టెలిఫోన్ సంభాషణ

0
5

[ఆఫ్రికన్ కవుల కవితలను పాఠకులకు పరిచయం చేసే క్రమంలో నైజీరియన్ కవి, నోబుల్ ప్రైజ్ గ్రహీత వోలె సోయంకా రచించిన ‘Telephone Conversation’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి]

~

[dropcap]ఆ[/dropcap] ఇంటి అద్దె సముచితంగానే ఉంది కానీ స్థలమే కాస్త బుగులు పుట్టిస్తున్నది.
ఇంటి యజమానురాలు తను ఆ ఇంటికి దూరాన ఉన్నట్లు చెప్పింది.
“మేడమ్ నాకు వృథా ప్రయాణాలంటే ఇష్టం లేదు.. ముందే చెబుతున్నా నేను ఆఫ్రికన్‌ని సుమా.. అందుకే మీకు ఫోన్ చేస్తున్నా” అన్నాను.
అటువైపు నుంచి మౌనం.. ఏదో అసహనాన్ని దాస్తున్నట్లు.
బహుశా.. ఆమె తన ఎర్రని లిప్‌‌స్టిక్ పెదాల మధ్య తడబాటుని దాచుకోడానికి సిగరెట్ వెలిగించే ఉంటుంది..
ఇక మౌనం వీడి నన్ను పట్టుకునే ప్రయత్నం మొదలెట్టింది.
“అవునా, ఎంత నలుపు రంగులో ఉన్నావేంటి నువ్వు?” నేనేమి అబద్ధం వినలేదు.. ఆమె అలానే అడిగింది.
“చెప్పు కొద్ధిపాటి నలుపా.. లేక చాలా చిక్కనైన నలుపా?”.. మళ్ళీ ఆమెనే.. నొక్కి.. నొక్కి మరీ అడిగింది.
ఆమె శ్వాసలో విశ్వవ్యాప్తమైన దాగుడు మూతల కంపు అక్కడ పరివ్యాప్తమైంది.
నిజమా లేక నా భ్రాంతి కాదు కదా ఇది?
చుట్టూ చూసాను.. ఎర్రని టెలిఫోన్ బూత్.. ఇంకా ఎర్రని స్తంభం మీది డబ్బా..
ఎర్రని డబల్ స్టీరింగ్ ఓమ్ని బస్.. నల్లని తారు రోడ్డు అన్నీ స్పష్టంగా కనిపించాయి!
ఇది నిజమే.. వాస్తవంగా ఈ క్షణాల్లో జరుగుతున్నదే!
అభద్రతతో.. సిగ్గుతో.. ముడుచుకుపోయా.
ఆమె మాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ బయటపడింది.. ఒక రహస్య విచారణ చేస్తున్నట్లే నిర్ధారించుకోసాగింది.
“అదేలే.. మరి నువ్వు గాఢమైన నలుపా.. అంటే బ్లాక్ చాకలేట్ నలుపా లేక పాలు కలిసిన లేత చాకలేట్ రంగా?”
ఆమె ఏదో వైద్యపరమైన భాష వాడుతున్నట్లు.. గొంతును అదిమిపెడుతూ రహస్యంగా అడిగింది.
నేను వెంటనే “నాది పశ్చిమ ఆఫ్రికా సెపియా రంగు” అన్నాను.
నా పాస్‌పోర్ట్‌లో కూడా నా జాతి నిర్ధారణ కోసం అదే ఉంది..
“‘సెపియా’ అంటే ఏంటి.. కాకి నలుపా?”.. ఆమె మళ్ళీ అడిగింది.
“ఏమో తెలీదు మేడమ్.. శ్యామల వర్ణపు నలుపేమో? అయినా..
అది బయటకు కనిపించే నా మొఖం రంగు మేడమ్. అసలైతే మీరు నా శరీరంలో వేరే భాగాలను కూడా చూసి తీరాలి..
మీరు నా అరచేతుల తెల్లని రంగుని, దానితో పాటు గరుకు పాదాల కింద పసుపు రంగు చర్మాన్ని కూడా చూడాలి.
పెరాక్సయిడ్ ద్రావణంతో రుద్దినట్లుగా.. అచ్చం తెల్లని మేనిచ్చాయలో మెరిసిపోయే మీ బంగారు జుట్టు రంగులా.. ఉంటాయి వాటి రంగు.
అలాగే.. నేను మూర్ఖంగా నేల మీద కూర్చుని.. కూర్చుని.. రుద్దీ .. రుద్దీ నా పిర్రలు కూడా చాలా నల్లగా మారిపోయాయి మేడమ్!”
గర.. గరమంటూ ఫోన్ రిసీవర్.. ఆమె చెవుల దాకా వెళ్లడం వింటూనే..
“మేడమ్.. ఫోన్లో కాదు కానీ.. మీరే నా దగ్గరికి వచ్చి., నా పిర్రల రంగు గాఢమైన నలుపో.. లేక
పాలు కలిపిన లేత చాకలేట్ నలుపో స్వయంగా చూడకూడదా మేడమ్.. రండి మేడమ్?” అంటూ
ఆ తెల్ల రంగు చర్మపు ఇంటి యజమానురాలికి విన్నపం చేసాను కానీ.. ఆమె వస్తుందంటారా.. ఏమో??

★★

ఆంగ్ల మూలం: Wole Soyinka

తెలుగు అనుసృజన: గీతాంజలి


వోలే సోయంకా నైజీరియన్ కవి, నవలా, నాటక రచయిత. 1986లో సాహిత్యానికి నోబెల్ బహుమతిని గెల్చుకున్నారు. సాహిత్యం విభాగంలో నోబెల్ పురస్కారం పొందిన తొలి సబ్-సహారన్ ఆఫ్రికన్ ఈయనే. జాత్యాహంకారంపై పోరాడిన ఈయన Keffi’s Birthday Treat, The Invention, The Road వంటి నాటకాలు రచించారు. Telephone Conversation, A Big Airplane Crashed into The Earth, Mandela’s Earth and other poems వంటి కవితా సంపుటులు వెలువరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here