కుసుమ వేదన-25

0
3

[మత్స్యకారుల జీవన విధానాన్ని, వారి జీవితాలలోని ఒడిదుడుకులను పద్య కావ్యం రూపంలో అందిస్తున్నారు శ్రీ ఆవుల వెంకట రమణ.]

షష్టాశ్వాసము – నాలుగవ భాగము

కం.॥
అదుగో చూడుము వెలుతురు
విదితంబైన కనబడగును యిది నిజమేగా
మది లోపల మోదంబును
కదలాడగ జూచుచుంటి గారడి కాదే. (516)

వచనం॥
అంతట సోమరాజు యచ్చోటికిని జేరిన బాలుర నుద్దేశించి. (517)

ఆ.వె.॥
వినుడి బాలలార విన్నవించెద నేను
శ్రద్ధ బూని మీరు చదువుడింక
మనసు నందు వేగ మానకుండ చదువ
పైకి పైకి పోవు పాడిగాను. (518)

తే.గీ.॥
చదువు సంస్కారమును నేర్చు సాధనంబు
చేయవలయును మీరంత శ్రుతిని మించ
కుండ మనవలె పెద్దల కోరికలను
నిజము చేయగ కదలుడి నిక్కముగను. (519)

తే.గీ.॥
ధనము లేకున్న నేనిత్తు దడయనేల
యాదుకొందును మిమ్ముల నద్భుతముగ
చదివి రాణింపుడీ వేళ జక్క గాను
నన్ను మరువక మసలుడి సన్నుతి గని. (520)

ఉ.॥
ఉన్నత విద్య నేరిచి పదోన్నతి నొందుడి బాలలార; మీ
కన్నిటి గూర్చి బెట్టెదను కాదనకుండగ విద్యనొందుడీ
పన్నుగ నేనె సాక్షి గద పాటెరిగించితి కండ్లు దెర్వుడీ
సన్నుతి జేతు నా మదిని చక్కగ విద్యల నేర్చితీరుడీ. (521)

చం.॥
పసితనమందునన్ మిగుల ప్రాయము లేకను బోవుటంధరన్
వసపులు గట్టి మాదిరిగ వాగుచు త్రుళ్ళుచు నాటలాడుచున్
మసి పులిమున్న తీరుగను మాసిన వస్త్రము గట్టుకొంటిమే
మిసమిసలాడు బ్రాయమున మిన్నుల నంటెడి విద్యనందమే. (522)

చం.॥
వినుడిపు డిట్టి రోజులను విన్నది కన్నది వాస్తవంబుగా
కనుడిటు నన్ను గూడ తలి గన్నది యీ పురి యందునే గదా
వెనుకటి గాథలన్ మరిచి వేగమె దూకుడి రంగమందునన్
మనుషులు గాన మీరలును మన్నన తోడుత నుత్సహించుచున్. (523)

కం.॥
అప్పుడు జనముల మధ్యన
చప్పుడు గాకుండ నుండె చంచల నేత్రన్
ఇప్పుడు గద నా కోరిక
తప్పక దీరెన టంచును తన్మయ మందెన్. (524)

తే.గీ.॥
ఇన్ని దినముల నుండియు నిటుల నేను
ఓర్పు తోడుత నున్నది ఒట్టి గాక
తనదు తండ్రికిచ్చిన మాట తప్పకుండ
తీర్చవలెనని జెప్పిన తీర్చె సుతుడు. (525)

తే.గీ.॥
ఈ శుభ ఘడియకే కద యిటుల నేను
ప్రాణముల నిల్పియుంటిని ప్రాణి లాగు
నాదు కోరిక దీరెను నయము గాను
ఇంక నేమిటి నాకింక శంకనిపుడు. (526)

ఉ.॥
ఈ సభ యందునున్నదని యిప్పుడు నేను దలంతునీ ధరన్
కాసుల నంది యిచ్చి నను గాచిన తల్లిపుడుండుటన్నిజం
బీసుని చేతనే నిపుడు ఏమరుపాటును లేక యుంటి; యే
వీసపు నెత్తు లేక నను విజ్ఞుని చేసిన తల్లి గొల్చెదన్. (527)

కం.॥
మేధిని లోపల తల్లిరొ
మోదము తోడుత వినదగె మ్రొక్కెద నీకున్
ఈ దినమందున తనయుడు
ఆదుకొనంగను వచ్చెను యాతృత తోడన్. (528)

కం.॥
తల్లిరొ వేగమె రాగదె
సల్లలితంబుగ వస్తిని సరగున రావా
ప్రల్లద మాడను వినుమా
కల్లలు కాదింక రమ్ము కర్కశమేలా. (529)

కం.॥
అంతట లేచెను కుసుమతి
చింతలు మనమున వదలుచు శీఘ్రమె నపుడున్
పంతము నిడచిన తల్లియు
మంతనమందున మురియుచు మరిమరి వచ్చెన్. (530)

తే.గీ.॥
ఇట్టి పల్కుల నాడిన గట్టివాడు
తనదు సుతుడని మనమందు తలచి గుసుమ
పైట చెంగును తలనిడి పటుతరంబు
కదలి వచ్చెను వేగమె కాంతయపుడు. (531)

కం.॥
క్రిక్కిరిసిన జనముల గని
గ్రక్కున కదలక యుండెను అప్పుడు గుసుమన్
మక్కువ తోడుత భటులును
యక్కసు లేకుండ నిలిచె యావిడ వెంటన్. (532)

ఆ.వె.॥
వేదికెక్క లేక వేదన నొందుచున్
బిడియ పీడితయ్యె భీతి తోడ
ఎప్పుడంత పెద్ద వేదికెక్కను లేదు
సంశయించు చుండె చంచలాక్షి. (533)

చం.॥
వినుడిక మీరలందరును విజ్ఞులు ప్రాజ్ఞులునున్న ఈ సభన్
కనుడిక నాదు తల్లి నను గౌరవ రీతిని గాచె నీధరన్
అనుదినమందు నన్ను యపుడా విధ రీతిని మేలు కొల్పగన్
ఘనుడిటునైతి నేను మరి గౌరవమిచ్చెద తల్లి కిప్పుడున్. (534)

చం.॥
వ్రణములు లేచినన్ జగతి వైద్యము లేకను చింతనొంద; కా
రణములు లేకపోయిన విరాజిత గీర్తిని పెంపుజేయ; ప్రే
రణమును బొందు తల్లి తన రాగము ద్వేషము నంతరించు; కా
రణము దయాంతరంగ అనురాగ తరంగ నమస్కరించెదన్. (535)

తే.గీ.॥
లేచి శాలువ తల్లిపై లెస్స రీతి
కప్పి కాళ్ళకు మ్రొక్కెను; కన్నతల్లి
నీవు చదివించ కున్నను నిజముగాను
యిట్టి గ్రామాన చేపలు బట్టుకొనుచు. (536)

తే.గీ.॥
మీలొ ఒకనిగ నుండెద మిక్కుటముగ
మీదు యిడుముల బాపుట మృషయు గాదు
కలకటేరుగా వస్తిని కాంతి లాగు
చేర వచ్చితి జిల్లాకు చెన్నమీర. (537)

తే.గీ.॥
అంత గోరెను వ్యాఖ్యాత నాదరమున
రెండు మాటలు పల్కుము ఖండితముగ
యనిన గుసుమతి నయ్యద మిక్కిలి నచ్చెరొంది
నోట పలుకుల కరవయ్యి నూరుకొనియె. (538)

కం.॥
నోటను కరువై పోయెను
మాటలు నరుదుగ జరిగెను మానిని కపుడున్
హాటకగర్భుని రాణియు
మాటికి మాటికి దూరము అయ్యెను జగతిన్. (539)

మ.॥
కనుదోయిన్ జడబాష్పధారలుగ బైకారంగ వేసారగన్
మనమున్ సంతసమంది నిల్చినది ప్రేమైకంబు తానుండగన్
తనరెన్ జన్మయు ధన్యమొందినది నీ తావున్ బలోపేతమై
వెనుకన్ ముందు నేనెయుంటి గద నా వేళందు నిక్కంబుగన్. (540)

(సశేషం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here