హిమాచల్ యాత్రానుభవాలు-4

    0
    4

    [box type=’note’ fontsize=’16’] “పట్టణ జీవితంలో మనం మరచిపోయిన స్వల్ప ఆనందాలు అనేకం యాత్రలలో పొందవచ్చు. ఇలాంటి యాత్రలు మనలోని బాల్యాన్ని మరలా తట్టిలేపి మరపురాని ఆనందాన్ని ఇస్తాయి” అంటున్నారు చాముండేశ్వరి “హిమాచల్  యాత్రానుభవాలు”లో. [/box]

    [dropcap style=”circle”]మ[/dropcap]నాలి డ్రీమ్స్ హోటల్ రూమ్ బాల్కానీ నుండి చూస్తే సూర్యోదయం, సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తాయి. పట్టణ జీవితంలో మనం మరచిపోయిన స్వల్ప ఆనందాలు అనేకం. అందులో సూర్య దర్శనం, వానలో తడవటం, నదిలో దిగి నీటిని ఒడిసిపట్టటం లాంటివి. ఇలాంటి యాత్రలు మనలోని బాల్యాన్ని మరలా తట్టిలేపి మరపురాని ఆనందాన్ని ఇస్తాయి.

    సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ వేడి టీ తాగుతూ ప్రశాంత వాతావరణం అందించే హాయిని అనుభవిస్తూ ‘ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి?’ అని అలోచించి అక్కడికి దగ్గరలో ఉన్న నగ్గర్ అనే గ్రామానికి వెళ్ళాలనుకుని త్వరగా తయారై హోటల్‌లో రుచి శుచికరమైన ఫలహారం తిని బయలుదేరాము.

    హోటల్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాటశాల ఎదురుగా ఆగిన కులు బస్సు ఎక్కి  నగ్గర్ గ్రామానికి బయలుదేరాము. మనాలి చుట్టుప్రక్కల గ్రామాలకు  చవక బస్సు ప్రయాణ వసతి బాగుంది. అందువల్ల మేము టాక్సీలలో తిరగకుండా బస్సులో తిరిగేవాళ్ళం.

    కులు మనాలి లోయలో మరొక ముఖ్య పర్యాటక ప్రాంతం నగ్గర్ కోట. ప్రకృతి అందాలకు నెలవు.

    ఈ గ్రామం కులు వైపు నుండి 26 కిమీ, మనాలి నుండి 21 కిమీ దూరంలో ఉంది. ఈ సుందర ప్రదేశాన్ని చేరటానికి చక్కని రవాణా సదుపాయం ఉంది. మనాలి నుండి నగ్గర్‌కి బస్సులో పట్లికుల్ దాకావెళ్లి అక్కడనుండి ఆటో లేక వాన్‌లో నగ్గర్ గ్రామ కూడలి చేరాక అక్కడనుండి దాదాపు 2 కిమీ కొండదారి ఎక్కి వెళ్ళితే కోట కనిపిస్తుంది. మనాలి నుండి టాక్సీలో సరాసరి కేజల్ చేరవచ్చు. మనాలి పరిసర ప్రాంతాలకు చక్కని బస్సు రవాణా సౌకర్యం ఉంది.

    నగ్గర్ పాలస్ లేదా కేజల్ ఎత్తైన కొండ శిఖరభాగాన కట్టబడింది. సుమారు 500సం క్రితం నిర్మితమైంది. దారిపొడవునా రమ్యమైన సుందర ప్రకృతి ఆహ్లాదం కలిగిస్తుంది. బియాస్ నదీ ప్రవాహం, మంచు కప్పబడిన హిమాలయాలు, ఆకాశాన్ని తాకున్నట్లున్న వృక్షాలు, తోటలు, పూలు ఆనందాన్ని కలిగిస్తాయి. పట్లికుల్ గ్రామం దాకా బియాస్ నదితో కలసి ప్రయాణిస్తాము. నిండైన నదీమ తల్లి ఎంత ఆనందాన్ని ఇవ్వగలదో మనాలి యాత్రలో అనుభవమైంది.

    నగ్గర్ అంటే ప్రాంతీయంగా మేధావి అని అర్థమట. హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్‌కి బదులుగా సినీ పరిశ్రమ షూటింగ్స్‌కి వస్తారుట. అనేక భాషల చిత్రాలు ఇక్కడే షూటింగ్స్ జరుపుకున్నాయి. అందులో ఒకటి మన తెలుగు సినిమా – అల్లు అర్జున్ హీరోగా నటించిన – “దేశముదురు” కూడా ఉంది.

    ప్రఖ్యాత ఆర్టిస్ నికోలస్ రోరిచ్ ఇక్కడి కోటలో ఉండి, పరిసర ప్రాంత రమణీయ దృశ్యాలతో ప్రేరణ పొంది గొప్ప గొప్ప కళాఖండాలను ఇక్కడే చిత్రించారట. నగ్గర్ క్రీ.శ. 1460లో కులు రాజవంశాలు అధికార పీఠంగా అనేక శతాబ్దాలు ఉన్నది. నగ్గర్ కేజల్ 1600 సం.లో బ్రిటిష్ హయాంలో నిర్మితమైంది.

    బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చాక దాన్ని మొదటగా న్యాయస్థానంగా, 1947 తరువాత అతిథి గృహంగా ఉపయోగించారు. ప్రస్తుతం హిమాచల్ పర్యాటక శాఖవారి స్టార్ హోటల్‌‌గా ఉన్నది. నామమాత్ర రుసుముతో పర్యాటకులు  కేజల్, గుడి, చిన్ని మ్యూజియం, రెస్టారెంట్ దర్శించవచ్చు, వరండాలోనుండి కనిపించే సుందర దృశ్యాలు చూసి ఫొటోలో తీసుకోవచ్చు.

    ఈ కేజల్ నిర్మాణం స్థానిక వాస్తుశైలిలో రాళ్లు, చెక్కలతో నేటికీ చెక్కుచెదరని విధంగా కట్టారు. ఆ వాస్తుశైలిని కత్‌కుని అంటారట. నిర్మాణంలో ఎక్కడ ఒక్క ఇనుప మేకు కానీ, రాళ్ళూ చెక్కల మధ్యన సున్నం కానీ వాడలేదు. తలుపులు ఏక చెక్కతో చేశారట. అంటే ఎంత పెద్ద వృక్ష కాండమో కదా!

    రాళ్ళని బియాస్ నదీ ప్రవాహానికి అవతలి ఒడ్డునుండి తెచ్చారట. కేజల్ లోపల ఉన్న గుడి సాంస్కృతిక పరంగా స్థానికంగా ముఖ్యమైనది. కులు లోయకు చెందిన దేవతల నివాసంగా భావిస్తారు. ప్రకృతి విపత్తులు, వరదలు భూకంపాలు తదితర దుర్ఘటనలు సంభవించినప్పుడు గ్రామాల పెద్దలు సమావేశమై ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్ణయిస్తారట.

    నగ్గర్ గ్రామ పరిసరా ప్రాంతాలలో అనేక పురాతన దేవాలయాలున్నాయి. చాముండా త్రిపురసుందరి, నరసింగదేవ వంటివి. నికోలస్ రోరిచ్ ఆర్ట్ గ్యాలరీ మరో సందర్శనీయ స్థలం.

    (సశేషం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here