ఆధునిక మృచ్ఛకటికమ్

1
3

[డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ రచించిన ‘మట్టి బండి’ అనే దీర్ఘ కవితని విశ్లేషిస్తున్నారు ప్రొఫెసర్ సిహెచ్. సుశీలమ్మ.]

[dropcap]బ[/dropcap]హుముఖీన ప్రతిభా పాండిత్యాలు కలిగిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ ఇటీవల రచించిన దీర్ఘ కవిత ‘మట్టి బండి’.

శూద్రకుడు రచించిన చారుదత్తుడు, వసంతసేన ‘మృచ్ఛకటికమ్’ నాటకానికి ఈ కావ్యానికి ఏ సంబంధం లేదు. అక్కడ చారుదత్తుని కుమారుడు ఆడుకునే మట్టిబండి మొత్తానికి తన నగలు కప్పి బంగారుబండిలా మార్చింది వసంతసేన. ఈ దీర్ఘ కవితలో తన బంగారం లాంటి పొలాన్ని, ఎద్దుల్ని, బండిని అమ్ముకొన్న రైతు ఆవేదన వ్యక్తంచేశారు కవి.

ఆధునిక కవిత్వంలో ఇటీవల దీర్ఘ కవితలు విస్తృతంగా రావడం ఆహ్వానించదగ్గ పరిణామం.

“తత్త్వ గౌరవంతో భాసించేది దీర్ఘ కవిత” అన్నారు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారు. దానినే మరింత వివరిస్తూ ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు “దీర్ఘ కవిత దీర్ఘ కావ్యానికి పునాది భూమిక. ఒక ఉద్యమం, ఒక సమస్య, ఒక భావన, ఒక సంఘటన తీసుకొని ఒక తాత్త్విక నేపథ్యంలో దాని పరిణామాన్ని, పర్యవసానాన్ని వివరించి కవి తన తీర్పునివ్వడమే దీర్ఘ కవితా లక్షణం” అంటారు.

అద్భుతమైన దీర్ఘ కావ్యం ‘కొయ్యగుర్రం’ రచించిన నగ్నముని “దీర్ఘ కవితకు వస్తువు ప్రాణం. రూపం విధానం. దీర్ఘ కవిత ప్రాణాయామంతో సమానం. తాడు మీద నడక వంటిది. తడబడితే కింద లోయ” అంటారు.

తెలుగులో దళిత దీర్ఘ కవితలు అనే వ్యాసంలో ఆచార్య శిఖామణి ఇలా అన్నారు – “తెలుగులో చాలా ఆధునిక ప్రక్రియల్లాగే దీర్ఘ కవితకు ఇంగ్లీష్ ‘లాంగ్ పోయెమ్’ కొంత ఆధారం. ఇంగ్లీష్‌లో ప్రముఖ కవులందరూ దీర్ఘ కవితలు రాసిన వారే. 1934 లోనే A.S. Cairncross సంపాదకత్వంలో Longer poems – old and new పేరుతో ఒక సంకలనం వచ్చింది”.

తాను ఎంచుకున్న వస్తువును కవితగా 20, 30 పాదాల్లో రాసినా సంతృప్తి కలగకపోతే, సంపూర్ణంగా తన భావాన్ని ఇమడ్చలేకపోయానే అనుకున్న కవి దీర్ఘ కవితలో చెప్పాలనుకుంటాడు. అప్పుడు గాని కవికి సంతృప్తి కలగదు. అయితే, పేజీలు నింపినంత మాత్రాన అది దీర్ఘ కవిత అనిపించుకోలేదు. తాను తీసుకున్న వస్తువుకు (ఇతివృత్తం) సంబంధం లేకపోయినా తన ప్రతిభను నిరూపించుకోవడానికో, పేజీలు నింపడానికో, చూడటానికి పెద్ద ‘వాల్యూం’ గా కనపడాలనో పెంచి రాస్తే ‘వాక్యూం’ అనివార్యంగా ఏర్పడి పాఠకుడికి విసుగు జనిస్తుంది. తెలుగులో చాలామంది కవులు సమర్థవంతంగా దీర్ఘ కవితలు రచించి విజయవంతంగా తమ భావాలను వెల్లడించారు.

తెలుగులో బైరాగి నూతిలో గొంతుకలు, ఆరుద్ర సినీవాలీ, సివి విషాదభారతం, శివారెడ్డి ఆసుపత్రి గీతం, నగ్నముని కొయ్యగుర్రం, వరవరరావు సముద్రం, శేషేంద్ర నా దేశం నా ప్రజలు, శీలా వీర్రాజు మళ్లీ వెలుగు, రంథి సోమరాజు పొద్దు, రోజీ, సి. నారాయణరెడ్డి విశ్వంభర, మట్టి మనిషి, సుప్రసన్న శతాంకుర, సాంప్రదాయం, చైతన్య ప్రసాద్ సహస్రవర్ష, ఎన్. గోపి జల గీతం, శ్రీకాంత్ శర్మ సువర్ణ, చిన్న వీరభద్రుడు పునర్యానం, యార్లగడ్డ రాఘవేంద్రరావు ముంతపొగ, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పొలి, మందరపు హైమవతి రాతి చేయి, బండ్ల మాధవరావు ఊరికల, ఈతకోట సుబ్బారావు నీటిచుక్క, మహాత్మా, పక్షి తీర్థం, సరికొండ నరసింహారాజు భస్మ సింహాసనం, కందుకూరి శ్రీరాములు దహనకావ్యం, ఛాయారాజ్ శ్రీకాకుళం రసస్పర్శ బుదడు, ఆశారాజు బద్నాం, మామూలుగా, ఎండ్లూరి సుధాకర్ కొత్త గబ్బిలం, ఈ. రాఘవేంద్ర కల్లంచుల బువ్వ, బాణాల శ్రీనివాసరావు కుంపటి, రాధేయ మగ్గం బతుకు, గూటంరాజు ఏకీకరణీయం, వనపట్ల అసిపె, పెరుగు రామకృష్ణ ఫ్లెమింగో, కె. రామ్మోహన్ రాజు వసంతమేఘం, రేణుకా అయోల మూడో మనిషి, పృథ, మద్దూరి గోదావరి, విద్యాసాగర్ దిష్టిబొమ్మ, దిలావర్ గ్రౌండ్ జీరో, జూలూరు గౌరీశంకర్ నాలుగో కన్ను, పాదముద్ర, మూడో గుణపాఠం, శీలా సుభద్రాదేవి యుద్ధం ఒక గుండె కోత, వాసా ప్రభావతి ఓ ఉదయం, కె.ఎస్వీ. రాత్రి, మద్దూరు శ్రీనివాసులు వాన, మాకినీడు పాపికొండల్లో పడవపాట, శ్రీరామమూర్తి అమ్మ ఒడి, ఎలుకట్టు శంకర్ యాది, ఎస్సార్ పృథ్వి అమ్మ జ్ఞాపకాలు, డా. గూటంస్వామి కనుపాపల తోటమాలి, మద్దూరి నగేష్ బాబు రచ్చబండ, ఊరూవాడా,కుందుర్తి హంస ఎగిరిపోయింది, బెల్లి యాదయ్య తర్జుమా, పెళ్ళకూరు జయప్రద మనసుకు మరణం, కె. బాలకృష్ణ రెడ్డి నువ్వు లేని నేను, ఎమ్మెస్ సూర్యనారాయణ దయామేఘ మల్హరి, సశ్రీ సంతకం, సుగంబాబు లెనిన్, జల్లి రాజగోపాలరావు స్పూర్తి ప్రదాత అంబేద్కర్, ఆసు రాజేంద్ర పడగ కింద పసితనం, సుంకర రమేష్ తల్లి కోడి హెచ్చరిక, ఖాదర్ మొహియుద్దీన్ పుట్టుమచ్చ, షేక్ కరీముల్లా సాయిబు, కారం శంకర్ అక్షరశ్వాస, అఫ్సర్ ఫ్లోరోసిస్, రూప్ కుమార్ డబ్బీకార్, వై. శ్రీరాములు జలగండం, శైలజా మిత్ర సృష్టికేతనం, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి నాగేటి గోడు దుక్కిచూపు, దాట్ల దేవదానం రాజు నాలుగో పాదం ముద్రబల్ల ఇంకా ఎన్నో దీర్ఘ కవితలు వందకు పైగానే వెలువడ్డాయి. మరికొన్ని నా దృష్టికోణానికి చిక్కివుండనివి చాలా ఉండివుండొచ్చు (ఆ సమాచార పట్టిక ఇవ్వడం ఈ వ్యాస ఉద్దేశం కాదు).

డా. నాగభైరవ ఆదినారాయణ ‘మట్టి బండి’లో మొదటినుండి చివరివరకూ రైతే కనిపిస్తాడు. రైతు పొలాన్ని అమ్మడం అనే దుఃఖఛాయలే వెంబడిస్తాయి. వ్యాకరణం, ప్రాచీన సాహిత్యాభిమాని యైన ఆదినారాయణ ఈ కవిత ఆసాంతం సరళమైన శైలిలో, లోతైన భావాభివ్యక్తితో పాఠకుల మనసులను తాకడం విశేషం. ప్రకృతి వైపరీత్యాల,నేటి ప్రభుత్వాల తీరుతెన్నుల పట్ల చివరిలో రైతు ‘ధర్మాగ్రహం’ వ్యక్తం చేయడం తప్పనిసరిగా అనివార్యమైంది.

మా పొలాన్ని అమ్మేసాను – అంటూ ఈ కావ్యాన్ని మొదలుపెట్టారు ఆదినారాయణ. మన పురాణాలలో కానీ, ప్రబంధాది కావ్యాలలో కానీ ‘విషాదాంతాలు’ లేవు. మంగళాంతంగా ముగించడం జరుగుతుంది. కేవలం ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ‘ట్రాజెడీ’లు ప్రవేశించాయి. ముఖ్యంగా బెంగాలీ నవలలలో దుఃఖాంతాలు మొదలయ్యాయి. కానీ మట్టి బండి ‘విషాదారంభం’. మొదటి వాక్యమే ఉలిక్కిపడేలా చేసింది. రైతు పొలం ఎందుకు అమ్మాడు, కారణాలేమిటి అన్న తీవ్రమైన ఆదుర్దాతో కూడిన ఉత్సుకతతో పాఠకుడు చదవడం ప్రారంభిస్తాడు. చదువుతున్న కొద్దీ భారతదేశంలోని దుర్భిక్షత, వ్యవసాయ రంగంలోని దౌర్భాగ్య పరిస్థితులు, ఎందరో రైతుల దుస్థితి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. తాత తండ్రుల వారసత్వంగా వచ్చిన భూమాత, అన్నం పెట్టి, అవసరాలకు తాను తాకట్టు లోకి వెళ్ళి ఆదుకొని, మళ్ళీ వచ్చి ఆసరాగా నిలిచిన పొలం అది.

“నాకు చెదిరిపోని ధీమాని/సడలని ధైర్యాన్ని/సమాజంలో గౌరవాన్ని/సాటివారిలో గుర్తింపును/ కల్పించిన పొలాన్ని/కర్కశంగా అమ్మేశాను/ఈ పొలాన్నే కాదు/వ్యవసాయంలో/సాయంగా నిలిచిన ఎడ్లను/అండగా ఉండే బండిని కూడా/అమ్మేశాను/అసలు పోయిన తర్వాత/కొసరు ఎందుకనుకుంటూ..”

కర్షక వృత్తిలో ఏనాడూ తలకెత్తుకున్నంత లాభాలు పొందడు రైతు. అసలు అది ‘వృత్తి’ అనుకోడు. వ్యవసాయం తన ధ్యేయం, తన కర్తవ్యం, తన జీవితాశయం అనుకుంటాడు. అటువంటి రైతు తన ప్రాణప్రదమైన పొలాన్ని అమ్ముకున్నాడు. పొలాన్ని పోగొట్టుకోవడంతో పాటు తన ప్రాణాలనూ మానసికంగా పోగొట్టుకున్నాడేమో! వ్యవసాయం అంటే తెలియని, పొలంతో బంధం పెంచుకోలేని తరం, ‘బియ్యం చెట్ల’ నుండి బియ్యం – అన్నం వస్తుందనుకునే కంప్యూటర్ యుగ యువతకు తెలియదేమో కానీ, రెక్కలు ముక్కలు చేసుకుని, ఆరుగాలం కష్టపడి, పొలం లోంచి పసిడి పంటను ఉత్పత్తి చేసే రైతుకు తెలుసు మట్టి విలువ. ఆ మట్టిపరిమళం తెలిసిన మనిషికి ఈ మట్టి విలువేమిటో తెలుస్తుంది.

ఇక ఈ పొలానికి సంబంధించిన భూతకాలపు జ్ఞాపకాలు తప్ప వర్తమానంలో వ్యాపకాలు గాని భవిష్యత్తులో వ్యామోహాలు గానీ ఉండే అవకాశం లేదు అని వాపోయాడు రైతు.

ఆర్థిక దుస్థితి, ఆవేదన, ఆక్రోశం, అవసరం అనే నాలుగు చక్రాలతో ఈ మట్టి బండిని లాక్కొచ్చారు నాగభైరవ. పొలంలో, బండితో తన జ్ఞాపకాలను తవ్వి గంప కెత్తారు.

“మా అమ్మ పురిటి నొప్పులు పడేటప్పుడు/ఆసుపత్రికి తీసుకెళ్ళింది పుట్టిన పసిగుడ్డునైన నన్ను/అమ్మతో ఇంటికి చేర్చింది ఈ బండే/నా ఇల్లాలు ఈ బండి లోనే వచ్చి/నా ఇంటికి దీపమైంది”.

“పంటల కాలంలో/ధాన్యపు బస్తాలతో/నిండు గర్భిణీల మెల్లగా సాగి వచ్చే/బండిని చూస్తే/బంగారాన్ని మోసుకొచ్చే/లక్ష్మీదేవి అనిపించేది/ఏడాది పాటు కడుపు నింపే/కూటికొండ అనిపించేది.”

తన పిల్లలతో పాటు పెరిగిన ఎడ్లు బండిని లాగుతూ, పొలాన్ని దున్నుతూ బాధ్యతల్ని పంచుకున్నాయి. వాటిని ఎంత మురిపెంగా వర్ణిస్తున్నాడో –

“ఎత్తయిన మూపురాలు/రాజసం కనిపించే నడకలు/నడకకు లయబద్ధంగా ఊగే గంగడోలు/కాటుక దిద్దినట్లున్న కళ్ళు/ఎంత అందంగా హుందాగా ఉండేవో/ఒంగోలు జాతికి చెందిన ఎడ్లు కదా/అపురూపమైన/ఆ వృషభాల రూపాలను చూస్తే/లేపాక్షి బసవన్న అయినా/లేచి నిలబడాల్సిందే/ తోకతో పాటు మోర పైకెత్తి/రంకె వేసాయంటే/కైలాసంలో నంది మీదున్న/పరమేశ్వరుడైనా సరే/పరమాశ్చర్యంతో/తలను దించి చూడాల్సిందే!”

అవి అంత గంభీరంగా ఉన్నా, ఎవరి పైనా కొమ్ము విసిరేవి కావు. పలుపుతాళ్ళను తెంచుకునే తెంపరితనం లేదు. ఎన్ని సంవత్సరాలు పొలాన్ని దున్నాయో, ఎన్ని కళ్ళాల్లో ధాన్యాలు నూర్చాయో, ఎన్ని ధాన్యపు బస్తాలను తెచ్చి గాదెల్ని నింపాయో! అల్లారు ముద్దుగా పెంచుకున్న వాటిని దూరం చేసుకున్న రైతు తన కన్న బిడ్డల్ని దూరం చేసుకొన్నంతగా అల్లాడిపోయాడు. నిర్దయగా నిర్దాక్షిణ్యంగా అమ్ముకునే పరిస్థితికి తనను తాను తిట్టుకున్నాడు.

పొలంతో పాటు చుట్టూ ఉండే అందమైన ప్రకృతి, వాగులు- వంకలు, పిట్టలు- పక్షులు, పల్లె పడుచులు, జమ్మిచెట్లు- తాబేటి బుర్రలు, ఎన్నెన్నో తీగలు- పిందెలు, పాటలు- పరవశాలు, తంపట్లు – లేత కంకులు, సంక్రాంతులు- సంబరాలు.. ఏవి తల్లీ నిరుడు కురిసిన ఆ ఆనందాల హరివిల్లులు! అన్నీ జ్ఞాపకాల జల్లులుగా మారిపోయాయా!

ఎందుకిలా జరిగిందన్న అమాయకత్వం, ఆవేదన ఆ ఘోషలో ఉంది. రైతు నిస్సహాయ స్థితి చదువుతున్నప్పుడు పాఠకుని కంటితో పాటు మనసులోనూ ఏదో తడి.

“రైతంటే పల్లెటూరి బైతు కాదు/సస్యమనే అశ్వాన్ని అధిరోహించి/ఆకలి రాకాసి నుండి/లోకాన్ని కాపాడే రౌతు/రైతంటే పరాన్న భుక్కు కాదు/ఏడాది పొడవునా/సాగు అనే యాగాన్ని ఆచరించే/గొప్ప ఋత్విక్కు/రైతంటే అన్న ప్రదాత/మన్ను నుండి/పరబ్రహ్మ స్వరూపాన్ని/రూపొందించే విధాత/ఆదిభిక్షువు బుభుక్షనైనా/తీర్చగల త్రాత!”

వర్షపు చినుకుని ఒడిసి పట్టి విత్తనానికి సత్తువను కూర్చి బంజరు భూములనైనా హృద్యంగా మార్చగల సేద్యగాడు. తాను తిన్నా తినకున్నా అన్నమై జగానికి ఆకలి తీర్చే అన్నదాత. అదే ఆత్మగౌరవంగా భావించి మీసం మెలేసేవాడు. తన చెమట చుక్కతో విశాల విశ్వానికి కబళం అంది‌స్తున్న తృప్తితో తలచుట్టూ తలపాగా చుట్టుకుంటాడు కించిత్ గర్వంతో, కూనిరాగాలు తీస్తూ.

ఏమైంది ఆ ధీమా! ఎక్కడ పోయింది ఆ గర్వం!

పేదరికం నిరాశ చీకట్లు అలముకుంటున్న వేళ కనుచూపుమేరలో ఆశా కిరణం కనిపించకపోవడంతో బ్రతుకు సమరంతో పోరాడే శక్తి ఇక లేక ‘పొలాన్ని అమ్మేసాడు’.

ప్రపంచీకరణ, వేగవంతమైన జీవన విధానం, మట్టికి దూరంగా బతుకుతున్న మనుషుల సుఖాల వెంపర్లాటలో, ఆరాటాలలో రైతు వెనకబడిపోయాడు. రైతు జీవితం లెక్కకు లేకుండా పోయింది. స్వార్థ రాజకీయాల జడిలో తన ‘మట్టి బండి’ కరిగి నీరు అయిపోయింది.

కన్న బిడ్డలు కూడా ఇన్నాళ్లు తమకు అన్నం పెట్టిన పొలాన్ని అమ్మేయమని చెప్పినప్పుడు నిలువునా నీరయ్యాడు. పెద్దవాడు సరే, పట్నంలో ఉన్నవాడు. తనకు తోడుగా ఉన్న చిన్న కొడుకు కూడా ఇన్నాళ్ళూ తను ఆత్మగౌరవంగా తలెత్తుకు బ్రతికే వ్యవసాయాన్ని వదిలేయమని నిర్దయగా, నిష్కర్షగా చెప్పినప్పుడు తన ఆర్థిక పరిస్థితి కంటే కొడుకు మాటలకే అతను కృంగిపోయాడు.

స్తబ్దుగా మారిపోయాడు. శిలగా నిలిచిపోయాడు. గత వైభవం గాలి బుడగగా పేలిపోయింది. కళకళలాడిన వ్యవసాయం కన్నీటిలో కరిగిపోయింది. మనసు రాయిగా చేసుకుని పొలంతో పాటు ఎద్దుల్ని మట్టి బండిని అమ్మేసాడు. నిజానికది ‘అమ్మడం’ కాదు – తనను తాను బలి ఇచ్చుకోవడం.

కురవాల్సిన సమయంలో గబగబా, చరచరా కదిలిపోయిన మేఘాలు, కంకుల మీదున్నప్పుడు, కళ్ళాల మీదున్నప్పుడు కక్ష కట్టినట్టు కుంభవృష్టి కురిస్తే కర్షకుడు నిశ్శబ్ద కన్నీటి వానయ్యాడు.

విత్తనాల కొరత, నకిలీ విత్తనాల విక్రయం, ధనదాహం నేపధ్యంలో పస లేని పురుగుమందులు స్వైరవిహారం, కిమ్మనని అధికార గణం, మద్దతు ధర ప్రకటించని ప్రభుత్వాలు, దోచుకుంటున్న దళారీలు, అప్పుల కుప్పలు.. అన్నీ కలిసి రైతు నుదుటి రాతను మార్చేసాయి. విడదీయరాని బంధం అనుకున్న వ్యవసాయం దండగమారి పని అని తేల్చేసాయి. ఎందరో సహచరులు అవస్థలతో, ఆకలితో ఆత్మహత్యలు చేసుకుంటుంటే – ఆ ధైర్యం చెయ్యలేని అధైర్యంతో ‘అమ్మేసాడు’.

ఉరికొయ్య కు ఊగలేక ‘ఉన్నపళంగా అమ్మేసాడు’.

అప్పుల ఊబిలో చిక్కుకుపోతే ఊతంగా అర్ధాంగి చేయి అందివ్వలేదేమో!

కొడుకులు ఓదార్పు వాక్యం కాలేకపోయారేమో!

అతడు పొలం అమ్మేసాడు.

రైతు ఆత్మగీతమే ఈ మట్టి బండి.

రైతు ఆర్ద్ర స్వరమే ఈ మట్టి బండి.

రైతు గాయాల గేయమే ఈ మట్టి బండి.

కర్షకుని శ్రమకు ప్రతీక యైన ఈ ‘మట్టి బండి’ కావ్యాన్ని ‘కర్షకుల హర్షమే ధ్యాసగా’ జీవించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కీ.శే. పాటూరి రాజగోపాల నాయుడు గారికి అంకితం ఇవ్వడం మరింత సమంజసంగా ఉంది.

పొలం, ఎద్దులు, బండి భౌతికంగా దూరమైనా రైతు గుండెలో సజీవ జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. అక్షరాలు గా మారి, ‘కావ్య స్థితి’ పొంది సాహితీ జగత్తులో శాశ్వత స్ధానాన్ని పొందాయి.

డా. నాగభైరవ ఆదినారాయణ కి ‘కర్షక కవి’ అనే స్థిరమైన కీర్తిని ఆర్జించిన పెట్టాయి.

***

మట్టి బండి (దీర్ఘకవిత)
రచన: డా. నాగబైరవ ఆదినారాయణ
పేజీలు: 42
వెల: 100/-
ప్రతులకు:
డా. నాగభైరవ ఆదినారాయణ,
202, శ్రీ వెంకటసాయి రెసిడెన్సీ
రామయ్య నగరు,
ఒంగోలు, ప్రకాశం జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ 523002
ఫోన్‌ నెంబర్‌ 9849799711

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here