[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]
[కాలేజీ ప్రాంగణంలో ఓ చెట్టుకింద కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధార్థ. అప్పడే అక్కడికి వచ్చిన శకుంతల ఓ ముఖ్య విషయం మాట్లాడాలని అంటుంది. ఆమె ఏం మాట్లాడదలచుకుందో తనకి తెలుసంటాడు సిద్ధార్థ. కాత్యాయని ఆంటీ తనకన్నీ చెప్పారని చెప్పి, సుందరి తరఫున క్షమాపణ అడుగుతుంది. తనలోని ఆవేదననంతా ఉపన్యాస ధోరణిలో చెప్తాడు సిద్ధార్థ. బంధుత్వం కన్నా స్నేహమే గొప్పదని భావించి తన ఆవేదనని, బాధని నీకు చెప్తున్నానని అంటాడు. తనని తాను కించపరుచుకోవద్దని అంటుంది శకుంతల. తన పేదరికమే తన అవస్థలకి కారణమని చెప్తాడు. బిందు పరిచయం వల్ల తనకి మంచే జరిగిందనీ, లేకపోతే సుందరిని పెళ్ళి చేసుకుని నరకయాతన అనుభవించేవాడినని అంటాడు. బిందూ, సిద్ధార్థ ఒకటయితే సంతోషించేవాళ్ళలో తానూ ఒకర్తిననీ, ఆ భగవంతుడు వాళ్ళిద్దరికీ తగినంత మనోబలం ఇవ్వాలని ప్రార్థిస్తానంటుంది శకుంతల. తాను చేస్తానన్న ఆర్థిక సహాయానికి సిద్ధార్థని ఒప్పించే పూచీ నీదే అన్న బిందూ మాటలు గుర్తొచ్చి – సిద్ధార్థ దగ్గర మాట తీసుకుంటుంది, తన కోరిక ఒకటి తీర్చలని. సరేనంటాడు సిద్ధార్థ. కాలేజీ అయిపోయాకా బయటకి వస్తుంటే శకుంతలని పిలుస్తాడు రవి. సిద్ధార్థ చదువు మానేస్తున్నాడన్న విషయం నిజమేనా అని అడుగుతాడు. అవునంటుంది. కారణం తానూ ఊహిస్తున్నా, నిజమేమిటో తెలుసుకోవాలని అడుగున్నానంటాడు రవి. ఆర్థికపరమైన కారణలని చెప్పి – సిద్ధార్థ వాళ్ళ మావయ్య పెట్టిన షరతు, సుందరితో పెళ్ళి సంగతి చెప్తుంది. సిద్ధార్థ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కనుక, మావయ్య సాయం వద్దన్ని, సుందరిని పెళ్ళి చేసుకోనని చెప్పి వచ్చేశాడని అంటుంది. సిద్ధార్థ ఇష్టపడిన ఆ అమ్మాయి బిందూనా అని అడుగుతాడు. అవునంటుంది. కాసేపు ఇద్దరు బాల్యం గురించి మాట్లాడుకుంటారు. బిందూ సిద్ధార్థని ఆర్థికంగా ఆదుకోడానికి ముందుకు వచ్చిన సంగతి చెప్తుంది. చీకటి పడుతుండడంతో వారిద్దరూ నివాసాలకి బయల్దేరుతారు. ఇక చదవండి.]
అధ్యాయం-27
[dropcap]మ[/dropcap]న ఆప్తులనుకున్న వాళ్ళు మనం చేసిన ఏ మంచి పనైనా పొగడకుండా, చెడ్డ పనిని విమర్శించకుండా, నిందించకుండా ఉంటే మనలో ఆత్రుత, ఆరాటం, ఆరంభమవుతాయి. మన శ్రేయస్సు కోరేవారు ఎందుకు తటస్థంగా, మౌనంగా ఉంటున్నారు? అనే ఆలోచన మనల్ని వేదిస్తూనే ఉంటుంది. వాళ్ళు ఈ మౌనం మనల్ని భరించలేనిదిగా ఉంటుంది.
మన శ్రేయోభిలాషులు తను చేసిన పనిని, హర్షిస్తున్నారా లేదా అనే క్యూరియాసిటీ మనలో కలుగుతుంది. బిందు విషయంలో కూడా అదే జరిగింది. ‘తను సిద్ధార్థకి ఆర్థికంగా ఆదుకోవాలన్న విషయం కాలేజీలో అందరికీ తెలిసిన విషయమే. రవికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. అయినా అతను ఈ విషయం గురించి తననేం అడగటం లేదు’, ఇలా ఆలోచిస్తోంది బిందు.
“రవీ!” పిల్చింది. బిందు రవిని. ఉమాదేవిని రవి అక్కయ్య అని పిలుస్తాడు. తన అక్కయ్య ఇందిరకి ఆవిడికి ఏం తేడా లేదనిపిస్తుంది. అతనికి. బిందు కూడా అతడ్ని చనువుగా పేరు పెట్టే పిలుస్తుంది.
“నేను చేసిన పనిని గురించి తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నావు, నేను చేసిన పని నీకు తెలియదా?”
“నీవు చెప్పంది ఎలా తెలుస్తుంది?”
“నటించకు, నేను చెప్పకపోయినా నీకు తెలుసు.”
“నీ నోటితో చెప్తే వినాలని.”
“నేను, సిద్ధార్థకి ఆర్థికంగా సహాయపడాలనుకోవడం నీకు తెలియదా?”
“విన్నాను, అయితే ఈ విషయం మీ మమ్మీకి తెలుసా? ఆమె రియాక్షను ఏంటి?”
“మమ్మీకి ఈ విషయం తెలిసింది,” అన్న బిందు గంభీరంగా ఆలోచిస్తోంది.
***
బాల్యాన్ని తలుచుకుంటే ముందు మనకు గుర్తుకు వచ్చేది అమ్మ తాలూకా స్మృతులే. ఆ తరువాతే మిగిలినవి. అందరికీ బాల్యంలో అన్ని కోణాలలో ప్రేమతో పెనవేసుకునిపోయేది అమ్మ. తను ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నా పిల్లల కోసం తన బాధను గుండెల్లో దాచుకుని తన పిల్లల కోసం త్యాగపూరిత జీవితం గడపడానికి ప్రయత్నించిన అమ్మ ఎవరికైనా ఆరాధ్య దేవతే. పిల్లల ఆకలి సమయంలో అమ్మ ప్రాణమై నిలుస్తుంది. అనుకోకుండా అతిథులెవరైనా వస్తే అమ్మకా పూట పస్తులే. ఆటలాడుతున్నప్పుడు దెబ్బలు తగిలితే తల్లడిల్లిపోయేది అమ్మే. జ్వరం వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళేది అమ్మే. తనకి అక్షర జ్ఞానం లేకపోయినా అంతకు మించిన సంస్కార జ్ఞానంతో పిల్లల్ని చదివించేది అమ్మయే. బ్రతికినంత కాలం తన పిల్లల కోసం తల్లడిల్లేది అమ్మయే.
పేదరికంలో మగ్గినా, సుఖాలలో జీవించినా బాల్యంలో ప్రతీ తల్లీ తన పిల్లల కోసం చేసే త్యాగాలు అందరికీ జ్ఞాపకం వస్తూ మనస్సుని కదిలిస్తూనే ఉంటాయి. మన బాల్య జీవితంలో అమ్మకుండే అవినాభావ సంబంధం అలాంటిది. అలాంటి త్యాగమూర్తి అమ్మను జీవితంలో బాధలు పెట్టే పిల్లలు ఏ విధంగా క్షమాపణకి యోగ్యులు కారు. అమ్మ తలంపుకు వస్తే తన చేతుల్లో తన తలనిమిరిన భ్రమ కలుగుతూ ఉంటుంది. చెమర్చిన కళ్ళను తన కొంగుతో తుడిచినట్లు అనిపిస్తుంది.
తనకి తండ్రి ప్రేమ ఎలాగూ ఎండమావే. అమ్మె సర్వస్వం. ప్రతీ తల్లిదండ్రులూ తమ పిల్లలకి గోరు ముద్దలు తినిపించి, వినయ విధేయతలు, సంస్కారం, పరోపకార భావం నేర్పుతారు. తన తల్లి తనకి తానే తల్లీ, తండ్రీ అయి అన్నీ నేర్పింది. అలాంటి అమ్మని తను చీట్ చేసింది. తను చేసిన మోసం, దగా తలుచుకోడానికే తనకి కంపరంగా ఉంది. తన మీద తనకే అసహ్యం కలుగుతోంది.
తను తల్లికి తెలియకుండా తన బ్యాంకు బ్యాలెన్సు డబ్బు డ్రా చేసి సిద్ధార్థకి సహాయం చేయడానికి బ్యాంకుకి వెళ్ళింది. డబ్బు తీసుకుంది. ఆ సమయంలోనే ఇందిరా ఆంటీ బ్యాంకుకి వచ్చారు. మమ్మీకీ, ఆవిడికీ ఏ విషయంలోనూ అరమరికలు లేవు. ఒకరి కష్ట సుఖాలు మరొకరికి తెలుసు. చెప్పుకుంటారు. స్వంత అక్క చెల్లెళ్ళలా ఉంటారు. ఇందిరా ఆంటీ ఆ సమయంలో తనతో ఏం మాట్లాడలేదు. ఏం అడగలేదు. మమ్మీకి ఆవిడ ఈ విషయం చెప్పి ఉంటారు. అందుకే మమ్మీ తనతో “పాపా! నాకు తెలియకుండా బ్యాంకు నుండి డబ్బు తీసుకునే పరిస్థితి ఏం వచ్చింది?” అడిగింది ఆమె సౌమ్యంగా కూతుర్ని. అలా సౌమ్యంగా అడిగినా ఆ మాటల్లో తీక్షణత తనకి అగుపించింది.
తను తడబడింది. ఏం జవాబు చెప్పాలో తెలియలేదు.
“నాతో కూడా చెప్పరాని విషయమా?”
మమ్మీ మాటలకి తనకి ఏడుపు వస్తోంది. కళ్ళల్లో కన్నీరు పైకుబకడమే తరువాయి. తన తల మీద ప్రేమగా రాస్తూ “ఏంటి విషయం” అని అడిగింది మమ్మీ. తను ఏడుపు ఆపుకోలేక ఏడ్చేసింది. తన కన్నీళ్ళు తుడిచింది మమ్మీ.
“చెప్పమంటే ఏడుస్తావేఁటి? డబ్బు ఎందుకు బ్యాంకు నుండి తీసుకున్నావు?” ఉమాదేవి గొంతుకలో విసుగుదల కనిపించింది.
“సిద్ధార్థ చదువు సగంలో ఆగిపోకూడదని ఈ పని చేశాను మమ్మీ!” తల్లి వేపు సూటిగా చూసే ధైర్యం లేక తలవొంచుకునే ధైర్యం తెచ్చుకుంటూ అంది తను.
“సిద్ధార్థ కోసమా? ఎవరు అతను?” తల్లి ప్రశ్నించింది. అప్పుడే వచ్చిన శకుంతల ఉమాదేవికి సిద్ధార్థ విషయం వివరించింది. శకుంతల చెప్పిన మాటలు విన్న ఉమాదేవి ఆలోచన్లలో పడింది.
‘నిన్న గాక మొన్న కాలేజీలో పరిచయం అయిన సిద్ధార్థ అంత దగ్గరయ్యాడా? తన కూతురు కాలేజీలో చేరి ఎక్కువ రోజులు కూడా అవలేదు. ఈ వయస్సులో ఆడ మగ మధ్య ఆకర్షణ ఉంటుంది. అది కాదనలేని సత్యం. ఆ ఆకర్షణను ప్రేమ అనుకుని భ్రమలో బ్రతకడం, ఆ భ్రమలో అనుచితమైన నిర్ణయాలు తీసుకోవడం తనకి నచ్చటం లేదు. తన జీవితంలా కూతురు జీవితం అవకూడదు. సిద్ధార్థకి ఆర్థికంగా సహాయం చేయడానికి బిందు ప్రయత్నిస్తోంది. అదీ ఆ విషయం తనకి తెలియకుండా. అంటే తన కూతురు తననే మోసం చేస్తోందన్నమాట ఆకర్షణలో పడి’. ఉమాదేవి ఆలోచనా ప్రపంచం నుండి బాహ్య జగత్తులోకి అడుగుపెట్టింది.
“నీవు చేయబోతున్న పని నాకు నచ్చలేదు పాపా! నీకు చాలా బంగారు భవిష్యత్తు ఉంది. డబ్బు సాయం చేస్తే చేశావు కాని వ్యామోహం, ఆకర్షణలో పడి ఆ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోకు. డబ్బు పోతే తిరిగి సంపాదించ వచ్చు కాని నాశనం అయిన భవిష్యత్తుని తిరిగి సరిచేసుకోవడం చాలా కష్టం.”
“క్షమించు మమ్మీ!” తను అంది.
“క్షమించేను కనకే ఇలా శాంతంగా మాట్లాడుతున్నాను. నీ తప్పును క్షమిస్తున్నాను. లేకపోతే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇప్పటికేనా చదువు మీద దృష్టి పెట్టు. కాలేజీలో ఎందుకు చేరేవో, నీ లక్ష్యం ఏంటో గుర్తుంచుకో!” అంది ఉమాదేవి కూతురితో.
***
“ఏంటి బిందూ ఆ ఆలోచన? మాట్లాడకుండా,” అన్నాడు రవి. ఆలోచనా స్రవంతిలో కొట్టుకుపోతున్న బిందు బాహ్య జగత్తులోకి అడుగు పెట్టింది. తన తల్లికి ఈ విషయం తెలిసిన విధానం వివరించింది బిందు రవికి. “మా అక్కయ్య మీ మమ్మీకి ఈ విషయం చెప్పిందన్న మాట. అయితే మా అక్కయ్య మీద నీకు కోపం వచ్చి ఉంటుందే?”
“ఛ..! ఆంటీ మీద నాకు ఎప్పుడూ చెడు అభిప్రాయం లేదు. కోపం అంత కన్నా లేదు. ఆవిడ నా శ్రేయస్సు కోరే మమ్మీతో చెప్పారు.” అని, “రవీ! నేను చేసింది తప్పా?” అంది.
“తప్పు అని నేను చెప్పలేను. అయితే మనం చేసిన కొన్ని పనులకి మాత్రం పెద్దవాళ్ళ అనుమతి తప్పకుండా ఉండాలి. వాళ్ళ కళ్ళు కప్పి పని చేసినా మనకే చెడు ఎదురవుతుంది. శ్రేయస్కరం కాదు అది మనకి.”
“మరో పర్యాయం అలా జరగదని చెప్తున్నానా?”
“సిద్ధార్థ అంటే నాకు కూడా చాలా అభిమానమే. మేమిద్దరం ఒకే చెట్టు పక్షులం. ఇద్దరం మంచి స్నేహితులం కూడా. అతని చదువు మధ్యలో ఆగిపోబోతోందన్న విషయంలో క్షోభపడిన వాళ్ళలో నేనూ ఉన్నాను. ఏ విధంగా అతనికి సహాయ పడలేకపోతున్నాన్నానే అని మథనపడే వాళ్ళలో నేనూ ఉన్నాను. అతనికి మంచి జరగాలని ఆకాంక్షించే వాళ్ళలో నేను ఉన్నాను. అలాంటి సిద్ధూకి నీవు సహాయపడ్తూ ఉంటే నేను హర్షించనా? అయితే నీవు సహాయం చేసే పద్ధతినే హర్షించలేకపోతున్నాను.” అన్నాడు.
“సిద్ధార్థ పరిస్థితి విడమర్చి మీ మమ్మీకి చెప్పి ఆవిడ్ని ఒప్పించి ఉంటే బాగుండేదని నా భావన,” తిరిగి అన్నాడు.
“నిజమే! ఆ సందర్భం అటువంటిది. అలాంటి సమయంలో నాకు ఆ ఆలోచన రాలేదు రవి.”
“అయిదేదో అయింది, ఇప్పుడేనా ప్రతీ అడుగూ ఆలోచించి వెయ్యి.”
“అలాగే!”
ఇద్దరూ సిద్ధూ కోసం – అతని భవిష్యత్తు కోసం ఆరాటపడిన వాళ్ళే.
అధ్యాయం-28
నిరాశకు లోను కాని జీవితం ఉండదు. అయినప్పటికీ చాలామంది నిరాశ వాతావరణం నుండి బయటపడ గలుగుతున్నారు. కొద్దిమంది మాత్రం నిరాశలో నిండి మునిగిపోతున్నారు. ఒత్తిడికి లోనవుతూ కృంగిపోతున్నారు. నిరాశలో చతిగిలబడ్డం కాదు మనం చేయవలసింది. ఆశని పెంపొందించుకోవాలి. ఆశతో జీవించాలి. దాన్ని ఆలంబనం చేసుకుని ముందుకు సాగాలి. అభద్రతా భావానికి గురి కాకుండా వర్తమానాన్ని విశ్వసించగలగాలి.
జీవన గమనంలో సంఘర్షణలు, పోరాటాలు తప్పవు. అయితే అటువంటి సమయంలో గెలుపు అసాధ్యం అనుకున్నవాడు కుంచించుకు పోవడం సహజం. లోపం తమదే అన్న తలంపుతో తలవంచుకు బ్రతికేయాలనిపిస్తుంది.
నిరాశా నిశ్శృహలతో కుంచించుకు పోకుండా మనస్సు విప్పగలిగితే ఆత్మవిశ్వాసంతో పరిష్కారం లభిస్తుందే తప్ప కుంగిపోతుంటే జీవితంపై ఏ మాత్రం వెలుగు పరుచుకోదు. నిరాశలన్నీ మలుపులే కాని ప్రతీ నిరాశా ఒక గమ్యం అని అనుకోకూడదు. నిరాశ ప్రయాణంలో ఒక భాగమే అని అనుకోగలిగితే ప్రయాణాన్ని అర్ధాంతరంగా ముగించాల్సిన అవసరం ఉండదు.
నిరాశగా కూర్చుని మిన్నుకుండడం వల్ల నిరాశ మటుమాయం కాదు. తలుపులు బిగించుకుని కూర్చున్నంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. కాస్త బయటకు వచ్చి ఆలోచిస్తే మనస్సులో సైతం ఆశ, ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తళుక్కుమంటుంది.
సిద్ధార్థ పరిస్థితీ నిరాశ, నిశ్పృహల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తను చదువు ఆపు చేసి వెళ్ళిపోవడానికి తీర్మానించుకుని సామాన్లు అన్నీ సర్దుకున్నాడు. అతని మనస్సు చికాకుగా ఉంది. అశాంతిగా ఉంది. భూతకాలం కంటే భవిష్యత్, వర్తమాన కాలం పరిస్థితులే అతడ్ని చికాకు పరుస్తున్నాయి. తన పరిస్థితి తనకే అగమ్యగోచరంగా తయారయింది. వర్తమానం గజిబిజిగా ఉంది. భవిష్యత్తు శూన్యమనిపిస్తోంది.
తన మీద తనకే కోపం వస్తోంది. ఆత్మగౌరవం ఆత్మాభిమానం అంటూ గిరి గీసుకుని ఉన్నన్ని రోజులూ తన బ్రతుకు ఇలాగే ఉంటుంది. తను మాత్రం గిరి దాటి బయటకు రాలేదు. రావడానికి ప్రయత్నం చేయడు కూడా. తను నోరు విప్పి అడుగుతే తనకి ఆర్థికంగా సహాయం చేయడానికి ఇద్దరు ముగ్గురేనా కాలేజీలో ఉన్నారు కాని, తన ఆత్మాభిమానం, ఆత్మగౌరవమే అడ్డుపడ్తున్నాయి.
తనేం తప్పు చేయలేదు. వాస్తవాన్నే తెలియజేసాడు. ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలే కాని, ఏదో తప్పు చేసినట్లు అపరాధ భావనతో వేగిపోకూడదు. ఇది ఆత్మవిశ్వాసానికి ప్రతీక. మన నుండి పుట్టుకొచ్చిన కొన్ని భావాలను అశక్తులుగా మలుచుకోకుండా సంయమనంతో వర్తించటం వల్ల సంతృప్తితో కూడిన జీవితం సాధ్యమవుతుంది. దీని కంతటికీ మనం చేయవల్సిందల్లా వాస్తవాన్ని అంగీకరించడమే.
“ఏంటండోయ్! బిచాణా ఎత్తేసి వెళ్ళిపోదామనే అన్ని సామాన్లు ఇలా సర్దుకుని కూచున్నారు,” శకుంతల అంది సిద్ధార్థతో నవ్వుతూ. కాలేజీకి అతను రాకపోయేసరికి బిందు, శకుంతల మధ్యాహ్న క్లాసులకి వెళ్ళకుండా సిద్ధార్థ రూమ్‌కి వచ్చారు. వాళ్ళు వచ్చేప్పటికి అతను ఆలోచనా ప్రపంచంలో మునిగి తేలుతున్నాడు. బిందుని, శకుంతలని చూసి ఒక్కసారి ఉలిక్కిపడి ఆలోచనా ప్రపంచం నుండి బయటపడ్డాడు.
“చదువు మానేసి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఉండడం ఎందుకు? రూమ్ రెంటు దండగ,” నవ్వుతూ అన్నాడు.
“అయితే చదువుమానేసి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయినట్లేనా?”
“అవును.”
“బావా!” గంభీరంగా పిల్చింది శకుంతల. వారిద్దరి వేపు చూస్తూ నిలబడిపోయింది బిందు.
“ఏంటి శకూ?”
“ఓ సందర్భంలో మీరు నాకు, నా మాట వింటానని మాటిచ్చారు గుర్తుందా?”
“ఆఁ గుర్తుంది. అయితే నీవు కోరబోయే కోరిక నాకు ఇబ్బందికరంగా ఉండకూడదు. నా ఆత్మగౌరవానికి భంగం వాటిల్లకూడదు.”
“నేను కోరే కోరిక మీకు అయిష్టమయినా నెరవేరుస్తానని నాకు మాటివ్వాలి.”
“ప్రయత్నిస్తాను.”
“ప్రయత్నిస్తాను అని కాదు. ఆచరిస్తాను అని అనాలి. నేను చేయబోయే పని – చెప్పే మాటలు మీ భవిష్యత్తుతో ముడిబడి ఉన్నాయి. నేను చెప్పినట్లు నడుచుకుంటే భవిష్యత్తు బంగారు బాట అవుతుంది.”
శకుంతల మాటలు సిద్ధార్థకి అర్థం కావటం లేదు. అయోమయంగా ఆమె వంక చూస్తున్నాడు. శకుంతల బిందు చేతిలోని బ్యాగు తీసుకుని నోట్ల కట్టల్ని ఎదురుగా టేబులు మీద ఉంచింది. ఆ నోట్ల కట్టలు చూడగానే విష నాగును చూసినట్లు అదిరిపడ్డాడు. అయోమయంగా శకుంతల వేపు చూస్తూ “ఇదేంటి?” అయోమయంగా అడిగాడు. అతని గొంతుకలో, ముఖంలో కంగారు చిహ్నాలు అగుపడ్డాయి.
“బావా! మీ చదువు ఆగిపోకూడదని బిందు చేసిన సాహస కార్యం ఇది. తను బ్యాంకులో దాచుకున్న డబ్బును తీసి మీ చదువుకు సహాయం చేస్తోంది.”
“బిందు నాకు డబ్బు సహాయం చేయడమేఁటి?” ఇలా అంటూ అతను బిందు వేపు చూశాడు. డబ్బు తీసుకోవాలంటూ ప్రాధేయపడ్తున్నట్లు చూసింది బిందు అతని వేపు. చప్పున తన చూపుల్ని ప్రక్కకి త్రిప్పుకున్నాడు. ఆమె వేపు చూస్తే ఆమె అభ్యర్థన తను కాదనలేదు. ఇలా ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం తన ఆత్మ సాక్షికి విరుద్ధం.
ఆత్మాభిమానం, ఆత్మగౌరవానికి విరుద్ధం.
“క్షమించు శకూ!”
“నాకిచ్చిన మాట నిలబెట్టుకోలేరా?”
“నీ మాటల్తో నన్ను కట్టిపడేస్తున్నావు. దీని వలన ఎన్నో సమస్యలు వస్తాయి తెలుసా?”
“ఏమిటా సమస్యలు?”
“ఈ విషయం బిందూ వాళ్ళ మమ్మీకి తెలిస్తే.”
“తెలుసు.”
“తెలుసా? అయితే ఆవిడ ఒప్పుకుందా? నా గురించి ఆమె బాడ్‌గా అనుకోలేదు కదా!”
“ఆమె మీ గురించి ఏం అనుకోవడం, ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం ఆ విషయాలన్నీ అలా ఉంచండి. ఈ విషయాలన్నీ బిందే చూసుకుంటుంది. వీటి అన్నిటికీ ఆమె బాధ్యత తీసుకుంటుంది. ఏ సమస్యా రాకుండా చూసుకుంటుంది. అంతగా మీ ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి అవమానం జరుగుతోందని అనుకుంటే అప్పుగా తీసుకోండి. జీవితంలో స్థిరపడిన తరువాత ఆ అప్పును తీర్చెయండి. అదీ ఇష్టం లేదా? మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పనులు ఆచరించక తప్పదు. ఇదే మానవ జీవితం.”
“శకూ నన్ను ఏం మాట్లాడలేని అసమర్థుని చేసేస్తున్నావు,” అన్నాడు. బిందు దగ్గర డబ్బు తీసుకోవడం తనకిష్టం లేదు. తీసుకోకపోతే బిందు బాధపడుతుంది. ఆమె బాధపడ్తూ ఉంటే తను చూడలేడు. సహించలేడు.
‘మన ఉజ్వల భవిష్యత్తు కోసం మన ఆలోచనలను, మనకు దూరంగా కొన్ని సందర్భాలలో తోసిపుచ్చవలసిందే. మంచి మనుగడ కోసం రాజీపడవల్సిందే. శాశ్వత విలువల ముందు తాత్కాలిక నిర్ణయాలు మార్చుకోక తప్పదు. మన ఆలోచనలలో కొన్నింటిని మనమే తుంగలో తొక్కడం వల్ల కొన్ని అనుకూల పరిస్థితుల విపత్కర సందర్భాల నుండి క్షేమంగా బయటపడగలుగుతాం.’ ఇలా సాగిపోతున్నాయి సిద్ధార్థ ఆలోచన్లు.
“ఏంటి ఆలోచన్లు బావా!”
ఆలోచన్లు నుండి బయటపడ్డ అతను “అయితే సరే! మీరు అలా చెప్తున్నప్పుడు కాదనలేక పోతున్నాను. అయితే ఒక షరతు. నేను డబ్బును అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను.”
“అలాగే బాబూ! అమ్మయ్య. ఇంకా మీరు అంగీకరిస్తారో లేదో అని గొప్ప టెన్షనులో చచ్చాం. కథ సుఖాతమయింది,” నవ్వుతూ అంది శకుంతల.
ఈ టెన్షను అనేది ప్రతీ మనిషిలో ఏదో ఒక సందర్భంలో కలుగుతుంది. ఇది సహజం కూడా. తన అనుకున్నది తీరినప్పుడు ఆ టెన్షను మబ్బుల మాటున మరుగయిన చందమామలా తొలగిపోతుంది.
“నీవు చేసిన ఈ ఉపకారం వలన నీకు నేను జన్మాంతం ఋణపడి ఉంటాను. ఈ ఉపకారం మరో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలోనూ మరిచిపోలేను బిందూ!” సంతోషంతో వచ్చిన ఆనంద భాష్పాలు కళ్ళల్లో తొణికిసలాడుతుండగా అన్నాడు.
“బిందుని ములగ చెట్టు ఎక్కించేస్తున్నారు,” నవ్వుతూ అంది శకుంతల.
“ఏదో ఉడతా భక్తిగా సహాయపడ్డాను” నోరు పెగుల్చుకుని అంది బిందు.
“ఇది ఉడతా భక్తి సహాయం కాదు. ఒకరి జీవితాన్ని నిలబెట్టిన గొప్ప సహాయం. అయితే మీ అమ్మగారు నిన్ను ఏం అనరు కదా!” బిందు వేపు కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ అన్నాడు సిద్ధార్థ.
“మమ్మీకి నేను సర్ది చెప్తాను సిద్ధార్థ గారూ! నా అభ్యర్థన మన్నించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది,” అతని వంక కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ అంది బిందు. అతని పరిస్థితీ అంతే.
“మీరిద్దరూ ఒకర్ని మరొకరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉండి పోవడం కాదు ముందు జరగబోయే పని, చేయవల్సిన పని గురించి చూడండి,” హెచ్చరిస్తూ అంది శకుంతల.
“అలాగే శకూ!” అన్నాడు సిద్ధార్థ వారిద్దర్నీ సాగనంపుతూ.
(ఇంకా ఉంది)