పునరుజ్జీవనం

0
3

[శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ రచించిన ‘పునరుజ్జీవనం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]వే[/dropcap]లవేల వత్సరాల జగతిలో
వానరమే నరుడైన క్రమంలో
మనిషిగా మారిన పరిణామ క్రమంలో
లేనే లేవు తేడాలు కానరావు విభేదాలు
సమిష్టితత్వం ఆనాటి జీవిత మార్గం
అనుబందాలు అనురాగాలు దట్టంగా
అల్లుకున్న వసుదైక కుటుంబం నాడు
మంచితనం మానవత్వం మనిషి
మనిషిలో నిండి వున్నడానాడు
శోధించి సాధించి అంతులేని జ్ఞానంతో
మానవాభ్యుదయానికి వేశాడు
రాచబాటలెన్నో
నింగిపైకి ఎగిరాడు నీటిలోకి దూకాడు
విశ్వ రహస్యాలన్నీ తేటతెల్లం చేసాడు
కార్పరేటు చదువులతో ఖండాంతరాలు దాటాడు
ఎదిగి ఎదిగి ఎవరికీ అందనంత ఎత్తు కెగసి
ప్రపంచీకరణ వలయంలో పడి కొట్టుకుపోయాడు
జాలి లేదు దయా లేదు
ప్రేమా లేదు పాశం లేదు
నీతి నిజాయితలకు నీళ్లొదిలివేసాడు
స్వార్థం మరిగాడు ద్రోహం నేర్చాడు
ధనార్జనే ధ్యేయంగా దానవుడై పోయాడు
సుఖాలుమరిగాడు విలాసాలు పెరిగాయి
తండ్రిలేడు తల్లిలేదు అన్నలేడు అక్కలేదు
బంధాలను మరిచాడు బాధ్యతలను విడిచాడు
కన్నతల్లి శవాన్ని స్కైప్‌లో చూసాడు
తండ్రి చితిమంటలు ఖరీదైన కెమేరాతో
వీడియో తీసి ఆన్‌లైన్‌లో పంపామన్నాడు
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే
మార్క్స్ మాటలను నిజం చేసి చూపాడు
సాటి మనిషిని మనిషిగా చూడటమే మానేశాడు
మనిషి పెరిగి పెరిగి ఆకాశాన్నంటాడు
మనసు తరిగి తరిగి మరుగుజ్జయి మిగిలాడు
వలువలను విడిచినంత సులభంగా
విలువలన్నీ వదిలేసాడు
మమతలన్నీ మాసిపోయి
మానవత్వం చచ్చిపోయి
మనిషినని మరచిపోయి
అతల వితల సుతల లోకాలన్నీ దాటి
పాతాళ లోకానికి పడిపోతున్నాడు
పతనమయిన మనిషిని
పునరుజ్జీవింపచేయాలి
మమతలపాదును సరిచేయాలి
అనురాగాల పందిరిని పదిలంగా అల్లాలి
అనుబందాలు ఆప్యాయతల కలబోతగా మదినిండా నిలపాలి
మానవత్వ పరిమళాలు హృదయమంతా పరవాలి
మనిషిని మనిషిగా మలచాలి
జగతి అంత వెలుగులు విరజిమ్మాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here