కలవల కబుర్లు-29

0
3

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]అ[/dropcap]మెరికాలో బియ్యం దొరకడం లేదంటే మన ఆంధ్ర, తెలంగాణలలో సునామీ వచ్చేసింది.

ఎందుకు పుట్టిందో, ఎక్కడ పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో ఆ వార్త.. గంటల్లోనే.. కాదు, నిముషాల్లో.. అబ్బే అదీ కాదండీ సెకన్లలో అమెరికా మొత్తం పాకిపోయింది. ఏదో సామెత వుంది చూసారూ! నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ఊరంతా తిరిగొస్తుందట. అలా ఆ అబద్ధమో, నిజమో ఏదో కానీ, అమెరికాలో నిద్ర లేచింది. పాపం ఆ టైముకి ఇండియా నిద్ర పోతోంది. తెల్లారగానే తెలుసుకుంది.

తెలుసుకోగానే.. రకరకాలైన ముచ్చట్లు వచ్చేసాయి. అమెరికా లోని ఇండియన్ స్టోర్ల ముందు హనుమంతుడి తోకలాంటి క్యూ లనీ, షాపులు లూటీ చేసి బియ్యం సంచీలని కొల్లగొడుతున్న మన తెలుగువారినీ చూసి.. మన తెలుగువాళ్ళలోనే నవ్వినవారూ వున్నారు. అయ్యో! అక్కడ మా పిల్లలు ఎలా వున్నారో? వాళ్ళకి బియ్యం వున్నాయో లేవో అని ఆందోళన పడినవారూ వున్నారు, మన తెలుగు వాళ్ళింతే.. ఎక్కడ వున్నా మన పరువు తీసేస్తారు అన్నవారూ ఉన్నారు.

నిజమే! మరీ అలా ఎగపడిపోయి, పక్కవాళ్ళకి కూడా మిగలకుండా సంచీలకి సంచీలు కొనేసుకున్నవారు చాలా మందే వున్నారు. అలా చేయకుండా వుండాల్సింది. రెండో, మూడో సంచీలతో సరిపెట్టుకుంటే బావుండేది. కానీ, ఈ కొరత ఎన్నాళ్ళు వుంటుందో అనే భయంతో కంగారు పడిపోయారు.

ఈ హడావుడి చూసి షాపు వాళ్ళు రేట్లు పెంచినా తగ్గేదే లేదంటూ, ఇదివరకు మన పల్లెల్లో గాదెలో ధాన్యం దాచుకున్నట్లు, గరాజులలో, సెల్లార్లలో బియ్యం సంచీలు స్టాక్ పెట్టేసుకున్నారు. పాపం! వాళ్ళ కంగారు వాళ్ళది. మరి మన తెలుగువారికి అన్నం ముద్ద కడుపులో పడందే తృప్తిగా వుండదాయే. ఆ ఉత్తరాది వారికి మల్లే, ముప్పొద్దులా ఆ చపాతీలూ, పుల్కాలూ, తినలేమాయె. ఎప్పుడో ఏదో సోకరంగా తింటామేమో కానీ.. పొద్దస్తమానం రొట్టెలు ఎక్కడ నమలగలమూ. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని, రకరకాల రుచుల అనుపానాలతో కడుపారా తినే ప్రాణాలాయే మనవి.

మరి అలాంటి అన్నగతప్రాణులకి , బియ్యం కొరత అనే మాట వింటే.. పై ప్రాణాలు పైకే పోవు మరీ?

అందుకే పక్కవాడి ఆకలి సంగతి దేవుడెరుగు.. చిన్ని నా పొట్టకి శ్రీరామ రక్ష అనుకున్నారు.

ఆఫీసులకి సెలవలు పెట్టి, పిల్లాపాపా మొత్తం క్యూ లు కట్టారు. ఈ తొక్కిసలాటలు, గుంపులు గుంపులు.. లూటీ చేసినట్టు ఎగబడడాలూ చూస్తోంటే, హెలికాప్టర్ నుంచి జారవిడిచే పులిహోర పొట్లాల కోసం తుఫాను బాధితులే గుర్తొచ్చారు.

ఏదైనా బాధ అనుభవించినవారికే ఆ కష్టం తెలుస్తుంది. ఒడ్డున కూర్చున్నవాళ్ళూ, దూరాన వున్న వాళ్ళు ఏం కబుర్లైనా చెపుతారు. ఎన్ని మాటలైనా అంటారు. ‘అమెరికాకి మా బాగా అయింది. లేకపోతే వున్నట్టుండి ఉద్యోగాలు పీకేస్తుందా? ఇప్పుడు మన దేశం బియ్యం ఎగుమతి ఆపి మంచిపని చేసింది. తిక్క కుదిరింది.’ అంటూ అక్కడ కూర్చుని చప్పట్లు కొడుతున్నారే… కానీ అమెరికాలో బియ్యం దొరక్కపోతే ఇబ్బంది పడేది మనవాళ్ళే అని గుర్తుంచుకోవాలి. అక్కడ ఈ కబుర్లు చెప్పేవారి కుటుంబాలనుండి ఇంటికొకరైనా అమెరికాలో వున్నారు. ఈ బియ్యం కొరతని అనుభవించేది వారే అని మర్చిపోకండి.

ఆ తర్వాత ఈ సంఘటన మీద వచ్చే జోకులూ, మీమ్సూ, రీల్సూ అబ్బో.. చెప్పలేనన్ని.

ఇండియాలో అత్తగారు, అమెరికా లోని కోడలితో మాట్లాడుతూ.. అన్నం వండాను కానీ, టమాటా కూర చేయలేదే అమ్మాయ్! అంటే.. దానికి జవాబుగా, కోడలు.. నేను టమాటా కూర చేసాను కానీ, అన్నం వండలేదు అత్తయ్యా!

మరి ఇండియాలో టమాటా ధర కొండెక్కి వుందాయే. మొన్నటిదాకా పెరిగిన టమాటా ధరలమీద సెటైర్లు మామూలుగా పడలేదు. బంగారం, వజ్రాలకన్నా కూడా టమాటాలు విలువైనవనీ, టమాటాలు కొన్నవారిమీద ఇన్‌కమ్ ట్యాక్స్ వారు దాడి చేస్తారనీ, టమాటా కొన్నవారు అత్యంత ధనవంతులనీ.. ఎక్కడ చూసినా జోకులే జోకులు.

ఇప్పుడు అమెరికాలో ఈ బియ్యం కొరత హాట్ టాపిక్ అయింది. ‘మీ అబ్బాయి అమెరికాలో ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు? ఎన్ని డాలర్లు సంపాదిస్తున్నాడు అని కాదు ప్రశ్న? ఎన్ని సంచులు బియ్యం కూడపెట్టాడు అనేదే ప్రశ్న.’

కానీ.. ఇది అనుకున్నంత సమస్య కానే కాదు. ఆ రోజు అమెరికాలోని తెలుగు వారు, అలా అగ్గగ్గలాడిపోయారు కానీ అనుకున్నంత సమస్య కానేకాదు. షాపుల తాలూకు గౌడన్లలో బియ్యం నిలవలు వున్నాయట. కొన్ని నెలలపాటు ఎవరికీ ఇబ్బంది వుండదు. ఆ తర్వాత ప్రోబ్లం సాల్వ్ అయిపోవచ్చు కూడా.

ఇవండీ ఈనాటి అమెరికా బియ్యం కొరత కబుర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here