మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-19

0
4

[భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్రను అనువదించి అందిస్తున్నారు శ్రీ శ్రీధర్ రావు దేశ్‌పాండే.]

అధ్యాయం 19 – జాతి నిర్మాణం – జాతీయ సమర్థత

[dropcap]దే[/dropcap]శం ఉత్పాదక శక్తి, వినియోగదారుల డిమాండ్లు, పరిపాలనా సామర్థ్యం, జాతీయ, అంతర్జాతీయ కార్యకలాపాలు, రాజకీయ సంకల్పం, వ్యాపార కార్యకలాపాలు, సాంస్కృతిక సామర్థ్యం మొదలైన వాటి మధ్య సరైన సమతుల్యతను సాధించాలని అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలో పాలకులు గుర్తించారు. కాబట్టి, భవిష్యత్ కార్యకలాపాలు, ఆచరణలను ఫలవంతమైన మార్గాలలోకి మళ్లించడానికి, మార్గనిర్దేశం చేసేందుకు ప్రభుత్వ సహకారంతో, ప్రజల ద్వారా, ప్రజల కోసం, ఆలోచనాత్మకమైన పని విధానాలను, పథకాలను రూపొందించడం మనం కూడా ఈ దేశంలో ప్రారంభించాలి.

జాతి నిర్మాణం – దాని లక్ష్యాలు:

ప్రణాళిక అనేది ఏదైనా నిర్దిష్ట అభివృద్ధి, లక్ష్యం లేదా ప్రయోజనాన్ని సాధించడానికి అవసరమైన కార్యాచరణను సూచిస్తుంది. ప్రజా శ్రేయస్సు కోసం ప్రణాళికలు తయారు చేయాలనే ఆలోచన ప్రజా పరిపాలనలో అంతర్లీనంగా ఉంటుంది.

ఒక రాష్ట్రం లేదా ప్రాంతం కోసం ఒక ఆర్థిక ప్రణాళిక అనేది దాని వనరులు, మానవ శక్తిని పూర్తిగా, అత్యంత లాభదాయకంగా ఉపయోగించడం ద్వారా దాని ఆదాయాన్ని, జీవన ప్రమాణాలను, భౌతిక సంపదను పెంచడం ద్వారా దేశ జానాభా ఆర్థిక శక్తిని పెంచే చర్యను వివరించే పథకం.

ఆర్థిక ప్రణాళికతో పాటు, తక్షణమే లేదా తరువాత కాలంలో నైనా, జాతీయ జీవితంలోని ఇతర రంగాలలో.. పరిపాలన, రక్షణ, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో సంస్కరణలు, పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రశ్నలు తప్పక ప్రజల ముందుకి వస్తాయి. ఇవి ఒకదానితో ఒకటి పరస్పర సంబంధాలు కలిగి ఉంటాయి. వాటిలో మార్పులు వేగంగానో లేదా నెమ్మదిగానో అనివార్యం. ఈ అన్ని విభాగాల క్రింద ప్రణాళిక అనేది ‘జాతీయ ప్రణాళిక’ లేదా ‘దేశ నిర్మాణం’ అనే సమగ్ర శీర్షిక క్రిందకు వస్తుంది. ఈ విభాగాలన్నిటిలో ఆర్థిక ప్రణాళికను మొట్ట మొదట సమర్థవంతంగా అమలులోకి తీసుకువస్తే, అది దేశ నిర్మాణం, జాతీయ సామర్థ్యాన్ని, ఇతర అన్ని ప్రణాళికా లక్ష్యాలను ప్రోత్సహించడానికి ఆర్థిక వనరులను అందించే అవకాశం ఉంది.

ప్రస్తుత సమయంలో అభివృద్ధి ప్రణాళికల సాధారణ లక్ష్యాలు ఏమిటంటే:

  1. దేశ ప్రజలకు తగినంత పని, ఆహారం దొరకడం,
  2. మనం చేసే పనిలో పరిమాణాన్ని, నాణ్యతను పెంచడం ద్వారా ఉత్పత్తిని, ఉపాధి అవకాశాలను, ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలను పెంచవచ్చు.
  3. ఏకకాలంలో లేదా క్రమంగా ఇతర దేశ నిర్మాణ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడం, తద్వారా ఆరోగ్యకరమైన, బలమైన, సంపన్నమైన దేశాన్ని అభివృద్ధి చేయడానికి, స్వీయ నియంత్రణ, సాధ్యమైనన్ని అంశాలలో స్వయం సమృద్ధిగా ఉండటానికి కృషి చేయాలి.

ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం అనేది శుష్కించి పోయిన ఒక దేశం ఆర్థిక బలాన్ని పెంచే ఒక ఒక ప్రాథమిక దశ. ఆ పెరిగిన బలం సహాయంతో, దేశ నిర్మాణంలో సాధ్యమైనంత ఎక్కువగా పెద్ద లక్ష్యాలను అందుకోవడానికి దోహదం చేస్తుంది. భారతదేశానికి వ్యక్తిగత లేదా జాతీయ జీవిత భద్రతను పెంపొందించే ప్రణాళిక ఏదీ లేదు. ఇప్పటి వరకు మొత్తంగా ఈ దేశంలో నెలకొని ఉన్న ఆర్థిక సమస్యలను సమగ్రంగా ఏ ప్రభుత్వ సంస్థ కూడా అధ్యయనం చేసిందన్న దానికి ఆధారాలు లేవు. ఏదైనా పెద్ద స్థాయిలో జాతీయ సంస్థల పురోగతిపై నిఘా ఉంచడం లేదా వ్యాపార పద్ధతిలో నడిపించడం మన దేశంలో ఆచరణలో లేదు.

తక్షణ ఆందోళన కలిగించే సమస్యలకు జవాబుగా తగిన ప్రత్యక్ష విధానం లేదు. దేశంలో జనాభా పెరుగుదల, ఆహార సరఫరా, నిరక్షరాస్యతను తొలగించడం, పూర్తి ఆటోమొబైల్, విమానం లేదా ఇతర భారీ స్థాయి యంత్రాల తయారీ వంటి వాటిలో కూడా మనకు విధానాలు లేవు. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు కూడా అస్తవ్యస్తంగా లేదా అసమగ్రంగా ఉన్నాయి. అటువంటి లోపాలను తొలగించడానికి మంచి సాంకేతిక ప్రాతిపదికన తగిన ప్రణాళికలు లేదా చర్యలు చాలా కాలంగా తీసుకోవలసి ఉండింది.

జాతీయ ప్రణాళికా సంఘం : (Planning Commission of India)

సాధారణ అభివృద్ధి పనులను ప్రోత్సహించడానికి, అత్యవసరంగా అవసరమైన సంస్కరణలు, పునర్నిర్మాణ చర్యలపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది.

ప్రణాళికా సంఘం తక్షణమే చేపట్టాల్సిన పని.. ఇంతకు ముందు చెప్పినట్లుగా, ప్రజలను ఎక్కువగా ఆలోచించేలా, మరింత ఎక్కువ పని చేసేలా చేయడం. ముందుగా జనాభాకు సరిపడా ఆహారాన్ని సరఫరా చేయడం, దేశలో లభ్యమయ్యే సహజ వనరులను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా దేశ ఆర్థిక బలాన్ని, ప్రజల జీవన ప్రమాణాలు వేగంగా పెరగడం.

ప్రధాన మంత్రి అధ్యక్షుడిగా 15 మార్చ్ 1950 న జాతీయ ప్రణాళికా సంఘం ఏర్పాటు

భవిష్యత్తులో ఏ కొత్త పునర్నిర్మాణ చర్యలు రూపొందించినా ప్రతి ప్రణాళిక లేదా పథకం కింద ఆశించిన నిర్దిష్ట ఫలితాలను అంచనా వేయడం, అలాగే అవి అందుకోవడానికి పట్టే సమయం తదితర అంశాలు స్పష్టంగా పేర్కొనాలి.

జాతీయ నిర్మాణంతో సంబంధం ఉన్న అంశాల పట్టిక తయారీ:

జాతీయ ప్రణాళిక, కార్యాచరణలో చోటు కల్పించే అత్యంత ప్రముఖమైన ప్రజా ఆకాంక్షలు, ప్రజా జీవనంలో ఉన్న లేమికి సంబందించిన పట్టికలు లేదా జాబితాలు ప్రణాళికా సంఘానికి అందుబాటులో ఉండటం మంచిది. అటువంటి కొన్ని అంశాల స్థూల సారాంశం క్రింది పేర్కొన్నాను:

(i) సంస్కరణలు, ఆవశ్యకత లేదా ప్రాముఖ్యత ఉన్న అభివృద్ధి అంశాలు:

నిధుల కొరత ఉన్నందున, వీటిలో అత్యవసరమైన లేదా అత్యంత ముఖ్యమైన వాటిలో కొన్నింటికి మాత్రమే ప్రారంభంలో ప్రాధాన్యత ఇవ్వాలి

ఈ దేశంలోని సగటు పౌరుడు తన సముపార్జన శక్తులు తక్కువగా ఉంటే, అతని జీవన ప్రమాణం పేదగా ఉంటే, అది అతనిలో ఇమిడి ఉన్న స్ఫూర్తిని, అతని శారీరక, మానసిక శక్తులను అసంపూర్ణంగా ఉపయోగించడం వల్లనే అని గుర్తుంచుకోవాలి. మానవ శ్రమే సర్వ శ్రేయస్సుకు మూలమని అతనికి ఇంకా బోధపడలేదు.

ప్రతి యోగ్యమైన పౌరుడు తన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రేరేపించడం, స్వయం సహాయం కోసం, అలాగే అతనిపై ఆధారపడిన వారి జీవనం కోసం కష్టపడి పనిచేయడం దేశ విధానంగా ఉండాలి. అతను తనకు వీలైనప్పుడల్లా, తన సంపాదనలో కొంత భాగాన్ని జాతీయ సంపదను, భద్రత పెంపొందించడానికి కూడా వితరణ చేయాలి.

ప్రాథమిక వృత్తులలో చిన్న రైతులు, హస్తకళాకారులు, చిన్న దుకాణదారులు వంటి కోట్లాది జనాభాకు క్రమబద్ధమైన శిక్షణ నిరంతరం సంకోచం లేకుండా కొనసాగించాలి.

ఉక్కు, యంత్ర పరికరాలు, యంత్రాలు, ఆటోమొబైల్, విమానాలు, నౌకా నిర్మాణం వంటి నిర్దిష్ట పరిశ్రమలు, దేశ ప్రజలకు తెలియని కారణాల వలన ఆగిపోయి ఉన్నాయో వాటిని సంతృప్తికరమైన రీతిలో పునరుద్ధరించాలి. ఈ పరిశ్రమలు సరిగ్గా అభివృద్ధి చెందితే, అదే సమయంలో అవి దేశ సేవ కోసం అర్హత కలిగిన సాంకేతిక నిపుణులను కూడా సమృద్ధిగా అందిస్తాయి.

దేశంలో పారిశ్రామికీకరణ సమస్య మొత్తంగా అపరిష్కృతంగానే ఉంది. దేశం ఎప్పటికీ వ్యవసాయ దేశంగానే ఉండాలని ఎంచుకుంటే తప్ప, ప్రభుత్వం, వ్యాపార, వాణిజ్య రంగాల నాయకులు ఇద్దరూ పారిశ్రామీకీకరణ సమస్యను తక్షణమే పరిగణనలోకి తీసుకొని పరిష్కరించాలి.

పారిశ్రామికవేత్తలు, నిపుణులు ఆమోదించిన ప్రణాళిక కంటే మరింత మెరుగైన ప్రత్యామ్నాయ ప్రణాళికా ప్రభుత్వం వద్ద అందుబాటులో లేని పక్షంలో, కొంతకాలంగా ప్రభుత్వం ముందున్న అఖిల భారత తయారీదారుల సంస్థ (All India Manufacturers Organization) రెండు భాగాలుగా ప్రతిపాదించిన పారిశ్రామికీకరణ పథకంపై దాని అనుకూలతలను దృష్టిలో ఉంచుకొని సత్వరం నిర్ణయాలు తీసుకోవాలి.

అవసరమైన సమాచారం, గణాంకాలు అందుబాటులో ఉంచితే, పథకంలో ఏదైనా ఒక భాగాన్ని సిద్ధం చేసి, ఏ ప్రాంతానికి అయినా స్వల్ప కాల నోటీసులో సరఫరా చేయవచ్చు.

ప్రతి రాష్ట్రానికి ఒకటి నుంచి మూడు పరిశ్రమల చొప్పున దేశమంతటా భారీ, కీలకమైన పెద్ద పరిశ్రమలను పంపిణీ చేయాలి.

దేశంలోని అన్ని ప్రాంతాలు ఆధునిక విజ్ఞానం, నైపుణ్యాలతో ప్రయోజనం పొందేలా, సముపార్జన స్ఫూర్తిని పెంపొందించేలా నిధులు, అటువంటి పరిశ్రమల నిర్వహణ బాధ్యతలను కూడా తగిన విధంగా పంపిణీ చేయాలి.

ఈ చర్యల వలన కేంద్ర ప్రభుత్వానికి తనకు తాను స్వచ్ఛందంగా తీసుకున్న బాధ్యతల నుంచి లేదా భారం నుంచి చాలా మట్టుకు ఉపశమనం లభించనుంది. ప్రభుత్వం అన్ని బాధ్యతలు తన పైననే వేసుకుంటే అది అవసరమైన స్థాయిలో పరిశ్రమల నిర్వహణ బాధ్యతలను మోయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది తన సాధారణ నియంత్రణను కొనసాగిస్తూనే అన్నిరకాల సహేతుకమైన సహాయం, ఆచరణాత్మక రాయితీలను అందించడం ద్వారా సంతృప్తి చెందాలి.

“ఆహారాన్ని ఎక్కువగా పండించండి” ప్రచారం లేదా రెండు సంవత్సరాలకు సరిపడా ఆహార సరఫరా నిర్వహణ వంటి పెద్ద అభివృద్ధి పథకాలను ముందుకు నడిపే బాధ్యతను, ఇప్పటికే వివరించినట్లుగా, వీలైనంత వరకు రాష్ట్రాలకు వికేంద్రీకరించాలి. లేదంటే చివరకు ఆ ప్రాంతంలో నిజమైన లబ్ధిదారులైన స్థానిక జనాభాపై పడతారు. ప్రాంతీయ జనాభాను ఈ పెద్ద పథకాల నిర్వహణ, అటువంటి ఇతర సమస్యలకు బాధ్యత వహించేలా చేయడంలో మరింత ఆలస్యం జరగడాన్ని అనుమతించడం దేశానికి శ్రేయస్కరం కాదు.

గణాంకాల సేకరణ సరైన, శాస్త్రీయ ప్రాతిపదికన జరగాలి. ఇది మన దేశంలో అనాదిగా నెలకొని ఉన్న లోటు. ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు చేసిన ప్రయత్నం ఇంకా అసమర్థంగా, అసంపూర్ణంగా ఉంది.

(ii) దీర్ఘకాల స్వభావం కలిగిన సంస్కరణలు, అభివృద్ధి:

చాలా ముఖ్యమైన లోపాలు, ప్రత్యేక, సుదీర్ఘ ప్రయత్నాలు అవసరమయ్యే వాటిని పరిష్కరించాలని అనుకుంటున్న అంశాలలో ఈ క్రింది వాటిని పేర్కొనవచ్చు:

  • దేశంలో సాధారణంగా తక్కువ స్థాయి సామూహిక విద్య.
  • ఉత్పత్తి లేదా పునర్నిర్మాణం కోసం తక్కువ నిర్వహణా సామర్థ్యం.
  • గతాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పరిశ్రమల మందగమనాన్ని వేగవంతం చేసే ప్రయత్నాలు ఇప్పటికీ చాలా బలహీనంగా ఉన్నాయి.
  • దేశ పరిపాలనకు అబ్బిన ప్రజాస్వామ్య స్వభావం కొత్తది అయినందున వివిధ దిశలలో అవసరమైన సామర్థ్యాన్ని అందుకోవడంలో ఇంకా చేయవలసినది చాలా ఉన్నది.

ఈ నాలుగు విభాగాల కింద జరిగే అభివృద్ధిపై ప్రత్యేక, తక్షణ శ్రద్ధ అవసరం. ప్రజా సేవ ఆదర్శాలను రూపొందించాలి. ఓటర్లు ఆమోదించిన విధానాలను సమర్థవంతంగా నిర్వహించాలి.

ఈ విభాగాలలో సంస్కరణలను ప్రభావశీలంగా అమలు పరచడానికి ఒక మార్గం ఏమిటంటే.. అమెరికా, కెనడా లేదా స్వీడన్ వంటి ఆధునిక ప్రగతిశీల దేశాలతో భారతదేశంలోని పరిస్థితులతో బేరీజు వేసుకొని నిరంతరం అధ్యయనం చేయడం, ఈ దేశంలో మార్గదర్శకత్వం కోసం, ఆచరణాత్మక చర్యల కోసం వారి నుండి పొందిన పాఠాలను వినియోగించడం.

(iii) జనాభాకు శిక్షణ, అక్షరాస్యత కోసం దేశ అవసరాలు:

అన్నిరంగాల పురోగతికి విద్య మూలం కాబట్టి, ప్రస్తుత విద్యా రంగ పరిస్థితిలో గుర్తించదగిన అనేక తీవ్రమైన లోపాలకు సత్వర పరిష్కారం కనుగొనడం అవసరం.

సామూహిక విద్య: దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురి అయిన సామూహిక విద్యను వేగంగా నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలి.

నిర్బంధ విద్య సోవియట్ రష్యాలో జరిగినట్లుగా ఇక్కడ కూడా దృఢ నిశ్చయంతో అమలు చేయాలి. ఈ దేశంలో అప్పుడప్పుడు అసమగ్రంగా జరుగుతున్న ప్రయత్నాలు సరిపోవడం లేదు. ఆర్థిక వనరులను సమకూర్చడంలో ఇబ్బంది ఉండవచ్చు కానీ స్థానిక ప్రయత్నాన్ని ప్రేరేపించవచ్చు. ఇతర మార్గాల్లో మూడు ‘R’ (Reduce, Reuse, Recycle) ల సిద్దాంతం గురించి జ్ఞానం పొందవచ్చు. ఏ రంగంలోనైనా పురోగతికి సామూహిక విద్య అనేది ఒక అనివార్యమైన అవసరం, ఆధారం. అది లేకుండా దేశం మొదటి శ్రేణి రాజ్యంగా ఎదగలేదు.

వృత్తిపరమైన విద్య: చిన్న, సన్నకారు రైతులు, హస్తకళాకారులు, చిన్న దుకాణదారులుగా లక్షలాది మందికి శిక్షణ ఇవ్వడానికి అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టాలని ఇప్పటికే సూచించడం జరిగింది.

తదుపరి.. ఉన్నత వృత్తి విద్య కార్మాగారాలలో పని చేసే ఫోర్మెన్ లకు, పెద్ద పారిశ్రామిక సంస్థల నిర్వహణ కోసం అవసరమయ్యే సాంకేతిక నిపుణులు, మేనేజర్ స్థాయి అధికారుల శిక్షణ.

నిర్వహకులుగా, టెక్నీషియన్లుగా, ఆర్థికవేత్తలుగా మారడానికి అర్హత కలిగిన నాయకులను దేశానికి అందించడానికి తగిన సంఖ్యలో ఉత్తమ శ్రేణి శిక్షణ ఇవ్వడానికి అనుకూలమైన అవకాశాలను కల్పించాలి.

గణాంకాల సేకరణలో శిక్షణ: ఈ దేశ స్థితిగతులను గతంలో ఉన్న వాటితో పోల్చడానికి, భారతదేశం కంటే మెరుగైన సంస్థలను ఏర్పాటు చేసుకున్న ఇతర ప్రగతిశీల దేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి, వాటి నుంచి స్పూర్తిని పొందడానికి గణాంకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఉన్నత విద్యకు మాధ్యమంగా ఇంగ్లీష్ భాష: జపాన్ దేశంలో మొదటి నుండి విశ్వవిద్యాలయాలలో మాధ్యమంగా ఇంగ్లీష్ భాషను కొనసాగించడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందింది. ప్రపంచంలోని రెండు అగ్రగామి దేశాలైన గ్రేట్ బ్రిటన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పురోగతికి సంబంధించిన అన్ని విభాగాలతో సన్నిహిత సంబంధాన్ని కొనసాగించడానికి జపాన్‌కు ఇంగ్లీష్ మాధ్యమం దోహదం చేసింది. ప్రపంచ పరిస్థితులలో ఏదైనా గొప్ప మార్పు ఇంగ్లీష్ భాషా వినియోగాన్ని వదిలివేయడాన్ని సమర్థిస్తే తప్ప, భారతదేశం ఇంగ్లీష్ భాషను కొనసాగించాలి. ఇంగ్లీష్ భాషా వినియోగం వలన తనకు ఇప్పుడు ఉన్న అనుకూలతలను, ప్రయోజనాలను కాపాడుకోవాలి.

(iv) పురోగతిని నిరోధించే కొన్ని దుస్సాంప్రదాయాలు, లోపాలను తొలగించడం:

మంచి వృత్తిపరమైన, సాంకేతిక లేదా వ్యాపార అర్హతలు కలిగి ఉన్నట్లయితే, ప్రతి రంగంలోని సామర్థ్యం ఉన్న వ్యక్తులను దేశ సేవ కోసం ఉపయోగించుకోవాలి. గ్రేట్ బ్రిటన్ (UK) లేదా అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) అనుభవాల ఆధారంగా మన దేశ ప్రజాస్వామ్యం ద్విపార్టీ వ్యవస్థగా పూర్తి పరిపక్వతతో ఎదిగే వరకు పార్టీ స్ఫూర్తికి లేదా ఇతర విపరీతమైన పరిగణనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు.

ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా, తమకు ఉపాధి దొరకని వారు, పని చేసేందుకు సిద్దపడే వారికి వృత్తులు వెతకడం ప్రభుత్వ ప్రాథమిక విధుల్లో ఒకటి. బంధుప్రీతి, వర్గ ప్రాధాన్యతలు అధికారిక జీవితంలో ఒక అసాధారణమైన నేరం. అర్హతలతో సంబంధం లేకుండా ఒకే కులం లేదా ఒకే ప్రాంతానికి చెందిన వ్యక్తులను నియమించడం తరచుగా మనం గమనిస్తూనే ఉన్నాము. ఇలాంటి పద్ధతులను రూపుమాపకుంటే భారతదేశం రెండవ తరగతి స్థాయి కంటే మించి ఎప్పటికైనా ఎదిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

‘National Life and Character’ పుస్తక రచయిత చార్లెస్ హెచ్. పియర్సన్ ఈ ‘ప్రసిద్ధమైన కానీ అత్యంత ప్రమాదకరమైన’ పద్ధతులపై ఏమి చెప్పారో నేను ఇక్కడ ఉటంకించ దలచాను.

“ప్రతిభను ప్రోత్సహించడం అనేది ఇప్పుడు ఆచరణాత్మకంగా తెలియని దేశాల్లో, సివిల్ సర్వీస్ లోని జూనియర్ వ్యక్తులకు తమకు ముందు ఆచరణలో ఉన్న పద్ధతులు, విధానాలే దాదాపు అనివార్యంగా వారికి మార్గనిర్దేశనం చేస్తాయి. బాధ్యతారహితంగా విధులను నిర్వహించడం, బంధుప్రీతి వంటివి ఈ కోవలోకి వస్తాయి. అందువల్ల, సాధారణంగా జరుగుతున్నట్టుగా, ప్రభుత్వాలు రోజురోజుకూ పరిశ్రమలపై తన నియంత్రణను నిరంతరం విస్తరింపజేస్తూ ఉంటే, తన మనుషులను మరింత ఎక్కువగా వాటిల్లోకి ప్రవేశపెడతుంటే, పరిశ్రమల్లో పోటీతత్వం నశించిపోతుంది. ప్రతిభ కలిగిన వ్యక్తులు వంచనకు గురి అవుతారు. ఇది తరచుగా జరుగుతూ ఉండవచ్చు. ఈ స్థితి మితిమీరకుండా ఉండాలంటే ఈ పద్ధతులను మొత్తంగా సేవల నుంచి తొలగించాలి. లేని పక్షంలో అన్ని విభాగాలలో పని ప్రమాణాలు చాలా తక్కువ స్థాయిలోకి కుదించుకుపోతాయి. తద్వారా ఆ సంస్థ ఒక గొప్ప సంస్థగా ఎదిగే అవకాశాన్ని కోల్పోతుంది.”

చార్లెస్ హెన్రీ పియర్సన్

అటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, అన్ని ప్రత్యేక, కీలకమైన ప్రభుత్వ నియామకాల కోసం యోగ్యత, సామర్థ్యం ఉన్న వ్యక్తులను శోధించడానికి, ఎంపిక చేయడానికి నిజమైన దేశభక్తి కలిగిన, సమగ్రత కలిగిన, తప్పొప్పులను సవరించడానికి సంసిద్దులైన నాయకులతో ఒక చిన్న కమిటీని ప్రభుత్వం నియమించాలి.

ఎంపిక చేసిన వ్యక్తులు ప్రభుత్వ విధుల్లో అధిక స్థాయిలో, ఖచ్చితత్వం, సంపూర్ణత, సమర్థత, నైతిక కోణంలో పని చేయగలగాలి.

భారతదేశంలో ఇప్పటికీ అసమగ్రంగా ఉన్న కొన్ని వ్యాపారపరమైన ఆచరణలు, పద్ధతులను అమెరికాలో మాదిరిగా ప్రత్యేక వ్యాపార, వాణిజ్య శిక్షణ ఇవ్వడం ద్వారా సరిదిద్దాలి. అటువంటి శిక్షణ ఇస్తున్న అత్యుత్తమ కళాశాలలు, పాఠశాలలను మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. అమెరికాలోని బోస్టన్ (మసాచుసెట్స్) నగరంలో ఇటువంటి అత్యున్నత స్థాయి ప్రమాణాలతో పనిచేస్తున్న సంస్థలు ఉన్నాయి.

ప్రభుత్వ సేవలో ఉన్న వ్యక్తుల ప్రవర్తనను నియంత్రించే వ్యవస్థలో ఉన్న నియమాల లోపాన్ని పరిష్కరించాలి. సరైన అధికారిక విధుల నిర్వాహణ కోసం తగిన అధికార వ్యవస్థను, నియమాలను రూపొందించాలి. వాటిని ప్రభుత్వ అధికార పరిధిలో ఉన్న అన్ని కార్యాలయాల్లో ప్రవేశపెట్టాలి. భారతీయ రాష్ట్రాల పరిపాలనలో ‘సమర్థత ఆడిట్ (Efficiency Audit)’ పేరుతో అధికారిక క్రమశిక్షణను అమలు చేయడానికి నేను నియమాల పట్టికను గతంలో జారీ చేశాను. ప్రజా సేవలను అందిస్తున్న కొన్ని శాఖలలో ఇంకా ఇటువంటి నియమాలు లేకపోవడం ఒక గొప్ప లోపంగా నాకు కనిపించింది.

సగటు పౌరుని పని జీవితంలో కొన్ని సక్రమమైన అలవాట్లు, క్రమశిక్షణపై కూడా దృష్టి పెట్టాలని అధ్యాయం 18 లో ‘జాతీయ వ్యక్తిత్వం’ శీర్షిక క్రింద కోరినాను.

మనిషి ఒక గంటకు ఉత్పత్తిని పెంచడానికి, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడానికి యంత్రాలు, యంత్ర పరికరాలను ఎక్కువగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలి.

(v) వృత్తులు:

వృత్తులు: 55 మిలియన్లకు పైగా అమెరికన్లు వారి మెదళ్ళను కొత్త తరహాలో ప్రతీ రోజు సంవత్సరాల తరబడి నిరంతరాయంగా వినియోగిస్తున్నారు. ఈ మేధోమథనం వేల సంఖ్యలో ఉన్న వివిధ వ్యాపారాలు, చేతిపనులు, వృత్తులు, వ్యాపారాలు లాంటి రంగాలలో జరుగుతున్నది. వారి సమయాన్ని, సామర్థ్యాన్ని అమెరికాను సంపన్నమైన, సురక్షితమైన దేశంగా నిలిపి ఉంచడానికి వెచ్చిస్తారు. ఇది ఎప్పటికీ ముగియని ప్రయత్నం. ఈ కృషిలో దేశంతో పాటూ తామూ వ్యక్తిగతంగా ప్రయోజనం పొందుతారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, కెనడా రెండింటిలోనూ ప్రజల వృత్తులు వివిధ గ్రూపులుగా లేదా పది విభాగాల క్రింద వర్గీకరించినారు. దాదాపు ఇదే రకమైన వర్గీకరణ మన దేశంలోనూ ఉన్నది. కానీ అమెరికాలో పది ప్రధాన గ్రూపులలో ప్రతి ఒక్కటి అనేక ఉప వృత్తులుగా విభజించినారు. ప్రతి వృత్తిలో పని చేస్తున్న స్త్రీ పురుషుల సంఖ్యను చూపే పట్టికలను కూడా తయారు చేసినారు. ఇది ఉపాధిని కోరుకునే వారికి ఏ ప్రాంతంలో ఎటువంటి వృత్తులకు సంబంధించిన ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయో స్పష్టమైన సమాచారాన్ని పొందడానికి అవకాశం ఇస్తుంది.

సమీపంలోని నగరాల్లో ఉపాధి అవకాశాల పరిస్థితిని అధ్యయనం చేయడానికి ప్రత్యేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచారు. తద్వారా ఉద్యోగం అవసరమైన ప్రతి వ్యక్తి తనకు సంతృప్తికరమైన వృత్తిని ఎంచుకోవచ్చు.

అదే విధంగా భారతదేశంలో కూడా సమగ్రంగా సంకలనం చేసిన వృత్తుల వివరణాత్మక జాబితాలను కలిగి ఉండటం అవసరం. ప్రస్తుతం ప్రభుత్వం జరుపుతున్న జనాభా గణన ఈ అవసరాన్ని తీరుస్తుందని భావిస్తున్నాను.

జాతీయ వ్యక్తిత్వం: జాతీయ ప్రణాళికా సంఘం ద్వారా జాతీయ వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి తగిన ప్రణాళికలు తయారు కావాలి.

జాతీయ వ్యక్తిత్వం స్వయంచాలకంగా తనకు తాను అభివృద్ధి చెందదు. ఇది క్రమశిక్షణ ద్వారా, మునుపటి అధ్యాయంలో సూచించిన విధంగా వ్యక్తిత్వ నిర్మాణ సూత్రాలను, నియమాలను పాటించడం ద్వారా నిర్మించాలి.

జాతీయ భద్రత: నేను ఇప్పటికే అధ్యాయం 17లో జాతీయ భద్రతకు వాటిల్లే ముప్పులను గురించి చర్చించాను. అందులో ప్రస్తావించిన ప్రమాదాలు భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక ఇతర ప్రాంతాలకు వర్తిస్తాయి. తెలిసినంతవరకు తీసుకోవలసిన చర్య ఏమిటంటే.. భారతదేశం కూడా దేశ భద్రతకు సంబందించిన అంశాలలో నిరంతర పరిశీలన, పరిశోధనలు నిర్వహిస్తూ ఉండాలి. ఈ ప్రమాదాల స్వభావంలో మార్పులపై కూడా నిరంతర నిఘా ఉంచాలి.

ఇతర చిన్న లేదా అతి చిన్న ప్రమాదాలను కూడా గమనిస్తూ ఉండాలి. వాటిలో ఒకటి ద్రవ ఇంధనం నిరంతరాయ నిర్వహణ, సరఫరా. ద్రవ ఇంధనాన్ని ఇప్పుడు మోటారు వాహనాలు, విమానాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నాము. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో ద్రవ ఇంధనం సరఫరాకు అంతరాయం ఏర్పడితే వాహనాల కదలికలపై ప్రభావం తీవ్రం ఉంటుంది. సైనిక సామాగ్రి సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చు. ఇటువంటి ప్రమాదాలకు బాధ్యతాయుతమైన ప్రభుత్వ సంస్థల ద్వారా ముందస్తు ఆలోచన, సమయానుకూల జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం.

పంచవర్ష ప్రణాళిక:

జాతీయ ప్రణాళికా సంఘం పైన పేర్కొన్న ఐదు అంశాలలో పొందుపరిచిన దేశ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చర్యలు తీసుకోవచ్చు. ఈ బాధ్యతాయుతమైన పనిలో సహాయం చేయడానికి, కమిషన్ ప్రణాళికలు, కార్యక్రమాల తయారీకి అవసరమైన సమాచారం, ఇతర వనరులను సరఫరా చేయడానికి; దర్యాప్తు, పరిశోధన, ఇతర విధులకు హాజరయ్యేందుకు కమిషన్ తన సేవలో, దాని నియంత్రణలో మూడు బ్యూరోలు లేదా బోర్డులను నియమించుకోవాలి.

బ్యూరో నెం.1: పరిపాలన సహా జాతీయ, అంతర్జాతీయ సమస్యలు, దేశ రక్షణ

బ్యూరో నెం.2: ఆర్థిక దిగుమతుల ప్రణాళికలు, వడ్డీ చెల్లింపులు, ఇతర ఆర్థిక సమస్యలు, పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్యం, రవాణా, విద్య మొదలైనవి

బ్యూరో నం.3: అన్ని ఇతర సంస్కరణలు, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి

ముందుగా సూచించినట్లుగా, రాష్ట్ర ఆర్థిక లేదా వనరులను మెరుగుపరిచే అవకాశం ఉన్న అంశాలకు ప్రణాళికల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.

పైన పేర్కొన్న అన్ని విభాగాలపై, సంబంధిత బ్యూరోలు నిశితంగా పరిశీలించాలి. అవసరమైన ప్రణాళికలు లేదా పథకాల తయారీ కోసం సేకరించిన మొత్తం సమాచారాన్ని, గణాంకాలను ఎప్పటికప్పుడు కమిషన్ ముందు ఉంచాలి. అవి పైన పేర్కొన్న ఐదు విభాగాల క్రింద ప్రతి విభాగంలో జాతీయ స్థాయిలో నెలకొని ఉన్న లోపాలు, ప్రజల ఆకాంక్షలను వ్యక్తం చేయాలి.

జాతీయ ప్రణాళికా సంఘం ముందుగా పంచవర్ష ప్రణాళికను సిద్ధం చేయాలి. ప్రతి సంవత్సరం ప్రారంభానికి ముందు ఆ సంవత్సరానికి సరిపడా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలి.

రష్యాలో అటువంటి ప్రణాళికలు తీసుకొచ్చిన విప్లవాత్మక పరిణామాల కారణంగా పంచవర్ష ప్రణాళికలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. మరే ఇతర కాలానికైనా ప్రణాళికను రూపొందించకపోవడానికి కారణం ఏమీ లేదు. ఆరేళ్లు అనవచ్చు. కానీ ఐదు సంవత్సరాల ప్రణాళిక అనేది మనకు బాగా అలవాటైన పదబంధం. కాబట్టి పంచవర్ష ప్రణాళికల పేరుతోనే పని చేయాలి.

ప్రతి ఏటా పరిస్థితులలో మార్పులు, అవసరాలను బట్టి పంచవర్ష ప్రణాళికను కూడా సవరించుకోవచ్చు.

జాతీయ ప్రణాళికా సంఘం అవసరమని భావిస్తే, పదేళ్ల ప్రణాళికను రూపొందించుకోవచ్చు. వాటిని మనం సాధించిన విజయాలను, ఇంకా సాధించవలసిన లక్ష్యాలను మనకు జ్ఞాపకం చేస్తూ మనలను జాగరూకులుగా ఉండడానికి నిర్వహించవచ్చు.

జాతీయ ప్రణాళికా సంఘం దేశంలోని వ్యాపారవేత్తలు ఖర్చు చేయగలిగిన లేదా ఈ తరగతి సమస్యలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం వద్ద ఉన్న వనరుల ఆధారంగానే కొత్త పథకాల ఎంపిక చేయాలి. మూడు బ్యూరోల సహాయంతో కమిషన్ మరింత అత్యవసరమైన, ముఖ్యమైన సంస్కరణలు, అభివృద్ధి పథకాలను వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళికలో చేర్చడం కోసం సమర్థవంతంగా ఎంపిక చేయగలదు. అత్యవసరాలు, ప్రాధాన్యతల దృష్ట్యా అత్యంత ముఖ్యమైన పథకాలను ఎన్నుకోవడం, వాటికి కార్యాచరణ సిద్ధం చేయడం కోసం వారి నిరంతర ప్రయత్నం ద్వారా కమిషన్ దేశ నిర్మాణంలో బ్యూరోలు ప్రభుత్వానికి సహాయం చేస్తాయి.

జాతీయ ప్రణాళికా సంఘం తన అన్ని అధికారాలను ఉపయోగించి దేశం ఆర్థికంగా బలోపేతం కావడం కోసం, జాతీయ సామర్థ్యంలో ఎదుగుదల కోసం దశల వారీగా కృషి చేయాలి.

పథకం మంజూరు చేసిన తర్వాత, దాన్ని చొరవతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలి. తద్వారా అంచనా వేసిన పురోగతి రేటు అంతరాయం లేకుండా సాధించగలుగుతాము.

కావాల్సిన లేదా ఉపయోగకరమైన పథకం అమలు కోసం నిధులు లేనప్పుడు, దానిని పక్కన పెట్టకూడదు. ప్రచారం చేసి దానిని ప్రభుత్వ ప్రాధాన్యతల నుంచి తొలగించలేదని ప్రజలకు చెప్పాలి. నిధులు అందుబాటులోకి వచ్చిన వెంటనే మళ్లీ పథకాన్ని చేపట్టాలి.

పేర్కొన్న మూడు బ్యూరోలు, దర్యాప్తు, పరిశోధనలతో పాటు, పథకాల పురోగతిని కూడా గమనిస్తూ, పురోగతికి అనుకూలమైన అన్ని అవకాశాలను జాతీయ ప్రణాళికా సంఘం దృష్టికి తీసుకువస్తాయి. అమలులో ఎదురౌతున్న అన్ని అడ్డంకులు అధిగమించడానికి చర్యలను బ్యూరోలు సూచిస్తాయి.

పథకాల అమలు సమయంలో దేశంలోని వనరులను నిశితంగా పరిశీలించాలి. కాలానుగుణ ప్రణాళికలను రూపొందించేటప్పుడు ప్రతి దిశలో వాటి వృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలి.

అమెరికా, జపాన్ వంటి దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవహారాలలో తమ ప్రభావాన్ని చూపడానికి ముందు వారు ఎటువంటి పరిస్థితులను అధిగమించి ముందుకు వచ్చారో ఆ అనుభవాలను భారతదేశం పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తం భారతదేశంలో నెలకొని ఉన్న లోపాలు, ప్రజల కోరికలను ప్రభుత్వం, జాతీయ ప్రణాళికా సంఘం, పైన పేర్కొన్న మూడు బ్యూరోలు నిశితంగా అధ్యయనం చేయాలి.

దేశం వ్యాపార సామర్థ్యంతో, ఆర్థిక బలంతో వేగంగా ప్రపంచంలో విజయవంతమైన దేశాల స్థాయికి ఎదగడానికి, మన ప్రజల క్రమశిక్షణ, సాధారణ పని సామర్థ్యంలో ఉన్న లోపాలను వీలైనంత త్వరగా తొలగించాల్సిన అవసరాన్ని ముగించే ముందు నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను.

భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పరిణామం ఏమిటంటే.. లోపాలను సరిదిద్దడం, జాతీయ వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించడం, అభివృద్ధిని ప్రభావితం చేసే బాధ్యత స్థానికంగా ఉండాలి. అంటే, తగిన విధంగా వీలైనంతగా వారి జనాభా, వనరులకు అనులోమానుపాతంలో ఉప-విభజన చేయాలి. చిన్న ప్రాంతాలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలి. సరైన గణాంకాలు సేకరించి నిర్వహించగలిగితే ఒక ప్రాంతానికి లేదా రాష్ట్రానికి అవసరమైన దాదాపు ప్రతి అభివృద్ధి దశ పరిస్థితిని సరైన రీతిలో నమోదు చేయవచ్చు. ఇవి దేశం మొత్తంలో భవిష్యత్ మార్గదర్శకత్వం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.

తక్షణ భవిష్యత్తులో ప్రాంతాలు లేదా రాష్ట్రాలు తమకు తాము స్వయంగా అభివృద్ది చెందడానికి విధానాలు ప్రోత్సహించాలి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో అభివృద్ది పనులను ఉపవిభజన చేయడం, వనరులను పంపిణీ చేయడం ద్వారా అభివృద్దిని స్థానికీకరించవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా ప్రాంతాల అభివృద్దిని దేశ స్థాయి అభివృద్ధితో అనుసంధానించవచ్చు. కొన్ని జాతీయ విధానాలు, ఉపయోగకరమైన పద్ధతులు ఉత్పత్తిని పెంచడానికి ప్రామాణీకరించాలి. సేవా రంగాన్ని, అదనపు ఉపాధిని అవకాశాలను పెంపొందడానికి ఇవి దోహదం చేస్తాయి. తద్వారా దేశంలో పేదరికాన్ని రూపుమాపవచ్చు. పేదరికం నుండి ప్రజలను రక్షించడం అవసరం.

ఆర్థిక రంగంలోని బలహీనతలను తొలగించి, రాజకీయ రంగంలో నైతిక ప్రవర్తనలను బలోపేతం చేయడం ద్వారా భారతదేశాన్ని నిర్మించడానికి తీసుకోవలసిన చర్యలు తక్షణమే ప్రారంభం కావాలి.

ఇంతకు ముందు పదేపదే సూచించినట్టు.. మొట్ట మొదట ఆర్థిక రంగంలో నెలకొని ఉన్న సమస్యలను అధిగమించి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి దేశంలో కొత్త ఆదాయ వనరులను సృష్టించేందుకు చర్యలు చురుకుగా కొనసాగించాలి. భారతదేశాన్ని ఉన్నత గమ్యానికి చేరుకునేందుకు సిద్ధం చేయడానికి అనేక ఇతర రకాల పరికరాలు, అవసరాలను అందించడానికి విస్తారమైన కొత్త వనరులు అవసరం.

రిపబ్లిక్ ఆఫ్ అమెరికాను నిర్మించడానికి జార్జ్ వాషింగ్టన్, లింకన్ వంటి మహానుభావులు వేసిన మార్గాలను అధ్యయనం చేయడం ద్వారా, వారి స్ఫూర్తితో, ఈ దేశానికి సరిపోయే పరిపాలనా విధానాలను, ఆచరణలను వ్యవస్థీకృతం చేయడం అభిలషణీయం.

అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్
అమెరికా సంయుక్త రాష్ట్రాల 16వ అధ్యక్షుడు అబ్రహామ్ లింకన్

వీలైనన్ని ఎక్కువ కీలకమైన స్థానాలలో పనిచేయడానికి సమర్థులైన, దేశభక్తి కలిగిన, నిస్వార్థ వ్యక్తులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాలి. వారితో ఆశించిన, ఇతర అభివృద్ది చెందిన దేశాలతో పోల్చదగిన, ఫలితాలను పొందడం ఉత్తమమైన మార్గం. ఇప్పటికే ప్రభుత్వ సేవలో ఉన్న మంచి వ్యక్తులను ప్రోత్సహించాలి. వ్యక్తిత్వం, సామర్థ్యం ఉన్న వ్యక్తుల కోసం నిశితంగా, చిత్తశుద్ధితో అన్వేషణ చేస్తే, ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న 350 మిలియన్ల జనాభాలో అవసరమైన స్థాయి, సమర్థత కలిగిన వ్యక్తులను కనుగొనడం కష్టమేమి కాదు.

ఈ అధ్యాయంలో, ముందటి రెండు అధ్యాయాలలో నిర్దేశించిన ఆదర్శాలు, ప్రవర్తనా వ్యవస్థలను సగటు భారతీయ పౌరుడు ఏ మేరకు అంగీకరించి, ఆచరించినా, అతని పని శక్తి, కర్తవ్య నిష్ట, స్వయం సమృద్ధి, విజయావకాశాలలో తగినంత స్థాయిలో పెరుగుదల తప్పక ఆశించవచ్చు.

***


చివరి మాట:

గత 21 వారాలుగా మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదాన్ని ‘సంచిక’ అంతర్జాల సాహిత్య పత్రికలో, సోషల్ మీడియాలో పాఠకులు చదువుతూ ఉన్నారు. ఒక పరిచయ వ్యాసం, ముందు మాట, 19 అధ్యాయాలతో ఈ అనువాద రచన ముగిసింది. సంచిక పాఠకులు, సోషయం మీడియా పాఠకులు ఈ అనువాదాన్ని ఆస్వాదించారని ఆశిస్తున్నాను. ఈ అనువాదం నాకు కూడా సంతృప్తిని మిగిల్చింది.

ఈ పుస్తకాన్ని తొలిసారిగా 2021 లో ఎం వి జన్మదినం సెప్టెంబర్ 15 కు వారం రోజుల ముందు చదివాను. ఇంజనీర్స్ డే రోజున Institution of Engineers, తెలంగాణ స్టేట్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించడానికి తయారౌతున్న క్రమంలో ఈ పుస్తకాన్ని చదవడం జరిగింది. ఈ పుస్తకం గురించి నాకు చాలా కాలంగా తెలుసు. కానీ పుస్తకాన్ని చదివే అవకాశాన్ని ఇంతకాలం తీసుకోలేకపోయాను. చదివిన అనంతరం నాకు ఎం వి కొత్త కోణంలో ఆవిష్కృతం అయినాడు. ఆయన కేవలం ఒక ప్రతిభావంతుడైన ఇంజనీర్ మాత్రమే కాదు దేశాభివృద్ధికి, జాతి నిర్మాణానికి, ప్రణాళికాబద్దమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఆయన తీవ్రంగా ఆలోచించాడని, అందుకు అనితరసాధ్యంగా శ్రమించాడని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఆయన రాసిన పుస్తకాల జాబితా చూస్తే ఆయన దృష్టి పెట్టిన కీలకాంశాలు ఇవే అని తెలుస్తుంది.

1938 లో భారత జాతీయ కాంగ్రెస్ ‘నేషనల్ ప్లానింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసింది. అప్పుడు సుభాష్ చంద్ర బోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ కమిటికి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అన్న చర్చ జరిగినప్పుడు అందరి చూపులు ఎం వి పైననే ఉన్నాయి. ఎందుకంటే ఆనాటికే ఆయన దేశాభివృద్దికి సంబందించిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు ప్రచురించి ఉన్నాడు. అవి 1. Reconstructing India (1919), Planned Economy For India (1934), 3. Unemployment in India – Its causes and Cures (1934), 4. Nation Building : A Five Year Plan for the Provinces (1937). ఒక మేధావిగా, ఉన్నత శ్రేణి ఆలోచనాపరుడిగా అప్పటికే పేరుగాంచిన ఎం వి, నేషనల్ ప్లానింగ్ కమిటికి అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు. ఆ కమిటి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది కనుక పార్టీలో మేధావిగా, రచయితగా, స్వాతంత్రియోద్యమ నాయకుడిగా దేశ రాజకీయ రంగంలో పరపతి, గుర్తింపు ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ వైపే పార్టీ వర్గాలు మొగ్గు చూపాయి. అయితే ఎం వి కూడా కమిటి సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఈ కమిటిలోనే కాదు జాతీయ స్థాయిలో అనేక కమిటీలలో ఎం వి ఛైర్మన్ గా, సభ్యుడిగా పని చేసి దేశానికి విశేషమైన సేవలు అందించాడు.

మైసూర్ సంస్థానానికి దీవాన్‌గా ఆరేళ్లు (1912-18) పనిచేసి అనేక అభివృద్ది పథకాలను అమలు చేశాడు. నీటిపారుదల రంగంలో, విద్యారంగంలో, పారిశ్రామిక రంగంలో మైసూర్ రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు అనితరసాధ్యమైనవి. కావేరీ నదిపై కృష్ణరాయ సాగర్ జలాశయం, మైసూర్ లో విశ్వ విద్యాలయం, బెంగళూరులో ఇంజనీరింగ్ కళాశాల, భద్రావతిలో ఇనుము ఉక్కు పరిశ్రమ.. ఇవన్నీ ఆయన సాధించినవే. వీటిని సాధించడానికి ఆయన పడిన కష్టాలను ఈ పుస్తకంలో వివరించాడు. దీవాన్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన తన సేవలను సుధీర్ఘ కాలం ఈ దేశానికి అందించాడు. ఈ సంగతులన్నీ ఈ పుస్తకంలో 19 అధ్యాయాల్లో స్థూలంగా వివరించే ప్రయత్నం చేశాడు. ఈ పుస్తకం ద్వారా ఎం వి పనికి సంబందించిన చరిత్ర మాత్రమే కాదు ఆయన సమకాలీన భారత దేశ చరిత్ర (1880 – 1950), ఆయనతో సన్నిహితంగా మెలిగిన బ్రిటిష్ అధికారులు, స్వదేశీ నాయకుల వ్యక్తిత్వాలు కూడా తెలుస్తాయి. దేశాభివృద్ధికి ఇంకా మనం చేయవలసింది ఎంతో ఉన్నది. ఆ కృషిని ముందుకు కొనసాగించడానికి ఈ పుస్తకం తప్పకుండా స్ఫూర్తిని ఇస్తుందని నమ్ముతున్నాను.

1954లో భారత రత్న పురస్కారాలను ప్రదానం చేయడం ప్రారంభం అయింది. 1955 లోనే భారత ప్రభుత్వం ఆయనకు భారత రత్న పురస్కారం ప్రదానం చేసింది. అది ఊరికే రాలేదు. ఎం వి తన జీవిత కాలంలో ఒక లెజెండ్. నీతి నిజాయితికి మారుపేరైన ఒక ఇంజనీర్‌గా, ఒక ఆలోచనాపరుడిగా ఈ దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం దక్కింది. అందుకు ఈ దేశంలోని ఇంజనీర్లు అందరికీ ఎంతో గర్వకారణం. అందుకే ఆయన జన్మ దినాన్ని(15 సెప్టెంబర్) జాతీయ స్థాయిలో ‘ఇంజనీర్స్ డే’ గా జరుపుకుంటున్నారు.

సర్ ఎం వి జీవిత చరిత్రలు అనేకం తెలుగు సహా అన్ని భారతీయ భాషలలో ప్రచురణ అయినాయి. ఆయన ఈ స్వీయ చరిత్ర (Memoirs of my working life) పుస్తకం మాత్రం కన్నడ భాషలో తప్ప మరే ఇతర భారతీయ భాషలోకి అనువాదం కాలేదు. ఇప్పుడు నా ద్వారా తెలుగులోకి అనువాదం కావడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 15.. సర్ ఎం వి జన్మ దినం నాటికి పుస్తక రూపంలోకి వస్తుందని ముందస్తుగా తెలియజేస్తున్నందుకు కూడా సంతోషంగా ఉంది. ఈ అనువాదాన్ని ప్రోత్సహించి ప్రచురించిన ‘సంచిక’ సంపాదకులు శ్రీ కస్తూరి మురళీ కృష్ణ, ఉప సంపాదకులు శ్రీ సోమ శంకర్ గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతీ అధ్యాయాన్ని శ్రద్ధగా చదివి నాతో అభిప్రాయాలను పంచుకున్న మిత్రులు.. ముఖ్యంగా నా బాల్య మిత్రుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు శ్రీ సబ్బని నరసయ్య (నిర్మల్), మా నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు శ్రీ నల్ల వెంకటేశ్వర్లు, శ్రీ బి నాగేంద్ర రావు, అమెరికాలో సియాటిల్ నగరంలో ఉంటున్న విశ్రాంత చీఫ్ ఇంజనీర్ శ్రీ కొండపల్లి వేణుగోపాల రావు, అంతర్రాష్ట్ర విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ సల్ల విజయ్ కుమార్, విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కందిమళ్ళ విజయ్ కుమార్, నమస్తే తెలంగాణ సీనియర్ జర్నలిస్టు శ్రీ రవికుమార్ గార్లకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు అనువాదకులు తరచుగా చేసే తప్పులను సూచించి వాటిని పరిహరించుకోవడానికి సహకరించిన చిరకాల సాహిత్య మిత్రులు, సీనియర్ అనువాదకులు శ్రీ ఎన్ వేణుగోపాల్ గారికి, ఎం వి ఫోటోలు సేకరించి పంపిన Institution of Engineers, తెలంగాణ స్టేట్ సెంటర్ ఉద్యోగి రత్నం గారికి ధన్యవాదాలు.

ఈ పుస్తకం వెలువడి 72 సంవత్సరాలు గడిచాయి. ఈనాటి పరిస్థితుల్లో కొన్ని అంశాలలో ఆనాడు ఎం వి వెలిబుచ్చిన అభిప్రాయాలతో మనకు ఏకీభావం ఉండకపోవచ్చు. స్వోత్కర్ష కనిపించవచ్చు. ఆయనకు మైసూర్ రాజా వారు, బ్రిటిష్ అధికారులు, మైసూర్ దివాన్‌లు, ఇతర వృత్తి నిపుణుల నుంచి అందిన ప్రశంసల ఉటంకింపులను ఈ పుస్తకంలో విస్తారం పొందుపరచినాడు. అవేవీ అబద్ధాలు కావు. వాటిని పక్కన పెడితే, ఆయన జీవిత కాలంలో చేసిన కృషి, దేశాభివృద్ధికి ఆయన పడిన తపన ఈ స్వీయ చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. ఇవి ఇప్పటికీ మనందరికీ.. ముఖ్యంగా దేశాభివృద్ధిలో పాలు పంచుకుంటున్న ఇంజనీర్లకు స్ఫూర్తిని ఇచ్చేదే.

ఇది నా మొదటి పూర్తి స్థాయి అనువాద రచన. కాబట్టి పంటి కింది రాయిలాగా అనువాద లోపాలు ఇంకా మిగిలిపోయి ఉంటాయి. అందుకు క్షంతవ్యుడిని. ఎం వి విక్టోరియన్ శైలిలో రాసిన ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులోకి సరిగా దించానా లేదా అన్నది పాఠకులు ఎట్లాగూ అంచనా వేస్తారు. ఈ అనువాద రచనను ఆదరించిన పాఠకులందరికి కూడా ధన్యవాదాలు.

– శ్రీధర్ రావు దేశ్‌పాండే

6 ఆగస్ట్, 2023.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here