దేశ విభజన విషవృక్షం-51

0
3

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]ముం[/dropcap]దే చెప్పుకొన్నట్టు 1909లోనే మింటో మార్లే సంస్కరణల అమలుతోనే దేశంలో మత విభజన జరిగింది. భారత్‌లో బ్రిటీష్ రాజ్యం కలకాలం కొనసాగాలంటే.. హిందూ ముస్లింల మధ్య అగాధం ఎంత పెంచగలిగితే అంత తమకు మేలు జరుగుతుందన్నది బ్రిటీషర్ల ఆలోచన. ముస్లిం నాయకులు మాత్రం చాలా ముందు చూపుతో వ్యవహరించారు. వారికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సూత్రాలే ముఖ్యమైనవి.. అనుసరణీయమైనవి. భారత్‌లో దారుల్ ఇస్లాం సాధించలేకపోయామన్న ఆందోళన, ఆవేదన, ఆగ్రహం ముస్లిం నాయకుల్లో బలంగా ఉండింది. ఇందుకోసం ఏం చేయాలో అవన్నీ చేయడానికి వారు సిద్ధపడ్డారు. ఇంతకు ముందరి వ్యాసాల్లో చర్చించుకున్నట్టు 1906లో సిమ్లాలో ఆగాఖాన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. ఈ చర్చల సారాంశం ఒక్కటే. ‘బ్రిటీష్ పాలకులను మనం వాడుకోవాలి. వారికి సహాయం చేస్తున్నట్టుగా వ్యవహరిస్తూ.. మన లక్ష్యాలను నెరవేర్చుకోవాలి. వ్యూహం ఇది’. లక్ష్యం దారుల్ ఇస్లాం. ఈ ఎత్తుగడతోనే ఆగాఖాన్ అప్పటి వైస్రాయ్ మింటోను కలిసాడు. ‘మీ ఎంపైర్‌కు అండగా ఉంటాం.. మా భాగస్వామ్యానికి వాల్యూ ఇవ్వండి’ అన్నాడు.  ఇద్దరి మధ్యన పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది. ఆ వెంటనే సిమ్లాలో సమావేశమైన గ్రూపు ముస్లిం లీగ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నది. పక్కా ప్రణాళిక ప్రకారం ముస్లిం మేధావులు కాంగ్రెస్‌కు దూరం జరిగారు. ముస్లిం లీగ్ బ్రిటీష్ ఎంపైర్‌కు అనుకూలంగా మాట్లాడసాగింది. మింటోకు మార్లే తోడయ్యాడు. బెంగాల్‌లో రాజుకున్న చిచ్చును ఆర్పేయడానికి ముస్లింలతో పాటు హిందూ సంపన్న వర్గాలను, పెరుగుతున్న పాశ్చాత్య సాంస్కృతిక వర్గాలను కలుపుకున్నారు. ఆ తరువాత అత్యంత నాటకీయంగా మింటో మార్లే సంస్కరణలు తీసుకొని వచ్చారు. 1909 నుంచి ఈ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. శాసన మండలి పరిమాణం గణనీయంగా పెరిగింది. మండలిలో ఎంత మంది సభ్యులుంటే మాత్రమేం.. వారికి ఉండే శాసనపరమైన అధికారాలు, హక్కులు ఏమీ ఉండవు.. ఉపన్యాసాలు చెప్పడానికి తప్ప మండలికి ఉండే ప్రాతినిధ్యం నామమాత్రమే. ఇప్పటికీ రాజ్యసభ కానీ, రాష్ట్రాల్లో శాసన మండళ్లు కానీ పునరావాస మేధో శిబిరాలే తప్ప మరేమీ కావన్నది కచ్చితం. కేంద్ర స్థాయిలో, ప్రావిన్సులలో కూడా మండళ్ల పరిమాణం 16 నుంచి 60 దాకా పెరిగిపోయింది. మెజారిటీ సభ్యులు మాత్రం బ్రిటీష్ వారే ఉంటారు. ప్రావిన్సుల్లోని లెజిస్లేటివ్ కౌన్సిళ్లలో సభ్యులు అనధికారిక మెజార్టీని కలిగి ఉంటారు. అధికారం లేని మెజార్టీ ఉంటే ఏం.. లేకపోతే ఏం? స్థానిక సంస్థలు ఎలక్టోరల్ కాలేజీని ఎన్నుకుంటే.. ఈ కాలేజీ ప్రావిన్సు సభ్యులను ఎన్నుకుంటుంది. మండలిలో సభ్యులు అనుబంధ ప్రశ్నలు అడగటం, బడ్జెట్ పై తీర్మానాలు చేయడం వంటి వాటి వరకు అనుమతించారు. కానీ వీరు చేసినవేవీ చట్టబద్ధం కావు. అమలు చేయాల్సిన నిబంధన ఏమీ ఉండదు. ఇప్పటి మండళ్ల మాదిరిగానే.. మరోవైపు వైస్రాయ్, గవర్నర్ల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో ఒక భారతీయుడిని చేర్చుకున్నారు. అలా మొదట చేరినవాడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. భారత వ్యవహారాల కార్యదర్శి కౌన్సిల్‌కు మరో ఇద్దరు భారతీయులు నామినేట్ అయ్యారు. ఇవన్నీ భారతీయుల ప్రాతినిధ్యం పెంచుతున్నామని చెప్పుకోవడానికి మింటో, మార్లే కలిసి చేసిన కుట్రలో పైన కనిపించే పార్శ్వం. వీటితో పాటు ‘ప్రత్యేక ఓటర్లు’ అనే సంస్కరణను ప్రవేశపెట్టడం ద్వారా దేశాన్ని మతవిభజన చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ స్వపరిపాలనను డిమాండ్ చేసింది కానీ, భారతదేశానికి స్వపరిపాలన తగినది కాదని మోర్లే సెలవిచ్చాడు. ఈ మత విభజనతోనే దేశంలో సెక్యులరిజం అన్న మాటకు అర్థమే లేకుండా పోయింది. అన్ని మతాలను, అన్ని ధర్మాలను ఒకే విధంగా చూడాలని, పౌరులందరినీ ఒకే రూపంలో చూడాలన్న సిద్ధాంతాలు చెత్త బుట్టల్లో పడిపోయాయి. ఇప్పుడు ప్రత్యేక ఓటర్లు అనే భావన లేకపోవచ్చేమో కానీ.. ‘ప్రత్యేక వర్గం’ అన్న భావన పాలకుల్లో పాతుకుపోయి ఉన్నది కాబట్టే ముస్లిం సంతుష్టీకరణ పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉన్నది. గమ్మత్తేమిటంటే అసలైన మైనార్టీలను ఇవాళ పట్టించుకునే వాడే లేకుండా పోయాడు. మత ప్రాతిపదికన మైనార్టీలను గుర్తించాలా లేక జనాభా ప్రాతిపదికన గుర్తించాలా? ఈ రెండూ కాకుండా మరే రకంగానైనా మైనార్టీలను గుర్తించవచ్చా అంటే మన దేశంలో అలాంటి పద్ధతి అమలులో ఉన్నది. మైనార్టీల గుర్తింపు మత ప్రాతిపదికన జరగాలంటే.. పార్శీలు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, కొండొకచో క్రైస్తవులు అవుతారు. శాక్తేయులు, శైవులు, వైష్ణవులు.. వంటివారిని అంతా కలిపి హిందూ మతం అని ట్యాగ్ లైన్ తగిలించారు కాబట్టి.. వారిని పరిగణలోకి తీసుకోలేము. మరి వారి తరువాత అధికంగా ఉన్న ముస్లింలను మాత్రం మైనార్టీలుగా ఎలా పరిగణనలోకి తీసుకున్నారు? రెండు నుంచి 10 శాతం లోపల ఉన్న ఇతర మతాల వారిని గురించి మాట మాత్రంగానైనా ఎందుకు మాట్లాడరు? పోనీ జనాభా ప్రాతిపదికన తీసుకున్నా.. ఈ మతాల వారి శాతం రెండంకెలు కూడా దాటడం లేదు కదా.. మరి 30 శాతం ఉన్నవారిని మైనార్టీలని ఎలా అంటాం? పైగా బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి రోహింగ్యాలనో.. మరొకటనో పేరుతో రోజూ పెద్ద ఎత్తున భారత్‌కు తరలి వస్తున్నారు కదా.. వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నది. మరి మైనార్టీని ఏ ప్రాతిపదికన నిర్ణయించాలి. రాజ్యాంగం రచిస్తున్న సమయంలోనే దీనిపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. దీనిపై తరువాతి వ్యాసాల్లో వివరంగా చర్చించుకొందాం.

మరోసారి మింటో మార్లే సంస్కరణల దగ్గరకు వద్దాం. ఈ సంస్కరణలతో కాంగ్రెస్ లోని మితవాదులు పెద్ద ఎత్తున గందరగోళానికి గురయ్యారు. జాతీయవాద శ్రేణులు చీలిపోయాయి. ‘ప్రత్యేక ఓటర్లు’ అనే ఒకే ఒక్క సాధనం ద్వారా భారతీయులు ఎప్పటికీ ఐక్యంగా ఉండకుండా చేయడంలో తెల్లతోలు పాలకులు సక్సెస్ అయ్యారు. బ్రిటీష్ వాడి ప్రోత్సాహంతో అతివాదులు జాతీయవాదాన్ని ప్రజల్లోకి తీసుకొని పోతుంటే.. మితవాదులు, ముస్లింలు అందుకు వ్యతిరేకంగా మారారు. మితవాదులు బ్రిటీష్ వారికి పూర్తి అనుకూలంగా లేకపోయినా మెతకవైఖరితోనే ముందుకు సాగారు. ముస్లిం నాయకులు మాత్రం పూర్తి స్థాయిలో బ్రిటీష్ వాళ్ల పక్షాన నిలిచి తమ దారుల్ ఇస్లాం లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఈ ఒక్క చర్యతో ఈ దేశంలో పౌరులంతా భారతీయులు అనే భావన ఎగిరిపోయింది. ముస్లింలకు ఈ దేశం తమది కాదేమోననే భావన ప్రబలిపోయింది. వారి నాయకుల దీర్ఘకాల లక్ష్యం దారుల్ ఇస్లాం (ఇస్లామీకరణ) కావడం వల్ల ఆ దిశగానే వాళ్లను ప్రొవోక్ చేస్తూ ముందుకు వెళ్లారు. చివరకు వాళ్లనుకొన్నది కొంతైనా సాధించగలిగారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పాలకులంతా ఇవే విధానాలను అనుసరించినప్పటికీ పూర్తిగా సాధించలేకపోయారు.

ఒక్కోసారి చాలా చాలా ఆశ్చర్యమేస్తుంటుంది. 1909లో మింటో మార్లే సంస్కరణలు వచ్చిన్నాటికి, ఇప్పటికి, పాలకులు, అధికారుల ధోరణిలో ఎలాంటి మార్పు కనిపించదు. ఈ సంస్కరణలను అమల్లోకి తెచ్చినప్పుడు ముఖ్యంగా ‘ప్రత్యేక ఓటర్ల’ను గురించి మాట్లాడేటప్పుడు బ్రిటీష్ అధికారులు మొత్తం సమాజం గురించి, సమాజోద్ధరణ గురించి అద్భుతంగా ప్రసంగాలు చేసేవారు. ప్రజలందరికీ మేలు చేయడం కోసమేనన్నట్టు చాలా ఉదారంగా, అద్భుతంగా మాటలు మాట్లాడేవారు. కానీ.. వారి చర్య ముస్లిం వర్గాలను, ముఖ్యంగా వారి నాయకత్వాన్ని సంతృప్తి పరచడం కోసమే. ఇప్పటికీ.. అప్పటికీ తేడా ఏమైనా ఉన్నదా మీరే ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఓటర్ల విధానాన్ని అప్రజాస్వామికమైనదిగా పరిగణించిందే కానీ.. దాన్ని పూర్తిగా ఎదుర్కోవడానికి పటిష్ఠమైన ప్రణాళికతో ఉద్యమించలేకపోయింది. పైగా పరోక్ష ఎన్నికల విధానం ద్వారా తమకు అనుకూలురైన వారిని చట్టసభల సభ్యులుగా చొప్పించే విధానానికి అప్పుడే నాంది పలికింది. ముస్లింలు వారి జనాభా దామాషా పద్ధతిని దాటి రకరకాల మార్గాల్లో ప్రతినిధులను ఎన్నుకొన్నారు. ముస్లింలను తమకు విశ్వాసంగా ఉండేలా చేసుకునేందుకు వారు అడగినదానికంటే ఎక్కువగా బ్రిటీష్ వారు ఇస్తూ పోయారు. ముస్లిం నాయకులు.. వ్యూహాత్మకంగా బ్రిటీష్ వారిని ఉపయోగించుకొని తమ లక్ష్యం వైపు వేగంగా అడుగులు కాదు.. ఏకంగా అంగలు వేయడం మొదలు పెట్టారు. ఏమాత్రం అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు బ్రిటీష్ విధానాన్ని అడ్డుకోకపోగా.. దాన్ని అంగీకరిచడం మొదలుపెట్టారు. క్రమంగా బ్రిటీష్ వాళ్ల పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం భారత్ లోకి చొరబడింది. వాస్తవానికి ముస్లిం లీగ్ ఏర్పడే నాటికే వారి ఎత్తుగడలు ఏమిటో బ్రిటన్‌లో లేబర్ పార్టీ వ్యవస్థాపకుడు, మూడుసార్లు బ్రిటన్ ప్రధానిగా వ్యవహరించిన జేమ్స్ రామ్సే మెక్ డొనాల్డ్ చాలా స్పష్టంగా భారతీయ ముస్లింల వైఖరి గురించి, ఎత్తుగడల గురించి స్వయంగా తన గ్రంథంలో రాశారు.

‘They were quick to see, moreover, that an extended political liberty might, at the moment, be dangerous for them unless their share in it was specially protected. Hence they journeyed to Simla in 1906, and laid their claims for special representation before the Viceroy. They were not in a position to defend themselves in the open field, they said. If the contest for all the prizes were to be open, they feared that few, if any, would fall to their lot, so they asked that some should be specially reserved for them. It is necessary to understand that the Moslem movement is inspired solely by considerations affecting itself. I have read carefully its literature and have discussed its intentions with some of its leading spirits. The Mohammedans take their stand upon the right of Mohammedanism to share in the government of India. They desire judges in the Courts, representatives in the public service, spokesmen under their own control on every public authority from District Boards to University Senates and school text-book Committees. They claim these things, not as a minority requiring protection, but as a distinct section of Indian society whose religious differences with the rest express not only an historical separateness but also a civic one. Numerical proportions, therefore, do not satisfy them. They claim effective power. They rank themselves as special allies with us in the Empire, and to their position in India they wish added influence in consideration of their importance as part of Pan-Islamism and their distinction as late rulers of the country.1 They regard India as a federal government of Hindu and Mohammedan, and desire a fixed representation for the same reasons as the American and Australian States have insisted upon an equality of representation (irrespective of population) in the Senates of these countries. (THE AWAKENING OF INDIA, J.RAMSAY MACDONALD, HODDER AND STOUGHTON, 1910 PP 280-282)

ఇందులో చాలా స్పష్టంగా రామ్సే రాశారు. ముస్లిం ఉద్యమం ఒక ప్రత్యేక ప్రతిపత్తి కోసం, ప్రత్యేక హక్కుల కోసం కొనసాగుతున్నదని, వాళ్లు అన్ని రంగాల్లోనూ అధికారాన్ని పంచుకోవాలని భావించారు. ఇదంతా వాళ్లు మైనార్టీ వర్గంగా ఉన్నందువల్ల కోరుకొంటున్నారని భావించవద్దని కూడా రామ్సే స్పష్టం చేశారు. ఈ దేశంలో తమ మతం వేరు కాబట్టి.. మిగతా మతాల కంటే ప్రత్యేకమైనది కాబట్టి జనాభాతో సంబంధం లేకుండా అన్ని విధాలుగా తమకు అధికారాలు, పదవులు కావాలని ఆశించారు. బ్రిటీష్ అధికారులు తమ కోణంలో వీరిని ప్రోత్సహించుకుంటూ వచ్చారు. సిమ్లాలో, లండన్‌లో సిఫార్సులు చేసి మరీ హిందువులకు భిన్నంగా ముస్లింలను ప్రత్యేక వర్గంగా పరిగణించి వారిని అందలమెక్కించారు. దీనివల్ల హిందూ ముస్లిం అనైక్యత అన్నది విపరీతంగా పెరిగిపోయింది.

ఇవాళ మనం చాలా చాలా చాలా గొప్పగా చెప్పుకొంటున్న పార్లమెంట్ రూపాలన్నీ కూడా మింటో మార్లే సంస్కరణల ఫలితంగా అమలులోకి వచ్చినవే. వాటినే మనం ఇప్పటికీ ఘనంగా చెప్పుకుంటూ కొనసాగిస్తున్నాం. పైగా.. సోకాల్డ్ బూర్జువా, సామ్రాజ్యవాదాన్ని నిద్ర లేస్తే తిట్టే మేధావులు సైతం.. వాటిని అమలు చేయడాన్ని అంగీకరించడమే కాకుండా.. కనీసం మార్చడానికి ఇసుమంతైనా ఒప్పుకోరు.  గమ్మత్తేమిటంటే.. ఇక్కడ భారతీయ ప్రతినిధులెవరికీ కూడా ఎలాంటి అధికారాలు లేవు. గవర్నర్ జనరల్‌కు వేటినైనా వీటో చేసే అధికారం కొనసాగింది. ప్రతినిధులుగా ఎన్నికైన వారంతా.. తమను తాము సంతృప్తి పరుచుకున్నారే తప్ప ఏమీ చేయలేకపోయారు. ఉదాహరణకు గోఖలే వంటి వారు సార్వత్రిక ప్రాథమిక విద్యను డిమాండ్ చేశారు. అణచివేత విధానాలపై చర్చించారు. ఇంకాస్త ముందుకు వెళ్లి దక్షిణాఫ్రికాలో ఒప్పంద కార్మికులు, భారతీయ కార్మికులపై దృష్టి పెట్టారే తప్ప భారతదేశంలో వలస పాలనపై చర్చించలేదు. పరిపాలన ఇలా ఉండాలి.. అలా ఉండాలి అంటూ సూచనలు చేశారు. అధికారుల తీరు తెన్నులను విమర్శించారు. ఈ చర్చలన్నీ రికార్డులకే పరిమితమయ్యాయే తప్ప భారతీయుల మాటను పట్టించుకున్న వాడే లేకుండాపోయాడు. అప్పటికి మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలోనే ఉన్నారు. అక్కడి కార్మికుల కష్టాలపై అక్కడి బ్రిటీష్ పాలకులపై పోరాడుతున్నారు. ఆయన్ని గోఖలేయే భారతదేశానికి రప్పించారు తరువాతి కాలంలో. కౌన్సిల్‌లో చేరడం ద్వారా కాంగ్రెస్ లక్ష్యం పక్కదారి పట్టింది. బ్రిటీష్ వారి పరిపాలనను అంగీకరించినట్టయింది. వారి పాలనలో తామూ భాగస్వామ్యమయ్యామని సంతోష పడ్డారే తప్ప.. వలస పాలన నుంచి భారతమాతకు విముక్తి కల్పించి.. స్వయం పాలన సాధించాలన్న ఆలోచన మసకబారింది. బ్రిటీష్ వాళ్లకు కావలసింది కూడా అదే. విశ్వాసంగా పడి ఉండాలంటే ప్రత్యేక తాయిలాలు ఇవ్వటం ముఖ్యం. అందుకే ఇండియన్ కౌన్సిల్ చట్టం వచ్చింది.

ఒక్క మాటలో చెప్పాలంటే 1909 నాటి మింటో మార్లే సంస్కరణలు.. తద్వారా అమలులోకి వచ్చిన ఇండియన్ కౌన్సిల్ చట్టం.. ద్వారా బ్రిటీష్ వట వృక్షం ఛాయలో నిలబడేందుకు భారతీయులకు ఇంత చోటు లభించింది. ఆ నీడలోనూ భారతీయులు ఒకవైపు, ముస్లింలు మరోవైపు నిలబడ్డారు. వీళ్లందరినీ కలిపి బ్రిటీష్ వాళ్లు ఇండియన్లు అని ముద్దుగా పిలుచుకున్నారు. ఈ సంస్కరణలు బ్రిటీష్ వాళ్లకు మెటీరియలైజ్ అయ్యాయే తప్ప భారతీయులకు మాత్రం అతి తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. ఈ చట్టం మనకు తెలియకుండానే ఉదారవాదం అనే పేరుతో అత్యంత కఠినమైన నిరంకుశత్వాన్ని అమలు చేసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here