నాదొక ఆకాశం-9

2
2

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[ఊరికి వచ్చిన సమీర అమ్మ చేసిన వంటలు తిని, ఆమెతో కాసేపు కబుర్లు చెబుతాడు. తన ఇంటిని, తన తండ్రిని తలచుకుంటాడు. లారీ డ్రైవర్ అయిన సమీర్ తండ్రి తాగుడుకి బానిసవుతాడు, వేశ్యల సాంగత్యంతో ఎయిడ్స్ సోకి – సమీర్‍కి ఐదేళ్ళప్పుడు చనిపోతాడు. దాంతో అతని అమ్మ ఎన్నో అవమానాలు భరిస్తుంది. ఉన్న ఊర్లోకి పొలం, ఇల్లు అమ్మేసి, ఇప్పుడున్న ఊరికి వస్తుంది. అమ్మ కష్టాలకు కుమిలిపోకుండా, అన్ని భౌతికి, లైంగిక దాదులను ఎదుర్కుంటుంది. ఎన్.ఎన్.ఎం.గా పనిచేస్తూ ఊరివాళ్ళకు రాత్రింబవళ్ళు సేవ చేసి తన అస్తిత్వాన్ని కాపాడుకుంటుంది. అమ్మ పనిలో చూపే నిబద్ధతను గమనించిన గ్రామప్రజలు, ఆమె పట్ల తమకు గల బాధ్యతను గుర్తించి, గుండెల్లో పెట్టుకుంటారు. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాడు సమీర్. ఉదయం లేచి ఫోన్ ఆన్ చేయగానే వసుధ నుంచి కాల్ వస్తుంది. ఎక్కడున్నావంటే, అమ్మ దగ్గర అని చెప్తాడు. వసుధ ఫోన్ కట్ చేస్తుంది. మరి కాసేపట్లో సుధాకర్ నాయుడు గారు ఫోన్ చేసి – సత్యం వాళ్ళు పదింటికి వస్తానన్నారు కదా, వెంటనే రా – అని అంటారు. సమీర్ కాస్త నసుగుతాడు. అప్పుడాయన సమీర్ అమ్మతో మాట్లాడుతారు. సమీర్ వాళ్ళమ్మ మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది. అమ్మకి జరిగిన విషయమంతా చెప్తాడు సమీర్. నీకు మంచిదనిపించింది చెయ్, వాళ్ళ మనసులను నొప్పించకు అంటుంది. టిఫిన్ తిని సిటీకి బయల్దేరి వస్తాడు సమీర్. రూమ్‍కి చేరి భోం చేసి కాసేపు పడుకుంటాడు. తర్వాత లేచి రడీ అవుతుంటే వసుధ ఫోన్ చేస్తుంది. ఆమె కవితాత్మకంగా మాట్లాడి బాధపడుతూంటే, బాధపడద్దనీ, నాకు నువ్వే ముఖ్యమని అంటాడు సమీర్. సాయంత్రం నిర్మాత సత్యం, దర్శకుడు శ్రీవిక్రమ్ వస్తారు. సంజయ్ స్థానంలో సమీర్‍ని నటింపజేయాలన్న తమ ఆలోచనని సుధాకర్ నాయుడికి చెబుతుంటే, తనకి ఇష్టం లేదంటాడు సమీర్. నిర్మాత సత్యం క్రోధంతో సమీర్‍ని తిడతాడు. అప్పుడు సుధాకర్ నాయుడు కోపగించుకుని సత్యం చెంపలు వాయించడానికి లేస్తే, శ్రీవిక్రమ్ ఆపి అందరినీ శాంతపరుస్తాడు. సత్యం తన సమస్యలని వివరించి ఎలాగైనా గట్టెక్కించమని వేడుకుంటాడు. శాంతించిన సుధాకర్ నాయుడు గారు సమీర్‌తో – నువ్వు సంజయ్‍కి ద్రోహం చేయడం లేదు, వాడు వదిలేసిపోయిన ఈ పనిని పూర్తి చెయ్యి అంటారు. సత్యం, శ్రీవిక్రమ్ సంతోషిస్తారు. మరి ఈ సినిమా చేయడం వల్ల సమీర్‌కి ఏం లాభం అని అడుగుతారు సుధాకర్ నాయుడు. రెమ్యూనరేషనా అని శ్రీవిక్రమ్ అడిగితే, కాదు హీరోగా సమీర్ భవిష్యత్తు అని అంటారు సుధాకర్ నాయుడు. త్రిపుల్ ఎస్ సినిమా రిలీజయిన పది రోజుల్లో సమీర్ హీరోగా కొత్త సినిమా మొదలుపెడతానని అంటాడు శ్రీవిక్రమ్. సంజయ్‍ని రానివ్వండి అంటాడు సమీర్. – ఇక చదవండి.]

రామోజీ ఫిల్మ్ సిటీలో నా షూటింగ్ శిక్షణ మొదలయింది. ముఖ్యంగా నేను నటించవలసిన పార్ట్ అంతా డాన్సులోని భాగాలే కాబట్టి, కొరియోగ్రాఫర్ కొన్ని బేసిక్ మూవ్‌మెంట్లు నాతో ప్రాక్టీసు చేయించాడు. నాలోని బిడియం, బెరుకు పోవడానికి రెండు రోజుల పాటు డ్యాన్సరు అమ్మాయిలతో కౌగిలింతలు, వాళ్ళ శరీరాల్లోని వేర్వేరు చోట్ల చేతులు వేయడం, మూవ్‌మెంట్స్ చేయడం చేసాను.

పాపం ఆ అమ్మాయిలు నటనలో కానీ, అందంలో కానీ ఏ పెద్ద హీరోయినుకూ తీసిపోరు. పైపెచ్చు వీళ్ళు నాట్యంలో ఆరితేరిన నిష్ణాతులు. ఈ జూనియర్ డ్యాన్సర్లు ఎక్స్‌పోజింగుకు కూడా వెనుకాడడం లేదు. నేను వాళ్ళ జఘనాల మీద, వక్షం మీద చేయి వేయడానికి సంశయిస్తుంటే వాళ్ళే బలవంతంగా నా చేతులను తీసుకుని నడుం మీద వేసుకుని స్టెప్పులు వేసారు. ఇప్పుడొస్తున్న హిందీ హీరోయిన్ల కన్నా వీరికే ఎక్కువ అర్హతలున్నాయనిపించింది. లేనిదల్లా తమ అందాన్ని, తమ నాట్య ప్రావీణ్యాన్ని మార్కెట్ చేసుకునే తెలివి తేటలు, ఇంగ్లీషులో స్టైల్‌గా మాట్లాడగలగడం.

ప్రధాన పాత్రల్లో నటించే హీరోహీరోయిన్లు వాళ్ళ పార్ట్ షూట్ కాగానే, తమ తమ వ్యానిటీ వ్యాన్లలోకి వెళ్ళి సేదదీరుతుంటారు. కానీ, ఈ డ్యాన్సర్లు రోజంతా అర్ధనగ్న దుస్తుల్లో, ఏ శాలువానో, పల్లూనో కప్పుకుని, వందలాది మంది యూనిట్ సభ్యులు, సందర్శకుల మధ్య నిలబడే ఉంటారు. వారికి అది అలవాటేమో కానీ, వారినలా చూస్తుంటే నాకే ఇబ్బందిగా అనిపించింది. ఇంతా చేస్తే వాళ్ళ పేర్లు సినిమా టైటిల్స్‌లో కనిపించవు. వారికి గుర్తింపు కూడా ఏముండదు. వాళ్ళతో పాటు నాలుగు స్టెప్పులు వేసి, తెలుగే రాని హీరోయిన్లు, ఎరోటిక్, రెచ్చగొట్టే పాటలకు పెదవులు కలిపి, కోట్ల రూపాయలూ, నేమ్, ఫేమ్, ఫార్చ్యూన్ సంపాదిస్తారు.

ఈ మధ్యనే, ఒక అగ్ర నటుడి నుండి విడాకులు తీసుకున్న ప్రముఖ హీరోయిన్, ముప్పావు నగ్నంగా, కామసూత్ర లోని అసభ్య ఫోజులన్నీ పెట్టి చేసిన, ఒక ఛండాలపు పాట, దేశమంతా అన్ని భాషల్లో ఎలా మారుమ్రోగిందో మనమంతా చూసేసాము.

ఇప్పుడు హీరోయిన్లు, సినిమాల్లో కథానాయికలుగా నటిస్తూనే, కోట్ల రూపాయలు కొల్లగొట్టి, అవకాశం వచ్చినప్పుడల్లా ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. సినిమా హిట్టు కొట్టడంలో ఈ ఐటెం సాంగ్స్ కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అసలు సినిమా రిలీజ్ అయ్యే మూడు నాలుగు నెలల ముందే ఈ ఐటెం సాంగ్స్ రిలీజయి, ఆ సినిమా మీద క్రేజును పెంచుతూ ఉంటాయి. ఆ ఒక్క పాట 24 గంటల్లో ఎన్ని హిట్లు కొట్టిందన్నది కూడా ఒక రికార్డుగా ట్రీట్ చేసి, ఆయా హీరోహీరోయిన్ల అభిమానులు పండుగలు జరుపుకుంటున్నారు.

ఈ జూనియర్ డ్యాన్సర్లంతా వాళ్ళ యూనియన్ల కంట్రోల్లో పని చేస్తుంటారు. వాళ్ళకు పెద్దగా ఆదాయం కూడా ఉండదు. వచ్చిన దాంట్లో, యూనియన్లు తమ ఫీజు కట్ చేసుకున్న తర్వాతనే, వీళ్ళకు పేమెంట్ చేస్తారు.

ఈ డ్యాన్సర్లలోనూ అనేక రకాల వాళ్ళున్నారు. రష్యన్ డ్యాన్సర్లు, బాలీవుడ్ డ్యాన్సర్లు, చెన్నై డ్యాన్సర్లు, టాలీవుడ్ డ్యాన్సర్లు. వీరిలో, అందరి కంటే టాలీవుడ్ డ్యాన్సర్లకే తక్కువ డిమాండ్, తక్కువ పేమెంట్ కూడా! రష్యన్ డ్యాన్సర్లకు రోజుకి పన్నెండు నుండి ఇరవై వేల వరకు రెమ్యునరేషన్ ప్లస్ ముంబయి నుండి రావడానికి పోవడానికి ఫ్లైట్ టిక్కెట్లు, ఇక్కడ కనీసం టూ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయాలి. మన డ్యాన్సర్లకు రోజుకి మూడు వేలు ఇస్తే మహా ఎక్కువ.

రెండు రోజులు ప్రాక్టీస్ చేయడంతో, సంజయ్ వేసే కొన్ని ఈజీ స్టెప్పులు కొంచెం నాకు అలవాటయ్యాయి. కెమెరా వంక సూటిగా చూడకుండా, కేవలం నా ప్రొఫైల్ కనబడేటట్టుగా మేనేజ్ చేయమని కెమెరామెన్, కొరియోగ్రాఫర్ సలహాలు ఇచ్చి అదే విధంగా డ్యాన్స్ డిజైన్ చేసారు.

***

మూడో నాడు లొకేషన్లో ఉదయం ‘త్రక్ష’ ప్రత్యక్షమైంది. నా డ్యాన్స్ ఆమెతోనే అనుకునేసరికి కాళ్ళల్లో వణుకు మొదలయింది. త్రక్ష నడుము మీద చెయ్యి వేసిన మరుక్షణం, నేను చలి జ్వరం వచ్చిన వాడిలా వణికిపోయాను. త్రక్ష ఫక్కున నవ్వి,

“క్యా బాబూ! ఇత్నా డర్ రహే హైఁ? లడ్కీకు పహల్ బార్ టచ్ కర్ రహే హైఁ క్యా?” {ఏంటి బాబూ ఇంత భయపడుతున్నారు? అమ్మాయిని మొదటి సారి ముట్టుకుంటున్నారా ఏమిటి?} అని బనాయించింది. నేను ముఖం మాడ్చుకుంటే,

“అరే బాబా! భయపడకు!” అంటూ చటుక్కున పెదవుల మీద ముద్దు పెట్టుకుని, నన్ను గట్టిగా హత్తుకుంది. ఈ దృశ్యాలన్నింటినీ కెమెరా ఆవురావురుమంటూ షూట్ చేయసాగింది. స్టిల్ ఫోటోగ్రాఫర్ వందలాది ఫోటోలు చకచకా తీసి పడేసాడు.

***

పాటలంటేనే రొమాంటిక్ దృశ్యమాలికలు. సంజయ్ అభిమానులు అతను తెర మీద చేసే రొమాన్స్, ఫైట్లు అంటేనే పడి ఛస్తారు. ఫైటింగ్ సీన్ల షూటింగు పూర్తయింది కాబట్టి నాకా బాధ తప్పింది. నేను కేవలం హీరోయినుతో శృంగారాన్ని పండిస్తే చాలు.

ఆ పాటలను షూట్ చేస్తున్నంత కాలం త్రక్ష బిగి కౌగిలిలో ఉన్న నన్ను అమ్మ, వసుధ చూస్తే ఏమనుకుంటారోనన్న బిడియంతోనే సతమతమయ్యాను.

***

కానీ, మొదటి రోజు మధ్యాహ్నం వరకు ఇబ్బంది పడుతున్న నా దగ్గరకు లంచ్ టైములో శ్రీవిక్రమ్ గారు, సంజయ్ వ్యానిటీ వ్యానులోకి వచ్చి, నాకు హితబోధ చేస్తూ,

“సమీర్! ఈ సినిమాలో నువ్వు సమీర్‌వు కాదు. నువ్వు సంజయ్‌వి. నువ్వు వేసే ప్రతీ స్టెప్పు సంజయ్ వేస్తున్నట్టే లెక్క. సంజయ్ ఫ్యాన్సుకు, సంజయ్ డ్యాన్సులంటే ప్రాణం. మనం ఈ సినిమాలో ఆల్రెడీ మూడు పాటలు షూట్ చేసేసాం. ఈ రెండు పాటలే మిగిలిపోయాయి. ఇప్పుడు ఫ్యాన్స్ తెలివి మీరిపోయారు. ఏ మాత్రం తేడా వచ్చినా పసిగట్టి, బండారం బయటపెడ్తారు. నువ్వు నీ స్నేహితుడి వ్యానిటీ వ్యానులో కూర్చోవడం కాదు. అతని పాత్రలో జీవించు. నువ్వు నీ ఫ్రెండుని రీక్రియేట్ చేస్తున్నావ్! నువ్వు బాగా చేయలేకపోతే, నీకేం నష్టం లేదు. కానీ, సంజయ్‌కి చెడ్డ పేరొస్తుంది. ఈ రెండు పాటల లిరిక్స్ మార్చి నీకు ఎక్కువ మాటలు లేకుండా ప్రయత్నించాము. సాధ్యమయినంత వరకు నువ్వు కనిపించే ప్రతీ సీన్ లాంగ్ షాటులోనే ఉంటుంది. కాబట్టి మనసులోని భయాలన్నీ వదిలిపెట్టేసేయ్! నువ్వు సమీర్‌వి కాదు. యూ ఆర్ సంజయ్!” అని అరిచాడు.

మనం ఫుట్‌బాల్ మ్యాచులు లేదా క్రికెట్ మ్యాచులు లేదా బాక్సింగ్ పోటీలు చూస్తున్నప్పుడు, లంచ్ బ్రేకులో, మోటివేషనల్ సెషన్స్ ఉంటాయి. బాక్సింగులో ప్రతీ రౌండు రౌండుకి మధ్య బాక్సర్లను, వాళ్ళ ట్రైనర్లు మోటివేట్ చేస్తుంటారు. గెలుపు నీదే అని నమ్మబలుకుతుంటారు.

అలాగే, తన సైనికులను యుద్ధరంగంలోకి పంపే ముందు, ఆ సైన్యాధ్యక్షుడు లేదా ఆ రాజు సమరభేరి మ్రోగించి, పౌరుషంతో రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసి సైనికుల నరనరాల్లో యుద్ధోన్మాదాన్ని పెంచి, శత్రుసైనికుల మీదకు ఉసిగొల్పుతారు. అదే విధంగా ఆటగాళ్ళను కూడా రెచ్చగొడుతుంటారు.

శ్రీవిక్రమ్ గారు కూడా అటువంటి మోటివేషనల్ క్లాసునే నాకు తీసుకున్నారు.

“సమీర్! ఈ సినిమాలో నీ పాత్ర చిన్నదే కావచ్చు కానీ సినిమా విజయంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. నిన్న ఇండస్ట్రీలో ఎవ్వరు గుర్తించడం లేదని కూడా నువ్వు చింతించాల్సిన పని లేదు. నిన్ను, నీలోని ప్రతిభను గుర్తించడానికి నేనున్నాను. ఇది హీరోగా రాబోయే నీ తరువాతి సినిమాకు రిహార్సల్స్ అనుకో! ఓకే! బీ స్పోర్టివ్! బీ సంజయ్! యో! చీర్ అప్ మ్యాన్!” అంటూ నన్ను ఉత్సాహపరిచారు.

***

దాంతో నేను ఫుల్లీ రీఛార్జ్ అయి, రెచ్చగొట్టబడి, ఆ రోజు మధ్యాహ్నం సెషనులో విజృంభించాను. సంజయ్‌నే మనసులో ధ్యానించుకుని ‘త్రక్ష’తో సమానంగా స్టెప్పులు వేసాను. కొరియోగ్రాఫర్ చెప్పినప్పుడు, అచ్చం సంజయ్ లాగానే, హీరోయిన్ని కౌగిట్లోకి లాక్కున్నాను, కళ్ళల్లో కళ్ళు పెట్టి, మోహంగా చూసాను. చిలిపిగా ఒళ్ళంతా తడిమాను. అయినా నాలో ఎటువంటి భయాలు, వికారాలు కలగలేదు. అసలు అక్కడ ఉన్నది నేను కాదు, సంజయే అనే నేను మనసులో ఫిక్స్ అయ్యాను.

మొదటి రోజు షూట్ పూర్తయ్యేసరికి అందరూ శాటిస్‌ఫై అయ్యారు.

“ప్యాకప్!”

అనగానే, నేను ‘హమ్మయ్య’ అని నిట్టూర్చాను. త్రక్ష నాతో పాటు నా క్యారవాన్ లోకి వస్తుంటే ఆశ్చర్యపోయాను.

“సమీర్! ఈ రోజు బాగా పెర్‌ఫామ్ చేసావు. కంగ్రాట్స్!” అంటూ కౌగలించుకుంది. అప్పుడు మాత్రం నాకు భయమయింది. ఒంటరిగా, హీరోయిన్‌తో ఉండడం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో తెలిసిన నేను,

“వన్ మినట్. డైరెక్టర్ గారు ఎందుకో నన్ను కలవమన్నారు.” అంటూ బయటకు వచ్చి నిలబడ్డాను. నా భయానికి, త్రక్ష నవ్వుకుంటూ,

“సమీర్! శ్రీవిక్రమ్ గారు నీతో కొత్త సినిమా అనౌన్స్ చేయబోతున్నారని తెలిసింది. హీరోయినుగా నన్ను రికమెండ్ చేయి సమీర్! ప్లీజ్! మనిద్దరి జోడీ బావుంటుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మనిద్దరిదీ హిట్ పెయిర్ అనీ,  మన మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని టాలీవుడ్ కోడై కూస్తుంది చూడు. అందుకే ముందు జాగ్రత్తగా నీకు చెప్పి పెడుతున్నా!” అంది.

“సారీ మేడమ్! నాకా విషయాలేం తెలియదు. అయినా, కొద్ది రోజుల్లోనే సంజయ్ వస్తాడు. మీరు ఈ విషయాలన్నీ అతనితోనే డిస్కస్ చేయండి. ఇక్కడి నుండి వెళ్ళండి ప్లీజ్!” అన్నాను.

నేను నటనకు కొత్తేమో కానీ, ఇటువంటి వ్యవహారాలకు కొత్త కాదు. మిగతా కొంతమంది హీరోల్లా, సంజయ్ ఫలానా  హీరోయిన్ కావాలని ఎప్పుడూ రికమెండ్ చేయడు. కథకు సూట్ అయ్యే హీరోయిన్‌ని సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ డైరెక్టరుకే ఉండాలని అతని అభిప్రాయం. కాబట్టి, ఒక్కరోజు కోసం హీరోనైన నేను, ‘త్రక్ష’ను ఎలా రికమెండ్ చేస్తాను.

***

షూటింగు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి బాగా లేటయింది. అందరూ నిద్రలో ఉన్నారు. నేను కూడా బాగా అలసిపోయి ఉన్నాను. ఒక్క రోజు షూటింగుకే ఒళ్ళంతా పులిసి పోయింది. అప్పుడు గానీ, సంజయ్ పడే శారీరక శ్రమ గురించి నాకు అవగాహనకు రాలేదు. తెర మీద అందంగా, నవ్వుతూ తుళ్ళుతూ తాజా, నవనవలాడే యాపిల్ పళ్ళలా కనపడే నటీనటులు అలా కనిపించడానికి ఎన్ని సార్లు మేకప్, టచప్ చేసుకుంటారో ఇప్పుడర్థమయింది. రోజంతా ఎండలో ఔట్‌డోర్‌లో ఉన్నా, ఇండోర్‌లో ఉన్నా, ఎండ వేడికి, లైట్ల వెలుతురుకు, ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి. దానికి తోడు కాస్ట్యూమ్స్ చిరాకు తెప్పిస్తుంటాయి. అందుకే సంజయ్ కొరకు ఒకే కాస్ట్యూమ్ మూడు జతలు తెప్పించి పెడతారు. సంజయ్ షూటింగ్ సమయంలో రెండు మూడు సార్లు తన వ్యానిటీ వ్యానులో స్నానం చేసేవాడు. దానికి కారణం ఇప్పుడు తెలిసింది. లేకపోతే చెమట కంపు కొడుతున్న బట్టలు వేసుకుని, ముఖంలో ప్రేమంతా రంగరించి, శృంగార డైలాగులు ఎలా చెప్పగలరు?

నేను సైలెంటుగా నా రూములోకి ప్రవేశించి, పొగలు గక్కే నీళ్ళతో స్నానం చేసి, తుడుచుకుంటుండగానే నిద్ర ముంచుకొచ్చింది. ఒంటి మీద బట్టలున్నాయో లేదో చూసుకోకుండానే అలాగే వచ్చి పడుకుండిపోయాను.

***

ఆ రోజు షూట్ చేసిన పాట లిరిక్స్‌లో కొన్ని నాకు పదేపదే గుర్తొస్తున్నాయి. హీరో మీదనే ఎక్కువగా కాన్సన్‌ట్రేషన్ ఉంటుంది కాబట్టి, ముందుగా అనుకున్న యుగళగీతం స్థానంలో హీరో పాడిన శాస్త్రీయ సంగీత బాణిలో సాగే ప్రేమ గీతాన్ని షూట్ చేసారు. అవే చరణాలు, నిద్రలో పలవరిస్తున్నట్టనిపించింది.

‘ప్రియా!
నీ పలుకుల స్వరం విని
కోయిల గానమేమోననుకుంటాను
స్వరరాగ గంగా ప్రవాహంలో మునిగిపోతాను
~
నువ్వు నా చెంతన ఉంటే
సౌరభాల సమీరమేదో
నను లాలిస్తున్నట్టుంటుంది
~
నువ్వభ్యంగన స్నానమాచరించ
నీ కురుల సాంబ్రాణీ పరిమళం
నీ దేహ సుగంధంతో కలిసి..’

అని కలవరిస్తుండగానే నా చుట్టూ పరిమళాల వలయాలు వ్యాపించాయి. సగం మత్తు, సగం నిద్రలో ఉన్న నేను కళ్ళు తెరుచుకోకుండానే, ‘ఇది కలా నిజమా’ అనే మీమాంసలో పడిపోయాను. నాకు ఆ సన్నివేశాలు ఊహించుకుంటున్నప్పుడు కలలోకి ‘త్రక్ష’ రాలేదు. త్రక్ష ధరించిన కురచ దుస్తుల్లో ఉన్న వసుధ కనిపించింది. అసూర్యపంశ వంటి నా వసుధ ఆ దుస్తుల్లో శృంగారదేవతలా, దేవతలకు అమృతం పంచే మోహినీ దేవతలా ఉంది.

కానీ, అంత మంది ముందు నా వసుధ అలాంటి దుస్తుల్లో కనిపించడం నాకస్సలు నచ్చలేదు. అందుకే,

“ఫో విప్పేయ్!” అంటూ నా కౌగిలిలో ఉన్న వసుధను చేతులతో నెట్టేస్తున్నాను.

ఇంతలో, నా పెదవుల మీద లీటర్ల కొద్ది, రసగుల్లాలను నానబెట్టే మధుర రసం, గుమ్మరించినట్లయింది. రసగుల్లాలు ఎంత మృదు మధురంగా ఉంటాయో. అచ్చం ప్రియురాలి అధరాలను చప్పరిస్తుంటే కలిగే అలౌకిక ఆనందం కలుగుతుంది. రసగుల్లాలను కానీ ప్రియురాలి పెదవులను కానీ చప్పరిస్తుంటే, అధరపు మధువులను జుర్రుకుంటున్నట్టే ఉంటుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here