‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -13

2
3

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 4 కాకతీయులనాటి సమాజంలో స్త్రీల స్థానం – మొదటి భాగం:

[dropcap]కా[/dropcap]కతీయుల నాటి సమాజంలో అన్ని వర్గాల స్త్రీల జీవన విధానంలో భేదం ఉన్నప్పటికీ వారందరికీ సమాజంలో ఎటువంటి స్థానం ఇవ్వబడిందో వివరించ బడుతుంది. కులస్త్రీలు వేశ్యలను ఆనాటి కావ్యాలలో పుణ్య పణ్యాంగనలు అని వ్యవహరించేవారు. వీరి గురించి ముందు వివరించబడుతుంది.

పుణ్యాంగనలు – పణ్యాంగనలు

పుణ్యాంగనలు:

ఆనాటి కావ్యాలలో బ్రాహ్మణ కులస్త్రీలను పుణ్యాంగనలని ప్రస్తావించేవారు. వీరు ప్రతి శుభకార్యానికీ ముందుండేవారు. రాజుల పట్టాభిషేక మహోత్సవం, వివాహాది శుభకార్యాలు, సహగమనం, నోములు, పూజలు మొదలైన మంగళ కార్యాలలో పుణ్యాంగనలు పాల్గొన్నట్లు ఆనాటి సాహిత్యంలోని ఆధారాల వల్ల చెప్పవచ్చును.

భాస్కర రామాయణంలో సీతారాముల వివాహఘట్టంలో దశరథుడు తన బంధువర్గంతో జనకుని నగరుకు తరలి వెళ్ళినపుడు వారి వెంట పుణ్యాంగనలు కూడా వెళ్లారు. వారవిలాసినులు ఆడారు. శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చేసే సందర్భంలో ‘అరుంధతి పురోగమ పురంధ్రీజనులాదిగా సమస్త జనంబుల’ రావించారు. అంటే పుణ్యాంగనలు జనులందరి లోనూ ముందుండేవారు. వీరు పుష్పాలు, అక్షతలు, ముత్యాలు సేసలుగా జల్లేవారు.

‘మంగళ పుష్ప సంఘములు మౌక్తపు సేసలు వింతనంత బుణ్యాంగన లోలి జల్ల’ ముత్తైదువులు ఈ విధంగా పట్టాభిషేకం చేసుకోబోయే రాజుపైన, వివాహ సమయంలో వధూవరులపైన పుష్పాలు అక్షతలు చల్లేవారు. ఆ సందర్భాలలో పణ్యాంగనలు అంటే వారవిలాసినులు ఆడేవారు.

‘తన్వంగులు రత్నదీపకళికా నివాళునొనర్ప’ రత్నదీప హారతులిచ్చేవారు. అంటే పైన చెప్పిన శుభకార్యాలన్నిటా స్త్రీలు పాల్గొన్నట్లు అందునా ముందు పుణ్యస్త్రీలు, తరువాత పణ్య స్త్రీలు పాల్గొన్నట్లు చెప్పేవారు.

ఈ పుణ్యాంగనలను పేరంటాండ్రు అని కూడా వ్యవహరించేవారు. శుభకార్యాలలో ఈనాటి వారి లాగా ఆనాటి పేరంటాండ్లు పాటలు పాడేవారు. రంగనాథ రామాయణంలో సీతారాముల పెళ్ళి సందర్భంలో సీత, ఊర్మిళ, శ్రుతకీర్తి, మాండవ్యలను పెళ్ళికూతుళ్ళుగా అలంకరించేటప్పుడు పుణ్యస్త్రీలు అంటే ముత్తయిదువులు పాటలు పాడేవారని ఈ క్రింది వాక్యం వల్ల తెలుస్తున్నది.

‘పేరంటాండ్రొగి పాడు పెండ్లి పాటలకు’ ఈనాటికీ ఈ సంప్రదాయముంది. వీళ్ళు పురోహితులు, వేద బ్రాహ్మణుల కులస్త్రీలయి ఉంటారు. కనుకనే అరుంధతీ పురోగమ పురంధ్రీ జనులు అన్నారు.

నోములు, పూజలు, పండుగల సందర్భంలో అందరికన్న ముందుగా ఈ పుణ్యస్త్రీలకే కానుక లిచ్చేవారు. ఆ విధంగా వారిని మన్నించి గౌరవిస్తే శుభప్రదమని ఆనాటివారి నమ్మకం.

జైత్రయాత్ర వంటివి చేసి, మహారాజులు నగర ప్రవేశం చేసినపుడు పుణ్యాంగనలు సేసలు చల్లడం శుభాస్పదమని భావించేవారు. పుణ్యస్త్రీలు సంఘంలో పై స్థానంలోను పణ్యస్త్రీలు లేదా భోగస్త్రీలు, వేశ్యాజనం తరువాతి స్థానంలోనూ ఉండేవారు.

పుణ్యపణ్యాంగనలు:

ఆనాటి సాహిత్యంలో పుణ్యపణ్యాంగనలు ప్రస్తావన కూడా తరచుగా కానవస్తుంది. తిక్కన సోమయాజి రచించిన మహాభారతంలోనూ, పాల్కురికి సోమనాధుని బసవపురాణం, పండితారాధ్యచరిత్రలలో ఈ పుణ్యపణ్యాంగనల ప్రసక్తి ఉంది.

తిక్కన రచించిన మహాభారతంలో శాంతిపర్వంలో ధర్మరాజు విజయంతో కరినగరం ప్రవేశించినపుడు మేడలపై నుంచి పుణ్యపణ్యాంగనలు అక్షతలు, ముత్యాల సేసలు అతనిపై జల్లారు.

‘హర్మ్యముల నుండి పణ్యపుణ్యాంగనాని
కరములక్షతయుత మౌక్తికముల సేస
లొలుక.’

బసవ పురాణంలో కల్యాణ కటకానికి బసవన్న రాగా అతనిని చూచే వేడుకతో పుణ్యపణ్యాంగనలు పురవీధులలోనికి వచ్చారు. పండితారాధ్య చరిత్రలోనూ ఈ పుణ్యపణ్యాంగనల ప్రసక్తి ఉన్నది.

‘దరికి య ప్పాట భక్తవ్రాతముబ్బి
శివమహోత్సవములు సెలగి చేయుచును,
బరగ నాయూరి యాబాల వృద్ధాదు
లరుదొంద బుణ్యపణ్యాంగనల్ మఱియు
చనుదెంచి పాదాంబుజంబులకెఱగి’

పైన చెప్పిన సందర్భాలలోని పుణ్యపణ్యాంగనలు అనే పదం పుణ్యాంగనలు, పణ్యాంగనలును అనే భావంలో ద్వంద్వ సమాసంగా వాడబడిందా లేక పుణ్యులైన పణ్యాంగనల్ అన్న అర్థంలో విశేషణ పూర్వపద కర్మధారయంగా వాడబడిందో విచారిస్తే శుభకార్యాలన్నిటా ముందు పుణ్యస్త్రీలు తరువాత పణ్యస్త్రీలు ఉండటం ఆనాటి సాహిత్యంలో కనిపిస్తుంది. ఆ విధంగా ద్వంద్వ సమాసంగా వాడినట్లు చెప్పవచ్చు. అయితే మున్నూర్వురు సానులు కూడా సంఘంలో గౌరవప్రదమైన స్థానాన్నలంకరించినవారే. నన్నెచోడుని కుమార సంభవంలో శివుని వద్దనుంచి వివాహ ప్రస్తావన హిమవంతునికి అందించవచ్చిన సప్తర్షుల వద్దకు హిమవంతుని ఆజ్ఞ పైన గణికాజనమే పార్వతిని తీసుకువచ్చారు.

మహాభారతంలో విరాటపర్వంలో ఉత్తరాభిమన్యుల వివాహ సందర్భంలో విరాటుడు పెండ్లి మంటపం అలంకరణకు చతుర పుణ్యాంగనలను నియోగించాడు. చతురోక్తులాడడం అనేది ఒక కళగా నేర్చేవారు ఆనాడు. ఈ కళను వేశ్యమాతలు వేశ్యలకు నేర్పించేవారు అని దశకుమార చరిత్రలో వేశ్యమాత మాటల వల్ల తెలుసుకోవచ్చు. ఉత్తరాభిమన్యుల వివాహాన్ని మంగళ పూర్వకంగా చేయించినవారు పుణ్యాంగనలు. వారితో పణ్యాంగనలు కూడా ఉన్నారు.

‘అమ్మహనీయ మహోత్సవంబు మంగల సంవిధాన సావధాన పుణ్యాంగనల వలనను, నృత్తగీతాది వైచిత్ర్య మనోహర వారనారీ జనంబుల వలనను.. పరమ సంపద్భరితమై యుండె’

బసవ పురాణంలో బసవన్నను చూడడానికి వచ్చిన పుణ్యపణ్యాంగనలు ఆడిన సంభాషణను బట్టి చూస్తే వారు సంఘంలో స్వేచ్ఛననుభవిస్తూ, ఇంటివారితో అనుమతి లేకుండా వీధులలోకి వచ్చిన శ్రీలనిపిస్తుంది కానీ శరీరాన్నమ్ముకొనే వేశ్యలుగా మాత్రం అనిపించదు. (ఆధునిక కాలంలో స్త్రీలు కూడా అదే విధంగా స్వతంత్రంగా తిరగగలుగుతున్నారు. మధ్యకాలంలో మాత్రం ఆ స్వేచ్ఛ ఉండేది కాదు.)

పుణ్య పణ్యాంగనల్ పురవీథులందు – బుణ్యాత్ము బసవ ప్రభుని
జూడగ వచ్చెద సుదతి నే ననుచు – వేడుక చెఱుపక వేగరమ్మనుచు
గాలి దొసగు గాక క్రమ్మఱు మనుచు – నేలమ్మ వచ్చిన నేమినీ కనుచు
నేకతం బొకతెవ యే గు మీ వనుచు – నీ కాళ్ళనడచెదనే కాంత యనుచు
బతిగన్నసై చునే పడతి నిన్ననుచు – బతిగని యెట్లైన బదరని మ్మనుచు
బసవన్న జూడక పడతి పో ననుచు – ముసు గిడి వేగ రామురియక యనుచు
దో కొని పోయిన దోసమే యనుచు – మూ కలోనికి బోకు ముగ్ధవీ వనుచు

నీ వెంట నేనూ వస్తానని ఒకరంటే తొందరగా రమ్మని మరొకరంటారు. మూకలోకి పోకు ముగ్ధవి నువ్వని ఒకరు, కొంగుమీదికి చేర్చి రమ్మని మరొకరు, నీ భర్త చూస్తే సహిస్తాడాని ఒకరంటే భర్త ఏమైనా వాగనీ అని మరొకరు అనడం వల్ల వారు వివాహితలేనని తెలుస్తున్నది.

కొందఱు గీత గద్యపద్యాలతో స్తుతించేవారు, కొందఱు కైవారాలు చేసేవారు ఉంటే కొందరు ఈ కలకలలకు దూరంగా మేడలపై నుండి చూసేవారు కూడా ఉండేవారు. బహుశా ధనికవర్గం స్త్రీలు తమ సౌధాగ్రాల నుండే వీధులలో జరిగే వేడుకలు వీక్షించేవారు. వీధులలోకి వచ్చిన వారు బహుశా శైవదేవాలయాలలో అంగరంగభోగాలు జరిపే స్త్రీలై ఉంటారు. వీరిని పుణ్యపణ్యాంగనలు అని అందుకే సంబోధించి ఉంటారు. మున్నూర్వురు సానులు వంటి నిబంధాలకు సంబంధించిన స్త్రీలై ఉండవచ్చు. లేదా పుణ్యస్త్రీలలో సమానంగా ఆనాటి పణ్యస్త్రీలు లేదా గణికాజనం సంఘంలో గౌరవస్థానాన్ని పొంది ఉంటారు. ఈనాడు అటువంటి స్త్రీలు లేరు. కాలక్రమేణా వారి గౌరవస్థానం తగ్గడం వల్ల ఆ దేవాయల సేవికలు వివాహాలు చేసుకొని దేవాలయ సేవలు మానివేసి ఉంటారు. మతాధికారులు మండలాధీశుల వంటి వారి చేత బలవంతంగా వ్యభిచారిణులుగా చేయబడిన స్త్రీలు, ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలవారు తమ కుటుంబాలలోని ఆడపిల్లల బరువు బాధ్యతలు గ్రహించక వారిని ధనానికై వేశ్యాగృహాలకు, దేవాలయాలకు అమ్మగా హీనమైన జీవితం అనుభవిస్తూ సంఘంలో నీచమైన స్థానం పొందారు.

కులస్తీ – వేశ్య – సారూప్యం

కులస్త్రీని సతి అనడం ప్రసిద్ధమైన విషయమే. సతి అన్న పదానికి పతివ్రత, సద్గుణములు గల స్త్రీ అని, సన్యాసిని, యోగిని, భార్య అన్న అర్థాలు సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఇవ్వబడినాయి. కానీ కాకతీయుల నాటి సాహిత్యంలో వేశ్యలకు కూడా సతి అన్న పదమే వాడబడింది.

పండితారాధ్య చరిత్రలో ఎన్నోమార్లు వేశ్యలకు సతి అన్న పదం వాడబడింది.

“సన్న ఏ నాటను సతి వెట్టి కలదె” మల్హణుని ప్రియురాలైన వేశ్య గురించి వాడబడింది.

“ఇస్సిస్సిరో మెత్తురే సరివిటులు ప్రస్సిపడ్డను నీకు వత్తురే సతులు”

“అడలుచు సతి మాటలయినను వినక”

“కుపతియై సతి చెల్మి గోరుచున్నెడను”

ఈనాడు సౌభాగ్యవతి అని సుమంగళి అయిన స్త్రీని సంభోధిస్తే ఆనాడు వేశ్యను కూడా సౌభాగ్యవతి అని సంభావించారు. ఇప్పుడు సౌభాగ్యానికి అయిదవతనం, సుమంగళీత్వం అర్థాలయితే ఆనాడు అదృష్టం, సుభగత్వం, సౌందర్యం, వైభవం, ప్రేమ వంటి అర్థాలలో వాడేవారు. కనుక వేశ్యలకు సౌభాగ్యవతి అన్న విశేషణం వాడేవారు.

“సౌభాగ్యవతి రంభ జంభారి జూచి యెలమిమై దేవతా హితకార్యమొకటి” అని రంగనాధ రామాయణంలో రంభను సౌభాగ్యవతి అని సంబోధించారు.

వేశ్యల మాతలు తమ కుమార్తెల చేత సౌభాగ్యం కోసం నోములు నోమించేవారు.

జాయప రచించిన నృత్త రత్నావళిలో ఉత్తమ నర్తకి కావలసిన స్త్రీకి ఉండవలసిన లక్షణాలలో అందమైన నాజూకైన దేహం, అందం, అదృష్టం మొదలైన వాటితోపాటు సౌభాగ్యం కూడా చెప్పబడింది – ‘తన్వీతారుణ్య లావణ్య భాగ్య సౌభాగ్య సౌధభూః’.

కులస్త్రీలకు సుమంగళులకు పసుపు కుంకుమలు అతిముఖ్యమైనవి. స్త్రీలకు వివాహ సమయంలో పసుపు కుంకుమలకై కొంత భూమిని స్త్రీధనంగా ఇవ్వడం మన సంప్రదాయం. ఇది అనూచానంగా వస్తున్న ఆచారం. కాకతి కుందమాంబకు ఆమె వివాహ సమయంలో తండ్రి మహాదేవుడు వేములతోంట అనే గ్రామాన్ని హరిద్రార్థం ఇచ్చాడు.

అయితే వేశ్యలకూ పసుపుకై కొంత ధనాన్నివ్వడం ఆనాడు ఉన్నది. క్రీడాభిరామంలో మంచన శర్మ తనకు వేశ్య గాంధర్వికి పుట్టిన మదనరేఖకు ముకుర వీజోత్సవంనాడు పసుపుకని కొంత వెండి (బహుశా వెండినాణెం) టిట్టిభ సెట్టి చేత ఇప్పించాడు.

‘దీవించి మంచి కూతురు
శ్రీ వర్థస్వంబు చెప్పి చెవి టిట్టిభ సె
ట్టి వెస నిప్పింపుము సం
భావన నొక వెండి పసపున కనియెన్’

సుమంగళి అయిన స్త్రీ మట్టెలు ధరించడం నేటి ఆచారం. కాకతీయులనాడు అందరూ ధరించేవారు. వేశ్యలు కూడా ధరించేవారు. తిక్కన రచించిన విరాటపర్వంలో సుధేష్ణ “లలితంబులగు మట్టియల చప్పుడింపార నంచకైవడి వచ్చి” సంతోషపెట్టే విలాసినులు కీచకుని కొరకు సిద్ధంగా ఉన్నారని అతనితో అన్నది.

పురుషులు యుద్ధానికి వెళ్తే వారి వెంట వెళ్ళేవారిలో వారి కులస్త్రీలు పరివారం వెళ్ళేవారు. వారితో విలాసినీ జనులు వెళ్ళేవారు. నన్నెచోడుని కుమార సంభవంలో యుద్ధానికి తరలి వెళ్ళిన పురుషులతో వారి స్త్రీలు కూడా వెళ్ళారని రణరంగ వర్ణనను బట్టి తెలుస్తుంది.

“ఇట్లు పుణ్యసతులు రణమరణ పరిచ్ఛేదులైన పతుల తోడన మరణ పరిచ్ఛేదలగుచునుండిరంత”.

పలనాటి వీరచరిత్రలో కారెమపూడి యుద్ధరంగానికి వెళ్ళబోతూ బాలచంద్రుడు తన వెంట వేశ్య సబ్బాయిని కూడా తీసుకువెళ్ళాలని తలిచి ఆమెను రమ్మని అడిగాడు.

“చెలగి కార్యమపూడి శ్రీకలనియందు
వీరుల కలయంగ వేగబోవుచును
ప్రియురాలవని నిన్ను పిలువ వచ్చితిని
పయనమ్ముగమ్మని పలికె నంతటను”

 

యుద్ధంలో ఓడిపోయిన రాజు భార్య పరివారంతో పాటుగా వనవాసం చేసే ఆచారం ఉండేది. అయితే నిర్బంధం ఏమీ లేదు. ప్రతాపరుద్ర యశోభూషణంలో ఒక సామంతుని భార్య భర్తతో శ్రీ వీరరుద్ర నరపతిని సేవింపక మానేస్తే మానెయ్యి నేను వనవాసుల రీతులు నేర్చుకుంటానన్నది.

……
……
ఆ వనవాసుల రీతులు
భూవర నేర్చెదను నే డె పొలుపెసలారన్

అని ఆమె అన్న మాటలను బట్టి రాజుల స్త్రీలు వనవాసం చేసేవారని తెలుస్తున్నది. రెండవ ప్రతాపరుద్రుని ఖండవల్లి దాయగజకేసరి తామ్ర శాసనంలో శత్రురాజుల విలాసినులు వనవాసం చేశారని ఆలంకారికంగా చెప్పబడింది.

యస్యారి భూపాల విలాసినీభ్యః శ్వాసానిలో త్యైర్వనవాసినీభ్యః
లావణ్యభిక్షామాపగన్తు మేవ ప్రవాలహసై ర్లతికాయతన్తే

కులపత్ని భర్త మరణిస్తే సహగమనం చేయడం ధర్మమే కానీ కొందరు భోగస్త్రీలు కూడా బహుశా సహగమనం చేసేవారేమో. కనుకనే బాలచంద్రుని వేశ్య సబ్బాయి మాంచాల కంటే ముందే అతని వెంట స్వర్గానికి వస్తానన్నది.

మాయక్క కంటెను మరివేగమునను
నీతోడ వైకుంఠ నిలయంబు జూతు

పైన చెప్పిన విషయాలన్నీ పరిశీలించి చూస్తే కులస్త్రీలు, వేశ్యలు ఆనాటి సమాజంలో సమానమైన పాత్రను నిర్వహించారనీ, కుడి ఎడమలుగా బింబ ప్రతిబింబాలుగా పురుషుని జీవితంలో సమభాగస్వామ్యం కలవారుగా ఉన్నట్లు తోస్తుంది. ఆనాటి ప్రతి శుభకార్యంలోనూ, ఉత్సవాలు, పండుగలలోనూ కులస్త్రీలు లేదా పుణ్యస్త్రీలు, వేశ్యలు లేదా పణ్యస్త్రీలు కలిసి పాల్గొనేవారు. కనుకనే ఆనాటి సాహిత్యంలో పుణ్యస్త్రీలు పణ్యస్త్రీలు జంటగా ప్రసక్తతమయేవారు. పుణ్యపణ్యాంగనలు అని ఆనాటి సాహిత్యంలో చెప్పబడిన వారు ఈ కులస్త్రీలు, వేశ్యలే. ఇహలోకానికి వేశ్యలు, పరలోకానికి కులస్త్రీలు కర్తలని ఆనాటివారు భావించేవారని “ఇహలోక సౌఖ్యమున కేమె కర్తలము పరలోక సౌఖ్యమొసగ నీ డతియె కర్త” అన్న వేశ్య సబ్బాయి మాటల్లో వ్యక్తమౌతుంది.

న్యాయస్థానాలు – స్త్రీలు

ఎవరికైనా అన్యాయం జరిగినపుడు న్యాయం కోరి న్యాయస్థానాన్నో, తీర్పరినో ఆశ్రయించడం సాధారణమే. స్త్రీకి అన్యాయం జరిగితే కుటుంబ పెద్దగానీ, కులపెద్దగానీ, తీర్పరిగానీ విచారించి తీర్పు చెప్పవచ్చు. గృహయజమాని, ఇల్లాలికి అన్యాయం చేస్తే పురుషాధిక్యత ఉన్న సమాజంలో ఆమెకు న్యాయం జరగకపోవచ్చు. అయితే కాకతీయుల కాలంలో వీరశైవ మత వ్యాప్తి వల్లను, గణపతి దేవచక్రవర్తి వంటి కాకతీయ ప్రభువులకు స్త్రీలంటే ఉన్న మాన్యత వల్లను శ్రీ పురుషులు సమానమనే ఆనాటి భావన వల్ల న్యాయస్థానాలలో స్త్రీలకు ఎంతవరకు న్యాయం చేకూరింది విచారించాలి. న్యాయస్థానాలలో స్త్రీలకు ప్రవేశం ఉన్నదా లేదా? భర్త పైన గానీ, ఇతర పురుషుల పైన గానీ, ఆమె వ్యాజం వేసేదా? ఆమెకు ఎంతవరకు న్యాయం జరిగేది, కులస్త్రీలకు, వేశ్యలకు ఒకే విధంగా న్యాయం జరిగేదా? లేక వారికి ప్రత్యేక న్యాయస్థానాలుండేవా? అత్యాచారం చేసిన పురుషుడి పైన స్త్రీ వ్యాజ్యం వేసేదా? అటువంటి సందర్భాలలో నేటి స్త్రీకి, కాకతీయులనాటి స్త్రీకి ఒకే విధంగా న్యాయం జరిగేదా? అన్న ప్రశ్నలు ఈనాటి వారికి కలగక మానవు. ఆనాటి కాలానికి చెందిన విజ్ఞానేశ్వరం న్యాయం చట్టానికి సంబంధించిన వాని గురించి వ్రాయయబడింది కాబట్టి పై ప్రశ్నలకు జవాబులు విజ్ఞానేశ్వరాన్ని బట్టి చెప్పవలసి ఉంటుంది. ఆనాటి కావ్యాలైన తిక్కన రచించిన ఆంధ్రమహాభారతం, మార్కండేయ పురాణం, ప్రేమాభిరామానికి ఆంధ్రీకరణమైన క్రీడాభిరామం, కేతన రచించిన దశకుమార చరిత్రలలో కూడా స్త్రీలకు న్యాయస్థానాలు ఏ విధంగా న్యాయం చేకూర్చేవి అన్న ప్రశ్నకు సమాధానం వెదకవచ్చును.

న్యాయసభలు – స్త్రీలు:

భర్త నియోగించని దానిని దేనినీ సతి చేయకూడదు. భర్తచేత నియోగింపబడిన దానిని చేయకపోవడం దోషమని మనువు చెప్పాడు అని పాండురాజు కుంతితో చెప్పాడు.

తనకు అన్యాయం జరిగితే కులస్త్రీ భర్తకు తెలియజెప్పాలి. భర్త నియోగించినపుడే ఆమె న్యాయసభకు వెళ్ళవచ్చు. స్త్రీలు న్యాయంకోరి సభకు ఏ పరిస్థితిలో వెళ్ళవచ్చునో, ఏఏ కారణాలవల్ల స్త్రీలకు న్యాయంకోరి సభకు వెళ్ళవలసిన అవసరం వస్తుందో కేతన తన విజ్ఞానేశ్వరంలో వ్యవహారకాండలో వివరంగా చెప్పాడు. కులస్త్రీ భర్త మీద వ్యాజ్యం వేసి సభకు రాకూడదు. అతడు ఆలి ఆభరణాలు అన్యాయంగా తీసుకొని ఇవ్వకుండా తోసిపుచ్చితే స్త్రీ న్యాయం కోసం సభకు వెళ్ళి చెప్పవచ్చును గానీ దానివల్ల ఆమెకు ఇహపరాలలో నింద వస్తుంది అన్నాడు కేతన.

మహాభారతంలోని విరాటపర్వంలో సైరంధ్రి కీచకుడు తనను బలాత్కారం చేస్తున్నాడని రాజసభలో మొరపెట్టుకున్న సందర్భంలో కంకుభట్టు వేషంలో ఉన్న ధర్మరాజు

‘పలుపోకల బోవుచు వి
చ్చల విడి నాట్యంబు సూపు చాడ్పున నిచటం
గుల సతుల గఱువ చందము
తొలగంగ నిట్లునికి తగునె తోయజవదన’

అన్నాడు. అంటే కులసతులు సభలో అందరి యెదుటకు రాకూడదు. ఆమె న్యాయం కోరి వచ్చినప్పటికీ ఆనాటివారు హర్షించలేదు. సమర్థించలేదు అన్నమాట.

కులసతులు సభలకు బరితెగించి రాకూడదనే విరాటపర్వంలో కంకుభట్టు (ధర్మరాజు) మాటల సారాంశం. విచ్చలవిడిగా నాట్యం చూపే విధంగా సభలో కులసతులకు తగని విధంగా ప్రవర్తించవచ్చునా అని మందలించిన ధర్మరాజుకు నా భర్త నటుడు, నేను శైలూషినే, నా భర్త నటుడే కాదు జూదరి కూడా, మరి జూదరి భార్యకు గఱువతనం ఎక్కడిది? అని ద్రౌపది సమాధానం చెప్పింది. ఈ సమాధానం ఆనాటి ధర్మశాస్త్రాల ప్రకారం సరి అయినదే.

జూదరి బండ, పరిహాసకుడు, నటుడు వంటి వారి భార్యలతో తప్ప తక్కిన పరాయి స్త్రీలతో పరాచికాలాడితే ఆ పురుషునికి దండన ఉన్నదని కేతన తన విజ్ఞానేశ్వరంలో చెప్పాడు. అంటే పైన చెప్పిన స్త్రీలు తక్కిన స్త్రీల కంటె భిన్నమైనవారు. స్వేచ్ఛ ఉన్నవారు అని అర్థమౌతున్నది. కనుక పైన చెప్పిన వారి భార్యలు తప్ప కులస్త్రీలు ఎవ్వరూ న్యాయం కోరి సభకు వెళ్ళడం సంఘం హర్షించకపోవడం ప్రాచీనకాలం నుండి ఉన్నదే.

భర్త చాటు స్త్రీలే కాక, కుటుంబాన్ని నడిపే దక్షత గల స్త్రీలు కూడా న్యాయం కోరి భర్త లేకుండా సభకు రాకూడదు అని కేతన చెప్పాడు. భర్త కాక పరాయి పురుషుడితో తగవు వచ్చిన స్త్రీలు ఇల్లు నడిపే దక్షత ఉన్నవారైనప్పటికీ సభలో పురుషుడికి వ్యతిరేకంగా వ్యాజ్యానికి తయారవకూడదు. భర్త భార్యను అందుకు నియోగించినట్లయితే ఆమె ఆ పని చేయవచ్చును. అంటే అన్యాయం చేసిన భర్తగానీ, పరపురుషుడుగానీ వారికి వ్యతిరేకంగా కులస్త్రీ, తనకు తానై స్వతంత్రించి సభలో న్యాయం కోరడానికి వీలులేదు. ఇలా అని కేతన చెప్పినప్పటికీ అది పూర్వపు ధర్మశాస్త్రాలు దృష్టిలో పెట్టుకొని చెప్పినట్లు అనిపిస్తుంది. కేతన స్త్రీ హక్కులకి వ్యతిరేకి కాడు. భార్యాభర్తల మధ్య పోరు వస్తే మాత్రం రాజు తీర్పు చెప్పాలన్నాడు. కనుక భర్త తప్పుచేసినప్పటికీ భార్య సహించాలన్నది కేతన అభిప్రాయం కాదు. కుటుంబగౌరవం, కాపాడవలసిన బాధ్యత భర్త కంటే భార్యకే ఎక్కువని చెప్పడం కేతన ఉద్దేశం కావచ్చును. కనుకనే అన్యాయానికి గురి అయిన భార్య న్యాయం కోరి భర్తపై నేరారోపణ చెయ్యరాదని ఖండించకుండా ఇహపరాలలో నింద వస్తుందని మాత్రమే చెప్పాడు. నిందకు భయపడని స్త్రీ నిరభ్యంతరంగా న్యాయసభకు రావచ్చుననే కేతన అభిప్రాయం కావచ్చును.

కులస్త్రీల కంటే ఈ విషయంలో వేశ్యలే కొంతమెరుగు. వారికి మామూలు న్యాయసభలు, రాజసభలే కాక వారి వృత్తిరీత్యా వచ్చే తగాదాలు తీర్చడానికి వారికి జారధర్మాసనాలుండేవి. ఈ జారధర్మాసనాల ప్రసక్తి క్రీడాభిరామంలో వస్తుంది. ఈ ధర్మాసనంలో న్యాయ నిర్ణేతలు మదన శిక్షాతంత్ర విద్యానిధులు, స్మరదివ్యాగమ కోవిదులు అని క్రీడాభిరామంలో చెప్పబడింది.

వేశ్యలకుగానీ, విటులకు గానీ అన్యాయం జరిగితే వారు రాజు వద్దకు వచ్చి న్యాయం కోరవచ్చును. దశకుమార చరిత్రలో మాధవ సేన అనే ఒక వేశ్యమాత తన కూతురు రాగమంజరి వేశ్యల కులవృత్తికి తగినట్లు ప్రవర్తించక, ఎవరు ఎంత ధనమిచ్చినా గ్రహించకుండా, తనకు నచ్చి, తాను మెచ్చినవాడిని వివాహం చేసుకుంటానన్నదని, తనకు తెలియకుండా ఎవరూ రాగమంజరిని కోరరాదని రాజు వద్ద ఫిర్యాదు చేసింది. ఆమె కోరిన విధంగా రాజు మాధవ సేనకు తెలియకుండా రాగమంజరిని కోరినవాడు ధనమాన ప్రాణాలు పోగొట్టుకుంటాడని ఆజ్ఞ చేశాడు. అంటే వేశ్యలు పెళ్ళి చేసుకోవడం వారి కులాచారానికి విరుద్ధం. వివాహాలకు ఆమె కుటుంబ సభ్యులే కాక రాజు, సంఘము కూడా అనుమతించేవారు కాదు. కేతన దశకుమార చరిత్ర అనువాదం కనుక ఈ పద్ధతి అంతకు ముందు కూడా ఉందని చెప్పవచ్చు. కాకతీయుల కాలంలోని ధర్మశాస్త్రాలలో వేశ్యలను మానవతా దృష్టితో నిష్పక్షపాతంతో చూశారని విజ్ఞానేశ్వరాన్ని బట్టి చెప్పవచ్చును.

బలవంతం చేయబడిన స్త్రీ కులస్త్రీయే కాదు వేశ్యా స్త్రీ అయినా బలవంతంగా అనుభవించే పురుషుడికి ఆనాడు శిక్ష వేసేవారు.

డబ్బు తీసుకొనే వేశ్యాదులను బలవంతంగా అనుభవిస్తే ఆ పురుషుడు పది పణాలిచ్చుకోవాలని చాలా మంది కలిసి ఒక స్త్రీని అనుభవిస్తే, వారందరూ వేరువేరుగా ఇరవై పణాలు చొప్పున ఇచ్చుకోవాలి.

తనను ఇష్టపడని వేశ్యను శరీరంపై నఖదంతక్షతం చేసినవాడు తానిచ్చుకొనే రోయి కాకుండా ఎనిమిది పణాలు ఎక్కువ చెల్లించాలి.

పై విధంగా వేశ్యలను కూడా మానవతా దృష్టితో చూచి, న్యాయం చెప్పడం స్త్రీలను గౌరవించిన కాకతీయల కాలంలోనే జరిగింది. ఈనాడు వేశ్యలు విటుల చేతిలో ఎంత హింస అనుభవించినా వారికి తగిన రక్షణ సంఘంగానీ, ప్రభుత్వంగానీ, న్యాయస్థానం గానీ కల్పించడంలేదు. వారివద్దకు వెళ్ళే విటులు, పోలీసులు ఎవరూ వారిని సానుభూతితో చూడక శారీరకంగా, మానసికంగా, హింసించి అవమానిస్తూ ఉన్నారు. కానీ ఆనాడు వేశ్యలకు అన్యాయం జరిగితే సహించలేదు. న్యాయం చెప్పడమే జరిగింది. ఆనాడు వేశ్యావృత్తిని తక్కిన కులవృత్తులతో సాటిగా పరిగణించారు. ఈనాడు కేవలం నిస్సహాయలు, సాటివారి చేత మోసపోయినవారు, వేరే ఆధారం లేనివారు వేశ్యలుగా మారడంతో వారికంటూ ఒక సంఘంలేక అవమానాలకూ, అంతులేని జబ్బులకూ గురి అయి అతి నికృష్టమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇటువంటి స్త్రీలకు విద్యగరిపి, ఇతర సాంకేతిక విద్యలనో, స్వయం ఉపాధి కల్పించే వృత్తులనో నేర్పి, వేశ్యావృత్తినే కొనసాగించదలచిన స్త్రీలకు తగిన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వానికీ, సంఘానికి ఉన్న బాధ్యత అని గుర్తించాల్సి ఉంది. ఈ విషయంలో కాకతీయుల కాలం నాటి ధర్మశాస్త్రాలు చాలా మెరుగుగా ఉన్నవని చెప్పాలి.

పరస్త్రీ పట్ల పురుషులు ప్రవర్తించవలసిన విధం:

కులస్త్రీలను గౌరవించాలని, పరస్త్రీ అయిన కులస్త్రీని సోదరిగా భావించడం పురుషుని ధర్మమని ఆనాటివారు నమ్మి ఆచరించేవారు. కనుకనే శాసనాలలో పరనారీ దూర, పరనారీ సోదర, అనే బిరుదులు కనిపిస్తాయి. పరనారీ దూర అని రేచెర్ల బేతిరెడ్డికి బిరుదున్నట్లు పిల్లలమర్రి శాసనం బట్టి తెలుస్తుంది. కాకతి రుద్రదేవునికి పరనారీ సహోదర అని ఒక శాసనంలో ప్రశంసించారు. ఒక అప్రకటిత శాసనంలో కాకతి మహాదేవుని దివ్యపాదపద్మారాధకుడైన మహాసామంత కుసుమ నాయకుని పరశ్రీ వర్జిత అని ప్రశంసించారు.

సుమతీ శతక కారుడు కూడా పరనారీ సోదరుడై ఉండేవాడు ఉత్తముడు అన్నాడు.

“పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక పరులకు హితుడై
పరులు దను బొగడ నెగడక
బరు లలిగిన నలుగ నతడు, పరముడు సుమతీ!”

పరస్త్రీలను చూచి నవ్వడం తప్పని కూడా అతడు హెచ్చరించాడు ఎక్కడ అనవసరమైన నవ్వు, హేళనతో కూడిన నవ్వు పనికి రాదో చెప్పే సందర్భంలో అతడు పరస్త్రీలను చూచి నవ్వడం కూడా తప్పని, “నవ్వకుమీ పరసతులతో” అన్న వాక్యంతో నిషేధించాడు. ఆ విధంగా చేయరాదని అన్నారంటే స్త్రీలను చూచి ఎగతాళి చేసేవారు ఆనాడు ఈనాడు కూడా ఉన్నారు కానీ తప్పు అని మందలించడం, కట్టుబాటుగా చేయడం మాత్రం ఆ రోజుల్లోనే ఉన్నది.

పరవనిత, అంటే తన భార్య కాని పరాయి స్త్రీ అనే అర్థంలో కాక మగనాలి అనే అర్థంలో (అంటే వివాహిత స్త్రీ అని) ఆనాడు వ్యవహరించేవారు. పరవనితపై చూపుపడ్డ దుష్టపురుషుని రాబందులు కళ్ళు పొడుచుకు తింటాయి అని నరకబాధల్లో ఒకటిగా మారన మార్కండేయ పురాణంలో చెప్పాడు. కేతన విజ్ఞానేశ్వరంలో పరసతీహారకుని పట్టించి రాజు అతని సర్వస్వము తీసుకోవాలి అని కన్యను చెఱపట్టిన దుర్జ నుని చిత్రవధ చేయాలని శాసించాడు.

చీకటిలో ఒంటరిగా పోయే పరసతిని నెట్టడం, ఆమె తనను తాకాలని ఆశపడటం, నలుగురి ముందర తలపై కొంగును పట్టటం, దగ్గరకు జేరి ఒకే ఆసనంపై కూర్చోవడం, పువ్వులు, మైపూతలు, లేపనాలు, తాంబూలము ఇవ్వడం, ఆమెతో ముచ్చటలాడటం, ఒకమూల చేరటం, రాత్రంతా మగనాలిని చేరి తన సరస కళా పాండిత్యం గురించి ఇచ్చమాటలాడడం, నేనిది వరకు యీ విధంగా సతుల పాతివ్రత్యాన్ని చెడగొట్టానని అహంకారంతో ఆమెను అనుభవించడం చెడ్డవారు చేసే పని అని అటువంటి పురుషుని శిక్షించాలని విజ్ఞానేశ్వరంలో చెప్పాడు.

పతిహితవ్రత అయిన బ్రాహ్మణ భార్యను, స్నేహితుని భార్యను, శిష్యుని భార్యను, గురుని సతిని, దాదిని అనుభవించ ప్రయత్నించిన వాడిని చంపక అతని కోరును తెంపాలనే శిక్ష చెప్పాడు కేతన.

పరస్త్రీ ఒంటరిగా ఉన్నపుడు ఆమెకు అభివాదం, నమస్కారం చేయడం కూడా ఆనాటివారు సహించేవారు కాదు. మంచెన కేయూర బాహు చరిత్రలో దక్షుడనే వాడు తన పొరుగింటిలో ఉన్న సుందరిని చూచి కామించి ఆమె ఎక్కడకు ఒంటరిగా వెళ్లినా ఆమెకు ఎదురై నమస్కరించేవాడు. ఆమె భర్తకు ఈ సంగతి తెలిసి అతడిని శిక్షించదలిచాడు. సుందరికి నమస్కారం చేయడానికి ఆమె ఇంటివైపు వచ్చిన దక్షునికి ఆ యింటి గోడ వెనుక దాగిన సుందరి భర్త కనిపించాడు. అతడు సమయస్ఫూర్తితో అన్ని దిక్కులకు ప్రదక్షిణం చేసి మొక్కాడు. అతడు దేవతలకు అభివందనం చేస్తున్నాడని, ఆ యక్షునికి మనసులో దురుద్దేశమున్నదే కానీ అది సుందరి భర్తకు తెలియదు కనుక ఆమె భర్త అతడిని శిక్షించకుండా వదలివేశాడు. ఈ వృత్తాంతాన్ని బట్టి పరస్త్రీ ఒంటరిగా ఉన్నపుడు పరపురుషుడు అభివాదం చేయటం కూడా ఆనాటి వారు తప్పుగా భావించేవారని తెలుస్తున్నది.

బండలు బూతులు పరిహాసకులు నట్టువారాదిగా గల వారు దక్క
బెఱవారి యాలుతా బ్రియుడు వారింపంగ బరుతోడ బల్కిన బణశతంబు
వలదన గా నొరు వనితతో నొక్కండు దా బల్కెనేరి శతద్వయంబు
వారించుటెఱి గియు వారిద్దఱును మాటలాడి రేనియును ఱంకాడినట్లు
కాన ఱంకునందు గడుదండు వచ్చుట విహితమండ్రు ధర్మవేదులెల్ల
వారి వర్తనములు వారికులంబులు తెలిసి దండువలు విధింప వలయు

బండలు, బూతులు, పరిహాసకులు, నట్టువవారు మొదలైనవారి భార్యలు తప్ప తక్కిన స్త్రీలు భర్త వారించినపుడు పరపురుషుడుతో మాట్లాడితే నూరుపణాలు ఇచ్చుకోవాలి. భర్తచేత వారింపబడిన స్త్రీతో పరపురుషుడు మాట్లాడితే రెండు వందల పణాలు ఇచ్చుకోవాలి. వద్దని వారించినప్పటికీ పరపురుషుడు పరస్త్రీతో మాట్లాడితే రంకాడినట్లే అంటే వ్యభిచరించినట్లే కనుక దానికి వారు ఎక్కువ పరిహారం ఇచ్చుకోవాలి. ధర్మం తెలిసినవారు వారి కులాలను బట్టి, వర్తనలను బట్టి నేరాన్ని నిర్ణయించి నేరపరిహారం విధించాలి అని కేతన నిర్దేశించాడు. దీన్నిబట్టి కొన్ని వృత్తులలో స్త్రీలు పురుషులు పరస్పరం మాట్లాడుకోవడం తప్పుకాదని, ఆ వృత్తులకు చెందనివారు, భర్తచేత వారింపబడ్డవారు మాత్రమే పరపురుషులకు దూరంగా ఉండాలని తెలుస్తున్నది. అటువంటి సందర్భాలలో కూడా స్త్రీలకంటే పురుషులకే దండన ఎక్కువ ఉండేది. దేవాలయాలలో వివాహితలైన అంగరంగ భోగాలవారికి పుణ్యపణ్యాంగనలకు బహుశా ఇది వర్తించదు.

కామంతో, మదంతో బలవంతంగా క్రీడించడం దోషం, పరస్త్రీని దూషించడం ఇంకా పెద్ద దోషం. ఈ తప్పులు చేసినవాడికి ఆ రోజుల్లో శిక్ష ఉండేదని విజ్ఞానేశ్వరం బట్టి తెలుస్తున్నది. ఈనాడు ఏ పురుషుడైనా స్త్రీని బలవంతం చేస్తే ఆ నేరాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత స్త్రీలదే. వారిని ప్రశ్నలతో అవమానించి వేధించడం నేటి న్యాయస్థానాలలో జరుగుతున్నదే కానీ కాకతీయుల కాలంలో నేరాన్ని రుజువు చేయవలసిన అవసరం స్త్రీకి లేదు. పైగా అలా బలవంతం చేయబడిన స్త్రీ ఈనాటి స్త్రీ వలె అవమానింపబడేదికాదు. బలవంతం చేయబడిన స్త్రీ కులస్త్రీ అయినా వేశ్యాస్త్రీ అయినా బలవంతం చేసిన పురుషుడికి ఆనాడు శిక్ష ఉండేది. ఈనాడు కులస్త్రీ అయినా బలాత్కారం చేసిన విషయం కూడా చెప్పడానికి జంకుతున్నది. దీన్నిబట్టి ఈనాటికన్న కాకతీయులకాలంలో స్త్రీల పరిస్థితి మెరుగని, సంఘం నుండి వారికి రక్షణ, సానుభూతి ఉండేవని మనం గ్రహించవచ్చును.

పరస్త్రీ దూషణ – శిక్షలు

స్త్రీలను దూషిస్తే ఆనాడు దండన విధించేవారు. కేతన విజ్ఞానేశ్వరంలో స్త్రీలను దూషించేవారికి దండన విధించాడు. తల్లిని, తండ్రిని, గురువుని, సోదరుని అకారణంగా దూషించేవారికి నూఱు పణాలు, తన కంటె అధికుడైన వాని సతిని తిడితే యాభైపణాలు, తనకంటె హీనుని సతిని తిడితే పన్నెండున్నర పణములు దండువుగా చెప్పాడు. అయితే ఈనాడు స్త్రీని తిట్టటం అపరాధం కాదు. దానికి శిక్ష అంటూ ఏమీ లేదు. తనకంటే హీనమైన స్త్రీని (పరసతిని) తిట్టడం ఒక హక్కుగా భావిస్తున్నారు.

నిజజీవితంలోనూ, చలన చిత్రాలలోనూ తిట్లు, బూతుమాటలు ఎక్కువైనాయి. ఏ తిట్టు అయినా స్త్రీకి అన్వయించబడుతుంది. ఒక పురుషుని తిట్టాలంటే అతని తల్లి, సోదరి, భార్య వంటివారికి అన్వయించే విధంగా తిట్టటం ఒకప్పుడు పామరులు చేస్తే ఇప్పుడది చలనచిత్రాలలో కూడా అనుసరిస్తూ అసభ్యకరమైన భాష వాడి స్త్రీజాతిని అవమానిస్తున్నారు. వీరికి దండన లేకపోగా ఆ చలన చిత్రాలలోని తిట్లు ప్రజాదరణకు నోచుకొని, ఆ విధంగా సంభాషణలు రాసినవారికి ధనం లభిస్తోంది. స్త్రీలు ఎంతో పురోగమిస్తున్నారు అనుకునే ఈనాటి సమాజంలో పరిస్థితి ఈ విధంగా ఉన్నది. కానీ కాకతీయుల కాలంలో స్త్రీల శీలానికి సంబంధించిన తిట్లు ఎవరైనా తిడితే వారికి దండువు (జరిమానా) ఉండేది. కేతన విజ్ఞానేశ్వరంలో ఆ విధంగా తిట్టేవారికి దండువు ఈ విధంగా ఉండాలన్నాడు.

వాని తల్లి తోబుట్టుగు వాని యాలు వాని లంజెలు వారికి దానుమగండ
ననుచు నీ క్రియ బూతాట మాడి తిట్టు నతని గొన దగు బంచవిశతి పణములు

ఒకరి తల్లి, సోదరి, భార్య వీరికి తాను మగడినని ఈ విధంగా బూతు తిట్లు తిట్టేవాడికే కాదు, అతని వేశ్య (భోగస్త్రీ) కు కూడా తాను మగడనని చెప్పడం అపరాధమనీ, దానికి (జరిమానా) అపరాధ శుల్కంగా ఇరవై అయిదు పణాలు చెల్లించాలని విజ్ఞానేశ్వరం ఆదేశించింది. స్త్రీలను తిట్టడం, స్త్రీలకు అన్వయించే అశ్లీల పదాలను వాడడం ఎక్కువైన ఈనాటికంటే కాకతీయుల నాటి, సమాజంలో స్త్రీ గౌరవప్రదమైన స్థానాన్ని పొందిందని చెప్పవచ్చును. సామాజికాచారాలు – స్త్రీలు:

కులస్త్రీ భర్త మరణించిన తరువాత ఏవిధంగా ఉండాలి అన్నది కాలాన్నిబట్టి మారుతూ ఉండవచ్చు. కొన్ని కులాలలో సహగమనం కొన్ని కులాలలో వైధవ్యాచారాలు పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనతో కాలం గడపడం, కొన్ని కులాలలో మారుమనువు చేసుకోవడం అనేవి వారివారి వర్గాల కుల, సమయ సంఘాలు ధర్మశాస్త్రాలు నిర్ణయిస్తాయి. కాకతీయుల కాలంలో భర్త మరణించిన తరువాత కులస్త్రీలు పాటించే సామాజికాచారాల గురించి తెలుసుకుంటే ఆనాటి స్త్రీలకు సమాజంలో ఉన్న స్థానం తెలుస్తుంది.

సతీసహగమనం:

నిరంతరం యుద్ధాలతో వేగిపోయిన మధ్యయుగపు ఆంధ్రదేశంలో ఆనాటి వీరులు విజయము లేక వీరస్వర్గము పొందాలని ఏ విధంగా భావించేవారో అట్లాగే వారి పత్నులు సహజీవనము లేక సహగమనం కర్తవ్యాలుగా భావించేవారు. కులసతి, ధర్మపత్ని అయిన స్త్రీ భర్త క్షేమం కోసం వ్రతాలు ఆచరించేది. అతడు మరణిస్తే అతని శవంతో పాటు తానూ చితిలో కాలిపోయేది. సహగమనం మధ్యయుగంలో ఎక్కువగానే ఉండేది.

పల్నాటి వీరచరిత్రలో నలగాముని కొలువుకు రాయబారిగా వెళ్ళిన అలరాజు మరణించినపుడు అతని భార్య పేరిందేవి చేసిన సహగమనం ప్రసిద్ధమైనది. ఆ కావ్యంలోనే ఇంకా కొందరు స్త్రీలు సహగమనం చేసిన వైనాలున్నాయి. మాంచాల బాలచంద్రుని మరణానంతరం సహగమనం చేసింది. తనకు కులపత్నిగా అదొక్కటే దక్కిందని కూడా అన్నది. బ్రాహ్మణస్త్రీలకు సహగమనం విజ్ఞానేశ్వరుడు అంగీకరించలేదు కానీ బాలచంద్రుని స్నేహితుడు బ్రాహ్మణుడు అయిన అనపోతు మరణించినపుడు బంధువులందరూ అతని భార్య సహగమనానికి సమ్మతించగా వారిద్దరినీ అగ్నికర్పించారు. దీన్ని బట్టి సహగమనం భార్య ఇష్టాన్ని బట్టి ఉండేదని తెలుస్తున్నది. పల్నాటి వీరచరిత్రలోని స్త్రీలందరూ సహగమనం పాటించలేదు. దొడ్డనాయుడు మరణిస్తే శీలమ సహగమనం చెయ్యలేదు. అనుగురాజు మరణిస్తే వీరవిద్యలదేవి చెయ్యలేదు. కాకతీయుల పూర్వానంతర కాలాల్లో సహగమనాలు ఎక్కువ జరిగాయేమో కానీ, కాకతీయుల కాలంలో సహగమనాలు తగ్గినాయని చెప్పవచ్చును. భర్తలు గతించాక వారి రాజ్యాలను, మండలాలను వారి భార్యలు ఏలడం అన్నవి జరిగాయని శాసనాధారాల వల్ల నిరూపించవచ్చును.

కాకతి రుద్రమదేవి భర్త చాళుక్య వీరభద్రుని మరణానంతరం సహగమనం చేయలేదు. కాకతి గణపతి దేవుని మరొక పుత్రిక గణపాంబ భర్త కోటబేతరాజు మరణానంతరం అతని రాజ్యానికి వారసురాలై ఆ రాజ్యాన్ని ఏలుకొన్నదని ఆమె వేయించిన యనమదల, మొగలుట్ల శాసనాలను బట్టి తెలుస్తున్నది. విరియాల కామసాని భర్త ఎఱ్ఱన మరణానంతరం గరుడబేతని సంరక్షణ భారం వహించింది. భర్తలు గతించాక స్త్రీలు భర్తల పుణ్యం కోసం శివలింగ ప్రతిష్ఠలు చేసి అఖండదీపదానాలు చేసి వేయించిన శాసనాలు అనేకం ఉన్నాయి.

కులపత్ని, కులపాలిక, కులసతి అని వ్యవహరింపబడే భార్య మాత్రమే సహగమనం చేసేది. కులస్త్రీలందరూ తప్పని సరిగా చేయకపోయినా సంఘంలో ఒక వర్గం స్త్రీలు ముఖ్యంగా రాజకుటుంబాల కులస్త్రీలకు భర్త చనిపోయాక సహగమనం చేయడం ధర్మమని భావించేవారని నాటి సాహిత్యం వలన తెలుస్తుంది.

కుమార సంభవంలో మన్మథుడు శివుని నేత్రాగ్నికి భగ్నమైపోగా రతి పతి సహవృత్తి లేదేనిం గులపాలికా ధర్మవృత్తి నైనం బురుషు తోడ బరలోకంబున కరుగవలయున వశ్యంబని అగ్ని ప్రవేశం చేయ నిశ్చయించింది.

సతీసహగమనం – పూర్వాపరాలు:

సతీసహగమనం అన్నది ఎలా ప్రారంభమై వుంటుంది, భార్య భర్త చనిపోతే ఎందుకు సహగమనం చేయాలి? ధర్మశాస్త్రాలు సహగమనం గురించి ఏం చెప్పాయి? ఈ సతి సహగమనం వల్ల చేకూరే ప్రయోజనం ఏమిటి? సహగమనం స్త్రీలు ఇష్టపూర్వకంగా చేసేవారా లేక బంధువులు బలవంతంగా చేయించేవారా? అనే ప్రశ్నలు ఈ నాటివారికి కలగడం సహజం.

మధ్యయుగంనాటి రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని మనం ఈ సతి సహగమనాన్ని గురించి పరిశీలించాలి.

ఆనాడు భారతదేశం చిన్నచిన్న మండలాలుగా ఉండేవి. వాటి పాలకులు ఏవో కారణాలతో యుద్ధాలు ప్రకటించేవారు. ఆ యుద్ధాలలో పాలకులు, సైనికులు ఎందరో మరణించేవారు. ఈ నాటివలె కాక ఆ రోజుల్లో మాటకు వీరావేశానికి, కీర్తికి పౌరుషానికి ఇచ్చినంత విలువ ప్రాణాలకి ఇవ్వలేదు. యుద్ధంలో రాజు చనిపోతే సైనికులు, సేవకులు ప్రాణత్యాగం చేసేవారు. రాజు ఓడిపోతే అతనికి సంబంధించిన అంతఃపుర జనం రాణులతో సహా మూకుమ్మడిగా అగ్నిలో దూకి ప్రాణాలర్పించేవారు. చితోడ్ రాజు చనిపోయినపుడు రాణీపద్మిని అంతఃపుర స్త్రీలందరితో సహా అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకున్న విషయం చారిత్రకంగా సుప్రసిద్ధమైంది.

ఇలా రాజుతో సైనికులు మరణించిన తరువాత వారికై నిర్మించిన సమాధులను వీరక్కల్ అనేవారు. స్త్రీలందరూ ఆత్మాహుతి చేసుకొన్న సందర్భంలో నిర్మించిన సమాధులను మాస్తిక్కల్ అంటే మహాసతి కొరకు నిలిపిన సమాధి అని అనేవారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here