సరిహద్దు రాజకీయాలపై తెలుగులో వచ్చిన సమగ్ర నవల – ‘రెండు ఆకాశాల మధ్య’

0
3

(ప్రఖ్యాత రచయిత్ర శ్రీ సలీం రచించిన ‘రెండు ఆకాశాల మధ్య’ అనే నవలని సమీక్షిస్తున్నారు పి. జ్యోతి)

ख़ून अपना हो या पराया हो नस्ल-ए-आदम का ख़ून है आख़िर
जंग मशरिक़ में हो कि मग़रिब में अम्न-ए-आलम का ख़ून है आख़िर
बम घरों पर गिरें कि सरहद पर रूह-ए-तामीर ज़ख़्म खाती है
खेत अपने जलें कि औरों के ज़ीस्त फ़ाक़ों से तिलमिलाती है
टैंक आगे बढ़ें कि पीछे हटें कोख धरती की बाँझ होती है
फ़तह का जश्न हो कि हार का सोग ज़िंदगी मय्यतों पे रोती है
जंग तो ख़ुद ही एक मसला है जंग क्या मसलों का हल देगी

రక్తం నాదో నీదో అన్నది కాదు, ఇది మానవ జాతి రక్తం
యుద్ధం తూర్పునో పడమరనో జరుగవచ్చు అది హరించేది మాత్రం ప్రపంచ శాంతినే,
బాంబులు ఇంటిపై పడవచ్చు పొలిమేరల్లో పడవచ్చు, గాయపడేవి మన ఆత్మలే
మన పొలాలు కాలినా మరొకరివరి కాలిపోయినా ఎగిసిపడేవి మనందరిలో ఆకలిమంటలే
ట్యాంకులు ముందుకు నడిచినా, వెనుకకు నడిచినా, బంజరుగా మారేది ఈ నేల తల్లే
గెలుపు సంబరాలు జరుపుకున్నా ఓటమి విషాదాన్ని భరించినా జీవితం కుమిలిపోయేది ఎన్నోమృతదేహాల మధ్యనే
యుద్ధమే ఓ సమస్య అయినప్పుడు యుద్ధం ఎలా సమస్యలను పరిష్కరిస్తుంది?

~

[dropcap]సా[/dropcap]హిర్ లుధియాన్వి యుద్ధంపై రాసిన ఉర్దూ కవిత పదే పదే గుర్తుకు వచ్చింది సలీం గారి ‘రెండు ఆకాశాల మధ్య’ నవల చదువుతున్నప్పుడు. తెలుగు పాఠకులకు భారత పాకిస్తాన్ విభజనకు సంబంధించిన కథలు ఉత్తర భారతీయ రచయితల ద్వారానే పరిచయం. దక్షిణాన ఉన్న భారతీయ ప్రజానికానికి ఆ విభజన విధ్వంసం డైరెక్టుగా తెలుసుకోవలసిన అవసరం పడలేదు. హిందీలోనూ ఉర్దూలోనూ ఆ సమయంలో విభజన గాయాలను అనుభవించిన ఎందరో కవులు ఆ నాటి విషాదాన్ని రికార్డు చేస్తే, ఆ అనువాదాలను మాత్రమే తెలుగు పాఠకులు ఇప్పటి దాకా చదివారు. కాని ఇప్పుడు డైరక్టుగా ఈ విషయంపై తెలుగులో రాయబడిన మొదటి నవల ఈ ‘రెండు ఆకాశాల మధ్య’.

ఈ నవలను రాస్తున్నప్పుడు విభజన విధ్వంసాన్ని కథావస్తువుగా తీసుకుంటూ రచయిత 1947న మొదటి సారి విభజన మారణకాండ జరిగిన సమయం నుండి 1971లో పాకిస్తాన్ భారత్‌ల నడుమ జరిగిన యుద్ధం నాటి పరిస్థితుల దాకా వివరిస్తూ, సరిహద్దు గ్రామాలలోని సామాన్య ప్రజానీకం పడ్డ కష్టాలను, అకారణంగా వారు అనుభవించిన విపత్కర పరిస్థితిని, దానితో అతలాకుతలం అయిపోయిన వారి జీవితాలను ఈ నవలలో ప్రస్తావిస్తారు. దీని కోసం సరిహద్దు రాజకీయాలకు సంబంధించిన రాజకీయ చరిత్రను సమగ్రంగా తెలుగు ప్రేక్షకుల కోసం రచయిత రికార్డు చేయగలిగారు. అందు కోసం వీరు చేసిన రీసెర్చ్ మెచ్చుకోదగ్గది.

ఓ పక్కన భారతీయ సిపాయిలు, మరో పక్కన పాకిస్తాన్ సిపాయిలు తుపాకులు పట్టుకుని ఒకరిపై మరొకరు సరిహద్దులలో కాల్పులు జరుపుకుంటుంటే మధ్యన ఊర్లల్లో నివసించే వ్యక్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవించవలసి రావడం, అనుకోకుండా గుండు తగిలి ఎవరో ఒకరు మరణించడం, ఇల్లు వదిలి బైటకు వస్తే తిరిగి ప్రాణాలతో ఇల్లు చేరగలమా లేదా అన్న అనుమానంతో నిత్యం జీవించవలసి రావడానికి మించిన విషాదం మరొకటి ఉండదు. అలా తూటాలకు బలి అయిపోయిన రషీద్ మరణాన్ని గురించి చదివినప్పుడు ఆ హత్య వెనుక ఎవరిని తప్పుపట్టాలో అర్థం కాదు. తుపాకుల శబ్దం వినిపించగానే గ్రామస్తులంతా గుహల్లోకి వెళ్ళి తలదాచుకోవలసి రావడం, తరువాత మట్టిలో కలిసిన ఇళ్ళను, పశువులను, ముసలివాళ్ళను, పిల్లలను తలచుకుని ఏడవడం, అత్యంత విషాదకరమైన జీవనం.

పెద్ద అన్నను చూసి రావడానికి లాహోర్ వెళుతుంది శంకర్‌లాల్ కుటుంబం. అక్కడ మతకలహలలో చిక్కుకుని, బంధువులని కళ్ళ ముందే పోగొట్టుకుని చివరకు చిన్న కూతురుని దుండగులు ఎత్తుకెళ్ళెతే మౌనంగా చూడటం తప్ప ఏం  చేయలేని అసహాయతను శంకర్‌లాల్ పాత్రలో చూస్తున్నప్పుడు అత్యంత విషాదంతో మనసు కొట్టుకుంటుంది. ఆ అమ్మాయిని ఓ ముస్లిం ఎత్తుకెళ్ళిపోయి, ఆమెపై అత్యాచారం చేసి వివాహం చేసుకుని ఆమెను జీవచ్ఛవంలా మారుస్తే, నలభై సంవత్సరాల తరువాత ఆమె తన పెద్ద కొడుకు సహాయంతో బార్డర్ దగ్గరకు వచ్చి కొనప్రాణంతో ఉన్న తండ్రిని తమ్ముడిని కలుసుకుంటుంది.

1971 యుద్ధంలో సరిహద్దు రేఖలు మారి పాకిస్తాన్ లోని గ్రామం హుందర్మో భారతదేశం వశం అవుతుంది. కూతురు పెళ్ళి కోసం ఊరి నుండి రెండు  మైళ్ళ దూరం ఉన్న బ్రోల్మో గ్రామానికి బట్టల కోసం వెళతాడు ఓ తండ్రి. సాయంత్రానికి సరిహద్దుల నిర్ణయం జరిగిపోతుంది. రెండు ఊర్ల మధ్య ముళ్ళ కంచె వెలుస్తుంది. రెండు మైళ్ళ దూరం ఉన్న తన గ్రామానికి మళ్ళీ చేరడానికి ఇరవై సంవత్సరాలు ఆగవల్సి వస్తుంది ఆ తండ్రికి. ఎంత రాక్షసమైన శిక్ష ఇది. ఒక ఊరి నుండి మరో ఊరికి వివాహం అయి వెళ్లిన ఆడపిల్లలతో కుటుంబీకుల సంబంధాలు జీవితాంతం తెగిపోయాయి. వివాహం  చేసుకున్న దంపతులలో, భర్త లేదా భార్య ఈ సరిహద్దు గ్రామాలల్లో ఇరుక్కుని పోతే ఏళ్ళ తరబడి వారి కోసం ఎదురు చూసి చివరకు మనసు చంపుకుని మరొకరిని వివాహం చేసుకోవలసి రావడం ఎంత ఘోరమైన శిక్ష?

డిల్లీ నుండి లాహోర్ వచ్చే ఓ హిందూ కుటుంబం విభజన సమయంలో చేసిన ఘోరమైన రైలు ప్రయాణంలో శవాల మధ్య పడుకుని ప్రాణాలను దక్కించుకోవాలని ప్రయత్నించడం, ఆ ఇంటి ఆడపిల్లపై అత్యాచారం జరుగుతున్నా, కొడుకు చేయి నరికేసినా చూస్తూ మౌనంగా శవంలాగా పడుకుని ఉండిపోవలసిన ఓ తండ్రి  అసహాయత, ఆయన్నిఆ తరువాత మరణించేదాకా జీవచ్ఛవంలా మార్చివేస్తుంది. ఇంత కన్నా విషాదం మరొకటి ఉండదేమో.

ఈ నలిగిపోయిన జీవితాలన్నిటి మధ్యన ఒకే ప్రశ్న మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. ఎవరు నిర్ణయించారు ఈ సరిహద్దులను? ఎవరికి వీటివలన మంచి జరిగిందని? ఈ సరిహద్దు నిర్ణయాల నడుమ నలిగిపోయిన, పోతున్న జీవితాలకు మూల్యం లేదా? వారెందుకు ఇలాంటి విషాదాన్ని భరించవలసి వచ్చింది? ఆ పాపం ఎవరిది?

సలీం గారి నవలలో ఈ ప్రశ్నలే పాఠకులను వెంటాడుతూ ఉంటాయి. ఆయన ఎన్నుకున్న కథావస్తువు అత్యంత విషాదమైనది. దేశ రాజకీయాలకు లక్షల మంది జనం బలికావడం ఎంత వరకు సహేతుకం? సరిహద్దు గ్రామాలలో వ్యక్తులకు పాకిస్తాన్, హిందుస్తాన్ లతో సంబంధం లేదు. తమ పొరుగున ఉండే బంధువులను తమకు దూరం చేసి తమ జీవితాలలో భయంకరమైన ఒంటరితనాన్ని నింపే ఈ సరిహద్దు రాజకీయాల కారణంగా వారి జీవితాలలో చిందే విషాదాన్ని ఎలా దూరం చేసుకోవాలన్నదే వారి ప్రశ్న. దానికి ఇన్ని సంవత్సరాలలో ఎవరూ జవాబివ్వలేకపోయారు.

సలీం గారు ఈ నవలలో పాత్రలన్నిటిలో అంతులేని విషాదాన్ని చూపించారు. ఇన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాని సరిహద్దు సమస్య కారణంగా నలిగిపోయిన జీవితాలను ప్రస్తావించారు. పాత్రల నడుమ సంభాషణలను చిత్రించేటప్పుడు చాలా వరకు దక్షిణాది సంస్కృతి కలిసిపోయినట్లు అనిపించింది. ముఖ్యంగా ఆ పాత్రలు ఒకరినొకరు పిలుచుకునే పద్ధతి, సంభాషించే విధానంలో తెలుగుతనం కలిసిపోయినట్లు కొన్ని సందర్భాలలో అనిపించింది. కాని చారిత్రికమైన రీసెర్చ్‌ని వీరు చాలా జాగ్రత్తగా చేసినట్లు మాత్రం స్పష్టం అవుతుంది. హుందర్మాన్ కార్గిల్ జిల్లాలో వస్తుంది. రాత్రికి రాత్రే ఈ ఊరు హిందుస్తాన్‌లో చేరిపోవడం, దాని పక్కనే ఉన్న బ్రోల్మో రెండు భాగాలుగా విడిపోయి పాకిస్తాన్‌గా అది ఉండిపోవడం ఎందరి జీవితాలను ఒక్క రోజులో మార్చివేసిందో. ఈ చారిత్రిక ఘటనను ఆధారం తీసుకుని, జరిగిన వాస్తవ సంఘటనలను ప్రస్తావిస్తూ రెండు గ్రామాల నడుమ కొన్ని పాత్రలను చిత్రించి కథ నడిపిస్తూ సరిహద్దు రాజకీయం సామాన్యుల జీవితలతో ఆడుకున్న విధానాన్ని రచయిత నవలా రూపంలో చెప్పడం చాలా బావుంది.

ఇలాంటి నవలల వలన ఎన్నో వాస్తవ సంఘటనలను మరో తరానికి రాజకీయ చరిత్రలా అందించే అవకాశం ఉంటుంది. పైగా చరిత్ర విస్మరించిన సామాన్య ప్రజానికం జీవన పోరాటాన్ని వ్యక్తీకరించిన రచయిత సామాజక భాద్యత కూడా స్పష్టమవుతుంది. సలీం గారు ఎంతో సెంటిమెంట్‌ను మెలోడ్రామాని కూడా రంగరించి పాత్రల మనోభావాలను చూపే ప్రయత్నం చేయడం వలన ఒక సినిమాటిక్ ఎఫెక్ట్ కూడా ఈ నవలలో కనిపిస్తుంది. అయితే అది ఇటువంటి గంభీరమైన విషయానికి కొంత హెచ్చు మోతాదయిందేమో అని కూడా కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది. ఎన్నో కథలను కల్పించుకుంటూ ఒక్కో సమయంలో జరిగిన ఒక్కో సంఘటనను రచయిత ప్రధాన కథావస్తువుతో కలుపుకుంటూ వెళ్ళారు. అందువలన కొన్ని కథలు, కొన్ని చారిత్రిక సంఘటనలు, కొన్ని జీవితానుభవాలను కలిపి ఒకో చోట కలిపి అందించినట్లు అనిపిస్తుంది.

ఏదేమైనా తెలుగులో ఈ నవల రావడం ఓ మంచి ప్రయోగంగానే చూడాలి. డైరక్టుగా సరిహద్దు రాజకీయాలపై తెలుగులో వచ్చిన సమగ్ర నవల ఇదే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ‘సర్హద్ జమీన్ బాంట్ సక్తీ హై పర్ దిల్ నహీ’ అనే వాక్యంతో రచయిత ఈ నవల వెనుక తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.

***

రెండు ఆకాశాల మధ్య (నవల)
రచన: సలీం
ప్రచురణ: అనుపమ ప్రచురణలు
పేజీలు: 251
వెల: ₹ 200
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా హైదరాబాద్. 90004 13413
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here