యువభారతి వారి ‘మాఘ కావ్య వైభవం’ – పరిచయం

0
4

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

మాఘ కావ్య వైభవం

[dropcap]ప్రా[/dropcap]చీన, అర్వాచీన సాహిత్యాలను దింగ్మాత్రంగానైనా పరిచయం కలిగించాలనే ఆలోచనతో, సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సునిశితంగా, సమవేదనా దృక్కోణంతో పరిచయం చేయాలనే ఉద్దేశంతో యువభారతి ‘సాహితీ వాహిని’ పరంపరను ప్రచురిస్తున్నది. ఈ పరంపరలో ప్రచురించబడిన పుస్తకమే – ‘మాఘ కావ్య వైభవం’.

సంస్కృత కవుల్లో ఉపమలు – అంటే పోలికలు – చెప్పడంలో కాళిదాసు గొప్పవాడు. గంభీరమైన అర్థాలను గుబాళించి కవితను వెలయించినవాడు భారవి. మృదులమైన పదాలను ఇంపుసొంపులు ఒలికిస్తూ ప్రయోగించడంలో మంచి నేర్పు ఉన్నవాడు దండి. ఐతే మాఘునిలో ఈ మూడు గుణాలూ ఉన్నాయని మాఘుని గూర్చి ఒక అభినివేశం ఉన్న అభిమాని అన్నాడు.

రఘువంశం, కుమారసంభవం, మేఘసందేశం, కిరాతార్జునీయం, శిశుపాల వధ – ఈ ఐదు కావ్యాలూ పంచకావ్యాలుగా ప్రసిద్ధి చెందాయి. కొందరు మేఘసందేశానికి బదులు శృంగార నైషధం కావ్యాన్ని కలిపి పంచకావ్యాలు అంటారు. ఈ ఆరు కావ్యాల్లో కాళిదాసు రచించిన మొదటి మూడుకావ్యాలు ‘లఘుత్రయి’ అనీ, మిగిలిన మూడు కావ్యాలూ ‘బృహత్రయి’ అని ప్రసిద్ధి పొందాయి. మాఘకవి రచించిన ‘శిశుపాల వధ‘ కావ్యాన్నే మాఘ కావ్యమని కూడా అంటారు.

మాఘకవి అయిదు శ్లోకాలలో తన వంశాన్ని గూర్చి చెప్పుకున్నాడు. శ్రీవర్మల రాజు దగ్గర మహామంత్రిగా ఉన్న సుప్రభదేవుని పౌత్రుడు, ఎందరికో ఆశ్రయమిచ్చి ‘సర్వాశ్రయు’ డని ప్రసిద్ధి పొందిన దత్తకుని పుత్రుడు ఐన ఈ మాఘుడు గొప్ప కవి, దార్శనికుడు. శాస్త్ర పరిజ్ఞానాన్ని పుష్కలంగా సముపార్జించుకున్న విజ్ఞాన ఖని.

ఆయన రచించిన ఈ కావ్యం లోని కొన్ని శ్లోకాలకు తెలుగులో సరళమైన వ్యాఖ్యానం వ్రాసి మనకు అందించినవారు శ్రీ కె వి రాఘవాచార్యులు గారు. ఆయన యువభారతి నిర్వహిస్తున్న సాహిత్యోద్యమం పట్ల ఆసక్తి చూపుతున్న సహృదయులు. సంస్కృతాంద్ర ఆంధ్ర భాషలలో చక్కని వైదుష్యం ఉన్నవారు. వేదాధ్యయన తర్పరులు. M.A., B.Ed., పట్టభద్రులు.

ఈ మాఘ కావ్య వైభవాన్ని ఆస్వాదించదలుచుకున్న వారు, క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోవచ్చు.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%98%20%E0%B0%95%E0%B0%BE%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here