[డా. బి. హేమావతి రచించిన ‘కనులు తెరచినప్పుడు జారి వస్తాను ఒక స్వప్నమై’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]నీ [/dropcap]కళ్ళల్లోని ప్రేమ
కొలిమిలో కాలుతున్న
ఇనుప కడ్డీలా
కరిగి ప్రవహించి
ఎర్రని జీరగా మిగిలింది
అందులో మిగిల్చింది
నన్ను సన్నని బూడిదగా
ఆకాశాన్నoతా అలుముకున్న
నేను నీ వేడికి
కరగి వర్షంలా
కురిసి హిమాలయముల
చల్లదనానికి గడ్డకట్టి
నీపై కోరికతో
సాగి ప్రవహించి
నీ కంటినే అందుకొన్నా
కంటిలోని బిందువై
కనురెప్పల మాటున
నీలో నేనైనా నాకు విశ్రాంతి
నా కోసం నీవు కనులు
తెరచినప్పుడు జారి వస్తాను
ఒక స్వప్నమై..