చదివి తీరాల్సిన ‘వ్యాస భారతంలో అసలు కర్ణుడు’

1
3

(వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘వ్యాసభారతంలో అసలు కర్ణుడు’ పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు వేదాల గీతాచార్య.)

[dropcap]ధ[/dropcap]ర్మం కూడా బలాన్నే అనుసరిస్తుంది – కర్ణుడు

అసలు బలమే ధర్మాన్ని అనుసరించాలి – పెద్దల వాక్కు

కర్ణుడి విషయంలో, వ్యాసభారతంలో లేని అంశాలు చాలా ప్రచారంలో ఉన్న మాట వాస్తవం. అందరూ అంగీకరించాలి. ముఖ్యంగా మన తెలుగూఫులకున్న లక్షణం మనకు నచ్చనిదంతా చెత్త, నచ్చినదే మెత్త అనుకునే తత్వం. గట్టిగా మాట్లాడితే పుక్కిట పురాణం అనే పదానికి అర్థం తెలియని వారు కూడా ఆ పదాన్ని విరివిగా వాడేయగలరు.

దీని కోసం మనం కొన్ని వివరాలను గట్టిగా పరిశీలించాలి.

వ్యాస భారతం ప్రామాణికం. మన పెద్దలు (మహర్షుల నుంచీ కూడా) పురాణాలకు, ఇతరేతర రచనలకు మధ్య తేడా ఉంటే, ఇతిహాసాలనే ప్రామాణికంగా తీసుకోవాలి అని నుడివారు. మరి ఆ ఇతిహాసాన్ని కనీ, వినీ, అనుభవించి రాసినవారు వ్యాస మహర్షి. ఆయన మాటే పరమ ప్రామాణికం.

॥వ్యాసోచ్ఛిష్ఠం జగత్సర్వం॥

తరువాత బాగా ప్రచారానికి నోచుకున్నది, ప్రజల నోట ఒకప్పుడు నానినదీ అయిన ఆంధ్రమహాభారతం. కవిత్రయం రాసిన ఈ భారతం స్వేచ్ఛానువాదమే తప్ప సంపూర్ణానుసరణ కాదు. కొన్ని చోట్ల స్వంత కవిత్వం, మరికొన్ని డ్రమటైజేషన్లు ఉన్నాయి. పైగా

  1. వ్యాస భారతానికి, కవిత్రయ అనువాద భారతానికి కర్ణుడి పాత్ర విషయంలో తేడాలు కొన్ని ఉన్నాయి
  2. జయ సంహితమనబడే మహాభారతానికి, ఆంధ్రమహాభారతానికి, మన తెలుగు సినిమాలలో, నాటకాలలో ప్రచారంలో ఉన్న కథలకూ మధ్య తేడాలు పరిశీలించాలి
  3. కొత్తగా వస్తున్న హిందీ సీరియల్స్ లో చూపిస్తున్న విధానం. వీటికి మెలూహాల లాంటి reinterpretations without valuing the proper sources, వాటి నాయనమ్మలైన పర్వాలకు కూడా తేడా తెలుసుకునేలా చదవాలి
  4. కొన్ని నిజాలు కొన్ని అసత్యాలు కలిపి వ్రాయబడుతున్న వాట్సాప్ యూనివర్సిటీ కోర్సులు. వీటికి పెద్దమ్మలైన యూట్యూబ్ ప్రవచనాలు (కర్ణుడు తల్చుకుంటే అర్జునుడు భస్మమే.. అతనుగానీ అడ్డుపడకపోతే… గురువుగారు చెప్పింది వింటే షాక్ అవుతారు)
  5. ఇవికాక జానపదాలు, క్లుప్తైజేషన్ చేసే అమర్ చిత్ర కథలు

ఇవన్నీ పరిశీలించి చూసి, అసలు భారతంలో లేని విషయాలను సంగ్రహించి వాటిని ఖండించాలి. అది అందరికీ సాధ్యమయే పని కాదు. దానికి పరిశోధన చేయగలిగే ఓపికే కాదు బోలెడంత ఓపెన్ మైండ్ కావాలి.

అలాంటి సందర్భంలోనే వ్యాస భారతంలో అసలు కర్ణుడు వంటి పుస్తకాలు రావాలి. పుస్తెలు తాకట్టు పెట్టైనా పుస్తకాలు కొనిక్కోవాలి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో లాంటి వ్యవహారికాలు ఈ పుస్తకానికి వాడవచ్చు.

వేదాంతం శ్రీపతి శర్మ గారు జగమెరిగిన పండిత రచయిత. అటు ఆంగ్లంలో, ఇటు ఆంధ్రంలో సమ పాటవంతో రచనలు చేయగలరు. వీరు విశ్లేషణలు సప్రామాణికంగా చేస్తుండటం తెలిసిన విషయమే.

వారు సంకలనం చేసిన ఈ పుస్తకం లో వ్యాస భారతం ప్రామాణిక ఎడిషన్.. (ప్రక్షిప్తాలు కాదని మెజారిటీ జనాలు అంగీకరించిన).. నుంచీ కర్ణుడి గురించి ప్రస్థావనకు వచ్చిన శ్లోకాలను సూక్ష్మస్థాయిలో పరిశీలించారు. జండాలను, ఎజండాలను పట్టించుకోకుండా వ్యాస వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుని సాదోహరణంగా కర్ణుడి పాత్రను డిసెక్ట్ చేశారు.

కర్ణుడిని ఉన్నది ఉన్నట్లుగా చూపించారు.

అందరికీ ఆంధ్రమహాభారతాలు (అసలుతో తేడాలు చాలానే ఉన్నాయి) చదివే ఓపికలు, శక్తులు ఉండవు. మరి అలాంటి వారు వ్యాసభారతాన్ని చదవటమే? అందుకే చెప్పేవారి వైపు ఒక చెవి విసిరి వింటున్నారు. సహజ పరిశీలన, గ్రహింపు ఉండవు కనుక తమకు ఎవరు చెప్పింది నచ్చుతుందో లేదా అనుకూలంగా ఉంటుందో దాన్నే ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారికి ఈ పుస్తకాన్ని అందించాలి.

వీలైనంత సరళసుందరమైన భాషలో వ్రాశారు శర్మ గారు.

కర్ణుడి జన్మ వృత్తాంతం మొదలుగొని, అతని తుది క్షణాల వరకూ వ్యాస భారతం ఆధారంగా సూటిగా సుత్తిలేకుండా సరైన సమాచారాన్ని అందించారు.

పుస్తకం ప్రింటు వేసిన తీరు కొంత ఇబ్బంది కలిగించినా, శైలి వల్ల విడువకుండా చదివించే గుణం ఉంది. అక్షరాలు పెద్దగా ఉండటం వల్ల పెద్దవాళ్ళు కూడా చదవటానికి అనుకూలంగా ఉంది. ఈ రోజుల్లో ఇది కూడా ముఖ్యమే. ఎందుకంటే తల్లిదండ్రులే తెలుగు చదవటం మర్చిపోతున్న ఈ రోజుల్లో పిల్లలు చదవగలరు అనుకోవటం మూర్ఖత్వం. అందుకే పెద్దవారు చదివి చెప్పాలి.

సంస్కృత భారతంలో కుమార అస్త్ర విద్యా ప్రదర్శనలో కర్ణుడు అర్జునుడిని ఎదిరించడం అంతా అలాగే ఆంధ్రీకరించినా కర్ణుడిని చూసి ధర్మరాజు భయపడినట్లు సంస్కృత భారతంలో ఉన్న విషయాన్ని నన్నయ స్వీకరించలేదు. వీరిది దాదాపు యథా మూలానువాదం అంటారు. ధర్మరాజు ఎందుకు అలా కంగారు పడి ఉంటాడు?

వ్యాసమౌనంలో అది దొరుకుతుంది. వ్యాసమౌనం అంటే హింట్లిచ్చి గ్రహించమన్న విశేషాలు. ఆ కంగారు పడటం గురించి శ్రీపతి శర్మగారు చెప్పారు. ఇతడు సూత పుత్రుడు కావున నేను ఇతడిని పెళ్లాడను అని ఉన్నది అని అంటారు. నాహం వరయామి.

ఆ విషయంలో చాలా విభేదాలున్నాయి పండితులలో. కొన్నిటిలో కర్ణుడు విల్లు ఎక్కుపెట్టినా గురి తప్పాడని ఉంది.

కవిత్రయం, BORI (రకరకాల ప్రతులను పరిశీలించి అందుబాటులో ఉన్న భారతంలో ఏకసూత్రత తేవటానికి భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూనుకుని ఒక ఎడిషన్ తీసుకొచ్చింది. రీసెర్చ్లో కొన్ని కొత్త విషయాలు తెలిస్తే వాటికీ మళ్ళీ సవరణలు చేసుకుంది. దీనినే BORI ఎడిషన్ అంటారు) కూడా ద్రౌపది కర్ణుడిని నిరాకరించిన విషయాన్ని అంగీకరించలేదు. కర్ణుడికి సంబంధించి ఇది ఒక తెగని వివాదం. కోహ్లీ అభిమానులు, రోహిత్ శర్మ అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకునే రీతిలో. ఎవరు చెప్పింది ఎవరూ అంగీకరించరు.

దీనికి పరిష్కారంగా శర్మగారు ఆ యా సందర్భాలలో ఉన్న శ్లోకాలకు పూర్వోత్తర శ్లోకాలను గ్రహించి, ఏకసూత్రత దొరికిన విషయాలను అందించారు.

కర్ణుడు దానానికి ‘బాగా ప్రసిద్ధి’. అయితే అతడు దానశీలి అని జనాలు అనడమే గాని అతడు చేసిన దానాలు, ఒక్క ఇంద్రుడికి కవచ కుండలాలు ఇవ్వడం మినహా, ఎక్కడా ప్రామాణిక గ్రంథాలలో వర్ణించబడలేదు. అది కూడా నిజానికి barter system యే. కానీ వీటి మీద వచ్చిన కథలకు అంతు లేదు. ఇవన్నీ పుక్కిట పురాణాలే. ఉదాహరణకు, యుద్ధభూమిలో చనిపోయే ముందు బ్రాహ్మణ వేషంలో వున్న శ్రీకృష్ణుడికి, తన బంగారు పన్ను పెరికి ఇచ్చాడన్నది తీసుకుందాం.

తల తెగి పడి మరణించిన వాడికి దానాలు చేసే సమయం ఎక్కడ దొరుకుంది స్వామీ? సీరియళ్ళలో కణతలలో పాయింట్ బ్లాంక్‌లో కాల్చబడిన పాత్రలు తమవారికి తుది సందేశం ఇచ్చినంత లాజిక్‌లెస్ కథనం. ఆ యా సీరియళ్ళ ట్రోల్ చేసే కుర్రకారు కూడా శ్రీమహాభారతంలో ఏముందో తెలియక సినిమాలు చూసి వాదిస్తారు. కర్మ!

ఇక కర్ణుడి శూరత్వం!

ఏడుసార్లు.. ఏంటి? ఏడుసార్లు రణభూమి నుంచీ పారిపోయిన వాడు ఏమి శూరుడు? ఈ వియయాన్ని, అభిమన్యుడితో యుద్ధంలో చేతకాక ఎలా చంపాలి అని ద్రోణుడినే అడిగి.. ఆయన చేత ఉపాయం చెప్పించి దానిని అమలు చేసిన విధానం తెలిస్తే అర్థమౌతుంది ఆ రాధేయుని సత్తా. అంతమాత్రాన అసలు చేతకాని వాడని కాదు. కానీ నిజమైన శూరుడు కాడు. అది తెలుసుకోవాలి. ఈ విషయాన్ని కూడా ఆధారాలతో చూపారు వేదాంతం శ్రీపతి శర్మ గారు.

కృష్ణుడు అర్జునుడికి, కర్ణుడికి చెరో బంగారు నిధి ఇచ్చి దానం చేయమనడం, అర్జునుడు చేయలేకపోవడం, అలాగే ధర్మరాజుని, కర్ణుడిని బ్రాహ్మణులు కలప కోసం అర్థిస్తే కర్ణుడు తలుపులు, కిటికీలు విరగగొట్టి ఇచ్చేయడం, ఇలాటివెన్నో కల్పిత కధలు! ఇవి వాట్సాపు యూనివర్సిటీ కోర్సులు కావు. లెఫ్టిస్టు కోశాలలో నుంచీ పుట్టిన డైనసార్లు.

ఇంకొకక అసత్యప్రచారం ద్రౌపది మనసులో కర్ణుడిని ఆరో భర్తగా పొందాలని ఉండేదని. దావీశూర కర్ణ సినిమాలో కూడా చూపటం వల్ల (చెట్టూ పండూ) బాగా ప్రచారమైంది. కానీ దాని గురించి శర్మగారు క్లారిఫై చేయలేదు.

కర్ణుడు కూడా ద్రోణుడి వద్ద విద్యనభ్యసించాడనటంలో సందేహం లేదు. అయితే అతను బ్రహ్మాస్త్రం నేర్పమని అడిగితే, ద్రోణుడు నేర్పకపోవడం వల్ల పరశురాముడిని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. అయితే చాలామంది కర్ణప్రియులకు కర్ణుడు ద్రోణుడి దగ్గర కూడా విద్యనభ్యసించాడనడం మనస్కరించదు. అయితే కర్ణుడికి బ్రహ్మాస్త్రం నేర్పకపోవడానికి అతడిలో పేరుకుపోయిన ద్వేషాగ్నులే కారణమని చాలామందికి తెలియదు. బాబులూ, ఎంట్రన్స్ టెస్ట్ పాసవ్వని వాడికి పై కోర్సులో చాన్స్ ఇస్తారా?

అసలు అస్త్రవిద్యా ప్రదర్శన సమయంలో కర్ణుడనే మాట నేటి గూండాలకు, మాఫియాలకు తగిన మాట.

ధర్మం కూడా బలాన్నే అనుసరిస్తుంది – కర్ణుడు

అసలు బలమే ధర్మాన్ని అనుసరించాలి.

కొన్నిసార్లు ధర్మపరులకు సహాయం అవసరపడుతుంది. అందుకే ధర్మపథాన్ననుసరించే వారికి దైవం సహాయం చేస్తాడు. మనషులు కూడా చేయాలి. విజయ్ ఏంటనీ నటించిన రోషగాడు సినిమాలో చివరగా అనే మాట.. మంచిని గెలిపించాలి. అప్పుడే పిల్లలు (జనరల్ గా చెప్పాలంటే జనులు) చెడు వైపు ఆకర్షితులు కారు.

భగవానుడైన శ్రీకృష్ణుడు ధర్మపక్షాన నిలబడ్డాడు. పాండవులు చేసిన గొప్పకార్యాలు పెద్దగా లేవని, దుర్యోధనుడి తప్పులనే పెద్దవిగా ఎంచుతారనే వాదనలున్నాయి. ఇక్కడ గట్టిగా తెలిసుకోవాల్సిన అంశాలను శర్మ గారు సరళంగా చెప్పారు.

కర్ణ కృష్ణ సంభాషణమ్!

అక్కడ వివేచనతో కర్ణుడు పలికే మాటలను కూడా శర్మగారు చక్కగా ఎత్తి చూపారు. వ్యాసుడు ఎలా నిష్పక్షపాతంగా రాశారో, వేదాంతం శ్రీపతి శర్మగారు కూడా అపోహలని తొలగిస్తూ, సత్యాలను వెలికి తీస్తూ (నిజానికవి వ్యాస భారతం చదివితే తేలికగా అవగతమవుతాయి. కానీ చదివే ఓపిక?) అందుకే శర్మగారు పూనుకున్నారు.

అంగ రాజుగా కర్ణుడిని పట్టాభిషిక్తుని చేయటానికి దుర్యోధనుడికి కానీ, ధృతరాష్ట్రుడికి కానీ ఏ అర్హత ఉంది? దీని గురించి ఎందుకో వదిలేశారు. అంత interpretation అవసరం లేదు కనుకా? Or did I miss something?

పోనీ కర్ణుడు చెప్పింది నిజమే అనుకున్నా, రాజ్యం వీరభోజ్యం. పాండురాజు గెలిచి సంపాదించుకు వచ్చింది. ధృతరాష్ట్రుడు గార్డియన్ మాత్రమే.

దుర్యోధనుడు విదురుడిని అవమానించటం మరొక తెలియజెప్పాల్సిన విషయం. అది ఇందులో శర్మగారు దుర్యోధనుడి మాటలను ఉటంకిస్తూ తెలియజేశారు (అంగరాజ్య పట్టాభిషేక సమయంలో).

మత్సరం అనేది ధర్మాచరణను విస్మరింపజేస్తుంది. తద్వారా అది అనర్థాలకు దారితీస్తుంది.

ఈ విషయానికి కర్ణుడు ఏనాడూ విలువ ఇవ్వలేదు.

యుద్ధం చేయటానికి, పాండవులను నేను జయించగలనని నేను నిశ్చయించుకున్నాను.

శ్రీకృష్ణుడితో కర్ణుడి మాటలు. విపరీతమైన వేనిటీ. వీటికి తోడు కర్ణుడికి విపరీతమైన ఆవేశం, చాపల్యం.

భీష్ముడిని అంపశయ్య మీద దర్శించుకున్నప్పుడు ఆయన బోధ – బలాన్ని, పరాక్రమాన్ని ఆశ్రయించి అహంకారరహితుడవై యుద్దం చేయి. ధార్మికమైన యుద్ధం.

కానీ అభిమన్యుడి విషయంలో..!

పేజి 62, 64లలో చెప్పిన విశేషాలు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అలాగే ద్రౌపది విషయంలో కర్ణుడు చేసిన తప్పుల గురించి కూడా వివరంగా ప్రస్తావించారు.

This is a very essential book and I highly recommend it.

***

వ్యాసభారతంలో అసలు కర్ణుడు
రచన: వేదాంతం శ్రీపతిశర్మ
ప్రచురణ: Notion Press
పుటలు: 94
వెల: ₹ 199.00
ప్రతులకు
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఆన్‍లైన్‍లో:
https://www.amazon.in/Vyaasabhaaratamlo-Asalu-Karnudu-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/dp/B0C2DZZMNB/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here