[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]
బ్రతుకు పుస్తకంలో.. ఉద్యోగపర్వం..!!
[dropcap]జీ[/dropcap]వితంలో బ్రతకడానికి చదువే అక్కరలేదు. చదువుకున్నవాళ్ళు అంతా ఉద్యోగం చేయాలనీ లేదు. అయితే, చదువుకున్నతరువాత, అవసరం అయినా, లేకున్నా, ఉద్యోగం కోసం ప్రాకులాడడం, సాధించడం జరుగుతూనే వుంది.
ఇక్కడ ఉద్యోగం విషయం వచ్చేసరికి, కొందరు బ్రతుకు బండిని లాగడం కోసమైతే, మరికొందరికి అదొక హోదా! అందుకోసమే అవసరం అయినవాళ్ళూ, అవసరం లేనివాళ్ళూ కూడా ఉద్యోగాల కోసం ఎగబడడం. అందుచేతనే ఈ త్రొక్కిసలాటలో, నిజంగా ఉద్యోగం అవసరం అయినవాళ్లు ఉద్యోగాలు చేజిక్కించు కోలేకపోతున్నారు, అది వేరే విషయం.
కనుక మామూలుగా ఆలోచించిస్తే విద్యావంతుడైన/విద్యావంతురాలైన వ్యక్తి జీవితంలో ‘ఉద్యోగ పర్వం’ అతి ముఖ్యమైనదని చెప్పక తప్పదు. చదివిన చదువు ఒకటైతే (వృత్తి విద్యలు పక్కన పెడదాం) ఉద్యోగ సాధనలో ఎన్ని కష్టాలో, ఎన్ని ప్రయోగాల్లో చెప్పలేము, అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది.
ఉద్యోగ పర్వంలో, రెండు ముఖ్యమైన (రోజులు) విభాగాలు ఉంటాయి. మొదటిది ఉద్యోగంలో చేరే మొదటి రోజు, రెండవది ఉద్యోగ కాలం (వయసును బట్టి) పూర్తి చేసుకుని, ఉద్యోగ విరమణ చేసే రోజు. ఈ రెండు రోజులూ దేనికవే ప్రత్యేకమైనవి. ఉద్యోగంలో చేరే రోజు చాలా సంతోషం కలిగించే రోజు. ఉద్యోగానికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి మంచి చెడ్డలు ఉంటాయి, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అన్న విషయాలు అప్పుడు మదిలో మెదలవు. కష్టపడి సంపాదించుకున్న వస్తువేదో చేతిలో పడ్డంత ఆనందం ఉంటుంది. తర్వాత దినసరి అనుభవాలు ఒక్కొక్కటి తెలిసి వస్తాయి. ఇతర సహోద్యోగుల మనస్తత్వాలు తెలుస్తాయి.
జీతాలు, కొత్త సంవత్సరంలో ఇంక్రిమెంట్లు, సంవత్సరానికోసారి సెలవులు అమ్ముకోవడాలు, అధికారుల కోపతాపాలు, అభినందనలు, రెండు సంవత్సరాలకొకసారి కుటుంబానికి విహార యాత్రలు, మధ్యలో ఊహించని రీతిలో బదిలీలు, దాని కోసం రకరకాల పైరవీలు, వీటికితోడు తమ ఉనికిని చాటుకునే దినపత్రికల స్టింగర్లూ, ఇలా ఉద్యోగంతో పాటు ఇవన్నీ మనతో కలసి నడుస్తాయి. ఇందులో, ఆనందాలు,నిరాశలు సంతోషాలు, సంతృప్తులు మనల్ని పెనవేసుకుని నడుస్తాయి. ఈలోగా వయసు 58/60 వచ్చేస్తుంది. సత్ప్రవర్తన గలవారు, అదృష్టవంతులు అతి తెలివిగలవాడు, ఎలాంటి సమస్యల్లో ఇరుక్కోకుండా, హాయిగా, ఆనందంగా, గర్వంగా, సగౌరవంగా బయటపడతారు. అదే సంతోషకరమైన పదవీ విరమణ.
పదవీ విరమణ చేసే సమయానికి ఎక్కువ శాతం మంది ఉద్యోగులు తాము నిర్వర్తించే వలసిన బాధ్యతలు అన్నీ సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. అంటే, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వాళ్ళ సెటిల్మెంట్లు, స్వంత ఇళ్లు కట్టుకోవడాలు వగైరా అన్న మాట!
కొంతమందికి బాధ్యతలు తీరవు. ఈ కేటగిరీవాళ్ళలో భవిష్యత్తును గురించి ఆలోచించకుండా కొంచెం కూడా పొదుపు చేసుకోకుండా, పదవీ విరమణ తర్వాత ఇబ్బంది పడేవాళ్ళూ, ఎక్కువ కుటుంబ బాధ్యతలు వుండి, సమస్యలతో సతమత మయ్యేవాళ్ళు వుంటారు.
పదవీ విరమణ తర్వాత ఆనందంగా విశ్రాంత జీవితం గడపగలిగేవారు కొందరు, ఇబ్బందులతో నలిగిపోయేవారు కొందరు. పదవీవిరమణ వల్ల లభించే సొమ్మును పంచుకునే విషయంలో పిల్లలు చేసే అల్లరికి మనశ్శాంతిని కోల్పోయే తల్లిదండ్రులు కొందరు. తల్లిదండ్రుల వల్ల, వారి ఉనికి వల్ల అసహనంగా వుండే పిల్లలు, ఆఖరి అస్త్రంగా తల్లిదండ్రులను, వృద్దాశ్రమాలకు పంపడాలు, ఇవన్నీ పదవీ విరమణ తర్వాత ఎదురయ్యే సమస్యలు. పిల్లల సంరక్షణలో ఆనందంగా బ్రతుకు వెళ్లదీస్తున్నవాళ్లూ లేకపోలేదు. అలాగే పిల్లల ఆలోచనలకు భిన్నంగా స్వయంగా వృద్ధాశ్రమాలు ఎంచుకుంటున్న తల్లిదండ్రులు కూడా వున్నారు.
పదవీ విరమణ చేసే వరకూ బ్రతికి ఉండడం దేవుడిచ్చిన వరం. అలాగే తమ తమ సమకాలికులు, బంధువుల పదవీ విరమణ చూడగలగడం ఇంకా అదృష్టం అని నా నమ్మకం. నాకు కొంతలో కొంత ఈ అదృష్టం దక్కింది. హైద్రాబాదులో పెద్దన్నయ్య, నాగార్జునసాగర్‌లో పెద్దక్క, విశాఖపట్నంలో చిన్నన్నయ్య, సికింద్రాబాద్‌లో చిన్నక్క, ఖమ్మంలో నా శ్రీమతి పదవీ విరమణలు చూసే అవకాశం నాకు దక్కింది. నేను 2011లో పదవీ విరమణ చేసి, నా కుటుంబం సంరక్షణలో ఇప్పటివరకూ హాయిగా వున్నాను.
ఈమధ్య, అంటే జూన్ 30 న, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్‌గా నా మేనకోడలు /మరదలు, శ్రీమతి రేచల్ హేమలత పదవీ విరమణ కూడా హైదరాబాద్‌లో జరిగింది. సుల్తాన్ బజార్ లోని ముఖ్య కార్యాలయం కార్పొరేట్ కార్యాలయాలకు మించి వుంది. ఒకే రోజు 17 మంది పదవీ విరమణ చేసిన వారిని ఘనంగా సత్కరించారు. అందులో నా మరదలు కూడా వుంది. ఈమె పదవీ విరమణ నాకు కొంచెం ప్రత్యేకమే! హేమలత నాకు మేనకోడలు, తర్వాత మరదలు అయింది. చిన్నప్పటి నుంచి ఈమె నాకు తెలుసు. నా కళ్ళముందు ఎదిగి విద్యా పర్వం పూర్తి చేసుకుని, పెళ్ళి చేసుకుని, ఉద్యోగం సంపాదించి ఒక కుమారుడికి తల్లి అయి, నా కళ్ళముందే పదవీ విరమణ చేయడం భగవంతుడు నాకు కల్పించిన గొప్ప అవకాశంగా నేను భావిస్తాను.
ఏది ఏమైనా మన గతం, వర్తమానం, అలాగే భవిష్యత్తు తీర్చి దిద్దుకునే అవకాశం చాలామట్టుకు మన చేతిలోనే ఉంటుంది.
మన జీవనశైలి, పిల్లల్ని పెంచే విధానం మంచైనా, చెడైనా, పిల్లల మీద తప్పక ప్రభావం పడుతుంది. అదే చివరి రోజుల్లో మన మీద ప్రయోగింప బడుతుంది. దేనికైనా మనం బాధ్యత వహించవలసిందే!
(మళ్ళీ కలుద్దాం)