మహతి-10

5
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[వాయిదాలలో డబ్బు కట్టించుకుని వస్తువులు ఇస్తామని ఊర్లోకి వచ్చిన సప్తగిరి హోం నీడ్స్ అనే సంస్థ మొదట్లో అందరినీ ఆకర్షించి జనాలు డబ్బులు కట్టాకా, వారిని మోసగించి, బిచాణా ఎత్తేస్తుంది. ఈ మోసానికి కారణం సప్తగిరి సంస్థ కాదనీ, మనలోని అత్యాశేనని అంటారు వరలక్ష్మి గారు మహతితో. ఈ సప్తగిరి పాఠం వల్ల దేన్నీ తొందరపడి నమ్మకూడదనే పాఠం నేర్చుకుంటుంది మహీ. అల ఉన్నట్టుండి చాలా స్వీట్‍గా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. తాను పిచ్చిగా ప్రవర్తించాననీ, అందుకు క్షమించమని మహీని అడుగుతుంది. ఓ వారం తరువాత అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి ఊరికి వెడుతుంది మహీ. డాక్టర్ శ్రీధర్ క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఇంట్లోని ముందు గదిని ఎమర్జెన్సీ రూమ్‍గా మార్చేసరికి రోగుల రద్దీ ఎక్కువవుతుంది. దాంతో రాత్రిపూట కూడా అయానకి ఇబ్బంది తప్పదు. ఇవన్నీ చూసిన తాతయ్య రోగుల సహాయకులు రాత్రి పూట బస చేసేలా – వడ్రంగినీ, తాపీ మేస్త్రిని పిలిపించి ఇంటి ముందున్న పెద్ద ఖాళీ స్థలంలో ఓ పేద్ద తాటాకు పాక వేయించి రెండు బాత్రూములూ, రెండు లెట్రిన్సూ కట్టి, నులక మంచాలు కుర్చీలు ఏర్పాటు చేయమని పురమాయిస్తారు. శ్రీధర్ గారు ఆశ్చర్యపోతారు. సంపాదించినది చాలని చెప్పి, పాకలో కనీసం 30, 40 మంది చాపలు వేసుకుని పడుకోవచ్చని అంటారు. తమ పాలేరుతోనే అక్కడ టీ కొట్టు పెట్టిస్తాననీ, అతనికీ, అతని భార్యకీ కాస్త ఆదాయం ఉంటుందనీ అంటారు. శ్రీధర్ గారు ధన్యవాదాలు చెప్తారు. అమ్మమ్మ కూడా మెచ్చుకుంటుంది. తర్వాత మహీ టౌన్‍కి వచ్చేస్తుంది. ఒక రోజు ఇంగ్లీషు లెక్చరర్ రాకపోతే, క్లాసుకి ప్రిన్సిపల్ గారు వస్తారు. ఆయన జీవితం ఎలా గడపాలో, ఏం నేర్చుకోవాలో పిల్లలకి వివరంగా చెప్తారు. కొత్తగా తీయబోయే సినిమాకి విద్యార్థుల నుంచి గాయకులు, నటీనటులు కావాలని ఒక సంస్థ ప్రకటిస్తుంది. సత్యం అనే కుర్రాడు ప్రయత్నిస్తానని అంటే అల హేళన చేస్తుంది. అల అలా వెటకారం చేసిన తీరు మహీకి బాధ కలిగిస్తుంది. అప్పుడు అఖిల అనే అమ్మాయి అల మొహంలో అన్నీ భావాలు వెంటనే పలుకుతాయనీ, సినిమాలో ప్రయత్నించమని సూచిస్తుంది. మహితని అడిగితే, అల గొప్ప నటి అవ్వాలని కోరుకుంటున్నాను అంటుంది. అల హగ్గీ గురించి, మహీ గురించి తప్పుగా మాట్లాడితే, రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దని గట్టిగా హెచ్చరిస్తుంది మహీ. గాయనిగా రేణుకని పాల్గొనమని చెప్తారు సంపూర్ణ గారు. తనని ఎందుకు పాల్గొనమని చెప్పలేదో అని అనుకుంటుంది మహీ. మూడు రోజుల పాటు జరిగిన పోటీలో అల, రేణుక, ఇంకో ముగ్గుర్ అమ్మాయిలు; కేశవ, హగ్గీ గాయకులుగా, సత్యా, జగపతి, శ్యామ్ అనే వారు నటులుగా పోటీపడినట్టు మహీకి తెలుస్తుంది. వాటిలో రేణుక సింగర్‍గా, అల, జగపతి నటీనటులుగా ఎంపికవుతారు. ఆ సంస్థ వాళ్ళే శిక్షణ ఇప్పిస్తారట. అల ఉత్సాహంగా కాలేజీకి వచ్చి తాను నటిగా ఎంపికవడంలో అఖిల పాత్ర, మహీ పాత్ర ఉందని చెప్పి మహీకి ధన్యవాదాలు చెప్తుంది. తనను మూర్ఖంగా తిమ్మూని వెంటాడాననీ, అతన్ని ఇబ్బంది నుంచి తప్పించడానికి మహిత చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తుంది అల. జరిగినదంతా మరిచిపోవాలనీ, తనకి నిజమైన స్నేహితురాలిగా ఉండమని మహిని అభ్యర్థిస్తుంది. సరేనంటుంది మహీ. పోటీలో తాను ఎంపిక కానందుకు బాధపడతాడు హగ్గీ. మహీ వాళ్ళ నాన్న అతను ఏం పాడాడో, ఎలా పాడాడో – అలాగే మళ్ళీ పాడమని చెప్పి, హగ్గీ చేసిన పొరపాటు ఏమిటో చెప్తాడు. హగ్గీకి ధైర్యం చెప్పి, ప్రేరణనిస్తాడు. సంపూర్ణ గారి విలువ అప్పుడు మహీకి అర్థం అవుతుంది. – ఇక చదవండి.]

[dropcap]రో[/dropcap]జులు చాలా వేగంగా దొర్లిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఫస్ట్ స్క్రీన్ టెస్ట్‌కి అలనీ, జగపతినీ సినిమా వాళ్ళు పిలిచారు. అఫ్‍కోర్స్, శ్యామ్ కూడా వెళ్ళాడు. అల వెంటనే సెలెక్టయింది. ఆమెకి ట్రైనింగ్ అక్కరలేదని, అతి సహజంగా భావాలు ముఖంలో పలికించగలదనీ మెచ్చుకున్నారట.

“నేను చదువు మానేస్తున్నాను మహీ!” ఉత్సాహంగా ఇంటికొచ్చి మరీ చెప్పింది అల.

“అవకాశం రావడం మంచిదేనమ్మా. కానీ సినిమా పరిశ్రమ ఓ చిత్రమన పరిశ్రమ. పద్మాలు ఆహ్లాదంగా పైకి కనిపిస్తాయి. కానీ వాటి మొదలుండేది బురదలోనేనని చాలామంది గ్రహించరు. అలా అని అక్కడ అందరూ చెడ్డవారని కాదు. కానీ అందరూ మంచివాళ్ళే కూడా వుండరుగా! ఆలోచించు. కనీసం ప్రైవేటుగానైనా నీ డిగ్రీ పూర్తి చేస్తే, జీవితానికి ఓ ధైర్యం వస్తుంది.” ప్రేమగానే అలకి చెప్పింది మా అమ్మ.

“మీరు చెప్పింది నిజమే ఆంటీ. నిజం చెప్పాలంటే నాకేనాడూ చదువు మీద ధ్యాస లేదు. సినిమా నటిని కావాలనే కోరిక అంత కంటే లేదు. కానీ ఇది వచ్చింది. ఎందుకొచ్చిందో నాకూ తెలీదు. నేను చాలా ఇంట్రోవర్ట్‌ని. నా బుర్రలో నేనే స్వయంపాకం వండుకుంటాను. అంతే కాదు, చాలా ఎమోషనల్ పర్సన్‍ని కూడా. అందుకే నా మొహంలో భావాలు అంత త్వరగా పలుకుతాయేమో! నేనంటూ ఫలానా జీవితం గడపాలి అని ఏనాడూ ఆలోచించలేదు. అలాంటప్పుడు వచ్చింది యాక్సెప్ట్ చెయ్యడమే మంచిదనుకుంటున్నాను” స్పష్టంగా చెప్పింది అల.

అనటామే కాదు, 15 రోజులలో హైదరాబాద్ సినిమా కంపెనీ వారి ఆహ్వానం మీద వెళ్ళిపోయింది. అల కంటే, అల తల్లిదండ్రులకి కూతురు సినిమా హీరోయిన్ కావాలనే ఆశ వున్నదట. అందుకే అలతో పాటు అల అమ్మ వసుంధర గారు కూడా హైదరాబాద్ వెళ్ళారట.

***

మార్చి ఎంటరైంది. ఓ పక్కన పరీక్షల టెన్షన్. మరో పక్క ఎండలు. ఈసారి హగ్గీ కూడా సీరియస్‍గా పరీక్షల కోసం చదవటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.

“వారానికి మూడు సార్లు అంటే ఆరు గంటలు సంగీతం క్లాసుల కోసం వేస్ట్ చేస్తున్నారు. ఆ టైమ్‍ని చదవడానికి ఉపయోగిస్తే మంచిదేమో!” మేమందరం కలిసి క్లాసుకి వెళ్తుండగా అడిగారు రహీమా వాళ్ళ అమ్మగారు. “అదీ ఆలోచించవలసిన విషయమే” అన్నాడు హగ్గీ. అంతే కాదు, “మేడమ్, ఎగ్జామ్స్ అయ్యాకా మ్యూజిక్ క్లాసులకి వద్దాం అనుకుంటున్నాము” అని సంపూర్ణ గారికి చెప్పాడు. ఆవిడ నవ్వి, “హరీ, రెండు గంటలు సంగీత సాధన కనీసం 20 గంటల స్ట్రెస్‍ని మనసులోంచి తొలగిస్తుంది. అంతే కాదు, మనసుని క్లీన్‍గా ఉంచుతుంది. ఆ పైన మీ ఇష్టం” అన్నారు. నాకు ఆవిడ మాట నూటికి నూరు పాళ్ళూ నచ్చి, మిగతా వాళ్ళు మానేసినా, నేను మాత్రం క్లాసులకి కంటిన్యూగా వెడదామనే నిర్ణయించుకున్నాను. అ తరువాత సంపూర్ణ గారు చెప్పింది నూటికి నూరు పాళ్ళూ నిజమని అనుభవంతో తెలుసుకున్నాను.

ఎగ్జామ్స్ మొదలయ్యాయి. మాకిక పగలూ రాత్రీ తెలీలేదు. మా ఎగ్జామ్స్ పూర్తి అయిన రోజునే అన్ని పేపర్ల లోనూ నూతన నటిగా ‘అల’ ముఖచిత్రం వచ్చింది. మేకప్‍లో అపర దేవకన్యలా ఉంది.

“అలని నటిని చేసింది నేనే!” గర్వంగా మా అందరితో అన్నది అఖిల.

***

అందరం మా వూరు బయలుదేరాం. నేనూ తాతయ్య, అమ్మమ్మ కొన్నాళ్ళు మా వూళ్ళో ఉందామనుకున్నాం. అమ్మా నాన్నా అన్న తమ్ముడు చెల్లి వెనక్కి వచ్చేసేటట్లూ. వాళ్ళకి మా కర్రావురి ఉప్పలపాడుతో పెద్దగా అనుబంధం లేదుగా! హగ్గీని వస్తావా అని అడిగాను గానీ, రానన్నాడు.

హాస్పటల్ యథాతథంగా ఫుల్ స్వింగ్‌లో వుంది. డాక్టర్ శ్రీధర్ సిన్సియర్‍ గనక చుట్టుపక్కల వూళ్ళ వాళ్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక మా తాతగారు వేయించిన ‘పాక రెసిడెన్సీ’ అయితే ఎప్పుడూ ఫుల్‍ గానే వుంటోంది. మా పాలేరు ఇంకో ఇద్దరు కుర్రాళ్ళని కూడా పెట్టుకుని టీ & టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నాడు.

“వీడు బాగా డబ్బు చేశాడే మహీ! బహుశా తొందర్లోనే మనకి టాటా చెప్పి వేరే చోట పెద్ద హోటల్ పెడతాడు!” గేటు దాటి ఇంట్లోకి ఎంటరవుతూనే అన్నది అమ్మమ్మ. రెండ్రోజుల పాటు మా ఇల్లు మళ్ళీ కళకళలాడింది. లీజుకిచ్చిన మా మామిడి తోట మళ్ళీ మా చేతికి రావడంతో హాయిగా వన భోజనాలు (అఫ్ కోర్స్, కార్తీక మాసం కాకపోయినా) హాయిగా ఎంజాయ్ చేశాం. శ్రీధర్ గారు కూడా ఏదో ఓ టైమ్ లో వచ్చి మాతో కాస్త సమయం గడిపేవారు.

అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి వెళ్ళిపోయాక  నాకు బోలెడంత సమయం మిగుల్తోంది. కుసుమ వాళ్ళింటికి వెళ్ళాలనిపించలేదు. అసలా విషయం తలచుకుంటేనే మనసులో ఏదో గుచ్చుకున్నట్లు వుంటోంది.

“డాక్టర్.. నాక్కూడా ఏదైనా పని వప్పజెప్పండి” అన్నాను సరదాగా. “ఆర్ యూ సీరియస్?” అన్నారు ఆశ్చర్యంగా. “యస్” అన్నాను.

“ఒక పని చెయ్యి. రోగులు ఎక్కువ, స్టాప్ తక్కువ వున్నారు. నర్సుల అవసరం చాలా వుంది. అలాగే రోగులకి చక్కగా టోకెన్‍లు ఇచ్చి ఓ పద్ధతిలో పంపడానికి అంతకు ముందు వుండే ఆఫీస్ క్లర్కు లేడు. ఇష్టమైతే టోకె‍లు ఇచ్చి, అక్కడ జరిగే గొడవల్ని కొంత నియంత్రించవచ్చు, లేదా ఇప్పుడు ఉన్న ఒకే ఒక నర్సుకి సహాయం చేస్తూ పేషంట్లకి సేవ చెయ్యొచ్చు” అన్నారు. తాతయ్య, అమ్మమ్మలతో చెప్పాను. వాళ్ళు ఓకె అన్నారు. మరుసటి రోజు పొద్దున్నే డాక్టర్‍తో బాటు హాస్పటల్‍కి వెళ్ళాను. ఆస్పత్రి యమా రష్‍గా ఉంది. ఒకే డాక్టరు. ఒకే నర్సు. ఇద్దరు ఆయాలు, ఒక స్వీపరు. పేషంట్లు చూస్తే బెడ్‍ల మీద పది మంది వుంటే బయట నూట ఇరవై మంది. హాస్పటల్ ఏరియా పెద్దదే. కానీ బాగు చేసేదెవరూ?

మొదటగా ఓ కాయితాన్ని చిన్న చిన్న ముక్కలుగా అందంగా కట్ చేసి, వాటిలో నంబర్లు రాశాను. మరో కొన్ని ముక్కల మీద ‘A’ అనే అక్షరాన్ని రాశాను.

మొత్తానికి అందరికీ వరుసగా నంబర్లు ఉన్న కాయితం ముక్కల్నీ, రోగితో పాటు వచ్చిన వాళ్ళకి ‘A’ (అటెండెంట్) అనే కాయితం ముక్కల్నీ పంచాను.

పిలిచిన తరువాతే లోపలికి రావాలనే ఆంక్ష పెట్టాను. జనాలు గుమిగూడడం చూసి వారిని నంబర్ల ప్రకారం కూర్చోబెట్టాను. మౌనం పాటించకపోతే, అటెండెంట్స్‌ని బయటకి పంపిస్తానని బెదిరించి, కాస్త ‘గడబిడ’ తగ్గేట్టు చేయగలిగాను. నెప్పి ఎక్కువగా వున్న వాళ్ళకి ‘P’ అనే కాయితం టోకెన్ ఇచ్చి ముందు పంపించాను. ‘P’ అంటే ప్రియారిటీ అన్న మాట. మధ్యాహ్నం రెండింటి దాకా అసలు సమయం ఎలా గడిచిందో కూడా తెలీలేదు.

హాస్పటల్ కాంపౌండ్‍లో చాలా చెట్లు వున్నాయి. కానీ ఆ చెట్ల కింద నానా చెత్తా పేరుకుని చాలా అపరిశుభ్రంగా వుంది. ఆ చెత్తని తొలగించగలిగితే కొంత వరకూ అటెండెంట్స్ కూర్చోవటానికి వీలుగా వుంటుందనిపించింది. కానీ తొలగించటం ఎలా?

అప్పుడు గుర్తుకొచ్చాయి మా వూళ్ళో ఉన్న సేవా సమాజాలు. మొదటగా శ్రీ సత్యసాయి సేవాదళ్ వారి దగ్గరకు వెళ్ళాను. మా వూరి సత్యసాయి సేవాదళ్ కార్యదర్శి శ్రీరామారావు గారు. నా చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్నారు కూడా.

“పెదనాన్నగారూ, ఇదండీ సమస్య” అన్నాను. అయన నవ్వి, “మా సేవా సంస్థలలో ‘గ్రామసేవ’ కూడా ఓ భాగం అమ్మా. తప్పనిసరిగా మేమందరం శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం వచ్చి క్లీనింగ్ కార్యక్రమం మొదలెడతాం. అనేక మంది స్వచ్ఛంద సేవకులున్నారు. వారినీ ఆహ్వానిస్తాం. మేమందరం కలిశాకా, కొన్ని సిమెంట్ బెంచీల్ని ఆ చెట్ల కింద నిర్మించే విషయాన్ని కూడా చర్చిస్తాం” అని మాట ఇచ్చారు. ఇంకేం కావాలి? మా జల్లిపల్లి వారి బట్టల కొట్టుకు వెళ్ళి ‘తాను’లలో వచ్చే ‘అట్ట’ల్ని కొన్ని తీసుకొచ్చా. వాటిని ఒక అంగుళం పొడుగు, వెడల్పుగా వుండే చదరం ముక్కల కింద కత్తెరతో కట్ చేశా. రెండ్ ఇంకూ, గ్రీన్ ఇంకూ తెచ్చి కొన్నిటి మీద 1 నుంచి 100 దాకా నంబర్లు రెడ్ ఇంకుతో వేశా. మిగతా వాటి మీద 1 నుంచి 100 దాకా గ్రీన్ ఇంకుతో ‘A’ అని వ్రాశా. ఓ ఇరవై అట్టముక్కల మీద బ్లూ ఇంకుతో ‘P’  అని వ్రాశా. మూడు అట్టపెట్టెల్లో (మందుల షాపు నుంచి తెచ్చిన ఖాళీ అట్టపెట్టెలు) వాటిని జాగ్రత్తగా వరుస సంఖ్య ప్రకరం సద్దాను. పేషంట్లు తాగడానికి నీటి ఏర్పాటు సరిగా లేదు. దానికి మా తాతయ్య 10 మంచి నీటి కుండల్నీ, వాటికి చదుర్లనీ, మూతల్నీ స్పాన్సర్ చేస్తానన్నారు. అప్పటికప్పుడే కుమ్మరి సుబ్బారావు దగ్గరికి వెళ్ళి చీకటి పడే లోగా ఆ పది కుండల్నీ చదుళ్ళు, మూకుళ్లతో సహా హాస్పటల్ వరండాలో పెట్టించా. మా పాలేరుని, ఆయన భార్యనీ పురమాయించి వాటిల్లో చలం బావి నీళ్ళు నింపించా (కుండల్ని బాగా గడ్డి తోనూ, కొబ్బరి పీచు తోనూ తోమించాక). పొద్దుట్నించీ పని చేస్తున్నా నాకు అస్సలు అలసట తెలీలేదు గదా, మహోత్సాహంగా వుంది.

“నువ్వు వుండటం వల్ల హాస్పటల్లో గడబిడ తగ్గడమే కాక, ప్రశాంతత కూడా చిక్కింది మహితా. రోగులు వరుసగా రావడం వల్ల పని కూడా తొందరగానే ముగిసింది” శ్రీధర్ గారు మా తాతయ్య అమ్మమ్మ ముందర నన్ను మెచ్చుకోవడం నాకు ఏనుగెక్కినంత సంతోషాన్ని ఇచ్చింది.

ఆ మరుసటి రోజున కుండలు, కుండలో నీళ్ళ ఏర్పాట్లు చూసిన శ్రీధర్ గారు నన్నెంతో మెచ్చుకున్నారు. “మహీ, వయసుకి మించిన ఆలోచనా పద్ధతి నీది. నీలాంటి వాళ్ళు వూరికి పదిమంది వుంటే చాలు” అని ఎంతో మెచ్చుకున్నారు. అంతే కాదు, ఆయన గదిలో నేను స్పెషల్‍లా పెట్టించిన చక్కటి నీళ్ళ కూజాని చూసి మురిసిపోయారు.

మధ్యాహ్నం భోజనానికి వెళ్తుంటే నా చిన్నప్పటి స్కూలు మాస్టారు సీతారామాంజనేయులు గారు కనిపించారు.

“ఏమ్మా మహీ, చాలా పనులు చేయిస్తున్నావని విన్నాను. మన అటెండరు లక్ష్మణరావు నిన్ను హాస్పటల్లో టోకెన్లు ఇస్తుంటే చూశానని చెప్పాడు.” అన్నారు.

“అవును, మాస్టారు సెలవులు గదా.. వృథాగా సమయం ఎందుకు గడపాలని నాకు తోచింది చేస్తున్నా” అన్నాను.

అంతే గాదు, హాస్పటల్ కాంపౌండ్ లోని చెత్త గురించీ, దానికి సేవాదళ్ శ్రీరామారావు గారిచ్చిన మాట గురించీ చెప్పాను.

“ఇంకేం.. అయితే మన స్కూలు స్కౌట్ బాయిస్‍ని కూడా పిలిపించి సత్యసాయి సేవాదళ్ వారితో కలుపుతాం. బ్రహ్మాండంగా పని సాగుతుంది” అన్నారు.

***

మధ్యలో ఏం జరిగిందీ ఎలా జరిగిందీ అన్నది వదిలేస్తే, ఆదివారం సాయంత్రానికి హాస్పటల్ కాంపౌండ్ చెత్తని వదిలించుకుని అద్దంలా తయారయింది. దానికి మరో ముఖ్యమైన కారణం శ్రీరామారావు గారి ఆర్గనైజేషన్. ఆయనే పంచాయతీ వారిని సంప్రదించి పంచాయితీ ట్రాక్టరుతోనే చెత్తనంతా వూరు బయటకు తోలించారు. స్కౌటు కుర్రాళ్ళయితే పారలూ, పలుగులూ తెచ్చి, పిచ్చి మొక్కల్ని పీకి అద్దంలా కాంపౌండుని మార్చారు. పిచ్చి  మొక్కలూ, ముళ్ళకంపలూ, పనికిరాని చెత్త డబ్బాలూ అన్నీ తొలగించాక హాస్పటల్ చాలా అందంగా కనిపించింది.

ఆ మాట హాస్పటల్ చూసిన ప్రతివాళ్ళూ అన్నారు.

కొంతమందైతే తామూ వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద సిమెంటు బెంచీల్నీ డొనెట్ చేస్తామన్నారు. దాదాపు 16 బెంచీలకి స్పాన్సర్లు దొరికారు. మేస్త్రీ కొండలరావుకి బెంచీలు నిర్మించే పని వొప్పగించడం కూడా జరిగిపోయింది.

“పంచాయితీ ప్రెసిడెంటుని పిలుద్దాం.. బెంచీల ఇనాగరేషన్‍కి” నవ్వుతూ అన్నారు శ్రీరామారావు గారు.

“చేసిందంతా మీరూ, మీ సేవాదళ్ వారూ, యీ పిల్లా! మధ్యలో ఆయనెందుకూ?” విచిత్రంగా అన్నాడో మెంబరు.

“అదే మరి! ఆయన్ని ఇందులో ఇరికిస్తే, ఈ కాంపౌండు ఇలాగే శుభ్రంగా వుండే ఏర్పాట్లు చెయ్యమని అడగటానికి వీలుంటుంది. అలాగే చక్కగా వరుసల్లో పూల మొక్కలు నాటించే పని ఆయనకే వొప్పజెప్పచ్చు. వూరు బాగుంటే పేరొచ్చెది గ్రామ ప్రెసిడెంటుకేగా!” నవ్వారు శ్రీరామారావు గారు. నిజమేగా మరీ!

***

వారం రోజుల్లో ఒక్కో చెట్టు కిందా నాలుగు బెంచీల చొప్పున 16 బెంచీలు సిద్ధమయ్యాయి. బెంచీలంటే బెంచీలు కాదు. పార్కు బెంచీల్లాంటివి. హాయిగా వీపుని ఆన్చుకుని కూర్చోవచ్చు. ఎనిమిది బెంచీలు రోగులకీ, ఎనిమిది బెంచీలు అటెండెంట్స్‌కీ ఏర్పాటు చేశాం. దాంతో వరండా ‘క్యూ’ గోల తప్పింది. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 10 దాకా టోకెన్లు ఇవ్వడానికి సేవాదళ్ స్వచ్ఛంద సేవకులు ఒప్పుకున్నారు. సాయి సేవాదళ్ వారు కూడా వారానికోసారి ‘కర్ సేవ’ చేస్తామని మాట ఇచ్చారు.

“సంకల్పం అనేది చాలా గొప్పది మహీ. ఎంత బలంగా మనసులో సంకల్పం వుంచుకుంటామో అంత త్వరగానూ, గొప్పగానూ ఆ సంకల్పించిన కార్యం నెరవేరుతుంది. నేను ఎడ్మిట్ అయినప్పుడు హాస్పటల్ చెత్తకుండీలా వుంది. ఇప్పుడు చూడు ఎంత బాగుందో. ఇదంతా నీ సంకల్ప బలమే” అన్నాడు తాతయ్య బెంచీల ఇనాగరేషన్ రోజున.

“సాయిబాబా చెబుతారు, ‘నువ్వు సేవా కార్యక్రమాలు చేస్తూ ఇతరులకేదో పేద్ద మేలు చేస్తున్నావనుకుని భ్రమ పడకు. నువ్వు చేస్తున్న సేవల వల్ల మొట్టమొదట లాభపడేదీ, ఆనందపడేదీ, నువ్వేనని గుర్తుంచుకో. ఆ సేవ చేసే భాగ్యం లభించినందుకు భగవంతుడికి కృతజ్ఞుడిగా ఉండు’ అని” ఆదివారం ఉదయం సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తూ సేవాదళ్ సభ్యులతో శ్రీరామారావు గారు అన్న మాట ఇది. ఆ మాట ముమ్మాటికీ నిజమని నేను గ్రహించాను.

పేషంట్లకి కూడా కొంచెం ‘క్యూ’ అలవాటయింది. వరండాలో పేషంట్లు, అటెండెంట్లూ గుమిగూడటం తగ్గింది. నాలుగు చెట్ల దగ్గగా దిమ్మలు కట్టించి, మంచి నీటి కుండలూ, రెండు సత్తు గ్లాసులు పెట్టించారు శ్రీ సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు. ఎండాకాలంలో చక్కగా నిమ్మకాయ, ఉప్పూ వేసిన ‘మజ్జిగ’ని కూడ ఉచితంగా పేషంట్లకీ, అందరికీ సప్లయి చేస్తామని చెప్పారు. పంచాయితీ వారు ప్రతి చెట్టు కిందా చెత్త కుండీలని ఏర్పాటు చెయ్యడమే గాక, చక్కని మొక్కల్ని నాటించి, పంచాయితీ పనివారితోనే నీళ్ళు కూడా పోయిస్తున్నారు. ఊరి పంచాయితీ ప్రెసిడెంటు మాంఛి ఉత్సాహి. తనంతట తను ఏదీ చెయ్యడు. ఎవరన్నా సహాయం అడిగి, పొగిడితే మాత్రం వద్దన్న దాకా ఆపడు. ఆయన్ని ‘ఇరికించడం’ బ్రహ్మాండంగా పనికొచ్చింది.

అందరిలోకి ఎక్కువగా సంతోషించింది శ్రీధర్ గారు.

“యూ హావ్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్..! కుసుమ విషయంలో నువ్వు చూపిన కన్‍సర్న్ నాకెంతో నచ్చింది. ఒక స్నేహితురాలిని పూర్తిగా ఆదుకోవాలన్న నీ తాపత్రయం నన్ను ముగ్ధుడ్ని చేసింది. ఇప్పుడు హాస్పిటల్‍ని పరిశుభ్రంగా వుంచడానికి నువ్వు చేస్తున్న కృషి నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ పరిసరాల్ని చూసి విసుక్కునేవాణ్ణి. ఏం చెయ్యాలో తెలిసేది కాదు. నేనూ ఈ వూరి వాణ్ణి కాకపోవడం వల్ల ఎవరిని అప్రోచ్ అయినా వాళ్ళు ‘చేస్తాం, చూస్తాం’ అనే వాళ్ళే తప్ప ప్రాక్టికల్‍గా ఏమీ చేసేవారు కాదు. రియల్లీ మహీ.. ఓనాడు నువ్వు గొప్ప లీడర్ అవుతావు” అన్నారాయన.

ఈ మాటలన్నీ నన్ను నేను కీర్తించుకోవడానికి చెప్పిన మాటలు కావు. నిజంగా ఓ పనిని మనస్ఫూర్తిగా చెయ్యాలనుకుని చేస్తే, ఎంతమంది మనకి సహాయపడతారో, ఎంతమంది మనని మెచ్చుకుంటారో తెలియజేద్దామనే ఉద్దేశం తోనే ఆ విషయలన్నీ చెబుతున్నాను.

“తరువాత ఏం చెయ్యాలనీ?” అడిగారు శ్రీధర్. నిజంగా చెబితే నాకున్నవి వూహలే. కాసేపు డాక్టరై ప్రజలందరికీ గోప్ప సేవ చేస్తున్నట్టూ, కాసేపు లాయరై పేదల తరఫున బల్ల గుద్ది వాదించేస్తున్నట్టూ, కాసేపు మంత్రి అయిపోయి ప్రజలకి వారు ఊహించనంతగా మేలు చేస్తున్నట్టూ ఊహించుకునేదాన్ని. ఆ వూహల్లో నేను గొప్ప సింగర్నీ, గొప్ప యాక్టర్నీ కూడా. ఏ మాత్రం నాకు అప్పుడు స్పష్టత లేదు. ఆ విషయమే నవ్వుతూ శ్రీధర్ గారికి చెప్పాను.

“ఓహ్.. ఆల్ ఇన్ వన్ అన్న మాట!” పకపకా నవ్వి అన్నారు. నా వూహలన్నీ విన్నవాళ్ళు నవ్వడంలో వింతేముందీ!

నా మనసులో మాత్రం ఆ సంభాషణ ఆగలేదు.

‘ఏం చెయ్యాలీ?’ అనే ప్రశ్న మనసుని తొలుస్తూనే వుంది. డిగ్రీ తీసుకోవాలి. అయితే ఏది? నా చదువు ఉపయోగపడాల్సింది ఉద్యోగానికా లేక సమాజానికా?

ఉద్యోగం దొరుకుతుంది. పొద్దుట్నించీ సాయంత్రం దాకా ఏ ఆఫీసులోనో పని చేసి ఇంటికి రావడం, ఆ తరువాత వంటా గింటా కానిచ్చి మింగి పడుకోవడం. ఇవన్నీ అందరూ చేస్తున్నవే. నాకంటూ ఓ ప్రత్యేకత వుండాలి.

అయితే ఆ ప్రత్యేకత అనేది ఎలా తెచ్చుకోవాలో తెలీలేదు. పోనీ నాన్నగారినో, అమ్మనో అడిగితే? వాళ్ళు నా ప్యూచర్ బాగుండాలనీ సుఖంగా గడిచే పని చెయ్యమనే చెబుతారు గానీ, ఏం చేస్తే నా మనసుకి సంతృప్తి కలుగుతుందో ఎలా చెప్పగలరూ.. అది ఆలోచించవలసింది నేనే.

ఫోన్ వచ్చింది. తీశాను. సురేన్ ఫోన్ చేశాడు. అన్నయ్య నాకు ఫోన్ చెయ్యడం అదే మొదటిసారి.

“చెప్పరా అన్నయ్యా” ఉత్సాహంగా అన్నాను.

“చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా?” అడిగాదు.

“అమ్మమ్మ, తాతయ్య వరండాలో వున్నరు, చెప్పు” అన్నాను.

“నేను చెప్పే విషయం వాళ్ళకి చెప్పొద్దు. నేను ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను. ఇంకా అమ్మానాన్నలకీ విషయం చెప్పలేదు. చదువుని మధ్యలో వొదిలెయ్యడం వాళ్ళకి ఇష్టం వుండదు. కానీ, ఆర్మీలో చేరడం అనేది నా కల. అందుకే..” ఆగాడు.

“చెప్పకుండా వెళ్ళిపోతావా?” కంగారుగా అన్నాను.

“లేదే. చెప్పే వెళ్తాను. మహీ, రేపటి కల్లా నువ్వు రాగలవా? ఈలోగా వాళ్ళని ఎలా ఒప్పించాలో ఆలోచిస్తాను. నువ్వూ ఆలోచించు. నేను వాళ్ళకి చెప్పే వెళ్ళాలని అనుకుంటున్నాను గానీ, పారిపోయి వెళ్ళాలనుకోవడం లేదు”. మెల్లగా అన్నాడు, “వస్తావు కదూ” అని.

“సరేరా ఆలోచిస్తాను. రేపు ఉదయం బయలుదేరి వస్తా” ధీమాగా అన్నాను. వాడీ విషయంలో నన్ను కన్సల్ట్ చెయ్యడం నాకు చాలా ఆనందాన్నించింది.

“ఎవరిదే ఫోనూ?” తాతయ్య అడిగాడు.

“మా ఫ్ర్రెండ్‌ది తాతయ్యా.. ఓ సమస్యలో ఉన్నాడు” అన్నాను.

“ఏమిటా సమస్య?” కుతూహలంగా అడిగాడు తాతయ్య.

“చదువు మధ్యలో ఆపేసి మిలిటరీలో చేరతానంటున్నాడు. తల్లిదండ్రుల్ని ఎలా ఒప్పించాలో తెలీక నన్ను అడిగాడు” ఠక్కున చెప్పాను.

“హాయిగా చేరమను. ప్రతివాడూ సుఖమైన ఉద్యోగాల కోసమే వెదుకుతున్నాడు. దేశం గురించి ఇవ్వాళా రేపూ ఆలోచించే వాడేవడూ? అమ్మాయ్.. ఒకప్పుడు నేనూ ఆర్మీలో చేరదామనుకున్నా. ఆ రోజులలో 5వ తరగతి పాసైతే చాలు. కానీ మా అమ్మానాన్న వద్దని గోల పెట్టడంతో ఆగాను. ఆ కల అలాగే మిగిలిపోయింది” నిట్టూర్చాడు తాతయ్య.

“అయితే మీరు కూడా నాతో రావాలి తాతయ్యా” అన్నాను.

“ఎందుకూ? ఎక్కడికీ?” ఆశ్చర్యంగా అన్నాడు.

“టౌన్‌కి. ఎందుకంటే సురేంద్ర ఆర్మీ లోకి వెడతాడట.” చిన్నగా అన్నాను.

“అంటే?” షాక్ తిన్నాడు తాతయ్య.

“సారీ తాతయ్యా, ఎవరో ఫ్రెండ్ అని అన్నందుకు. ఫోన్ చేసింది సురేనే. ఈ విషయం ఇంకా వాడు అమ్మానాన్నలతో చెప్పలేదట. చెబితే ఒప్పుకుంటారో లేదో అని సంశయిస్తున్నాడు. నన్ను కూడా తనతో ఉండమంటున్నాడు.. చెప్పేటప్పుడు. నువ్వూ అమ్మమ్మా వుంటే ఇంకా బాగుంటుందని నేననుకుంటున్నాను.” స్పష్టంగా చెప్పేశాను.

“మీ నాన్న సంగతి నీకు తెలుసుగా. ఆయనేమీ అడ్డుపెడతారని అనుకోను. ఇక ప్రాబ్లమ్ వస్తే అహల్య నుంచే రావాలి” సన్నగా అన్నాడు తాతయ్య. నేను ఎమోషనల్‍గా ఇరికించానని ఆయనకి అర్థమైంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here