కాజాల్లాంటి బాజాలు-128: స్టౌవ్ వెలిగించకుండా స్వీట్

2
3

[ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి.]

[dropcap]ఆ[/dropcap] రోజు నా పనంతా పూర్తయేటప్పటికి మధ్యాహ్నం పదకొండు దాటింది. అలసిపోయిన శరీరాన్ని హాల్లో సోఫాలో కూలేస్తూ, ఏదైనా పాత సినిమా మంచిదేదైనా వస్తుంటే చూద్దామని టీవీ ఆన్ చేసాను. అంతలోనే మొబైల్ మోగింది. తీస్తే.. ఇంకెవరూ.. వదినే.

“ఏంటి స్వర్ణా.. పొద్దుట్నించీ ఎన్ని లింకులు పంపించేనూ.. ఒక్కటీ చూళ్ళేదా! ఇప్పటిదాకా ఏం చేస్తున్నావూ!”

వదిన లింకులు పంపించిందా..

“దేని గురించి వదినా..”

“అదే.. నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! ఈ మధ్య ఏమీ అప్లోడ్ చెయ్యలేదనీ నిన్నరాత్రి కూర్చుని ఓ పది రకాల వంటలు చెయ్యడమెలాగో తీసి పడేసా. పొద్దున్నే అవన్నీ అప్లోడ్ చేసేను. నీకు అన్నింటి లింకులూ పంపించేను. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చెయ్యి.. మర్చిపోకు.. ఇదివరకు నువ్వు అందరికీ చెయ్యనేలేదు..” నిష్ఠూరంగా అంది వదిన.

క్రితంసారి వదిన చేసి పెట్టిన వంటల వీడియోలు ఫ్రెండ్స్‌కి షేర్ చెయ్యడం వల్ల చాలామంది నన్ను అన్‌ఫ్రెండ్ చేసిన విషయం గుర్తొచ్చింది.. కానీ ఆ మాట వదినతో అంటే ఇంకేదైనా ఉందా.. అనుకుంటూ..

“అది సరే కానీ వదినా. నీకొచ్చిన వంటల వీడియోలన్నీ ఇదివరకే పెట్టేసేవు కదా! ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏవైనా నేర్చుకుని చేసేవా!” అనడిగేను.

నేనడిగిన ప్రశ్నకి వదిన గొంతు ఉత్సాహంగా వినిపించింది.

“ఒక కొత్త కాన్సెప్ట్‌తో చేసేను తెల్సా ఈ వీడియోలూ.. ఇప్పుడు చాలా ఇళ్ళలో పెద్దవాళ్ళిద్దరే ఉంటున్నారు కదా! రోజూ వాళ్ళు వండుకునే కూరా పులుసూ ఉడకబెట్టుకుని పోపెట్టుకునేవేగా.. కానీ పాపం వాళ్లకి మటుకు ఓసారి కాపోతే ఓసారైనా కాస్త నోటికి రుచిగా తినాలనిపించదూ! మా తాతయ్యగారు అంటూండేవారు.. ముసలాళ్ళూ, పిల్లలూ ఒకటేననీ.. అస్తమానం ఏదోకటి తినాలనిపిస్తుందనీనూ. ఇంతోటి వాళ్ళు తినే ఒకటీ రెండూ ముక్కల కోసం నూనె మూకుడు పెట్టి అంతంతసేపు స్టౌ ముందు నిలబడలేరు కదా! అలాంటి వాళ్ల కోసం ‘స్టవ్ వెలిగించకుండా స్వీట్’ అనే కాన్సెప్ట్‌తో ఓ పదిరకాల స్వీట్లు చెయ్యడం చూపించేను. అవే నీకు పంపించేను. ఈసారి ఎలావుందో చూసి చెప్పడవే కాదు.. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చెయ్యాలి సుమా..” అంటూ బెదిరించింది.

వదిన అన్న మాటలకి షాక్ అయిన నాకు వదిన బెదిరింపులు చెవిన పడలేదు..

“స్టవ్ వెలిగించకుండా స్వీటా.. ఎలా వదినా!”

“అదే కదా ట్రేడ్ సీక్రెట్.. అంత వీజీగా చెప్పేస్తారేంటీ.. నువ్వే చూడు.. షేర్ చెయ్యడం మాత్రం మర్చిపోకు..” అంటూ ఫోన్ పెట్టేసింది.

ఇంక ఆతృత ఆపుకోలేక టీవీ కట్టెసి, వదిన పంపిన లింకులు ఓపెన్ చేసేను.

చూడగానే మొదటి రెసిపీ టైటిల్.. ‘గులాబ్ జామూన్ అయిస్క్రీమ్’.. ఎంత బాగుందో ఆ టైటిల్.. ఆ ఫొటో చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయి..

ఒక చక్కని గాజు ట్రే లో పరిచిన వెనిలా అయిస్ క్రీమ్‌కి మధ్య మధ్యలో కెంపుల్లా మెరిసిపోతున్న గులాబ్ జామూన్ ముక్కలు.. ట్రే పక్కన చక్కని గులాబీపూలు హాండ్ ఎంబ్రాయిడరీ చేసిన నేప్కిన్ మీద ఒక స్పూన్, ఫొర్క్ అందంగా అమర్చబడి ఉన్నాయి.

వామ్మో.. వదిన ఎంత మంచి అయిటమ్ చెపుతోందీ! ఆతృత ఆపుకోలేక వీడియో చూడడం మొదలుపెట్టేను.

అసలే అందమైన వదిన మరింత అందంగా మేకప్ అయి, కొత్తగా కొనుక్కున్న రాయల్ బ్లూ కలర్ ఉప్పాడ పట్టుచీర కట్టుకుని, మెరిసిపోతున్న వన్ గ్రామ్ గోల్డ్ గుట్టపూసల గొలుసు వేసుకుని, మోచేతులవరకూ గాజులతో, చేతులకి గోరింటాకుతో, గోళ్ళకు మేచింగ్ గోళ్ళరంగుతో, లిప్‌స్టిక్ వేసుకున్న పెదాలు లైట్లకాంతికి మెరుస్తుంటే, అందంగా, నాజూకుగా, చిరునవ్వుతో ఆ వంట చేసే విధానం చెపుతుంటే ఆ వంటను చూడాలో, వదిన్ని చూడాలో తెలీక అయోమయంలో కాసేపు కొట్టుమిట్టాడి, నన్ను నేను సంబాళించుకుని, వీడియో చూడడం మొదలెట్టేను. వీడియో నడుస్తున్నంతసేపూ కింద ఆ వంటకం తయారీ విధానం కూడా డిస్ ప్లేఅవుతోంది. అమ్మో.. వదిన చాలా నేర్చేసుకుందే అనుకున్నాను.

రెసిపీ తయారుచేసే విధానం వైపు నా కళ్ళు పరుగులు పెట్టాయి..

గులాబ్ జామూన్ అయిస్క్రీమ్..

  1. కావల్సిన వస్తువులు –
  2. వెనిలా అయిస్ క్రీమ్ – ½ లీటరు
  3. గులాబ్ జామూన్ – ½ కెజి.

తయారుచేసే విధానం –

అయిస్ క్రీమ్‌ని ఒక పదినిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట రూమ్ టెంపరేచర్ లోనే ఉంచాలి.  ఈ లోపల సగం గులాబ్ జామూన్ లని ఒక్కొక్కదాన్నీ మూడేసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని, కరిగిన అయిస్ క్రీమ్‌ని అందులో పొయ్యాలి. అందులో ముక్కలు చేసుకున్న గులాబ్ జామూన్ లని వేసి, స్పూన్ తో బాగా కలపాలి. బాగా కలిసాక దానిని ఒక అందమైన గాజు ట్రే లో పోసి, అంతా సమంగా ఉండేలా సర్దాలి. ఆ తర్వాత మిగిలిన గులాబ్ జామూన్‌లని ఆ అయిస్ క్రీం పైన అందంగా సగం లోపలికీ, సగం బైటకీ ఉండేలా గుచ్చాలి. అప్పుడు ఆ ట్రే ని ఫ్రీజర్‌లో ఉంచి, ఒక అరగంట అయాక తీసి చూస్తే.. ఆహా.. నోరూరించే గులాబ్ జామూన్అయిస్ క్రీమ్ రెడీ..

చేతులూ, కళ్ళూ తిప్పుకుంటూ, అపసోపాలు పడిపోతూ ఆ తయారీ విధానాన్ని చెపుతున్న వదిన యాక్షన్ చూస్తుంటే నాకు మతిపోయింది. ఇదేంటీ.. రెండూ బజార్లో కొనుక్కొచ్చేసి, అవి రెండూ ఒక ప్లేట్లో కలిపేసి పెట్టడం ఒక పెద్ద వంటకమా! అదేనాలాంటి దయితే మళ్ళీ కలపడం కూడా ఎందుకని అదో స్పూనూ, ఇదో స్పూనూ ఒకటి మార్చి ఒకటి నోట్లో పడేసుకుంటుంది.. కడుపులో ఎలాగూ కలిసిపోతాయి కదా!

నన్ను నేను సంబాళించుకుంటూ రెండో వంటకం ఏం చెప్పిందా అని చూసేను.

చాకోబార్..

అబ్బ.. ఆ బొమ్మ చూస్తుంటేనే ఎంత బాగుందో.. అచ్చం పెద్ద పెద్ద కంపెనీలు అమ్మే చాకోబార్‌లా ఉంది. వెంటనే రెసిపి చదవడం మొదలుపెట్టేను.

చాకోబార్..

కావల్సిన పదార్ధాలు –

  1. పార్లే గ్లూకోజ్ బిస్కట్ పేకెట్స్ -2
  2. క్యాడ్ బరీస్ డార్క్ చాకొలెట్లు పెద్దవి -2
  3. పాలు – ½ లీటర్

తయారుచేసే విధానం –

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా డార్క్ చాకొలెట్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అందులో వేసుకోవాలి. తర్వాత అవి మునిగేలా దానిలో పాలు పోసుకోవాలి. ఆ చాకొలెట్ పాలలో కలిసేవరకూ ఒక చిన్న గరిటతో నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఫ్రిజ్‌లో చాకోబార్‌లు తయారుచేసుకుందుకు పెట్టే ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుని, అందులో ఒక్కొక్క దానిలో రెండేసి బిస్కట్లు నిలువుగా పెట్టి, వాటి మధ్యలో పట్టుకునేందుకు అయిస్ క్రీమ్‌కి పెట్టేపుల్ల లాంటిది పెట్టి, పైనుంచి ఒక్కొక్కదానిలోనూ మిక్సింగ్ బౌల్‌లో కలుపుకున్న చాకొలెట్ పాలు పొయ్యాలి. ఇలా అరలీటర్ పాలకి ఇంచుమించు ఎనిమిది బార్‌లు వస్తాయి. వాటిని ఫ్రీజర్‌లో పెట్టేసి, అరగంటయాక తీసుకుని చప్పరించెయ్యడమే.. యమ్మీయమ్మీ చాకోబార్ రెడీ..

ఆ వీడియో చూస్తుంటేనే నా కళ్ళ ముందు చాకోబార్లు గిరగిరా తిరగడం మొదలెట్టేయి.

మరింక మూడో వంటకం చూసే ధైర్యం చెయ్యలేననుకునేంతలో అదే కళ్ళ ముందు ప్రత్యక్ష్యమైపోయింది. దాని పేరు డ్రై ఫ్రూట్స్ కోవాకజ్జికాయ –

వీడియోని ఆపలేని నా అశక్తతకు చింతించుకుంటూ దానివైపు కళ్ళు పోనిచ్చేను.

డ్రై ఫ్రూట్స్ కోవాకజ్జికాయ –

  1. కావల్సిన పదార్థాలు-
  2. పాలకోవా – ½ కెజి
  3. డ్రై ఫ్రూట్స్ (చిన్నముక్కలుగా చేసిన పేకెట్) – ¼ కెజి
  4. పంచదార – 4 స్పూన్లు
  5. ఏలక్కాయల పొడి – ¼ స్పూన్

తయారుచేసే విధానం –

డ్రై ఫ్రూట్స్ ముక్కల్లో పంచదార, ఏలకుపొడి కలుపుకోవాలి.

కోవాను చిన్న చిన్న పూరీలుగా అరచేతిలో వత్తుకోవాలి. మధ్యలో ఒక స్పూన్‌తో కలిపిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని పెట్టి, మధ్యగా మడిచి, అంచులు వత్తుకోవాలి. ఓపికుంటే ఆ అంచులను మంచి డిజైన్‌గా మడుచుకోవచ్చు. అంతే..

నోరూరించే డ్రై ఫ్రూట్స్ కోవాకజ్జికాయలు రెఢీ..ఇవి రుచికి రుచీ..శరీరానికి బలం..

..అంటూ వదిన ఆ కజ్జికాయల ప్రాశస్త్యం గురించి చెపుతుంటే గబుక్కున వీడియో ఆపుచేసేసేను.

ఇదెక్కడి వంటల వీడియో.. అన్నీ బజార్లో కొనుక్కొచ్చి, అదీ ఇదీ కలిపెయ్యమని చెప్పడం.. దానిని ఓ పెద్ద రెసిపీలాగా వీడియో చేసి అప్లోడ్ చేసెయ్యడం.. రామచంద్రప్రభో… ఏమవుతోందీ దేశానికి అన్నట్టు.. ఓ రామచంద్రా.. ఏమయింది ఈ వదినకి అనుకుంటూండగానే మళ్ళీ వదిన దగ్గర్నించి ఫోన్.. ఇప్పుడు ఫ్రెండ్స్‌కి షేర్ చేసావా లేదా అని అడుగుతుందేమో.. ఇది కనక షేర్చేస్తే వాళ్ళు నన్ను అన్‌ఫ్రెండ్ చెయ్యడం ఖాయం.. చెయ్యకపోతే వదిన నిష్ఠూరాలు..

భగవంతుడా.. నాకేది దారి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here