గుజరాత్ రాజస్థాన్ పర్యటనానుభూతులు-10

1
3

[2023 ఫిబ్రవరి నెలలో గుజరాత్, రాజస్థాన్ లలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]ఆ [/dropcap]ఎడారిలో అంతంత పెద్ద, విలాసవంతమైన ఎడారి క్యాంపులు నడపడం ఆషామాషీ వ్యవహారం కాదు. బయటకి మామూలుగానే ఉంది ఎంట్రన్స్. లోపల రిసెప్షన్ చాలా పాష్‌గా ఉంది. సోఫాలు, షాండిలియర్లు! చెకిన్ అయ్యాము. పశుపతి సిసోడియా కూడా రాత్రి అక్కడే ఉండిపోతాడట. వాళ్లకు కూడా వేరే డార్మిటరీ ఉంటుందట.

‘బాయ్’ మా సామాను (ఒక్క బ్యాగ్, చిన్న షోల్డర్ బ్యాగ్) తీసుకొని మమ్మల్ని 521 నెంబరు కాటేజీకి తీసుకు వెళ్లాడు. మొత్తం ముపై ఎకరాల విస్తీర్ణం. కిందంతా ఇసుకే. నాలగు వైపులా, ఒక్కో పక్కకు పన్నెండు చొప్పున మొత్తం 50 కాటేజీలున్నాయి. 500 నుంచి 550 వరకు. ప్రతి కాటేజి కొంచెం ఎలివేషన్ మీద ఉఁది. ఐదారు మెట్లెక్కాలి. కాజేజ్ (గుడారం అనవచ్చు) పెద్దదే. 20 x 20 ft ఉంటుందేమో. గుడారం మందమైన క్లాత్‌తో చేయబడంది.

క్రింద వుడెన్ ఫ్లోరింగ్ అందమైన లతలు, పువ్వులతో ఉంది. గుడారం మధ్యలో డబుల్ కాట్, ఫ్యాన్, ఎ.సి, డ్రెస్సింగ్ టేబుల్. వార్డురోబ్ అన్నీ ఉన్నాయి. అటాచ్‌డ్ బాత్ రూంలో అన్ని హంగులు ఉన్నాయి గీజర్, బాత్‌టబ్‌తో సహా. గుడారం తలుపు ఫైబర్‌ది. దానికి తాళం తీసుకోవచ్చు. మేం లోపలికి వెళ్లగానే లోపల విపరీతమైన వేడి.

బాయ్ ఎ.సి. ఆన్ చేశాడు. బాయ్, అంటాం గాని, బాయేం కాదు, మ్యానే! హిందీలో చెప్పాడు మాకు.

“సాబ్, రాత్రి పది తర్వాత టెంపరేచర్ పూర్తిగా పడిపోతుంది. చలి తట్టుకోలేరు. అందుకే ఈ మందపాటి బొంతలు! (Quilts)” అన్నాడు. “మీకు టీ, స్నాక్స్ క్యాంటిన్‌లో సిద్దంగా ఉన్నాయి. అక్కడికి వెళతారా, లేక రూంకి తెమ్మంటారా?” అతనిలో వినయం ఉట్టి పడుతూంది. అతని పేరడగితే ‘తల్వార్ సింగ్’ అని చెప్పాడు.

“రూం తీసుకురా అబ్బాయ్! టీలో షుగర్ అసలు వద్దు! బిల్ కూల్ చీనీ మత్ డాల్‌నా. ఫిర్ భీ స్రాంగ్ రహనా! స్నాక్స్ ఏమున్నాయి?”

“ఒకే రకం ఉటాయి సార్ అందరికీ. మిర్చి బడ ఈ రోజు!”

“అంటే?” అన్నాడు మా యోగా.

“మిరపకాయ బజ్జీలు రా!” అన్నా అతను వెళ్లిపోయాడు.

“మరి బడ అంటాడేమిట్రా, వాడి బండ పడ!”అన్నాడు మావాడు.

“మనం బజ్జీలంటాం. వాళ్లు వడలంటారు అంటే ‘వ.బ యోఃన భౌదః’ అని ఇంతకు ముందు నేను చెప్పిన సూత్రం ప్రకారం అది మిర్చి బడ ఐంది” అన్నా.

“అయితే స్నానం చేద్దామా?”

“ఉండరా! స్నాక్స్ తిని, టీ తాగి, చేద్దాం.”

పది నిమిషాల్లో రెండు పేపర్ ప్లేట్లలో రెండు మిర్చి బజ్జీలు, ఫ్లాస్కులో టీ, రెండు కప్పులు రాగి, కొంచెం చిన్న బౌల్‌లో చెక్కర తెచ్చి టీ పాయ్ మీద పెట్టి వెళ్లిపోయాడు. ఒక మూల అందమైన సోఫా! సోఫాలో కూర్చుని, బజ్జీలు తినసాగాము. ఒక్కొక్కరికి ఒకటే ఎందుకు ఇచ్చాడంటే, అవి అంత పెద్దవి! దాదాపు ఆరంగుళాలపైనే పొడవు, రెండంగుళాల వ్యాసం కలిగి ఉన్నాయి. ఫ్రైడ్ చిల్లీస్, సాస్ పాకెట్లు కూడా ఇచ్చాడు.

కారం లేని బజ్జీ మిర్చిలో, బంగాళదుంప మసాలా కూర స్టఫ్ చేసి, దాన్ని శనగపిండిలో ముంచి నూనెలో వేయించారని నాకర్థమైంది. కూరలో కొంచెం చింతపండు పులుపు, వాము పొడి కలిపారు. వేడిగా చాలా బాగున్నాయి. తినేసి టీ తాగాము.

స్నానాలు చేసి రెడీ అయ్యాము. అప్పుడు ఏడు దాటింది. గుడారాలు చుట్టూ ఉండి మధ్యలో అంతా ఖాళీ స్థలం. క్రిందంతా ఇసుక. మధ్యలో ఒక మూడడుగుల ఎత్తు వేదిక. దానికి ఫ్లడ్ లైట్లు. చుట్టూ ప్రేక్షకులు కూర్చోడానికి దూది పరుపులు, ఆనుకోవడానికి బాలీసులు అమర్చారు. కుర్చోలేని వారి కోసం కుర్చీలు కూడా. కొంచెం పక్కగా చిన్న మొబైల్ బార్. అక్కడ డ్రింక్స్(ఆల్కహాల్) సర్వ్ చేస్తారట. చుట్టూ లైటింగ్! గుడారాల్లో లైట్లు వెలుగుతున్నాయి. చీకట్లో అవి దీపాల తోరణాల్లా ఉన్నాయి. వాటి అంచులకు, పైన కప్పుకు రంగు రంగుల లైట్లు వేలాడదీశారు! అదంతా వేరే లోకంలా ఉంది.

మేం ఒక చోట కూర్చున్నాం. ఒకతను వచ్చి “డ్రింక్ తెమ్మంటారా?” అనడిగాడు. వద్దన్నాం. “కనీసం చిల్డ్ బీరయనా తీసుకోండి సార్” అంటూ బ్రతిమాలుతున్నాడు.

“వీడి ఆతిథ్యం మండ! వద్దంటే వినడేం?” అన్నాడు మా వాడు.

టూరిస్టులు ఇంకా నిండలేదు. షో ప్రారంభం కావటానికి టైం పట్టేటట్లుంది. రాజస్తానీ మ్యూజిక్ అండ్ డాన్స్ షో ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు జరుగుతుంది.

మైకులో చెబుతున్నారు – “జీప్ సఫారీ, కేమిల్ సఫారీ అని రెండు కాంప్లిమంటరీ ఆఫర్స్ మన డెజర్ట్ క్యాంప్‌లో ఉన్నాయి. అవి రేపుదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు. కాని ఇప్పుడే మీ పేర్లు రిసెప్షన్ దగ్గర నమోదు చేయించండి” అని.

నేను రిటైరైంతర్వాత హైదరాబాదులోని పంజాగుట్టలో అరోరా బిజినెస్ స్కూలులో, రెండేళ్లకు పైగా PGDM విద్యార్ధులకు ‘బిజనెస్ కమ్యూనికేషన్’ అనే సబ్జెక్టు చెప్పేవాడిని. వారి కాలేజీ మ్యాగజైన్‌కు, న్యూస్ లెటరుకు ఎడిటర్‌గా కూడా ఉన్నా. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో పిల్లలను ‘ఇంటర్నేషనల్ స్టడీ టూర్’ (IST) కి విదేశాలకు తీసుకువెళ్లేవాళ్లం. అలా నేను మొదటిసారి మలేసియా, సింగపూర్, థాయిలాండ్ దేశాలకు, రెండవసారి దుబాయ్, అబుదాబి, షార్జాలకు, మూడవసారి యూరోప్‌కు వారి వెంట వెళ్లాను.నా పని ఏమిటంటే మొత్తం టూర్‌ను కవర్ చేస్తూ ఒక ఎక్జిక్యూటివ్ రిపోర్టు రాయడం (100 పేజీలు). దాన్ని AICTE (All India Council of Technical Education) కు సబ్మిట్ చేస్తారు. ఇక పిల్లలను లీడ్ చేయడం సరే సరి. ఇద్దరు మగ, ఒక ఆడ ప్రొఫెసర్లు వారి వెంట వెళ్లేవారు. అన్ని ఖర్చులు బిజినెస్ స్కూల్ భరించేది. మిగతా వాళ్లను మార్చేవారు కాని నన్ను మాత్రం ప్రతిసారీ పంపేవారు. నా ఎక్జిక్యూటివ్ రిపోర్టును చిలవలు పలవలు కల్పించి, విద్యార్థులు దాని వల్ల అకడమిక్‌గా ఎంత బెనిఫిట్ పొందారో రాయాలి. నాకు వచ్చిన ఇంగ్లీషు మహిమ! అప్పుడు అబుదాబి, షార్జా బార్డర్ లోని ఎడారి క్యాంప్‌లో ఉన్నాం. అక్కడ జీప్ సఫారీ అనుభవం అయింది. బలమైన పెద్ద పెద్ద టైర్లున్న జీపుల్లో, సీటు బెల్టులు కట్టుకొని, ఇసుక దిబ్బల మీదగా అత వేగంగా ప్రయాణించాలి. చాలా థ్రిల్గింగ్‌గా ఉటుంటుంది. అదే మావాడితో చెబితే “వద్దు! నాకు భయం!” అన్నాడు. నేనాల్రెడీ అనుభవం పొందాను కాబట్టి దానికి వెళ్లాల్సిన పనిలేదు.

ఇక రెండవది కేమిల్ సఫారీ. అంటే ఒంటెల మీదికి అవి పడుకున్నప్పుడు చిన్న ల్యాడర్స్‌తో ఎక్కిస్తారు. దాని మూపుర చిన్న బాక్స్ లాంటి దుంటుంది (అంబారీ). దాంట్లో క్రింద కూర్చోవాలి. ఒంటె లేచి నిలబడిన తర్వాత చాలా ఎత్తుగా ఉంటుంది. పైగా అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది.

“ఇది కూడా వద్దురా శర్మా! సరిగ్గా కూర్చోలేక, ఎక్కలేక క్రింద పడితే? ఈ వయసులో అవసరమా! పైగా నీవసలే క్రింద కూర్చోలేవు!” అన్నాడు వాడు. వాడి వాదన కరెక్టే. షో ప్రారంభం కోసం ఎదురుచూడసాగాం.

ఏడు నలభైకి వేదిక మీదికి కళాకారులు వచ్చారు. పక్కా రాజస్థానీ గెటప్‌లో ఉన్నారు. వారితో బాటు అందమైన టీనేజ్ ఆడపిల్లలు ఇద్దరు, మరో ఇద్దరు టీనేజ్ అబ్బాయిలు. కీబోర్డు, హార్మనియం, తబాల, డక్కి. ప్రతి ఒక్కరి ముందు మైకులు. మొత్తం అంతా కలిసి ఒక చిన్న ఔట్‌డోర్ స్టేడియం అనవచ్చు.

వారిలో గాయకుడు హిందూస్తానీ సంగీతాన్ని ఔపోసన పట్టనట్లున్నాడు. మోకాళ్ల మీద కూర్చుని, రాజస్థానీ ఘజల్స్, ఖవ్వాలీస్, ఇంకా కొన్ని బాలీవుడ్ హిట్ హిందీ సినిమా పాటలు అతడు పాడుతుంటే, శ్రోతలు మంత్రముగ్ధులవుతున్నారు. “జోర్ దార్ తాలియా” అంటూ చప్పట్లతో, కేకలతో, ఈలలతో అతన్ని అభినందిస్తున్నారు. కొందరైతే లేచి వెళ్లి, వంద, ఐదు వందల నోట్లతో అతని తల చుట్ట్టూ తిప్పి, దిష్టి తీసి, అతనికిచ్చి వస్తున్నారు.

పాట మొదట్లో అతను చేసే ‘ఆలాప్’ మంద్రంగా ప్రారంభమై, రాను రాను శృతి ఉచ్చస్థితికి చేరుకుంటుంది. అతని పేరు సమర్ రాథోడ్! అతనికి వాయిద్య సహకారం అందిస్తున్నవారు, తబలా పై సతూర్ ఝూ, హర్మోనియం పై కబీర్ కథియవాడీ, కీబోర్డుపై అభిజిత్ రాజపుత్. స్వతహాగా సంగీతజ్ఞడిని, గాయకుడిని ఐన నేను వారి సంగీత రసాంబుధిలో ఓలలాడసాగాను. మా యోగా, “భాష అర్ధం కాకపోయినా, వినాలనిపిస్తుంది శర్మా” అన్నాడు ప్రశంసగా. ‘మ్యూజిక్ హాజ్ నో లాంగ్వీజ్’ అనేది వాడి మాటల ద్వారా ఋజువైంది.

మధ్యలో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు కొన్ని పాటలకు సంప్రదాయ నృత్యాలు చేశారు. ఒంటి నిండా బట్టలు కట్టుకున్నారు. వారి నృత్యాల్లో వీసమెత్తైనా అశ్లీలత లేదు. నిండా పదహారేళ్లయినా నిండాయో లేదో బంగారు తల్లులకు.

తర్వాత ఇద్దరు యువకులు, రకరకాల ఫీట్స్ ప్రదర్శించారు. నోటిలో పెట్రోలు పోసుకొని, అంటించుకొని, మంటలు ఫూత్కరాలు చేయడం, చిడతలతో లయబద్ధంగా వాయిస్తూ జానపద నృత్యులు చేశారు.

చివర్లో కొన్ని బీట్ ప్రాధాన్యత గల, మెలోడీని త్యాగం చేయని హిందీ సినిమాలను ప్లే చేస్తూ, ప్రేక్షకులను ఎరీనాలోకి ఆహ్వానించారు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా అందరూ చాలా సేపు ఆ పాటలకు నృత్యం చేశారు. నాకు కూడా హుషారు వచ్చింది. “యోగా రారా! మనమూ డాన్స్ చేద్దాం!” అంటే వాడు “నా వల్ల కాదు గాని, నీవు చేయి పోరా, నేను వీడియో తీస్తా” అన్నాడు.

నేను వెళ్లి వారితో కలిశాను. సంగీతానికి, లయకు ఉన్న ప్రబావమేమో గాని, అది అన్ని వయసుల వారిని ఊపేస్తుంది. ఒక పావుగంట పాటు నా వయసును మరచిపోయి, నాకు తోచిన విధంగా డాన్స్ చేశాను. బృంద నృత్యంలో ఆ టీనేజ్ అమ్మాయిలు కూడా కలిశాలు. ఎరీనా పక్కన అందర్నీ గమనిస్తూ ఐదారు మంది ధృడకాయులు ఉండటం గమనించాను. ఎవరయినా పోకిరీలు ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవరస్తే, వారు రంగలోకి దిగి, అదుపు చేస్తారని ఊహించాను. వారిని ‘బౌన్సర్సు’ అంటారుట. యూత్ కొందరు నన్ను చూసి, “వా, అంకుల్ వా బహుత్ ఖూబ్” అంటూ నన్ను ప్రోత్సహించసాగారు. నేనే అనుకుంటే, ‘అతని కంటె ఘనుడు అచంట మల్లన్న’ అన్నట్లు, దాదాపు 75 సంవత్సరాల పెద్దాయన, ఉన్నట్లుండి గ్యాలరీ నుంచి ఎరినాలోకి వచ్చి, చిందులు వేయసాగాడు. దట్స్ ది స్పిరిట్.

ఆల్‌ఫ్రెడ్ లార్డ్ టెన్నీసన్ అన్నట్లు “Old age hath its own honour and toil. To seek, to strive, to find and not to yield!”

వృద్ధాప్యానికి కూడా దానికి తగిన గౌరవం, శ్రమ ఉంటాయి. కొత్తవి కోరుకో, కష్టపడు, తెలుసుకో, కాని వయసుకు లొంగిపోకు!

ఎంత బాగా చెప్పాడు మహాకవి! ఈ మాటలు ఆయన వ్రాసిన ప్రఖ్యాత పద్యం ‘ULYSSES’ లోవి!

వచ్చి మా వాడి దగ్గర కూర్చున్నాను. వాడు మహాదానందంతో నన్ను వాటేసుకున్నాడు. “ఒరేయ్ శర్మా, గ్రేట్ రా నిజంగా! ఎంత బాగా స్టెప్పులు వేశావురా! ముసిలోడయినా బసిరెడ్డే మేలని మన రాయలసీమ సామెతను రుజువు చేశావు గదరా! నీ పాసుగూల! నీవు గట్టోనివి రోయ్!”

ప్రోగ్రాం ముగియ వచ్చింది. సమర్ రాథోడ్ మైకులో, “ప్రేక్షకుల్లో ఎవరయినా గాయకులుంటే వచ్చి పాడవచ్చు” అని ప్రకటించాడు. ఒక నలభై ఐదేళ్ల ఆవిడ లేచి వెళ్లి ‘సత్యం శివం సుందరం ఆ.. ఆ.. ఆ..’ అంటూ చక్కగా పాడింది. డాన్స్ చేసిన పెద్దాయనకు ఇంకా హుషారు తగ్గినట్లు లేదు. లేచి వెళ్లి అమితాబ్ పాట, ‘తెరే అంగనే మే’ మాంచి ఊపుతో పాడాడు. ‘జిస్ కీ బీబీ మోటీ, జిస్ కీ బీబీ లంబీ’ అంటూ అభినయం కూడా చేశాడు. చప్పట్లు మారుమోగాయి. మా యోగా “ఏదైనా పాడు, నీకు పాటలు వచ్చు కదా!” అని సతాయించసాగాడు.

నేను లేచి వెళ్లి, మైకు తీసుకొని “భాయీయోం ఔర్ బెహనో, ఆజ్ శామ్ బహుత్ సుందర్ హై, సంగీత్ ఔర్ నృత్య్ సే సంపన్న్ హువా. మై అబ్ ప్రేష్ కర్‌తాహు ఏక్ భజన్. ఆజ్ తక్ భక్తి నహీ థా. థోడా భక్తి భీ హోనా చాహీయే! హై నా? ఏ భజన్ షిరిడీసాయి బాబాకా హై. శ్రీమతి కవితా కృష్ణమూర్తి జీ నే గాయీ థీ!” అన్నా. భజన్ అనగానే చాలా మంది వెళ్లిపోతారనుకున్నా. కాని ఎవరు కదల్లేదు. మొదట భూపాల రాగంలో దత్తాత్రేయ స్వామి మీద ఒక శ్లోకం పాడాను. రాగప్రస్తారాన్ని కొద్ది క్షణాల్లో హార్మోనిస్టు గ్రహించి కర్ణపేయంగా నా గాత్రాన్ని అనుసరించాడు.

శ్లో:
ద్తతాద్రేయం మహాత్మానం
వరదం భక్తవత్సలం.
ప్రసన్నార్తి హరం వందే
స్మర్తృగామి సనోవతు

మూడో చరణంలో ‘వందే’ అన్నచోట శృతి పెంచి పీక్‌కి వెళ్లాను. సమర్ రాధోడ్ “వా వా” అని అరిచాడు. తర్వాత భజన్.

మేరే హృదయ్ కే హర్ కణ్ మే
భజ్ రహే సాయినామ్ కే గుణ్
సాయీ నామ్ గాతే గాతే
నాచే మన్ ఛున్ ఛున్

అంటూ పాడాను.

అది భజన్ కాబట్టి చక్కని లయ ఉంది. తబలిస్ట్ కూడా దానికనుగుణంగా వాయించసాగాడు హార్మోనిస్ట్‌తో కలిసి. ఆర్కెస్ట్రాతో పాడటం నాకు అలవాటే.,

పాట ముగిసే సరికి ఒక్కసారిగా హర్షాతిరేకాలు! ఎవరో ఒకాయన వచ్చి రెండు వందలు రూపాయల నోటు నా తల చుట్టూ తిప్పి, దిష్టి తీసి, దాన్ని నా జేబులో పెట్టి వెళ్లాడు.

ఒక పంజాబీ సర్దార్జీ వచ్చి, నా రెండు చేతులూ పట్టుకొని, “భాయీ సాబ్, బహుత్ బహుత్ షుక్రియా! క్యా భజన్ సునాయా ఆప్ నే! మేరే మన్ ఖుల్ గాయా!” అని నన్ను వాటేసుకున్నాడు.

డాన్సర్లలో రశ్మి అనే పిల్ల నా దగ్గరకి వచ్చి “షిరిడీ వాలే సాయిబాబా హమారే ఆంఖోంకే సామ్ నే ఆగయా!” అన్నది.

సమర్ రాధో నా వివరాలడిగి “ఏ సాహెబ్ హైదరాబాద్ సే ఆగయే. దత్తాశర్మాజీ. కాలేజీ కా ప్రిన్సిపాల్ థే. ఆప్ కా భజన్ బహుత్ ఖూభ్ హై జనాబ్!” అని పొగిడాడు.

అందరూ అలా పొగడుతుంటే నాకు సిగ్గనిపించింది. అందిరకీ కృతజ్ఞతలు చెప్పాను. సమీర్, అతని బృందంతో ఫోటోలు దిగాం.

తొమ్మిది నలభై ఐదు. అందరం డైనింగ్ హాలుకు వెళ్లాం. బఫె డిన్నర్. కాని కుర్చీలు బల్లలు వేసి ఉన్నాయి చక్కగా. బన్సీ రవ్వ (దొడ్డు రవ్వ) తో పొడి హల్వా, పుల్కా, ఉల్లి టమోట ముద్ద చట్నీ, ఆలూ జీరా, బూందీ రైతా, వైట్ రైస్, సాంబార్ అప్పడాలు డిన్నర్ సుపర్!

రాత్రి గుడారంలో ఎంత చలేసిందంటే, ఏ.సి ఫ్యాన్‌లు ఆపేశాం. రజాయిలు కప్పుకున్నాము. అయినా చలి ఆగడం లేదు. పరుపులు చల్లగా అయిపోయాయి.

ఉదయం 7 గంటలకు అద్భుతమైన చాయ్ తెచ్చిచ్చారు. చెప్పకుండానే సుగర్ లెస్! నిన్న చూశారు కదా! ఎనిమిదిన్నరకు కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ చేశాము. స్నానాలు చేయలేదు. కాళ్లూ మొఖాలు కడుక్కున్నాం అంతే. పూరీ సబ్జీ, పోహా పెట్టారు. మేం పూరీ తిన్నాం. మొత్తం డెజర్డ్ నైట్ క్యాంప్‌కు ఇద్దరికి పదివేలు పైనే ఛార్జ్ చేస్తారట. కానీ అది మా ప్యాకేజ్ లోనే ఇన్‌క్లూడెడ్.

పది గంటలకు చెక్ అవుట్ చేశాము. పశుపతి సిసోడియా రాత్రి అక్కడే ఉన్నాడు కదా! నా పాట విన్నాడట. చాలా బాగుందట. “ఏదైనా ముకేష్ పాత పాట వస్తే పాడండి సాబ్” అన్నాడు. అడిగేవాడు కావాలి! నేను కొంత కాలం క్రిందట కలకత్తాలోని సీనియర్ సిటిజన్ సింగింగ్ కాంపిటిషన్‌లో ఆన్‌లైన్‌లో పాల్గొనడానికని ‘ఛలియా’ సినిమాలో రాజ్ కపూర్ సాబ్‌కు ముకేష్‌జీ పాడిన, ‘మేరా టూటే హుయే దిల్ సే’ అన్న పాట ప్రాక్టీసు చేసి ఉన్నాను. అదే పాడాను. దానికి నాకు మూడవ బహుమతి వచ్చింది లెండి! పశుపతి సిసోడియా పాట విని మహదాంద భరితుడైయాయాడు.

ముందు ఫోర్ట్ జైన్ మందిర్‌కు వెళ్దాం. అది జైసల్మర్ వెళ్లే దారిలో ఉంది. అది ఒక అద్భుత కట్టడం. యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సైట్. అందులో మొత్తం 7 మందిరాలున్నాయి. అంతా చెక్కడం వర్క్ (fresco) లతో అలరారుతున్నాయి. వాటిలో పార్శ్వనాథ, చంద్రప్రభ, రిషభనాథ, సంభవనాథ, శాంతినాథ, కుంతునాథ, తీర్థంకరులున్నారు. అది శ్వేతాంబర సంప్రదాయానికి చెందింది. 16వ శతాబ్దంలో నిర్మించారు. పార్శ్వనాథ మందిరం ముందున్న శిలాతోరణం ఒక అద్భుతం. రాతిపై అన్ని నగిషీలు చెక్కడం అనన్య సాధ్యం. వాటి నిర్మాణ శైలి ‘దిల్‌వారా’ ప్రక్రియలో ఉంది.

అక్కడి నుంచి ‘పట్వా కీ హవేలి’ చేరుకున్నాము. ఇది ఐదు పెద్ద రాజభవనాల సముదాయం. దీనిన 1805లో గుమన్ చాంద్ పట్వా అనే ఆయన నిర్మించారు. ఆయన మహారాజు కాదు. పెద్ద, సంపన్న వ్యాపారస్థుడట.

దీనిని ప్రస్తుతం రాజస్తాన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. బంగారు పసుపు వర్ణం దీని ప్రత్యేకత. లోపల రకరకాల అద్దాలు అమర్చిన ఒక హాలు ఉంది. పురావస్తు శాఖ వారి మ్యూజియం ఉంది. మేం ఓపిక లేక దాంట్లోకి వెళ్లలేదు.

ఒకటిన్నరకు ‘ది ప్రైడ్ – హోటల్ స్కైప్లాజా’ లో చెకిన్ అయ్యాం. లంచ్ రూంకే తెప్పించుకున్నాం. భెంఢీ మసాలా, బటర్ నాన్, కర్డ్ రైస్. ఐదున్నర వరకు నిద్రపోయాం. సిసోడియా సిద్ధం. డిస్ట్రిక్ట్ కల్చరల్ సెంటర్, ‘వన్ టీచర్స్ మ్యూజియమ్’కు తీసుకెళ్లాడు.

దాన్ని N.K. శర్మ అనే రిటైర్డ్ లెక్చరర్ గారు స్థాపించి, అభివృద్ధి చేశారు. ఆయనింకా ఉన్నారు. ప్రస్తుతం ఆయన వయసు 93 సంవత్సరాలు. మ్యూజియం గురించి పది నిమిషాలు ఆయన ఆంగ్లలో ప్రసంగించారు. పైజామా కుర్తా వేసుకొని, పైన హాఫ్ కోట ధరించి, ఆరోగ్యంగా చురుగ్గా ఉన్నాడా మహానీయుడు. నేను యోగా వెళ్లి ఆయనకు పాదాభివదనం చేసి, ఆయనతో ఫోటో దిగాము.

అక్కడే, ఒక ప్రత్యేక ఆకర్షణ, తోలు బొమ్మలాట. పప్పెట్ షో! చిన్న ఆడిటోరియం. 50 మంది పడతారు. సింగర్ మరియు వ్యాఖత నకుల్ సింగ్ తనను తాను పరిచయం చేసుకొన్నాడు. తోలు బొమ్మలాట ప్రాశస్త్యాన్ని వివరించాడు. తబలిస్ట్. మరో గాయకుడు మహేంద్ర షెకావత్. అది ఒక అద్భుత అనుభవం.

కేవలం చేతి వేళ్లకున్న దారాలతో తోలు బొమ్మలను ఆడిస్తున్నారు. ఒక తెర మీద అవి కదులుతున్నాయి. ఆడించేవాడు మనకు కనబడడు. ఇద్దరు రాజుల కత్తి యుద్ధం ప్రదర్శించారు. ప్రియుని కొరకు ఎదురు చూసే విరహోత్కంఠిక, పిల్లవాని బంతాట, బంతి పోగొట్టుకొని ఏడుస్తాడు. అది దొరకదు. చివరకు పై నుంచి వాడి నెత్తినే పడుతుంది. చివర, ఆడమగ రూపాలు ఒకే బొమ్మలో కలసి ఉన్న రూపంలో, స్త్రీ పురుష సమానత్వాన్ని బోధించే ఒక రూపకాన్ని ప్రదర్శించారు. మొత్తం నలభై ఐదు నిమిషాల షో! అసలు విసుగనిపించ లేదు.

ఎనిమిది గంటలకు శనేశ్వర్ మహాదేవ్ మందిర్ సందర్శించాము. పురాతన దేవళం. గర్భగుడలోకి వెళ్లి శివలింగాన్ని స్పృశిచవచ్చు. స్వామిని చూసి ‘శివశివశంకర భక్తవ శంకర’ అన్న భక్త కన్నప్పలోని పాట పాడాను.

తొమ్మిది గంటలకు రాజస్థాన్ హ్యాండ్‌లూమ్ సెంటర్‌కు షాపింగ్‌కు వెళ్లాము. కొడుకు, అల్లుడికి కుర్తాలు, కూతురికీ కోడలికి డ్రస్‌లు తీశాము. భార్యలకు (?) చీరలు, డిజైనర్ వ్యానిటీ బ్యాగులు కొన్నాం. మేం కూడా కుర్తాలు తీసుకున్నాం. మనవళ్లకు రాజస్తానీ డ్రస్‌లు. ఒంటె శరీరం మీద రోమాల నుండి తీసిన నూలుతో చేస్తారట ఆ చేనేత వస్త్రాలను. చాలా మొత్తగా ఉన్నాయి.

ఒంటె ఎముకలను పాలిష్ చేసి తయారు చేసిన గాజులు అమ్ముతున్నారు. ఏనుగు దంతాల వలె మెరుస్తున్నాయి. వాటి మీద రాళ్లు, బంగారం రంగులో లతలు పొదిగారు. రెండు సెట్స్ నేను తీసుకున్నాను. ఒకటి మూడు వేలు.

తర్వాత, సముద్రంలోని రాతి శిధిలాల (శిలాజం) ద్వారా ఏర్పడిన ఒక మెటీరియల్‌తో చేసిన లోటాలు, పాత్రలు అమ్ముతున్నారు. చాలా ఖరీదు. నేను ఒక టంబ్లర్ కొన్నా 700 రూపాయలకు. దాంట్లో రాత్రి నీళ్లు పోసి పెట్టి, ఉదయం పరగడుపున తాగీతే ఆరోగ్యానికి చాలా మంచిదట!

ప్రక్కనే ‘రుద్రక్ష భవన్’ ఉంది. రాజస్థాన్ ప్రభుత్వ certified outlet. మౌంట్ అబూ నుంచి తెప్పించిన రుద్రాక్షలు, రకరకాల సైజుల్లో ఉన్నాయి. స్వచ్ఛమైన, తెల్లని, స్ఫటికాలున్నాయి. నేను మినపగింజ పరిమాణంలో ఉన్న సన్నని రుద్రాక్షలు 108, ఐదు గ్రాముల స్పటికం కొన్నాను. స్పటికాన్ని చేతుల్లో పట్టుకుంటే చల్లగా ఉంది. మొత్తం 3500 రూపాయలు అయింది. రుద్రాక్షలను బంగారంలో చుట్టించుకొని, క్రింద స్పటికాన్ని వేలాడదీసుకొని ధరించాలని నా చిరకాల కోరిక. ఇన్నాళ్లకు తీరింది!

రాత్రి పదిన్నరకు రోడ్ సైడ్ కేరళ వాళ్ల బండి దగ్గర ఇడ్లీ, ఊతప్పం తిన్నాం. పదకొండుకు రూం చేరి విశ్రాంతి తీసుకున్నాం.

27-2-23 చివరి రోజు

రాత్రి (తెల్లవారుఝాము) 2.30 నిముషాలకు కారు తీసుకువచ్చాడు పశుపతి సిసోడియా. మూడు గంటలకు జైసల్మేర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. మా రైలు రాణిఖేత్ ఎక్స్‌ప్రెస్. ఎక్కి పడుకొని ఉదయం తొమ్మిదికి తీరుబాటుగా లేచాం. మేవార్ జంక్షన్ వచ్చింది. పదకొండుకు, పెద్ద పెద్ద ఆలూ పరోటాలు తిన్నాం. అదే బ్రేక్ ఫాస్ట్ కం లంచ్, వెరసి బ్రంచ్! మధ్యాహ్నం 3 గంటలకు జయపూర్ జంక్షన్ చేరుకున్నాం. ఆ రైలు ఢిల్లీ దాటి కథ్‌గోదాం వరకు వెళుతుంది.

స్టేషన్ బయటకు వెళ్లి బ్రడ్ బజ్జి, తిని, టీ తాగాం. క్లోక్ రూం లోంచి సామాను తెచ్చుకొని సెకండ్ ఎసి వెయిటింగ్ రూంలో కూర్చున్నాం. 7.15కు జయపూర్ – మైసూర్ ఎక్స్‌ప్రెస్ ఏడవ నంబర్ ప్లాట్‌ఫాంకు వచ్చింది. ఒక ట్రాలీ మాట్లాడుకొని వెళ్లి రైలెక్కాము. మా అమ్మాయి “నాన్నా, అంత ప్రయాణం చేసి అలసి పోయి ఉంటారు. ట్రావెల్స్ వారు చేసిన ధర్డ్ ఎసి క్యాన్సిల్ చేస్తాను, ముందు సెకండ్ ఎ.సి. కన్‌ఫర్మ్ అయింతర్వత. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది” అని నవీ ముంబాయి నుంచి ఫోన్ చేసింది. బంగారు తల్లి!

సెకండ్ ఎ.సి. తత్కాల్‌లో నిన్ననే confirm అయ్యాయి. బెర్తులు సింగిల్ కాట్స్ అంత ఉన్నాయి. హ్యాపీ!

ఆ రాత్రి మర్నాడు పగలంతా, మర్నాడు అర్ధరాత్రి వరకు ఏకధాటిగా ప్రయాణించాము. విసుగు రాలేదు. పుస్తకాలు చదువుకున్నాం, కబుర్లు చెప్పుకున్నాం. ఇంటికి తిరిగి వెళుతున్నామన్న ఉత్సాహమొకటి. రైలు బొంబాయి మీదుగానే వెళ్లేటట్లుయితే దిగి అమ్మాయి దగ్గర నాల్రోజులుండి వెళదామనుకున్నాం. కాన అది ఝాన్సీ, ఇటార్సీ, నాగపూర్, భోపాల్, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, ఖాజీపేట్ మీదుగా కాచిగూడా చేరింది. రాత్రి 12 గంటలకు. మొత్తం 29 గంటల ప్రయాణం.

ఎక్కడా, ఎటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేకుండా రెండు రాష్ట్రాలు, అతి పెద్దవి చుట్టబెట్టి వచ్చాం. లక్ష్మీ నరసింహునికి జోతలర్పించాం. మన గొప్పతనం ఏముంది అంతా ఆయన సంకల్పమే. “నాహం కర్తా హరిః కర్తా” అన్నాడు కదా అన్నమయ్య.

ఆ రైలు కాచిగుడా నుంచి కర్నూలు గుత్తి, అనంతరం, బెంగుళూరు మీదుగా మైసూరు వెళుతుంది. కాచిగుడలో రైలు పదినిముషాలు ఆగింది. మా యోగాకు కర్నూలు వరకు ఎక్స్‌టెన్షన్ రాసిమ్మని టి.టి.యి.ని అడిగాం. ఆయన సరే అన్నారు. కాచిగూడ – కర్నూలు గట్టిగా మూడున్నర గంటల ప్రయాణం. రైలు కదిలింది. వాడు డోర్ దగ్గర నిలబడి చెయ్యి ఊపుతుంటే ఎందుకో దిగులుగా అనిపించింది నాకు. వాడు బిక్క మొగం వేసుకొని చూస్తున్నాడు పాపం! వాడు నాలుగు గంటలకు కర్నూలు చేరి అక్కడి నుంచి బస్‌లో ఆదోనికి వెళతాడు.

నేను మా వనస్థలిపురానికి క్యాబ్ బుక్ చేసుకొని, రాత్రి ఒంటిగంటకు ఇల్లు చేరాను.

అదండీ మా గుజరాత్ రాజస్థాన్ యాత్ర!

(ఫోటోలు – కొన్ని ఇంటర్‍నెట్ నుంచి సేకరణ, కొన్ని రచయిత తీసినవి)

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here