(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)
[డాక్టర్ శ్రీధర్‍తో మాట్లాడుతుంది మహీ. కుసుమ భర్త తెచ్చింది ఫేక్ సర్టిఫికెట్ అని ఆయన చెప్తారు. కుసుమ బతుకులో నిప్పులు పోసినట్టేగా అని అంటుంది మహీ. కానీ భర్తతో వెళ్లడానికి కుసుమ ఒప్పుకుందని ఆయన చెప్తారు. ఆమె విషయంలో మనమేం చేయలేమని అంటారు. తాతయ్య పాటించాల్సిన డైట్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహీకి చెప్పి పంపుతారు శ్రీధర్. మహీ ఇంటికి వెళ్ళేసరికి హగ్గీ పాట పాడుతూంటాడు. ఆ పాట అయిపోయాకా, మహీని పాడమంటాడు వాళ్ళ నాన్న. చక్కగా పాడుతుంది మహీ. అది విన్న తాతయ్య, మహీదంతా అమ్మమ్మ పోలికంటూ చెప్పి, అమ్మమ్మ కూడా చక్కగా పాడుతుందని అంటాడు. అమ్మమ్మ భానుమతిగారి పాట పాడుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. కాసేపు అంతా పాటలు పాడుకుంటారు. మర్నాడు కుసుమ భర్తతో వెళ్ళిపోతుంది. కారు ఇంటి ముందు నుంచే వెళ్ళినా, మహీ వైపు చూడదు కుసుమ. అత్తగారిని, మామగారిని తమ ఊరికి తీసుకువెళ్ళేందుకు ఒప్పిస్తాడు మహీ నాన్న. తాతయ్య ఇంట్లోకి షిఫ్ట్ అయ్యేందుకు డాక్టర్ శ్రీధర్‍ని ఒప్పిస్తుంది మహీ. వాళ్ళు ఓ రెండు గదులు ఉంచుకుని, మిగతా ఇంటిని డాక్టరు గారికి ఇస్తారు. శ్రీధర్ గారు ఆ ఇంట్లో దిగాకా, అమ్మమ్మనీ తాతయ్యనీ తీసుకుని ఊరు వెళ్తుంది మహతి. చదువుతో పాటు మ్యూజిక్ మీదా శ్రద్ధ పెడుతుంది మహీ. ఓ రోజు కాలేజీ ప్రేయర్ టైమ్‍లో ప్రిన్సిపాల్ గారు సంపూర్ణదేవి అనే సంగీతం టీచర్‍ని పరిచయం చేస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆమె దగ్గర శిక్షణ పొందవచ్చని చెప్తారు. కొన్ని చిన్న చిన్న పరీక్షల అనంతరం ఆవిడ కొందరిని ఎంచుకుంటారు. ఆవిడ మహతిని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇంటికి వెళ్ళాకా, మహతి – సంపూర్ణదేవి గారి దగ్గర సంగీతం నేర్చుకునేందుకు తల్లిదండ్రుల అనుమతి తీసుకుంటుంది. తాతయ్య కూడా అందుకు ప్రోత్సహిస్తారు. రేణుక అనే అమ్మాయి స్వరం చిత్రమైనదని సంపూర్ణదేవి గారంటే, ఆ అమ్మాయి అపార్థం చేసుకుని క్లాసులకి రావడం మానేస్తుంది. రేణుక రావడం లేదేమని మహీని అడిగితే, రేణుక ఇల్లు ఇక్కడికి దగ్గరే అని చెప్పి వెళ్ళి రేణుకని పిలుచుకు వస్తుంది మహీ. రేణుక అపోహలని తొలగించి – సాధన చేస్తే చక్కని గాయనివవుతావని అంటారు సంపూర్ణ. మహీ క్లాస్‍మేట్ రేఛల్ పుట్టినరోజు వస్తుంది. కాలేజీ లోని ఫ్రెండ్స్ అందరినీ తన ఇంట్లో జరిగే పార్టీకి పిలుస్తుంది రేఛల్. వాళ్ళ నాన్నగారు అందరినీ పరిచయం చేసుకుని, తమ కుటుంబాన్ని పరిచయం చేసి, పార్టీని ఎంజాయ్ చెయ్యమని చెప్తారు. పార్టీ అయిపోయి, అందరూ ఇళ్ళకు బయల్దేరుతున్నప్పుడు భగవగ్దీత, ఖురాన్, బైబిల్ పుస్తకాలు తెప్పించి – ఎవరికి కావల్సినవి వాళ్ళని తీసుకోమని చెప్పి – వాటిని ఎందుకు చదవాలో వివరిస్తారు. మూడు పుస్తకాలని తీసుకుని వస్తుంది మహీ. వాటిని చూసి తానూ చదువుతానంటాడు తాతయ్య. ఆ మూడు పుస్తకాలని చదవాలని భావిస్తుంది మహీ. అయితే ముందు స్టడీస్ మీద దృష్టి పెట్టమని వాళ్ళమ్మ సలహా ఇస్తుంది. – ఇక చదవండి.]
[dropcap]“75 [/dropcap]రూపాయల ఫోల్డింగ్ స్టీలు కుర్చీ కేవలం 15 రూపాయలకే. 150 రూపాయల ప్రెజర్ కుక్కర్ 30 రూపాయలకే. వాటర్ బక్కెట్స్ నుంచి సోఫా సెట్స్ వరకూ, ఐరన్ బాక్స్ నుంచి డబుల్ ఫోం బెడ్ వరకూ అన్నీ అతి చవక ధరల్లో. నేడు కొనండి కూపన్లు.. సొంతం చేసుకోండి సామాన్లు”
ఎక్కడ చూసినా ఇవే పోస్టర్లు. రిక్షాల్లో, ఆటోల్లో, మైకు సెట్లలో ఇవే అడ్వర్‌టైజ్‌మెంట్స్. ఫ్రెండ్సందరం వెళ్లి చూశాం. ఓహ్, జనాలే జనాలు. పదిహేను టిక్కెట్ కౌంటర్లు. ఒక్కొక్క దాని ముందూ ఫర్లాంగు ఫర్లాంగున్నరో వున్నంత క్యూలు. లోపలికి పోయి చూసాం. గుట్టలు గుట్టలుగా సామాన్లున్నాయి, ధగధగలాడుతూ. రెండు వేల రూపాయల డబుల్ బెడ్ కావాలంటే 400 రూపాయల కూపన్స్ కొనాలి. 45 రోజుల తర్వాత డబుల్ బెడ్‌ని మీరు పట్టుకుపోవచ్చు. ఛైర్స్ లాంటి వైతే 30 రోజులు చాలు. 15 రూపాయలు కూపన్ కొంటే 30 రోజుల తర్వాత అది పట్టుకుపోవచ్చు. మేం చూస్తుండగానే లారీల్లో ఇంకా సామాన్లు దిగాయి. బ్రహ్మాండమైన స్టీలు బీరువాలూ, డ్రెస్సింగ్ టేబుల్సు, నిలువెత్తు మిర్రర్‌లు. చాలా ఎట్రాక్టివ్‌గా అప్పటికప్పుడు కొనేద్దామన్నంత ఇష్టంగా కనిపించాయి. రోజు రోజుకీ రద్దీ పెరుగుతోంది. ఒక్కొరోజు ఒక్కో గొప్ప ఉద్యోగినో, లోకల్ ప్రముఖుడినో చీఫ్ గెస్ట్‌గా పిలిచి సన్మానిస్తున్నారు. ‘సప్తగిరి హోం నీడ్స్’ వారు. ఓ కార్పోరేటర్ “కనీసం కొన్ని చిన్న వస్తువుల్ని20 రోజుల్లో ఇవ్వగలిగితే మీ బిజినెస్ ఇంకా బావుటుంది” అన్నాట్ట ఓ రోజు గెస్ట్‌గా వచ్చి.
అప్పటికప్పుడు సప్తగిరి హోం నీడ్స్ యాజమాన్యం వారు ఆ సలహాని మెచ్చుకుని ఎనౌన్స్ చేశారు. 75 రూపాయలకి (అనగా 15 రూపాయల కూపన్ కొన్న వారికి) వెంటనే సరుకు ఇచ్చేస్తామన్నారు. అన్నట్టుగానే ఆ మరుసటి రోజున 2500 కుర్చీలు (స్టీల్ ఫోల్డింగ్ చైర్స్) ఇచ్చేశారు. జనాలకి పిచ్చెక్కింది. నమ్మకం వెయ్యి రెట్లు పెరిగింది. ఇంట్లో వుండే బంగారు వెండి వస్తువుల్ని తాకట్టు పెట్టి మరీ వేలంవెర్రిగా కూపన్స్ కొనేశారు. సప్తగిరి వాళ్లు కూడా 150 లోపు సామాన్లని 25 రోజులకే ఇచ్చేయ్యడం మొదలెట్టారు. 15 రూపాయలకి 75 ఖరీదు చేసే వస్తువులు వస్తాయంటే జనాలు పరుగులెట్టక ఏం చేస్తారు. 30వ రోజున హుషారుగా జనాలు వెళ్ళారు. మొత్తం ఖాళీగా వుంది. రాత్రికి రాత్రే లారీలో సామానంతా షిఫ్ట్ అయిపోయింది. జనాలు గోల గోల. పట్టించుకునే నాథుడు లేడు.
‘సప్తగిరి హోం నీడ్స్’ మనుషుల నెత్తి మీదనే కాదు ఓ నగరానికే నెత్తిన టోపీ పెట్టింది. అప్పట్నించీ ఎవరో ఎవరేం చేసినా “ఏం.. సప్తగిరా?” అనేవాళ్ళు.
టోటల్‌గా లాభం పొందిన వాళ్ళు 2% అయితే నష్టపోయిన వారు 98%. ఘోరంగా వేలకి వేలు పెట్టి నష్టపోయినవారు 40% కన్నా ఎక్కువే.
“మోసానికి కారణం సప్తగిరో గోవర్ధనగిరో కాదు. మనసులోని అత్యాశే. పదిహేను రూపాయలకే 75 రూపాయల వస్తువు ఎలా ఇవ్వగలరూ? మనుషులు ఆలోచించరు. మనలోని అత్యాశ ఆలోచించనివ్వదు. ఇదే కాదు ఎవడో చెబుతాడు, మా బ్యాంకులో నూటికి నెలకి పదిహేను రూపాయలు వడ్డీ ఇస్తామని. అర్జంటుగా జనాలు అక్కడ మూగిపోతారు. అది సాధ్యమో కాదో ఆలోచించరు. ఇంకోడెవడో వచ్చి చిట్ ఫండ్స్ అంటూ మొదలెడతాడు. ఎన్ని సార్లు తలబొప్పి కట్టినా జనాలు చీటింగ్ చిట్స్‌ని మానరు. అంతా పోయాక లబోదిబో మంటూ గోలెడతారు. గవర్నమెంటు ఎలా కళ్ళు మూసుకుందాని నానా బూతులూ తిడతారు. ఈ తప్పు నీదా గవర్నమెంటుదా? ఎన్నికల్లో నిలిచిన వాళ్ళలో మంచి వారెవరో, వెధవ ఎవరో జనాలకి తెలీదా? తెలుసు. అయినా నోట్లకి కక్కుర్తి పడి ఓట్లు వేస్తారు. నోట్లు పంచి వాడు పంచిన దానికంటే పదింతలు సంపాదించి తీరతాడని తెలీదా? తెలుసు. అమ్మాయ్, అయినా కథ ఇలాగే సాగుతోంది. ఇలాగే సాగుతుంది కూడా!” నిర్వికారంగా అన్నారు వరలక్ష్మిగారు నాతో.
***
ఈ సప్తగిరి ఎపిసోడ్ ఎందుకు చెప్పానంటే, అది ఇతర్లకి ఏ పాఠం నేర్పిందో నాకు తెలీదు గానీ, నాకు మాత్రం దేన్ని తొందరపడి నమ్మకూడదనే పాఠాన్ని చక్కగా నేర్పింది.
అనంతలక్ష్మి ఎప్పుడూ మితభాషే. అతిభాషుల వల్ల పెద్ద ప్రమాదం వుండదు. ఎప్పటికప్పుడు వాళ్ళు మనసులో ఆలోచనల్ని నోటి ద్వారా ప్రవహింపచేస్తుంటారు. మితభాషుల బుర్రలో ఏముందో తెలుసుకోవడం అంత తేలిక కాదు. అనంతలక్ష్మి ఈ మధ్య మహా అణుకువగా మహా వినయంగా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా అన్నంత ప్రియంగా ప్రవర్తిస్తోంది. మొదట్లో ఆమె చాలా మంచిదనే మేమనుకున్నాం. తరవాత ‘తిమ్మూ’ని వేటాడటం చూసి దూరంగా వున్నాం. ఇప్పటి అల ప్రవర్తనకి అర్థం కాక బుర్ర పగలగొట్టుకుంటున్నం.
“చాలా ఎక్‌స్ట్రా స్వీట్‌గా వుంటుంది. ఎందుకో మాత్రం తెలీడం లేదు” అన్నది రేణుక.
“సారీ మహీ.. ఏదేదో.. పిచ్చిగా ప్రవర్తించాను. సారీ” అని ఓనాడు నాతో అన్నది అల.
“ఇట్స్ ఓకే” అన్నాను.
కాలం చాలా ఫాస్ట్‌గా గడుస్తోంది. ఆ మధ్య ఓ వారం క్రితం నేను తాతయ్య అమ్మమ్మా కర్రావురి వుప్పలపాడు వెళ్ళాం. డా. శ్రీధర్ గారు క్షణం తీరిక లేకుండా వున్నారు. ఫ్రంట్ రూంని ఎమర్జెన్సీ రూమ్‌గా మార్చారు. దాంతో రాత్రిళ్ళు కూడా పేషెంట్ల బెడద తప్పడం లేదు. మేమున్న రెండ్రోజులూ మా యింటి భోజనమే తీసికెళ్ళి ఇచ్చేదాన్ని.
“ఈ వూరు మంచిదే కానీ ఒకే ఒక్క ప్రాబ్లం. బయటి వూర్లనించి వచ్చి అడ్మిట్ అయ్యే పేషంట్ల తాలూకు వారికి కనీసం ఓ గంట రెస్టు తీసుకోవడానికైనా చోటు లేదు. పాపం. వాళ్ళు కారిడార్లో పడి వుండటం చూస్తుంటే బాధగా వుంది” అన్నారాయన.
అప్పటికప్పుడు తాతయ్య వడ్రంగినీ, తాపీ మేస్త్రిని పిలిపించి ఇంటి ముందున్న పెద్ద ఖాళీ స్థలంలో ఓ పేద్ద తాటాకు పాక వేయించి రెండు బాత్రూములూ, రెండు లెట్రిన్సూ కట్టి, నులక మంచాలు కుర్చీలు ఏర్పాటు చేయమని వాళ్ళకి పురమాయించాడు. పదివేలు డబ్బు కూడా ఇచ్చాడు.
“ఏంటి తాతయ్యగారూ ఇదీ!” ఆశ్చర్యంగా అన్నారు డా. శ్రీధర్.
“బాబూ, సంపాయించింది చాలు. కనీసం రోగులతో వచ్చే వారు కాసేపు కూర్చునో పడుకునో విశ్రాంతి తీసుకోవడానికి బాగుంటుందిగా. అదీగాక నేను రెండు రోజున్నుంచీ గమనిస్తున్నా. రాత్రిళ్ళు వచ్చిన పేషెట్లు మూలుగూతూ ఆ ఫ్రంట్ రూంలో వుంటే, మీకు మాత్రం ఏం నిద్ర పడుతుంది. గవర్నమెంటు డాక్టరుగా ఎంతో సేవ చేస్తున్నారు. మీరెవరి దగ్గర నుంచీ పైసా కూడా ఆశించరని నాకు తెలుసు. రాత్రి నిద్ర కూడా లేకపోతే మీ ఆరోగ్యం ఏం కావాలీ? మేము ఇక అప్పుడప్పుడు వచ్చి పోయేవాళ్ళమేగానీ ఇక్కడే వుండే వాళ్ళం కాదుగదా. ఓ పేద్ద పాక వేయించాననుకోండి, కనీసం 30, 40 మంది చాపలు వేసుకుని పడుకోవచ్చు. రోగులకి నులక మంచాలు వుంటాయాయి. అదీగాక ఆ స్థలం సద్వినియోగమవుతుంది. మా పాలేరుకీ, పాలేరు భార్యకీ కూడా నాలుగు డబ్బులు దొరుకుతాయి” అన్నాడు తాతయ్య.
“అదేంటీ? రోజుకి ఇంత అని అద్దెకిస్తావా?” అన్నాను తాతయ్యతో ఆశ్చర్యంగా.
“నీ మొహం. ఉన్న వాళ్ళు కాఫీకో టీకో బైటెకి పోవాలి గదా! మన పాలేరు తోటే ఓ టీకొట్టు పెట్టిస్తే వాడికీ కాస్త డబ్బులొస్తాయి. అంతే కాదు పొద్దున్న శ్రీధర్ గారు కాఫీకి మొహమాటపడే పనుండదు. హోటల్ కంటే కొంచెం శుభ్రంగా ఉంటుంది కదా!” నవ్వి అన్నాడు తాతయ్య. అదీ నిజమే. రోజుకి పది రూపాయలు కళ్ళజూసే వ్యాపారమైతే ఎవరైనా శ్రద్ధగా చేస్తారు. నిజంగా అది మంచి ఆలోచన అనిపించింది.
“థాంక్య్ సార్! ఇన్నాళ్ళూ కొంచెం ఇబ్బంది పడ్డాను. ఇక నుంచీ హాయిగా నిద్రపోగల్ను.”నవ్వుతూ అన్నారు శ్రీధర్.
“డబ్బుని సద్వినియోగం చెయ్యకపోతే డబ్బుకీ జబ్బొస్తుంది. పోనీలే మంచి ఆలోచన చేశారు. సొంత లాభం కొంత మానుకో అన్నారు గదా పెద్దాయన” తాతయ్య వంక మెచ్చుకోలుగా చూస్తూ అన్నది అమ్మమ్మ.
“నా మొహం ఇదేదో పేద్ద వూరికి వుపకారం కాదు. జీవితపు చివరి అంచున వున్న వాళ్ళం. మన సంతృప్తి కోసమైనా కొద్దొ గొప్పో చేసుకోవాలిగా!” తేలిగ్గా నవ్వి అన్నాడు తాతయ్య.
***
ఆ రోజు మా ఇంగ్లీషు లెక్చరర్ రాలేదు. ప్రిన్సిపాల్ గారొచ్చారు.. క్లాస్ తీసుకోవడానికి. అరగంట సేపు గంగా ప్రవాహంలా సాగింది ఆయన ఉపన్యాసం. ఓహ్.. కదలాలనిపించలేదు. సరిగ్గా అరగంట తరవాత ఆపి, “ఓకే, ఇప్పుడు పాఠంలోంచి జీవితంలోకి వద్దాం” అన్నారు. ఉత్సాహంగా చెవులు రిక్కించాం.
“ఇది నేను కొత్తగా చెబుతున్నది కాదు. ఎందరికో చెబుతూనే వున్నాను. అసలు మనిషికి ఏం కావాలీ? ఈ చదువులు నిజంగా చదువులేనా? ఓ పాతికో ముప్పైయ్యో పుస్తకాలు కొన్నాళ్ళపాటు చదివితే డిగ్రీ వస్తుంది. దాని వల్ల ఓ ఉద్యోగం దొరుకవచ్చు. ఆ క్షణం నుంచే బానిసత్వం మొదలు. నీ పై వాళ్ళు చెప్పినట్టు విని తీరాలి. నీకింద వాళ్ళు పని చెయ్యనని మొండికేస్తే, చచ్చినట్టు నీ సమర్థత నిరూపించుకోవడం కోసం నువ్వు వాడి పని కూడా చెయ్యాలి. అదీ ఏం పనీ? జీవితమంటే కూడికలూ, తీసివేతలూ, హెచ్చింపులూ, భాగాహారాలూ మాత్రమేనా? అసలు మనం ఎందుకు పుట్టాం. ఈ చదువు నిజంగా మనకి అవసరమైన విజ్ఞానాన్ని ఇస్తుందా? ఇవన్నీ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నలు కాదు. దశాబ్దాలుగా నాలో నేను వేసుకుంటున్న ప్రశ్నలు. వీటికి సమాదానం ఎవరికి వారు తెలుసుకోవలసిందే. ఒకటి మాత్రం నిజం. ఆడామగా, ధనిక బీద, సాదా గొప్పా, కులం మతం ఈ తేడాలన్నీ మానవుడు తెచ్చినవే. ఇందులో ఆడ మగ అనేవి అన్ని జీవుల్లోనూ వున్నా, నేను మగాడ్ని, నేను చెప్పినట్టి నువ్వు విని తీరాలి అని మనిషి పెట్టిన ఆంక్షలు హద్దులు – సృష్టిలో ఏ జీవికీ లేవు. ఇతర జీవుల్లో ఏనాడూ ఆడ మగా తేడాలు లేవు. జీవించడానికీ, జీవన పథాన్ని ఎంచుకోవడానికీ మనిషి తెచ్చి పెట్టుకున్న తేడాలే మనిషి నాశనానికి కారణం అవుతున్నాయి. అందుకే పిల్లలూ, ఏం చేసినా బాగా ఆలోచించుకుని చెయ్యిండి. మీ భవిష్యత్తుని నిర్ణయంచుకోవడంలో ఎటువంటి పొరబాట్లు చెయ్యద్దు” అని ముగించారు. వారు చెప్పినది ఎంతో వున్నా సారాంశం మాత్రం ఇదే.
క్లాసు అయిపోయాక కూడా వారు చెప్పిన మాటలు నన్నెంతో ఆలోచింపజేశాయి. ఇంతకీ నేనేం కావాలీ? ఏ వృత్తిలో స్థిరపడాలీ? ఆ రాత్రి కూడా ఆలోచిస్తూనే వున్నాను.
“సరికొత్తగా, కొత్త నటీ నట, గాయనీ గాయకులు నృత్య దర్శకులతో తీయబోయే సినిమాకి విద్యార్థినీ విద్యార్థులు కావలెను. వివరాలకు సంప్రదించండి. ఇట్లు XXXX” ఎక్కడ చూసినా ఈ ప్రకటనే. సినిమా హాళ్ళల్లో స్లైడ్స్ గానూ ఇదే ప్రకటన. అన్నీ పేపర్లలోనూ వచ్చింది.
“నమ్మొద్దు నారాయణా.. ఇదో రకం కొత్త సప్తగిరి” అన్నాను సత్యనారాయణతో. అతనూ చాలా తెలివైన స్టూడెంట్ కాక మంచి నటుడు. బాగా డబ్బున్న వాళ్ళ అబ్బాయి.
“వెళ్తే గదా తెలిసేదీ! చూద్దాం!” నవ్వాడు సత్యం.
“వీడా.. ఆ మొహం చూడు.. నటుడువుతాడు.. సినిమా న.. టు.. డు” వెటకారాన్నంతా వొలకబోస్తూ అన్నది అలం. నేనేం మాట్లాడలేదు. ప్రేమ ఉదయించిన హృదయాలు దయకీ దాక్షిణ్యానికీ నిలయాలవుతాయని విన్నాను. పుస్తకాల్లో చూశానూ. గానీ, ఇలా పగకీ, వ్యంగ్యానికీ, వెటకారానికి నిలయం కావడం ఇప్పుడే గమనించడం.
“అనంతా.. నిజంగా చెప్పనా.. నీ మొహంలో ప్రతి భావమూ అద్భుతంగా పలుకుతుందే. అసలు నువ్వు మనసులో ఏమి అనుకుంటే అది తక్షణమే నీ మొహంలోనూ కళ్ళల్లోనూ ప్రతిఫలిస్తుంది. నువ్వు కూడా ఎందుకు ట్రై చెయ్యకూడదూ?” వెళ్ళిపోతున్న అలని ఆపి అడిగింది అఖిల.
“జోకా?” నవ్వినట్టుగా మొహం పెట్టి అన్నది అల.
“కాదు నిజం. నువ్వు గ్యారంటీగా సెలెక్టు అవుతావని నాకు నమ్మకంగా వుంది. బెట్” కాన్ఫిడెంట్‌గా అన్నది అఖిల.
“కుమారి మహితగారు ఏమంటారు?” నా వంక చూస్తూ అన్నది అల.
“కుమారి అనంతలక్ష్మి సావిత్రి అంత గొప్ప నటి కావాలని కోరుకుంటున్నా అంటాను” అన్నాను.
“మీరూ హగ్గీ కూడా గాయనీ గాయకులుగా మరి ట్రై చెయ్యొచ్చుగా?” నా మాటని నమ్మీ నమ్మనట్టు అన్నది అల.
“నా వరకూ నేను డిగ్రీ అయ్యేంత వరకు కాలేజీ కాంపీటీషన్స్ తప్ప వేరే పోటీలకు వెళ్ళను.” స్పష్టంగా చెప్పాను.
“మరి హరిగోపాల్?” అడిగింది అల కాదు.. అఖిల.
“అది అతను నిర్ణయించుకోవలసిన విషయం.”
“మరి మీరేదో లవ్‌లో పడ్డారనీ, మీ పేరేంట్స్ కూడా ok అన్నారనీ, అందుకే హాగ్గీనీ మీ వూరికి కూడా మీరంతా తీసికెళ్ళారనీ విన్నానే? కాబోయే వాడికి తోడుగానైనా వెళ్లొచ్చుగా?” వ్యంగ్యంగా అన్నది అల.
పిచ్చికోపం వచ్చింది. అయినా తమాయించుకుని “భలే రహస్యాన్ని పట్టావు అలా. అయినా ఓ విషయం నీకు చెప్పాలి. అతనికీ నాకూ మధ్య ఏ ప్రేమా దోమా లేదు. ఒక వేళ నువ్వు అతన్ని ప్రేమించదలుచుకుంటే నిరభ్యంతరంగా ప్రేమించుకో. నేనీ కాలేజీలో అడుగు పట్టినప్పుడు పరిచయమైన మొదటి దానివి నువ్వే. నిన్ను చూసి చాలా స్నేహశీలివనీ, మితభాషివనీ అనుకున్నాను. ఓ ఏడాది పాటు అలానే వున్నావు కూడా. ప్రస్తుతపు నీ ప్రవర్తన నేను వూహించినది కాదు. ఎనీవే.. నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకునే హక్కు నీకుంది. కానీ రూమర్లు స్ప్రెడ్ చేసే హక్కు నీకే కాదు ఎవరికీ లేదు. ఆల్ ది బెస్ట్” చెప్పాల్సిన మాటు నాలుగూ చెప్పి చరచరా నడుస్తూ నా క్లాస్ లోకి వెళ్ళి కూర్చున్నాను.
“ఓహో.. నీ కోసమే వెతుకుతున్నాను. సంపూర్ణగారు సినిమా సెలక్షన్‌లో గాయనిగా పార్టిసిపేట్ చెయ్యమంటున్నారు నన్ను.” కొంత సంతోషంగా, కొంత ఇబ్బందిగా అన్నది రేణుక.
“తప్పని సరిగా పాల్గో, సంపూర్ణగారినే అడుగు ఏఏ పాటలు సెలెక్ట్ చేసుకోవాలో” భుజం తట్టి అన్నాను. ఎందుకో, రేణుకని పాల్గోమని చెప్పిన సంపూర్ణగారు, నన్ను ఎందుకు ఎంకరేజ్ చెయ్యలేదో నాకు అర్థం కాలేదు. అయితే బాధపడలేదు. ఎందుకంటే అసలు పార్టిసిపేట్ చేద్దామనే ఊహే నాలో లేదు కనుక.
***
పోటీలు 3 రోజులపాటు జరిగాయి. అల, రేణుక ఇంకో ముగ్గురు ఆడపిల్లలు, కేశవప్రసాద్, హరగోపాల్ సింగర్స్‌గా సత్యా, జోగపతి, శ్యామ్ అనేవారు నటులుగా పోటీలో పాల్గొన్నట్టు తెలిసింది. అఖిల కూడా ‘నటి’గా ట్రై చేసిందని విన్నాను. (చెమట smell వస్తోందని చెప్పినందుకు తను నా మీదే ముందు అరిచి గోల చేసి, తరువాత realize అయ్యి సారీ చెప్పింది ఆ అమ్మాయి).
నాలుగో రోజున రిజల్టు చెపుతామన్నారట. వివిధ కేటగిరీల్లో పాల్గొన్న వారి సంఖ్య 2272ట. బాబోయ్.. సినిమా పిచ్చి వున్న వాళ్ళు ఇంత మందున్నారా?అని ఆశ్చర్యపోయాను.
చాలా చిత్రంగా రేణుక, అల, జగపతి, ఎంపికయ్యారు. రేణుక సింగర్‌గా, అల జగపతి నటీనటులుగా. వాళ్ళే నటీనటులకి, 3 నెలల ట్రైనింగ్ ఇప్పిస్తారట, ‘విద్యామూర్తి’ గారి ఇన్‌స్టిట్యూట్‌లో. మిగతా కాలేజీలన్నీటిలోంచి మరో అయిదుగురు ఎన్నికయ్యారు.
అల మహోత్సాహంతో కాలేజీ కొచ్చింది. “మహీ, నీకూ అఖిలకూ నేను నిజంగా థాంక్స్ చెప్పాలి. అఖిల ఇన్‌డైరెక్టుగా కాకుండా డైరెక్టుగా చెప్పింది – నాలో ఓ నటి ఉన్నదని.. నా ముఖంలో అద్భుతంగా ఎక్స్‌ప్రెషన్స్ పలుకుతాయనీ. Thanks to her! ఇక నీకు థాంక్సెందుకంటావా? నేను తిమ్మూని ప్రేమించిన మాట, పిశాచిలా అతని వెంటాడిన మాట నిజమే. అతనూ నువ్వూ అతనీ కాలేజీ వదిలేసే ముందర మాట్లాడుకున్నారని నాకు తెలిసింది. అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా నీకు తెలుసని నాకు తెలుసు. కానీ నువ్వేనాడూ ఆ విషయాన్ని బయటపెట్టలేదు. ఎన్ని విధాలుగా ట్రై చేయ్యాలో అన్ని విధాలుగానూ నీ దగ్గర ట్రై చేశా. స్నేహనికి నువ్విచ్చే ఇంపార్టెన్స్‌కి నా జోహార్లు. వెల్.. చదువు మీద నాకెన్నడూ పెద్గగా ధ్యాస లేదు. త్వరలోనే నేను సినిమాల్లోకి వెళ్ళిపోతున్నా. మంచీ చెడూ చెప్పుకోవడానికో, గుండె భారాన్ని పంచుకోవడానికో నిజమైన స్నేహితులు ఉండాలంటారు, కనీసం ఒక్కరైనా. ఇప్పుడు అడుగుతున్నా నాకు నిజమైన నమ్మకం నీ ఒక్కతి మీదే వుంది. విల్ యూ బీ మై లైఫ్‌లాంగ్ ఫ్రెండ్?”
అల కళ్ళల్లోకి చూశా. చాలా నిర్మలంగా వున్నాయి.
“యస్” అన్నాను. అక్కడికక్కడే నన్ను కౌగిలించుకుని “థాంక్స్ మహీ.. నా వల్ల జరిగిన పొరపాట్లని క్షమించు. నా వల్ల ఇక నుంచీ ఏ ప్రాబ్లమూ వుండదని తిమ్మూకి చెప్పు. అన్నట్టు హగ్గీ భయంకరంగా డిసప్పాయింట్ అయ్యాడు. సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తావు కదూ!” మరో సారి హాగ్ చేసుకుని ప్రిన్సిపాల్ రూమ్ వైపు వెళ్ళింది అల.
హరగోపాల్ చాలా దెబ్బతిన్నాడు. చాలా దిగులుతో కనపడ్డాడు. ‘సింగర్’గా సినిమా వాళ్ళు అతనికి ఛాన్స్ ఇవ్వకపోవడాన్ని అతను వూహించలేదు.
“హగ్గీ.. ప్రయత్నించడం మన ధర్మం. గెలవడం ఓడటం అనేది మన చేతిలో లేదు. నువ్వు బాగా పాడతావని అందరికీ తెలుసు. ఇవ్వాళ కాకున్నా రేపు ఇంకో అవకాశం వస్తుంది. నువ్విలా ఒక్క విషయానికే లోకపు తలుపులన్నీ మూసుకుపోయినట్లు భాదపడటం నాకు ఇష్టం లేదు. అసలు చూసే వాళ్ళకీ బాగోదు” అన్నాను. నిర్లిప్తంగా తలూపాడు అంతే.
ఆ విషయమే మా నాన్నతో చెప్పాను, అమ్మ వింటుండగానే. “హరగోపాల్ చాలా చాలా మంచి సింగర్. ఒకసారి అతన్ని రమ్మని చెప్పు. నేను మాట్లాడాతా” అన్నారు నాన్న. పిలిచాను.
“హరీ.. అక్కడ ఏ పాట పాడావూ?” అడిగారు నాన్న.
“ఎవరో జీ మ్యూజికు డైరెక్టర్‌టండీ.. ఓ ట్యూన్ రెండు మూడు సార్లు వినిపించాడు. లిరిక్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. నేను బాగానే పాడాను మరి” అన్నాడు హగ్గీ.
“ఆ ట్యూన్ గుర్తుందా? ఉంటే పాడు” అన్నారు నాన్న.
పాడి వినిపించాడు హగ్గీ. మెల్లగా నవ్వారు నాన్న.
“అక్కడ నేనున్నా రిజెక్ట్ చేసేవాడ్ని. ఎందుకో తెలుసా? ఆ ట్యూన్‌నీ, లిరిక్సినీ అచ్చు నువ్వు S.P. బాలసుబ్రహ్మణ్యంగారి లాగా పాడావు. వాళ్ళు ఛాన్స్ ఇద్దామనుకున్నది కొత్త సింగర్‌కి. ఓ ఫేమస్ సింగర్ వాయిస్‌ని మక్కీకి మక్కీ దింపే వాళ్ళకి కాదు.” అనునయంగా అన్నారు నాన్న.
నేనూ షాకయ్యాను. నిజమే. హగ్గీ పాడింది అచ్చు SPB లాగానే.
“నీదంటూ నీకో ఐడెంటిటీ కావాలంటే నీలా నువ్వు పాడటం ప్రాక్టీసు చెయ్యి. రఫీనీ, ముఖేష్‌నీ, ఘంటసాలనీ యథాతథంగా వారే పాడుతున్నారా అన్నంత గొప్పగా నువ్వు పాడగలవు. కానీ హరగోపాల్ వాయిస్ ఏదీ? అర్థమయిందా?” హరగోపాల్ భుజం తట్టి అన్నారు నాన్న. తల వూపాడు హరగోపాల్. అతనికి విషయం అర్థమయిందని నాకు అర్థమైంది.
“నేనూ అంతేనా నాన్నా?” అడిగాను. మరి నేను పాడుతున్నదీ ఇతరుల గాత్ర ధర్మాలతోనేగా!
“నిజం చెప్పాలంటే అంతే! మనకి తెలియకుండనే మనం అభిమానించే గాయనీ గాయకులు మన స్వరంలో దూరిపోతారు. అలా కాకూడదంటే చాలా సాధన చెయ్యాల్సి వుంటుంది. అఫ్‌కోర్స్, నువ్వు పోటీల్లో పాల్గొనడం మొదలెట్టడం యీ మధ్యే గనుక ఆ ప్రాబ్లమ్‍ని నువ్వు తొందరలోనే అధిగమించగలవు. హరీ, నీలో ఆపారమైన టాలెంట్ వుంది. మొదట నువ్వు నీ మీద విశ్వాసం పెంచుకో. ఆ తర్వాతే పోటీలకు వెళ్ళు. నువ్వు నిజంగా గొప్ప సింగర్‌వి అవుతావనీ, కాగలవనీ నాకు నమ్మకం వుంది.” అన్నారు నాన్న.
అప్పుడర్థమయింది.. రేణుకని సంపూర్ణ గారు పోటీకి ఎందుకు వెళ్లమన్నరో. రేణుకది ఓన్ వాయిస్. ఎవరినీ ఇమిటేట్ గానీ, ఫాలో గానీ చెయ్యదు. అందుకే బహుశా తనని వెంటనే సెలెక్టు చేసి వుంటారు.
‘గురువు’ యొక్క వేల్యూ ఎంతో ఆ క్షణంలో నాకు తెలిసివచ్చింది.
(ఇంకా ఉంది)