మహతి-8

3
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[బహుమతులు గెల్చుకుని వచ్చిన విద్యార్థులను ప్రశంసిస్తారు ప్రిన్సిపాల్ గారు. వాళ్ళకి కాలేజీలో సన్మానం చేస్తారు. మహతి ఇంటికెళ్ళేసరికి వాళ్ళ నాన్న   పైన కవర్లు కప్పి ఉంచిన కొన్ని ఫొటో ఫ్రేమ్‍లను చూపించి వాటిని తెరవమంటాడు. వాటిని తెరిచి చూసిన మహీ అబ్బురపడుతుంది. అవన్నీ ఆమె ఫొటోలే. రంగనాథ్ గారు తల నిమురుతున్నదీ, జాలాది గారు భుజం తట్టిందీ, జి. ఆనంద్ గారు కరచాలనం చేస్తున్నదీ, మహీ తన్మయత్వంతో పాడుతున్నదీ, ప్రైజ్ మనీ ముగ్గురు జడ్జీల చేతి మీదుగా అందుకుంటున్నదీ.. మహీ పాట వినడానికి వచ్చిన అమ్మానాన్న ఆమె పాటలు విని, ఫొటో స్టూడియో వీరయ్య గారిని తీసుకొచ్చి ఫొటోలు తీయించారనీ, ఆయన కూడా మహీ పాటలు విని  ఆ ఫొటోలన్నీ ఫ్రీగా తీసిచ్చారని చెప్తారు. అలాగే హరగోపాల్ ఫొటోలు కూడా తీయించి, మర్నాడు అతన్ని తమ ఇంటికి భోజనానికి పిల్చి ఆ ఫొటోల మీద కవర్లని అతనితోనే తీయిస్తారు. తన ఫోటోలను చూసుకున్న హగ్గీ ఆనందిస్తాడు. మహీవాళ్ళ నాన్న పాదాలకి నమస్కరిస్తాడు. కొన్ని రోజులకి కాలేజీలో వీళ్ళని ప్రత్యేకంగా చూడ్డం మానేస్తారు. తిమ్మూ దిగులుగా ఉండడం చూసి, ఓరోజు అతన్ని కారణం అడుగుతుంది మహీ. ప్రేమించమంటూ అల తనని వేధిస్తోందనీ, తాను కాదంటే ఆత్మహత్య చేసుకుంటాననీ బెదిరిస్తోందని చెప్తాడు తిమ్మూ. కాసేపు ఆలోచించి ఓ ఉపాయం చెబుతుంది మహీ. దాని పాటిస్తాడు తిమ్మూ. మర్నాడు, ఆ తరువాత కొన్ని రోజులు తిమ్మూ కాలేజీకి రాకపోయేసరికి పిచ్చెక్కినదానిలా ప్రవర్తిస్తుంది అల. మహీ చెప్పిన ప్రకారం, ప్రిన్సిపాల్ గారు చేసిన సాయం వల్ల వేరే ఊర్లోని కాలేజీలో చేరుతాడు తిమ్మూ. ఆ విషయం ఎవరికీ తెలియనివ్వదు మహీ. సెలవల్లో కర్రావూరి వుప్పలపాడుకి వెళ్తుంది మహతి. ఇంటికి వెళ్ళగానే, లగేజ్ లోపల పడేసి కుసుమ ఇంటికి వెళ్ళబోతుంటే, అమ్మమ్మ మందలిస్తుంది. నీ వాళ్ళను నువ్వే నిర్లక్ష్యం చేయడం తగదని అంటుంది. అయినా ఆ మాటలు పట్టించుకోకుండా కుసుమ ఇంటికి వెళ్తే కుసుమ సరిగా మాట్లాడదు. పైగా కుసుమ అత్తవారింటికి వెళ్ళిపోతోందని వాళ్ళ బామ్మ చెబుతుంది. మౌనంగా ఇంటికి వచ్చిన మహీకి ఇల్లు తాళం వేసి కనబడుతుంది. పక్కింటావిడ తాళం చెవులిస్తూ – మీ తాతగారు హాస్పటల్లో వున్నారమ్మా. ఇప్పుడే మీ అమ్మమ్మ గారు హాస్పటల్‌కి వెళ్ళారు. నువ్వొస్తే తాళాలివ్వమని చెప్పారని అంటుంది. మహీ గబగబా హాస్పిటల్‍కి పరుగెత్తుతుంది. అక్కడ డా. శ్రీధర్ కనబడతారు. తాతయ్యకి వచ్చింది చాలా మైల్డ్ స్ట్రోక్ అనీ, ఇప్పుడు పరవాలేదని అంటారు. తాతయ్యని చూసి బాధపడుతుంది మహీ. తమకెందుకు చెప్పలేదని అడుగుతుంది. వచ్చి అందరూ ఇబ్బంది పడటం తప్ప ఉపయోగం ఏముందని చెప్పలేదంటారు తాతయ్య. అమ్మమ్మని కౌగిలించుకుని తనని క్షమించమని అడుగుతుంది మహి. నీ తప్పేం లేదులే అని అంటుంది అమ్మమ్మ. మహీ వెంటనే ఇంటికి ఫోన్ చేసి విషయం చెబుతుంది. సాయంత్రానికల్లా అమ్మానాన్నా సురేన్, నరేన్, కల్యాణీ మాత్రమే కాకుండా వాళ్ళతో పాటు హరగోపాల్ కూడా వస్తాడు. వాళ్ళందరిని చూసిన తాతయ్య ఎంతో సంతోషిస్తారు. ఆయనని డిశ్చార్జ్ చేస్తారు డా. శ్రీధర్. – ఇక చదవండి.]

[dropcap]“వా[/dropcap]ళ్ళు తెచ్చింది ఫేక్ సర్టిఫికెట్ మహీ! ఎవడో డబ్బుల కోసం ఏ పరీక్షలూ చెయ్యకుండా ఇచ్చిన సర్టిఫికెట్ అది” నిట్టూర్చి అన్నారు డాక్టర్ శ్రీధర్.

“అలా ఇవ్వకూడదు కదా డాక్టర్.” సీరియస్ గానే అన్నాను.

“డబ్బులిస్తే ఏదన్నా జరుగుతుందిక్కడ. వాళ్ళిచ్చే సర్టిఫికెట్టు కూడా చాలా తెలివిగా ఇస్తారు. అది ఇచ్చేవారి వ్యక్తిత్వాన్ని సంస్కారాన్ని బట్టీ వుంటుంది.” నిట్టూర్చి అన్నారు శ్రీధర్ గారు.

“మరి అది కుసుమ బతుకులో నిప్పులు పోసే చర్యేగా?” హెల్ప్‌లెస్‌గా అన్నాను.

“నువ్వు చూసేది నీ స్నేహితురాలు అనే దృష్టిలో. కానీ, అతనితో వెళ్ళడానికి కుసుమ కూడా ఒప్పుకుంది. నేను నాలుగయిదు సార్లు అడిగాను.” మళ్ళీ నిట్టూర్చారాయన.

“వాళ్ళ వాళ్ళ బలవంతం మీదేమో!” అన్నాను.

“అలాగే అనుకున్నా మనమేం చెయ్యగలం? ఆవిడ బదులుగా మనం కేసు వెయ్యలేము కదా. నా అభిప్రాయం అడిగితే కుసుమ సంగతి కుసుమకే వదిలెయ్యడం మంచిది. అఫ్‌కోర్స్, ఆవిడంతట వచ్చి సహాయం చెయ్యమంటే అది వేరే విషయం.” సూటిగా నావంక చూసి, అన్నారు శ్రీధర్.

ఆ తర్వాత తాతయ్యకి ఎలాంటి డైట్ పెట్టాలో, స్ట్రోకు మళ్ళీ రాకుండా యేయే జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు. అన్నీ నోట్ చేసుకుని ఇంటికొచ్చాను. ఇంట్లో హరగోపాల్ ప్రోగ్రాం జరుగుతోంది. చుట్టు పక్కన వాళ్ళంతా అక్కడకి చేరి ఆనందిస్తున్నారు. నన్ను చూడగానే “మామయ్యా, మీ మనవరాలి పాట మీరు వినలేదు.. ఏది మహీ, ఆ ‘పాడవేల రాధికా’ పాట పాడు” ఉత్సాపరిచాడు మా నాన్న. మళ్ళీ అడిగించుకోకుండా హాయిగా పాడాను. మా వాళ్ళందరూ మహా సంతోషపడ్డారు.

“ఓసి పిడుగా.. ఇంత విద్య నీకుందని నాకెందుకు చెప్పలేదే!” నా తల మీద చేయి వేసి ఆశీర్వదిస్తున్నట్టుగా నిమిరి అన్నాడు తాతయ్య.

“ఇదిగో మహీ.. మీకెప్పుడూ నేను చెప్పలేదు. మీ అమ్మ గొంతు కూడా అచ్చు మహీ గొంతులానే వుండేది. ఇంత బాగానూ పాడేది. ప్చ్.. దానికి సంగీతం నేర్పించడం కుదర్లా. అప్పట్లో అన్నీ ఉమ్మడి కుటుంబాలు. సర్లే.. అమ్మమ్మ పోలికే మనవరాలికొచ్చిందనుకుంటా!” చిన్నగా నిట్టూర్చి అన్నారు తాతయ్య.

ఏమైనా పాడాల్సిందే పట్టుపట్టాను. అమ్మమ్మ చిన్నగా నవ్వి, భానుమతిగారి పాటలందుకుంది. చూడు, మాకందరికీ పిచ్చెక్కిపోయింది. ఆ వయసులో అంత స్వచ్ఛతా.. ఆ వయసులో అంత స్వరమాధుర్యమూ.. ఆవిడతో పోల్చుకుంటే నేనెంత?

“అబ్బ.. అద్భుతంగా పాడారు బామ్మగారు.. మై గాడ్ మై గాడ్..” ఆశ్చర్యపోయాడు హగ్గీ.

ఓ అద్భుతమైన మ్యూజికల్ యీవినింగ్ అది.

మాతోటే పాటు అమ్మా, నాన్నా, నరేన్, సురేన్ కూడా పాడారు. రాత్రికి అమ్మ, అమ్మమ్మలతో పాటు నేనూ కొన్ని ఐటమ్స్ చేశా. భోజనాలయ్యే సరికి రాత్రి పదకొండు. హాయిగా పడుకున్నా.. కిటికీలోంచి చంద్రడ్ని చూస్తూ.

***

మా ఇంటి ముందు నుంచే కుసుమ కారు వెళ్ళింది. వాళ్ళాయనా అత్తగారూ పొద్దున్నే కారు తేవడం నేను చూశాను. ఉదయం 10 గంటలకి కారు కుసుమతో వెళ్ళింది. నేను వాకిట్లోనే వున్నా, అది మా ఇంటి వైపు చూడలేదు. ఓ చిన్న నిట్టూర్పు నాలోంచి అసంకల్పితంగా వెలువడింది. ఆ దృశ్యాన్ని అమ్మా నాన్నా తాతయ్యా అమ్మమ్మ కూడా చూసే వుంటారు. కానీ చూసినట్టు వాళ్ళు నాకు తెలియనివ్వలేదు.

వారం రోజుల పాటు అందరం కర్రావూరి వుప్పలపాడులో ఉన్నాం. రేపు బయలుదేరదామనగా నాన్న తాతయ్యతో, “మావయ్యా ఇక్కడ మీరిక ఒంటరిగా వద్దు. అందరం ఒకే చోట వుందాం. ప్రతి శనివారం అందరం ఇక్కడికికొచ్చి హాయిగా గడిపి ఆదివారం వెళ్ళిపోదాం. అలాగైతే మీ వూరిని మీరు విడిచిపెట్టినట్టు కూడా వుండదు. నా మాట మీరీసారి మన్నించాలి” అని చాలా శ్రద్ధగా వినయంగా అనడం నేను విన్నాను. తాతయ్య ఏదో గొణగడం వినిపించింది అస్పష్టంగా.

నాన్నా, అమ్మా, నరేన్, సురేన్, కల్యాణి, హగ్గీ మరుసటి రోజున ఉదయమే వెళ్ళిపోయారు. నేను మాత్రం ఆగాను. కారణం ఇల్లంతా చక్కగా సర్దించి తాతయ్యనీ అమ్మమ్మనీ టౌన్‌కి నేనే తీసుకెళ్ళాలి. డాక్టర్ శ్రీధర్‌కి పాపం సరైన ఇల్లు దొరకలేదని నాకు తెలుసు. అందుకే ఆయన్నీ అడిగా, “సార్, మా అమ్మమ్మనీ తాతయ్యనీ మా ఇంటికి తీసుకుపోతున్నా. వారానికొసారి మేం వచ్చినా వంట గదీ మరో గదీ మాకు చాలు. అదిగాక మరో వంటగదీ మండువా పెద్ద గదూలూ వున్నాయి. మీరూ హాయిగా మా ఇంట్లో వుండచ్చు. మా పాలేరూ, అతని భార్యా రోజూ వచ్చి, ఇల్లు శుభ్రం చేయడమే గాక మీకు  ఏం కావల్సినా తెచ్చి పెడతారు. మంచి వెజిటబుల్ గార్డెన్ కూడా వుంది. మీరు వస్తే మాకు చాలా ఆనందం” అన్నాను.

మొదట్లో కొంచెం సందేహపడ్డా తరువాత మా ఇంట్లోకి ‘షిఫ్ట్’ కావడానికి ఒప్పుకున్నారు. ఆ మాట విని మా వాళ్ళూ మహా సంతోషపడ్డారు.

నాలుగు రోజులు డాక్టర్ శ్రీధర్ మా ఇంట్లో పాలు పొంగించిన తరవాతే, అమ్మమ్మనీ తాతయ్యనీ తీసుకుని నేను టౌన్‌కి వెళ్ళాను. దసరా శెలవులన్నీ పర్పస్‌ఫుల్ గానూ, జాయ్‌పుల్ గానూ గడిచాయి, ఒక్క కుసుమ విషయం తప్ప.

***

ఓపక్క ఉత్సాహంగా చదువుకుంటూనే మరో పక్క ‘మ్యూజిక్’ మీద శ్రద్ధ పెట్టాను. కారణం సంపూర్ణాదేవిగారు. మా ప్రిన్స్‌పాల్ గారొక రోజున ‘ప్రేయర్’ టైంలో ఒకావిడని అందరికీ పరిచయం చేస్తూ “వీరి పేరు సంపూర్ణాదేవి, అటు హిందుస్థానీ, ఇటు కర్ణాటక సంగీతంలో గ్రాడ్యూయేషన్ చేశారు. కొంతకాలం మంగళంపల్లి వారి దగ్గర శిష్యురాలిగా వుండి సంగీతంలో మెలకువలు నేర్చుకున్నారు. హిందీ క్లాసికల్, ఫోక్ అంటే అభిమానం. వారానికి రెండు రోజులు పాటు మన కాలేజీకి రావడానికి ఒప్పుకున్నారు. అయితే, ఫీజు మీరే డైరెక్టుగా ఇవ్వాల్సి ఉంటుంది. కాలేజీ విద్యార్థులు కనక మీకు 50% కన్షెషన్ ఇస్తానని  చెప్పారు. పేర్లు ఇవ్వదలచినవారు అంటే సంగీతం నేర్చుకోదలుచుకున్న వారు ప్రేయర్ అయాక, వారిని స్పోర్ట్స్ రూంలో కలవొచ్చు” అన్నారు.

ఇంకేం.. ప్రేయర్ అయ్యాక స్పోర్ట్స్ రూంకి వెళ్ళాను. నాతో పాటు మరో పాతిక మంది వచ్చారు.. హగ్గీతో సహా.. ఆమె చిరునవ్వుతో ఓ కొత్త నోట్ బుక్ తీసి మా పేర్లు వరుసగా రాసుకున్నారు.

“ఈ సాయంత్రం మళ్ళీ 5 గంటలకి మీ కాలేజీకి వస్తాను. 5 నుంచి 7 వరకు మొదట మీరు పాడే పాటలు వింటాను. ఒక ఫోకు సాంగ్, మరో మీకు ఇష్టమయిన పాట పాడండి. అది లలిత గీతం కావచ్చు, సినిమా పాట కావచ్చు.. శాస్త్రీయ సంగీతం కావచ్చు. ఏదైనా సరే. సరేనా. సిద్ధంగా వుంటారని ముందు చెబుతున్నా” అని బయలుదేరారు. మనిషి చాలా అందగత్తె. ఓ ఇరవై ఎనిమిదేళ్ళు ఉండొచ్చు. తాళిబొట్టు మెట్టెలు లేవు కనక పెళ్లి కాలేదనీ అనుకోవాలి. ఆమె రూపంలాగే మాట కూడా సున్నితంగా మధురంగా వుంది. నాకెందుకో ఆమెని చూడంగానే నా కెంతో నచ్చేసింది.

“ఏమి స్టైలో..! మొదట మనం పాడాక ఆవిడ వినాలిట. నచ్చకపోతే పాఠం చెప్పదా? తెల్ల తోలు నల్ల జూలు..” వెటకారంగా అన్నది అల. అల మ్యూజిక్ నేర్చుకోవడానికి వస్తుందని అసలు నేను వూహించలేదు. అయితే అల మాటలు మాత్రం చాలా బాధించాయి. తిమ్మూ వెళ్ళిపోయాక అల చాలా ఘోరంగా మారింది. అందరితోటీ సూటిపోటి మాటలే. కయ్యానికి కవ్వింపులే. ఎవ్వరూ మాట్లాడలేదు.. “ఓహో.. మీరందరూ ఆవిడ అందానికి ఫ్లాట్ అయిపోయారన్నమాట. గుడ్. వారం రోజులు ఆవిడ కథంతా బయటపెడతా..” కళ్ళెగరేసి ఛాలెంజింగ్‌గా అన్నది మళ్లీ అల. “ఆవిడ కథేమోగానీ, ఇప్పుడు బయటపడుతున్నది మాత్రం నీ కుసంస్కారమే. నువ్వూ మంచి ఫ్రెండువనీ, ఎంతో స్నేహశీలివనీ భావించా. ఇలాంటి కామెంట్లు ఇచ్చి నిన్ను నువ్వు హీనపరుచకోకు!” సీరియస్‌గా అన్నాడు హగ్గీ. అంత తీవ్రంగా అలని హెచ్చరిస్తాడని మాలో ఎవ్వరూ అనుకోలేదు. నిర్ఘాంతపోయి నిలబడింది అల.

మేం మాట్టాడకుండా క్లాస్ రూం వైపు నడిచాం. హగ్గీ అలా మాట్లాడటం నాకూ ఆశ్చర్యంగా అనిపించింది.

***

సాయంత్రం పాట వినిపించడానికి అల రాలేదు. పొద్దున జరిగినదానికి బాధపడి వుండొచ్చు. లేదా అహం అడ్డపడి వుండొచ్చు. అందరి పాటలూ వింటూ ఓ రఫ్ బుక్ మీద ఏదో రాసుకున్నారు సంపూర్ణగారు. అందరూ పాడడం పూర్తయ్యేసరికి ఏడు గంటలయింది. ఫుల్ సాంగ్ పాడించలేదు. కొందర్ని పల్లవితో ఆపమన్నారు. కొందర్ని కేవలం రెండు లైన్లు పాడక ఆగమన్నారు. కొందరి చేత పల్లవి చరణాలు పాడించారు. కొందరి చేత ఒక పాట మాత్రమే పాడించారు.

“మీ మీ గాత్ర ధర్మాల గురించి వివరించాలి. ఆ పని రేపు  పని రేపు చెయ్యొచ్చు. కానీ, ఇప్పుడు చెబితేనే బాగుటుంది. సరే, ఒకటి రెండు లైన్లుతో ఇప్పుడు చెప్పి, రేపు ఒక్కొక్కరికీ వివరంగా చెబుతాను. సరేనా?” అంటూ మేము పాడిన పాటల్లో దొర్లిన లోపాల్ని, అంటే కృతి మిస్ కావడం etc etc చక్కగా చెప్పి 7.30కి ముగించారు.

ఆవిడ పద్ధతి నాకు అద్భుతంగా నచ్చింది. మొదట శిష్యుడి సత్తా ఎంతో, లోపాలు ఎక్కడో అంచనా వేస్తేనే కదా గురువు ఎలా బోధించాలో నిర్ణయించుకునేదీ!

ఒక్కటి మాత్రం నిజం, వెళ్ళిన 24 మందిలో కనీసం పదిహేను మంది మంచి ‘స్వరం’  వున్న వాళ్ళే. నలుగురయిదుగురు మాత్రం ‘హారిబుల్’ అనుకున్నాను. ఇతరులు పాడేటప్పుడు ఆవిడ మొహంలో కదిలే హావభావాల్ని చాలా జాగ్రత్తగా గమనించాను.

ఆవిడ చిరునవ్వు అద్భుతం. కూర్చునే విధానం కూడా చాలా పొందిగ్గా వుంది. చక్కని పలువరస. నల్లని కనుపాపలు.

న్యాయంగా చెబితే ఆవిడ్ని చూసిన ఏ ఆడదానికైనా అసూయ వచ్చి తీరుతుంది. నాకు మాత్రం అసూయ రాలేదు. ఆవిడతో స్నేహం చెయ్యాలనే గాఢమైన కోరిక మాత్రం తీవ్రంగా కలిగింది.

***

ఇంటికి వెళ్ళాక అమ్మనాన్నలతో సంపుర్ణగారి విషయం చెప్పి నేనూ ట్యూషన్ తీసుకుంటానని చెప్పాను. అమ్మనాన్నా ఇద్దరూ చాలా సంతోషించారు. “ప్రతి మనిషీ పొట్టకూటి కోసం చదివే చదువుతో బాటు ఏదో ఒక కళలో ప్రవేశం సంపాయించాలమ్మా. కళ అనేది భగవత్వ్సరూపం. దాన్ని డబ్బుల తోటో, పదవి తోటో కొనలేము. భగవంతుడు నీకు ‘పాడే’ కళనిచ్చాడు. చక్కగా నేర్చుకో. గురుముఖతా నేర్చుకున్న విద్యే, అసలు సిసలైన విద్య” అన్నారు నాన్న. ఇక మా తాతయ్య అమ్మమ్మ అయితే “మహీ, మన కుటుంబం నుంచి గొప్ప ఉద్యోగస్థులు వచ్చారు గానీ, కళాకారులు పుట్టలేదే. పుట్టినా ఇంటికి పేరు తెచ్చేంతగా ఎదగలేదే. నువ్వెట్టాగైనా ఆ లోటు తీర్చాలి. సినిమాల్లో నీ పాట నేను వినాలి” అన్నారు ముఖ్యంగా తాతయ్య. నవ్వొచ్చింది. సినిమాల్లోనా!

వెంటనే జాలాది గారూ, ఆనంద్ గారూ, రంగనాథ్ గారూ గుర్తొచ్చారు. అదో కల. ఎన్నో కలలు కనురెప్పలు మాటునే ఆవిరవుతాయి. కొన్ని కన్నీరుగా మారి జారిపోతే, కొన్ని మాత్రమే నిజమై కళ్ళెదుట నిలుస్తాయి.

“ఏమిటీ.. వూహల్లోకి వెళ్ళిపోయావా తాతయ్య మాటలు వినీ!  అది మా కోరిక మాత్రమే. ఇప్పుడు నువ్వు శ్రద్ధ పెట్టాల్సింది చదువు మీదా, సంగీతం నేర్చుకోవడం మీదా” వీపు నిమిరి అన్నది మా అమ్మమ్మ. వాళ్ళిక్కడికొచ్చాక ఉత్సాహంగా వున్నారు. కారణం అందరం తలో గంటయినా వారితో గడపడం వల్ల.

***

“మహీ.. రేణుక రావడం లేదేం?” సంపూర్ణగారో రోజున అడిగింది. సంపూర్ణగారు అన్నట్లుగానే మా ఎంట్రన్స్ (పాటలు వినడం) అయ్యాక మా మా లోపాలు చెబుతూ, “రేణుకా, నీదో చిత్రమైన వాయిస్. కొంచెం స్వీట్‌నెస్‌తో పాటు, హెవీనెస్ కూడా వుంది. నీకు ఏది సూటవుతుందో ఆలోచిస్తాను” అన్నారు. అప్పుడే, అంటే ఆ రోజే రేణుక నాతో అన్నది “లాభం లేదే. సంగీతం నేర్చుకోవాలనే పిచ్చి నాకు చాలావుంది గానీ, నాది కాస్త మగాడి గొంతు. ఎవరేం చెయ్యగలరూ?” అన్నది.

అదే మాట ఆవిడతో చెప్పాను. “ఛీ.. ఛీ.. నేనన్నది ఆ వుద్దేశంతో కాదు. తనకి ఏటైపు సాంగ్స్ సూటవుతాయో ఆలోచించాలన్నాను. అంతేగానీ, తాను సింగర్‌గా పనికి రాదని కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆమెని నేను రమ్మన్నానని చెప్పగలవా?” అన్నారు సంపూర్ణ.

“దాని ఇల్లు దగ్గరే మేమ్.. అయిదు నిమిషాల్లో పిలుచుకొస్తాను.” ఠక్కున లేచాను. అప్పుడు మేమిద్దరం వున్నది షిరిడీ సాయి గుడిలో. ఆవిడ గుళ్ళోకి వెళ్ళడం చూసి నేనూ ఫాలో అయ్యానన్నమాట. ఫాస్ట్‌గా పరుగులాంటి నడకతో రేణుక ఇంటికెళ్ళి దాన్ని బయటకి లాక్కొచ్చాను. “ఏమిటే?” అని అది అడుగుతూన్నా వినిపించుకోలేదు. దాని నోటంట మాటలు వస్తూనే వున్నా నేను మౌనంగానే గబగబా దాని చెయ్యి వదలకుండా గుడికి లాక్కొచ్చాను. “ఇప్పుడు గుడి కెందుకే?” అని చేతిని విడిపించుకోబోతూ సంపూర్ణగారిని చూసింది.

“ఏమిటీ.. పిలుచుకు రమ్మంటే, లాక్కొచ్చావా? భలేదానివే.. రేణుకా.. రామ్మా.. నీతో నాలుగు మాటలు మాట్లాడాలి. ఆ పక్కన కూర్చుందాం..” అంటూ రేణుక భుజం మీద చెయ్యి వేసి నన్ను భుజం మీద తట్టి ఓ మూలకి తీసికెళ్ళారు. ముగ్గురం విశ్రాంతిగా కూర్చున్నాం.

“రేణుకా, నీది చాలా ప్రత్యేకమైన వాయిస్. వెరీ రేర్. ఉషా ఉదుప్ లాగా చాలా వాలటైల్ వాయిస్. ఆవిడ పాటలు ఎప్పడైనా విన్నావా? అంతే కాదు.. వెస్ట్రన్ నీ గొంతులో అద్భుతంగా ఇముడుతుంది. కానీ చాలా శ్రద్ధతో సాధన చేస్తే నువ్వో సెలెబ్రటీవి అవుతావు” అన్నారు.

రేణుక అవాక్కయింది.

“నిజమా మేడమ్” చెమ్మగిల్లిన కళ్ళతో అన్నది.

“అదిగో ఆ షిరిడీ సాయి సాక్షిగా” నవ్వి అన్నారు సంపూర్ణ. జీవితంలో అప్పుడు ఆశ్చర్యానికి గురైనంతగా నేనెప్పుడూ అంత ఆశ్చర్యానికి గురి కాలేదు.

***

హగ్గీ అన్యమనస్కంగా వుంటున్నాడు. ఏమిటని అడిగాను. “ఫేమిలీ ప్రాబ్లమ్స్” అన్నాడు ముక్తసరిగా. నేను తల వూపి వూరుకున్నాను. ఎవరి పర్సనల్, ప్రయివేట్ ఫేమిలీ ప్రాబ్లమ్స్ లోనూ తల దూర్చకూడదని ‘కుసుమ’ విషయం తరవాత గట్టిగా నిర్ణయించుకున్నాను.

విద్యార్థి జీవితం ఎంత గొప్పదో! స్నేహం ఎంత మధురమైనదీ! అందరం కలిసి మెలిసి పోయామే గానీ ఎవరి స్థాయి ఏమిటో ఎవరికీ తెలీదు. అసలు తెలుసుకోవాలనే ఆలోచనే మాకు రాలేదు.

క్లోజ్ ఫ్లెండ్స్ అందర్నీ బర్తడే పార్టీకి పిలిచింది రేఛల్. పిలిచిన వాళ్ళల్లో నేనూ, హగ్గీ కూడా వున్నాం. మిగతా క్లాసుల్లోంచి ఒకరిద్దరు. మా క్లాసులోంచి భారతీ, మాన్యా అందరూ వచ్చారు. ఓహ్ మేము కాక కనీసం మరో యాభై మంది రేఛల్ చిన్న నాటి ఫ్రెండ్స్ కూడా వున్నారు. అసలు వాళ్ళ ఇల్లు చూస్తేనే మతి పోయింది.

పేలస్ లాగా వుంది. వాకిట్లో మూడు కార్లున్నాయి. అన్నిటిదీ ఒకే నెంబరు 1952 అని. అవి వాళ్ళవే అయింటాయి. అయినా రేఛల్ ఏనాడూ కార్లో కాలేజీకి రాలేదు. రిక్షాలోనే వస్తుంది.

అసలా షాండ్లియర్లు, తివాచీ, లైంటింగ్ ఎరేంజిమెట్ పిచ్చెక్కించాయి. చాలా చాలా కాస్టల్లీ ఫర్నీచర్. దాంట్లో కనీసం వంద మంది పడతారు.

“ప్లీజ్ కమ్” అంటూ అందర్నీ చాలా ప్రేమగా ఆహ్వానించింది రేఛల్. మా కందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చారు బట్లర్లు. తాగుతూ వుండగానే “వెల్.. అందరికీ వెల్‌కమ్.. సుస్వాగతం.. నా పేరు రిచర్డ్. రేఛల్ తండ్రిని. యీమె లీజా ఎలిజిబెత్, రేఛల్ తల్లి.  వాడు టామ్.. రేఛల్ పెద్ద బ్రదరు. వీడు లూయిస్, రేఛల్ చిన్న బ్రదరు. నేను సెక్రటేరియట్‌లో జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్నాను. రేఛల్ పుట్టిన రోజు కోసం హైద్రాబాదు నుంచి వచ్చాను. లీజా ఇక్కడే ఓషియానిక్ హాస్పటల్‌లో ఛీఫ్ కార్డియాలజిస్టుగా పని చేస్తుంది. టామ్ IPS కోసం ప్రిపేరవు అవుతున్నాడు. మీరందరూ వచ్చినందుకు నా ధన్యవాదాలు. హేపీగా ఎంజాయ్ చెయ్యండి. మేమేదో ఓల్డ్ పీపుల్ అని భావించకండి. ఉత్సాహంలో అయితే గ్యారంటీగా మీతో పోటీ పడగలం!” అంటూ హాయిగా ఆయన ఆవిడా మాతో కలిసిపోయారు. ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అని మేమందరమూ వూహించలేదు. చాలా ఉత్సాహంగా క్విజ్ లతో, పాటలతో, తంబోలా లాంటి గేమ్స్‌తో ఆ సాయంత్రం అద్భుతంగా గడిచింది. పార్టీ పూర్తయ్యే సరికి రాత్రి ఎనిమిదైంది.

“మీకు కావల్సిన పుస్తకం మీరు తీసుకోవచ్చు. మూడు చదవాలనుకుంటే మూడు చదవొచ్చు. ప్లీజ్ హావ్..” అని మూడు బండిల్స్‌ని తెప్పించారు రిచర్డ్.

ఆయనే బండిల్స్ విప్పి పుస్తకాల కట్టలు మూడిట్నీ పక్కపక్కనే పెట్టారు. ఒకటి భగవద్గీత, రెండోది ఖురాఆన్, మూడవది బైబిల్.

“మీరనుకోవచ్చు.. యువకులకి యీ ఆధ్యాత్మిక గ్రంథాలెందుకని. పిల్లల్లారా.. ప్రతి మనిషి చావూ ఒకటే పుట్టుకా ఒకటే. కన్న తల్లి కడుపులోంచి పుడతాం.. కొన్నాళ్ళు పవిత్రమైన ప్రకృతితో గడిపి, చివరికి భూమితల్లి కడుపులోకి వెడతాం. మానవ జీవితం అంటే, కన్న తల్లి కడుపులోంచి నేలతల్లి కడుపులోకి చేసే ప్రయాణమే. ఇక ఇవన్నీ అంటే కులమతాలు, సుఖదుఃఖాలూ, పదవులూ, ధనం, పేదరికం, రాజకీయాలు, గెలుపోటములూ ఇవన్నీ మధ్యలో వచ్చి మధ్యలో పోయేవే. అందుకే, అద్భుతమైన, అసలు సిసలైన జీవితం ఏమిటో తెలియజెప్పే యీ పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథాలన్ని పఠించాల్సిందే, అర్ధం చేసుకోవలసినదీ చిన్న వయసులోనే కానీ, అన్నీ ఉడిగిన తరవాత కాదు. మీక్కావలసిన పుస్తకాన్నో, లేక పుస్తకాల్నో ఎటువంటి సంకోచం లేకుండా తీసుకోండి. చక్కగా వీలున్నప్పుడు అధ్యయనం చెయ్యండి. అవి చదవడం వల్ల మీ ఆలోచనా పరిధి పెరుగుతుంది. అంతే కాదు, మీ యువతరపు ఆలోచన మారితే, దేశ భవిష్యత్తే అద్భుతంగా మారుతుంది. గుడ్ లక్” అన్నారు. ఓహ్.. నేను మాత్రం మూడు పుస్తకాలు తీసుకున్నాను. అంతే కాదు రిచర్డ్ గారికీ, లీజీ గారికీ పాద నమస్కారం కూడా చేశా. మత సామరస్యం కాదు నేను చూసింది. సర్వమత సమానత్వం, సౌబ్రాతృత్వం. వాళ్ళు చల్లగా ఆశీర్వదించారు.

ఇంటికెళ్ళాక పార్టీ విషయాలు తు.చ. తప్పకుండా అమ్మానాన్నలకీ, తాతయ్యా అమ్మమ్మలకీ చెప్పాను.

“గ్రేట్ రా మహీ.. మంచి ‘తల్లిదండ్రుల్ని’ కలిశావు. అంతే కాదు, అన్ని మతాలనీ సమానంగా చూడగలిగే ఆదర్శమూర్తుల్ని చూశావు. ఆయన చెప్పిన నాలుగు మాటలూ నిజంగా ఆణిముత్యాలే” అన్నాడు నాన్న.

“నాకు మంచి బహుమతి తెచ్చావే. రేపట్నించే వీటిని నేనూ చదివే ప్రయత్నం చేస్తాను” ఉత్సాహంగా అన్నాడు తాతయ్య. ఫక్కున నవ్వింది అమ్మమ్మ. “అదేం?” అని నేనంటే, “ఆయన స్కూలికి వెళ్ళిన రోజులు కేవలం వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చని మా అత్తగారు నాతో చెప్పేది” అన్నది.

“పిచ్చి మొద్దూ, ఎంత గొప్ప గ్రంథాలయినా, అవి నిలబడేది యాభై ఆరు తెలుగు అక్షరాల మీదేనే! ఆ యాభై ఆరూ బ్రహ్మండంగా వచ్చు నాకు!” దిలాసాగా అన్నాడు తాతయ్య.

“నువ్వు రైట్ తాతయ్యా. అమ్మమ్మ రాంగ్” కొంచెం ఎగదోస్తూ అన్నాడు సురేన్.

“ముందు చదివాక గదా చెప్పేదీ!” అమ్మమ్మకి సపోర్ట్ వెళ్ళాడు నరేన్.

“నేనున్నాగా చదవి వినిపించడానికీ” చల్లగా అన్నది మా అమ్మ అహల్య.

***

ఆధ్యాత్మికమైన ఆలోచనలు నిజంగా నాలో లేవు. కానీ రిచర్డ్ గారి మాటలు విన్నాక ఆలోచన కలిగింది. ఆయన భారతదేశంలోని మూడు ముఖ్య మత గ్రంథాలనీ ఇచ్చారు. అంటే ఆ మూడింటినీ ఆయన అధ్యయనం చేసివుండాలి. అసలు ఏ పుస్తకమైనా కొన్ని వందల సంవత్సరాలో వేల సంవత్సరాలో, అనంతమైన విజ్ఞానం అందులో లేకపోతే నిలబడగలదూ? ఓ రామాయణం, ఓ మహాభారతం, ఓ భాగవతం ఇవన్నీ వేలాది సంవత్సరాలుగా మనుషుల్ని అలరిస్తూనే వున్నాయి. మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞానతృష్ణని తీరుస్తూనే వున్నాయి. ప్రజలలో పవిత గ్రంథాలుగా గుర్తింపబడుతూనే వున్నాయి. అందుకే, కొద్దో గొప్పో ఆ మూడు పుస్తకాలనీ చదవాలని నిర్ణయించుకున్నాను. ఆ మాట అమ్మతో అన్నాను. “మంచి ఆలోచనే, కానీ మహీ ఏ సమయానికి తగిన పని ఆ సమయంలోనే చెయ్యాలి. ముందు నువ్వు నీ పరీక్షల కోసం సిద్ధం కావాల్సి ఉంది. అలాగే సంగీతం మీద దృష్టి పెట్టాలి. అన్ని విద్యల కంటే గొప్పది ఆత్మ విద్యే. అయితే దాన్ని ఆషామాషీగా కాదు. అత్యంత శ్రద్ధగా భక్తిగా పఠించాలి. నీ సెలవుల్లో విశ్రాంతిగా ఆ పని చెయ్యొచ్చు. ప్రస్తుతానికి మాత్రం స్టడీస్ మీద కాన్‌సన్‌ట్రేట్ చెయ్యి” అని సమయానికి తగిన సలహా ఇచ్చింది. దటీజ్ మదర్.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here