[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘బంధాలన్నీ.. రుణానుబంధాలే!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]గుం[/dropcap]డె లోతులన్నీ ఘనీభవించాయి!
ప్రేమానుబంధాల తేమ..
మమతానురాగాల తడి..
గుండె గోడలపై మచ్చుకైనా లేవు!
నాలుగు గోడల నడుమ
యాంత్రిక జీవనమే అందరిదీ!
తనకు అందరూ ఉన్నారనే నిజం భౌతికమైతే..
ఎవ్వరూ లేరనే నైరాశ్యం
హృదయమంతా నిండి వుంది!
సంతోషాలు ఒక్కొక్కటిగా వస్తే
దుఃఖాలు గుంపులుగా వచ్చి..
అంతరంగంలో బాధను
హృదయంలో వేదనను
రగిల్చి వెళ్తున్నాయి..!
అందరూ ఆశావహంగానే కనిపిస్తారు గానీ..
లోలోపల తీవ్రమైన అంతర్వేదనలు
అల్లిబిల్లిగా అల్లుకొని..
మానస సరోవరంలొ
అలజడులెన్నో చెలరేగుతున్నాయి!
హృదయం ఎడారిలో భగభగల మంటలు..
ఆ ఆవేదనా జ్వాలలను తడిపేందుకు
ఏరులై పారుతున్న దుఃఖ ధారలు..
కాలిపోతున్న గుండె లోపలి నుండి
ఎగదన్నుకుంటూ వస్తోన్న పొగలు..
ఉక్కిరిబిక్కిరై అలమటిస్తోన్న దుస్థితిలో
ప్రేమతో లాలించే హృదయాలు..
సానుభూతితో గుండెలకు హత్తుకునే చేతులు..
కరువైపోయాయి చుట్టూ వున్న ప్రపంచంలో!
ఈ ఆధునిక వ్యవస్థలో..
అన్నీ ఇచ్చిపుచ్చుకోడాలే!
మనతో కలిసి బ్రతికే జన సమూహమే కాదు..
బంధాలు.. రక్త సంబంధాలు
కన్నవాళ్ళు.. కడుపున పుట్టినవాళ్లు
అందరిదీ వ్యాపార దృక్పథమే!
మానవ జీవనయానం కడవరకూ
గమ్యం తెలియని ప్రయాణమే!
ఈ బ్రతుకంతా బాకీలు తీర్చడానికేనని..
మనిషికీ మనిషికీ మధ్య నడయాడేది
రుణానుబంధమేనని..
ఒకరికి మరొకరు
బాకీలు తీర్చుకొని
ఎవరి లోకానికి వారు
పయనమైపోతారని..
కట్టకడపటి మజిలీ
మృత్యుగహ్వరమేనని..
గ్రహించలేని మనిషి
బ్రతుకంతా ఆరాట పోరాటాలతో
ప్రతి రోజూ..
ప్రతీ క్షణమూ..
చస్తూనే బ్రతుకుతున్నాడు!