(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)
[dropcap]బెం[/dropcap]గాల్ విభజన దరిమిలా ప్రారంభమైన జాతీయోద్యమం బెంగాల్‌లో అనేక పార్శ్వాలలో కొనసాగుతుండగానే.. మరో పక్క దేశ వ్యాప్తంగా వందేమాతరం ఒక నినాదంగా మారింది. జాతీయ స్థాయిలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి బ్రహ్మాస్త్రంగా మారింది. అటు బెంగాల్‌లో ఎవరూ ఊహించని విధంగా అన్ని వర్గాలు ఒక్కసారిగా ఏకమై పోరాట పథంలోకి దిగాయి. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నేత అయిన సురేంద్రనాథ్ బెనర్జీ మతపరమైన విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకోసం హిందూ ముస్లింలను సమన్వయం చేసుకొంటూ పోరాటాన్ని రచించారు. మతపరంగా ప్రాంతాలను విభజించడం అత్యంత ప్రమాదకరమని ఆయన తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే.. మతపరమైన విభజనను బెంగాలీలు అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అలాంటప్పుడు దేశ విభజనను ముస్లిం ప్రజలు కోరుకొన్నారని ఎవరు అన్నారు? వారు ఆశించిన ప్రయోజనం ఏమిటి?
బెంగాల్ విభజన అనంతర ఉద్యమం అనేక రూపాలలో వ్యక్తమైంది. ముఖ్యంగా బెంగాల్ ఉద్యమాన్ని స్వదేశీ ఉద్యమం అనో.. వందేమాతరం ఉద్యమం అనో భావించడానికి ప్రధాన కారణం మాతృభూమి భావనే. ఇందులో ప్రధానంగా ప్రభావితం చేసింది 19వ శతాబ్దంలో బెంగాల్‌లో వచ్చిన సంస్కరణోద్యమాలు. ఇవాళ హిందువుల్లోనే మూఢ నమ్మకాలు ఉన్నాయి. హిందూ ధర్మాన్ని అతి హేయంగా, అతి నీచంగా, అత్యంత దుర్మార్గంగా వెటకారాలు చేసే లిబరల్స్, హేతువాదులు.. సోకాల్డ్ కమ్యూనిస్టులమని చెప్పుకొనేవారు ముందుగా అధ్యయనం చేయాల్సింది బెంగాల్ సంస్కరణ ఉద్యమం గురించి. బెంగాల్‌లో జరిగిన సంస్కరణ ఉద్యమాలు కేవలం హిందువుల్లోనే కాదు.. ముస్లిం సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలను, తప్పుడు ఆచారాలను సంస్కరించే చర్యలు పెద్ద ఎత్తున మొదలు పెట్టాయి. ఒక పక్క రాజారామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం స్థాపించారు. మరో పక్క స్వామి దయానందులు ఆర్య సమాజం ప్రారంభించారు. ఇంకోవైపు ఫరియాజీ, తారీఖ్ ఈ మహమ్మదీయా వంటి సంస్కరణ ఉద్యమాలు ముస్లిం సమాజోద్ధరణకు పూనుకున్నాయి. హనాఫీ నుంచి పాయగా.. సూఫీల మెదళ్లలోంచి పుట్టుకొచ్చిన మూర్ఖపు ఆచారాలను తొలగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమాలు వేటికవే సమాంతరంగా కొనసాగుతూ బెంగాల్‌లో ప్రజలంతా ఏకం.. దేవుడు ఒక్కడే అన్న భావనను గట్టిగా పాదుకొల్పగలిగాయి. 1830లలో రాజా రామ్మోహన్ రాయ్ ద్వారా బెంగాల్‌లో ప్రారంభమైన ఈ సంస్కరణోద్యమాలు అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వచ్చాయి. రామకృష్ణులు, వివేకానందులు, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, శ్రీ అరవిందులు.. ఇలా ఒకరేమిటి.. ఎవరి మార్గంలో వారు భారతీయ మూలాలు విచ్ఛిన్నం కాకుండా పొత్తిళ్లలో పెట్టుకొని కన్నబిడ్డను కాపాడుకొన్నట్టు కాపాడుకొన్నారు. పూర్తిగా స్వతంత్రమై అభివృద్ధి గతిని నడిచే శక్తిమంతమైన భారతదేశాన్ని స్వామి వివేకానందులు దర్శించారు. తన సాంస్కృతిక గతం తోనే ఆక్రమణదారుల బంధాలనుంచి విముక్తి పొందాలని శాసించాడు. ‘స్వప్నాలు మేలుకొని సంకెళ్లు తెగిపోనీ, భయపడకు ఎప్పుడూ – ఈ అనర్థం నా నీడ, నన్నెప్పుడూ భయపెట్టలేదు. ఆ బ్రహ్మమే నేనని తెలుసుకో’ అని స్వేచ్ఛా గీతం అన్న కవితలో భారత దేశ స్వాతంత్ర్యోద్యమాన్ని, నిరంతరమైన విముక్తి సాధనను అభిన్నంగా భావించాడు వివేకానందుడు. ఠాగూర్ కుటుంబం విద్యాసంస్కరణల మీద దృష్టి సారించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన నాస్తానీర్ నవల పునరుజ్జీవన మార్గాలను గురించి ప్రస్తావన చేస్తుంది. కేశవ చంద్రసేన్, బిపిన్ చంద్రపాల్, ఎంఎన్ రాయ్ లాంటి వాళ్లు వినూతన బెంగాల్ కోసం పరితపించారు. శ్రీ అరవిందులు సాయుధ పోరాటాన్ని ఆకాంక్షించారు. ఆ దిశగా అడుగులు కదిపారు. స్వతంత్రత అన్నది ఏ జాతికైనా హక్కు అని స్పష్టంగా తేల్చి చెప్పారు. ఈ హక్కును కాపాడుకోవడం కోసం అవసరమైతే హింసను ప్రయోగించవచ్చని నినదించాడు. డర్టిన్ ఆఫ్ పాసివ్ రెసిస్టెన్స్ అన్న పేరుతో వందేమాతరం పత్రికలో ఏడు వ్యాసాలు రాశాడు. బాంబుల కర్మాగారంలో బాంబులు తయారు చేశారన్న నెపంతోనే ఆయన్ను అలీపూర్ జైల్లో బంధించారు. ఆ జైల్లోనే ఆయనకు వాసుదేవ సాక్షాత్కారం కావడంతో ఆయన తీవ్రంగా సాగుతున్న ఉద్యమాన్ని వదిలేసి వేదాంత అనుభవ మార్గం వైపు పయనించారు. దాదాపు ఒక శతాబ్దం పాటు బయటి ప్రపంచాన్ని, అంతర్గత సంఘర్షణలను మిగతా భారతదేశం కంటే బెంగాల్ ఎక్కువగా అర్థం చేసుకొన్నది. తూర్పు బెంగాల్ లోని బెంగాలీలు కూడా ఈ సంస్కరణల ప్రభావంలో ముందుకు సాగారు. హుస్సేన్ షా ఆ కాలంలో బెంగాలీ ప్రజల సాంస్కృతిక లక్షణాలను సమ్మిళితం చేసేందుకు కృషి చేశాడు. ఈ పునరుజ్జీవన ఉద్యమం బెంగాలీలంతా ఒక్కటే అన్న భావనను ప్రబలం చేసింది. వీరికి మతం, కులం అడ్డు కాలేదు. ఈ క్రమంలోనే బెంగాల్ విభజనను వారు తీవ్రంగా అడ్డుకోగలిగారు.
ఇప్పుడు తమను తాము సంస్కరణవాదులుగా చెప్పుకొంటున్న మేధావుల వల్ల ఈ సమైక్యత కూడా లేకుండా రెండు వర్గాల మధ్యన తీవ్రమైన అగాధం నెలకొన్నది. వాళ్లకు కావాల్సింది కూడా అదే. ఈ రెండు వర్గాలు ఎప్పటికీ కలువకూడదు. వీటిని ఛిన్నాభిన్నం చేయడం ద్వారా నిరంతరం కల్లోలంగా ఉంచడం వల్ల దేశంలో వేర్పాటువాదం ప్రబలి దేశం ముక్కలు చేయడానికి వీలవుతుంది. అప్పుడు తాము అనుకొన్న కమ్యూనిస్టు దేశాన్ని సాధించవచ్చు. ఇదీ వారి సుదీర్ఘ కాల వ్యూహం. ఇప్పుడిప్పుడే ఈ కూట నీతిని తిప్పికొట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి.
బెంగాల్ ఉద్యమం ప్రారంభంలో బెంగాల్‌కు పరిమితమైనప్పటికీ.. అప్పటికి బ్రిటిష్ వారికి కలకత్తా రాజధాని కావడంతో ఉద్యమ జ్వాలలు దేశమంతటా విస్తరించాయి. 1906 అక్టోబర్ 16న బెంగాలీలకు అత్యంత పవిత్రమైన దసరా ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున దుర్గా పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగానే దాదాపు 250కి పైగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ప్రదర్శనల్లో అన్ని మతాల ప్రజలు విభజనకు వ్యతిరేకంగా పోరాడారు. కలకత్తా, ఢాకా, ఫరీద్ పూర్ వంటి నగరాల్లో జరిగిన విభజన వ్యతిరేక సమావేశాలకు మహమ్మదీయులే అధ్యక్షత వహించారు. బెంగాలీలు అంతా కూడా మతాలకు అతీతంగా ఏకం కావడం బ్రిటిష్ వారికి కానీ, అలీగఢ్ ఎలీట్ మేధావులకు కానీ ఈ పరిణామాలు ఎంతమాత్రం రుచించలేదు.
ఒక పక్క అప్పుడప్పుడే పుట్టిన కాంగ్రెస్ నేతృత్వంలో ప్రారంభమైన తొలి ఉద్యమం ఇది. ఒక పక్క కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సురేంద్రనాథ్ బెనర్జీ ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఒకవైపు ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిష్ వారు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. 1906 డిసెంబర్‌లో కలకత్తాలో కాంగ్రెస్ మహా సభ నిర్వహించింది. ఈ సభ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఏకంగా తీర్మానం చేసింది. ఆ సభలో సురేంద్రనాథ్ బెనర్జీ సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు. బెంగాల్ విభజనను నీరుకారుస్తూ లండన్ టైమ్స్ పత్రిక విలేఖరి రాసిన వ్యాఖ్యల్ని ఆయన నిర్ద్వంద్వంగా తిప్పి కొట్టారు. ఈ ఉద్యమం యావద్భారతాన్ని ప్రభావితం చేస్తుందని, అది స్వపరిపాలనకు దారి తీస్తుందని స్పష్టంగా చెప్పాడు. బెంగాల్ విభజన అనే పెద్ద తప్పు భారతీయుల హృదయాల్లో సరికొత్త చైతన్యాన్ని తీసుకొచ్చాయి. విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు ప్రోత్సాహం అన్న రెండు బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమానికి ఊపిరి పోసాయి. 1905 డిసెంబర్‌లో మహారాష్ట్ర లోని పూణెలో బాబు గేను అనే ఒక యువకుడు విదేశీ వస్త్రాలను తగులబెట్టాడు. ఆ తరువాత అతడిని లారీ ఎక్కించి చంపారు బ్రిటిష్ వాళ్లు. అలా మొదలైన విదేశీ వస్తు బహిష్కరణ 1906 ఫిబ్రవరి 27న కలకత్తా కాలేజీ స్క్వేర్ దగ్గర ఉద్యమ రూపం దాల్చింది. బెంగాల్ ఉద్యమాన్ని అణచివేయడానికి లార్డ్ మింటో వైస్రాయ్‌గా వచ్చాడు. కానీ ఉద్యమం రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చింది. 1906లోనే స్వదేశీ వస్తు ప్రోత్సాహం పెరిగింది. 1906లో వంగ లక్ష్మీ కాటన్ మిల్లు ప్రారంభమైంది. అరవిందఘోష్ జాతీయ విద్య కళాశాలను ప్రారంభించాడు. బెంగాలీ, యుగంధర్, అమృతబజార్, వందేమాతరం, నవభారత్ వంటి పత్రికలు ఉద్యమాన్ని ముందుకు నడిపించాయి. ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు పురుడు పోసుకోవడానికి రెండు దశాబ్దాలకు ముందే దేశంలో కార్మిక సంఘాలు మొదలయ్యాయి. 1905 అక్టోబర్ 21 న పెయింటర్ల యూనియన్ ఏర్పడింది. రైల్వే కార్మికుల సంఘం అసన్‌సోల్, రాణీగంజ్ లలో 1906లో ఏర్పడ్డది. ఇండియన్ మిల్స్ హ్యాండ్స్ యూనియన్‌ను 1906 లోనే అశ్వనికుమార్ బెనర్జీ ఏర్పాటు చేశారు. స్వదేశీ పరిశ్రమలు నెలకొల్పే వారికి మనీంద్ర నంది ఆర్థిక సహాయాన్ని చేశారు. ఈ దేశంలోకి కమ్యూనిస్టులు ప్రవేశించడానికి ముందే.. సామ్యవాద లక్షణాలు ఇక్కడ వేళ్లూనుకొని ఉన్నాయి.
క్రమంగా వందేమాతరం ఉద్యమం జ్వలిత చేతనను రగిలిస్తూ దేశమంతటా విస్తరించింది. దేశమంతటా విస్తరింపచేయడంలో కీలక పాత్ర పోషించిన వాడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ‘సార్వజనీనమైన నవ రాజకీయములందు పూర్వాచారపరమైన భారత ప్రజలకు తిలక్ ఏకైక నాయకుడై నిలిచినాడు. మత విశ్వాసము చెడని భారత ప్రజలు వారిని విశ్వసించినది ఇందువలననే. నవీన రాజకీయోత్సాహమును, ప్రాచీన సంప్రదాయముతో జోడింపగలిగినవాడు. కాంగ్రెస్ ఉద్యమము అంతకుముందు ఆంగ్ల భాషావేత్తలైన కొద్ది మందికే వ్యాపించి ఉండినది. హిందూ దేశ అంతరాత్మతో కానీ, పూర్వ చరిత్రతో కానీ ఆ ఉద్యమమునకు బంధం ఏర్పడి ఉండలేదు. అట్టి బంధము ఏర్పరిచిన మొదటి రాజకీయ నాయకుడు తిలక్. గతమునకు, వర్తమానమునకు లంకె వేసిన వాడు తిలక్. యావత్ ప్రజానీకమును ఉద్యమములోనికి చేరదీసినవాడు తిలక్.’ అని శ్రీఅరవిందులు తిలక్ రచనలు, ఉపన్యాసములు అన్న గ్రంథానికి రాసిన ముందు మాటలో పేర్కొన్నారు. తిలక్ కారణంగానే వందేమాతరం ఉద్యమం దేశవ్యాప్తమైంది. మద్రాస్ కేంద్రంగా ఇండియన్ బ్యాంకు 1907లో మొదలైంది. అహమ్మదాబాద్ లో దేశీయ ఉత్పాదిత వస్తు సంరక్షణ సమితి ఏర్పడింది. బారాసోల్‌లో అశ్వనీ కుమార్ దత్ స్వదేశీ బోధన సమితి స్థాపించారు. 1906లో జాతీయ శిక్షాపరిషత్ మొదలైంది. ఆంధ్ర ప్రాంతంలో టంగుటూరి ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య కలిసి ఆంధ్ర మహాసభను ప్రారంభించారు. ఆంధ్ర కేసరి, స్వరాజ్య, దేశాభిమాని పేర్లతో తెలుగు పత్రికలు మొదలయ్యాయి. మదన్ మోహన్ మాలవీయ, చింతామణి కలిసి నైనిటాల్ ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ ప్రారంభించారు. బొంబాయిలో ప్రచారిణీ సభ, అలహాబాద్‌లో నగరీ ప్రచారిణీ సభలు ప్రారంభమయ్యాయి. లాలా లజపతిరాయ్ అనుచరుడు అజిత్ సింగ్ భారతమాత సమాజాన్ని ప్రారంభించాడు. ఉద్యమం దేశమంతా విస్తరిస్తుండటంతో బ్రిటిష్ వాళ్లు అణచివేత చర్యలను పెద్ద ఎత్తున చేపట్టారు. 1908 జూలై 13న బాలగంగాధర్ తిలక్‌కు ఆరేండ్ల జైలు శిక్ష విధించి బర్మాలోని మాండలే జైలుకు పంపించారు. లాలా లజపతి రాయ్ దేశ బహిష్కరణకు గురయ్యారు. బిపిన్ చంద్రపాల్, శ్రీఅరవిందులు క్రియాశీల ఉద్యమం నుంచి తప్పుకున్నారు.
ఈ పరిణామాలన్నీ కూడా తరువాతి కాలంలో దేశ విభజన తంత్రానికి బీజావాపం చేశాయని భావించవచ్చు. ఎందుకంటే.. బెంగాల్ విభజన సందర్భం నుంచే బ్రిటిషర్లు హిందూ ముస్లింలను వేరుగా చూడటం ప్రారంభించారు. రెండు మతాల ప్రజలు కలివిడిగా కాకుండా వేర్వేరుగా ఉన్నప్పుడే తమ పరిపాలన కలకాలం ఉంటుందని భావించారు. వాళ్లు కలకాలం ఉండలేదు కానీ.. దేశం మాత్రం వారి పోకడల కారణంగా ముక్కలు చెక్కలైంది.
నిజంగా పరిపాలనా సౌలభ్యం కోసమే కనుక బెంగాల్ ప్రావిన్సును రెండు పరిపాలనా కేంద్రాలుగా చేయాలంటే.. భాష ప్రాతిపదికన చేయాలని బెంగాలీలు మొదట్నుంచీ కోరారు. కానీ.. బ్రిటిష్ వాళ్ల అంతర్గత ఆలోచన మాత్రం మతమే కావడంతో ఆ తరువాతి చర్యలు కూడా ముస్లిం సంతుష్టీకరణ దిశగానే సాగాయి. ఈ సంతుష్టీకరణ అన్నది దేశం అవిభాజ్యంగా ఉంచడం కష్టసాధ్యమయ్యే పరిస్థితులను కల్పించాయనడంలో సందేహం లేదు. వాస్తవానికి బెంగాల్ విభజన అమలులోకి వచ్చిన నాటినుంచే ముస్లిం మేధావులు దేశ విభజన వాదానికి పావులు కదుపుతూ వచ్చారు. 1906 అక్టోబర్‌లో ఆఘాఖాన్ నేతృత్వంలో కొందరు ముస్లింల సమూహం సిమ్లా డిప్యూటేషన్ పేరుతో వైస్రాయ్ మింటోతో సమావేశమై ముస్లింలకు ప్రత్యేక ఓటర్లు, వారి జనాభాకు మించి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కొంత కాలం తరువాత ఇదే గ్రూపు ముస్లింలీగ్ పై నియంత్రణ సాధించింది. మింటోతో చర్చల అనంతరం.. వారి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం మేరకు 1906 డిసెంబర్లో ఢాకా నవాబు సలీముల్లా, మరో ఇద్దరు నవాబులు మొహ్సిన్ ఉల్ ముల్క్, వకార్ ఉల్ ముల్క్ నేతృత్వంలో ముస్లిం లీగ్ అవతరించింది. ముస్లింలీగ్ ను పెంచి పోషించింది మింటోయే. వీరిని సంతుష్టీకరించడం కోసమే 1909లో మింటో మార్లే సంస్కరణలు వచ్చాయి. అప్పటి వైస్రాయ్ మింటో, అప్పటి భారతీయ వ్యవహారాల మంత్రి జాన్ మార్లే పేరుతో ఈ సంస్కరణలను తీసుకొని వచ్చారు. ఈ చట్టం భారతీయ శాసనమండళ్ల విస్తరణ పరిధిని పెంచాయి. ఈ చట్టం ముస్లింలకు ప్రత్యేకంగా నియోజక వర్గాలను కేటాయించింది. చట్ట సభల్లో భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామనే పేరుతో ఈ ప్రత్యేక నియోజక వర్గాలను సృష్టించడం ద్వారా మరో విభజనకు ఆజ్యం పోసింది. ఈ సంస్కరణ దేశంలో ఓటర్లను కూడా మత ప్రాతిపదికన రెండుగా విభజించింది. ముస్లింలు మాత్రమే ఓటర్లుగా, ముస్లింలను మాత్రమే ఎన్నుకొనే విధంగా ప్రత్యేక నియోజకవర్గాల విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భారతదేశంలో మతవాదాన్ని చట్టబద్దం చేసిన తీవ్రమైన సంస్కరణ ఇది.
(సశేషం)