[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘దివ్యమైనది భక్తి యోగం’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]ప్ర[/dropcap]పంచంలో వివిధ ఆధ్యాత్మిక గురువుల ద్వారా ప్రతిపాదించబడిన అనేక యోగ సాధనలు ఇప్పుడు ప్రాచుర్యంలో వున్నా అన్ని – యోగ సాధనల పరమావధి భక్తి యోగంలోనే వున్నాయి. మరొక విధంగా చెప్పాలంటే అన్ని యోగ సాధనలు భక్తి అనబడే కేంద్ర బిందువుకు చేరేందుకు సాధనాలు మాత్రమేనని భగవానుడు భగవద్గీతలో ధ్యానయోగం అనబడు ఆరవ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు.
భక్తి అంటే భగవంతుని పట్ల ఏర్పడే దివ్యమైన ప్రేమ. ఇది దైవిక అనుబంధం యొక్క స్వభావం. ఇది ఒక రకమైన అనుబంధం. అయితే ఇతర అనుబంధాల వలే ఇది మానవులను అనురాగ పాశాలతో బంధించలేదు కాని విముక్తులను చేస్తుంది.
నారద భక్తి సూత్రాలలో నారదుడు భక్తి అంటే ఏమిటో అత్యద్భుతంగా వివరిస్తాడు. భక్తి అంటే భగవంతుని పట్ల తీవ్రమైన ప్రేమ. ఒక వ్యక్తి దానిని పొందినప్పుడు, అతను అందరినీ ప్రేమిస్తాడు, ఎవరినీ ద్వేషించడు; అతను శాశ్వతంగా సంతృప్తి చెందుతాడు. నిత్యం పరబ్రహ్మానంద స్థితిలో పారవశ్యం పొందుతూ వుంటాడు. ఐహికపరమైన కర్మలు చేస్తున్నా, భౌతిక ప్రపంచంలో తనకు నిర్దేశించబడిన కర్తవ్యాలను నెరవేరుస్తున్నా అతని దృష్టి అంతా భగవంతునిపైనే కేంద్రీకరించబడి వుంటుంది.
ఈ ప్రేమను ఏ భూసంబంధమైన ప్రయోజనానికి తగ్గించలేము. ఎందుకంటే ప్రాపంచిక కోరికలు ఉన్నంత కాలం, అలాంటి ప్రేమ రాదు. కర్మ జ్ఞానం , యోగా కంటే భక్తి ఎంతో గొప్పది.
భగవానుడు భగవద్గీతలో మరొక శ్లోకంలో అంత్యకాలంలో ఎవరైతే నన్నే స్మరిస్తారో, అంటే శరీర త్యాగం చేసే సమయంలో వారు నా భావాన్ని పొందుతారు. ఇందుకోసం శ్రీరాముడనో, శ్రీకృష్ణుడనో ఈశ్వరుడనో, గణేశుడనో ఏ రూపంగా నైనా స్మరించవచ్చు. ఎవరు మరణ మాసన్నమైనప్పుడు పరమాత్ముడినే స్మరిస్తారో వారు పరమాత్ముడినే పొందుతారు. ఇందులో ఇసుమంతైనా సందేహం లేదు.
అయితే ఇటువంటి మానసిక స్థితి పొందడం కోసం యిక్త వయస్సు నుండే భగవంతుని పట్ల నిశ్చల భక్తి కలిగి ఉండటం ఎంతో అవసరం. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మన భక్తి చలించకుండా సదా నిశ్చల దీపం వలే నిలుపుకోవడం ఎంతో అవసరం.
కాబట్టే ఆధ్యాత్మిక వేత్తలు ఏ సాధకుడైతే భక్తి యోగాన్ని అభ్యసించి దానిలో ఒక్కొక్క మెట్టే ఎక్కగలిగాడో అతను అన్ని యోగాలను అతిశయించినవారిగా పరిగణిస్తారు.