తెలంగాణా ప్రాంతంలోని శ్రీవైష్ణవ కుటుంబాలు – సంప్రదాయము

0
3

[ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య షష్టిపూర్తి అభినందన గ్రంథం ‘సాహితీ సంపద’ లో తొలిసారి ప్రచురితమైన ఈ వ్యాసాన్ని ప్రత్యేక వ్యాసంగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము. ఈ వ్యాసాన్ని డా. గోవర్ధనం స్వామినాథాచార్యులు రచించారు.]

[dropcap]శ్రీ[/dropcap]వైష్ణవ సంప్రదాయము పుట్టింది దక్షిణ దేశంలోనైతే పుష్పించి ఫలించింది తెలుగుదేశంలో – అందులోను ప్రత్యేకంగా తెలంగాణా ప్రాంతంలో. శుద్ధమైన వైదిక సంప్రదాయం – ఒకప్రక్కనైతే, మరొకప్రక్కన పరమవైదిక సిద్ధాంతంగా భావించబడే ద్రావిడ ప్రబంధాధ్యయన సంప్రదాయము ఈ రెండింటిని రెండు కన్నులుగా కాపాడుకొని ఇప్పటికిని శ్రీవైష్ణవ సంప్రదాయము కొంతవరకైన నిలిచియుండేట్టు పాటుపడిన శ్రీవైష్ణవ కుటుంబాలు తెలంగాణా ప్రాంతంలో ఎన్నో కలవు. దీనికి కారణము జీవయాత్రకన్నా సంప్రదాయాచరణము, సంప్రదాయోపదేశమునకు పూర్వులిచ్చిన ప్రాధాన్యము అని చెప్పుట అతిశయోక్తి కాదు.

ఇక శ్రీవైష్ణవ శబ్దాన్ని విమర్శించుకుంటే మనకు కొంత విషయము అవగాహనకు వస్తుంది. శ్రీవిశిష్టుడైన నారాయణుని సర్వవిధ రక్షకుడుగా ఆశ్రయించువారు శ్రీవైష్ణవులని భావము. భగవంతుడు జీవుని కాపాడడంలో అమ్మవారు పాత్ర ఏమున్నది? అని ప్రశ్నించుకొన్నప్పుడు ఆమె పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. లోకోదాహరణ చూద్దాము. పిల్లవానికి కావలసిన వస్తువులను పరిస్థితులనుబట్టి త్వరగా ఇవ్వలేని తండ్రిని, సమయంచూచి సిఫారసు చేసి అతన్ని ఫలదాతగా మారుస్తుంది తల్లి. తల్లి చేసే పురుషకారం పని జరగడంలో ప్రమాదాన్ని తగ్గించి శీఘ్రంగా తప్పనిసరిగా ఫలితం కలిగేట్టుగా చేస్తుంది. అందుకని లక్ష్మీ విశిష్టుడైన నారాయణుని ఆశ్రయించమని చెప్పే సంప్రదాయము శ్రీవైష్ణవ సంప్రదాయము. శ్రీ శబ్దమును మంగళ వాచకముగా తీసుకున్నను మంగళ ప్రదాత్రి (“మా రమా మంగళ దేవతా” – నిఘంటువు) శ్రీ యే కనుక – ఇది శ్రీ సంప్రదాయమనే చెప్పుకొనవచ్చును.

శ్రీ శబ్దము సాక్షాత్తు లక్ష్మీవాచకమేకాన ప్రస్తుతార్థాన్ని చెప్పుకోవడంలో ఆపత్తి లేదు. ఇట్టి శ్రీవైష్ణవ సంప్రదాయము పూర్వాచార్యులలో మొదటివాడైన నాధమునులు మొదలుకొని భగవద్ రామానుజుల వరకును, అటు పిదప మణవాళ మహామునులు వరకును తదుపరి అష్టాదశ రహస్యాలను ప్రసాదించిన పిళ్ళైలోకాచార్యుల వరకును. అటు పిదప అనేకమంది సంస్కృత ద్రావిడ ప్రబంధ వ్యాఖ్యాతల వల్లను విష్ణువుపై భక్తి – ప్రవత్తులను ప్రబోధించుచు తామరతంపరగా అభివృద్ధి చెందింది. ఇప్పటికిని కొంతవరకు నిలిచియుండ కల్గుటకు పూర్వులైన శ్రీవైష్ణవులలోనున్న సంప్రదాయాభినివేశము, దానిని ప్రవర్తింపజేసిన పెద్దలపై నుండి గౌరవము, ప్రమాణ పరతంత్రత సర్వస్వామిపై నుండే రక్షకత్వ విశ్వాసము ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి. ఇట్టి వైష్ణవ సంప్రదాయాన్ని ప్రవర్తింప జేసిన మహనీయుల కుటుంబాలు అనేకంగా ఇప్పటికిని తెలంగాణా ప్రాంతంలో కనిపిస్తున్నాయి. వీనిలో కొన్ని కుటుంబములవారు ద్రావిడ దేశము నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడినవారు. ఆ ప్రాంతమునుండి వచ్చిన ద్రావిడ శ్రీవైష్ణవాచార్యులను సమాశ్రయించి వారి ఇంటి పేర్లనే తమ ఇంటి పేర్లుగా మార్చుకొన్న కొన్ని కుటుంబాలవారు; మొదటినుండి ఇక్కడనే ఉండి తమ యోగ్యతచేత ఆచార్యత్వమును స్వీకరించినవారు కూడా ఉన్నారు.

ఐతే విశేషమేమనగా, శ్రీ భాష్యాది గ్రంథ ప్రబోధకులు, పురాణ ప్రవక్తలు, శాస్త్రపండితులున్న కుటుంబాలు ఒక ప్రక్కన ఉన్నా, మరొకప్రక్క పరాంకుశులు మధురంగా పాడిన వేయి పాశురముల (తిరువాయ్ మొశి) వ్యాఖ్యాన రూపమైన భగవద్విషయ గ్రంథ ప్రబోధ – ప్రచారాలతో సదాచార సంపత్తిలో – భాగవతారాధన దృష్టితో (అనగా భగవద్భక్తుల సేవయే భగవత్సేవ) అనే సద్భావనతో జీవితాన్ని పరమార్థ భరితం చేసుకున్న ప్రపన్నాచార్య పురుష కుటుంబాలు అనేకములు కనిపిస్తాయి.

మరొక ప్రక్కనుండి పరిశీలిస్తే “మరింగంటి” మొదలగు కుటుంబాలవారు ఆచార వ్యవహారాదులలోనేగాక భగవదనుగ్రహ జన్యమైన కవితా ధోరణిలో పండిత పామర సంవేద్యమైన తిరునామములను (పాటలను) రచించి, భగవత్పర తత్త్వమును, ఆచార్య నిష్ఠను, భాగవత సేవా పరమార్థమును చాటి చెప్పినవారు కలరు. ఈ తిరునామములు భక్తుడు భగవంతునితో “సాక్షాత్తుగా సంవాదము చేయుచున్నట్లుగానో, మొరపెట్టుకున్నట్లుగానో కనిపిస్తాయి.(1) కేవలము ఆచార్యు లుపదేశించిన అష్టాక్షరీ, ద్వయమంత్రము అను రెండు మంత్రముల యొక్క అర్థ వివరణమే సకల వేద ప్రబంధసారముగా ప్రమాణ పరతంత్రులైన ఆచార్యుల నుండి తెలుసుకున్న శ్రీవైష్ణవ శిఖామణులు, పరోజ్జీవన కాంక్షతో ఇతరులకు యథాశక్తి ప్రబోధించే వైష్ణవులు బ్రాహ్మణేతర జాతులలోను కనిపిస్తారు.(2) ఇట్టి యీ శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూలము దక్షిణదేశము. సంప్రదాయమంతా అక్కడినుండి వచ్చి తెలుగుదేశంలో శాఖోపశాఖలుగా విస్తరించి పుష్పించి ఫలించింది. (మహబూబ్ నగర్, గద్వాల మొదలగు ప్రాంతములలో “వడకలై” సంప్రదాయస్థు లెక్కువగా కనిపిస్తారు.) దీనికి మూల పురుషులున్నారు. ఈ ప్రాంతంలో అహోబలము, పరకాల మఠముల శ్రీవైష్ణవ పీఠస్థుల శిష్యపరంపర అధికము.

దాదాపు 610 సంవత్సరాల క్రితం (జీవించి) సంప్రదాయాన్ని వ్యాఖ్యాన గ్రంథముల ద్వారా అనుష్ఠానము ద్వారా ప్రవర్తింపజేసిన వారు భగవద్రామానుజుల పునరవతారమైన “సౌమ్య జామృత యోగీంద్రులు” (మణవాళ మహామునులు) అను ద్రావిడ జీయరు. “విశదవాక్ శిఖామణులై” వందలమార్లు వందలాది శ్రీ వైష్ణవ కుటుంబాలకు భగవద్విషయ కాలక్షేపములను ప్రసాదించి శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులుగా చేసినారు. భగవద్రామానుజుల భాష్యములవల్ల పునరుద్ధరింపబడి, నిలద్రొక్కుకున్న యీ శ్రీవైష్ణవ సంప్రదయము (విశిష్టాద్వైత సంప్రదాయము)(3) మణవాళ మహామునుల యొక్క కాలంలో పరిమళించింది. అది అవిఛ్ఛిన్నంగా కొనసాగటానికై మణవాళ మహామునులు తాము సన్న్యసించి(4) తదుపరి తమ తరువాత దేశంలో సంప్రదాయాన్ని ప్రవర్తింపచేయడానికై అష్టదిగ్గజములని చెప్పబడే 8 ఆచార్య కుటుంబీకులను సిద్ధాంత ప్రచారము ద్వారా శిష్యకోటి సంగ్రహ – సంరక్షణల కొరకై నియమించినారు. వారిలో ప్రతివాది భయంకరం అణ్ణన్‍వారు, పరవస్తువారు, కోయిల్ కందాడై(5) మొదలగువారు. “వానమామలై జీయర్” – అనువారు మణవాళ మహామునుల యొక్క ఆజ్ఞానుసారంగా వారి ప్రతినిధిగా వానమామలైలో ఉండిరి.(6) ఉత్తరదేశం నుండి వెళ్ళిన రామానుజులనేవారు ఈ జీయర్ వద్ద భాష్య భగద్విషయాది సంప్రదాయ గ్రంథములను సేవించారు. వాటియందలి అభినివేశం (అత్యంత ప్రామాణ్య బుద్ధి) చేత సంప్రదాయాన్ని కాపాడడం వల్ల ఈ కుటుంబానికి కాత్తాన్ (సంరక్షించువారు) అనే పేరు వచ్చింది. తర్వాత అది ఆత్తాన్ అయ్యింది.

వీరు తిరునగరిలో స్థిరపడి, అక్కడి నుండి తెలుగుదేశానికి దాదాపు 400 సం. క్రితం వచ్చి, తెలంగాణాలోని జీడికల్లు వద్ద స్థిరపడినట్లు చారిత్రకంగా తెలుస్తున్నది. వారు పీఠాధిపతులై శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని బహుళ ప్రచారం చేసినారు. ఇప్పటికిని అత్తాన్ వంశస్థులు అక్కడక్కడ నామమాత్రంగా ఉన్నారు. ఇక పరవస్తువారు – అనే ఆచార్య పరంపరకు శిష్యులైన శాత్తాద శ్రీవైష్ణవులు కరీంనగర్ జిల్లాలోని కేశవపట్నంలో ఉన్నారు. వీరిలో ఇప్పటికిని సదాచార సంపన్నులు ఉన్నారు.

భగవద్రామానుజుల యొక్క శిష్యులైన కురేశుల సంతానమైన భట్టర్ వారి సంతానము యీ ప్రాంతానికి విచ్చేసి, తమలోని ఆచార వ్యవహారాదుల ద్వారా భగవద్విషయాది గ్రంథ కాలక్షేపాదుల ద్వారా దాదాపు 15 సంవత్సరాల క్రితం మహబూబాబాద్ తాలూకాలోని కోమటిపల్లి అగ్రహారంలో స్థిరపడ్డారు. వీరు అప్పటి దేశముఖుల ఆశ్రయంలో అగ్రహారం సంపాదించారు. పిట్టంపల్లి (7) లోను తూ.గో. జిల్లాలోని కోరుకొండలో కూడా స్థిరపడ్డారు.

తిరుమలవారు ‘నల్లబెల్లి’ (8)లో ఉన్నారు. నల్లాన్‍వారు, ఆచ్చివారు, కిడాంబివారు అను యీ కుటుంబాలు తెలంగాణా ప్రాంతంలోనివే. కాని వీరికి పరంపరాగతమైన ఆచార్యత్వం లేదు.

తిరుపతి నుండి పరంపరగా వచ్చింది నల్లాన్ వారి వంశం. ఇక్కడి వీరి పరంపరలో ఆద్యులై ప్రసిద్ధులుగా చెప్పుకొనబడినవారు శ్రీవాత్స్య వరదాచార్యులు (నడాదూర్ అమ్మాళ్) (9). వీరు తిరుపతిలో శ్రీవెంకటేశ్వర స్వామికి కైంకర్యం చేసేవారట. వారి వంశస్థులందరు పండితులు నిష్ఠాగరిష్ఠులు, భగవద్ భక్తులు కావడం వల్ల కొందరు వైష్ణవులు యీర్ష్యపడి వీరిని నిందిస్తూ దూరదూరంగా ఉంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకొనడం మానివేశారని పెద్దల అభిప్రాయము. అప్పుడు వారు 8 గోత్రముల వారితోనే సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకొని ‘అష్టగోత్రు’లైనారు. వరదాచార్యులవారు ఈ విషయాన్ని స్వామిదృష్టికి తీసుకొనిరాగా, సర్వర్కు పొల్లా, ఎనక్కు నల్లా (మీరితరులకు చెడ్డవారు, మాకు మంచివారే) అని తిరుపతి వేంకటేశ్వరస్వామి అర్చక ముఖంగా అన్నారట.

అప్పటినుండి వీరికీ పేరు వచ్చిందని, ఇక్కడినుండే నల్లంతిఘళ్, నల్లాన్ చక్రవర్తుల, నల్లాన్ అనే 3 శాఖలు వచ్చినవని పెద్దలు చెప్పుతారు. కాని వీరు గృహనామములను తమ గృహ నామములలో కొన్ని శ్రీవైష్ణవ కుటుంబాలు అతిశయోక్తి కొరకై చేర్చినట్లు కనిపిస్తున్నది. నల్లాన్ చక్రవర్తుల వారినుండి చక్రవర్తుల నామం తీసుకొని “నల్లంతిఘళ్ చక్రవర్తుల” అని తమ ప్రధాన గృహ నామంగా కొందరు ఉంచుకున్నట్లు కనిపిస్తున్నది. బహుశః వీరి పూర్వులు పై రెండు కుటుంబాలకు చెందిన వారికి ఆచార్యులుగా ఆశ్రయించినారేమో? ఇదమిత్థంగా తెలియదు. దాదాపు 200 సంవత్సరాల క్రితం యీ మూడు వంశాలవారు తెలంగాణలో స్థిరపడినారు. సుబ్బలివేడు (జి.వరంగల్లు); ఖమ్మం; కరీంనగర్ జిల్లాలో కొన్ని కుటుంబాలు కనిపిస్తాయి.

మాడభూషణి – మాడభూషి అనే ఇంటి పేరుగల ఆచార్య పురుషులు దక్షిణ దేశం నుండి పరంపరగా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. దాదాపుగా 200 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినారు. ఇప్పుడు కనిపిస్తున్న మాడభూషణి కుటుంబాలవారు ఆ పరంపరకు చెందినవారేనా? లేదా వారి నాశ్రయించి వారి గృహ నామ ముంచుకున్నవారా? సరియైన ఆధారం దొరకలేదు.

మాడభూషణి వారు వరంగల్లు జిల్లాలోని నెల్లికుదురులోను, వరంగల్లులోను కనిపిస్తారు. మాడభూషణి రంగాచార్యులు వారు గొప్ప విద్వాంసులు. వీరి జన్మస్థానం నెల్లికుదురు. వీరు 1912లో పరమపదించినారు. వీరు పులియాల నరసింహ దేశికుల వారివద్ద భగవద్విషయాది సంప్రదాయ గ్రంథాలను సేవించినారు. వీరు చేసిన ధనుర్మాస కాలక్షేపాన్ని విన్న నెల్లికుదురు జమీందార్ గారు వీరిని పల్లకి మీద ఊరేగించినారట. శ్రీమాన్ మాడభూషణి రంగాచార్యుల వద్ద మరింగంటి లక్ష్మణ దేశికులు, కోవెల రంగాచార్యులుగారు మొదలగు ప్రసిద్ధ పండితులు సాంప్రదాయిక గ్రంథాలను సేవించినవారే. వీరు ద్వయమంత్ర సారార్ధమైన భాగవశేషత్వ (భాగవత సేవయే భగవత్సేవ) నిష్ఠకలవారై, పలుమార్లు తదీయారాధన (భోజనం పెట్టుట) చేయడమే గాక భూదానాలు మొదలగునవి పుచ్చుకొని తిరిగి దానం చేసేవారు. వారి జీవితం ఇలా ప్రశాంతంగా గర్వరహితంగా త్యాహమయంగా గడిచింది.

ఆచార్యుల వారు తమిళ భాషలో రెండు గ్రంథాలు రచించినారు: రామానుజ రహస్యత్రయ వివరణం; రెండవది ప్రపన్న జనజీవాతువు. వీటిలో మొదటి గ్రంథం మాత్రమే 1910లో ముద్రితమైనది. ఇంతేగాక ఆచార్యులవారు భగవద్భాగవతాచార్య వైభవాన్ని ఆత్మ ప్రబోధాన్ని అనేక గ్రంథాలలోని సూక్ష్మాంశాల్ని తేటతెనుగులో చమత్కారవంతంగా తిరునామముల రూపంలో రచించారు. ఇవి శిష్యుల నాలుకను మాత్రమే ఆశ్రయించినవి.

నమిలికొండ వారి వంశం కూడా తెలంగాణాలో ప్రసిద్ధమైనదే. కరీంనగర్ జిల్లాలో వీరు ఎక్కువగా ఉన్నారు. వీరు కూడా దాదాపుగా 17వ శతాబ్దంలో ఆచార్య పురుషులుగా ప్రసిద్ధులైనవారే.

“పులియాల” – గృహ నామముగల కుటుంబంలో శాస్త్ర పండితులు నిష్ణాగరిష్ఠులు, భగవద్విషయ వేత్తలైన పండితులు కలరు. వీరి నిలయము వరంగల్లు జిల్లాలోని మాటేడు. ఈ కుటుంబంలో సర్వ ప్రసిద్ధులైన మహానుభావులు పులియాల నృసింహదేశికులు. వీరు సంస్కృత వ్యాకరణ శాస్త్రంలో గొప్ప విద్వాంసులుగా ప్రసిద్ధులు. అంతేగాక ప్రమాణ పరతంత్రులు. గొప్ప భగవద్విషయవేత్త. ఎంతో మంది శిష్యులకు మంత్రోపదేశం చేసినవారు. వీరు కాశ్యప సగోత్రులు. దేశికులవారు 19వ శతాబ్దంలోనివారే. వీరివద్ద మాడభూషి రంగాచార్యులువారు వ్యాకరణం – సంప్రదాయ గ్రంథాలను అధ్యయనం చేసినవారు. వీరి పేర “నృసింహదేశిక చరిత్ర” అను గ్రంథము కూడా ముద్రితమైనది.

ఆంధ్ర దేశములో మరింగంటివారు వైదుష్యంలోను, కవిత్వంలోను, సంత్సంప్రదాయాచరణలోను ప్రసిద్ధులు. విజయనగర సంస్థానంలో ఆస్థాన పండితులుగా, కవులుగా గౌరవవింపబడిన యీ పండిత కుటుంబాలలో స్తంభాలు విసుఱ్ఱాళ్ళు కలాపీధ్వనులలోను కవిత్వం వినిపించేదని “రత్న ఖేట దీక్షత పరాజయ” వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. అలాంటి పండిత కుటుంబాలే తెలంగాణా ప్రాంతంలో కొన్ని స్థిరపడినవి. వీరు మౌద్గల్య గోత్రోద్భవులు. మరింగంటి నృసింహ దేశికులు – అప్పల దేశికులు – శ్రీనివాస దేశికులు మిక్కిలి ప్రసిద్ధులు – ఆచార వ్యవహారములను బట్టి, పంచ సంస్కార ప్రధాన యోగ్యతను బట్టి, భగవద్విషయాది గ్రంథ ప్రవచన వైలక్ష్యమును బట్టి వీరికి దేశికత్వం లభించింది. అది సామాన్య శ్రీవైష్ణవుల కందునది కాదు. వీరికి సిరిపురం సంస్థానం వారు కోదాడ దగ్గర అగ్రహారం ఇచ్చినారట. అక్కడ స్థిరపడ్డారు. నడిగూడెం సంస్థానం రెడ్డిరాజులు (కీసరి, నాయినివారు) నరసింహాపురం అగ్రహారాన్ని వీరికి సమర్పించినారు. ఒక శాఖ అక్కడికి వెళ్ళింది. వీరనేక తిరునామములను అనుగ్రహించి, శ్రీవైష్ణవ సిద్ధాంతమును పండిత పామరుల నాలుకలపై నాట్యమాడించినారు. వీరు దాదాపు 17వ శతాబ్దివారే. ‘మరింగంటి కవుల సాహిత్యసేవ’ అనే అంశంపై శ్రీ కోవెల సంపత్కుమారాచార్యుల వారి పర్యవేక్షణలో శ్రీ రంగాచార్య (పాలెం ఓరియంటల్ కాలేజి ప్రిన్సిపాల్) పరిశోధన చేసి డాక్టరేటు పొందారు. వారి పరిశోధన గ్రంథంగా వెలువడింది.

పైకోవకు చెందినవారే మరింగంటి లక్ష్మణ దేశికులవారు. వరంగల్లులోని ఇప్పటి పంచాంగకర్త మరింగంటి పీతాంబరాచార్యులవారి తాతగారు. వీరి నివాస స్థలం జనగామ తాలూకాలోని మల్లంపల్లి. వీరు దాదాపు నూట అరవై తిరునామాలు రచించినారు. ఇవన్నీ సంకలితములు. ఈ తిరునామాలలో దాదాపు వందకు పైగా భగవద్రామానుజలను గూర్చి, మిగిలినవి భగవద్భాగవతాచార్యులను గూర్చి ఉన్నవి. కొన్నింటిలో వీరి ఉదాత్త్వాత్వం చిత్రించబడింది. మరి కొన్ని వారి పేరున అంకితం చేయబడినవి. వీరికిగల భగవత్ భాగవతాచార్య పారతంత్ర్యనిష్ఠ మెండు.

దాదాపుగా వీరికి సమకాలికులైనవారు అమరవాది నారాయణాచార్యులు (వరంగల్లు). వారికి భగవద్విషయం కాలక్షేపాన్ని ప్రసాదించినవారు మరింగంటి చెన్నమాచార్యులు గారు (10). వీరు ప్రసిద్ధ భగవద్విషయ వేత్తలు. వీరు ఎంతో మందికి భగవద్విషయం సేవింప చేసినారు. వీరు మహబూబాబాద్ తాలూకాలోని గుండంరాజుపల్లి గ్రామంలో ఉండేవారని పెద్దలు చెప్పుతారు.

వరంగల్లులోని అమరవాదివారి కుటుంబంలో మహాపండితులు జన్మించినారు. వారు అమరవాది నారాయణాచార్యులుగారు. వీరు జననం 1874. పరమపదించుట 1939. వీరు శ్రీభాష్యభగవద్విషయ, పురాణపండితులు. రామానుజయశోభూషణం, సుదర్శన శతక వ్యాఖ్య, నీలాకల్యాణము అను గ్రంథాలను రచించారు. శ్రీ పెరుంబూదూరులోని కుండలం స్వామి వద్ద శాస్త్రాభ్యాసం చేసి శ్రీభాష్యాది సంప్రదాయ గ్రంథాలను సేవించి, వరంగల్లులోనికి వచ్చి సంస్కృత పాఠశాలను నిర్వహించారు. శాస్త్రార్థ వాదనలతో పాండిత్య ప్రకర్షను ప్రకటించి వరంగల్లు నగరానికి వన్నె తెచ్చినవారు వీరు. వీరు మరింగంటి చెన్నమాచార్యులవారి వద్ద భగవద్విషయం సేవించారు. తాము సేవించిన గ్రంథాలను పునఃప్రవచనం చేసి ఎంతో మందిని శ్రీవైష్ణవులుగా మార్చారు. వీరి కుమారులు వేంకట నర్సింహాచార్యులుగారు కూడా ఉ.వే. పండితులు. సంస్కృతాంధ్ర తమిళాలలో కవిత్వం వ్రాసిన కవులు; ద్రావిడ భాషలోని నాలుగువేల పాశురాలకు (నాలాయిరం) కూడా వ్యాఖ్యాన వివరణం చేయగల నాలాయిర పండితులు. వీరు 1986లో పరమపదించినారు.

ఆంధ్ర ప్రాంతంలోని మోటూరు నుండి దాదాపు 100సం. క్రితం ఇటు వైపు వచ్చినవారు శ్రీ న.చ. వాత్స్య వరదాచార్యులవారు – కూనూరులో స్థిరపడినారు. వీరు గొప్ప ఆచార్య పురుషులు. తిరుపతిలోని నల్లాన్ కోవకు చెందినవారే వీరు. అష్టగోత్రులు; వీరి కుమారులు శ్రీమాన్ న.చ తాతాచార్యులు వారు. బుచ్చమాచార్యులుగారు, శ్రీమాన్ తాతాచార్యులుగారు సాహిత్య పండితులే గాక ధర్మశాస్త్రంలో అందెవేసిన చెయ్యి. వీరు కందాడై స్వామినాథ దేశికుల వారికి సమకాలుకులు, అత్యంత సన్నిహితులు.

వీరి కుమారులైన నల్లాన్ చక్రవర్తుల రఘునాధాచార్యస్వామివారు సీతారాంబాగ్ (హైదరాబాద్) పాఠశాలలో సంస్కృత విద్యాభ్యాసముతో పాటు గీతాభాష్య, శ్రీభాష్యాది సంప్రదాయ గ్రంథములను సేవించారు. వీరి అధ్యాపకులలో ఒకరైన ప్రతివాదిభయంకర వేదాంతాచార్యులుగారు వీరికి అత్యంత ప్రీతితో సంస్కృత వేదాంతాన్ని, శాస్త్రపాఠాల్ని బోధించినారు. వీరు తర్కవ్యాకరణ మీమాంసా, సాహిత్య శాస్త్రములలో ప్రవీణులు – ఉభయ వేదాంత పారీణులు. 1972 సం. డిసంబరు 17న వీరికి రాష్ట్రపతి అవార్డు లభించినది. వీరు హన్మకొండ, వరంగల్లు నగరాలలో శ్రీభాష్య – గీతాభాష్య – ఉపనిషద్భాష్య – శ్రీవచన భూషణ తిరుప్పావై; శరణాగతి గద్య కాలక్షేపాల్ని ప్రసాదించి, తిరిగి ప్రబోధించగల శిష్యులను తయారు చేసినారు. వీరు సత్సంప్రదాయ సుధ మొదలగు సంప్రదాయ గ్రంథాలను, ఈశావాస్య; కఠ; ముండకోపనిషత్తులకు వ్యాఖ్యలు రచించారు. వీరు మిక్కిలి సాత్త్వికులు. నిరాడంబర జీవితం గడిపే స్వభావం కలవారు.

తిరుమల నుండి, కాంచీపురం నుండి తెలుగుదేశానికి విచ్చేసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వంబికందాళ వారిని ఆశ్రయించిన కొన్ని కుటుంబాల వారు నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో ఉన్నారు. కుంభంరెడ్డి వంశంవారు పోషించగా విస్తరించినవీ కుటుంబాలని వారికి అత్యంత సన్నిహితులైన శ్రీవైష్ణవులు వివరించారు. ఈ కుటుంబాల వారు నల్లగొండ జిల్లాలోని నిడిచెనమెట్లలో స్థిరపడి, శ్రీవస్త్స గోత్రీకులుగా వ్యవహరింపబడ్డారు. ఈ కుటుంబీకులు చక్కని ఆచారనిష్ఠాగరిష్ఠులు. పెద్దలనుగ్రహించిన సంప్రదాయాన్ని బాగుగా నిలబెట్టిన అనుష్ఠాతలు. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వేంచేసినవారు. నిడిచినమెట్ల ప్రాంతం వారైన కందాడై స్వామినాథాచార్యులు గారు (వేంకటాపురం – జి. వరంగల్లు) భగవద్విషయంలో గొప్ప నిష్ణాతులు. గొప్ప బ్రహ్మవేత్త. భగవద్‍నిష్ఠగల పరమ ప్రపన్నులు. అనేక మార్లు భగవద్విషయ కాలక్షేపము – భాగవత తదీయారాధనలు చేసినవారు. కాంచీ ప్రతివాది భయంకరం అణ్ణంగరాచార్యులు గారిచే పల్లకిపై ఊరేగింపబడి సన్మానింపబడినవారు. వీరికి సప్రదాయ గ్రంథములలోని మూల పంక్తులు, ప్రాస్తావిక రామాయణాది ప్రామాణిక శ్లోకములు కంఠస్థములు; కరీంనగర్ జిల్లాలో ఆచార్య పురుషులుగా మంచి స్థానమును పొంది, అనేకమంది వెలమలను, శ్రీవైష్ణవులను శిష్యులుగా చేసుకొన్న శ్రీవాత్స్య విద్యత్కండాళై శ్రీరంగ శఠకోపాచార్యులు వారు స్వామినాథ దేశికులవారి కుమారులు. వీరు కూడా తండ్రి గారి వలెనే దేశిక స్థానం పొందినారు.

శ్రీ స్వామినాథ దేశికుల వారి 7గురు మేనల్లుళ్ళు సముద్రాల పెద్ద రంగాచార్యులు గారు, చిన రంగాచార్యులు గారు మొదలగువారు. వీరు తమలోని యోగ్యత వల్ల పూర్వులనుండీ పరంపరగా సంక్రమింపజేసుకొన్న ఆచార్యత్వము కలవారే. వరంగల్లు జిల్లాలోని అయోధ్య, ముడుపుగల్లు, గుండ్రేపల్లి గ్రామాలలో స్థిరపడ్డారు.

పైవారికి సమకాలికులైన శేష – గోవర్ధనం అని జంటగా చెప్పబడే ఆచార్య పురుష కుటుంబాలు వరంగల్లు జిల్లాలోని చిన్నగూడూరు, ఇసుగుర్తి, ధర్మసాగరం, పాలకుర్తి మొదలగు ప్రాంతాలలో ఇప్పటికీ కనిపిస్తారు. దాదాపు 100 సంవత్సరాల క్రితం వారైన గోవర్థన భట్టర్ దేశికులవారు (చిన్నగూడూరు) శ్రీ రంగంలోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో మూడుసార్లు తీర్థం గ్రహించినారట. (దక్షిణ దేశంలో అచ్చటి స్థానాచార్యులకు తప్ప యీ గౌరవము ఎవ్వరికి ఇవ్వరు.) వీరి వైదుష్యం వీరికా ఆలయ మర్యాదభాగ్యాన్ని కలిగించిందట. వీరారోజులలో గొప్ప భాష్య భగవద్విషయవేత్తగా గౌరవింపబడ్డారు. “విద్వాన్ సర్వత్ర పూజ్యతే” అను ఆర్వోక్తి వీరికి అన్వయించింది. ఇదే వంశంలో వీరి తాతగారైన గోవర్ధనం భట్టర్ దేశికులు వారు భగవద్విషయం కాలక్షేపం చేస్తూనే బ్రహ్మ రంధ్రం భేదించి పరమపదించినారని వారి వంశీయులు చెప్పుతారు.

ఇనుగుర్తిలోని గోవర్ధనం వారి వంశంలో కూడా ధర్మాచార్యులు, భట్టరాచార్యులు, వేంకటప్పలాచార్యులుగారను ఆచార్య పురుషులు సదాచార సంపత్తి కలవారై అనేక శిష్యులకు పంచ సంస్కార మంత్రోపదేశాలు చేసినారు. వీరికి ఇప్పటికిని హైదరాబాద్ నుండి మద్రాసు వరకు పరంపరగతి శిష్యకోటి ఉన్నది. ఇదే గ్రామంలోని చింతపట్ల నరసింహాచార్యులుగారు, దాశరథి రాఘవాచార్యులుగారు కూడా భగవద్విషయ వేత్తలు.

శేషం వారి కుటుంబాలు అక్కడక్కడ కనిపిస్తాయి. వీరు కౌండిన్య గోత్రోద్భువులు; వీరి స్వయమాచార్య పురుషులు. ఇనుగుర్తికి సమీపంలోని చెట్ల ముప్పారంలోని శేషం శ్రీనివాసాచార్యులుగారు పండితులు – కవులు – నైష్ఠికులు. కృష్ణమాచార్యులుగారు స్వామినాథ దేశికులకు జామాత. స్వామినాథ దేశికులవద్ద ఆచార్య సంబంధాన్ని పొందిన కండ్లకుంట లక్ష్మీ నరసింహాచార్యులుగారు, శ్రీనివాసా చార్యులుగారు ఇద్దరూ సదాచారపరులు – అనుష్ఠాన వేదాంతులు, పెద్దవారు భగవద్విషయవేత్తలు – వాస్తుశాస్త్ర పండితులు; రెండవ వారగు కం. శ్రీనివాసాచార్యులుగారు షోడషకర్మాధికారి; ప్రతిష్ఠాంతం దేవయాజ్ఞికం చేయించు గొప్ప సంస్కారి. పెద్దవారి నివాసం శ్రీరామగిరి – రెండవవారిది ఇనుగుర్తి.

ఇంకను ముడుంబై; వెలిగలేటి; ఓలేటి; శ్రీభాష్యం; దరిపెల్లి; మంత్రరత్నం మొదలగు కుటుంబాలెన్నో సదాచారం కలవి కనిపిస్తాయి. ఇప్పటికినీ భగవదారాధనలో కాలక్షేపం చేస్తున్న వారున్నారు. కాల ప్రభావంవల్ల, లౌకికములైన ఉద్యోగాదులవల్ల ఆచార వ్యవహారాదులు కొంచెం తగ్గినను ఆ వాసన మాత్రం వదలలేదని చెప్పవచ్చును.

పైన చెప్పిన వంశములేగాక వరంగల్లు నగరంలోని ‘ఠంయాల’ వారి వంశస్థులు చాలామంది యున్నారు. ఠంయాల అనునది వీరికి బిరుద నామము. అంతకు క్రితం వీరు “పాడిచేటి” వారు. ఈ కుటుంబీకులలో ఠంయాల లక్ష్మీ నరసింహాచార్యులుగారు వేల్పుగొండ లక్ష్మీనృసింహస్వామి భక్తులు. వారిపై శతకాన్ని రచించి తమ భక్తిని ప్రకటించారు. వీరి ఆంధ్ర తత్త్వత్రయము ప్రసిద్ధి గాంచినది. ఈ గ్రంథంవల్ల వీరు సంప్రదాయానికి చేసిన సేవ మిక్కిలి ప్రశంసనీయమైనది. వీరు రచించిన అనేక క్షేత్రమాహాత్మ్యాలూ – ప్రబంధాలూ – ఇతర రచనలూ సంప్రదాయాన్ని ప్రకటించేవి.

ఇక స్థానిక వైష్ణవ కుటుంబాలలో ఆంధ్ర ప్రాంతమునుండి మద్రాసు ప్రాంతమువరకు ప్రసిద్ధి చెందిన కుటుంబం ఒకటి వుంది. అదే కోవెల రంగాచార్యులుగారి కుటుంబము. వీరు 1885 సంవత్సరంలో వరంగల్లు జిల్లాలోని నెల్లికుదురు గ్రామంలో జన్మించారు. ఆచార్యుల వారి జీవితం చాలా ఒడుదుడుకులతో నడిచింది. కేవలం స్వయంకృషితో ఉత్తమస్థాయి నందుకొన్న మహాపండితులు రంగాచార్యులుగారు. నైష్ఠిక కుటుంబంలో క్రీ.శ. 1885లో నరసమాంబ, అప్పలాచార్య దంపతుల ద్వితీయ సంతానంగా జన్మించారు. వీరికి విద్యాతృష్ణ ఉన్నను పరిస్థితుల ప్రభావంవల్ల బాల్యంలో విద్యాభ్యాసం సాగకపోవడం వల్ల 20 సంవత్సరాల వయస్సులో శ్రీ అమరవాది నారాయణాచార్యులగారి వద్ద విద్యాభ్యాసం ప్రారంభించి, అక్కడ సరిగా సాగకపోవడం వల్ల విజయనగరం వెళ్ళి, అక్కడ రాజాగారి కళాశాలలో తర్కశాస్త్రాధ్యయనం ప్రారంభించారు.

అచ్చట కొంతకాలానికి శ్రమ ఎక్కువ కావడంవల్ల జబ్బుపడిన స్వామివారు వరంగల్లుకు తిరిగి వచ్చి ఆరోగ్యం కుదుర్చుకొని “తుని”కి వెళ్ళి అక్కడ శ్రీరంగాచార్యులవారి అనుగ్రహం వల్ల శ్రీమద్రామానుజ సూత్రభాష్యం, గీతా భాష్యం ఇతర సంప్రదాయ గ్రంథములు సేవించడం జరిగింది. వీరు నెల్లి కుదురులోని శ్రీమాన్ మాడభూషణి రంగాచార్యులుగారి వద్ద భగవద్విషయాది సంప్రదాయ గ్రంథాలను సేవించడం జరిగింది. కొంతకాలం చిట్యాలలో ఉండి వరంగల్లులో స్థిరనివాసం ఏర్పరచుకొన్న శ్రీ స్వామివారు తమ మధుర గంభీరమైన – సర్వజన రంజకమైన ఉపన్యాసాలను యావదాంధ్రమున వినిపించి “ఉపన్యాస కేసరి” “సుబోధక సుధీమణి” అను బిరుదులు పొందినారు. కంచి నుంచి విజయనగరం వరకు వారి ఉపన్యాసామృతము ప్రవహించని ప్రదేశము లేదు. శ్రీభాష్య భగవద్విషయాదులను ఎన్నోమారులు కాలక్షేపము చేసినారు.

ఇట్లు పరమ యోగ్య భాగవతోత్తముల కుమారులుగా జన్మించినవారు నలుగురు. అందు పెద్దవారు శ్రీమాన్ కోవెల వేంకట నరసింహాచార్యులుగారు; రెండవవారు శ్రీమాన్ కోవెల లక్ష్మీనరసింహాచార్యులుగారు; మూడవవారు శ్రీమాన్ కోవెల అప్పలాచార్యులు గారు. నాల్గవవారు; శ్రీమాన్ కోవెల సంపత్కుమారాచార్యులు గారు; వీరందరును సంప్రదాయ వేత్తలు. ప్రాచీన పద్ధతిలో తండ్రిగారి వద్ద సేవించిన అనేక గంభీరార్థములు వీరికి ఇప్పటికిని ఉపస్థితిలో ఉన్నవి. ప్రస్తుతం వీరు శిష్యోద్ధరణకై అచ్చటచ్చట పర్యటించుచూ సంప్రదాయార్థాలను కాలక్షేపరూపంలో వివరిస్తున్నారు. వ్యక్తిత్వమును బట్టి కూడా వీరు సౌమ్యులు. భాగవతనిష్ఠ కలవారు.

ఇక నాల్గవ వారైన కోవెల సంపత్కుమారాచార్యులుగారు లౌకికమైన ఉద్యోగ నిర్వహణలో ఉన్నను, సంపూర్ణ సంప్రదాయాభిమానిగా గోచరిస్తారు. వీరు గొప్ప కవులు – పండితులు – విమర్శకులు – నిరాడంబరజీవి. తీగను మీటితే రాగం వస్తుంది అన్నట్లు వీరిని కదలిస్తే చాలు – సద్విమర్శ ప్రవాహంవలె వస్తుంది. వీరి పరిశోధన గ్రంథము – స్వతంత్ర గ్రంథములు – కృతులు – విమర్శ గ్రంథములు అన్నియు సాహిత్య పిపాసువులకు సువిదితములు. వీరు బహు సమ్మాన పాత్రులు.

Footnotes:

  1. నరసింహపురం మరింగంటివారు; మరింగంటి లక్ష్మణదేశికులు (మల్లంపల్లి నివాసి.)
  2. (a)కరీంనగర్ జిల్లాలో శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని పాటించే మాల దాసరులు ఉన్నారు. వీరు పంచసంస్కారాలు పొందినవారు. నిరహంకారులు – దాసనాములు. ప్రస్తుతం ‘నిత్యస్వాములు’ అనే పేరుతో వ్యవహరింపబడుచున్నారు. (b)శాత్తాద శ్రీవైష్ణవులు కూడా వున్నారు. వీరు శిఖా యజ్ఞోపవీతరహితులు. కేవల ద్రావిడ ప్రబంధానుసంధాతలు. వ్యాపారవైష్ణవులు కూడా కలరు. వీరిలో భగవద్విషయి పండితులు, నైష్ఠికులున్నారు.
  3. పరమాత్మ చిత్తును (ఆత్మను) ఆచిత్తును (ప్రకృతిని) ప్రళయంలో తనలో ఉపసంహరించుకుంటాడు. (అత్తాచరాచరగ్రహణాత్ – (బ్ర.సూ) సృష్టించి ఆ రెండింటిలో అంతః ప్రవేశం చేస్తాడు (అన్తః ప్రవిష్టః శాస్తా జననాం సర్వాత్మా – ఉపనిషత్ ) కనుక మూడు పదార్థాలు కలిసి ఒకే వస్తువుగా గ్రహించబడిన నారికేళం వంటివాడు పరమాత్మ. ఇదే తత్త్వత్రయం – విశిష్టాద్వైత సంప్రదాయము.
  4. శ్రీరంగంలో వీరికి వందలాది కుటుంబాలలో దాయాదులున్నారు. జాతాశౌచ, మృతా శౌచముల బాధ శ్రీరంగనాథుని కైంకర్యానికి భంగమని వీరు సన్న్యసించినారు. అంతటి నిర్మలమైన భక్తికలవారు వీరు.
  5. ముదలియాండాన్ అను రామానుజులవారి శిష్య సంతతి
  6. ఈ పీఠం ఇప్పటికిని వానమామలైలో కొనసాగుచున్నది.
  7. కేసముద్రం (మండలం) గ్రామానికి 7 కి.మీ. దూరంలో – జి. వరంగల్లు.
  8. మాదన్నపేట దగ్గరలో జి.వరంగల్లు.
  9. వీరు ఆచార్య పురుషులు. శ్రీభాష్యానికి శ్రుత – ప్రకాశికా వ్యాఖ్యానమును వ్రాసినవారు.
  10. మరింగంటి చెన్నమాచార్యులుగారు – అమరవాది నారాయణాచార్యులుగారు, శ్రీవాత్స్య విద్వత్కందాడై స్వామినాథ దేశికులు; సుబోధకసుధీ – మణి శ్రీమాన్ కోవెల రంగాచార్యులుగారు; శ్రీమాన్ వెలగలేటి నృసింహదేశికులు; శ్రీ న.చ.తాతాచార్యులు గారు; మరింగంటి లక్ష్మణ దేశికుల వారు ఇంచుమించు సమకాలికులు.

– డా. గోవర్ధనం స్వామినాథాచార్యులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here