మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-18

0
3

[భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్రను అనువదించి అందిస్తున్నారు శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే.]

అధ్యాయం 18 – జాతీయ వ్యక్తిత్వం

[dropcap]ఉ[/dropcap]న్నతమైన దేశాన్ని నిర్మించాలంటే ఉన్నతమైన వ్యక్తులను సృష్టించడమే మార్గం. విజయవంతమైన దేశం, సాధారణంగా, ఎక్కువ మంది సమర్థులు, మంచి స్వభావం, సహేతుకమైన, అధిక కర్తవ్య నిష్ఠ కలిగిన పౌరులను కలిగి ఉంటుంది. తనను విశ్వసించాలని కోరుకునే వ్యక్తికి మంచి వ్యక్తిత్వం ఉండాలి. వ్యాపారానికి పునాది ఉద్దెర ఇవ్వడంలో ఉందని మనకు తెలిసిందే. ఉద్దెర వ్యాపారం విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసం ఉన్నత వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది.

ప్రజలు తమను తాము సమర్థవంతమైన ఆధునిక దేశంగా నిర్మించుకోవడానికి అవసరమైన జాతీయ ఆదర్శాలు, విధులు తప్పనిసరిగా ఉండాలి. వాటిని అమలు చేయడానికి అందుబాటులో ఉన్న మేధావుల ఉత్తమ సలహాలతో నిర్దిష్ట విధానాలు, పక్కా ఆచరణాత్మక ప్రణాళిక తయారు కావాలి.

ప్రస్తుతం భారతదేశ జనాభాలో అధిక శాతం మంది నైపుణ్యం లేనివారు. క్రమశిక్షణ లేనివారు. కొద్ది శాతం మాత్రమే మనం ఆశిస్తున్న ప్రమాణాలకు చేరుకున్నారని చెప్పవచ్చు. అత్యధికులు మూడు ‘R’ (Reduce – Reuse – Recycle) లు కూడా తెలియనివారు. నిలువ నీరు లాగా ప్రాచీన అభివృద్ధి నిరోధక విధానాలు, సాంప్రదాయ పద్ధతులను అనుసరించడంలో సంతృప్తి చెందుతున్నారు.

ఈ స్థితిలో అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశం సమర్థవంతమైన దేశంగా అభివృద్ధి చెందడానికి భారతీయులకు ఎలాంటి సలహాలు ఇస్తాయని ఆశించలేము. ప్రభుత్వం, జాతీయ స్థాయి నాయకులు ఇద్దరూ దేశ జనాభాలో ఉన్నతమైన జాతీయ స్వభావాన్ని, ప్రగతిశీల ప్రవర్తనను, సంబంధిత ఆరోగ్యకరమైన అలవాట్లను నిర్మించే ఈ బాధ్యతను స్వీకరించాలి.

ఉన్నత జాతీయ స్వభావాన్ని పెంపొందించడం అనేది దేశం దీర్ఘకాలిక విధానాలలో ఒకటిగా ఉండాలి. భారతదేశం ప్రపంచ దేశాల సరసన సమర్థతతో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకునే ప్రతి పౌరుడు ఈ విధానాలను ప్రోత్సహించాలి.

ఉన్నత వ్యక్తిత్వం, సమర్థత, అధిక పని సామర్థ్యం, దీర్ఘకాలంలో స్థిరమైన, సౌకర్యవంతమైన జీవనానికి దారి తీస్తుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల వంటి అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలోని ప్రజలు ఈ అంశాలలో సాధించిన ప్రమాణాలతో పోలిస్తే ప్రస్తుత భారత సమాఖ్యలో నివసిస్తున్న ప్రజలు చాలా వెనుకబడి ఉన్నారు. రెండు సమాజాల ప్రజల జీవన ప్రమాణాల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయి.

విద్య, ప్రణాళికాబద్దమైన జీవనం:

సగటు భారతీయుడికి తక్కువ సంపాదనా సామర్థ్యం ఎందుకు ఉంది అంటే ప్రధాన కారణాలలో దేశ జనాభాలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు అని చాలా తరచుగా నొక్కి చెప్పలేము. నిరక్షరాస్యతతో పాటు వారిలో సక్రమమైన జీవన విధానాలు, అలవాట్లు లేకపోవడం కూడా ప్రజలను పేదలుగా, అసమర్థులుగా ఉండిపోవడానికి కారణం అవుతున్నాయి.

ప్రధానంగా ఈ లోపాల ఫలితంగా సగటు భారతీయుడు క్రమరహితంగా, ఎక్కువగా సంప్రదాయాల మీద ఆధారపడి జీవిస్తాడు. అతనికి ప్రగతిశీల జీవనానికి అవసరమైన మార్గనిర్దేశనం లోపించింది. దేశంలో చాలా మంది తెలివిగల వ్యక్తులు ఉన్నారు. వారు చదువుకోకపోయినా వారి పరిమిత జ్ఞానంతో వారు పని చేస్తున్న రంగాలలో తెలివిగా ఆలోచించడం, విజ్ఞతతో అవగాహన చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. అయితే, సాధారణంగా చెప్పాలంటే, అవిద్య వారిని జీవితంలోని ఉన్నత లక్ష్యాల నుండి, ఆధునిక పరిజ్ఞానం నుండి ఇనుప తెరతో మూసివేస్తుంది.

కొంతమంది పౌరులు విద్య లేకపోయినా అసాధారణమైన సహజసిద్ధ ప్రతిభతో సమాజంలో పరపతిని సాధించవచ్చు. అభివృద్ధిని పొందవచ్చు. కానీ ఉన్నత విద్య, క్రమశిక్షణతో కూడిన అలవాట్లు, ఆలోచనాత్మకమైన జీవిత ప్రణాళిక మనిషి వ్యక్తిత్వాన్ని, జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుకోవడానికి అత్యంత విలువైన సాధనాలు.

అమెరికా వంటి దేశాలు మరింత సంపన్నంగా ఉండటానికి, ఉన్నత స్థాయి నాగరికతను నిర్వహించడానికి, వారి ప్రజలు ఎక్కువ కాలం జీవించడానికి వారు ప్రపంచంలోని అత్యున్నత విద్యా సౌకర్యాలను పొందడమే కారణం. అక్కడి ప్రజలు ప్రపంచ వ్యవహారాల గురించి బాగా తెలుసుకుంటారు. వారు ఒక నిర్దిష్ట లక్ష్యం లేదా ప్రణాళికను కలిగి ఉంటారు. వారు క్రమశిక్షణతో కూడిన అలవాట్లతో పని చేస్తారు.

సగటు అమెరికన్ పౌరుడు విద్యలో మన కంటే మెరుగ్గా ఉన్నాడు. ఆచరణాత్మక నైపుణ్యం, యాంత్రిక పరికరాలకు సంబంధించిన జ్ఞానం, ప్రపంచం పరిణామాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. అమెరికన్లు గొప్ప నిర్వాహణ సామర్థ్యం, చొరవను కలిగి ఉన్నారు. వారు భారతదేశ ప్రజల కంటే చాలా ఎక్కువగా కష్టపడి పని చేస్తారు. వారు క్రమశిక్షణతో కూడిన జీవితాలను గడుపుతారు. జీవితంలో కష్టపడి పనిచేయడం వలన అసాధారణ రీతిలో వారిని మరింత శక్తివంతంగా, బలంగా మార్చి పని చేసే సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. వారు యోగ్యత, సామర్థ్యం, నిష్ఠాపరత్వం ఉన్న నాయకులను కలిగి ఉన్నారు. అనేక తరాల నుంచి వారి వారి వృత్తులు లేదా సంస్థల్లో సంచితం అయిన అనుభవాన్ని, జ్ఞానాన్ని స్వంతం చేసుకున్నారు. వాటి ఆధారంగా జాతికి మార్గనిర్దేశం చేస్తున్నారు. మరోవైపు భారతదేశంలో అత్యధిక జనాభా నిరక్షరాస్యులు. వారి పూర్వీకుల జీవన విధానాన్ని అనుసరించడంలోనే సంతృప్తిని పొందుతున్నారు. పెద్ద సంఖ్యలో జనం జీవితంలో ఏ ఆశయాలు, లక్ష్యాలు, చొరవ లేకుండానే జీవితాలను గడిపేస్తున్నారు. ఇప్పుడు తమను తాము ప్రస్తుత పోటీ వాతావరణంలో సౌకర్యవంతమైన జీవనాన్ని పొందేందుకు ఇబ్బంది పడుతున్నారు.

విద్య లేకపోవడం వల్ల నిష్క్రియత, ఆశయం లేకపోవడానికి దారితీసింది. తమని తాము చక్కదిద్దుకోవడానికి వారిలో సృజనాత్మక శక్తి, సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి లేదా పూర్తిగా లోపిస్తాయి. ప్రధానంగా విద్య లేకపోవడం వల్ల సగటు భారతీయుడి సంపాదనా శక్తి ఆచరణలో అమెరికన్ సగటు పౌరుడితో పోలిస్తే పదో వంతు కంటే తక్కువగా ఉంది. భారతదేశంలో ఆయుర్ధాయం అమెరికాతో పోలిస్తే సగం కంటే తక్కువగా ఉంది.

రష్యాలో విద్యా రంగంలో సంస్కరణల అమలును ప్రారంభించినప్పుడు వారి జనాభాకు మొట్టమొదట ప్రవేశపెట్టినటువంటి నిర్బంధ ప్రాథమిక విద్య భారతదేశంలో పురోగతికి ఒక ముఖ్యమైన ప్రాథమిక అవసరం. ఈ గంభీరమైన లోటును ఇకపై మన జాతీయ ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశిస్తున్నాము.

1946లో రచయితకు న్యూయార్క్ లోని విద్యాశాఖ అధికారులు “పాఠశాలకు వెళ్లే వయస్సులో ఉన్న పిల్లవాడు విద్యా సంస్థకు హాజరుకాకపోతే తల్లిదండ్రులే బాధ్యత వహించాలి. ప్రభుత్వం వారిని నిర్బంధించవచ్చు” అని చెప్పారు. భారతదేశంలో ఈ రకమైన దృఢత్వం అమలులో లేదు. ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్దేశించినప్పుడు కూడా ఆదేశాలు, నియమాలు, సూత్రాలు అమలుకావడం లేదు.

జీవితానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక ఆలోచనలు, ప్రపంచ వ్యవహారాల పరిజ్ఞానం:

ఈ విషయంలో కొన్ని ప్రాథమిక ఆలోచనలను నిర్దేశించుకోవచ్చు. ఇవి మనం చేపట్టబోయే సంస్కరణలకు నేపథ్యాన్ని ఏర్పరుస్తాయి.

సాధారణంగా లభించే సమాచారం ఆధారంగా సగటు భారతీయుని పని శక్తి ఊహించలేనంత తక్కువ స్థాయిలో ఉంటుంది. నేను ఊహించలేనంతగా అని ఎందుకు చెబుతున్నానంటే.. వృద్ధిని కొనసాగించడానికి అవసరమైన జీవనాధార సాధనాల కంటే జనాభా వేగంగా పెరుగుతోంది. భారతదేశం వ్యవసాయ దేశమైనప్పటికీ, దాని జనాభాకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో విఫలమైతున్నది. ప్రస్తుతం విదేశాల నుండి అవసరమైన ఆహార దిగుమతికి చెల్లించడానికి ఇతర వృత్తులు లేదా సాధనాల ద్వారా తగినంతగా సంపాదించడం లేదు.

పాశ్చాత్య దేశాలలో ఒక సాధారణ నినాదం:

నువ్వు పని చేయకపోతే.

తిండి తినడానికి అనర్హుడివి.

ఈ నినాదం ప్రాముఖ్యతను భారతీయ పౌరుడు ఇంకా తగినంతగా గ్రహించలేదు. తన పని ద్వారానే ఒక వ్యక్తి జీవనోపాధి పొందగలుగుతాడు.

ప్రతి మనిషి తనకు, తన కుటుంబానికి సంతృప్తికరమైన జీవనోపాధిని పొందేందుకు, ఇతరులపై భారం కాకుండా తగినంత పనిని బాధ్యతగా చేయడానికి సిద్ధపడాలి. అతను మునుపటి కంటే ఎక్కువ చేయాలి. అతను చేయగలిగే స్థితిలో ఉంటే తన దేశానికి, పొరుగువారికి మామూలుగా ఏదైనా ఇతర సేవలను అందించాలి. అధిక జ్ఞానం లేదా నైపుణ్యం, సామర్థ్యం లేదా ఆశయంతో చేసే పని సాధారణంగా తదనుగుణంగా అధిక ప్రతిఫలాన్ని అందిస్తుంది.

వ్యక్తులను సమర్థవంతంగా తీర్చిదిద్దాలంటే సగటు భారతీయుడు మరింత కష్టపడాలి. అతను ఇప్పటి కంటే క్రమశిక్షణతో కూడిన మెరుగైన అలవాట్లను అలవర్చుకోవాలి. తనంతట తాను, పరిస్థితులు అనుమతించినంత మేరకు, సాధారణ ప్రపంచ వ్యవహారాలపై మంచి అవగాహనతో సన్నద్ధం కావాలి. తనను తాను ప్రగతిశీలిగా భావించే ప్రతి వ్యక్తి అటువంటి జ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. అతను అధిక సామర్థ్యం, యోగ్యతను కలిగి ఉంటే, ఆశయాల ద్వారా ప్రేరణ పొందినట్లయితే, అతను తనకు ఎదురయ్యే ఏ పనినైనా సాధ్యమైనంత సమర్ధవంతంగా చేయడానికి తన వంతు కృషి చేయాలి. గొప్పగా మారిన ప్రతి మనిషి తన విజయాలకు నిరంతరమైన తన శ్రమకు ఫలితం అని గుర్తిస్తాడు.

భారతదేశంలో మనం ఈ వాస్తవాలు, ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయడానికి శిక్షణ పొందలేదు. మనం మృదువైన పరిస్థితులు, నీరసమైన ఆదర్శాల క్రింద పెరిగాము. ప్రమాదాలు తలెత్తినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి మనకు శిక్షణ లేదు. పాశ్చాత్య పారిశ్రామిక నాయకులు ఈ విషయంలో చాలా శిక్షణ పొందారు. వారు సంఘర్షణకు, చొరవకు, సాహసానికి అలవాటుపడిన జాతి నుండి వచ్చారు.

అమెరికన్లు నేడు అత్యంత ధనిక జాతిగా నిలబడినారు. వారు ప్రపంచంలోనే అత్యధిక స్థాయి జీవన ప్రమాణాలు కలిగి ఉన్నారు. ఇంకా సందర్భం వచ్చినప్పుడు దేశం కోసం వారు దేనికైనా.. పోరాడటానికైనా, తమ ప్రాణాలను త్యాగం చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటారు.

భారతదేశంలో మన ఆలోచనా విధానం, జీవన తాత్వికత భిన్నంగా ఉంటుంది. దానికి ఆశయాలుగాని, హడావుడి గాని లేవు. బోస్టన్ లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శ్రీ సమ్నర్ స్లిచ్‌టర్ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగిన ఒక పబ్లిక్ కార్యక్రమంలో ఈ క్రింది విధంగా అభిప్రాయాలు వ్యక్తీకరించారు:

“నిస్సందేహంగా భద్రత అనేది మనిషి ఆదర్శాలలో ఉన్నత స్థానానికి అర్హమైనది. అయితే, ఏ దేశం కూడా కేవలం భద్రత కోసం కృషి చేయడం ద్వారా గొప్పతనాన్ని సాధించలేదని గుర్తుంచుకోండి.. మనిషిలో ఉత్తమమైన లక్షణాలను తీసుకురావడానికి మరింత సానుకూల, చలనశీలమైన ఆదర్శాలు అవసరం. గొప్పగా ఉండాలని కోరుకునే దేశం తప్పనిసరిగా భద్రత కంటే అంతర్గత వ్యవస్థలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రాధాన్యతనివ్వాలి. చాలా మందికి ఉపాధి అవకాశాలు కొందరి చొరవ పైననే ఆధారపడి ఉన్నాయి. అందువల్ల దేశం ఆవిష్కర్తలు, ప్రయోగాలు చేసేవారు, పరిశ్రమలను స్థాపించేవారిని ఉపయోగకరమైన పౌరులుగా ప్రత్యేకంగా పరిగణించాలి. వారికి అనుకూలమైన, ఆతిథ్య వాతావరణాన్ని అందించడానికి ముందుకు సాగాలి.”

ప్రొఫెసర్ శ్రీ సమ్నర్ స్లిచ్‌టర్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం

“దేశం తన పౌరుల నుండి ప్రయోగాలు చేసేవారి, కొత్త ఆవిష్కర్తలను చేసేవారి నిష్పత్తిని పెంచడానికి తీవ్రంగా ప్రయత్నించాలి. వారి జీవనం కోసం వేరొకరి నుంచి వేతనాలు పొందడం ద్వారా కాకుండా తామే ఇతరులకు ఉపాధి అవకాశాలు సృష్టించడం ద్వారా జరగాలి.”

ఆధునిక దేశాలు తమ పౌరుల్లో పరిశ్రమ, ఐక్యత, ముందస్తు ఆలోచన, ఆశయం లాంటి ఇతర ఆరోగ్యకరమైన లక్షణాలు అభివృద్ధి చేసినారు. వారు పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన స్థాయిలో పని చేయడం కూడా నేర్చుకున్నారు.

‘న్యూయార్క్ వరల్డ్’ మాస్టర్ జర్నలిస్ట్ అయిన శ్రీ జోసెఫ్ పులిట్జర్ జీవితంలోని ఖచ్చితత్వం లేదా అత్యున్నత ప్రమాణాలు అందుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు ‘పియర్సన్’ పత్రిక మార్చి 1909 సంచిక నుండి తీసుకున్న ఈ క్రింది వాక్యాలు ఒక ఉదాహరణగా నిలుస్తాయి.

న్యూయార్క్ వరల్డ్ పత్రిక ప్రచురణకర్త జోసెఫ్ పులిట్జర్

“అతని వార్తాపత్రికల పాత్రికేయులు అందించిన సమాచారం మేరకు, అతని (శ్రీ పులిట్జర్) మానసిక మరియు నైతిక శక్తులు తక్షణమే అప్రమత్తం అయిపోతాయి. అతని దృష్టికి వచ్చిన విషయానికి సంబంధించిన వాస్తవాలను అత్యంత శక్తివంతమైన, అద్భుతమైన రీతిలో సేకరించడానికి లేదా ఆ వాస్తవాలను విశ్లేషించడానికి అతను గంటల తరబడి కష్టపడతాడు. లేదా మనలను విస్మయపరచడానికి, ఒప్పించడానికి వారు వాడే చక్కని, అత్యంత ఖచ్చితమైన, మరపురాని ఒక పదబంధాన్ని లేదా పదాన్ని కూడా అనుభూతి చెందగలము. ఇది క్రమశిక్షణ ఇచ్చే అంతిమ ఫలితం.”

పియర్సన్ పత్రిక ముఖ చిత్రం

ప్రపంచంలో ప్రస్తుతం నెలకొని ఉన్న తీవ్ర పోటీ వాతావరణంలో, ప్రతి సమాజం విజయవంతమైన వ్యాపారవేత్తల సమూహంగా మారడానికి మంచి అలవాట్లు, మంచి ప్రవర్తన అనివార్యం. ప్రణాళికాబద్ధమైన పని, క్రమశిక్షణతో కూడిన అలవాట్లు అతనిని మంచి ఆరోగ్యంతోజీవించడానికి, అతని ఆయుర్దాయాన్ని పొడిగించేవి అని సగటు పౌరుడు తన అనుభవం నుండి నేర్చుకుంటాడు.

నిర్ధిష్టమైన పని గంటలు, విధులకు సమయానికి హాజరు కావడం, ప్రామాణిక వ్యాపార విధానాలు, సమయం విలువను గుర్తెరగడం వంటి కొన్ని ఆచరణలు ఒక వ్యక్తి సంపన్నమైన, బాదరబంది లేని, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందే అవకాశాలను మెరుగుపరచుకోవడంలో సహాయపడతాయి.

సహజమైన తెలివితేటలు, సామర్థ్యం ఎక్కువగా ఉండవచ్చు లేదా తక్కువగా ఉండవచ్చు. అయితే వారు తగిన ప్రతిఫలాన్ని పొందేందుకు ముందుచూపు, అకుంఠిత దీక్ష, సంకల్ప బలం ద్వారా నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉండాలి.

ఏ వృత్తిలోనైనా లేదా వ్యాపారంలోనైనా విజయం సాధించాలంటే దానిని నిర్వహించేవారి సామర్థ్యం, ఉన్నత వ్యక్తిత్వం, సమగ్రత, వ్యక్తి దూరదృష్టి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితంలో విజయాలు తమ స్వంత శ్రమపై ఆధారపడి ఉంటాయి. జీవితంలో చాలా పడవ మునక లాంటి అపజయాలు, బహుశా అవన్నీ ప్రమాదవశాత్తు సంభవించినవి కావు (మోనిస్ట్ అనే పత్రిక పాత సంచికలో చెప్పిన ముచ్చట). ప్రజలు సుఖాలకు అలవాటుపడి కష్టాన్ని మరచిపోవడం వలన అపజయాలు సంభవిస్తాయి. సుఖాలకు మరిగి బాధను నివారించడం అనే లక్ష్యంతో ఉన్న వ్యక్తి గోడకు గుద్దుకోవడం ఖాయం. సుఖాలపై అదుపు, బాధలను అధిగమించడంపై పట్టు సాధించడం అనేది జీవితంలో ఏదైనా శాశ్వతమైన, ఆశించిన విజయాలకు ఆధారంగా నిలుస్తుంది. అది నైతిక ఆచరణలు ఇచ్చే గౌరవం మన జీవితం మీద వేసే గాఢమైన ముద్ర. ఒక గొప్ప వ్యక్తి గొప్పతనానికి శాశ్వతత్వాన్ని తీసుకువచ్చే అనివార్యమైన స్థితి అది.

ఆచరణ సూత్రాలు:

భారతీయ పౌరుడు సులభంగా గుర్తుంచుకోవడానికి వీలుగా ప్రవర్తనను నియంత్రించడానికి ఏవైనా సూత్రాలు, నియమాలు సంక్షిప్త రూపంలో ఇవ్వాలి. వాటిని నాలుగు విభాగాల క్రింద క్రోడీకరించడానికి ప్రయత్నిస్తున్నాను.

(i) కష్టతరమైన పని:

సగటు భారతీయుడు విషయాలను తేలికగా తీసుకోవడానికి మొగ్గు చూపుతాడు. రోజువారీ జీవితంలో అతను చేసిన పని లేదా కృషి చాలా తక్కువ. దాని పర్యవసానంగా దేశం సమర్థత, ఆర్థిక బలం చాలా తక్కువగా నమోదు అవుతున్నది.

పాశ్చాత్య దేశాలలో పౌరులు కష్టపడి పని చేస్తారు. వారి పని నాణ్యత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు సంపాదించే ఆదాయం, వారి జీవన ప్రమాణాలు రెండూ తులనాత్మకంగా చాలా ఎక్కువగా ఉంటాయి.

(ii) ప్రణాళికాబద్ధమైన, క్రమశిక్షణతో కూడిన పని:

ప్రతిరోజు క్రమం తప్పకుండా నిర్ణీత గంటల సమయాన్ని కేటాయించి క్రమశిక్షణతో పని చేస్తే, అది మన శ్రమ విలువను గణనీయంగా పెంచుతుంది.

క్రమశిక్షణతో చేసే శ్రమ చాలా సందర్భాలలో కార్మికుడిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అతని ఆయుర్ధాయాన్ని పొడిగిస్తుంది.

అన్ని పరిస్థితులలో విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ప్రజాదరణ పొందిన నమ్మకాన్ని విసర్జించాలి. చాలా మంది ప్రజలు ఉపశమనం కోసం పని మార్పును ఆశ్రయిస్తారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. విశ్రాంతి ద్వారా కాదు పనిలో నిమగ్నం కావడం ద్వారా ఉపశమనం పొందాలి.

(iii) సమర్థత:

సమర్ధత అంటే.. కర్తవ్య నిష్ఠ, ఆశయం, సమయపాలన, క్రమశిక్షణ, ఖచ్చితత్వం, సాధ్యమైనంత ఎక్కువ నాణ్యతతో తమ పని చేయాలనే కోరిక వంటి లక్షణాలను ఉన్నత స్థాయిలో కలిగి ఉండడం. సాధారణంగా పనిలో నాణ్యత ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది.

(iv) మర్యాద, సేవ:

పాశ్చాత్య దేశాల్లో తోటి సిబ్బందితో సామరస్యంగా, స్నేహపూర్వకంగా పని చేసే విధానం ఎంతో ప్రశంసనీయమైనది. అదే స్థాయిలో వ్యక్తుల మధ్య స్నేహపూర్వక భావనలు ప్రస్తుతం భారతదేశంలో లేదు.

తోటి కార్మికులు లేదా పొరుగువారి పట్ల ప్రతి పౌరుడి ప్రవర్తన సామరస్యంతో, మర్యాద పూర్వకంగా సాగాలని మనం గుర్తించాలి.

విజయం సాధించాలనుకునే వారు, యోగ్యమైన వ్యక్తిగా సమాజం తమని గుర్తించాలని ఆశించే ప్రతి పౌరుడు పై నాలుగు సూత్రాలను నిరంతరం దృష్టిలో ఉంచుకోవాలి.

ఈ ప్రయోజనకరమైన లక్షణాలు వాటికవే శిక్షణ లేకుండా మనలో ప్రోది కావు. జపాన్‌లో చేసినట్లుగా, ప్రభుత్వ ఆదేశానుసారం, విద్యా సంస్థలలో, వయోజన జనాభా కోసం ప్రచారం ద్వారా పౌరులకు ఇటువంటి శిక్షణ ఇవ్వాలి.

జాతీయ ప్రభుత్వం క్రింద ఉన్న ప్రస్తుత పరిస్థితి మనలో ఇటువంటి కొత్త కోరికలను, కొత్త ఆశయాలను రేకెత్తించింది.

పైన పేర్కొన్న నాలుగు సూత్రాలు దేశ ప్రజల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను; దేశ ప్రజలు తమ విధుల నిర్వహణ పట్ల బాధ్యతను పెంపొందించడానికి ఉద్దేశించినవి.

***

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here