పూచే పూల లోన-9

0
4

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[సమీర్‍తో పాటు ఓ గుహలోకి వెళ్ళి అక్కడ్నించి క్రిందకు దిగడం మొదలుపెట్టిన సుందర్ క్రింద కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి అబ్బురపడతాడు. ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసి మైమరిచిపోతాడు. ఇంతలో క్రిందకి రమ్మని సమీర్ సైగ చేస్తాడు. ఎలా రావలని సుందర్ అడిగితే, కుడివైపున దేన్నో చూపిస్తాడు సమీర్. జాగ్రత్తగా చూస్తే, అక్కడ ఓ సన్నని త్రోవ కనిపిస్తుంది. మెల్లగా దాని వెంబడి దిగి, సమీర్ చేతుల్లో వాలతాడు సుందర్. అతను గట్టిగా కౌగిలించుకుని వీపు తడతాడు. ఈ ప్రదేశానికీ మీకూ ఏదో కథ ఉండాలి కదా అంటాడు సుందర్. అవునంటాడు సమీర్. చిన్నప్పుడు ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టేవాడినని చెప్తాడు. అక్కడున్న గొయ్యి లాంటిదాన్ని చూసి, అదేమిటి అని సుందర్ అడిగితే, అది ఆ కాలం నాటి యజ్ఞవాటిక అని కొందరు, కాదు అదో నుయ్యి లాంటిదని మరికొందరు చెప్తారని అంటాడు సమీర్. మెల్లగా ఆ గుహ దాటి సముద్రం ఒడ్డుకు వస్తారు ఇద్దరూ. మాట్లాడుకుంటూ అక్కడ్నించి  కొంత దూరం వచ్చాకా ఒక రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్డు ఎక్కడికి పోతుందని సుందర్ అడిగితే, మనం కారు ఆపిన చోటుకు వెళ్తుందని అంటాడు సమీర్. థ్రిల్ ఉండాలి జీవితంలో అంటాడు. మరోసారి వీలు చూసుకుని వచ్చి ఆ కొలనుల మధ్య ధ్యానం చెయ్యాలని ఉందని అంటాడు సుందర్. అలా కుదరదని, దేనికైనా ఓ సమయమూ, ఓ ఘటన ఉంటాయనీ; ఒకరి సంకల్పం వలన ఏదీ కాదని అంటాడు సమీర్. కారు ఎక్కి బయల్దేరుతారు. ఆ ఊరంటే తనకి చాలా ఇష్టమని అక్కడి వాళ్ళంతా తనకి ఆప్తులని అంటాడు సమీర్. తరువాత తన తాత గురించి, ఆయన చేసిన దౌర్జన్యాల గురించి చెప్తాడు. కాసేపటికి తన తండ్రి క్రూరత్వాన్ని తెలిపే మరో సంఘటన గురించి సుందర్‍కి చెప్తాడు సమీర్. తనకీ, తండ్రికీ మధ్య అంతరం ఎలా ఏర్పడిందో చెప్తాడు. ఇక చదవండి.]

[dropcap]నా[/dropcap]లుగు రోజుల తరువాత ఒక ఆదివారం మధుకర్ ఆయన ఇంటికి బ్రేక్‌ఫాస్ట్‌కి పిలిచారు. ఈసారి ఆ మహిళ ఇంటి క్రిందనే ప్రత్యక్షమైంది. చేతిలో ఏదో సరుకులు పట్టుకుని చక్కగా నవ్వింది. కొద్దిసేపు ఆలోచించాను. నాకు ఇవ్వాలని పట్టుకుందా? కాదు. మరి ఎందుకు నవ్వుతోంది? మధుకర్ నన్ను చూసి “రండి, లోపలికి వెళదాం” అన్నారు. క్రిందటి సారి పొరపాటుగా ప్రక్కన ఉన్న హాల్లోకి వెళ్ళాను. ఆ మనిషి అక్కడే లేదు కానీ, ఎవరో ఇద్దరు రెండు స్టీల్ చెయిర్స్‌లలో కూర్చుని పేపరు చదువుకుంటున్నారు. పైకి వెళ్ళి ముందుగా కొద్దిగా కాఫీ త్రాగి రిలాక్స్ అయ్యాను. ఆమె లోపలికి వెళ్ళి ఒక ప్లేట్‍లో ఏవో వెరైటీ బిస్కట్స్ సర్ది పట్టుకొచ్చింది. చక్కగా నవ్వి వెళ్ళింది.

“ఏంటి చూస్తున్నారు?” అడిగారు మధుకర్.

“ఈవిడ క్రిందటి సారి చిత్రంగా చూసింది. ఈసారి చిరకాల పరిచయం ఉన్నట్లు నవ్వుతోంది!”

ఆయనా నవ్వారు.

“ఈ సందేహం నాకు చాలాసార్లు కలిగేది..” చెప్పారు. “ఆ మాటకొస్తే ఈ ప్రాంతంలో దాదాపుగా అందరూ అంతే.”

“ఏదైనా బలమైన కారణం ఉందా?”

“ఉంది. ఇక్కడికి వచ్చేవారి ప్రవృత్తులన్నీ సందేహాస్పదంగా ఉంటాయి.”

నా మోహం మాడిపోయిందని నాకు తెలిసిపోయింది. ఆయనా అందుకే నా వీపు మీద ఒక దెబ్బ వేసారు.

“కమాన్. టేక్ ఇట్ ఈజీ. అది ఒక జీవిత సత్యం. అంతే. అలా రండి. లైబ్రరీలోకి వెళ్ళి కొంత మీరు వచ్చిన పని ఏంటో చూద్దాం.”

లోపలికి వెళ్ళాం. చాలా పెద్ద లైబ్రరీ అది. అప్పటికే కొన్ని పుస్తకాలు, కొన్ని పురాతమైన పత్రాలు ఓ మూల టేబుల్ మీద పెట్టి ఉంచారాయన.

ఒక దీర్ఘ రోగి ఎవరో మూల కాలయాపన చేస్తూ పడుకుని ఉంటే తప్పదన్నట్టు చూడటానికి వెళ్ళినట్టు అనిపించింది. బిస్కట్ కలర్‌లో ఉన్న కాగితాలని నేను తీయబోతుంటే ఆపారాయన.

“గాజు కంటే నాజూకు. చిరగటం కాదు, పగిలిపోతాయి.”

“ఎలా చదవాలి?”

“నేను చదువుతాను, మీరు వినండి”

అక్కడ ఉన్న కుర్చీ లాక్కుని కూర్చున్నాను. ఆయన తన రెండు చేతులూ నలుపుకున్నారు. ఏదో మాయ చేస్తున్నట్టు అక్కడ ఉన్న ఓ పెట్టెలోంచి ఏవో పనిముట్లు తీసారు. అవి ప్లాస్టిక్‍తో చేసినట్లున్నాయి. ఒక ట్రే లోకి ఒక్కో కాగితం ఆ పనిముట్టుతో తీసిపెట్టారు. నా వైపు చూసి ఏదో ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టారు.

“దేశంలో ఎందరో చరిత్రకారులున్నారు. కానీ మధుకర్ పద్ధతి వేరు” అన్నారు.

“ఎందుకలాగ?”

“చరిత్రకు ఆధారాలేమిటి?”

“శిలా శాసనాలు. కాదా?”

“శిలా శాసనాలకి?”

“..”

“పోనీ ఎవరో ఆ సమకాలీనులు వ్రాసుకున్న మాటలా? అవి అబద్ధాలు, వారు వ్రాసుకున్న బాధలు కావచ్చు కదా?”

“సత్యశోధన అనేది చాలా కష్టం”

“భద్రాచలం శ్రీరామాలయంలో శిలాశాసనాలు చూసారా?”

“లేదు”

“తానీషా కాలంలోని శిలా శాసనాన్ని చెరిపేసి, మరొకటి వ్రాసినట్టు స్పష్టంగా తెలుస్తుంది”

“ఛ”

“అవును. మరి ఏది చరిత్ర?”

“ఎవరు చెప్పాలి?”

ఆయన ఆ ట్రేలోని కాగితం మీద ఒక భూతద్దం పెట్టుకున్నారు.

“మీరు ఒకటి లేదా రెండు సంఘటనలను ఎంచుకుని ఓ కథ వ్రాస్తారు. అవునా?”

“కావచ్చు”

“అయినా అది కథే”

“ముమ్మాటికిన్నూ”

“మరదే! ఒక యుద్ధం, ఒక ఆక్రమణ, ఓ సంఘటన.. వీటి మీదుగా కదా మనం చరిత్రను శోధించేది?”

“అవును. అవీ తప్పేనా?”

“దాని దగ్గరకు తరువాత వద్దాం”

లేచి నిలబడ్డాడు. దగ్గరగా వెళ్ళాను.

“నేను చదువుతాను, వినండి..” అన్నారాయన. “..మెక్కా నుండి మూడు వందల ఎనభై మంది మగ, ఆడ మనుషులను, పిల్లలను షిప్‍లోకి తీసుకున్నాం. గన్ పౌడర్‍తో ఆ షిప్పునూ, అందులో ఉన్న అందరినీ కాల్చేసాం.. ఇది చెప్పింది వాస్కోడగామా సహచరుడు. 1502వ సంవత్సరంలో.”

“ఇది అతను వ్రాసిందా?”

“కాదు”

“మరి?”

“ఆఫ్రికా నుండి యూరప్‍కు మరో దారిలో వెళుతున్న వాస్కోడగామా హిందూ మహాసముద్రంలో దాదాపు 2000 సంవత్సరాలుగా సాగుతున్న వ్యాపార సీమలోకి వచ్చాడు. మనం మామూలుగా వాడే మిరియాలు, అల్లం, ఇంగువ తొలుత దోపిడీలన్నింటికీ కారణాలంటే మనం నమ్మగలమా?”

“నిజమే”

“అవి పండే చోట వ్యాపార నిమిత్తం పెద్ద పెద్ద స్థావరాలుండేవి. ఆధునిక వైద్యశాస్త్రం లేనప్పుడు ఎన్నో జబ్బులను వీటితోనే నయం చేసారు. అంతే కాదు, చనిపోయిన వారి శరీరాలను వీటితో పాడైపోకుండా కాపాడుకున్నారు.”

“ఇంతకీ ఇది వ్రాసింది ఎవరు?”

ఆ మహిళ వచ్చి మమ్మల్ని డైనింగ్ టేబుల్ వద్దకు ఆహ్వానించింది.

“ఇదేంటి? ఆవిడ ఇడ్లీ సాంబారు తయారు చెయ్యగలదా?” ఆశ్చర్యంగా అడిగాను.

“అవును. ఈ మధ్యనే నేర్చుకుంది. అందుకే ఇందాకటి నుండి నవ్వుతోంది. ఆ ప్రతిభ మీకు చూపించాలని!”

ఇద్దరం తిండిలో మునిగిపోయాం.

మధుకర్ చెబుతున్నారు..

“సామాన్యంగా వ్యాపారం ఉన్న ప్రతి చోటా లావాదేవీలలో భాగంగా అమ్మాయిల వ్యవహారం సర్వసాధారణం. ఈ అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా వాళ్ళ కార్యాలు నిర్వహిస్తూ మరో పని కూడా చేసేవారు.”

“విషం పెట్టి చంపేవారా?”

“కాదు. కొంకణి, తులు, మలయాళ భాషల మిశ్రమంలో ఒక సందేశం వ్రాసేవారు.”

“ఎవరికి?”

“చెప్పటం కష్టం! కాకపోతే వ్యాపార నిమిత్తం వీరి తోడి వ్యాపారస్థులకో లేక భుస్వాములకో లేక ఒక్కోసారి పాలిస్తున్న రాజుల కోసం కూడా.”

“ఏం వ్రాసేవారు?”

“వీళ్లు చాలా తెలివిగల వారు. వ్యాపారస్థులు ఎంతో అందంగా ఉన్నవారి వద్దకు తరచూ వచ్చేవారు. వాళ్లల్లో కొంతమందికి కలిగే జబ్బులకు వైద్యం కూడా వీరు చేసేవారు. క్రమంగా వారి సంభాషణలను అర్థం చేసుకుంటూ వాళ్ళ మాటలను వారికి చేతైన భాషలోకి తర్జుమా చేసుకునేవారు. అటువంటి వర్తమానమే నేను ఇప్పుడు మీకు చదివి వినిపించినది!”

“ఓ. మీ చేతికెలా వచ్చింది?”

“అదో పెద్ద కథ”

“ఒక్క విషయం అర్థం కాలేదు”

“చెప్పండి”

“వర్తమానం ఏదో పంపారు, నిజమే. ఆ కాగితాలు అలా భద్రపరచటానికి కారణం?”

“ఆ రహస్యం చాలా కాలం వరకూ తెలియలేదు. ఈ సంగ్రహం దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఒక బ్రిటీషర్ చేతిలో పడింది. ఎంతో పట్టుదలతో పరిశోధించాడు ఆ మహానుభావుడు. చివరకు ఏం తేలిందంటే ఎవరి ఇళ్ళల్లోనైతే ఇవి దొరికాయో అందరూ గొప్ప వ్యాపారవేత్తలే! కాకపోతే ఈ కాగితం యొక్క మెటీరియల్ కూడా ఎవరికీ తొందరగా అంతుపట్టలేదు.”

ఆమె వైపు తిరిగి “చాలా బాగా చేసారండి” అన్నాను. ఎంతో ఆనందించినట్లు అనిపించింది.

“చాలా ఆశ్చర్యకరంగా, ఆసక్తికరంగా ఉంది. ఈ స్క్రిప్ట్‌ని మొత్తనికి డీకోడ్ చేసారు.”

“అవును వాస్తవానికి ఈ ప్రాంతంలో కొన్ని భాషలకు లిపి లేదు. కేవలం వాడుక ద్వారా తెలుసుకోవాలి. మీరు లింగ్విస్టిక్స్ అనే సబ్జెక్ట్ గురించి విని ఉంటారు.”

“అవును. ఇలాంటివి ఈ అధ్యయనాల ద్వారానే వచ్చాయి.”

“ఇంతకీ ఈ కాగితాల సంగతి తేల్చలేదు.”

“ఏం లేదండీ, మిరియాలు, ఇంగువ, అల్లం, పసుపు.. ఇలాంతివి పొడిగా తయారు చేసి, ఆ మిశ్రమాన్ని ఈ కాగితంలో కట్టి ఇచ్చేవారు. దొరలు వైద్యానికి తీసుకుని వెళ్ళేవారు. ఆ పొడిని నీటిలో కలుపుకున్నాకా, కాగితాన్ని సేవకులు ఆ షిప్పుల ద్వారా చేర్చవలసిన చోటుకి చేర్చేవారు.”

“ఎవరికీ అనుమానం రాలేదా?”

మధుకర్ లేచారు. ఆ టేబుల్ దాకా చేరి మరో కాగితం తీసారు.

“ఇందులో ఉన్నది చదువుతాను. మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఏముందంటే.. ఆ.. ఆదీ! వచ్చే పున్నమికి మరో మంత్రం పంపుతాను.. అని ఉంది!”

“ఓ. అంటే ఇవి..”

“మంత్రాలని చెప్పి వైద్యానికి కట్టిన పొట్లాలివి!”

“నమ్మాలంటే కష్టంగానే ఉంది”

“కానీ అదే చరిత్ర! ఇక్కడ చూడండి..”

ఆ టూల్ పట్టుకుని ఆ కాగితాన్ని ఎత్తి పట్టుకున్నాడు. అందులో ఒక బొమ్మలాగా కూడా ఉంది.

“ఎవరై ఉంటారు?”

“ఇది మార్కోపోలో – ఈయన చైనా నుండి పర్షియన్ గల్ఫ్ మీదుగా పదమూడవ శతాబ్దం చివర భారతదేశం వచ్చాడు. ఈయన క్విలన్, మిరియాలు, చందనం.. ఇలా ఎన్నో విషయాల గురించి వ్రాసియున్నాడు. దీని వెనుక ఇద్దరు యాత్రికుల గురించి ఉంది – ఫ్రెంచ్ వాడైన జోర్డానస్, ఇటాలియన్ అయిన ఒడోరిక్. ఇద్దరూ మలబార్ వచ్చారు. మన సముద్రాల అంచున క్రైస్తవ సైన్యాన్ని నెలకొల్పమని అప్పటి పోప్‍కి చెప్పింది వీరే!”

మనిషి మరో మనిషికి ఏ విధంగా అవసరమవుతాడు, ఏ విధంగా శోషింపబడతాడు అనేవి ప్రశ్నలే కానీ సమాధానాలు హింస లోనే దొరుకుతున్నాయి.

ఆయన ఆ సబ్జెక్ట్ నుండి మరో చోటుకి వెళ్ళటం లేదు.

“వాస్కోడగామా మే 20, 1498 న కాలికట్‍కు ఉత్తరాన మలబార్ తీరాన లంగరు వేసాడు.. ఇదిగో మరో మాట – అఫనాసీ నికిటిన్ అనే వ్యాపారస్థుడు మరెవరికో చెబుతున్నప్పుడు వ్రాసిన మాట.. పాశ్చాత్యులు ఇక్కడ ఇన్ను యజమానురాలు దగ్గర ఉంటారు. ఆవిడ వండి పెడుతుంది. ఆవిడ వాళ్ళతో పడుకుంటుంది. ఇక్కడి స్త్రీలు తెలిసిన తెల్లచర్మం గల పురుషులతో పడుకోవటం ఇష్టపడతారు. అలాంటి వారంటే వారికి చాలా ఇష్టం!”

“బ్రేక్‍ఫాస్ట్ బాగుంది. పెద్ద మసాలాలు లేవు.”

“ఓ. గుడ్. వాస్కోడగామా షిప్ పేరు సావో గెబ్రియల్. అది అతని సొంతం. ఇద్దరు మహ్మదీయ వర్తకులను బంధించి తెచ్చినప్పుడు వాళ్ళు కెస్టిలియన్ భాషలో మాట్లాడి ఆశ్చర్యపరిచారు. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం – క్రైస్తవులు, మసాలాలు (స్పైసెస్)!”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here