(శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘సాఫల్యం’ నవలని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్)
[dropcap]శ్రీ [/dropcap]పాణ్యం దత్తశర్మ రచించిన తొలి నవల ‘సాఫల్యం’. ఈ నవల తొలుత ‘సంచిక’ వెబ్ పత్రికలో 54 వారాలపాటు సీరియల్‍గా ప్రచురితమైంది. సంచిక పాఠకులను విశేషంగా ఆకర్షించిన ఈ నవల, అనంతరం పుస్తక రూపంలో వెలువడింది.
ఈ నవలలోని కథాకాలం దాదాపు 57 సంవత్సరాలు. అంటే ఒక అర్ధ శతాబ్దం. ఈ కాలంలో సమాజంలో వస్తున్న మార్పులను రికార్డు చేసిందీ నవల. కథానాయకుడు పతంజలి బాల్యంతో మొదలై, వృద్ధాప్యం వరకు సాగి జీవితంలో అతను పొందిన సాఫల్యం ఏమిటో చెప్పేవరకూ సాగుతుంది నవల.
పతంజలి జీవితంలో ఎదుగుతూ ఒదిగిన తీరు, అతని చుట్టూ ఉన్న వ్యక్తుల వృద్ధి, వ్యవసాయ వ్యాపార రంగాలలో చోటు చేసుకున్న మార్పులు, క్రమంగా మారుతున్న విలువలు.. ఇలా అయిదు దశాబ్దాల పాటు ఓ వ్యక్తి జీవితాన్ని, అతనితో పాటు సమాజం పోకడలని ప్రదర్శిస్తుంది ఈ నవల.
పతంజలి పాత్రని ఓ కొడుకుగా, ఓ విద్యార్థిగా, ఓ అన్నగా, ఓ స్నేహితుడిగా, ఓ రైతుగా, ఓ వ్యాపారవేత్తగా, ఓ ట్యుటోరియల్ నిర్వాహకుడిగా, ఓ భర్తగా, ఓ ఉపాధ్యాయుడిగా, ఓ తండ్రిగా, ఓ ఉన్నతోద్యోగిగా పరిశీలిస్తే అతని వ్యక్తిత్వం పాఠకులకి అర్థమవుతుంది.
అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాలలోనూ పతంజలి జీవితం సాగడం వల్ల ఆయా ప్రాంతాల ప్రజల జీవన శైలులు, అక్కడి ప్రజల ఆనాటి స్థితిగతులు ఈ నవలలో వెల్లడవుతాయి.
కొడుకుగా పతంజలి:
పతంజలి తండ్రి మార్కండేయశర్మ. పౌరాణికులు. జ్యోతిష్యుడు. సంస్కృత పండితుడు. తల్లి వర్ధనమ్మ. నవల ప్రారంభం నుంచి పతంజలి తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యే వరకూ ఓ కొడుకుగా అమ్మానాన్నల పట్ల పతంజలి ప్రవర్తన ఆదర్శప్రాయంగా ఉంటుంది. బాల్యంలో తండ్రి అడుగుజాడలలో నడుస్తూ.. అమ్మకి చేదోదుగా ఉంటూ చదువుకుని ఒక్కో క్లాసు పాసవుతూ, పదో తరగతి పూర్తి చేస్తాడు పతంజలి. అక్కడి నుంచి కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారుతుండడంతో మార్పుని అవగతం చేసుకుని ప్రయివేటుగా చదువుతూ, ట్యూషన్లు చెప్తూ కొంత సంపాదించి కుటుంబానికి ఆసరా అవుతాడు పతంజలి. డిగ్రీ పూర్తి చేశాకా, ముందు ట్యుటోరియల్‌తో, తరువాత బ్యాంకు ఉద్యోగంలో నిలకడ సాధించి ఆర్థికంగా లోటు లేకుండా చూస్తాడు.
విద్యార్థిగా పతంజలి:
నవల మొత్తంగా పతంజలి నిత్య విద్యార్థి. ఎందరో గురువులు. వారి నుంచి ఎన్నేన్నో నేర్చుకుంటాడు.
పాఠశాల స్థాయిలో ఆజాం సారు, రాధాసారు, శంకరయ్య సారు లాంటి వారు పతంజలి భావి జీవితానికి పునాది వేస్తే – ఆపై స్థాయిలో పతంజలికి వివిధ ఎకనామిక్స్ చెప్పిన ఇద్రుసుబాష, సంస్కృత పాఠాలలోని మర్మాలను బోధించిన విశ్వేశ్వరశాస్త్రి; స్టేషనరీ షాపుని ఎలా నిర్వహించాలో చెప్పిన విజయవాడ అరుణోదయ ప్రెస్ లెనిన్‌గారు పతంజలి జీవితం మలుపు తిరగడంలో తమ వంతు పాత్ర పోషిస్తారు.
అలాగే పతంజలి అక్క భర్త రామ్మూర్తి – పతంజలి జీవితంలోని ముఖ్యమైన దశల్లో కీలకమైన సలహాలిచ్చి మార్గనిర్దేశం చేస్తాడు. అలాగే ఓ వ్యక్తిగా, ఓ భర్తగా, ఓ తండ్రిగా ఎలా మసలుకోవాలో; ఉన్నంతలో జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో నేర్పుతాడు రామ్మూర్తి.
సోదరుడిగా పతంజలి:
పతంజలి అక్క వైదేహి పెళ్ళి జరిగే నాటికి పతంజలి విద్యార్థి దశలోనే ఉంటాడు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో అక్క పెళ్ళి జరిగిపోతుంది. రామ్మూర్తి బావ పతంజలిని ఆదరించి, అన్ని విధాల సహకరిస్తాడు. ఇక ఇంటి పెద్దకొడుకుగా బాధ్యతలు స్వీకరించిన పతంజలి తమ్ముళ్ళు మంజునాథ, పాణిని, చెల్లెలు మహతి లను చదివించి, వాళ్ళు జీవితాలలో స్థిరపడేందుకు దోహదం చేస్తాడు.
రైతుగా పతంజలి:
నిమ్మతోట సాగులో తండ్రికి సాయంగా వెళ్ళి మెళకువలు గ్రహించిన పతంజలి, క్రమంగా తానే బాధ్యతలు తీసుకుని రైతుగా మారుతాడు. నిమ్మతోట సంరక్షణ, పట్టు పురుగుల పెంపకం, పొలంలో వంకాయలు, టమాటాలు సాగు చేయడం – టమాటాలు విపరీతంగా పండి ధర పడిపోయి, పొలంలోనే నేలలో పోసి ఎరువుగా మార్చుకోడం – ఇవన్నీ వ్యవసాయంలోని సాదకబాధకాలని వివరిస్తాయి.
నిమ్మతోటలో చక్కని కాపు రావడానికి ఎండు చేపల పొట్టు వేయాలని ఎవరో సలహా ఇస్తే గోకర్ణం నుంచి ఎండు చేపల పొట్టు తెప్పించి తోటలో పోయిస్తాడు. రెండు మూడేళ్ళు నిమ్మకాపు పెరుగుతుంది. అయితే తరువాతి కాలంలో తోటని గుత్తకి తీసుకున్నవారు ఎరువుగా ఆముదం చెక్కలు వేయడంతో భూసారం క్షీణించి తోట పాడయిపోయిన వైనం రైతుల వ్యథని చాటుతుంది.
వ్యవసాయదారులకు ఎద్దులు, ఇతర పశువులతో ఉండే అనుబంధాన్ని ఈ నవల గొప్పగా ప్రదర్శిస్తుంది. పతంజలి చేతుల్లో పెరిగిన ‘గణపతి’ అనే కోడెదూడ – పెరిగి పెద్దదయి – ఎద్దుగా మారుతుంది. గణపతిది ఓ ఉపకథలా సాగుతుందీ నవలలో.
మిత్రుడిగా పతంజలి:
నవలలో పతంజలి మిత్రులుగా తారసపడేది తక్కువ మందే. ఎలిమెంటరీ స్కూల్‍లో చదివిన మస్తాన్ అనే మిత్రుడు తరువాతి కాలంలో ఓ లారీ డ్రైవర్‍గా పతంజలికి తటస్థపడతాడు. హైస్కూల్ స్థాయిలో పతంజలికి జూనియర్ అయిన మునికుమార్, క్లాస్‌మేట్ అయిన ఉస్మాన్‌లు తరువాతి కాలంలో తటస్థపడతారు. ఈ ముగ్గురు కలిసి ‘సక్సెస్ ట్యుటోరియల్స్’ అనే కోచింగ్ సెంటర్‍ని విజయవంతంగా నిర్వహిస్తారు. కోచింగ్ సెంటర్‍కి అనుబంధంగా స్టేషనరీ షాపు కూడా పెట్టి ఉపాధి కల్పించుకుంటారు. ముగ్గురు ఒకరికొకరు తోడ్పడుతూ స్నేహధర్మాన్ని పాటిస్తూ జీవితంలో ఎదుగుతారు.
వ్యాపారవేత్తగా, ట్యుటోరియల్ నిర్వాహకుడిగా పతంజలి:
రాధా సార్ సూచనతో కర్నూలులో మిత్రులతో కలిసి ‘సక్సెస్ ట్యుటోరియల్స్’ అనే కోచింగ్ సెంటర్‍ని ప్రారంభిస్తాడు పతంజలి. దాని స్థాపనకి అవసరమైన పెట్టుబడి కోసం బ్యాంకు లోను తీసుకోవడం, భవనం కోసం దేవసహాయం దంపతులని సంప్రదించడం, వివిధ యూనివర్శిటీల పరీక్షలకు హాజరయ్యే వారికి మెటీరియల్ తయారు చేసివ్వడం, స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు నిర్వహించడం, కోచింగ్ సెంటర్‍కి అనుబంధంగా స్టేషనరీ షాపు ప్రారంభించి దాన్ని విజయవంతంగా నిర్వహించడంలో పతంజలిలోని ప్రొఫెషనలిజం, వృత్తి నిబద్ధత పాఠకులకు పరిచయం అవుతుంది.
భర్తగా పతంజలి:
పతంజలి తన మేనత్త కూతురు వసుధని ఇష్టపడడం, వివిధ సందర్భాలలో ఆమెని కలవడం, ఊసులాడడం, పతంజలి దిగులుపడినప్పుడు ఆమె ఓదార్పునివ్వడం – వారి వివాహానికి ముందు ప్రేమకథలా సాగుతుంది. తల్లిదండ్రుల అనుమతితో వసుధని వివాహం చేసుకుంటాడు పతంజలి. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ప్రేమగా, బాధ్యతగా మసలుకుంటూ జీవితాన్ని నందనవనం చేసుకుంటారు. భార్య అభిమతాన్ని గౌరవిస్తూ పతంజలి, భర్త మనసెరిగి మసలుకుంటూ వసుధ – రెండు శరీరాలున్న ఒకే ఆత్మలా మారిపోతారు.
ఉపాధ్యాయుడిగా పతంజలి:
బోధన పతంజలికి కొత్త కాదు. తాను చదువుకుంటున్న రోజుల్లోనే పిల్లలకి ట్యూషన్లు చెప్పి కుటుంబానికి ఆసరా అవుతాడు. కాలక్రమంలో ఇంగ్లీషు లెక్చరర్ అయి ఎన్నో ఊర్లలోని ప్రభుత్వ కళాశాలలలో పిల్లలకి పాఠాలు చెప్తూ – వాళ్ళకి ఇంగ్లీషంటే ఉన్న భయం పోగొడతాడు. అల్లరి చిల్లరిగా తిరిగే విద్యార్థులకు బుద్ధి చెప్పి వాళ్ళు జీవితంలో తప్పటడుగులు వేయకుండా చూస్తాడు. ఇందుకు ఉదాహరణ పలాస కాలేజిలో చదివిన ‘దుర్యోధన’ అనే కుర్రాడు. మొదట్లో దుందుడుకుగా ఉండే ఆ కుర్రాడు తర్వాతి కాలంలో నేవీలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ అవుతాడు.
రిటైర్ అయిన తరువాత – నల్లగొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ సైన్సెస్ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్‌స్కిల్స్ బోధిస్తాడు. అలాగే, సి.వి. రామన్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ కమ్యూనికేషన్ పాఠాలు చెప్తాడు. ఆ పై హైదరాబాద్ పంజాగుట్టా లోని గ్లోబల్ బిజినెస్ స్కూల్‍లో పిల్లలకి ఎన్నో విషయాలు నేర్పుతాడు.
తండ్రిగా పతంజలి:
పతంజలి వసుధ దంపతులకు ప్రద్యుమ్న అనే కొడుకు, ప్రజ్ఞ అనే కుమార్తె పుడతారు. వారిని చక్కగా చదివించి, వారెన్నుకున్న కెరీర్‍లలో రాణించేలా చేస్తాడు పతంజలి. వారి చదువులపై తన అభిప్రాయాలను రుద్దకుండా, వారు చదువుకుంటానన్న కోర్సులలో చేర్పించి పిల్లలతో ఓ స్నేహితుడిలా మసలుతాడు. పిల్లలు ఎదిగి ఉద్యోగాలు చేస్తూ, పెళ్ళి చేసుకుని, తల్లిదండ్రులను ఆనందపరుస్తారు.
ఉన్నతోద్యోగిగా పతంజలి:
చదువైపోయిన తొలి రోజుల్లో ఓ గ్రామీణ బ్యాంకులో క్లర్కుగా ఉద్యోగం వస్తుంది. అక్కడ చేరి బాధ్యతలు నిర్వహించిన పతంజలి తనకి ఆ ఉద్యోగం నప్పదని గ్రహిస్తాడు. కొన్ని రోజులకి తండ్రి అనుమతి తీసుకుని ఆ ఉద్యోగం మానేస్తాడు. తరువాత కొంతకాలానికి లెక్చరర్‍గా ప్రభుత్వోద్యోగం సాధిస్తాడు. ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఇంగ్లీషు లెక్చరర్‍గా పని చేసి విద్యార్థుల, తోటి ఉపాధ్యాయుల గౌరవ మర్యాదలని పొందుతాడు. పాఠాలు చక్కగా చెప్పడమే కాదు, ఇన్విజిలేషన్, పేపర్ వాల్యూయేషన్ బాధ్యతలూ సక్రమంగా నిర్వహిస్తాడు. కాలక్రమంలో ప్రమోషన్ పొంది ప్రిన్సిపాల్ అవుతాడు. ఆపై ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ డైరక్టర్ స్థాయికి ఎదిగి ఉన్నతోద్యోగిగా రాజీపడకుండా కర్తవ్య నిర్వహణ కొనసాగిస్తాడు. అత్యంత నిజాయితీతో ఉద్యోగ జీవితం కొనసాగించి, తృప్తిగా పదవీ విరమణ చేస్తాడు.
సమాజంలోని మార్పులు:
నవలలో కాలం గడిచే కొద్దీ సమాజంలోనూ, వ్యక్తుల విలువల్లోనూ వచ్చే మార్పులు స్పష్టమవుతాయి. ఒకప్పుడు తోటివారికి ఏ ప్రతిఫలమూ ఆశించకుండా సాయం చేసేవారు. నిస్వార్థంగా, నిరాడంబరంగా ఉంటూ సంతోషంగా ఉండేవారు. కానీ నవల కథాకాలంలోని చివరి రెండు దశాబ్దాలలో మనుషుల ప్రవర్తనలో ఆడంబరాలు ఎక్కువయి, స్వార్థం పెరగడం పాఠకులు గమనిస్తారు. డిగ్రీ చదువుతున్నప్పుడు పతంజలికి ఎకనామిక్స్ నేర్పిన ఇద్రూస్‌బాష ఉదంతం; పతంజలి ఇంటర్మీడియట్ బోర్డులో ఉద్యోగిగా ఉన్నప్పుడు – పేపర్ ప్రకటనలు ఇచ్చే క్రమంలోని లోపాయికారి వ్యవహారాలు – సమాజంలోని మార్పుని కళ్ళకి కడతాయి.
అలాగే ఓ చోట సిఫార్సు కోసం వెడితే, ఓ పెద్దాయన – ‘నీ ప్రతిభపై నమ్మకం ఉంచు; ఇలా పక్కదార్లు తొక్కాల్సిన అవసరం లేదు’ అని పతంజలికి చెప్పిన వృత్తాంతం – నేటి సమాజపు అవలక్షణాన్ని గుర్తు చేస్తుంది.
నిమ్మతోటని గుత్తకి ఇవ్వడం, గుత్తేదారు ప్రవర్తన మొదలైనవి వ్యవసాయంలోకి జొరబడిన మార్పులని తెలుపుతాయి.
మనుషుల్లో ఎక్కువ తక్కువలు పాటించని పతంజలి:
సమాజంలో పాతుకుపోయిన ఎక్కువ తక్కువ భావలనని పట్టించుకోడు పతంజలి. పొలంలో తన సహాయకులు తోకోడు, సుంకన్నలతో ఎంతో సన్నిహితంగా మసలుకుంటాడు. వాళ్ళ తిండి తింటాడు. అలాగే ఆజాం సారు ఇంట, బాజిరెడ్ది ఇళ్ళల్లో ఎలాంటి న్యూనతా భావాలకి లోనుకాకుండా వాళ్ళ పద్ధతులని గౌరవిస్తూ – వాళ్ళు పెట్టింది తృప్తిగా తింటాడు పతంజలి. మనుషుల మధ్య దగ్గరితనం కోరుకునే స్వభావం పతంజలిది.
నవలలో మినీ ట్రావెలాగ్:
కథానుగుణంగా పతంజలి తన ఊరి నుంచి ఇతర ప్రదేశాలకు చేసిన ప్రయాణాలను మినీ ట్రావెలాగ్‍గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాజిరెడ్డితో కలిసి గోకర్ణం వెళ్ళిన ఉదంతం ఆధునిక ట్రావెలాగ్‍లకు ఏమీ తీసిపోదు. తడిది అనే ఊరికి వెళ్ళే క్రమంలో “ఊరు దాటగానే సముద్రం. ఇద్దరూ సముద్రాన్ని చూడటం అదే ప్రథమం. ఆ అనంత జలరాశి వాళ్లను చకితులను చేస్తూంది. రోడ్డుకు ఒక వైపు సముద్రం. ఒక వైపంతా కొబ్బరి తోటలు.” అని రాస్తారు రచయిత. పాఠకుల కళ్లముందు ఆ దృశ్యం కదలాడుతుంది. అక్కడ ముచికుందప్ప దంపతుల ఆతిథ్యం, వారి జీవన శైలి – పైన ప్రస్తావించుకున్న నిరాడంబరత, సంతృప్తికరమైన జీవనవిధానానికి నిలువెత్తు ఉదారహణలు. ప్రకృతిని ఆస్వాదిస్తూ, మనుషులని గమనిస్తూ, వారి ఆనందాలని విచారాలని గ్రహిస్తూ, ఎంతో కొంత నేర్చుకుంటూ సాగుతాయి ఈ ప్రయాణాలు. టూరిస్టుగా కాక ట్రావెలర్‍గా పతంజలి పాఠకులను ఆయా ప్రాంతాలలో తిప్పుతాడు, అక్కడి మనుషులతో మమేకం చేయిస్తాడు.
ప్రశ్న – జవాబు:
జీవితంలో అన్ని రకాల పాత్రలు నిర్వహించి విశ్రాంత స్థితికి వచ్చాకా, పతంజలి బుర్రలో ఓ ప్రశ్న ఉదయిస్తుంది – ‘జీవిత సాఫల్యం’ అంటే ఏమిటి? అది ఎలా సిద్ధిస్తుంది? అని. దాన్ని తెలుసుకునే క్రమంలో ఎన్నో ఆలయలు తిరుగుతాడు, ఎన్నో పుస్తకాలు చదువుతాడు. కానీ జవాబు దొరకదు. ఈ అన్వేషణలో కుటుంబ సభ్యులతో సరిగ్గా గడపక మనశ్శాంతికి దూరమవుతాడు. గాణగాపురం దత్తక్షేత్రానికి వెళ్తాడు. అక్కడ దర్శనం అయ్యాకా, గుడి ఆవరణలో కూర్చుని ఉండగా, కృత్తివాస్‌ముఖర్జీ అనే పెద్దాయన పరిచయం అవుతారు. సాఫల్యమనేది వైయక్తికమని ఆయన చెప్తారు. పతంజలి సందేహాలని తొలగించి అతని మనసులోని నిర్వేదాన్ని దూరం చేస్తారు (ఈ ఎపిసోడ్ లోని ప్రశ్నలు జవాబులు ఎవరికైనా వర్తిస్తాయి).
తేలిక పడిన మనసుతో ఇంటికి తిరిగివచ్చిన పతంజలికి మనవరాలు పుట్టడం, ఆ పాపకి ‘సాఫల్య’ అని పేరు పెట్టడంతో నవల ముగుస్తుంది.
నవలలో ఎన్నో పాత్రలు తారసపడతాయి. ఏదో రకంగా పతంజలి జీవితాన్ని స్పృశిస్తాయి. పాఠకుల మనసులపై చెరగని ముద్ర వేస్తాయి. మొత్తానికి ఒకసారి మొదలుపెడితే, ఆపకుండా చదివింపజేస్తుందీ నవల.
***
సాఫల్యం (నవల)
రచన: పాణ్యం దత్తశర్మ
ప్రచురణ: సదరన్ స్ప్రింగ్స్ పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్
పేజీలు: 584
వెల: ₹ 475
ప్రతులకు:
ప్రచురణకర్తలు
9100942260, 9100942275