రైతుకన్యే రాణి!

    1
    3

    [box type=’note’ fontsize=’16’] “దివాన్ సాహెబ్! మేం రాజపూత్‍లం. ప్రాణత్యాగమైనా చేస్తాం కాని కూతురింట పచ్చి మంచినీళ్ళు కూడా తాగం. మేం అందించగల అతిథి మర్యాదలు అందుకోడానికి సిద్ధంగా ఉంటేనే ఈ వివాహం జరుగుతుంది” అని ఖరాఖండిగా చెప్తాడు వధువు తండ్రి “మహారాణి అయిన రైతు కన్య” అనే వాస్తవిక కథలో. [/box]

    [dropcap style=”circle”]క్[/dropcap]రీస్తు శకం 1850 నాటి సాయంకాలం.

    నేల వాలుతున్న సూర్యుడు ఆకాశమంతా కుంకాన్ని పులిమి వీడ్కోలు చెప్తున్నాడు. ఊరి చెరువు నీలం కోక మార్చేసుకుని ఎర్రకోక కట్టేసుకుంది.

    దూరంలో ఉన్న కోవిల కలశాలు పసిడి వన్నెలీనుతున్నాయి. చల్లని తెమ్మెరలు మానవ శరీరాలకు ఎర్రచందనం పూస్తున్నాయి. విరులు వికసించిన తోటలు పర్యావరణాన్ని మత్తెక్కిస్తున్నాయి.

    ఉత్తర కోస్తాలో నున్న విజయనగరం యువరాజు పూసపాటి విజయరామరాజు గజపతి వారణాసి వద్దనున్న చంద్రావతీ గ్రామంలో బగ్గీలో వాహ్యాళికి వెళుతున్నారు. ఆ వంశంలో ఆయన ఆ పేరు గల మూడవ రాజు.

    ఆయన వారణాసిలో ఉండడం వెనుక ఓ కథ ఉంది.

    ఆయన తండ్రి నారాయణ గజపతి 1827లో వారణాసి తరలివచ్చారు. దానికి కారణమేమిటంటే విజయనగరం సంస్థానం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి చెల్లించవలసిన కప్పం చెల్లించకపోయింది.

    వర్షాభావం వలన శిస్తులు వసూలు కాకపోవడం, నారాయణ గజపతి మితిమీరి ఖర్చు పెట్టే స్వభావం, అప్పటి దివాన్ అవినీతి ఈ పరిస్థితికి దారితీశాయి.  అందువలన నారాయణ గజపతి 1827లో ప్రభుత్వం తనకి సంవత్సరానికి లక్ష రూపాయలు జీవనభృతిగా చెల్లించే షరతుపై సంస్థానాన్ని కలెక్టరుకు స్వాధీనం చేసి వారణాసికి తరలి వచ్చారు.

    ఏనుగు బ్రతికినా, చచ్చినా వెయ్యే అన్నట్టు నారాయణ గజపతి వారణాసిలో కూడా భవ్యమైన కోట కట్టుకుని లెక్కలేనన్ని భూములు, భవంతులు, తోటలు, జవాహిరి సంపాదించి సర్వసుఖాలు అనుభవిస్తూ 1845లో అక్కడే కాలం చేశారు.

    విజయనగరం సంస్థానానికి చంద్రావతీ గ్రామంలో కూడా భూములు, ఊరు బైట ఉద్యానం మధ్య దివాణం ఉన్నాయి. విజయరామరాజు వారణాసి నుంచి అక్కడికి వెళ్ళి వస్తూంటారు.

    రాజుగారికి యుక్త వయసు వచ్చింది. దేశం నలుమూలల నుంచి సంబంధాలు వస్తున్నాయి. ఆయన ఆ రాజకుమార్తెలను చూస్తున్నారు కానీ ఇంతవరకు ఆయనకు నచ్చిన రాజకుమార్తె కనబడలేదు. అందచందాలలో, వంశగౌరవంలో, సంపన్నతలో ఆ రాజకుమార్తెలు ఎవరికి వారే సాటి.

    రాజమాత తొందరగా పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తోంది.  కోడలి అందెల గలగలలు, మనవల కేరింతలతో ఇల్లు మారుమోగాలని ఏ ఇల్లాలు కోరదు!

    బగ్గీ గ్రామం లోంచి వెళుతోంది. ఆ చల్లని గాలి అలల్లో ఓలలాడుతూ తన ఆలోచనా లోకంలో విహరిస్తున్నారు రాజుగారు. తాను చూసిన రాచభామలు చక్కని చుక్కలే కానీ తన మన మనసును ఎవరూ ఎందుకు ఆకట్టుకోలేదు? ఎందుకంటే ఎక్కడో అక్కడ తనను మోహించే అందాలరాశి ఉండి ఉండాలంటోంది మనసు.

    దారి పక్కగా ఓ పడతి తలపై కట్టెలతో ఎదురు వచ్చింది. ఆమెపై దృష్టి పడగానే ఆయన ఆలోచనా లోకం మాయమైంది. సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు రాజుగారు.

    ఈ కుగ్రామంలో ఇంత సౌందర్యరాశా? అదినూ కట్టెలు మోస్తూనా! సృష్టికర్త తీరికగా కూర్చుని చెక్కిన పాలరాతి ప్రతిమలా ఉంది. ప్రతి అవయవాన్ని ఆచితూచి లేశమైనా తృటి లేకుండా తీర్చిదిద్దిన అలౌకిక చిత్రకారుడి చిత్రంలో సుందరిలా భాసిస్తోంది ఆ అపురూప పద్మాక్షి. ఆ గౌరాంగి బగ్గీ వైపు దృష్టి సారించి రాజుగారి హుందాతనాన్ని, ఠీవిని చూసింది. కళ్ళల్లో మురిపాలు మెరిపిస్తూ, మేని విరుపుల్లో సొగసులు చిందిస్తూ ఆమె ముందుకు సాగింది.

    నెత్తిపై కట్టెలున్నా ఆమె నడుస్తూంటే నాగుబాములా మెలికలు తిరుగుతున్న ఆమె కటి ఒలకబోస్తున్న సొబగులు ఇంతవరకూ ఏ స్త్రీ లోనూ చూడలేదే అనిపించింది ఆ రాచ యువకాడికి.

    సాధారణ పల్లె స్త్రీ ధరించే వస్త్రాలు ధరించినా, చెవులకు కమ్మలు, ముక్కుకి బులాకి, మెడలో పూసల హారం మాత్రం వేసుకున్నా ఆమె కారుచీకటిలో దీపంలా ప్రకాశిస్తోంది.

    ఆ కన్యను దాటి బగ్గీ ముందుకు సాగింది. బగ్గీని ఆపమని తెల్లని తలపాగా, ఎర్రని కోటు నడిపైకట్టుతో బండి వెనుక చిన్న బల్లపై నిలబడిన సేవకుడికి సౌంజ్ఞ చేశారు రాజుగారు. సేవకుడు దుమికి బండి ముందుకు పరిగెత్తి బగ్గీ ఆపాడు.

    బగ్గీ చోదకుడి పక్కన కూర్చున్న తన వ్యక్తిగత ముఖ్య సేవకుడిని తన వద్దకు పిలిచారు రాజుగారు. అతను దిగి వచ్చి చేతులు కట్టుకుని నేల వైపు చూస్తూ రాజుగారి దగ్గర నిలుచున్నాడు. రాజావారు అతడితో ఏదో రహస్యంగా చెప్పారు. అతడు “చిత్తం” అనగానే బగ్గీ ముందుకు సాగింది. ముఖ్యసేవకుడు గ్రామం వైపు నడిచాడు.

    ఆ రాత్రి ముఖ్య సేవకుడు దివాణంలో రాజుగారిని కలుసుకుని ఈ విధంగా విన్నవించాడు.

    “మహాప్రభూ! ఆ కన్య పేరు రాజేశ్వరి. తండ్రి ఠాకూర్ రతన్‌సింగ్. సూర్యవంశీయ రాజపూత్ రైతు. కొద్దిగా సాగుభూమి, పశువులు ఉన్నాయి. మట్టి గోడలు గల పెంకుటింటిలో ఉంటున్నారు. వ్యవసాయమే బ్రతుకుతెరువు. సామాన్య రైతు కన్యలా ఆమె కట్టెలు తేవడం, పిడకలు చేయడం, పశువులకు దాణా పెట్టడం మొదలగు పనులు చేస్తూంటుంది.”

    “సరే! ఈ సంగతి నీ వరకే ఉంచు.”

    రాజుగారు రాత్రల్లా నిద్ర పోలేకపోయారు. ఆయన మనసు నిండా ఆ రైతు కన్యే ఉంది. కానీ తన వంశానికి ఉత్తర కోస్తా ప్రాంతంలో సుదీర్ఘ పరిపాలనా చరిత్ర ఉంది. జయపురం, బొబ్బిలి, పాలకొండ, కురుపాం, మేరంగి, అనకాపల్లి, కశింకోట మొదలగు జమీందారులంతా విజయనగరం మహారాజులకు సామంతులే.

    ఆంగ్లేయులు వచ్చి తమ నక్కజిత్తులతో క్రమంగా విజయనగరం సామ్రాజ్యాన్ని జమీందారీగా మార్చి, మహారాజా బిరుదును మాత్రం ఉంచి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రస్తుతం సంస్థానం కలెక్టర్ యాజమాన్యంలో ఉంది. అతడు రైతుల నుంచి శిస్తులు వసూలు చేసి సంస్థానం ఈస్ట్ ఇండియా ప్రభుత్వానికి చెల్లించవలసిన ఋణం… అనగా బకాయి పడిన కప్పం చెల్లిండడానికి ప్రయత్నిస్తున్నాడు.

    ఋణం తీరిపోగానే సంస్థానాన్ని అర్హుడైన వారసుడికి అప్పగించాలి. ఆ పరిస్థితే వస్తే తానే సంస్థానానికి మహారాజవుతాడు. అప్పుడీ రైతు కన్యను మహారాణీగా విజయనగం తీసుకువెళితే జనం ఏమంటారు?
    ఎట్టి పరిస్థితిలోనైనా ఆమెనే వివాహమాడాలని అంటోంది ఆయన అంతరాత్మ. విజయనగరం జనం, ముందు ఏమనుకున్నా తర్వాత రాజీ పడక తప్పదు. కానీ అమ్మాజీవారు అనగా తల్లిగారు ఒప్పుకోరే!

    ఆమెతో నేరుగా మాట్లాడే ముందు ఆస్థానం ముఖ్య పౌరోహిత్యులు గజానన శాస్త్రి గారిని అమ్మాజీ వద్దకు రాయబారిగా పంపడం బాగుంటుందనిపించింది రాజుగారికి.

    గజానన శాస్త్రి గారిని పిలిపించి విషయమంతా వివరించారు. తర్వాత తన వద్దకు వచ్చిన శాస్త్రి గారిని చూసి “రండి శాస్త్రి గారు, కూర్చోండి” అన్నారు అమ్మాజీ వారు.

    శాస్త్రి గారు కూచొని, లోలోన భయపడుతూ ఇలా విన్నవించారు.

    “ఏలినవారితో ఓ ముఖ్య విషయం చర్చించాలి.”

    “చెప్పండి. కాళికాదేవి ఆలయం పక్కన శివాలయం కట్టిస్తున్నాం కదా! దాని గురించా?”

    “అబ్బే, ఆ పని చురుకుగా సాగుతోంది…” అని అసలు విషయం చెబితే ఆమె క్రోధాగ్ని ఎంత ఎత్తుకు లేస్తుందో ఊహించి చింతాగ్రస్తుడవుతూ ఇలా అన్నాడు.

    “యువరాజా వారు ఓ కన్యని ఎంచుకున్నారు. ఆమె అపురూప సౌందర్యవతి. రాజపూత్ సంతతికి చెందినది.”

    “చాలా సంతోషం. ఇన్నాళ్ళకు యువరాజా వారికి ఓ రాచకన్య నచ్చిందన్నమాట. ఏ ఊరు ఆమెది?”

    “మంచి గౌరవమైన సూర్యవంశీయ క్షత్రియ కుటుంబం. వారణాసికి దగ్గరగానున్న చంద్రావతికి చెందినది.”

    “చంద్రావతా? అక్కడ మన దివాణం, భూములు ఉన్నాయే! అక్కడ రాజ కుటుంబం ఉన్నట్టు మేం వినలేదే?”

    “రాజ కుటుంబం కాదు రాజమాతా. సామాన్య వ్యవసాయదారు కుటుంబమే. ఆమె అనుపమ సౌందర్యాన్ని మోహించి కుమార్ రాజా వారు వివాహమాడదలచారు.”

    అమ్మాజీ వారి కోపం కట్టలు తెంచుకొంది.

    “ఏమిటీ, ఓ వ్యవసాయదారుని కూతురు మా ఇంటి కోడలూ, కాబోయే మహారాణీనా? కుమార్ రాజాకి వివేకం లేకపోయినా విజయనగరం నుంచి మాతో వచ్చిన మీకు తెలుసు కదా మా వంశ చరిత్ర?”

    “చిత్తం. వంశపారంపర్యంగా ఏలినవారి కుటుంబానికి పౌరోహిత్యం చేస్తున మాకు – విజయనగరం ప్రభువుల వంశ గౌరవం – తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది, రాజమాతా? అందులోనూ విజయనగరం సంస్థానం ప్రతిష్ఠ యావత్ భారతదేశమంతా విస్తరించి ఉంది. వెయ్యేళ్ళకు పైగా గల పూసపాటి మహారాజుల ఆధిపత్యం కోస్తాంధ్రలో జాజ్వల్యమానంగా ప్రకాశించింది!”

    “ఈస్ట్ ఇండియాకి చెల్లించవలసిన మా ఋణాన్ని కలెక్టరు పూర్తిగా చెల్లిస్తున్నాడనీ, మా సంస్థానం మాకు రాబోతోందని వార్తలు వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో ఓ పల్లె రైతు కన్యని మహారాణిగా విజయనగరం తీసుకెళ్ళి, ‘ఇదిగో మీ మహారాణి’ అని జనానికి చెప్తే ఎలా ఉంటుంది? మీరే చెప్పండి?”

    శాస్త్రి గారు “చిత్తం…” అని మౌనం వహించారు.

    “సరే. కుమార్ రాజా వారి అభీష్టం మాకు తెలియజేశారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి.”

    “ఏలినవారు వేరే చెప్పాలా? సెలవు తీసుకొంటా…” అని వంగి నమస్కారం చేసి శాస్త్రి గారు వెనక్కి నడుస్తూ గది బయటకు వచ్చారు.

    ఆ తర్వాత రాజావారు అమ్మాజీ వారిని కలుసుకున్నారు.

    “ఏమిటి కుమార్ రాజా, నువ్వు చంద్రావతిలోనున్న ఓ రైతు కన్యను ఎంచుకున్నావని శాస్త్రి గారు చెప్పారు, అది నిజమేనా?”

    “ఔను, అమ్మాజీ.  నేను అనేక రాజకుమార్తెలను చూశాను కాని ఇంత సౌందర్యవతిని చూడలేదు.”

    “చూడు కుమార్ రాజా. మనకు కావలసింది కేవలం సౌందర్యం కాదు. భారతదేశం నలుమూలల నుంచి మనకు సరితూగే మహారాజ కన్యల సంబంధాలు వస్తున్నాయి. వాటిని కాదని ఓ రైతు కన్యను పెళ్ళాడి రేపు విజయనగరానికి తీసుకెళ్ళి, ‘ఇదిగో మీ మహారాణి’ అంటే ఏం బాగుంటుంది?”

    “వాళ్ళు మనసులో ఏమనుకున్నా ఆమెకు ఇవ్వవలసిన గౌరవం ఇస్తారు, అమ్మాజీ. మహాభారతంలో ఓ జాలరి కన్య సత్యవతిని శంతన మహారాజు వివాహమాడగా ప్రజలు ఆమెను మహారాణిగా స్వీకరించలేదా?”

    “నాయనా, పురాణాల్లో వంకాయలు పులుసులోకి పనికిరావని అంటారే. అలాగ ఆ యుగంలో జరిగినదాన్ని పునరావృతం చేస్తామా ఏమిటి?”

    అలా తర్జనభర్జనలు జరిగాకా చివరకు యువరాజు గారు “అమ్మాజీ, నేను చేసుకుంటే ఆమెనే చేసుకొంటా కానీ మరో కన్యని చేసుకోను. తర్వాత మీ ఇష్టం” అని కుండ బద్దలు కొట్టారు.

    అమ్మాజీ నియతికి తలవంది దివాన్‍జీనీ, ముఖ్య పౌరోహిత్యుడుని ఠాకూర్ రతన్‌సింగ్ వద్దకు పంపడానికి నిశ్చయించారు.

    పెళ్ళిచూపులు అయ్యాయి. ముహూర్తం కూడా నిశ్చయమైంది. దివాన్‌జీ రతన్‌సింగ్‌తో “ఠాకూర్ సాహెబ్! పెళ్ళికి రాజకుటుంబీకులు, మహారాజులు అతిథులుగా విచ్చేస్తారు. వారికి తగిన గౌరవ మర్యాదలు జరగాలి. కాబట్టి తమరు ఏమీ అనుకోకుంటే ఓ లక్ష రూపాయలు యువరాజా వారు మీకు ఇవ్వాలనుకుంటున్నారు.”

    “దివాన్ సాహెబ్! మేం రాజపూత్‍లం. ప్రాణత్యాగమైనా చేస్తాం కాని కూతురింట పచ్చి మంచినీళ్ళు కూడా తాగం. మేం అందించగల అతిథి మర్యాదలు అందుకోడానికి సిద్ధంగా ఉంటేనే ఈ వివాహం జరుగుతుంది. నా తల తాకట్టు పెట్టయినా మా స్థాయికి తగ్గట్టు చేయవలసిన మర్యాదలు చేస్తాం. కానీ మేం అల్లుడి నుంచి డబ్బు తీసుకొని మర్యాదలు చేసి మా సమాజంలో ఛీ అనిపించుకోలేం.”

    “సరే, ఈ విషయాన్నియువరాజా వారికి, అమ్మాజీ వారికీ మనవి చేస్తాం. సెలవు.”

    రతన్‌సింగ్ అందించే నిరాడంబర గౌరవ మర్యాదలు అందుకోడానికి మగపెళ్ళివారు ఒప్పుకున్నారు. మరో మార్గం లేదు కూడా.  వివాహంలో ఆ గౌరవ మర్యాదలు మగపెళ్ళివారి హోదాకు తగ్గట్టుగా లేకపోయినా సర్దుకుపోయారు.

    ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం విజయనగరం సంస్థానం నుంచి అందుకోవాల్సిన బకాయి కప్పం అందుకుని సంస్థానాన్ని 1852లో వారణాసిలోనున్న వారసుడు విజయరామరాజుకు అప్పజెప్పింది.

    విజయరామరాజు మహారాణి అలక రాజేశ్వరితో సహా విజయనగరం చేరుకొని పట్టాభిషిక్తుడై పరిపాలన చేపట్టాడు. ఆయన హయాంలో విజయనగరంలో సాంస్కృతిక, విద్యారంగాలు వినూత్న కాంతులు సంతరించుకున్నాయి.

    ఆయన కుమారుడు రెండవ ఆనంద గజపతి పరిపాలనలో (1879 – 1897) సాహితీ, విద్యా, లలిత కళల రంగాలు వెల్లివెరిసాయి. సంఘ సంస్కరణలు పరిఢవిల్లాయి. తెలుగు ధ్రువతార గురజాడ అప్పారావుగారికి స్ఫూర్తిదాత్త ఆనంద గజపతి మహాప్రభువు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here