కలవల కబుర్లు-28

0
4

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]వా[/dropcap]రం వారం ఈ కబుర్లు తప్ప ఈ మధ్య కథలేమీ వ్రాయడం లేదు. బాగా బద్ధకం వచ్చేసిందని.. మొన్న ఓ కథకి శ్రీకారం చుట్టాను. అంతే మళ్లీ ఏదో బ్రేక్ పడిపోయింది. ఇహ ఇలా కాదు.. ఎలాగైనా ఈరోజు పూర్తి చేయాలనుకున్నాను.  బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది కదా! మధ్యాహ్నం లంచ్‌కి పెద్ద హడావుడేం లేదు.. పన్నెండింటి దాకా కూర్చుని రాస్తే, అప్పుడు లేచి వండుకోవచ్చు అనుకుని,  మొన్న చుట్టిన శ్రీకారం కింద నాలుగు వాక్యాలు  చుట్టానో లేదో.. అలా టింగుమంటూ.. చెల్లి దగ్గర నుంచి వాట్సాప్ నోటిఫికేషన్ వచ్చింది.

ఏదో మెసేజ్ పంపినట్టుంది. వెంటనే రిప్లై ఇవ్వకపోతే మళ్లీ అదో గోల అనుకుంటూ.. కథకి కామా పెట్టి వాట్సాప్ లోకి ప్రవేశించాను. ఏంటా ఆ మెసేజ్ అని చూసేసరికి.. ‘ఆషాఢం డిస్కౌంట్‌లో అందమైన చీరలు’ అనే థంబ్ నెయిల్‌తో యూట్యూబ్ లింక్ పంపింది. చూసి నచ్చిన చీర సెలెక్ట్ చేసుకుని చెపితే కొని పంపుతుంది కాబోలు అనుకుంటూ ఆ లింకు ఓపెన్ చేసాను.

మూర తక్కువ చీర లాగా.. ముందు పనికిరాని కబుర్లు బోలెడు చెప్పాక ఆఖరులో ఓ రెండు చీరలని చూపించారు ఆ వీడియోలో. ఓసినీ! ఇంతేనా? అనుకునేలోగా కిందన మరో వీడియో.. ఉప్పాడ చీరలట.. శ్రావణ మాసం రాబోతోంది. బావుంటే తెప్పించుకోవచ్చు అనుకుంటూ.. ఇవేవో చూద్దామని దాని మీద నొక్కాను. ఒకదాని తర్వాత మరోటి అబ్బో.. ఉప్పాడ చీరలకే కనీసం పాతిక యూట్యూబ్ వీడియోలు చూసానేమో! ఇంతలో ఆ మధ్య నా స్నేహితురాలు చెప్పిన మంగళగిరి చీరలు గుర్తొచ్చాయి. ఉప్పాడ నుంచి మంగళగిరికి బయలుదేరాను. అక్కడినుంచి అసంకల్పితంగానే వెంకటగిరి, కంచి, ధర్మవరం, మైసూరు అలా  ఇటు మన దక్షిణాది నుంచి ఉత్తరాది పైతానీ, రాజస్థానీ, కాశ్మీరీ చీరల నుంచి రిటర్న్ బెంగాల్ వేపు వెళ్లి మళ్లీ పోచంపల్లికి వచ్చాను. ఇలా ఈ వీడియోలు చూసి ఆర్డరిస్తే, వచ్చేవి ఎలా వుంటాయో బాబూ! వద్దులే, షాపుకి వెళ్ళే కొనుక్కుందాం అని నిర్ణయానికి తీసేసుకున్నాను.

ఇంతలో సడన్‌గా ఏవో వన్ గ్రామ్ హారాలట.. అవి నా కంట పడ్డాయి. ఇప్పుడు ఆకాశాన్ని అందుకునే ఖరీదు ఉన్న బంగారం కంటే, ఇలాంటి గొలుసులు, గాజులు తీసుకుంటే డబ్బూ తక్కువ అవుతుంది, దొంగలు దోచుకున్నా ఫర్వాలేదు.. ఇవేవో చూసి తెప్పించుకుంటే సరి, మోడల్స్ బావున్నాయేమో చూద్దాం అనుకుని దాంట్లోకి వెళ్ళాను. ఆ వెళ్ళడం వెళ్ళడం, నా చూపుడు వేలు ఒకొక్క యూట్యూబ్ వీడియోని పైకి తోయడం, నొక్కడం, తోయడం.. నొక్కడం.. వన్ గ్రామ్ లోనే పచ్చలు, కెంపులు, ముత్యాలు, పగడాలు అబ్బో మెరిసిపోతూ ఒకదాన్ని మించి మరోటి కనపడ్డాయి. చూస్తోంటే అన్నీ కొనేయాలనిపించింది. అంతలోనే నాలో నేనే అనుకున్నాను.. ఆ..ఎంతైనా బంగారం బంగారమే.. గిల్టు గిల్టే.. ఇవి ఎన్ని వేసుకున్నా, వేసుకునే ఒక్క బంగారు గొలుసుతో సాటి రావు.. వద్దులే అనవసరంగా డబ్బులు దండగ.. నేను వేసుకునే ఆ ఒకే ఒక్క బంగారు గొలుసు చాల్లే అనిపించింది.

సరే ఎలాగూ యూట్యూబ్ చూడడం మొదలెట్టాను కదా! రాబోయే వరలక్ష్మి వ్రతానికి పూర్ణాలు చేయడంలో కొత్త కిటుకులేమైనా తెలుస్తాయేమోనని  వంటల వీడియోలు నొక్కాను. ఇహ చూస్కోండి.. పూర్ణాల నుంచి రకరకాల వంటలు నా ప్రమేయం లేకుండానే ఎలా కనపడసాగాయో తెలుసా? బాలకృష్ణుని నోటిలో యశోదాదేవికి భూమ్యాకాశాలు, సూర్యచంద్రులు, ఆకాశం, పర్వతాలూ కనిపించినట్టు.. ప్రపంచమంతా ఇక్కడే యూట్యూబ్ లోనే నిండిపోయి కనిపించేస్తోంది. ఈ హడావిడిలో పూర్ణాల సంగతి మర్చిపోయాను.

ఆ తర్వాత ఈజీగా చేసుకునే టిఫిన్లు ఏమున్నాయీ? అని అడిగాను.. ఇక చూస్కోండి.. వరస పెట్టి వద్దన్నకొద్దీ వందలకొద్దీ దోశలలో రకాలు.. కుడివేపు నుంచి తిప్పే దేశ, ఎడం వేపు నించి తిప్పే దోశ.. గరిటతో పోసే దోశ, గ్లాసుతో పోసే దోశ.. ఆ తర్వాత ఇడ్లీలు.. సగ్గుబియ్యం, అటుకులు, మిలెట్లు, చద్దన్నం ఆహా! ఇన్ని రకాల ఇడ్లీలున్నాయా? ఇన్నాళ్లు నాకు తెలియనందుకు నా మీద నాకే జాలి వేసింది. వరుసపెట్టి రోజుకో రకం చేసేయాలని గట్టి నిర్ణయం తీసేసుకువ్నాను. ఉప్మాలు, వడలు ఒకటేంటి.. ఇవన్నీ చేసుకునేసరికి నా జీవిత కాలం సరిపోదే అనిపించింది.

పైగా..

‘ఈ ఇడ్లీ ఇలా తిన్నారంటే ఇక జీవితాంతం మర్చిపోరు’.

‘ఆ దోశ ఇలా కాకుండా అలా వేసారంటే మీ కాపురం మూడు ముక్కలవుతుంది’.

‘వడియాలు ఎలా పెట్టాలో తెలుసా?’

‘సలసల మరిగే పప్పుచారులో ఏవేం వేస్తారో చూసారంటే ఆశ్చర్యపోతారు..’ ఇలా చెపుతోంటే నిజంగానే నిబిడీకృతమైన ఆశ్చర్య కుతూహలాన్ని ఆపుకోలేక చూద్దామని చూసేసరికి

తుస్స్.. ఏముండదు.

ప్చ్.. నిట్టూరుస్తూ, ఇక చూసింది చాల్లే ఆపుదాం అనుకునేసరికి.. మరోటి కంట పడింది.

‘మీ రాశి ఫలానేదే అయితే ఈ వీడియో చూడండి.. మీరు  పట్టిందల్లా బంగారమే’ అని కనపడింది. అయితే ఆ రాశి నాదే కదా అని గుర్తొచ్చింది. నేను పట్టిందేం బంగారమవుతుందో ఏంటో అని ఆత్రంగా అంతకంటే ఆశగా ఆ వీడియోలోకి దూకాను. ఎవరో కానీ..గడ్డం స్వామి చెపుతున్న జాతకాల జాబితా ఈ చివర నుంచి ఆ చివర దాకా, కళ్ళు, చెవులు ఏకం చేసి విన్నాను కానీ.. పట్టిందల్లా బంగారమనే మాట మాత్రం రాలేదు. అంతా మోసం అనుకున్నాను.

సరిగ్గా అప్పుడే.. కడుపులో ఎలకలు పరిగెడుతున్నట్లు అనిపించి టైము చూసుకునేసరికి మూడయింది.

ఈరోజు ఎలాగైనా, కథ వ్రాయడం పూర్తి చేద్దామనుకున్న  నా మూడు కాస్తా ఈ ఈ యూట్యూబ్ లలో కొట్టుకుపోయింది.

ఇవండీ ఈనాటి కబుర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here