‘నాన్న లేని కొడుకు’ ఉంటాడా!?

5
4

[శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి ‘నాన్న లేని కొడుకు’ నవలకి ప్రొఫెసర్ సిహెచ్. సుశీలమ్మ రాసిన ముందుమాటని అందిస్తున్నాము.]

Motherhood is a matter of fact and fatherhood is a matter of opinion

[dropcap]ప్ర[/dropcap]ముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి తన నవలకి ‘నాన్న లేని కొడుకు’ అని శీర్షిక ఉంచడం కొంత ఆశ్చర్యం కలిగింది – 2022లో సంచిక వెబ్ మాగజైన్‌లో సీరియల్‌గా వస్తున్నప్పుడు. వారం వారం చదువుతున్న కొద్దీ ఈ కథాంశానికి చాలా చక్కగా సరిపోయే శీర్షిక అనిపించింది. ఆడపిల్లలని చంపడమో, గాయపరచడమో, యాసిడ్ పోయడమో గమనించాం. కానీ ఇదో కొత్త కథాంశం. పాఠకులు ఊహించని తరహా హింస. ప్రతి వారం సస్పెన్స్ పోషించారు. కానీ అనవసరమైన మలుపులు, సాగతీత లేకుండా సూటిగా కథ చెప్పారు.

శీర్షిక నుండే సస్పెన్స్ మొదలు పెట్టిన విజయలక్ష్మి అసాంతం థ్రిల్లర్‌గా రూపొందించారు. కానీ అంతర్లీనంగా ఒక అమాయకపు ఆడపిల్ల వంచించబడి ఎంత హింస అనుభవించిందో హృదయ విదారకంగా చెప్పారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా మనిషిలోని రాక్షస ప్రవృత్తి మారలేదు. నేర స్వభావం మరింతగా పెచ్చరిల్లిపోతోంది. ఆకర్షణని ప్రేమ అనుకోవటం, అమ్మాయి ఒప్పుకోకపోతే అది కక్షగా మారి ఆమెను చంపటమో చచ్చేంత హింస పెట్టడమో జరుగుతోంది.

In a novel suspense is an uneasy feeling that a reader gets when he doesn’t know what is going to happen next. A writer creates suspense through a controlled release of information to readers that raises key questions and makes readers eager, but terrified, to find out what happens.

ఒకప్పుడు యండమూరి, మల్లాది రచనలు ఇష్టంగా చదివే ఆనాటి పాఠకులకు మళ్లీ అలాంటి రచన చదివే అవకాశం కలిగింది ఈ నవలతో. అలాగే ఈ నాటి యువతరం కూడా ఆసక్తిగా చదివేంత ఆకర్షణ గల ‌సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం ఇది. ఇలా సస్పెన్స్ ఆసాంతం పోషించడం, అదీ ఒక ఆడపిల్ల మీద అత్యాచారం గురించి, ఆమె అనుభవించిన క్షోభ, భయంకరమైన అనుభవాల్ని.. హింస, సెక్స్ వంటి అశ్లీల, అభ్యంతరకరమైన వర్ణనలు లేకుండా రాయడమంటే రచయిత/త్రికి ఒక ఛాలెంజ్ లాంటిది. నవల అంటే అనేక పాత్రలు, సన్నివేశాలు ద్వారా ఒకరి జీవితం లేదా కొందరి జీవితాలకు దర్పణం లాగా చూపించగలగాలి. వివిధ సన్నివేశాలు కల్పించాలి. అయితే ఈ నవలలో పాత్రలు చాలా తక్కువ. ఒక రాక్షసుడు లాంటి సైకో, లేత గులాబీ వంటి అమ్మాయి, చిన్న పిల్లాడు (వీరి పేర్లు దాదాపు నవల చివరి వరకు చెప్పక అతడు, ఆమె అనడం మరో టెక్నిక్.) తల్లి తండ్రులు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు – పాత్రలు.

పాత కొత్తల భావాల మేలు కలయిక అత్తలూరి విజయలక్ష్మి గారి రచనలు. మారుతున్న సమాజం, మనుషుల మనస్తత్వాలు, పాఠకుల ఆసక్తిని గమనిస్తూ, తనను తాను అప్‌డేట్ చేసుకుంటూ, రాస్తూ, తన రచనా వ్యాసంగానికి గ్యాప్ నివ్వక, నిరంతరం కొనసాగిస్తూనే ఉన్న సీనియర్ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి. స్త్రీవాదుల జాబితాలో లేని స్త్రీవాద రచయిత్రి ఆమె. తన భావాలు అభ్యుదయ పంథాలో సాగుతాయి. అయితే ఎక్కడా విశృంఖలత కనిపించదు. ఆ భావాలను వివరిస్తూ పాఠకులను ఒప్పించే నైపుణ్యం తెలిసిన రచయిత్రి ఆమె. కొన్ని రచనలు విమర్శకులకు నచ్చకపోయినా, ఏది నచ్చలేదో గమనిస్తూ, మారుస్తూ, వైవిధ్యంగా రాస్తూ ఆమోదింప చేసుకునే గడుసుతనం ఉంది ఆమె కలానికి.

ప్రేమ విఫలమైతే త్యాగం చేసే నాయికా నాయకులు మన పాతతరం నవలలు, సినిమాలలో కనిపిస్తారు. ‘ప్రేమించు లేదా చచ్చిపో’ అనే దుర్మార్గమైన సైకిక్ మెంటాలిటీ ఈమధ్య బాగా పెరిగిపోయింది యువకుల్లో.

డాక్టర్ సూర్యనారాయణ, జ్యోతి దంపతులు నాలుగేళ్ల క్రితం కనపడకుండా పోయిన కూతురు కోసం దుఃఖిస్తూ ఉంటారు. పోలీస్ రిపోర్టు ఇచ్చినా లాభం లేకపోయింది. కిడ్నాప్ అయిందా లేక హత్య చేయబడిందా, అసలు ఏమైందో తెలియక, ఆ వయసుగల అమ్మాయిలు కనబడితే ఆశగా గమనిస్తూ, ఆమె జ్ఞాపకాలతో బ్రతుకుతూ, ఏదో తెలియని ఆశతో రోజులు గడుపుతుంటారు. ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్లిపోయే స్వభావం కాదు వారి పెంపకంలో పెరిగిన కూతురిది. పేరు ప్రతిష్ఠలు గల సంపన్నవంతమైన డాక్టర్ సూర్యనారాయణ పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల రక్షణ గురించి ఆలోచించే పనేలేదు.

ఇంతకీ ఆమె ఏమైంది? ఎక్కడుంది? ఎలా ఉంది?

ఒక నిర్మానుష్యమైన అడవిలో ఏపుగా పెరిగిన పెద్ద చెట్ల దాపున, సూర్య చంద్రులను కూడా చూడలేని, పాడుబడిన ఇంటిలో, గాలి వెలుతురు సరిగా రాని ఒకే ఒక గదిలో ఉంచబడింది ఆమె. చిన్న గట్టుమీద సింగిల్ బర్నర్ స్టౌ, కొన్ని గిన్నెలు, ఒక ప్లాస్టిక్ బిందె, కొంత వంట సరుకులు, ఒక మంచం, పరుపు, రెండు తలగడలు, రెండు దుప్పట్లు.

ఆ చిన్న గదిని ఆనుకొని ఇంకా చిన్న బాత్రూం లావెటరీ, ఒక బకెట్, మగ్. ఎటూ పారిపోయే అవకాశం లేదు ఒక కిటికీ గాని వెంటిలేటర్ గాని లేదు. నల్లగా ఎత్తుగా లావుగా మొరటుగా ఉన్న, పరమ వికృత ప్రవృత్తి గల, రాక్షసుడి కంటే మించిన సైకో ఆమెని అక్కడ బంధించాడు. రోజూ వచ్చి, వంట వండించుకొని, తిని, మందు తాగి, బలవంతాన ఆమె శరీరాన్ని క్రూరంగా అనుభవించి వెళ్ళిపోతూ ఉంటాడు. మనసు క్షోభిస్తుంటే, ఎదిరించి, అతనిచే దెబ్బలు తింటూ, కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న సమయంలో ఆమెకి గర్భం వస్తుంది. దాన్ని అసహ్యించుకొని, పోగొట్టుకోవాలని ఎంతో ప్రయత్నించింది. విషయం తెలిసి వాడు ఉన్మాదిలా ఆనందించాడు. “నిన్ను నేనే చూడాలి. నేనే ముట్టుకోవాలి. నువ్వు ఎవరికీ దక్కకూడదు. నాకోసమే బతకాలి. నాకోసం చావాలి” అన్నాడు కసిగా. నాలుగేళ్లు పాశవికంగా అత్యాచారం చేశాడు. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా అవకాశం లేని చోటు పకడ్బందీగా ఏర్పాటు చేయడం వాడి క్రిమినల్ బ్రెయిన్‌కి తార్కాణం.

‘ఆడపిల్లలకి మనసు ఉంటుంది, ఇష్టాఇష్టాలు ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు అభిరుచులు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి.. అనే స్పృహ లేకుండా ‘మేము ప్రేమిస్తున్నాం. నువ్వు ప్రేమించాలి లేకపోతే యాసిడ్ పోస్తాం లేదంటే చంపేస్తాం’ అంటూ ఈ బెదిరింపులు ఈ కిడ్నాప్‌లు.. న్యాయంగా ఉందా! నా జీవితం ఇలా నాశనం చేసే అధికారం ఎవరిచ్చారు వాడికి” అంటున్న హరిత ఆవేశం వెనక రచయిత్రి ఆవేదన ఉంది.

పిల్లవాడికి మూడేళ్ళు వచ్చాయి. కానీ మానసికంగా ఎదగలేదు. మాటలు రాలేదు. ఆ దుర్మార్గుడు వచ్చినప్పుడు పిల్లవాడు అడ్డం అని, గోడకి ఒక చెక్కని అడ్డంగా కొట్టి ఒక బొంత వేశాడు. వాడు ఉన్నంత సేపు పిల్లవాడు ఆటకలాంటి దానిలో పడి ఉండాల్సిందే. ఒక రోజు ఆటక లాంటి దానిమీద గోడకి ఒక ఇటుక సగం విరిగి కొంత రంధ్రం కనబడిందామెకు. దాన్ని మరింత పెద్దదిగా చేసి, దాని ద్వారా తను, తన కొడుకు బయటపడవచ్చుననే ఆలోచనతో, అక్కడ ఒక పాత తుప్పు పట్టిన సుత్తి కనపడటంతో దానితో కొట్టసాగింది. రాను రాను ఆమె సంకల్పం దృఢపడసాగింది. వాడు లేనప్పుడు రోజూ కొద్దికొద్దిగా ఇటుకల్ని పగలగొట్టసాగింది.

గృహహింస చట్టం వచ్చినా, నిర్భయ, దిశ చట్టాలు వచ్చినా స్త్రీ ధైర్యంగా తన మానాన తన జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం కనిపించటం లేదు నేడు. కత్తి మీద సాములా చదువు ఉద్యోగం చేయాల్సి రావటం దౌర్భాగ్యమనే చెప్పాలి. అనుకోని పరిస్థితుల్లో ఆడపిల్ల అన్యాయమై పోతే సమాజం ఆదరించకపోగా ఈసడిస్తుంది. చివరికి కుటుంబ సభ్యులు కూడా ఇరుగుపొరుగు వారి మాటలకి భయపడి, కన్న కూతుర్ని గుండెల్లో పెట్టుకోలేకపోతున్నారు. ఇక ఆమె చదువు ఉద్యోగం కొనసాగేలా ప్రోత్సహించటం దాదాపు అసాధ్యం. విషయం దాచకుండా చెప్పి పెళ్లి చేయటం, పెళ్లి చేసుకునే వాడు దొరకటం దాదాపు జరగదనే చెప్పాలి.

పాతికేళ్లకే నూరేళ్ల భయంకరమైన అనుభవాల్ని చూసిన ఆమె జీవితం మంచి మలుపు తిరిగిందా? అనేక ప్రశ్నలతో వేధించే వారిని ఆమె ఎదుర్కుందా? చదువుకొనసాగించగలిగిందా? తల్లిదండ్రులు ఆమె జీవితాన్ని ఎలా సరిదిద్దగలిగారు?

అసలు ఆ రాక్షసుడి బందిఖానా నుండి తప్పించుకోగలిగిందా? ఎలా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ నవలను పూర్తిగా చదవాల్సిందే. నా ముందుమాటలో క్లుప్తంగా ఆమె అనుభవించిన క్షోభని, హింసని చెప్పటం అసాధ్యం, అసంపూర్ణం, అమర్యాద. అసమంజసం కూడా.

తొమ్మిది నెలల పాప నుంచి తొంభై ఏళ్ల వృద్ధురాలులో కూడా లైంగిక సుఖాన్ని ఇచ్చే యంత్రాన్ని చూసే నీచులు ఉన్న సమాజంలో తన కాళ్ళ మీద తను నిలబడి జీవితాన్ని, అనేక ఛాలెంజ్ లను ఎదుర్కొని ఆత్మస్థైర్యం ఆమెకు కలదా!

ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా, అప్రమత్తతతో ఉన్నా కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వారిపై జరుగుతున్న హింసని, క్రైమ్‌ని కథలు, నవలలు, సినిమాలు, టీవీల్లో మళ్లీ మళ్లీ చూపిస్తూ ‘గ్లోరిఫై’ చేస్తూనే ఉన్నారు. ఒకరకంగా వారి జీవితాల్ని మరింత ఘోరమైన పరిస్థితుల్లో నెట్టటం అవుతుందది.

కానీ రచనలో చెయ్యి తిరిగిన సీనియర్ రైటర్ అత్తలూరి విజయలక్ష్మి ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోకుండా సస్పెన్స్ పోషిస్తూనే ఒకే రకమైన టెంపోని కొనసాగించారు. మొదలు పెడితే చివరి వరకు చదివించే కథనశైలి ఆమె సొంతం.

మరీ ముఖ్యంగా ముగింపు చాలా ఉన్నతంగా చిత్రించారు. “నేను పిల్లవాడికి తల్లిని. వాడికి నాన్న లేడు” అని మనసారా నమ్మి దృఢంగా చెప్పగలిగిన కథానాయిక, ధీర ‘హరిత’ ఆమె.

కేవలం ఊహాజనితమైన ప్రేమ కథలు, యువతను పెడదోవ పట్టించే, మేఘాల్లో విహరింపజేసే కథలకు కాలం చెల్లిపోయింది. జరుగుతున్న కథలు, యువత తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కథలు చెప్పాలి బాధ్యతగల రచయిత/త్రి. అప్పుడే ఆ రచనకు న్యాయం కలుగుతుంది.

“స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే ప్రేమ మంచి గంధం పరిమళంలా అంగాంగం లోనే కాదు, అంతరంగంలో కూడా వ్యాపించాలి. ప్రేమంటే యాసిడ్ బాటిల్ కాదు.. అత్తరు సీసా. ప్రేమంటే కత్తికి కట్టిన కంకణం కాదు.. రెండు హృదయాలు వేసుకున్న ముడి. అలాంటి ప్రేమ ఇవాళ శాడిస్టుల మనసులో చొరపడి విషవాయువులు ప్రపంచం మొత్తం వ్యాపింప చేస్తోంది. ఈ పరిణామమే.. పవిత్రమైన జీవన విధానాన్ని చెల్లా చెదురు చేసి చెట్టుకొకరు పుట్టకొకరుగా విసిరి వేస్తోంది. ఈ పరిణామమే.. అక్క, చెల్లి, అమ్మ, నాన్న, అన్న, బంధువులు, మిత్రులు అనే బంధాలను తెంచి మనిషిని ఒంటరిని చేస్తుంది. ఈ పరిణామం వలన రేపటి పిల్లలు నాన్న లేని పిల్లలుగా మిగిలిపోతున్నారు. ఇంటిపేరు లేని అనాథలుగా అవుతున్నారు” అంటూ రచయిత్రి ఆధునిక సమాజంలోని దుష్పరిణామాలని ఎండగట్టారు.

ఆడపిల్లల జీవితాల్లో అనుకోకుండా జరిగే అఘాయిత్యాలు ఎలా జరుగుతున్నాయో, దేశంలో విదేశాల్లో ఎంత ఘోరమైన సంఘటనలు సంభవిస్తున్నాయో, వాటికి ఎలాంటి కఠినమైన చట్టాలు ఉన్నాయో వంటి వివరాలు ఇవ్వటం కూడా జరిగింది ఈ నవలలో.

జరుగుతున్న అవాంఛనీయమైన సంఘటనలను చెప్తూనే – ఆడపిల్లలు ఎంత ధైర్యంగా ఆత్మస్థైర్యంగా అడుగులు ముందుకు వేయాలో వివరంగా చెప్పిన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి అభినందనీయురాలు.

~

ప్రొఫెసర్ సిహెచ్. సుశీలమ్మ

రిటైర్డ్ ప్రిన్సిపాల్

పూర్వ ఉప సంచాలకులు

తెలుగు అకాడమీ, ఏ.పి.

***

నాన్న లేని కొడుకు (నవల)
రచన: అత్తలూరి విజయలక్ష్మి
ప్రచురణ: జె.వి. పబ్లికేషన్స్,
పేజీలు: 88
వెల: ₹ 100
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
అచ్చంగా తెలుగు
8558899478 (WhatsApp only)
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు:
https://books.acchamgatelugu.com/product/nanna-leni-koduku/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here