[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]
ఓ నా మోనాలిసా
[dropcap]రో[/dropcap]జ్ పెటల్స్ స్కూల్లో యల్‌కేజీ చదివే నానిగాడి కోసం శ్రీహరి –
అదే క్లాస్‍లో చదివే చిన్ని కోసం శ్రీవల్లి –
రోజూ అదే సమయానికి వచ్చి గేటు దగ్గర చెట్టు నీడలో నిలబడేవాళ్లు.
నానిగాడు పరుగెత్తుకుంటూ వచ్చి “బాబాయ్, ఇవాళ టీచర్ నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది” అన్నాడు కొండంత సంబరంగా.
“అబ్బ, ఎంత అదృష్టంరా, నన్ను కూడా మీ క్లాస్‌లో చేర్చుకుంటుందేమో అడగరా” అన్నాడు శ్రీహరి ఆశగా పక్కనే ఉన్న శ్రీవల్లి వంక చూస్తూ.
“లేపు అడుగుతాలే” అన్నాడు నానిగాడు.
శ్రీవల్లి నవ్వుకుంటూ చిన్నీని తనతో తీసుకువెళ్లింది.
మర్నాడు శ్రీహరి వచ్చేటప్పటికి కొంచెం ఆలశ్యమైంది. చిన్నీ, శ్రీవల్లితో పాటు నానిగాడు కూడా నాలుగు అడుగులు వేస్తూ ఎదురుపడ్డాడు.
“ఏరా, ఇవాళ ఎవరూ ఎత్తుకొని ముద్ద పెట్టుకోలేదా?” అని అడిగాడు శ్రీహరి.
“ఇదుగో, ఈ ఆంటీ ముద్దు పెట్టుకుంది” అని శ్రీవల్లి వంక చూపించాడు.
“థాంక్సండీ” అన్నాడు శ్రీహరి నవ్వుతూ.
శ్రీవల్లి సిగ్గుతో విరిసీవిరియని మొగ్గలా ముడుచుకుపోయింది.
రోజు రోజుకీ నానీకి, చిన్నీకి స్నేహం పెరుగుతూ వచ్చింది. అలాగే శ్రీహరికీ, శ్రీవల్లికినూ..
చిన్న కోసం శ్రీహరి చాక్లెట్లు తెచ్చి ఇస్తే, నానీ కోసం శ్రీవల్లి బిస్కట్లు తెచ్చి ఇచ్చేది.
పిల్లలు ఇద్దరూ ఎల్‌కేజీ నుంచి, యూకేజీలోకి వచ్చేటప్పటికి, వాళ్లిద్దరూ కొంచెం దగ్గరయ్యారు. అందుచేత వీళ్లద్దరూ కూడా కొంచెం దగ్గరయ్యారు. పిల్లల కోసం అని చెప్పి, ఒకరు పూలూ, పండ్లూ తెచ్చి ఇస్తుంటే, ఇంకొకరు పలహారాలు పట్టుగొచ్చేవారు. అలా వ్యవహారాలు ముదిరి పాకాన పడినయి.
స్కూలు బయట చెట్టు నీడన కల్సుకుని, చూపులు కలుపుకునే కొద్దినిముషాలూ ఎంత థ్రిల్లింగ్‌గా ఉన్నాయంటే, ఆ కొద్ది నిముషాల కోసమే మిగిలిన రోజంతా ఎదురు చూసే స్థితికి వచ్చారు.
చెట్టు కింద చేరాక, కళ్లు కళ్లు కల్సుకున్నాక, ఎన్నో కబుర్లు కలబోసుకున్నాక, ఆనక ఎన్నో కలలు వెంటబడి తరుముతుంటే, జీవన సుమ సౌరభాలను మోసుకొచ్చే ఆ సంతోష సమయాలన్నీ క్షణాల్లా జారిపోయేవి.
స్కూలుకి శలవులిస్తే వీళ్లిద్దరికీ ఏమీ తోచేది కాదు. ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్. పిచ్చెక్కిపోయ్యేది.
నానీ, చిన్నీ ఇంకో మెట్టు ఎక్కారు. శ్రీహరి, శ్రీవల్లిల స్నేహం, తొండముదిరి ఊసరవెల్లి అయినట్లుగానే, ప్రేమగా మారింది. నాలుగు రోజులు కనిపించకపోతే అయిదో రోజున అడిగేవాడు.
“ఓ నా మోనాలిసా? నాలుగు రోజుల్ని నాలుగు యుగాలుగా మార్చి నాకు దూరంగా ఎక్కడికి వెళ్లావు?”
“మా పెదనాన్నగారి అబ్బాయి పెళ్లికి వెళ్లాను..”
“అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నయి. ఎవర్ని చేసుకున్నాడు?”
“ఓ ఆడపిల్లను..”
“ఆడపిల్లను గాక మగపిల్లాడ్ని చేసుకుంటారా ఎవరైనా?”
“ఎందుకు చేసుకోరు? మా అక్కయ్య మగవాడ్నే కదా చేసుకుంది..” అని నిండు జాబిల్లిలాగా నవ్వింది.
“మరి నువ్వు ఎవర్ని చేసుకుంటావు?” అని అమాయకంగా అడిగాడు.
“సందేహమేల? మనసైన మగవాడ్నే చేసుకుంటాను” అన్నది శ్రీవల్లి.
చిన్నీ, నానీ ఇంకో క్లాసు దాటారు. ఇప్పుడు ఇద్దరూ వాళ్లంతట వాళ్లే స్కూలుకు వెడుతున్నారు. అందుచేత మిట్ట మధ్యాహ్నం చెట్టు కింద సమావేశాలకు అవసరం లేకపోయినా, ఇంకే చెట్టు చాటునో కలుస్తూనే ఉన్నారు.
“రేపు నా పుట్టిన రోజు” అని చెప్పింది శ్రీవల్లి.
“ఒక సినిమా డాన్సర్ పుట్టిన రోజున ఆమె ఇంటికి వచ్చిన గెస్ట్‌లంతా హాపీ ‘నూడ్’ ఇయర్ అని చెప్పారుట. నీకే చెప్పాలో తెలియటం లేదు” అన్నాడు శ్రీహరి.
ఆ రోజు హోటల్‌కి వెళ్లారు. తరువాత కూడా..
ఇంకో రెండు సార్లు హాటల్‌కి, మూడు సార్లు సినిమాలకు, నాలుగు సార్లు షికార్లకీ వెళ్లారు.
“ఇకనైనా మనం పెళ్లి చేసుకుంటే బావుటుంది” అన్నది శ్రీవల్లి.
“నిజమేగానీ, ఇన్ని సార్లు తిరిగాక ఇంక మనల్ని ఎవరు చేసుకుంటారు?” అని హాస్యమాడాడు.
“నీలాంటి మూర్ఖుడితో మాట్లాడటమే అనవసరం” అంటూ ఆమె అలిగి వెళ్లిపోయింది.
ఆమెతో పాటే అతని జీవితంలోని వెలుగూ, వెన్నెలా వెళ్లిపోయి, చిమ్మ చీకటి అలుముకుంది. ఆమె అలా ఛీత్కారం చేసి వెళ్లిపోతే, కొల్లగొట్టబడిన గుండె ఒట్టి డొల్లగా మారింది. తిరణాలలో తల్లి నుంచి తప్పిపోయిన పిల్లాడిలా. ఆమె కోసం అల్లాడిపోతూ, దుఃఖాన్నీ, వెక్కిళ్లనీ, చెక్కిళ్ల మీది కన్నీటి చారికలనీ ఎవరికీ కనిపించకుండా దాచుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తూ, తనలో తాను రగుల్చుకున్న ప్రేమాగ్నికి దహించుకుపోతూ, చిక్కి శల్యమైపోతుండగా, ఒక రోజు శ్రీవల్లి మళ్లీ కనిపించింది. కళ్ల ముందు తళుక్కున మెరుపు మెరిసింది. ఆత్రంగా వెళ్లి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆమె విదిలించుకుంది.
“నీతో మాట్లాడాలి మోనాలిసా!” అన్నాడు.
“ఏం మాట్లాడుతావు, మాట్లాడు” అన్నది నడిరోడ్డు మీద అందరూ తమవంకే చూస్తున్నందుకు ఇబ్బంది పడుతూ.
“ఇక్కడ కాదు. కొంచెం అలా రా” అని వేడుకున్నాడు.
శ్రీవల్లి జాలిపడి అతనితో నడిచింది. ఒక చోట కూర్చున్నాక హృదయం విప్పి చెబుతూ అన్నాడు.
“ఇకనైనా నా మీద నీ అగ్రహోదగ్ర అవేశకావేషాలు మానేసి, ఎప్పటిలా నీ కృపావీక్షణాలు ప్రసరింప చెయ్యి” అన్నాడు. అతను అంతగా ప్రాధేయ పడుతుంటే ఆమె మనసు నవనీతంలా కరిగిపోయింది.
అతనే అన్నాడు “నెల నెలా వచ్చే పున్నమి వెన్నెల నీ వదనారవిందంలో అనుక్షణం వెల్లివిరిసేది కదా, మోనాలిసా? ఇప్పుడిలా గ్రహణం పట్టిందేం?”
“నాకు పెళ్లి నిశ్చయం అయింది” అన్నది ఎటో దూరంగా చూస్తూ.
అతని గొంతులో మింగుడుపడని దేదో అడ్డు పడింది. అయినా లేని నవ్వు తెచ్చి పెట్టుకున్నాడు.
“అభినందనలు మోనాలిసా, మనం పెళ్లి చేసుకుంటే బావుంటుందని ఒక రోజు అన్నావు కదా. ఎందుకని మనసు మార్చుకున్నావు?”
“నీ సమాధానం విన్నాకే మనసు మార్చుకున్నాను.”
“నేను సరదాకి అలా అన్నాను. నా సరససల్లాపాలు నీకు తెలియనివా? అసలు ప్రేమ సరాగామే కదా సరాగం. దానికి నన్నింత కఠినంగా శిక్షిస్తున్నావా? నువ్వు కాదని వెళ్లిపోయినప్పటి నుంచీ చూడు, ఈ కళ్లల్లో దిగుళ్లు ముళ్లు గుచ్చుకొని, రక్తాశ్రువులు ఎలా రాలుతున్నాయో? ఈ అనంతాకాశమంత ఏకాంతంలో నన్నొది లేసి, నువ్వెళ్లిపోతే, విచారంతో నేను నిలువునా సగానికి చీలిపోయాను. ఈ చిన్న గుండెలో ఇన్ని మధుర కాంక్షలన్ని వెలిగించి, ఆ మంటల్ని నాకు మిగిల్చి ఇలా నిర్దయగా నువ్వెళ్లిపోతే, నేనేమైపోవాలి మోనాలిసా?” అని వేడుకున్నాడు శ్రీహరి.
“అందుకే నేను ముందే అడిగాను. నువ్వేమో సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు అన్నీ నిశ్చయమైపోయాయి. నీకూ నాకూ ఎవరు దొరుకుతారు అన్నావు కదా? నాకు మంచి సంబంధమే దొరికింది. నేనూ ఒప్పుకున్నాను..”
“నిన్నటి దాకా నువ్వు నాకే దక్కాలనుకున్నాను. నాకా అదృష్టం లేదు. ఇంక నా సోది నీకు వినిపించను. నిన్ను విసిగించను. వెళ్లిరా మోనాలిసా” అన్నాడు శ్రీహరి వేదనా భరితమైన హృదయంతో.
“మనసు, హృదయమూ, ప్రేమలూ, అనుభూతులూ, ఆనందాలూ, కష్టాలూ, కన్నీళ్లూ నీకు ఒక్కడికే ఉంటాయని అనుకోకు. అవన్నీ నాకూ ఉన్నాయి. అంతకు పదిరెట్లు నేనూ దహించుకుపోతున్నాను” అన్నది శ్రీవల్లి పెల్లుబికే దుఃఖాన్ని ఉగ్గబట్టుకొని.
“నువ్వు నా దానివి గనుక, నీ గుండె గదిలో మ్రోగే సంగీతాలన్నీ నాకు వినిపిస్తూనే ఉంటాయి. కానీ జీవితంలో విలువన సౌందర్యాలు చేజారిపోకుండా దక్కించుకోగలమా? ఆశల స్వప్నాలు పూచే రోజు వస్తుందా? నీకూ నాకూ ఇదొక సవాల్. గెలివగలిగితే మనం ఎక్కలేని శిఖారాలను ఎక్కినట్లే..” అన్నాడు శ్రీహరి.
“ప్రతి క్షణం నేను నీ గురించే ఆలోచిస్తూంటాను, ఆలుపూ సొలుపూ లేకుండా..” అన్నది శ్రీదేవి.
“అయిదు నిముషాలు అద్దంలో చూసుకుంటే మన ముఖమే మనకు విసుగు అనిపిస్తుంది గదా.. మరి ఇన్ని గంటలూ, రోజులూ, నెలలూ ఒకరి నొకరు స్మరించుకుంటున్నా విసుగు పుట్టటం లేదంటే కారణం ఏమిటంటావు?”
“ఏమో, నాకు తెలీదు.”
“నాకు తెల్సు. అది నీ గొప్ప, నా గొప్ప కాదు. ప్రేమంటే అంతేనే పిచ్చిదానా. నన్ను విడిచి నువ్వు ఉండలేవు. నిన్ను విడిచి నేను ఉండలేను.” అని అతను చెప్పిన మాటలు ఆమెకు నిజమే అనిపించాయి.
“మరేం చేద్దాం. ఇప్పుడింక మా వాళ్లకు చెప్పలేను. చెప్పినా ప్రయోజనమూ లేదు. చాలా దూరం వెళ్లింది విషయం..”
“ఒక పని చేద్దాం. రేపు తెల్లవారుఝామున నాలుగు గంటలకు లేచి స్టేషన్‌కు వచ్చెయ్. వాళ్లు నిద్ర లేచేటప్పటికి ఊరు విడిచి వెళ్లిపోదాం. నీ కోసం ఎదురు చూస్తుంటాను” అని చెప్పాడు.
శ్రీవల్లి, శ్రీహరి వంక భయంభయంగా చూసింది. అతను అభయం ఇచ్చాడు.
“ఒక్కొసారి ధైర్యం చేయల్సి వస్తుంది. భవిష్యత్తు మీద బోలెడంత భరోసాతో బయలుదేరుతున్నాం. ఏం జరుగబోతోందో తెలీదు. నీ సామీప్యం, నీ సాన్నిహిత్యం, ఇవి మాత్రమే నేను చూసుకుంటున్నాను..” అన్నాడు శ్రీహరి.
“వస్తాను మరి, నువ్వు మాట తప్పవు కదూ..” అని అడిగింది శ్రీవల్లి.
“నేను బ్రతుకుతున్నదే నీ కోసం మోనాలిసా. మాట తప్పితే మరణించిన వాడినే అవుతాను” అన్నాడు శ్రీహరి.
అక్కడి నుంచి ఒకరినొకరు విడిచి వెళ్లలేక, వెళ్లలేక వెళ్లారు.
***
ఏడేళ్ల తరువాత..
రోజ్ పెటల్స్ స్కూలుకు ఎదురుగా చెట్టు కింద శ్రీవల్లి కారు ఆపింది. దిగి లోపలికి వెళ్లి కొడుకు టిల్లూను వెంటబెట్టుకు వస్తుంటే..
కారు పక్కనే స్కూటర్ ఆపి కూతురు డాలీ కోసం ఎదురు చూస్తున్న శ్రీహరి కనిపించాడు.
ఒకరి నొకరు చూసుకొని శిలా ప్రతిమల్లా నిలబడిపోయారు.
“మోనాలిసా?” అని శ్రీహరి పలకరించాడు.
చాలా ఇబ్బందిగా నవ్వింది.
“మీ బాబా?” అని అడిగాడు.
అవునంది తలొంచుకొని. ఇంతలో డాలీ వచ్చింది ‘డాడీ’ అంటూ. కూతుర్ని శ్రీవల్లికి చూపించాడు.
“వస్తాను” అంటూ పిల్లాడిని కారులో కూర్చోబెట్టుకొని కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది.
మర్నాడు మళ్లీ అదే సన్నివేశం. అతను పలకరించాడు. ఆమె జీవం లేని నవ్వు నవ్వింది.
శ్రీహరి టిల్లూకి చాక్లెట్స్ ఇచ్చాడు.
మర్నాడు శ్రీవల్లి డాలీకి బిస్కట్స్ ఇచ్చింది.
మాటా మాటా కలిసింది.
టిల్లూ, డాలీని వాళ్ల ఇంటికి రమ్మని అడిగాడు. తల్లి ప్రోత్సాహంతో, కారు వెనకాలే స్కూటరు మీద శ్రీహరి వెళ్లాడు.
ఇల్లంతా చూపించింది. తన భర్త ఫోటో చూపించింది. ఆయన ఏదో ఒక ఫాక్టరీ నడుపుతున్నాడట. చాలా సరదా అయిన మనిషట. పిల్లలిద్దరూ అక్వేరింయంలోని రంగు రంగుల చేపల్ని చూస్తున్నారు.
శ్రీహరి భార్య గురించి అడిగింది. చెప్పాడు. “ఒకసారి తీసుకురాకూడదూ?” అని అడిగింది కుడిచేతికున్న అరడజను బంగారు గాజులను సవరించుకుంటూ.
అలాగేనన్నాడు శ్రీహరి. టిఫెనూ, కాఫీలు ముగించాక, పక్కనే కూర్చుని అడిగింది.
“ఆవేళ తెల్లవారు ఝామున నన్ను రమ్మన్నావు. తరువాత ఏం జరిగిందో చెప్పమని అడగలేదేం?”
“ఆ ప్రస్తావన తీసుకురావటానికే సిగ్గు పడుతున్నాను” అని ఆగిపోయ్యాడు శ్రీహరి.
ఆమె చెప్పింది – “ఎవరికంటా పడకుండా స్టేషన్ చేరుకోవాలనే తాపత్రయంలో ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఒక గంట ముందే మూడు గంటలకే నెమ్మదిగా ఇంట్లో నుంచి బయటపడ్డాను. వీధిలో నడుస్తున్నాను. కుక్కలు లేచి అరుస్తున్నాయి. ఇంకొంచెం దూరం వచ్చేటప్పటికి ఇద్దరు పోలీసులు ఎదురుపడ్డారు. ఎక్కడికీ వెళ్తున్నావని నిలదీశారు. ఏం చెప్పాలో తెలియక హాస్పటల్‌కి అని చెప్పాను. వాళ్లకు నమ్మకం కుదరలేదు. నాతో పాటు వాళ్లూ వస్తామన్నారు. చివరకు దొరకిపోయాను. నన్ను మా ఇంట్లో అప్పగించి వెళ్లారు. ఇంట్లో వాళ్లంతా సవాలక్ష ప్రశ్నలతో చంపుకుతిన్నారు. అందరి దృష్టిలో దోషిగా నిలబడ్డాను. అందరికీ లోకువైపోయాను.. జీవితంలో మళ్లీ నీ కంట పడకూడదనే అనుకున్నాను. ఇప్పుడూ గిల్టీగానే ఫీలవుతున్నాను..” అని ఆగిపోయింది.
“నువ్వు అలా రాలేకపోయావు. నేను మరో విధంగా రాలేక పోయాను. ఆటో కోసం వేగంగా రోడ్డు దాటుతుంటే ఒక లారీ గుద్దేసింది. ఎవరో తీసుకెళ్లి దగ్గర్లోని హాస్పటల్‌లో చేర్చారు. వారం రోజులు ఆ హాస్పటల్ లోనే ఉండిపోయాను. ఇంతకీ విధి అనుకూలించ లేదు. దగ్గర కావాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ప్రతిబంధకం ఎదురై, ఇద్దర్నీ చెరో వైపుకు నెట్టేస్తోంది. అప్పుడు నిన్ను ఆత్రంగా కౌగిలిలో చేర్చుకోవాలని, చీకట్లో, చలిలో మంచులో బయల్దేరి, అందుకోలేనంత దూరంలో ఉండిపోయాను. ఇప్పుడు నిన్ను కల్సుకున్నా చాలా ఆలస్యం అయింది. నువ్వు పరాయి దానివి..” అన్నాడు శ్రీహరి.
అతని చూపులో ఎన్నో కోరికలున్నయి. ఆమె చూపుల్లో వేల వేల కాంక్షలున్నయి. శ్రీవల్ల లేచి అతనికి మరింత దగ్గరగా వచ్చింది. అనుకొని నిలబడింది. అతని ఉద్వేగం పది రెట్లు పెరిగింది.
“రేపు మధ్యాహ్నం రా.. ఇంట్లో ఎవరూ ఉండరు” అన్నది.
ఆమె ఆంతర్యం అతనికి అర్థం అయినట్లూ, కానట్లూ ఉన్నది. వాళ్లు ఏకాంతంగా కల్సుకున్న సమయాలు ఇదివరలోనూ చాలా ఉన్నయి.
కూతుర్ని తీసుకొని శ్రీహరి ఇంటికి వచ్చాడు.
ఇంట్లో ఎవరో కూర్చుని ఉన్నాడు. తన క్లాస్‌మేట్ అంటూ శ్రీహరి భార్య అతన్ని పరిచయం చేసింది. అతన్ని కొంచెం నిశితంగా చూశాడు. శ్రీవల్లి ఇంట్లో ఫోటోలో చూసిన ఆమె భర్త ఇతనే. మరి కొన్ని వివరాలు తెల్సుకున్నాక అతను శ్రీవల్ల భర్తే అని నిర్ధారణ అయింది.
అతను ఉన్న కాసేపూ తన భార్య ముహం దేదీప్యమానంగా వెలిగిపోవటం, ఆ కాసేపూ ఆమె సంతోషం అతనికి కొత్త విషయం ఏదో తెలియజేసింది.
రాత్రి భార్య నిద్రపోయాక, ఆమె సూట్‌కేస్ వెతికాడు. కొన్ని ప్రేమలేఖలు, అతనితో తీసుకున్న ఫోటోలు కనిపించాయి.
మర్నాడు శ్రీవల్లి రమ్మన్న సమయానికి వాళ్ల ఇంటికి వెళ్లలేదు.
సరిగ్గా అదే సమయంలో శ్రీహరి తన మేనేజింగ్ డైరెక్టర్ ముందు ఉన్నాడు. ట్రాన్స్‌ఫర్ కావాలని అడిగాడు.. ఈ ఊరు కాకుండా ఇంకే ఊరికి అయినా సరే.