సమాజం పోకడలపై సింగీతం గారు సంధించిన సెటైరాస్త్రం ‘క రాజు’ కథలు

3
5

[box type=’note’ fontsize=’16’] “ఇప్పటి సమాజం పోకడల మీద సింగీతం గారు సంధించిన సెటైరాస్త్రం ఈ ‘క రాజు’ కథలు. ఇందులో 21 కథలున్నాయి. జీవిత సత్యాలని తేలిక మాటల్లో చెక్కి, వాటిని హాస్యపు తొడుగులలో చుట్టి కథలుగా అచ్చేసిన పుస్తకమిది” అంటూ ఆ పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు పి.టి.ఎస్.కె. రాజన్. [/box]

[dropcap style=”circle”]సిం[/dropcap]గీతం శ్రీనివాసరావు గారు… ఈ పేరు వినగానే కొందరికి  ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాలు గుర్తుకువస్తాయి. ఇంకొందరికి  పుష్పక విమానం, విచిత్ర సోదరులు, అమావాస్య చంద్రుడు, మైఖేల్ మదన కామరాజు గుర్తుకువస్తే, మరికొందరికి మయూరి, పంతులమ్మలు గుర్తుకువస్తాయి. మొత్తంగా చూస్తే భారతీయ సినిమాని వైవిద్యభరితమైన మార్గాలలో కొత్తపుంతలు తొక్కించి ఘన విజయాలు అందుకున్న దిగ్దర్శకుడాయన. సింగీతం గారి సినిమాలలో గీతం, సంగీతం కూడా ఉత్తమ స్థాయిలోనే ఉంటాయి. వరుస విజయాల దర్శకుడు క్రిష్, ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ వంటి ఎందరో దర్శకులకు స్ఫూర్తి మూర్తీ ‘సింగీతం’గారే. ఇప్పుడున్న పాత, కొత్తతరం దర్శకులలో సింగీతంగారితో సరిపోలే స్థాయి ఉన్నవారిని చూపించడం కొంచెం కష్టమేనేమో!

ఎనభై యేడేళ్ళ వయస్సు అన్నది ఆయనకు అస్సలు పట్టని విషయం. బహుశా అదే ఆయన ఆరోగ్య రహస్యం. ఈ-టీవి ‘పుష్పక విమానం’ కార్యక్రమంలో ఆయన తన సినిమా సంగతులు చెప్పే విధానం చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఆయా సినిమాలకు తనతో కలిసి పనిచేసిన టెక్నీషియన్స్‌ని తలచుకుంటూ, వారు తన సినిమాల విజయాలకు ఎలా భాగస్వాములయ్యారో వివరించే తీరు ఆయన వినమ్రతకు, స్వచ్ఛమైన హృదయానికి అద్దం పడుతుంది.

“మీ సినిమాలకు మీరే మాటలు రాస్తే బావుంటుంది” అని జంధ్యాల గారు నాతో చాలాసార్లు చెప్పారు. ఆయన మాటల్ని కాదనలేక ‘పుష్పక విమానం’ తీశాను” అన్న చతురత సింగీతం గారిది. ఇటువంటి హాస్య చతురుడు కథా రచనకు పూనుకుంటే మరి ఆ కథలకు హాస్యం అంటకుండా ఎలా ఉంటుంది? ఒకలా చెప్పాలంటే ఇప్పటి సమాజం పోకడల మీద సింగీతం గారు సంధించిన సెటైరాస్త్రం ఈ ‘క రాజు’ కథలు. ఇందులో 21 కథలున్నాయి. ఒక్కో కథా ఒక్కో తీరుగా చిరుమందహాసాల, మందహాసాల మార్గాలలో సాగుతుంది. ప్రతీ కథ చివరా ‘క రాజు’ తన మంత్రికి చెప్పే విషయాలన్నీ మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ధర్మసూక్ష్మాలే.

జీవిత సత్యాలని తేలిక మాటల్లో చెక్కి, వాటిని హాస్యపు తొడుగులలో చుట్టి కథలుగా అచ్చేసిన పుస్తకమిది. ఈ పుస్తకం నాకు నచ్చడానికైనా, మీకూ నచ్చుతుంది అనడానికైనా ఇంతకుమించి కారణమేముంటుంది!!

***

ఒకప్పుడు అమ్మమ్మలు చెప్పే కథలు అనగనగా ఒక రాజు గారుండేవారని మొదలయ్యేవి. ఆ రాజు పేరు అమ్మమ్మలు చెప్పేవాళ్లూ కాదు, వినే పిల్లలు అడిగేవాళ్లు కాదు. కథ బాగుంటే చాలు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. కథ ఎలా ఉన్నా రాజు పేరేంటని అడుతారు. పెద్ద పేరున్న రాజైతే ఎగబడి వింటారు. లేకపోతే దాని దరి దాపుల్లోకి కూడా రారు. అందుకే మన రాజుకి ఏదో ఒక పేరు పెట్టాలి కనుక క్లుప్తంగా ‘క’ అని పెట్టుకుందాం అంటూ ‘క’ రాజు పేరు వెనుక కథతో మొదటి కథ ‘ఆరోహణ క్రమం’ మొదలౌతుంది.

  1. మయ సభంత గొప్పగా ఓ భవనం నిర్మించాలనుకుంటాడు ‘క రాజు’. గొప్పగొప్ప కళాకారులెందరో ఆ నిర్మాణంలో పాల్గొంటారు. భవనం పైకప్పున ఉన్న కలశానికి రంగువెయ్యడం మినహా మిగతా పనంతా పూర్తవుతుంది. భవన నిర్మాణంలో పాల్గొన్న కళాకారులందరిలో మేటి అయినవాడే ఆ కలశానికి రంగు వెయ్యాలన్నది రాజు గారి అభిమతం. కళాకారుల వడబోత స్వయంగా చేస్తారు ‘క రాజు’ గారు. చివరి జాబితాలో నిలచిన ఇద్దరు అన్నదమ్ములలో, అన్నని మేటివానిగా ఎంపిక చేస్తారు. అయితే అందరి అంచనాల ప్రకారం మేటి అనుకున్న తమ్ముని కాదని, అన్నని ఎందుకు ఎంపిక చేశారన్న మంత్రి గారి ప్రశ్నకు ‘క రాజు’ చెప్పిన సమాధానంతో కథ పూర్తవుతుంది. కథంతా సరదాగా సాగుతుంది. ముగింపు గంభీరమైన సత్యాన్ని చెబుతుంది.
  2. ‘క రాజు’ కి తన పక్క రాజ్యాల్లో పాలన ఎలా జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. అనుకున్నదే తడవుగా మారువేషాలలో ప్రక్క రాజ్యమైన సింగన్నపురం వెళతారు రాజు, మంత్రి. ఆ సమయంలో అక్కడ రాజుగారి ఆధ్వర్యంలో ఒక వినోద ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. పోటీలో నెగ్గినవారికి రాజు గారు స్వయంగా తన రత్నాల హారం బహూకరిస్తారని ప్రకటిస్తారు. కానీ ఎంతసేపు గడుస్తున్నా ఒక్కరు కూడా గెలవలేక పోతుంటారు. చివరికి మారువేషంలో ఉన్న ‘క రాజే’ రంగంలోకి దిగి విజయం సాధిస్తాడు. అంతమంది చెయ్యలేని పని మీరెలా సునాయంగా చేశారని అడుగుతాడు మంత్రి తమ తిరుగు ప్రయాణంలో. రాజు తన గెలుపు రహస్యం చెబుతాడు. ‘క రాజు’ చెప్పిన ఆ రహస్యం ఆటలోనే కాదు, జీవితంలో కూడా మనల్ని గెలిపిస్తుంది. ఇది ‘పురోగమనం’ కథ.
  3. ‘తుంబుర శాస్త్రి’ కథ ఎన్నదగిన తెలుగు కథల్లో ఒకటని ఏ అనుమానం లేకుండా చెప్పొచ్చు. ఏది ఉత్తమ సంగీతం అని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన సభలో, అనుకోని రీతిలో జనామోదం పొందుతాడు తుంబురశాస్త్రి. ఆ తరువాత శాస్త్రి గారికొచ్చిన అవస్థలేమిటి, గాడిదకి, ఆయనకి ఏమిటి సంబంధం, చివరికేమయ్యింది అన్నది చదివి ఆనందించాలి. తరువాత, సింగీతం గారు ‘క’ రాజుతో ఈ సెటైర్ కథ ఎందుకు చెప్పించారో ఆలోచించి అబ్బురపడాలి.
  4. ‘క రాజు’ తన రాజ్యంలో ఉండే నరనారాయణుల దేవాలయాలకు కొత్త పూజారులను నియమించాలనుకుంటాడు. ఆ పని తన మంత్రికి, ధనపాలుడనే అధికారికి అప్పగిస్తాడు. నారాయణుడి ఆలయానికి కేశవశర్మనే మహా వేదవేదాంతసాధ్వాయిని మంత్రి నియమిస్తే, నరుడి ఆలయానికి ప్రసాదాలు చేసుకొనే నారాయణశర్మని ధనపాలుడు నియమిస్తాడు. కాలక్రమంలో నరుడి ఆలయానికి ఉధృతమైన ఆదరణ లభిస్తే, నారాయణుడి ఆలయం వెలవెలబోతుంది. కారణం ఏమిటన్నదే ముగింపు. ఈ ‘భజన విజయం’ ఏకాలంనాటికీ పాతబడని నిత్యనూత్నమైన కథ.
  5. ‘ఉత్తరజిత్తు – దక్షిణజిత్తు’ సమాజం ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించే కథ. సంతోషాన్ని అమ్మే స్వాముల కథ. సుఖదుఃఖాలు తీపి,చేదు అనుభవాలవంటివని, అవి మనకి ఉండటం ముఖ్యం కాదు; అవి ఉన్నప్పుడు కలిగే అనుభవాలే ముఖ్యం అంటూ ఉత్తరజిత్తు ప్రజలకు ఉపదేశాలిస్తూ సంతోషాన్ని అమ్ముతుంటాడు. మరి ఆ సంతోషాన్ని కొనుక్కుని జనం నిజంగానే సంతోషించారా? ప్రజలు సంతోషిస్తే మంత్రి ఎందుకు ఆదుర్దా పడినట్టు? ‘క’ రాజు దక్షిణజిత్తును ఎందుకు పిలిపించినట్టు? ఈ ప్రశ్నలకు సమాధానాలతో కథ ముగుస్తుంది.
  6. ఒకానొకప్పుడు ‘క రాజు’ కి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ప్రతీ సంవత్సరం తనదేశంలో ఉన్న ముగ్గురు ప్రతిభావంతులని ఎంపిక చేసి వారినొక ప్రశస్తమైన బిరుదనామంతో సత్కరించాలన్నదే ఆ ఆలోచన. అయితే ఆ బిరుదు అన్ని రంగాలకూ సరిపోయేదిగా ఉండాలన్నది ‘క రాజు’ కోరిక. తర్జనభర్జనలనంతరం “గొప్పవాడ”నే బిరుదు నామాన్ని ఖాయం చేస్తారు రాజు గారు. అప్పటి నుండి దేశంలో గొప్పవాడు బిరుదాంకితులందరూ మా గొప్పగా గౌరవమర్యాదలను పొందుతూ ఆనందంగా ఉంటూ ఉంటారు. అయితే ఒక వంటవాడి కొడుక్కి చమత్కారానంద స్వాములవారు “గొప్పవాడ”ని నామకరణం చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ గొప్పవాడు అనే జన్మనామధేయుడుతో, గొప్పవాడు బిరుదునామధేయులకు వచ్చిన చిక్కేమిటి? చివరికి రాజు గారు ఆ సమస్యను ఎలా పరిష్కరించారన్నదే “గొప్పవాడు” కథ.
  7. ‘క రాజు’ రాజ్యంలో ఉన్న తూర్పుపేటలో రెండు తెగలు. కోరమీసాల కోటయ్య, మిడిగుడ్ల సిద్ధయ్య ఆ తెగలకు నాయకులు.అందరికీ వీరంటే భయం. వీరిద్దరికీ నాటకాలంటే మక్కువెక్కువ. నవరాత్రులలో రావణాసురుడి వేషం కట్టడానికి ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఇంకొకరు అన్నీ సిద్ధం చేసుకుంటారు. నాటకాల్లో పైచేయి కోసం వాళ్లు అనుసరించాలనుకున్న కర్కశమైన ఆలోచనలు తెలుసుకున్న జనం మంత్రి గారిని వేడుకుంటారు. మంత్రి ప్రార్థనపై ‘క రాజు’ ఒక ఉపాయం చెబుతాడు.ఆ ఉపాయం ఫలించి నాటకం పూర్తవగానే కోటయ్యకు, సిద్ధయ్యకు జనం బ్రహ్మరథం పడతారు. ఇదీ ‘వేషాల భాష’ కథ.
  8. ఇక తరువాయి కథ ‘నిజాల గోడ’. ప్రజల కష్టనష్టాలు తెలుసుకోవడానికి సన్యాసుల వేషాలలో ప్రయాణం కడతారు రాజూ, మంత్రి. గోపాలాచారనే దురదృష్టవంతుడొకడు వాళ్లకి ఎదురవుతాడు. అతనికి తనకంటూ ఒక స్థలం, అందులో ఒక ప్రహరీ గోడ తప్ప మరేమీలేదని తెలుకుంటారు. అతని కష్టం తెలుకున్న ‘క రాజు’ అతనికొక ఉపాయం చెబుతాడు. సన్యాసి వేషంలో ఉన్న రాజు గారి మాట మీద నమ్మకంతో తన గోడను ఆయన చెప్పినట్టే ఉపయోగిస్తాడు గోపాలాచారి. అంచెలంచలుగా అతనికి, పేరు, రాబడీ కూడా రావడం మొదలవుతుంది. అయితే వక్రించిన అతని బుద్ధివల్ల జనానికి ఇబ్బందులు మొదలవుతాయి. మంత్రి ‘క రాజు’ని పరిష్కరం కోసం అర్థిస్తాడు. కేవలం నిజాలో లేక అబద్దాలో చెప్పేవాళ్లు పెద్దగా ఎదగలేరని, నిజంలాంటి అబద్దాలు చెప్పేవారే ఎత్తుకు ఎదగగలరని, ఇదే లోక స్వభావమని ‘క రాజు’ మంత్రికి ఉపదేశిస్తూ ఒక ఉపాయం చెబుతాడు. ‘క రాజు’ మంత్రికి చెప్పిన ఉపాయం అమలుచేయడంతో పరిస్థితి యథాతథ స్థితికి వస్తుంది.
  9. చెంచయ్య అనే పశువుల వ్యాపారికి, ఆ రంగంలో పోటీ ఎక్కువవ్వడం వల్ల చిలుకలను తెచ్చి అమ్ముదామని ప్రయత్నిస్తాడు. ఎవరూ అంతగా ఆసక్తి చూపకపోయేసరికి, వాటికి మాటలు నేర్పాలనే నిశ్చయానికి వస్తాడు. ముందుగా చిలుకలకు పొగడ్త మాటలను నేర్పుతాడు. ఆ చిలుకలను జనం ఎగబడికొంటారు. కొంతకాలానికి ఇంకొన్ని చిలుకలకు తిట్లు నేర్పుతాడు. కానీ వాటిని కొనడానికి ఎవరూ ఆసక్తి చూపరు. వాటిని ఎలా అయినా వదిలించుకోవాలని, మంత్రి సలహాతో వాటిని మాజీ నేరస్థులుండే మంచివాళ్ల పేటలో వదులుతాడు. విచిత్రంగా వాళ్లు అప్పటినుండి మళ్లీ యథేచ్ఛగా నేరాలు మొదలు పెడతారు. మంత్రి వేడుకోలుతో ‘క రాజు’ కొన్ని చిలుకలకు ఒక చిత్రమైన మాట నేర్పి వదలమని సలహా ఇస్తాడు. ఆ ఉపాయం పారడంతో పరిస్థితి పూర్తిగా చక్కబడుతుంది. మంత్రి హాయిగా ఊపిరి పీల్చుకుంటాడు.
  10. ఏదుటి వాడికి తగ్గట్టుగా తాళం వేయగలిగినవాడే ప్రతిభావంతుడు. ఆనాడైనా ఏనాడైనా ఎవరైనా పైకి రావలంటే నేర్చుకోవాల్సిన తాళమిదే అన్న ‘క రాజు’ ఉవాచ వెనక ఉన్న కథే ఈ ‘ఆది తాళం’. సంగీతంలో తాళానికి, తాళంకప్పలో ఉన్న తాళానికి భేదం గుర్తించకపోవడంతో కథలో వినోదం మొదలవుతుంది. ఆదిశంకరభట్టు పన్నులమీద పన్నులు వేసే ఆర్థికాధికారి. అతనికి కచేరీలు ఇవ్వాలన్నది ఆకాంక్ష. బ్రహ్మయ్య కళ ఏమాత్రం ఒంటబట్టని మృదంగ విద్వాంసుడు. బ్రహ్మయ్య సహాయంతో వ్యాపారస్థులు తమ పన్నుల తిప్పలనుండి ఎలా తప్పించుకున్నారన్నదే కథ.
  11. తన మేనల్లుడైన సర్వజ్ఞుడిని సర్వ విద్యాపారంగతుడిగా చేసి అప్పుడు రాజాస్థానంలో ఉద్యోగం వచ్చేలా చేయాలనుకుంటాడు మంత్రి. అందుకు వ్యాకరణాది శాస్త్రాలు నేర్చుకోవడానికి వారణాసి, చిత్రలేఖనాది కళల అభ్యాసానికి ఉజ్జయిని, సంగీతంలో ప్రావీణ్యం కోసం విజయనగరం వెళ్లిరమ్మని పంపిస్తాడు. తీరా అన్నిచోట్లా విద్యాభ్యాసం ముగించుకొని తిరిగివస్తున్న మేనల్లుడి నైపుణ్యం సంగతి చారుల ద్వారా విని అవ్వాకవుతాడు మంత్రి. అసలు సర్వజ్ఞుడు వెళ్లిన చోటల్లా ఏమి నేర్చుకున్నాడు? అతని ప్రతిభకు తగినదిదే అని ‘క రాజు’ గారు సర్వజ్ఞుడికి ఆస్థాన విమర్శకుడి పదవి ఇవ్వడానికి కారణమేమిటన్నదే “ఆస్థాన విమర్శకుడు”కథ.
  12. ‘క రాజ్యం’లో శ్రీమంతులైన భూపతిరాజు, శ్రీపతిరాజులు ప్రజలచే ఎన్నుకోబడే ప్రజాప్రతినిధి పదవి కోసం పోటీ పడతారు. వారి ప్రధాన అనుచరులైన దానయ్య, శీనయ్యలు తమ నాయకుల గెలుపు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల పర్యవసానంగా మంచినీళ్ల చెరువు రంగుల చెరువుగా మారిపోతుంది. దానికి కారణమేమిటి? చివరికి భూపతిరాజు, శ్రీపతిరాజులలో ఎవరైనా గెలిచారా? దానయ్య, శీనయ్యలు చివరికి ఏమయ్యారన్నదే ‘రంగుల చెరువు’ కథ.
  13. ‘క రాజ్యం’లో అత్యున్నత ప్రతిభాశాలురకు ఇచ్చే “రాజరత్న” బిరుదుకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి అయిదుగురు పెద్దమనుషులతో ఒక కూటమిని ఏర్పాటు చేస్తాడు మంత్రి. వంద పుస్తకాలో, వంద నాటకాలో, వంద కచేరీలో ఇలా ఏదైనా పనిని వందసార్లు జయప్రదంగా చేసిన వారికి ఆ బిరుదు ప్రదానం చెయ్యాలని కూటమి నిర్ణయిస్తుంది. చివరికి ఆ బిరుదు ఎవరిని వరించిందన్నదే కథ. ఈ ‘వందనాలు’ కథలో నేటి కళాధర్మం ఏమిటో, ప్రజలు ఎలాంటి వారి కళలను మెచ్చుకుంటారో ‘క రాజు’ మంత్రికి చేసిన ఉపదేశమే ముగింపు.
  14. తన రాజ్యంలోని యువకుల భాషోచ్ఛారణ చాలా పేలవంగా ఉందని తెలుసుకుంటాడు ‘క రాజు’. తక్షణమే రాజు గారి ఆజ్ఞానుసారం సంభాషణా పాఠశాలను ప్రారంభిస్తాడు మంత్రి. ప్రధానబోధకునిగా భాషాశాస్త్రి నియమితుడవుతాడు. ఆ పాఠశాల భవనం దాత కుమారుడు చంద్రగుప్తుని పర్యవేక్షణలో చివరికి ఈ ప్రహసనం ఎలా ముగిసిందన్నదే ‘పలుకుబడి’ కథ.
  15. పాపం అనబడే పానకాల పద్మనాభానికి తానో గొప్ప నాటక కర్తగా వెలిగిపోవాలని కోరిక. అయితే అతని నాటకానికి ఒక్కరంటే ఒక్కరూ పాపమని కూడా పోరు. తన అవస్థకు తానే అయ్యో పాపం అనుకుంటుంటాడు. ఇంకొకవైపు మహేంద్ర వర్మ అనే బట్టల వ్యాపారస్తునికి వ్యాపారంలో నష్టాలు పెరిగిపోవడంతో తనని లాభాలబాట పట్టించేవాని కోసం ఎదురు చూస్తుంటాడు. పాపం, మహేంద్ర వర్మల అవస్థలు తీర్చడానికి వ్యాపార వైద్యుడుగా పేరుపడ్డ మహరాజనే మారుపేరు కల కన్నయ్య సిద్ధపడతాడు. వీరికి కీర్తిని, లాభాన్ని ఆర్జించి పెట్టడంలో మహరాజు ఎలాంటి పథకాలు వేసి సఫలీకృతుడయ్యాడన్నదే ‘వ్యాపార వైద్యుడు’ కథ.
  16. ‘క రాజ్యం’లో ఉన్న అవినీతి అధికారుల చిట్టా తయారు చేయిస్తాడు మంత్రి. ఈ విషయం చెప్పడానికి రాజు గారి దగ్గరకు వెళతాడు. ఈలోగా ఉత్తర భారతదేశం నుండి అత్తరు వ్యాపారి కూడా రాజు గారి సందర్శనానికి వస్తాడు. ఒక్కసారి పూసుకుంటే ఆరు నెలలు వరకూ వంటికి పట్టిన సువాసన వదలని అత్తరు, రాజుకి కానుకగా ఇస్తాడు వ్యాపారి. రాజు క్షణమాలోచించి అత్తరు వ్యాపారిని న్యాయాధీశుని కలిసి ఈ అత్తరు కోసం చెప్పమంటాడు. న్యాయాధీశుని కలవమని చెప్పడంలో ‘క రాజు’ ఆంతర్యం ఏమిటి? న్యాయాధీశుడు ఆ అత్తరుతో ఏం చేశాడన్నదే ‘అత్తరు శిక్ష’ కథ.
  17. తన స్నేహితుడైన పొరుగు రాజ్యం రాజు శివరాజు కొడుకు పెళ్లికి మంత్రితో కలిసి వెళతాడు ‘క రాజు’. అక్కడ స్వాగత సత్కారాలన్నీ ఎడమ చేతి వాటంతోనే చేస్తుంటారందరూ. విషయం ఆరా తీసి నివ్వెరపోతాడు ‘క రాజు’. అసలు ఆ ఎడమచేతి వాటం అనే పెట్టుడు అలవాటు ఆ రాజ్యంలోని వారికి ఎలా అలవాటయ్యింది, పెళ్ళికొడుకైన యువరాజు సలహాదారుడికి దీనికి ఏమిటి సంబంధం? చివరకి ఏమయ్యిందన్నదే ‘కుడి ఎడమైతే’ కథ.
  18. భవిష్యత్తరం అవసరాలకోసం ప్రఖ్యాతులైన రాజోద్యోగులను తయారుచెయ్యాలనుకుంటాడు మంత్రి. అసలు ప్రఖ్యాతులు అంటే ఎవరు అనే సందేహం వస్తుందతనికి. జనం మెచ్చినవాడే ప్రఖ్యాతుడని సమాధానపడతాడు. నటులు కంటే జనం మెచ్చే ప్రఖ్యాతులుండరు కనుక యువనటులకు పోటీలు పెట్టాలని నిర్ణయిస్తాడు. చివరికి జనం మద్దతు ఉన్న ఆడంబర వర్గం, విజ్ఞుల మద్దతు ఉన్న ప్రతిభావంతుల వర్గంగా పోటీదారులు చీలిపోతారు. ఇప్పుడు ఎంపిక ఎలా చెయ్యాలో తెలియక ‘క రాజు’ని శరణువేడతాడు మంత్రి. రాజు సలహాతో సమస్య పరిష్కారమవుతుంది. ‘కుమార సంబరం’ అనే కథ ఇది.
  19. “చెడ్డవాళ్ల ఆలోచనలన్నీ చేతల్లో ఉంటాయి. మంచివాళ్ల చెడ్డ ఆలోచనలన్నీ వాళ్ల మనసుల్లోనే ఉంటాయి” అని ‘క రాజు’ ప్రబోధంతో ‘మర్కట సూత్రాలు’ కథ ముగుస్తుంది. ఇంతకీ కథాశీర్షికైన ఆ మర్కట సూత్రాలేమిటి? నీతి నాటకాల నీలకంఠయ్య నీతి నాటకాలతో పాటు తెరమాటున శృంగారపరమైన నాటకాలెందుకు రాశాడు అన్నదే కథ.
  20. ‘క రాజ్యం’ లోని శంకరగిరిలో చిన్న చిదంబరం అన్న పేరుగాంచిన శివాలయం ఉంది. భూములూ, పాడి సమృద్ధిగా ఉన్న ఆ ఆలయానికి ధర్మకర్త అవ్వాలనుకుంటాడు కాళహస్తి కనకలింగయ్య. అందుకోసం అప్పటికి ధర్మకర్తగా ఉన్న కాశీవిశ్వనాథయ్యతో ఎన్నికల్లో పోటీ పడి నెగ్గుతాడు. ఓడిన కాశీవిశ్వనాథయ్య తనకు శివుడు కలలో కనపడి కాశీ వెళ్లిపొమ్మన్నాడని చెప్పి వెళ్లిపోతాడు. తీరా చూస్తే గుడి ఆస్తులన్నీ తాకట్టులో ఉంటాయి. కాశీవిశ్వనాథయ్యకు ముందు ధర్మకర్త కూడా శివుడు చెప్పాడని కాశీ వెళ్లిపోయినవాడే. ఆ పరిస్థితుల్లో కనకలింగయ్య ఏంచేశాడు? ఈ ధర్మకర్తలు కాశీకి వెళ్లారా లేక మధ్యలో ఎక్కడన్నా మజిలీ చేశారా? ఈ కాశీ మజిలీలను ఆపడానికి ‘క రాజు’ మంత్రికి చెప్పిన ఉపాయం ఏమిటి అన్నదే ఈ ‘కాశీమజిలీ’ కథ.
  21. రాతిబండ రత్తయ్య పురపాలకాధికారిని తలమీద కర్రతో కొట్టడంతో అతనికి అయిదు సంవత్సరాలు కారాగార శిక్ష పడుతుంది. అయితే ఇందులో ఏదో మతలబు ఉందని తలుస్తారు ‘క రాజు’ గారు. అనుకున్నదే తడవుగా మంత్రి గారితో కలిసి మారువేషంలో బయలుదేరతారు. రత్తయ్యను కలుసుకొని విచారిస్తే కొంత నిజం బయటికొస్తుంది; మిగతా నిజం రత్తయ్యకూ తెలియదు. అతనిచ్చిన వివరాలను బట్టి భీమరాజును కలుస్తారు. అక్కడా అతనికి తెలిసింది సగం నిజమే. అక్కడ నుండి మళ్లా అతనిచ్చిన వివరాలతో నారాయణగుప్త ఇంటికి వెళతారు. అక్కడా అతనికి తెలిసింది అర్థ సత్యమే. అసలు చివరికి తేలిన పూర్తి సత్యమేది? అపరాధి ఎవరు అన్నదే కథ. ఇదే ఈ సంపుటిలోని ఆఖరు కథ అయిన ‘బాదరాయణ సంబంధం’.

ఇదీ టూకీగా “క రాజు” కథల పరిచయం.

“లక్ష్మణాచారి భార్యను ఉర్మిళలా నిద్రపోనిచ్చి, పక్క ఊళ్ళోని దేవయానికి నిద్రలేకుండా చేస్తున్నాడు” వంటి సరసమైన మాటలు, “ప్రపంచంలో అందరికీ కావలసింది, అందరూ అడిగేది, అందరూ ఇచ్చేది, ఎవ్వరూ తీసుకోనిది ఒక్కటే – ‘సలహా’” వంటి నిఖార్సైన సత్యాలు, “ఏ పనీ చేతగాని వాడికైనా చేతనయ్యే ఒకే ఒక్క పని విమర్శించడం” వంటి విసుర్లు, ఈ కథల నిండా నిండుగా ఉంటాయి. ఇక కథల్లో పాత్రల పేర్లు చమత్కారంగా ఉన్నా వాటి స్వాభావాలకి సరిగ్గా అతికినట్టు సరిపోతాయి. చివరిగా ఒక్కమాటలో చెప్పాలంటే ఈ కథలు చదువుతున్నంత సేపు  మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తూనే, మన చూట్టూ ఉన్న సమాజంతో పాటు మనల్ని మనం కూడా తరచి చూసుకొనేలా చేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here