సంచిక విశ్వవేదిక – మానవ (మన) ప్రస్థానం

0
4

[సంచిక విశ్వవేదిక శీర్షికలో భాగంగా ‘మానవ (మన) ప్రస్థానం’ అనే రచనని అందిస్తున్నారు శ్రీ సారధి మోటమఱ్ఱి.]

[dropcap]ఈ[/dropcap] క్లిష్టతర, అవధులులేని అంశం ఆధారంగా, జనవరి 1, 2022 రోజున, కొత్త సంవత్సరానికి ఆహ్వానం చెబుతూ, మా సిడ్నీ తెలుగవాణి రేడియోలో ఒక కార్యక్రమాన్ని అందించాను. దానికి  రాసుకొన్న, ఒక సశేష ముందుమాట, మధ్యమాట సంచిక-విశ్వవేదిక  ద్వారా మీతో పంచుకోవాలనే చిన్న ప్రయత్నం ఇది. ఈ కార్యక్రమ ధ్వనిముద్రణ లంకెను, వ్యాసం చివరిలో అందించాను. అభిరుచి ఉన్నవారు, దానిని దిగుమతి చేసుకొని వినవచ్చును. మీ మీ స్పందనలు తెలియచేస్తే ఆనందం!

మానవ ఆవిర్భావం ఎప్పుడు, ఎక్కడ జరిగినది, ఎలా పరిణామం చెందింది –

జాతుల ప్రయాణం, వలసల, కలయికల వల్ల –

మనకి కొంత తెలుసు! కొంత ఊహ!

తెలియనిది ఎంతో! ప్రశ్నలు మరెన్నో!

లక్షల ఏళ్ల ప్రయాణంలో మానవునిగా తెలుసుకున్నది ఎంత?

గతం గురించి తెలుసుకున్నది, నేర్చుకున్నది ఎంత?

నేర్చి మరిచినదెంత? మార్చుకున్నది ఎంత  – తన స్వార్థానికి?!

ఇది ప్రతి తరం, ప్రతి నిత్యం, తమను తాము, అద్దంలో చూసుకొంటూ,

ఆత్మ వివేచన చేసుకుంటూ – ఈ విశ్వవేదికలో, ఈ అనంత విశ్వంలో, ఈ అనంత కాలగమనంలో –

తన, మన పయనాన్ని- దారి మళ్ళించే, దారి ధ్వంసిచే శక్తులను దాటి – మానవాళి ప్రగతి గురించి,

ఈనాటి, ఆంగ్ల నూతన వత్సర ఉషోదయాన చర్చించుకోవడం,

అందు మన పాత్రను బేరీజు వేసుకొని –

విశ్వ మానవ శ్రేయస్సు కోసం –

గతించిన వారికి ఒక్క నిక్కమయిన కన్నీటి బొట్టు ఒలికించి,

ఒక్క క్షణం కాలాన్ని నిర్జించి అవలోకిద్దామా!!

1984 నుండి, ప్రతి నూతన సంవత్సరానికి, ఉగాదికి, ఒక కవిత రాస్తూ, ఆ కవితలో వీలైనంతవరకు సమకాలీన అనుభవాలు నిక్షిప్తం చేస్తూ వస్తున్నాను. 2022వ సంవత్సరానికి, రాసుకొన్న కవిత మీతో పంచుకొని, దానిని ప్రేరేపించిన అంశాలు గురించి క్లుప్తంగా వివరిస్తాను.

మీలో చాలామందికి Carl Sagan అనే మాననీయ అంతరిక్ష శాస్త్రవేత్త గురించి తెలిసే ఉంటుంది. శాస్త్రరంగ చరితని నిశితంగా, మానవీయ కోణంలో విశ్లేషించిన ఒక మహత్తర వ్యక్తిగా Sagan నాకు తోస్తాడు: Cosmos టీవి episodes ఆయన మనకు 1980 లలో అందించిన ఒక తరగని ఘని. ఆ సిరీస్, ప్రతి వ్యక్తి తప్పక చూడాలి. అందు మానవాళి అభివృద్ధికి అహర్నిశలు, తమ తమ జీవితాలను కూడా పణంపెట్టి, మన నేటి ప్రగతికి, దోహదపడిన మహానుభావుల జీవనయాత్ర, వారి కష్టాలు, నష్టాలు మన ముందుంచి, మన కనులవెంట ఒక కన్నీటి చుక్క తెప్పిస్తాడు. మన సూర్యమండలాన్ని, పాలపుంతలను, దాటి విశాల విశ్వంలోకి వీక్షించి, ఆ అనంత కోట్లాది నక్షత్రాల, పాలపుంతల నడుమ, ఒక చిన్న బిందువైనా కాని, మన నివాస భూమిని, ‘the pale blue dot’ గా అభివర్ణిస్తూ, ఆ చిన్న బిందువును కాపాడుకోవడంలో మనపై, మన ముందు తరాలపై ఉన్న అనితర బాధ్యతని గుర్తుచేస్తూ చెప్పిన కొన్ని వాక్యాలు విజ్ఞానరంగములో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆ మేలుకొలుపు మాటలే, నా ఈ నూతన సంవత్సర కవితకి ప్రేరణ. అలాగే నేను రూపొందించాలనుకున్న ‘మానవ (మన) ప్రస్థానం’ అనే కార్యక్రమానికి పునాది. ఆ వ్యాసం రాయాలని మదిలో ఉన్నా, బహుశా అది రూపుదిద్దుకోవడానికి, మరిన్ని నెలల ఆలోచన, కృషి అవసరముంది.

ఇప్పుడు Carl Sagan ఆ సందేశాన్ని, ఆయన మాటలలోనే విందాము.

** Carl Sagan సందేశం:

https://www.youtube.com/watch?v=sb4WhNvLRFw&ab_channel=InvisibleMind

Carl Sagan

గత మూడు సంవత్సరాల మేర, ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తున్న సూక్ష్మ జీవి Covid-19 కరోనా! మానవాళి తన ప్రస్థానంలో ఎన్నో అవాంతరాలు చూసింది, వాటిని అధిగమించి పురోగమించింది, సాంకేతికంగా! కానీ ఇంత తొందరగా సమస్త భూమండలాన్ని ఆవరించిన విపత్తు, లక్షలాది మందిని బలిగొన్నది ఈ కరోనానేమో! కరోనా ప్రకృతి ప్రతీకారమా? మానవ కల్పితమా? మానవ తప్పిదామా? ఏమో రాబోయే కాలంలో తెలియవచ్చు, తెలియకపోవచ్చును కూడా!

మానవ (మన) ప్రస్థానం, విశ్వవేదికలో, ఈ అనంత విశ్వంలో, ఈ అనంత కాలగమనంలో – మానవాళి పయనాన్ని – దారి మళ్ళించే, దారి ధ్వంసించే శక్తులను దాటి నిజంగా ముందుకు వెళ్ళిందా? “పశువుల కన్న, పక్షుల కన్న, మనిషిని మిన్నగ చేశాడు; బుద్దిని ఇచ్చి, హృదయానిచ్చి భూమే నీదని పంపాడు! బుద్ధి కి హృదయంలేక, హృదయానికి బుద్ధే  రాక నరుడే ఈ నరలోకం నరకం చేశాడు!” అంటాడు ఆత్రేయ. గత సంవత్సరం ఆత్రేయ శతజయంతి నివాళిని ముగిస్తూ, మనం తలుచుకున్న మాటలు: “మనసున్న మనషులే మనకు దేవుళ్ళు; మనసు కలసిన నాడే మనకు తిరనాళ్ళు” అని. ఆ దేవుళ్ళని, తిరనాళ్ళని మానవజాతి చూసినదా? లేక ఇంకా వాటికి సుదూర తీరాల్లో చరిస్తున్నదా? అని సశేషంగా నిలిపివేశాం. ఇలా మన మనుగడ శాంతితో మనగలిగి, ప్రతి రోజు ఒక తిరనాళ్ళలా సాగాలని, తమ ప్రతీ రచనలో ఉద్ఘాటించిన ఆత్రేయ లాంటి రచయితలు, Carl Sagan లాంటి శాస్త్రవేత్తలు ఉన్నారు.

నిజమే మనిషి బుద్ధి నైపుణ్యంతో ప్రకృతిని తదితర జీవరాశిని అర్థం చేసుకొని, లోబరుచుకున్నాడు. తన ఉదరపోషణకు ముందుగా జంతుజాల వేటకు ఆయుధాలు సమకూర్చుకున్నాడు. చెట్లను ఉపయోగించుకున్నాడు. క్రమేణా చక్రం, నిప్పు (Wheel and Fire) ను కనుగొని తన ఆహారంలో మార్పు తెచ్చుకున్నాడు. చుట్టూ ఉన్న ప్రకృతిలో సంభవించే మార్పులు: రాత్రి, పగలు, ఋతువుల సరళిని అవగతం చేసుకుంటూ, కాలగణనకు ఒక ప్రాతిపదిక కనుగొన్నాడు. దీనితో భూమిని సేద్యానికి అనువుగా మార్చుకొని, వ్యవసాయ విప్లవానికి నాంది పలికాడు. ఆహారంలోను, జీవనసరళిలోను, తన చుట్టూ ఉన్న సమాజంతో అనుబంధానికి కొత్త నిర్వచనాలు రూపొందించాడు. ఈ ప్రస్థానంలో డబ్బు అనే దానిని మనిషి సృజించాడు. ఈ ఘటనని విశ్లేషిస్తూ ఆత్రేయ ఏమంటాడంటే “డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా! పేదవాడు నాడే పుట్టాడమ్మా!” అని.

ఆ తదుపరి ప్రస్థానంలో మనిషి గణనీయంగా పెరిగిన శారీరక శ్రమని తగ్గించడానికి, జీవ, వృక్ష, భౌతిక, రసాయన శాస్త్రాలను విస్తుత పరిచి, శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయ ప్రగతిని సాధించి, పారిశ్రామిక విప్లవానికి ఆజ్యం పోశాడు. గ్రహరాశుల, ఘన తారల పథాన్ని నిర్ధారించాడు.

**ఇప్పుడు, ఘంటసాల మాష్టారు బాలాభారతం సినిమాకై పాడిన ఒక స్పూర్తి గీతం, ‘మానవుడే మహనీయుడు’ పాట కూడా వినండి. రచన ఆరుద్ర, సంగీతం సాలూరి రాజేశ్వరరావు:

https://www.youtube.com/watch?v=Ph8TlK5BxP8&ab_channel=v9Videos

మన తెలుగు సంవత్సరాలు వికారి, శార్వరి, ప్లవ కూడా కొంత విపత్తును సూచించాయని చెబుతారు. ఏప్రియల్‌లో రాబోయే శుభకృతు, ఆ తదుపరి శోభకృతు, బహుశా మనందరికీ శాంతి ప్రసాదించ గలదని ఆశిద్దాము. శుభకృతు నా వ్యక్తిగత జీవతములో ఒక మైలురాయిని సూచిస్తుంది కూడా. మన వేదాలలో, ఉపనిషత్తులలో ఉద్బోధించిన శాంతి మంత్రాలు: మానవునికి, ప్రకృతికి, సర్వజీవకోటికి, సమస్త రోదశికి శాంతిని ఆశించి, చిట్టచివరికి శాంతికి కూడా శాంతి కలగాలని ఆశించినారు నాటి ఋషి ఉత్తములు.

**ఓం ద్యౌ శాంతిః అంతరిక్షం శాంతిః పృథివీ శాంతిః ఆపా శాంతిః ఔషదయ శాంతిః వనస్పతయః శాంతిః విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతి రేవాః శాంతిః సామాః శాంతిరేదిః ఓం శాంతిః శాంతిః శాంతిః

ఈ వ్యాసాన్ని సశేషంగా నిలుపుతూ, ఇప్పుడు గమ్యం చిత్రానికి సిరివెన్నెల సీరారామశాస్త్రి గారు అందించిన అద్వైత గీతం వినండి.. స్వరకల్పన ఇ. యస్. మూర్తి, అనిల్, ఆర్. పాడినది రంజిత్. సిరివెన్నెల గారు, మనలను వీడి ఒక నెల రోజులు కావస్తుంది. శ్రీశ్రీ, ఆత్రేయ, కొసరాజు, వేటూరి తదుపరి అనేక  అద్భుతమైన, ఎన్నో సందేశాత్మక, ప్రేరణాత్మక గీతాలు అందించిన ఆయనతో ఒక శకం ముగిసిందని చెప్పుకోవాలి. మనం వింటున్న ఈ గీతం మనకి ఒక ఉత్తేజాన్ని ఇస్తుందని, మనందరికీ శాంతి కావాలంటే, ఎక్కడ ఏది చూసినా అందులో మనలను చూసుకొని, గమనమే గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకుతుందని, వెన్నుతట్టి చెప్పిన ఈ వాక్యాలు మనకు ఒక స్పూర్తిని అందిస్తుంటే, వారు ఎక్కడ ఉన్నా, తప్పక మన హృదయ నివాళిగా అందుకుంటారు!

NASA’s Deep Space Climate Observatory, 2015: The Sun, the Earth and the Moon

అనుబంధం -1:

ఎంతవరకు ఎందుకొరకు

చిత్రం: గమ్యం (2008)

సంగీతం: ఇ.ఎస్.మూర్తి, అనీల్.ఆర్

గీతరచయిత: సిరివెన్నెల

నేపధ్య గానం: రంజిత్

పల్లవి:

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు

ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా

తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

చరణం 1:

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు.. అడగరే ఒక్కొక్క అల పేరు

మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు.. పలకరే మనిషి అంటే ఎవరూ

సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నది

చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది

నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా

మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా

తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

చరణం 2:

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై.. నీడలు నిజాల సాక్ష్యాలే

శతృవులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే.. ఋతువులు నీ భావ చిత్రాలే

ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం

మోసం రోషం ద్వేషం నీ మకిలి మతికి భాష్యం

పుట్టక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ

జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ

తారరరరే తారరరరే తారరరరే తారారరే

తారరరరే తారరరరే తారరేరా రారరరరే

తారరరరే తారరరరే తారరేరా రారరరరే

https://www.dropbox.com/s/w2dkof44nlp8jr1/MotamarriS_20220101_Manava%28Mana%29%20Prasthanam_New%20Year_full.mp3?dl=0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here