విదేశీ రోగం

0
4

[శ్రీ రాజ మోహన్ ఇవటూరి రాసిన ‘విదేశీ రోగం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]ప్పుడే విమానం దిగాను. విదేశ యానం మొదటిసారి. విమాన ప్రయాణం కూడా మొదటిసారే. బయటికి రాగానే చలిగాలి గుప్పుమని తగిలింది. ‘అయ్యో చలి తట్టుకోవటానికి సరైన బట్టలు కూడా తెచ్చుకోలేదు ఎప్పుడు పరిస్థితి ఏమిటి?’ అనుకున్నాను.

ఇంతలోనే నా పేరు రాసిన ఒక అట్టముక్క పట్టుకుని ఒక మనిషి కనిపించాడు. నన్ను చూడగానే “నమస్తే వెంకట్” అని పలకరించాడు ఆ శ్వేత జాతీయుడు. ఎటు పోవాలో అని తికమకపడుతుండగా అతను కనిపించి హమ్మయ్య అనుకున్నాను.

అతను నా పెట్టె అందుకుని తన వాహనం వెనక పెట్టి “నేనే పీటర్. మీ ప్రయాణం బాగా సాగిందా?” అన్నాడు.

పీటర్ అంటే నాకంటే రెండు అంచెలు పెద్ద స్థాయిలో ఉన్న ఉద్యోగి. చరవాణిలో మాటాడటమే తప్ప ఇదే మొదటి సారి చూడటం. అతనే స్వయంగా నన్ను కలిసి నన్ను అతిథి గృహానికి తీసుకుపోవటం వింత అనుభవం.

ఆ రోజు శనివారం కనుక నేను కొంత విశ్రాంతి తీసుకోవచ్చని చెప్పి పీటర్ వెళ్ళిపోయాడు. మూడు గంటల తర్వాత వచ్చి “పదండి. భోజనానికి వెళ్తాము” అన్నాడు.

పాపం నా కోసం సెలవు రోజంతా గడుపుతున్నాడు అని మొహమాటపడినా అతను లేకపోతే ఆ దేశంలో ఇబ్బందే కదా అని ఊరుకున్నాను.

మంచి భోజనం పూర్తిగా శాకాహారంతో చేస్తుంటే “ఒకసారి మీ ప్రవేశ పత్రం (పాస్‌పోర్ట్), మీ టికెట్ ఇవ్వండి. మీరు ఈ దేశానికి వచ్చిన తర్వాత చేయవలసిన ఒకటి రెండు లాంఛనాలు ఉన్నాయి” అన్నాడు. నేను చూపించిన పత్రాలు చూసి ఎవరినో చరవాణిలో పిల్చి చేయవలసిన పని చెప్పాడు. మేము ఆ పనులు ముగించుకుని వసతికి బైలు దేరాం.

దారిలో “మీరు ఈ నగరంలో ఏమైనా చూడాలంటే సాయంత్రం తీసుకు వెళ్తాను” అన్నాడు.

“అలాగే” అని చెప్తూనే “అరె. నా పత్రాలు అక్కడే మరిసిపోయినట్టున్నాను” అన్నాను కంగారుగా. పాస్‍పోర్ట్, టికెట్ లేకుండా ఇక్కడెలా బతుకుతాం?

“అయ్యో” అని పీటర్ ఒక క్షణం ఆలోచించి “మనం ఆ ఫలహారశాలని వదిలి రెండు గంటలు పైగా అయింది కదా! మీ వసతికి వెళ్లి అవసరమైతే అక్కడ నుంచే ఏం చెయ్యాలో ఆలోచిద్దాం” అన్నాడు.

ముఖ్యమైన పత్రాలు పోతే ఇతను ఇంత నిశ్చింతగా ఉన్నాడేమిటి అనుకున్నా గానీ నా అంతట నేను ఏమీ చేయలేని పరిస్థితి.

మా వసతికి వెళ్లి నా గది తాళం కోసం అడగగానే “మిస్టర్ వెంకట్. మీ కోసం ఈ వస్తువు ఎవరో ఇచ్చారు” అంటూ ఆ ఉద్యోగి చిన్న కాగితం సంచి అందించాడు. ఒక్కసారి నా కళ్ళు మెరిసాయి. అందులో నా దస్తావేజులన్నీ డబ్బులతో సహా ఉన్నాయి.

పీటర్ నవ్వుతూ “ఈ దేశంలో వారికి పనికిరాని వస్తువులు ఎవరూ తీసుకోరు. మీరు ఇందాక ఆందోళనగా ఉన్నట్టు గమనించాను గానీ మీకే తెలుస్తుందని ఎక్కువ మాటాడలేదు” అన్నాడు.

అతనికి మనసారా ధన్యవాదాలు చెప్పాను.

అతను అన్నట్టే సాయంత్రం నగరంలోకి వెళ్లాం. నేను చలి కాలం దుస్తులు లేకుండా తెల్ల కుర్తా పైజామాలో ఉన్నాను. చలి ఎక్కువగా ఉన్నా భరిస్తూ తిరుగుతున్నాం. ఎక్కడైనా ఉన్ని దుస్తులు కొనాలని అనుకుంటూ తిరుగుతుంటే “వారు మీ ప్రాంతం వారే అనుకుంటా” అంటూ ఇద్దరు దంపతులని చూపించాడు పీటర్.

“నమస్తే పీటర్” అంటూ వాళ్ళు పలకరించారు.

“నమస్తే” అని అభివాదం చేసి “ఇతను మీ ప్రాంతం వారే. ఈరోజే వచ్చారు” అన్నాడు పీటర్.

సంభాషణ ఎలా మొదలు పెట్టాలా అనుకుంటుంటే “అప్పుడే ఇతనికి ఒక వింత అనుభవం అయ్యింది. పాస్‌పోర్ట్ పోయింది” అని సరదాగా అన్నాడు పీటర్.

నేను కూడా నవ్వేసి వారు నా దేశస్థులు అయినా ఏ రాష్ట్రం వారో తెలియదు కనుక ఆంగ్లంలో “మీరు ఎక్కడ ఉంటారండీ” అన్నాను.

అతను నేను పలానా సంస్థలో పనిచేస్తున్నాను అని జవాబు చెప్పి ఇంకా ఏదో చెప్పేలోపల అతని భార్య “ఈ వంగదేశం గాడు ఇంకో రెండు నిముషాల్లో వెయ్యో రెండు వేలో యూరోలో ఇమ్మంటాడు. నువ్వు ఏడుస్తూ ఇచ్చేస్తావు. సంభాషణ ఆపి పద” అంది. (నా తెల్ల కుర్తా పైజామా చూసి నన్ను బెంగాలీ అనుకున్నారన్నమాట)

“అంత లేదులే. వీడు ఆ ధోరణిలో మాటాడేలానే ఉన్నాడు, పాస్‌పోర్ట్ పోయిందన్నాడు. ఇంకాసేపయ్యాక అసలు విషయంలోకి వస్తాడు” అన్నాడు.

ఎదురుగా తమ దేశస్థుడిని నిలబెట్టి దంపతులు స్వభాషలో ఏదో మాటాడుకుంటుంటే ఆశ్చర్యంగా పీటర్ చూస్తుంటే “మనం వెళదాం పీటర్. నాకు ఉన్ని దుస్తులు అత్యవసరంగా కావాలి” అన్నాను.

ఆ దంపతుల ముఖంలో వెలుగుకి వర్ణన దొరకదు.

సరే అని పీటర్ కదులుతుంటే నేను ఒక క్షణం ఆగి “మీకు ఐదో పదో వేలు యూరోలు కావాలంటే నా హోటల్‌కి ఫోన్ చెయ్యండి. ఊరు గాని ఊళ్ళో ఆ మాత్రం సాయం చేస్తా లెండి” అని తెలుగులో అన్నాను.

ముఖంలో రక్తం చుక్క లేనట్టు పాలిపోయిన వారిని చూడటం ఇష్టం లేక ముందుకు కదిలాను.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here