ప్రాంతీయ సినిమా -10: భోజీవుడ్ ఫుల్ భోజనం

    0
    5

    [box type=’note’ fontsize=’16’] “సినిమాల తీరు పూర్తిగా ద్వందార్ధాల,  అశ్లీలాల, మాస్ మసాలాల ప్రదర్శనగా మారిపోయింది. ఇలా ఉంటేనే ప్రేక్షకులకి ఫుల్ భోజనం ఆరగించినట్టు వుంటోంది” అని భోజ్‌పురి సినిమాల గురించి విశ్లేషిస్తున్నారు సికందర్ప్రాంతీయ సినిమా – 10: భోజీవుడ్ ఫుల్ భోజనం” వ్యాసంలో. [/box]

    [dropcap style=”circle”]దే[/dropcap]శంలో ఆయా ప్రధాన భాషల్లో సినిమా రంగాలున్నాయి. ఒక్కోటీ వేల కోట్ల రూపాయల టర్నోవర్ గల పరిశ్రమలుగా అభివృద్ధి చెందాయి. కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రధాన భాషలో సినిమాలు ఇంకా ఎదగని లఘు పరిశ్రమలుగానే  వున్నాయి. అయితే ఒక ప్రధాన భాషకి మాండలికంగా వున్న భాషలో ప్రాంతీయ సినిమా పరిశ్రమ రెండు వేల కోట్ల బృహత్ పరిశ్రమగా ఎదగడం ఒక్క చోటే జరిగింది. అది భోజీవుడ్‌లో. భోజీవుడ్ ఉత్పత్తి చేస్తున్న భోజ్‌పురి సినిమాలు తెలియని వారుండరు.  పశ్చిమ బీహార్, తూర్పు ఉత్తర ప్రదేశ్ లతో బాటు, నేపాల్ లోని మధేష్ ప్రాంతంలో మాట్లాడే భోజ్‌పురి భాష హిందీకి ఒక మాండలికంగా వుంది. 25 కోట్ల మంది భోజ్‌పురి ప్రేక్షకులు గల విస్తారమైన  మార్కెట్‌తో, ఏడాదికి 75 సినిమాలు నిర్మించే రెగ్యులర్ మూవీ ఇండస్ట్రీగా ఇవ్వాళ  భోజీవుడ్ వర్ధిల్లుతోంది.

    భోజ్‌పురి సినిమాలు ఈ మధ్య కాలంలో కమర్షియల్ సినిమాలుగా బాగా ప్రాచుర్యం పొందాక దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిలో పడ్డాయి గానీ, వీటికి 55  ఏళ్ల  సుదీర్ఘ చరిత్ర వుందన్న సంగతి  చాలా మందికి తెలియదు. 1962  లోనే మొదటి భోజ్‌పురి సినిమా నిర్మించి చరిత్రకి అంకురార్పణ చేశారు. ప్రథమ దేశాధ్యక్షుడు, బీహార్‌కి చెందిన  బాబూ రాజేంద్ర ప్రసాద్ (1950- 62), నటుడు నజీర్ హుస్సేన్‌ని భోజ్‌పురిలో ఒక సినిమా నిర్మించమని కోరినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. అప్పటికే నజీర్ హుస్సేన్ ‘దేవదాస్’లో నటిస్తున్నప్పుడు భోజ్‌పురి భాషలో  ‘గంగామయ్యా తొహే పియారీ చధైబో’ ( గంగమ్మ తల్లీ నీకు పసుపు చీర అర్పిస్తున్నా)  అనే స్క్రిప్టు రాసుకున్నారు. దాన్ని నిర్మాత బిశ్వనాథ్ ప్రసాద్ షహబాదీకి చూపించారు. అలా 1962  లో అదే పేరుతో  తొలి భోజ్‌పురి చలనచిత్రంగా  ఇది నిర్మాణం జరుపుకుంది. ఐతే ఇదేదో ప్రాంతీయ సినిమాలాగా స్థానిక కళాకారులతో నిర్మించింది కాదు. హిందీ సినిమా కళాకారులతో హిందీ సినిమాలకి దీటుగా అట్టహాసంగా అప్పట్లోనే నిర్మించారు. కుందన్ కుమార్ దర్శకుడు. కుమ్‌కుమ్, ఆశీమ్ కుమార్, నజీర్ హుస్సేన్‌లు నటీ నటులు. ఆర్కే పండిట్ ఛాయాగ్రాహకుడు, చిత్రగుప్త సంగీత దర్శకుడు, శైలేంద్ర గీత రచయిత, మహ్మద్ రఫీ, లతా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, సుమన్ కళ్యాణ్‌పురిలు గాయనీ గాయకులు. నిర్మాణ వ్యయం లక్షన్నర అనుకుని ప్రారంభిస్తే  అయిదు లక్షలయ్యింది. విడుదలకి ముందు పాట్నాలో బాబూ రాజేంద్ర ప్రసాద్‌కి ప్రదర్శించి ప్రశంస లందుకున్నారు. వితంతు వివాహాల మీద అభ్యుదయకరంగా ఈ తొలి భోజ్‌పురి సినిమా తీశారు.

    ఆలస్యంగా చరిత్ర ప్రారంభించుకున్న ప్రాంతీయ సినిమాలు నత్తనడకే నడిచాయి. 1920లలో చరిత్ర ప్రారంభించుకున్న వివిధ భాషా చలన చిత్రాలు సంఖ్యాపరంగా వెంట వెంటనే ఊపందుకున్నాయి. కారణం సినిమా అప్పుడప్పుడే కొత్త. జనాల్లో వున్న క్రేజ్. కానీ 60లలో, 70 లలో, 80 లలో చరిత్ర ప్రారంభించుకున్న కొన్ని ప్రాంతీయ చలన చిత్ర రంగాలు అక్కడి ప్రేక్షకుల్లో క్రేజ్‌ని సృష్టించలేక పోయాయి. కారణం,  అప్పటికే ప్రధాన భాషల్లో సినిమాలు వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తూ వుండడం. అందుకని హిందీ రాష్ట్రాల్లో హిందీ సినిమాల ఉప్పెనలో భోజ్‌పురి సినిమా ఆవిర్భావం ఒక కుదుపు ఏమీ కాలేకపోయింది. వెంట వెంటనే భోజ్‌పురి సినిమాల నిర్మాణాలు ఊపందుకోనూ లేదు. ఆ తర్వాత 1963లో రెండు (‘లాగీ నహీ ఛుటే రామ్’, ‘బిదేశియా’),  65లో మరో రెండు (‘గంగా’, ‘భౌజీ’).  66లో ఒక్కటి (‘లోహాసింగ్’) అన్నవి కొన్ని మాత్రమే నిర్మాణం జరుపుకున్నవి. ఇక 1970లలో మొత్తం కలిపి నాల్గే సినిమాలు నిర్మించారు. ’80లలో ఎనిమిది నిర్మించాక, ’90లలో భోజ్‌పురి సినిమాలనేవే లేవు!

    2001 నుంచే మళ్ళీ ప్రారంభమవుతూ క్రమంగా కమర్షియల్ బాట పట్టి, క్రమ క్రమంగా విలువలు కోల్పోతూ చవకబారు సినిమాల ఉత్పత్తిదారుగా పేరు తెచ్చుకుంది భోజీవుడ్. 2001లోనే సిల్వర్ జూబ్లీ హిట్  ‘సయ్యా హమార్’ (మై స్వీట్ హార్ట్) లో హీరోగా పరిచయమైన  రవికిషన్,   రెండు మూడేళ్ళ కల్లా బిజీ స్టార్ అయిపోయాడు. 2005లో ‘ససురా బడా పైసే వాలా’ (మామ బాగా డబ్బున్నోడు)  అనే హిట్‌తో పరిచయమైన  మనోజ్ తివారీ తర్వాత తనూ  స్టార్ అయిపోయాడు. ఇలా భోజీవుడ్ స్టార్లుగా వీళ్ళిద్దరూ ఏలుకోసాగేరు. రవికిషన్ కొన్ని  తెలుగు సినిమాల్లో విలన్‌గా  నటించడానికీ వెనుకాడలేదు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, శత్రుఘ్న సిన్హా, మిథున్ చక్రవర్తి, సైతం భోజ్‌పురి సినిమాల్లో నటించడానికి వెనుకాడలేదు. రాజ్ బబ్బర్, కాదర్ ఖాన్, అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగణ్, జాకీ ష్రాఫ్ లవంటి బాలీవుడ్ స్టార్స్ కూడా భోజీవుడ్‌లో నటించారు.

    భోజ్‌పురి సినిమాలకి విదేశాల్లో కూడా మార్కెట్ వుంది. అమెరికా, బ్రిటన్, దుబాయి, నేపాల్, ఘనా, ఫిజీ, గయానా, దక్షిణాఫ్రికా, మారిషస్, నెదర్లాండ్స్ లలో కూడా భోజ్‌పురి సినిమాలు చూసే ప్రేక్షకులున్నారు. వంద రెండు వందల ఏళ్ల క్రితం వలస కూలీలుగా వెళ్ళిన భోజ్‌పురి భాషీయులు రెండు కోట్ల మంది వరకూ వెస్టిండీస్‌లో, దక్షిణ అమెరికాలో వున్నారు. భోజ్‌పురి సినిమాలు వాళ్ళకీ చేరుతున్నాయి. ఇలా విస్తృత మార్కెట్ వ్యవస్థతో,  ఏటా 75 సినిమాలు తీసే,  2 వేల కోట్ల పరిశ్రమగా విరాజిల్లుతోంది భోజీవుడ్.

    భోజ్‌పురి సినిమాలు ముంబాయి కేంద్రంగానే నిర్మాణాలు జరుపుకుంటున్నాయి. ముంబాయిలో భోజ్‌పురి సినిమాలు తీసే బ్యానర్లు 250 వరకూ రిజిస్టరయి వున్నాయి. ఇక్కడ్నించీ లక్నో మారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రలో నార్త్ ఇండియన్స్ వలసల్ని అడ్డుకుంటున్న రాజ్ థాకరే వర్గీయులతో భోజ్‌పురి సినిమాల నిర్మాణాలకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. షూటింగ్ స్థలాల్లో దాడులు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని లక్నోకి మారిపోదామని ప్రయత్నిస్తున్నారు భోజీవుడ్ ప్రముఖులు. కానీ యూపీ ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదు. లక్నో కాకపోతే ధిల్లీ, నోయిడా, పాట్నాలు ప్రత్యాన్మాయాలుగా యోచిస్తున్నారు.

    మహారాష్ట్రలో అభద్రతా పరిస్థితుల మధ్య కూడా భోజీవుడ్ మనుగడకీ, అభివృద్ధికీ లోటు రాకుండా చూసుకోవడం కేవలం ఇద్దరు సూపర్ స్టార్లు రవికిషన్, మనోజ్ తివారీల వల్లే సాధ్యమవుతోందనీ చెప్పుకుంటున్నారు. వీళ్ళ ఒక్క సినిమా విడుదలైతే పదికోట్లు వసూలు చేస్తుంది. పారితోషికం 20 శాతం పెంచుకున్నారు. నిర్మాణ బడ్జెట్ 75 లక్షల నుంచి 2 కోట్లకి పెరిగింది. ఈ ఇద్దరు స్టార్లు 2004 – 14 మధ్య దశాబ్ద కాలం వెలుగొందాక, ఇప్పుడు నెమ్మదించి నప్పటికీ,  పరిశ్రమ మీద పట్టు మాత్రం కోల్పోక పెద్ద దిక్కుగా కొనసాగుతున్నారు.

          

    ఇప్పుడు భోజీవుడ్ లేటెస్ట్ స్టార్స్ పవన్ సింగ్, దినేష్ లాల్ యాదవ్, కేసరీ లాల్ యాదవ్‌లు. పాపులర్ హీరోయిన్లు మధు శర్మ, అమ్రపాలీ దుబే, కాజల్ రఘ్వానీ, సంభావనా సేథ్‌లు. ఈ హీరోయిన్లు యాభై లక్షలు డిమాండ్ చేస్తున్నారు. సినిమాల తీరు పూర్తిగా ద్వందార్ధాల,  అశ్లీలాల, మాస్ మసాలాల ప్రదర్శనగా మారిపోయింది. ఇలా ఉంటేనే ప్రేక్షకులకి ఫుల్ భోజనం ఆరగించినట్టు వుంటోంది. బీహార్‌లో చిన్నచిన్న పట్టణాల్లోని థియేటర్లలో భోజ్‌పురి సినిమాలని ప్రదర్శిస్తున్నారు. పాట్నా లాంటి పెద్ద నగరాల్లో కార్పోరేట్ చైన్ థియేటర్లలో వీటికి స్థానం  కల్పించడం లేదు. వాటిని బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకే పరిమితం చేస్తున్నారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here