[శ్రీ ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి రచించిన ‘మల్లెపూలు ఘొల్లుమన్నవి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]“మ[/dropcap]ల్లెపూలు.. మల్లెపూలు..” వీధిలో కేకవేస్తూ వెళ్తున్నాడు కుర్రాడు. హాలులో ఉన్న సరళ “ఒరేయ్ శేఖరం మల్లెపూల వాడ్ని పిలవరా” అని గట్ట్టిగా అంది. వరండాలో కూర్చుని ఫ్రెండ్‌తో కబుర్లు చెబుతున్న శేఖరం బయటకు వెళ్లి ‘మల్లెపూల’ వాడిని కేకేసాడు. ఆ కుర్రాడు సైకిల్ వెనక్కి తిప్పి శేఖర్ ఇంటి దగ్గరకు వచ్చాడు.
సరళ స్టీల్ గిన్నె, డబ్బులు తీసుకుని బయటకు వచ్చి మల్లెపూలు కొనుక్కుని, కుర్రాడికి డబ్బులు ఇచ్చేసి లోపలకు వెళ్ళిపోయింది. రోజూ బోల్డు డబ్బులు ఖర్చుపెట్టి అక్క అన్ని మల్లెపూలు ఎందుకు కొంటుందో అర్థం కాక తన ఫ్రెండ్ వెంకట్‌ని అడిగాడు “ఏరా, ఈ ఆడాళ్ళు రోజూ ఎందుకు అన్ని మల్లెపూలు కొంటారు?” అని. వెంకట్, శేఖర్ కేసి చూసి చిన్నగా నవ్వాడు. వెంకట్ చాలా ముదురు. వాడు ఇప్పటికే గుడి తోటలో ఉన్న మల్లెపూలు, సంపెంగ పూలు గోడ దూకి కోసుకొచ్చి తన గర్ల్ ఫ్రెండ్ విమలకి చాలా సార్లు ఇచ్చాడు. వాడి దృష్టిలో శేఖర్ ‘శుద్ధ ముద్ద పప్పు’. అందుకే “నీకు ఇప్పుడు తెలియదులేరా, పెళ్లి అయ్యాకా అన్నీ బోధపడతాయి” అని నర్మ గర్భంగా నవ్వి వెళ్లి పోయాడు వెంకట్.
‘ఆడవాళ్ళు మల్లెపూలు ఎందుకు కొంటారో తెలియాలంటే, పెళ్లి కావాలా? ఇదెక్కడి లాజిక్’ అని ఇంటి ఎదురుగుండా ఉన్న వేపచెట్టు కేసి చూసాడు శేఖర్. వైశాఖమాసం, సాయంకాలం ఆరుగంటల సమయం. ‘నీ సందేహం తీర్చడం నా పని కాదు, ప్రజల్ని సేద తీర్చడమే నా పని’, అని వేపచెట్టు చల్లని గాలులు వీయసాగింది. ఐదు నిముషాలు గడిచేసరికి శేఖర్ బావ కిరణ్ రిక్షా దిగాడు. శేఖర్ లోపలకు వెళ్లి “అక్కా, బావ వచ్చాడు” అని చెప్పాడు. శేఖర్ వాళ్ళ అమ్మ రాఘవమ్మ మంచినీళ్ళు తీసుకుని వచ్చి అల్లుడికి ఇచ్చింది. సరళ ఫ్లాస్క్ లోని టీ తీసుకు వచ్చి ఇచ్చి సన్నగా నవ్వింది. శేఖర్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు.
కాసేపటికి అక్కా, బావా బయటకు వచ్చి రిక్షా ఎక్కి మినర్వా టాకీసుకి సినిమాకి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయాడు. అక్క జడలో మల్లెపూలదండ ఉండడం గమనించాడు శేఖర్. ‘అంటే మొగుడు వస్తే పెళ్ళాం తలలో మల్లెపూలదండ పెట్టుకుని బయటకు వెళ్ళాలి అన్నమాట’ అని గొణుక్కున్నాడు శేఖర్. శేఖర్ శివపురం హై స్కూల్‌లో పదవ తరగతి పరీక్షలు రాసాడు. మనిషి ఎదిగాడు కానీ లోకజ్ఞానం తక్కువ అని వాడి ఫ్రెండ్స్ అందరి ఏకగ్రీవ అభిప్రాయం. చదువులో మాత్రం చాలా చురుగ్గా ఉంటాడు.
జూన్ నెలలో పదవ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. శేఖర్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. టౌన్‌కి పంపిస్తే నెగ్గుకు రాలేడని, శివపురం లోని జూనియర్ కాలేజీ లోనే ఇంటర్మీడియట్‌లో చేర్చారు గుర్నాధం గారు. కాలేజీకి రాగానే శేఖర్ ఫ్రెండ్స్ చాలా మంది ప్రేమ వ్యవహారాలూ నడపడం మొదలు పెట్టారు. వాళ్ళ ధైర్యం చూసి శేఖర్ ఆశ్చర్యపోయేవాడు. కాలేజీలో ఆడపిల్లలు ఎవరైనా మల్లెపూలు పెట్టుకుని వస్తారేమోనని చూసాడు శేఖర్. కొద్ది మంది మాత్రం జడలో ఒక్క గులాబీ మాత్రమే పెట్టుకోవడం గమనించాడు. మిగతా వాళ్ళు మాత్రం జడలో పూలు పెట్టుకోవడం లేదు అని కూడా గ్రహించాడు శేఖర్. అంటే ‘కాలేజీకి వస్తే ఆడపిల్లలు మల్లెపూలు పెట్టుకోరు’ అని ఒక దృఢమైన అభిప్రాయానికి వచ్చ్హాడు శేఖర్.
శేఖర్ బుద్ధిగా చదువుకుని ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు. తర్వాత శివపురం డిగ్రీ కాలేజీలో బి.కాం.లో చేరాడు శేఖర్. డిగ్రీలో కూడా ఆడపిల్లలు తలలో మల్లెపూలు పెట్టుకోవడం లేదని మరోసారి నిర్ధారణ చేసుకున్నాడు శేఖర్.
డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉండగా రిపబ్లిక్ దినోత్సవం నాడు జరిగిన కాలేజీ సాంస్కృతిక ఉత్సవాలలో భాగంగా ‘విచిత్ర వేషధారణ’ పోటీలు జరిగాయి. మగ పిల్లలు సీతారామరాజు, చాణుక్యుడు, కాళిదాసు పాత్రలు వేసారు. ఆడపిల్లలు ఝాన్సీ లక్ష్మీబాయి, మొల్ల, భారతమాత పాత్రలు వేసారు. కార్యక్రమం చివరలో బి.ఎస్.సి. ఫైనల్ ఇయర్ అమ్మాయి ‘పెళ్లి కూతురు’ వేషంలో స్టేజి మీదకు వచ్చింది. మొత్తం ప్రేక్షకులు అందరూ కన్నార్పకుండా ఆ అమ్మాయికేసే చూస్తూండి పోయారు.
శేఖర్ అయితే నోరు కూడా తెరిచి విస్మయంగా ఆమె కేసి చూసాడు. బంగారు మేని చాయతో పట్టుచీర కట్టుకుని పూలజడ వేసుకుని, కళ్ళకు నిండుగా కాటుక, చేతులకు ఎర్రటి గోరింటాకు, బంగారు గాజులతో పాటు, ఎరుపు ఆకుపచ్చ రంగుల గాజులు, నుదిటిన బాసికంతో మెల్ల మెల్లగా స్టేజి మీద నడుస్తూ వెళ్తుంటే చప్పట్లతో సెమినార్ హాల్ దద్దరిల్లి పోయింది. లెక్చరర్లు, ప్రిన్సిపాల్ కూడా చప్పట్లు కొట్టి ఆమెని అభినందించారు. అప్పుడు చూసాడు శేఖర్, ఆమె మల్లెపూల జడ వేసుకోవడం. అతని మనసు ఆనందంతో పులకించిపోయింది. తనకిష్టమైన ‘మల్లె పూలు’ కనిపించినందుకు. విచిత్ర వేషధారణలో ఆ అమ్మాయికే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు.
అప్పుడే శేఖర్ గట్ట్టిగా ఒక నిర్ణయానికి వచ్చాడు. తన పెళ్ళికి, పెళ్లి కూతురికి మల్లెపూల జడ వేయించాలని. సంధ్యా సమయం అవడం వలన ‘తధాస్తు దేవతలు’ కూడా పై నుంచి ‘తధాస్తు’ అని దీవించి వెళ్ళిపోయారు.
బి.కాం. అయ్యాక ఎం.కాం. చేసి బ్యాంకు పరీక్షలు రాసి ఒక ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు శేఖర్. పెళ్లిచూపులలో అమ్మాయి నచ్చిందని చెప్పడమే కాకుండా, పెళ్లికూతురికి మల్లెపూల జడ ఉండాలని ‘కండిషన్’ పెట్టాడు. అందుకని వైశాఖం వచ్చేవరకు ఆగి అప్పుడు పెళ్లి చేసారు శేఖర్, పల్లవి లకు. పెళ్ళిలో పెళ్లికూతురు మల్లెపూల జడ చూసి ఆనందపడ్డాడు శేఖర్.
పెళ్లి అయ్యాకా మొదటి రాత్రి గదిలోకి వచ్చిన శేఖర్ కొంచం అసంతృప్తి చెందాడు. కాసేపటికి పాల గ్లాసుతో గదిలోకి వచ్చిన పల్లవి అతన్ని చూసి “అలా ఉన్నారేం? వంట్లో బాగాలేదా?” అని గాభరాగా అడిగింది.
“నిక్షేపంలా ఉంది. గది అలంకరణ బాగా లేదు” అన్నాడు శేఖర్. పల్లవి గది అంతా పరిశీలించి చూసింది. తన చెల్లెలు, పిన్ని మూడు గంటలు కష్టపడి గది అలంకరించారు. గోడలకు గులాబీ పువ్వులు ప్లాస్టర్‌తో అతికించారు. మంచి ఫోటోలు పెట్టారు. స్వీట్స్, పళ్ళు ఉన్నాయి. గది మూల అగరవత్తుల నుండి మంచి సువాసనలు వస్తున్నాయి.
“గదిలో అన్నీ అమర్చారు కదా! ఇంకేమిటి లోటు?” సౌమ్యంగా అడిగింది పల్లవి అతని పక్కనే కూర్చుని. “ముళ్ళపూడి వారి తూర్పు గోదావరి జిల్లా కదా, కళాపోషణ ఉంటుందనుకున్నా. కానీ పక్క మీద మల్లెపూలు లేవు. సినిమాలో చూపించినట్టు బెడ్ అంతా మల్లెలు పరుస్తారనుకున్నా. ఉహూ.. ఒక్క మల్లెపూవు కూడా పక్క మీద లేదు” అన్నాడు బుంగమూతి పెట్టి శేఖర్. అతని మాటలకి చిన్నగా నవ్వింది పల్లవి.
“అదా, మహాశయా, మీ అలక. మా వాళ్ళు మల్లెలు పరుస్తామంటే వద్దని ‘నేనే’ చెప్పాను. పడుకున్నప్పుడు అవి గుచ్చుకుని చిరాగ్గా ఉంటుందని. సరే ఈ పాలు తాగండి” అని అతనికి పాలగ్లాసు ఇచ్చి లైట్ ఆర్పి వచ్చింది పల్లవి.
***
శేఖర్, పల్లవిలకు ఒక అబ్బాయి పుట్టాడు. ప్రస్తుతం వాడికి నాలుగేళ్ళు. వేసవి సెలవులలో మనవడు మా దగ్గర ఉంటాడని బాబీని శేఖర్ తల్లి తండ్రులు అమలాపురం తీసుకెళ్ళారు. శని, ఆదివారాలు కలిసి వచ్చేటట్టు రెండు రోజులు సెలవు పెట్టి, నాలుగు రోజులు అత్తారింట్లో గడుపుదామని రాఘవపురం వచ్చాడు శేఖర్, పల్లవితో కలిసి. రెండు రోజులు ఖుషీగా గడిచింది. రావులపాలెం వెళ్లి సినిమా కూడా చూసి వచ్చారు శేఖర్, పల్లవి.
మూడోరోజు సాయంకాలం ఐదు గంటలు అయ్యింది.
“పల్లూ, ఓ పల్లూ” అంటూ గట్టిగా పిలిచాడు శేఖర్. జవాబు రాలేదు. ‘ఈ ఆడాళ్ళు పుట్టింటికి వస్తే చాలు, ఎక్కడ లేని కబుర్లు పుట్టుకొస్తాయి.. హూ.. మొగుడ్ని అస్సలు పట్టించుకోరు’ అని విసుక్కున్నాడు.
దొడ్లో వసారాలో కత్తిపీట మీద కూర్చుని, రాత్రి వేపుడు కోసమని బంగాళాదుంపలు తరుగుతోంది
సుందరమ్మ. “చూడమ్మా, అతను పిలుస్తున్నాడు.. ఏమైనా కావాలేమో?” నెమ్మదిగా అంది సుందరమ్మ, కూతురితో..
“ఆ.. ఇప్పుడేగా డజనున్నర పనస తొనలు తిన్నారు. ఇంకేం కావాలి? వాచీ కనిపించ లేదనో, జేబు రుమాలు కావాలనో అంటారు. కళ్ళెదురుగా ఉన్న వస్తువు కూడా తీసుకోరు. ఎవరో ఒకరు వచ్చి ఇవ్వాలి. హూ.. మా అత్తగారు ఈయన్ని సరిగా పెంచలేదు. బాగా గారం చేసింది. ఇదిగో, ఇప్పుడు నన్ను విసుగిస్తున్నారు” అంది చిరాగ్గా పల్లవి. అది చిరాకు కాదని, భర్త మీద ఉన్న ప్రేమ అని గ్రహించింది సుందరమ్మ.
చిన్నగా నవ్వి “ఓ సారి వెళ్లి రా అమ్మా. అతనికి కావలసిందేదో ఇచ్చి రా” అంది సుందరమ్మ. తల్లి మాట కాదనలేక లోపలకు వెళ్ళింది పల్లవి. “ఏం కావాలి?” ప్రేమగా అడిగింది భర్తని.
“డజను తింటే సరిపోయేది. ‘మీకిష్టం కదా.. తినండి’ అని మరో ఆరు ఇచ్చావు. పద్దెనిమిది పనస తొనలు తినేసాను. కడుపు చాలా బరువుగా ఉంది. నాలుగు అడుగులు వేస్తేనే కానీ పొట్ట సమస్య పరిష్కారం కాదు. అలా జానకమ్మ రావి వరకూ వెళ్లోద్దాం. రా” అన్నాడు శేఖర్, చిరు బొజ్జ మీద చేయివేసుకుని.
“అమ్మో.. మీతో కలిసి నడిచి వెళ్ళడమే.. ఇంకేమైనా ఉందా! హెడ్ మాస్టర్ గారి అమ్మాయికి పెళ్లి అయ్యాకా షికార్లు ఎక్కువయ్యాయి అంటారు” అంది పల్లవి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ.
“అబ్బా, మన పెళ్ళికి ముత్యాల పల్లకీలో ఈ ఊళ్లోనే ఊరేగాం. నేనే, నీ మొగుడ్నని అందరికీ తెలుసు. ఇంకోలా అనుకోరు. నువ్వు జోకులు వెయ్యక, మీ అమ్మతో చెప్పి గమ్మున రా” అని పొట్ట తడుముకుంటూ, వీధి గుమ్మం దగ్గరకు వచ్చి చెప్పులు వేసుకున్నాడు శేఖర్. పల్లవి దొడ్లోకి వెళ్లి, తల్లితో బయటకు వెళ్తున్నామని చెప్పి శేఖర్ దగ్గరకు వచ్చింది. ఇద్దరూ కలిసి నడచుకుంటూ ఊరి బయటకు వచ్చారు.
రోడ్డుకి అటూ, ఇటూ అరటి తోటలు ఉన్నాయి. కొన్ని గెలలు కూడా వేసాయి. అక్కడక్కడ చేలలో కంద మొక్కలు ఏపుగా పెరిగి, ఆకు పచ్చని గొడుగులు నేలపై నిలబెట్టినట్టు అందంగా ఉన్నాయి. పెద్ద బోరింగ్ పైపు గొట్టం లోంచి నీళ్ళు ధారగా పడుతూ, చిన్న చిన్న కాలువల ద్వారా మొక్కలకు చేరుతున్నాయి. మామిడి చెట్లు, సపోటా చెట్లు, కొబ్బరి చెట్ల మీదనుండి చల్లని గాలులు వీస్తున్నాయి. ఈ చల్లదనం ముందు ఊటీ కూడా ఎందుకూ సరిపోదు అనుకున్నాడు శేఖర్.
సాయంకాలం అయిదున్నర గంటల సమయం. రామ చిలుకలు సందడి చేస్తూ జామ చెట్ల మీద వాలి, సుతారంగా జామ పండ్లు కోరుకుతున్నాయి. అది చూసి శేఖర్ జేబులోంచి సెల్ ఫోన్ తీసి రామ చిలుకల్ని ఫోటో తీసాడు.
“ఏవండి పాపగారూ, రావులపాలెం వెళ్తున్నారా?” సైకిల్ వస్తూ ఎదురైన నారాయణ అడిగాడు పల్లవిని. “లేదు. జానకమ్మ రావి వరకే” అంది నవ్వుతూ పల్లవి.
“ఆయ్.. నాన్నగారు పొద్దున్న చెప్పారండి, ముంజికాయలు తెమ్మనమని. రేపు పొద్దున్నే పట్టుకోస్తానండి” అని వెళ్ళిపోయాడు నారాయణ.
“అతను నారాయణ. నా క్లాస్‌మేట్. నాతో ఐదో తరగతి చదువుకున్నాడు” అంది కళ్ళు పెద్దవి చేసి గర్వంగా పల్లవి. “ఏదో, వి.ఐ.పి. అన్నట్టు చెబుతున్నావే” అన్నాడు శేఖర్ తేలిగ్గా.
“అతను వి.ఐ.పి.యే మరి. గతేడాది వరకూ మా ఊరి సర్పంచ్‌గా చేసాడు. ఇప్పుడు ఎం.పి.టి.సి. మెంబర్” అంది పల్లవి. ఆమె మాటలకు ఆశ్చర్య పోయాడు శేఖర్. తమ ఊరి సర్పంచ్‌గా చేసినవారు కార్లు కొనుక్కుని దర్జాగా తిరగడం గుర్తుకు వచ్చింది అతనికి. ఇద్దరూ నడుచుకుంటూ జానకమ్మ రావి దగ్గరకు వచ్చారు. రావి చెట్టు ఎరుపు రంగులో ఉన్న చప్టా మీద కూర్చున్నారు ఇద్దరూ. చల్లటి గాలి వీయడంతో ఇద్దరికీ అలసట తీరినట్టు అనిపించింది.
కాల్వగట్టున ఉన్న మెయిన్ రోడ్డు కొత్తగా వేసారు. అటు రావులపాలెం వైపు వెళ్ళే బస్సులు, ఇటు అమలాపురం వైపు వెళ్ళే బస్సులు స్పీడుగా వెళ్తున్నాయి. పావుగంట గడిచింది.
“ఏనుగు మహల్ వరకూ వెళ్దామా?” అడిగాడు శేఖర్ ఉత్సాహంగా.
“అమ్మో.. అంత వరకూనా! నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. నేను నడవలేను” కంగారుగా అంది పల్లవి. పది నిముషాలు అలాగే చల్లగాలి పీలుస్తూ కబుర్లు చెప్పుకున్నారు ఇద్దరూ. ఒక కుర్రాడు సైకిల్‌కి ముందు రెండు వెదురు బుట్టలు కట్టుకుని ‘మల్లెపూలు.. మల్లెపూలు’ అని అరుస్తూ వెళ్తుంటే,శేఖర్ అతన్ని కేకేసాడు. ఆ కుర్రాడు వెనక్కి తిరిగి వచ్చాడు. పల్లవిని చూసి నవ్వాడు. ఆమె నవ్వింది.
ఆ కుర్రాడి బుట్టలో ఓ గ్లాసు ఉంది. మల్లెపూలు గ్లాసుతో కొలిచి ఇస్తారని గ్రహించాడు శేఖర్.
“గ్లాసు పూలు ఎంత?” అడిగాడు శేఖర్. “పది రూపాయలండి” అన్నాడు కుర్రాడు. పువ్వులు చాలా బాగున్నాయి. మంచి వాసన వేస్తున్నాయి. వంద రూపాయల మల్లెపూలు కొన్నాడు శేఖర్.. ఆ కుర్రాడు పదకొండు గ్లాసుల పూలు ఇచ్చాడు. మళ్ళీ పల్లవి కేసి తిరిగి నవ్వి వెళ్ళిపోయాడు, కుర్రాడు.
“ఏమిటి, నిన్ను చూసి నవ్వుతున్నాడు. వీడూ నీ క్లాస్‌మేటా?” హాస్యంగా అన్నాడు శేఖర్.
“ఇంత చిన్న కుర్రాడు నా క్లాస్‌మేట్ ఏమిటి? మీరు మరీనూ. వీళ్ళ అన్నయ్య శేషగిరి రావులపాలెం హై స్కూల్‌లో నా క్లాస్‌మేట్.. వీడు వేణు. వీడి వాటాకు ఐదు ఎకరాల కొబ్బరితోట ఉంది తెలుసా?” అంది పల్లవి. ఆమె మాటలకి ఆశ్చర్యపోయాడు శేఖర్. టైం వేస్ట్ చేయకుండా, కష్టపడుతున్న వేణుని మనసులోనే అభినందించాడు శేఖర్.
“అవునూ.. అన్ని మల్లెపూలు ఎందుకు కొన్నారు?” ఆశ్చర్యంగా అడిగింది పల్లవి.
‘మల్లెపూలు ఘెల్లుమన్నవి, పక్క మీద’ అని పాట పాడాడు శేఖర్. మొదటి రాత్రి గుర్తుకు వచ్చి సిగ్గు పడింది పల్లవి. “ఈరోజు.. పక్క అంతా మల్లెపూలతో ఘుమ ఘుమలాడిపోవాలి. నా కోరిక తీరాలి” అన్నాడు శేఖర్. “మీరు మరీ కుర్రాళ్ళు అయిపోతున్నారు” అని అందంగా విసుక్కుంది పల్లవి.
కాసేపుండి, చీకటి పడడంతో ఇంటికి వచ్చారు నడుచుకుంటూ. అప్పటికే పల్లవి చెల్లెలు శిరీష, ఆమె భర్త శ్రీధర్ వచ్చి ఉన్నారు. పల్లవి చేతిలో ఉన్న మల్లెపూల కవరు చూసి, స్టేట్ రాంక్ వచ్చిన పదవ తరగతి అమ్మాయిలా ఆనందపడింది శిరీష. “మా అక్క ఎంత మంచిదో, నేను వస్తానని తెలిసి నాకిష్టమైన మల్లెపూలు తెచ్చింది” అని పల్లవి చేతిలోని పూల కవర్ తీసుకుని లోపలకు వెళ్ళిపోయింది. మరదలు వేళాకోళం ఆడుతోందని అనుకున్నాడు శేఖర్.
అందరి భోజనాలు పూర్తయ్యి రాత్రి పది గంటలకు బెడ్ రూమ్ లోకి వచ్చిన పల్లవిని చూసి ఆశ్చర్యంగా
“అదేమిటి, మల్లెపూల కవర్ ఏది?” అడిగాడు శేఖర్. “ఇంకెక్కడి కవర్? మీ కళ్ళ ముందే, మా చెల్లెలు పట్టుకుపోయిందిగా” అంది నవ్వుతూ. చేతిలోని పాలకోవా కాకి ఎత్తుకుపోతే, బిత్తరపోయిన పిల్లాడిలా భార్య కేసి చూస్తూండిపోయాడు శేఖర్.
అతని అవస్థ చూసి పల్లవి జడలోని కాసిని మల్లెలు ఘొల్లుమని నవ్వాయి.