[box type=’note’ fontsize=’16’] “ఒడిదుడుకుల, వేగవంతమైన జీవితంలో సామాన్యుల గురించి పట్టించుకునే వారుండడం లేదు. ‘మీకు తోడుగా మేమున్నాం’ అనే ఒక చిన్న భరోసా, కొన్ని జీవితాలను నిలబెడుతుంది” అంటున్నారు మణి వడ్లమాని ‘కొంచెం భరోసా ఇవ్వండి‘ కథలో. [/box]
[dropcap style=”circle”]రెం[/dropcap]డు రోజులగా జ్వరం వస్తోంది. ఏదో మాత్రలు వేసుకున్న పెద్ద ఫలితం కనిపించటం లేదు. మొన్ననే చెప్పాడు శంకరం – ‘వరసగా మూడు రోజులు పని ఉంటుంది, ఇక వేరే చోట ఎక్కడా కుదురుకోకు’ అని. వాళ్ళది పెద్ద కేటరింగ్ కంపెనీ. అందులో పని దొరికితే కాస్త డబ్బులు కూడా బాగానే ఇస్తారు. అది కాక శంకరానికి తను చేసే వంటలు బావుంటాయని ఒక నమ్మకం కూడా ఉంది.
నిజానికి ఈ రోజు పొద్దున్న నుంచే బావుండటం లేదు. కానీ ఇవాళ సుభద్ర గారింట్లో అమ్మవారి పూజ చేసుకొని భోజనాలు పెట్టుకున్నారు. అది మునుపే చెప్పి ఉంచారు. అందరూ వంటలు బావున్నాయని చెప్పేసరికి తృప్తిగా అనిపించింది.
అయినా ఈ మధ్య బొత్తిగా ఓపిక ఉండటం లేదు. చిన్న పనికే అలసిపోవడం, ఎప్పుడూ పడుకోవాలనే అనిపించడం. ‘ఇదేమన్నా కుదిరే పనా?’ అనుకుంటూ జానకి త్వరత్వరగా నడుస్తోంది. పక్కనే పిల్లలు కొంతమంది కొత్త సినిమాలో పాట కాబోలు ‘రంగమ్మా,మంగమ్మా’ అని పాడుకుంటూ పోతున్నారు.
తల వంచుకొని నడచుకుంటూ వెళుతున్న జానకిని చూస్తూ రామనాధం ‘ఓహ్ నువ్వు ఇక్కడే కనిపించావు నాకు ఓ పెద్ద పని తప్పింది. మీ ఇంటికే వద్దామనుకుంటున్నా, రేపు పొద్దున్న మీ ఆయన్ని తొమ్మిది గంటలకల్లా ఆంజేనేయస్వామి గుడి దగ్గరకి వచ్చి నిలబడమను. జగన్నాధం గారింట్లో శనిదానం, మృత్యుంజయ దానం ఉన్నాయి. వెంటనే మీరు గుర్తొచ్చారు. ఏదో నా చేతనయింత సాయం చెయ్యాలని తాపత్రయ పడుతున్నాను’ అన్నాడు.
ఆయన చెప్పిందంతా విన్న జానకి ‘అయ్యో ,మీరు మా కోసం శ్రమ తీసుకొని చెప్పడమే పెద్ద సాయం అలాగే తప్పకుండా పంపిస్తాను’ అంది.
‘శ్రమ ఏం లేదమ్మా, ఏదో ఒక ఊరి వాళ్ళం, అందరం బతుకు తెరవు కోసం ఇక్కడకు వచ్చిన వాళ్ళమే, ఏదో నాకు అవకాశం ఉంది. అందుకే చెప్పాను’ అంటూ బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు.
మళ్ళీ నడక మొదలుపెట్టిన జానకికి ఈ మారు నీరసంగా అడుగులు పడుతున్నాయి. ఓ పక్క ఈ సంసారం ఎలా గడుస్తుందని బాధ, ఇంకో పక్క ఆరోగ్యం సహకరించటం లేదనే బెంగ ఒకటి. ఆ నీరసంలోనే ఎడతెగని ఆలోచనలు వస్తున్నాయి. ఎలాగో ఇంటికి చేరింది. ఇల్లు అంటే ఓ చిన్న గది బయట ఉన్న వరండా. దాన్నే వంటిల్లుగా చేసుకుంది. అద్దె లేకుండా, కరెంటు ఖర్చులు కూడా భరిస్తూ సాయం చేస్తున్న ఆ సావిత్రమ్మ గారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలి అనుకుంటూ చేతిలో ఉన్న సంచీని కింద పెట్టింది.
జానకి రావడం చూసిన రమణ, అంతవరకూ చాప మీద పడుకున్నవాడు ఆత్రంగా లేచి వచ్చి సంచీ లోకి చేతులు పెట్టి, అందిన రెండు అరటి పళ్ళు తీసుకొని ఆబగా తింటూ, జానకి వైపు చూసాడు. కానీ ఆ చూపులని తట్టుకోలేక ‘ఆకలికి ఆగలేకపోయాను’ సంజాయిషీ చెప్పబోయాడు. ‘పరవాలేదులెండి’ అంటూ సంచీని తీసుకొని అందులో ఉన్న చిన్న చిన్న సంచులును బయటకు తీస్తూ అనుకుంది ‘ఆకలికి అతనే ఆగలేకపోతే, చిన్నపిల్లలు వాళ్ళు ఎలా తట్టుకుంటారు’ అని. ఇంతలో ఏదో గుర్తొచ్చి ‘అయ్యో ఈ హడావిడిలో మర్చిపోయాను. ఇందాకా బస్‌స్టాప్ దగ్గర రామనాధం గారు కనిపించి ఆంజనేయ స్వామి గుడి దగ్గర పొద్దున్న తొమ్మిది కల్లా ఉండమన్నారు’ జానకి రమణతో చెప్పింది. ఆమె చెప్పిన దానికి ఊ కొట్టి ఊరుకున్నాడు
***
ఎండ చిరచిర లాడుతోంది. మార్తాండుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గాలి ఎక్కడికి వెళ్ళిపోయిందో? ఆకులన్నీ కదలకుండా బిగుసుకొని ఉన్నాయి. ఉస్సురనుకుంటూ గుడి అరుగుల మీద కూర్చున్నాడు రమణ. పదకొండు గంటలకి వచ్చాడు రామనాధం. అప్పటికే కళ్ళు కాళ్ళు తేలుతున్నాయి, నీరసంగా ఉంది.
పొద్దున్న జానకి ఇచ్చిన నీళ్ళ టీ తప్ప కడుపులో ఏం పడలేదు. బండి నడుపుతూ, రామనాధం ఏదో మాట్లాడుతున్నాడు, అవేమి వినిపించటం లేదు రమణకి. మొత్తానికి ఒక గంట ట్రాఫిక్‌లో నానా కష్టాలు పడి ఆ జగన్నాధం గారింటికి చేరుకున్నారు. వాళ్ళ మాటలను బట్టి గత నాలుగు రోజులుగా వాళ్ళింట్లో గ్రహ శాంతులు జరుగుతున్నాయి. కొడుకు కోసం శని జపం, పెద్ద కూతురికి కొడుకు పుట్టాడు, ఆ పిల్లాడి నక్షత్రానికి అపమృత్యు దోషం ఉంది. ఆ దోష నివారణార్థం కలిపి ఈ శాంతి పూజలు జరిపిస్తున్నారని అర్థమయింది
ఇంతలో ‘రమణా రా, ఇదిగో ఈ దానం పట్టు’ అంటూ రామనాధం పిలిచాడు. జగన్నాధం గారి అమ్మాయి వచ్చి నిలుచుంది. ముందు కాళ్ళు కడిగి శనిదానం ఇప్పించారు. ఒక పళ్ళెంలో బియ్యం, కొన్ని నువ్వులు, చిల్లర డబ్బులుతో పాటు కొంత డబ్బు ఉన్నాయి, ఆ దానం గ్రహిస్తూ రమణ మనసులో ‘అమ్మా నీకున్న శనిదోషాన్ని నేను గ్రహిస్తున్నాను, ఇక మీకు ఈ దోషం అంటదు’ అనుకున్నాడు. ఆ తరువాత మృత్యు దోష నివారణ దానం కూడా తీసుకుంటూ, ‘ఈ మృత్యుదోషాన్ని నేను గ్రహిస్తున్నాను’ అనుకుంటూ అది కూడా అందుకున్నాడు. అక్కడితో ఆ తంతు ముగిసింది. అన్నీ అయ్యేసరికి నడిమధ్యాహ్నం అయింది.
నక నక లాడుతున్న కడుపుతో బస్సు ఎక్కి మూడు గంటలకి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లోకి వచ్చిన రమణ, చాప మీద వారగా పడుకున్న జానకిని లేపాడు. నీరసంగా ఉన్న ఆమెని చూస్తూనే ‘మళ్ళీ జ్వరమా?’ ప్రశ్నించాడు. అవునని తలూపింది. ‘సరేలే పడుకో, ఇదిగో అన్నట్లు ఈ డబ్బులు దాచు’ అంటూ వాళ్ళింట్లో ఇచ్చినవి ఆమె చేతికి ఇచ్చాడు. ఆ డబ్బులు చూసి ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ‘ఈ దానాలు తీసుకునే వాళ్ళంటే ఎంత చిన్న చూపు. దాని వెనుక ఉండే అర్థం తెలిసి కూడా ఇంత తక్కువ ఇస్తారా?’ మొహం తిప్పుకుంది భర్త చూడకుండా.
పచ్చడి, నీళ్ళ మజ్జిగతో కడుపు ఏం నిండుతుంది. ఆ అర్ధాకలితోనే చాప మీద వారగా పడుకున్నాడు. ఎన్నో ఆలోచనలు, బతుకు మీద విరక్తి, తన తాతగారు కాస్త ఉన్నవాడేనట. కాని ఆయన అర్ధాంతరంగా పోవడంతో తన తండ్రికి ఏమీ లేక అయన మేనమామ ద్వారా ఇదిగో ఇలా చావులకి, తద్దినాలకి, ఇలాంటి దానాలకి వెళ్ళేవాడు. అదే వారసత్వం తనకు వచ్చింది. మిడిల్ స్కూల్‌తో ఆపేయాల్సి వచ్చింది. కొన్నిరోజులు తండ్రి వెనుక వెళ్ళేవాడు. తాతగారి లాగే తండ్రి కూడా అర్ధాంతంగా పోవడంతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. ఉన్న ఇద్దరి చెల్లెళ్ళలో ఒక చెల్లి టైలర్ అబ్బాయితో ఎక్కడికో వెళ్ళిపోయింది. బతికి ఉందో లేదో కూడా తెలియదు. ఇంకో చెల్లిని పక్క ఊరిలో ఉండే అతనే చేసుకున్నాడు. అతను ఇద్దరి పిల్లల తండ్రి, అయితేనేం భార్యని పోషించుకునే స్థితిలో ఉన్నవాడు. రెండు వైపులా ఖర్చులు అతనే పెట్టుకున్నాడు. అతనిది అదో తత్వం. పెద్దగా రాకపోకలు లేవు.
కొంతకాలానికి బావగారి పినతండ్రి కూతురు అయిన జానకిని చేసుకోవలసి వచ్చింది. మరి కొంతకాలానికి తల్లి పోయింది. ఆపైన సంసారం పెరగడం, పొట్ట చేత్తో పట్టుకొని ఈ ఊరు రావడం, సావిత్రమ్మ గారి పుణ్యమా అని ఓ ఉండటానికి ఓ గూడు దొరికింది.
మరి ఇది నిజమా, కాకతాళీయమా తెలియదు. ఇలాంటి దానాలు తీసుకునే వాళ్ళలో ముందు జీవకళ పోతుంది. వంటి రంగు కూడా మారిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రేతకళ కనిపిస్తూ ఉంటుంది.
ఇలా ఆలోచనలతో నిద్రపోయిన రమణకి మెలకువ వచ్చేసరికి సాయత్రంయింది. స్కూల్‌కి వెళ్ళిన పిల్లలు ఇంటికి వచ్చారు. వాళ్ళని చూస్తూ అనుకున్నాడు ‘నాలాంటి అసమర్ధుడికి పుట్టిన పిల్లలు బక్కచిక్కినట్లుగా కాకుండా బంతులా ఉంటారా?’ అవును జానకి ఏది? అటు ఇటు చూసాడు, అది చూసిన పిల్లలు ‘నాన్నా,అమ్మ డాక్టర్ దగ్గరకు వెళ్ళింది’ అన్నారు.
ఇంతలో ‘రమణ గారు, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు’ అంటూ సావిత్రమ్మ గారి కారు డ్రైవర్ వచ్చాడు.
‘ఓహ్ వాళ్ళ అబ్బాయి వచ్చాడా అమెరికా నుంచి?’ అడిగాడు. ‘అవునండీ’ బదులిచ్చాడు అతను. ‘వస్తున్నా పద’ అంటూ అతని వెనకే వెళ్ళాడు రమణ.
***
అప్పటికే ఇద్దరూ చాలా సేపటినుంచి అలా కూర్చొని ఉన్నారు. ఒకళ్ళ నొకళ్ళు చూసుకుంటున్నారు ఏం చేద్దాము అన్నట్లు.
‘కాసేపు పడుకో. అసలే నీరసంగా ఉన్నావు. అవును మళ్ళీ ఆసుపత్రికి ఎప్పుడూ వెళ్ళేది’ .
‘రెండు రోజులు పోయాక’
‘మరి ఏమి చేద్దాం?’
‘చేసేదేముంది’
‘అదే నీ నిర్ణయమా?’
‘అవును, మరి మీది?’
‘ఇంచుమించుగా మనిద్దరిది పెళ్ళయినప్పటినుంచి ఒకటే మాట కదా! అలాగే కానిద్దాము’.
‘అబ్బ నిద్రపోతున్న పిల్లలని ముద్దు పెట్టుకోకూడదు’.
***
“అయ్యా!
నేను బతుకు తెరువు కోసం, తద్దినం మంత్రాలూ చెప్పుకుంటూ, దానాలు పట్టుకుంటూ జీవితాన్ని నడిపిస్తున్నాను. అయితే ఈ లోకం శనిదానాలు తీసుకుంటూ, మృత్యు దానాలు పడుతూ, శవాలు మోసే వాళ్ళను ఖాతరు చేస్తుందా? అసలు మేము ఈ సంఘంలో మనుషులుగా లెక్కకి వస్తామా? ఎవరైనా పట్టించుకుంటారా ? ఏంజీవితాలు? చదువు కోవటానికి డబ్బు ఉండదు, ఎటువంటి సాయం అందదు. ఇక ఆఫీసుల్లో ఉద్యోగం మాకు అందని ద్రాక్ష, ఏం చెయ్యాలి, ఎలా బతకాలి, ఇదే నిత్యం ఆలోచన. మీ కోసం మేం ఉన్నాము అనే అండ ఏది? ఉన్న దరిద్రాలకి జబ్బులు తోడయితే, డబ్బు బోలెడు ఖర్చు, తినటానికే గతి లేనివాడికి ఇవన్ని ఎక్కడ నుంచి తేవాలి, ఇక ఏదో కొంతమంది ధర్మాత్ములు అడగకుండా సాయం చేసినా, ఎంతకాలం? ఉంటున్న ఆ గూడు ఖాళీ చేసేయాలి, ఎక్కడకి వెళ్ళను, ఇంతమందిని తీసుకొని? నా ముందు అన్నీ జవాబు లేని ప్రశ్నలే. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాను. అది తప్పే కావచ్చు. ఎవరికి ప్రాణం తీసే హక్కు లేదు. కాని తప్పలేదు. బతికేందుకు తగ్గ ఆధారం, హంగులు లేవు. అందుకే ఈ నిర్ణయం, పిల్లలు వెర్రి నాగన్నలు, ఎప్పుడూ కూల్‌డ్రింక్ మొహం తెలియదు. అందుకే అవి చూడగానే ఆత్రంగా తాగేసారు. అందులో పురుగుల మందు కలిపానని తెలియదు. అయితే నాభార్య కి తెలుసు. ఇక కుటుంబ పెద్దని కదా అన్నీ చూసుకొని, ఈ ఉత్తరం ఎవరికైన చేరకపోతుందా? నా వ్యధ, బాధ ఏ ఒక్కరికయినా చేరితే, మేం పోయినా కనీసం మా గురించి ఆలోచిస్తారనే స్వార్థంతో ఈ నాలుగు ముక్కలు రాస్తున్నాను.
చివరిగా నా విన్నపం. ఈ ప్ర్రపంచంలో మాలాగా ఎందరో ఉన్నారు. వాళ్ళని గుర్తించండి, బతికేందుకు చేయూతనివ్వండి,
ఇట్లు
బతకడం ఎలాగో తెలియక చావుని ఆశ్రయించిన మనిషి.
అని ఉత్తరం రాసి అక్కడున్న దేవుడి పటం కింద పెట్టి, అప్పటికే సిద్ధం చేసి ఉంచుకున్న కూల్‌డ్రింక్ సీసాలోని ద్రవాన్ని గ్లాసులోకి పొయ్యబోతుండగా తలుపు చప్పుడయ్యింది. రమణ చెయ్యి వణికింది. జానకి భయంగా భర్త వైపు చూసింది. ఒక్క క్షణం ఇద్దరూ చలనం లేకుండా ఉండిపోయారు. మళ్ళీ తలుపు కొట్టిన శబ్దానికి రమణ ‘ఆ వస్తున్నా’ అంటూ లోగొంతుతో ‘వాటి మీద తువ్వాలు కప్పేయి’ అంటూ తలుపు తీసాడు.
“అయ్యో పడుకున్నారా, నన్ను రామనాధం గారు పంపించారు. రేపు మిమ్మల్ని గాంధీనగర్‌లోని వెంకటేశ్వర రావు గారింటికి రమ్మనమని చెప్పారు. మీకు ఇల్లు తెలియదని, నన్ను వెంట పెట్టుకొని రమ్మన్నారు. రేపు పొద్దున్న తయారుగా ఉండండి.”
“ఏమిటి సంగతి?” అని గొంతు పెగల్చుకొని అడిగాడు రమణ. “రేపు అక్కడకి వెళ్ళాక తెలుస్తుంది లెండి, ఒక్కటి మటుకు నిజం. రామనాధం గారి పుణ్యమా అని మనకి మంచి రోజులు వస్తున్నాయి, ఇప్పటికే పొద్దు పోయింది. ఇక నేను వెళ్తాను, పొద్దున్నే తయారుగా ఉండండి” అని మరో మారు చెప్పి వెళ్ళిపోయాడు అతను.
అంతవరకు అతని మాటల తుఫానులో ఉక్కిరిబిక్కిరి అయిన రమణ, ‘అయ్యో అతని పేరయిన అడగలేదు’ అనుకుంటూ తలుపు వేసి లోపలకి వచ్చే సరికి – హడావిడిగా వెనుక తలుపు తీసి కూల్‌డ్రింక్ సీసాలలోని ద్రవాన్ని కాలవలో పారపోసి సీసాలను చెత్తలో విసిరేసి, అదురుతున్న గుండెలతో లోపలికి వచ్చిన జానకి కనిపించింది. ఎదురుగా ఉన్న రమణని చూసేసరికి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. పడుకున్న పిల్లల దగ్గరకు వెళ్లి వాళ్ళను గుండెలకి హత్తుకుంటూ ‘ఒక్క క్షణంలో యెంత అనర్థం జరిగిపోయి ఉండేది’ అంటూ పదే పదే ముద్దులు పెట్టుకోసాగింది. రమణ హృదయంలో కూడా అదే మెదిలింది. ‘అతను రావడం ఒక్క క్షణం ఆలశ్యం అయి ఉంటే’ అని అనుకోసాగాడు. నెమ్మదిగా భార్య చెయ్యి పట్టుకుంటూ “రేపు రామనాధం గారు కలవమని చెప్పారు, విన్నావుగా” అన్నాడు.
సమధానంగా జానకి తలూపింది. కళ్ళముందు భవిష్యత్తు ఆనందంగా కనిపిస్తోంది. ఎన్నో ఆశలు, ఆలోచనలు కలుగుతున్నాయి. జీవితం మీద ప్రేమ మొదలయింది. బతుకుకి భరోసా దొరకుతోందన్న ఆనందం ఆమె కళ్ళలో కనిపిస్తోంది…