[మాయా ఏంజిలో రచించిన ‘Contemporary Announcement’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]
(ఉపాధి కోల్పోయిన వేతనజీవుల వెతలను కళ్ళకి కట్టే కవిత!)
~
[dropcap]పె[/dropcap]ద్దగా గంటలు మోగించు
వంట త్వరగా ముగించు
నీ వెండి గొలుసు మెడలో వేసుకో
అదిగో
ఇంటి యజమాని తలుపు తడుతున్నాడు
అద్దె డబ్బులు నా జేబులో ఉన్నాయిలే
దీపాలు ఆర్పెయ్యి
శ్వాసను బిగబట్టి ఉంచు
నా హృదయాన్ని నీ చేతిలోకి తీసుకో
రెండువారాల కిందటే
నా ఉద్యోగం పోయిందని తెలుసుగా
అద్దె డబ్బులివ్వాల్సిన రోజు
మళ్ళీ రానే వచ్చింది!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
ఎనిమిదేళ్ళ వయసులో, తన తల్లి మగస్నేహితుడు మాయా పై అత్యాచారం చేసిన తరువాత ఆమె కొంతకాలం పూర్తిగా మూగబోయింది. ఆ వయసులోని అన్ని ఆనందాలకీ దూరమై, దాదాపు అయిదు సంవత్సరాలు నిశ్శబ్దంగా, నిరామయంగా బతికింది. ఆ రోజుల్లో ఆమెని ఆ నిర్లిప్తతలోంచి బయటపడేసేందుకు మాయా అమ్మమ్మ ఎంతగానో పరితపించింది. ఆమె Arkansas రాష్ట్రంలోని stamps అనే చిన్న గ్రామంలో ఒక జనరల్ స్టోర్ ని నడిపిస్తూ జీవించేది. మాయా బాల్యం అంతా అమ్మమ్మ దగ్గరే గడిచింది. ఆమెని మాయా అమ్మా అనే పిలిచేది. ఆమే మాయాకి మంచి సాహిత్యాన్ని పరిచయం చేసింది. అదే సమయంలో మాయా తల్లి సోదరుడు ఆ రేపిస్ట్‌ను హత్య చేస్తాడు. సాహితీ పఠనంతో నెమ్మదిగా సేదదీరిన మాయా క్రమంగా ఒక కళాకారిణిగా ఎదిగింది. తరువాత తరాలను ప్రభావితం చేసే రచయిత్రిగా రూపు దిద్దుకోవడానికి ఈ బాల్యంలోనే పునాది పడింది.
హైస్కూల్ చదువుకు కావాల్సిన డబ్బు కొరకు శాన్ ఫ్రాన్సిస్కో లో స్ట్రీట్ కార్ కండక్టర్‌గా పనిచేసింది. 2013లో ప్రఖ్యాత అమెరికన్ టెలివిజన్ టాక్ షో హోస్టెస్, రచయిత్రి ఓఫ్రా విన్ ఫ్రే కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో – తన నల్లరంగు వలన తను ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నించినా తిరస్కారమే ఎదురైందని చెప్పారు.
తన హైస్కూలు గ్రాడ్యుయేషన్ చదువు పూర్తి అయిన నెలరోజుల లోపే 17 సంవత్సరాల బాలిక మాయా ఒక మగశిశువుకు జన్మనిస్తుంది. I know Why The Caged Bird Sings అన్న తన ఆత్మకథలో తాను లెస్బియన్‌ని కాదని నిరూపించుకోవడానికే ఒక బాలుని ద్వారా తల్లినైనానని రాసుకుంది.