నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-32

0
4

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]30[/dropcap]వ తారీఖు సాయంత్రం నేను సర్దార్‍తో చాలా సేపు మాట్లాడేను. ఆ రోజు సర్దార్ ఎంతో ఒత్తిడిలో ఉన్నట్లు అనిపించారు. నిజానికి కొన్ని రోజులుగా సర్దార్ ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. గత సంవత్సరంగా గాంధీజీకీ సర్దార్‍కీ నడుమ అభిప్రాయభేదాలు పొడచూపాయి. సాయంత్రం ఉపన్యాసాలలో మహాత్మాగాంధీ వాటిని ప్రస్తావించారు కూడా. బొంబాయిలో ఇచ్చిన ఉపన్యాసంలో సర్దార్ కూడా ఆ అభిప్రాయభేదాలను సూచనప్రాయంగా ప్రస్తావించారు.

గత సంవత్సరమంతా సర్దార్ ఎంతో బరువు బాధ్యతలను తన భుజస్కంధాలపై మోయాల్సి వచ్చింది. ఆయన కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకోవటమే కాదు, వాటిని అత్యంత ఉత్సాహంగా అమలుపరిచారు. దేశ విభజన తప్పనిసరి అని గ్రహించి ఆ నిర్ణయాన్ని ఆమోదించారు. అనేక మంత్రుల కార్యనిర్వహణను ఆయన నిర్దేశించారు. దేశ విభజన వల్ల ఉత్పన్నమైన పలు సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించారు. ప్రాణాలు అరచేత పట్టుకుని దేశం వలస వచ్చిన వారి వల్ల కలిగిన సంక్షోభం ఒత్తిడిని భరించారు. దేశంలో బలహీనమవుతున్న శాంతి భద్రతల బాధ్యతను భరించారు. భారతదేశ చరిత్రలో ఇంతవరకూ కనీ విని ఎరుగని రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఒక రకంగా ఆయన మానవాతీత శక్తిని ప్రదర్శించారు. దేశాన్ని ఒకటి చేశారు. దేశంలోని పలు సంస్థానాధీశులను విధేయులైన మిత్రులుగా మార్చారు. బ్రిటీష్ వారు ముక్కలు ముక్కలుగా వదిలిన దేశాన్ని ఏకత్రితం చేశారు. దేశంలో ప్రభుత్వోద్యోగుల, అధికారుల విధేయతను కనీవినీ ఎరుగని రీతిలో సంపాదించారు. స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ నాయకులు ఎదుర్కున్న సమస్యలను ఆయన ప్రభుత్వోద్యోగుల నుంచి ఎదుర్కోలేదు.

అదనంగా ఆయన అన్ని రాష్ట్రల ముఖ్యమంత్రుల పనిలో మార్గదర్శనం చేశారు. ఆయన దేశానికి సుస్థిరతను సాధించారు. మహాత్మాగాంధీ మార్గదర్శనం కొరవడిన కాంగ్రెస్ సంస్థను ఆయన నడిపించారు. ఇలాంటి బరువు బాధ్యతలను భరించటం ఎంతో ధైర్యంతో కూడుకున్న పని. కానీ ఇన్ని బాధ్యతల బరువు ఆయనపై ఒత్తిడిని పెంచింది. నేను గమనించింది నిజమే అయితే, కొన్ని రోజుల క్రితం ఆయన తన మంత్రి పదవికి రాజీనామా పత్రాన్ని గాంధీజీకి సమర్పించారు కూడా.

మా సంభాషణ చివర్లో నేను ‘అతడి’ గురించి, గాంధీజీతో నా సంభాషణ గురించి చెప్పాను. సర్దార్ కోపంగా అన్నారు “మీనన్‍కు చెప్తాను అతడిని తొలగించమని”. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రపూరితమైన ప్రచారం గురించి ఆయన బిర్లా హౌస్‌కు వెళ్ళి గాంధీజీతో చర్చించారు కుడా. ఆయనను దుష్టుడనీ, మతతత్వవాది అని దూషిస్తున్నారు. కాంగ్రెస్ సాధించిన మత సామరస్యాన్ని పాడు చేస్తున్నాడని విమర్శిస్తున్నారు.

ఆ కాలంలో కాంగ్రెస్‍లో ఇలాంటి విషప్రచారం గుసగుసలలో సాగటం సాధారణం. ఇలా గుసగుసల ద్వారా, ఒకరి నుంచి మరొకరికి విషయం పాకుతూ, నచ్చని వ్యక్తిపై ‘మతతత్వవాది’ అన్న ముద్ర వేయటం జరుగుతోంది. ‘మతతత్వవాది’ అన్న పదాన్ని పలికే విధానంలో, ఆ పదంలోనే ‘పతితుడు’, ‘కాంగ్రెస్ ద్రోహి’  అన్న అర్థం వస్తుంది. ఈ రకంగా ఒక అబద్ధాన్ని సృష్టించి దాన్ని నిరూపించేవారు కూడా. ఈ రకంగా ఈ గుసగుసల ప్రచారంతో వారు ఎంతోమందిని దెబ్బతీశారు. ఈసారి వారి లక్ష్యం సర్దార్ లాంటి అత్యున్నత స్థానంలో ఉన్న శక్తిమంతుడు. గాంధీజీ ఈ విషయమై చింతించేవారు. సర్దార్, నెహ్రుల నడుమ భేదాభిప్రాయాల వల్ల పొరపొచ్చాలు రాకూడదని, వారు కలిసికట్టుగా పని చేయటంపైనే భారత్ భవిష్యత్తు ఆధారపడి ఉందనీ గాంధీజీ విశ్వాసం.

ఆ రోజు సాయంత్రం గాంధీజీ, సర్దార్‍ల నడుమ సంభాషణ సుదీర్ఘంగా సాగింది. నిజానికి గాంధీజీ సమయపాలన ఖచ్చితంగా పాటిస్తారు. అందుకని ఆయన సంభాషణను హడావిడిగా ముగించి ప్రార్థన సమావేశానికి ఆయన మనుమరాలు మను, మునిమనుమరాలు అభాల భుజాలపై చేయి వేసి, తన గది వెనుక తలుపుల నుండి బిర్లా హౌస్ తోటలోని ప్రార్థనా స్థలానికి ప్రయాణమయ్యారు.

హఠాత్తుగా ఓ వ్యక్తి, గాంధీజీ దారికి ఇరువైపులా భక్తి ప్రపత్తులతో నిలబడిన వారి నడుమ నుంచి వచ్చి గాంధీజీ మార్గంలో అడ్డుగా నిలుచున్నాడు. అతడు గాంధీజీ కాళ్ళపై పడ్డట్టు చేశాడు. గాంధీజీతో ఉన్న ఓ అమ్మాయి అతడిని ఆపాలని ప్రయత్నించింది. అతను ఆమెను పక్కకి తోశాడు. ఆమె చేతుల్లో ఉన్న గాంధీజీ ధార్మిక పుస్తకం, రుద్రాక్ష మాలలు  క్రింద పడ్డాయి. ఆమె వాటిని తీసేందుకు వంగింది.

అతడు గాంధీజీకి ఎదురుగా నిలబడ్డాడు. పిస్టలు తీశాడు. వరుసగా మూడుసార్లు కాల్చాడు. గాంధీజీ ఆ దెబ్బల తాకిడికి ఊగారు. మరుక్షణం క్రిందపడిపోయారు. ఆయన పెదవులపై ఆయన అమితంగా ప్రేమించే పదాలు నిలిచాయి – ‘హే రామ్!’

బిర్లా హౌస్ తోటమాలి హంతకుడిని ఆపాలని ప్రయత్నించాడు. ఇతరులు అతడిని పట్టుకున్నారు. అతడు పేల్చిన తూటాలలో రెండు గాంధీజీ పొత్తి కడుపు నుంచి దూసుకుపోయాయి. మూడోది ఆయన ఊపిరితిత్తులలో ఇరుక్కుపోయింది. మహాత్ముడు మరణించాడు!

***

సర్దార్‍తో సుదీర్ఘ సంభాషణ తరువాత నేను వి.పి.మీనన్‍ను కలవటానికి వెళ్ళాను. అప్పుడు సాయంత్రం సమయం 5.30-6.00 అయి ఉంటుంది. నేను సెక్రటేరియట్ మెట్లు దిగుతున్నాను. బిర్లా హౌస్‍కు చెందిన కారు డ్రైవర్ నాకు ఎదురుపడ్డాడు. అతడు రెండు మెట్లు చొప్పున హడావిడిగా మెట్లెక్కుతున్నాడు.

“రండి.. రండి.. గాంధీజీని హత్య చేశారు” అని అరిచాడు.

అతడికి పిచ్చి పట్టిందని అనుకున్నాను.

వెంటనే బిర్లా హౌస్‍కి పరుగెత్తాను. నేను గాంధీజీ గది చేరేసరికి, ఆయనను మంచం మీద పడుకోబెట్టారు. ఆయన శరీరం నుంచి రక్తం కారుతోంది. ఆయనకు దగ్గరలో సర్దార్ కూర్చుని ఉన్నారు. రోదిస్తున్న పండిట్‍జీ భుజం మీద చేయి వేసి ఉన్నారు. అభా, మనులు విపరీతంగా రోదిస్తున్నారు. మణిబెన్ భగవద్గీత పఠిస్తున్నది. గాంధీజీని పరీక్షించడం పూర్తి చేశారు డాక్టర్ జేవరాజ్. మంచానికి మరోవైపు ప్యారేలాల్ ఉన్నారు. ఆయన గాంధీజీ వైపు ఆత్రుతగా చూస్తున్నారు. దూరంగా పెద్ద గుంపు నిశ్శబ్దంగా ఉంది.

నేను సర్దార్ పక్కన కూర్చున్నాను. గాంధీజీని పరీక్షించటం పూర్తి చేసిన డాక్టర్ లేచి నిలబడ్డారు. తల అడ్డంగా ఊపుతూ “లాభం లేదు” అన్నారు.

నాకేమవుతుందో అర్థం కావటం లేదు. ఏమీ ఆలోచించలేకపోతున్నాను. జరుగుతున్నది నిజం అనిపించటం లేదు.

ఉదయం నేను వేరే పని మీద వెళ్ళేటప్పుడు గాంధీజీని పలకరించి వెళ్ళిపోయాను. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఏదో రాసుకుంటున్నారు. ఆయన నన్ను చూసి పలకరింపుగా నవ్వారు. నా నమస్కారాన్ని అలవాటుగా చేయి కదలికతో స్వీకరించారు.

ఇప్పుడు ‘లాభం లేదు!’ అన్న మాటలు వింటున్నాను. నా కళ్ళు ఎండిపోయాయి. ఒక్క నీటి చుక్క కూడా రావటం లేదు. కంటికి కన్నీళ్ళు తెచ్చే భావావేశం స్తంభించిపోయింది. ఆ గదిలో నిశ్శబ్దాన్ని అప్పుడప్పుడు వినిపిస్తున్న రోదన ధ్వనులు భగ్నం చేస్తున్నాయి.

కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఇతరులు రావటం ఆరంభమయింది. ఆ సమయంలో బిర్లా కుటుంబ సభ్యులెవరూ లేరు. అందుకని నేను సేవకులందరినీ కూడదీసుకున్నాను. ముందుగా ప్రధాన ద్వారాలు మూయించాను. కొందరు మిత్రులను తలుపుల దగ్గర ఉండి అత్యంత ప్రధానమైన వారిని మాత్రమే లోపలకు రానివ్వమని చెప్పాను. బయట పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడుతున్నారు. ఇంతలో పోలీసుకు వచ్చారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

గాంధీజీ హత్య సంఘటన ప్రభావం ఆరంభంలో అతి భయంకరంగా ఉంది. గాంధీజీని హత్య చేసింది ఓ ముస్లిం అని చెప్పారు. దాంతో పాకిస్తాన్, భారత్ లలో రక్తపుటేర్లు పారుతాయన్న భయం కలిగింది. కానీ తరువాత తెలిసింది గాంధీని హత్య చేసింది ముస్లిం కాదు, హిందువు అని. అతడిని పట్టుకున్న బిర్లా హౌస్ తోటమాలి చెప్పాడు.

కొన్ని నెలల క్రితం గాంధీజీతో నేను జరిపిన సంభాషణ నా మనసులో మెదిలింది. ఎవరో అన్నారు, “బాపూ, మిమ్మల్ని ఏదో ఓ రోజు ఓ ముస్లిం హత్య చేస్తాడు” అని.

“ముస్లింలు నన్ను ఎప్పటికీ హత్య చేయరు. నేను హత్యకు గురయితే, అది హిందువు చేతుల్లోనే” అన్నారు గాంధీజీ. దాదాపుగా భవిష్యవాణి చెప్పినట్టే అన్నారు.

కాస్సేపటి తర్వత మేము లైబ్రరీలో కలిశాము. నాకు గుర్తున్నంత వరకూ నేను, లార్డ్ మౌంట్‌బాటెన్, పండిట్‍జీ, సర్దార్, మౌలానా సాహెబ్, గాడ్గిల్, జీవరాజు కలిశాము. గదిలో ఇంకా చాలా మంది ఉన్నారు.

“కొద్ది రోజు ఆయన శవాన్ని దర్శనానికి ఉంచాలి. దేశం నలుమూలల నుంచి ప్రజలు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడానికి వస్తారు” అన్నాడు మౌంట్‌బాటెన్.

“అది హిందూ ఆచారాలకు విరుద్ధం” అన్నారు కొందరు.

“సాయంత్రం సమయంలో మరణం సంభవిస్తే, మరుసటి రోజు మధ్యాహ్నం లోపల శవ దహనం చేయాలి. మధ్యాహ్నం దాటిన తరువాత శవాన్ని ఉంచుకోకూడదు” గాడ్గిల్ కాబోలు అన్నాడు.

ప్యారేలాల్ అన్నారు “తనకు హిందూ పద్ధతిలో దహన సంస్కారాలు జరపాలని గాంధీజీ కోరేరు”. దాంతో మరుసటి రోజు ఉదయం గాంధీజీ దహన సంస్కారాలు జరపాలని నిర్ణయించారు.

శవ దహనం జరుపవలసిన స్థలం నిర్ణయించేందుకు నేను, ఓ సైనిక అధికారి, హెచ్. ఎం. పటేల్ వెళ్ళాం. రాజ్‍ఘాట్ అయితే, తరువాత గాంధీజీ స్మారకార్థం ఏదైనా నిర్మాణం చేపట్టడానికి స్థలం సరిపోతుందనిపించింది. ప్రస్తుతం గాంధీజీ సమాధి ఇక్కడే ఉంది.

రెండు గంటలకు నేను బిర్లా హౌస్‍కి తిరిగి వచ్చాను. నాకు నిద్ర పట్టలేదు. జరిగింది ఇంకా ‘నిజం’ అని అనిపించటం లేదు. వెళ్ళి కాసేపు గాంధీజీ శవం వద్ద కాస్సేపు కూర్చున్నాను.

రాత్రంతా ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు. వాళ్ళు చేస్తున్న శబ్దం, అరుపులు నాకు చిరాకు కలిగించాయి. కనీసం ఆ సమయంలోనైనా నిశ్శబ్దంగా ఉండాలని వాళ్ళకి తెలియాలి. వాళ్ళు బిర్లా హౌస్ అంతా తిరుగుతున్నారు. గాంధీజీ దర్శనం చేసుకుంటున్నారు. జనాలని నియంత్రించేందుకు నేను స్వచ్ఛంద సేవకులను నియమించాను. వారు ప్రజలను ఒక వరుసలో నిలబెట్టారు. ఒకరొకరుగా దర్శనం చేసుకుంటున్నారు. గాంధీజీ ఉన్న గది తప్ప మిగతా గదులన్నీ తాళాలు వేయించాను. నన్ను నేను కార్యనిర్వాహకుడిగా నియమించుకున్నాను. అయితే గాంధీజీ దర్శనానికి ప్రజలు పెద్ద సంఖ్యలో రావటంతో, అందరికీ దర్శనం సాధ్యం కాదు కాబట్టి, గాంధీజీని బాల్కనీలో ఉంచాం. ఏడుస్తున్న మహిళలు, పిల్లలు, పురుషుల నడుమ కొందరు దర్శనం కోసం కుతూహలంగా ఉన్నవాళ్ళూ ఉన్నారు.

చివరగా గాంధీజీ పార్థివ శరీరాన్ని ఓ ట్రక్కులో ఉంచి, జాతీయ జెండా కప్పాము. గాంధీజీ వదనం ప్రశాంతంగా ఉంది. ప్రార్థనలో ఉన్నట్లు ఆయన కళ్ళు మూసుకుని ఉన్నాయి. సర్దార్‌తో పాటు గాంధీజీ తనయుడు దేవదాస్ – గాంధీజీ శరీరానికి దగ్గరగా కూర్చున్నారు. సర్దార్‍తో పాటు బలదేవ్ సింగ్ ఉన్నాడు. దారికి ఎవ్వరూ అడ్డుపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ దారి పొడుగునా ఉన్న ప్రజలను నియంత్రించటం కష్టం అయింది.

ఓ మహారాజు శవయాత్ర సాగినట్టు ఢిల్లీ వీధుల్లో గాంధీజీ శవయాత్ర సాగింది. అదే సమయానికి ప్రజలలో పెల్లుబుకుతున్న దుఃఖం ఒక మహాత్ముడి మహాప్రస్థానాన్ని తలపింపజేసింది.

నిండు జీవితం గడిపిన తరువాత శ్రీకృష్ణుడు ఒక వేటగాడి బాణం తగిలి ప్రాణాలు కోల్పోయాడు. తనను ద్వేషించిన వారు అందించిన విషంతో సోక్రటీసు మరణించాడు. తన ప్రజల ద్వేషం కురిపించిన విషయం వల్ల శిలువపై ఏసు క్రీస్తు ప్రాణాలు విడిచాడు.

గాంధీజీ కూడా తాను చీకటి నుంచి వెలుతురు వైపుకు నడిపించిన తన ప్రజల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆయన మరణించే సమయానికి అత్యంత శక్తిమంతుడు, ప్రపంచ ప్రజల గౌరవ మన్ననలందుకుంటూ, కేవలం భారత్‍కే కాదు ప్రపంచానికి నాయకుడిగా నిలిచారు. ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త మరణాన్ని పొందారు ఆయన. ప్రార్థనకు వెళ్తూ, పెదాలపై భగవంతుడి నామంతో ప్రాణాలు విడిచారు.

ఎలా గౌరవంగా జీవించారో, అలాగే మరణించారు. గొప్ప త్యాగధనుడిలా ప్రాణాలు విడిచారు. సాయంత్రానికల్లా దహన సంస్కారాలు అయిపోయాయి. గాంధీజీ మరణవార్త దెబ్బ నుంచి నేను నెమ్మదిగా కోలుకున్నాను. నేనెంతో ఒంటరి వాడినయ్యానని నాకు అనిపించింది. భరించలేని బాధాకరమైన ఒంటరితనం అది. ఎంతో నిరాసగా, నిస్సారంగా అనిపించింది. ఇక నాకు అత్యంత ప్రేమతో మార్గదర్శనం చేసేదెవరు? ఎవరి మార్గదర్శనం కోసం నేను ఎదురు చూడాలి? అన్న భావన కలిగింది.

పండిట్‍జీ, సర్దార్‍లకు కూడా తమ భుజాలపై పడిన సరికొత్త బాధ్యత గ్రహింపుకొచ్చింది. మార్గదర్శనం కోసం తమ వైపు చూసున్న ప్రజలకు తాము న్యాయం చేయాలి.

తను జీవించినంత కాలం అద్భుతాలు చేసినట్టే మరణం లోనూ గాంధీజీ అద్భుతాన్ని సాధించారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here