[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
[dropcap]మం[/dropcap]త్రులు జనమేజయుడితో ఇంకా ఇలా చెప్పారు “బలపరాక్రమాలు, సంపదలు కలిగిన జనమేజయా! నీకు చిన్నతనంలోనే పట్టాభిషేకం జరిగి రాజ్యభారం అప్పగించబడింది. ప్రజలందర్నీ ధర్మ మార్గంలో నడిచేలా చేశావు. యాగాలు చేసి ఎంతో ఎక్కువగా దక్షిణలు ఇచ్చి బ్రాహ్మణుల్ని పోషించావు. గుణసంపదల్లో నీకు ఎవరూ సాటి రారు. ఈ విషయంలో నీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. శృంగి అనే బ్రాహ్మణుడి ప్రేరణవల్ల నీ తండ్రికి హాని జరిగింది. నువ్వు కూడా సర్పయాగం చేసి పాముల సంతతి మొత్తం అందులో పడి కాలి బూడిద అయ్యేలా చెయ్యి!” అని మంత్రులు సలహా ఇచ్చారు.
వాళ్ల మాటలు విన్న జనమేజయుడు కోపంతో “తక్షకుడు విషాగ్నితో నా తండ్రిని ఎలా అయితే చంపాడో అదే విధంగా తక్షకుణ్ని, అతడి బంధుజనాన్ని కూడా అగ్ని జ్వాలల్లో పడి కాలిపోయేలా చేస్తాను. స్వర్గస్థుడైన నా తండ్రికీ, ఉదంకుడు అనే బ్రాహ్మణుడికీ, మంచివాళ్లందరికీ మంచి జరిగేలా చేస్తాను!” అన్నాడు. సర్పయాగం ఎలా చెయ్యాలో శాస్త్రాల్లో చెప్పిన విధానం గురించి తనకు వివరంగా చెప్పమని ఋత్విక్కుల్ని అడిగాడు.
“రాజా! జనమేజయా! ఈ సర్పయాగం నీ కోసమే దేవతలతో కల్పించబడింది. ఇతరులు ఎవరూ ఈ యాగాన్ని చెయ్యరు. ఇది అతి ప్రాచీనమైంది, ప్రసిద్ధమైందని పురాణాల్లో చెప్పబడినట్టుగా మేము విన్నాము” అని చెప్పారు ఋత్విక్కులు.
జనమేజయుడు సర్పయాగం చెయ్యాలన్న నిర్ణయానికి వచ్చాడు. జనమేజయ మహారాజు ధర్మపత్ని కాశీరాజు కుమార్తె ‘వపుష్టమ’తో కలిసి సర్పయాగం చెయ్యడానికి దీక్ష తీసుకున్నాడు. శాస్త్రంలో చెప్పబడిన కొలతలు, లక్షణాలతో నేర్పరులతో నిర్మించబడిన యజ్ఞకుండము; యజ్ఞానికి కావలసిన అనేక సాధనాలు; అవసరమైన వస్తువులు; కావలసినంత ధనం, ధాన్యం; విధులు నిర్వర్తించడానికి వచ్చిన బ్రాహ్మణులు; యజ్ఞాన్ని చేయించగల గొప్ప ఋత్విక్కులతో యజ్ఞశాల కళకళలాడుతోంది.
గృహనిర్మాణశాస్త్రంలో అనుభవం, పురాణజ్ఞానం కలిగిన ఒక బ్రాహ్మణుడు “జనమేజయా! నువ్వు చేస్తున్న ఈ యజ్ఞం ఋత్విక్కులు శాస్త్రోక్తంగా చేయించినా కూడా ఒక బ్రాహ్మణుడి కారణంగా మధ్యలోనే ఆగిపోతుంది!” అని చెప్పాడు.
అతడి మాటలు ఎవరూ పట్టించుకోలేదు. మహారాజు నియోగించిన చ్యవనమహర్షి వంశంలో ప్రసిద్ధుడైన చండభార్గవుడు హోతగాను; పింగళుడు అధ్వర్యుడుగాను; శార్జ్ఞరవుడు ఋత్విజుడుగాను; కౌత్సుడు ఉద్గాతగాను; వైశంపాయనుడు మొదలైన మహర్షులు యజ్ఞవిధికి పరీక్షకులుగాను ఉండి యజ్ఞం చేయించడం ప్రారంభించారు.
నల్లటి రంగుగల వస్త్రాలు ధరించి, పొగవల్ల ఎర్రబడ్డ కళ్ళతో యజ్ఞతంత్రాన్ని నడిపించే ఋత్విజులు నెయ్యి మొదలైన పదార్థాలు అగ్నిలో హోమం చెయ్యడం మొదలుపెట్టారు. మంత్ర ప్రభావం వల్ల, హోమంలో వేస్తున్న పదార్థాల ప్రభావం వల్ల పాముల జాతికి రాజులైన పాములు మిగిలిన వాళ్లని కూడా తమతో తీసుకుని వచ్చి హోమకుండంలో పడుతున్నారు.
హోమంలో పడిన పాముల పేర్లు అన్నీ చెప్పుకోలేము కనుక, కొన్ని పేర్లు చెప్పుకుందాం. వాసుకి వంశంలో పుట్టిన కోటీశుడు, మానసుడు, పూర్ణుడు, శలుడు, పాలుడు, హలీమకుడు, పిచ్ఛిలుడు, గౌణపుడు, చక్రుడు, కాలవేగుడు, ప్రకాలనుడు, హిరణ్యబాడు, శరణుడు, కక్షకుడు, కాలదంతుడు మొదలైనవాళ్లు.
తక్షక వంశంలో పుట్టిన పుచ్ఛాండకుడు, మండలకుడు, పిండసేక్త, రణేభకుడు, ఉచ్ఛికుడు, శరభుడు, భంగుడు, బిల్వతేజుడు, విరోహణుడు, శిలశలకరుడు, మూకుడు, సుకుమారుడు, ప్రవేపనుడు, ముద్గరుడు, శిశురోముడు, సురోముడు, మహాహనువు మొదలైనవాళ్లు. ఐరావతుడి వంశంలో పుట్టిన పారావతుడు, పారిజాతయాత్రుడు (పారియత్రుడు), పాడరుడు, హరిణుడు, కృశుడు, విహంగుడు, శరభుడు, మోదుడు, ప్రమోదుడు, సంహతాపనుడు (సంహతాశనుడు), మొదలైన వాళ్లు. సర్పరాజ కులంలో పుట్టిన నేరకుడు, కుండలుడు, వేణి, వేణీస్కంధుడు, కుమారకుడు, బాహుకుడు, శృంగబేరకుడు, ధూర్తకుడు, ప్రాతరాతకుడు, కొరవ్యుడు మొదలైనవాళ్లు.
ధృతరాష్ట్ర సర్పరాజ వంశలో పుట్టిన శంకుకర్ణుడు, పిఠరకుడు, కుఠారుడు, సుఖసేచకుడు, పూర్ణాంగదుడు, పూర్ణముఖుడు, ప్రహాసుడు, శకుని, దర్యుడు, మాహఠుడు, కామఠకుడు, సుషేణుడు, మానుడు, సావ్యయుడు, భైరవుడు, ముండుడు, వేదాంగుడు, పిశంగుడు, చోద్రపారకుడు, వృషభుడు, వేగవంతుడు, పిండరకుడు, మహాహనుడు, రక్తాంగుడు, సర్వసారంగుడు, సమృద్ధుడు, పఠవాసకుడు, వరాహకుడు, వీరణకుడు, సుచిత్రుడు, చిత్రవేగికుడు, పరాశరుడు, తరుణకుడు, మణిస్కంధుడు, ఆరుణ్యుడు మొదలైన వాళ్లు ఉన్నారు.
అన్ని వంశాలవాళ్లు ఒక్కొక్కళ్లుగా హోమకుండంలో వచ్చి పడుతున్నారు. కోరల్లో అగ్నిలాంటి విషం ఉన్న వాళ్లూ, తెల్లని, నల్లని, పసుపు పచ్చని, ఎర్రని రంగులూ; బాగా ఎత్తుగా ఉన్న దేహాలూ; ఒకటి కంటే ఎక్కువ తలలు ఉన్నవాళ్లూ అందరూ మంత్ర ప్రభావం వల్ల దీనంగా అరుస్తూ వేగంగా వచ్చి హోమకుండంలో పడి కాలి బూడిదవుతున్నారు. పాముల దేహాలనుంచి అగ్నిలో పడేటప్పుడు, కాలేటప్పుడు, కాలిన తరువాత ముక్కలుగా బ్రద్దలయ్యేటప్పుడు కలుగుతున్న ధ్వని అన్ని దిక్కుల్లోను ప్రతిధ్వనించింది.
సర్పయాగాన్ని ఆపించిన ఆస్తీకమహర్షి
ఆ సమయంలో తక్షకుడు తనను రక్షించమని ఇంద్రుణ్ని వేడుకున్నాడు. ఇంద్రుడు తక్షకుడికి భయపడవద్దని ధైర్యం చెప్పాడు. తన తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల ఈ మారణ హోమం జరుగుతోందని నాగజాతి మొత్తం నాశనమవుతోందని బాధపడిన వాసుకి తన చెల్లెలు జరత్కారువు దగ్గరికి వెళ్లాడు. “సోదరీ! జనమేజయుడు తలపెట్టిన సర్పయాగం వల్ల నాగజాతి మొత్తం నాశనమవుతోంది. దాన్ని ఆపించగల శక్తి నిర్మలమైన మనస్సు కలిగినవాడు, గొప్ప తపస్సంపన్నుడు, పాపాలులేనివాడు బ్రహ్మతో సమానుడు అయిన నీ కుమారుడు ఆస్తీకమహర్షికి మాత్రమే ఉంది.
ఈ విషయాన్ని బ్రహ్మ చెప్తుండగా ఏలాపుత్రుడు అనే నాగకుమారుడు విన్నాడు. అందువల్లనే నీ వివాహం జరత్కారుడుతో జరిపించాము. ఇంక అలస్యమయితే సర్పజాతే లేకుండా పోతుంది. జనమేజయ మహారాజు దగ్గరికి వెళ్లి సర్పయాగం ఆపించి పాముల్ని రక్షించాలి!” అన్నాడు వాసుకి.
వాసుకి చెప్పిన మాటలు విని జరత్కారువు ఆస్తీకుడివైపు చూసి “నీ మేనమామ చెప్పింది విన్నావా? అతడు చెప్పినట్టు చెయ్యి!” అని చెప్పింది. తల్లి మాటలు విని ఆస్తీకుడు “తల్లీ! ఇంతకు ముందు అగ్నిలో పడి దగ్ధమైన వాటిని ఏమీ చెయ్యను. ఇకముందు పడకుండా ఉండేటట్టు మిగిలిన వాటిని రక్షిస్తాను!” అని చెప్పాడు.
ఆస్తీకుడు వాసుకి మొదలైన సర్పరాజుల్ని ఓదార్చి జనమేజయుడు సర్పయాగం చేస్తున్న శాలలో ప్రవేశించాడు. అతడు ప్రవేశించగానే ఆ ప్రదేశమంతా గొప్ప కాంతితో ప్రకాశించింది. “ఓ జనమేజయ మహారాజా! నువ్వు చంద్రవంశానికే అలంకారానివి. గొప్ప ధర్మాత్ముడివి. భూ ప్రజలు కోరుకున్నట్టుగాను పాండవ వంశం కీర్తితో ప్రకాశించేట్టుగాను రాజ్యాన్ని పాలిస్తున్నావు.
నలమహారాజు చేసిన యాగం; ధర్మరాజు చేసిన రాజసూయ యాగం; బ్రహ్మదేవుడు ప్రయాగ క్షేత్రంలో చేసిన యాగం; వరుణదేవుడు, కృష్ణుడు, చంద్రుడు చేసిన యాగాల కంటే కూడా నువ్వు చేస్తున్న యాగం చాలా గొప్పది. ఇక్కడ ఉన్న ఋత్విక్కులు కూడా యజ్ఞం చేయించడం బాగా తెలిసినవాళ్లు, గొప్ప జ్ఞానం కలవాళ్లు, గొప్ప తపస్సంపన్నులు, అనేక శక్తులు కలవాళ్లు, బ్రహ్మతో సమానమైనవాళ్లు. ఇంద్రుడి యజ్ఞంలో ఉన్న ఋత్విక్కులకంటే గొప్ప కీర్తి కలిగినవాళ్లు.
మహారాజా! విద్వాంసులకే విద్వాంసుడు, ధర్మదేవత మూడులోకాల్లోను గొప్ప తేజస్సు కలవాడు, మంచివాళ్లతో కీర్తింపబడేవాడు అయిన వ్యాస మహర్షి తన కుమారుడితోను, శిష్యులతోను, ఋత్విక్కుల సమూహంతోను వచ్చి నువ్వు చేస్తున్న యాగంలో సదస్యుడుగా ఉన్నాడంటే నీ యాగం గురించి, నిన్ను గురించి వర్ణించడం ఎవరితరం?” అని మహారాజుని కీర్తించాడు.
జనమేజయ మహారాజుని, అతడి యజ్ఞాన్ని, యజ్ఞం చేయిస్తున్న ఋత్విక్కుల్ని, యజ్ఞ విధిని పరీక్షిస్తున్న సదస్యుల్ని, పూజ్యుడైన అగ్నిని, అక్కడున్న ప్రతి ఒక్కళ్లని కూడా ఎవరికి తగినట్టు వాళ్లని పొగిడి అందర్నీ సంతోషపెట్టాడు ఆస్తీకమహర్షి.
జనమేజయ మహారాజు అనందంతో ఆస్తీక మహర్షికి ఏం కావాలో అడగమన్నాడు. “జనమేజయా! కోపాన్ని వదిలి పెట్టి, పాముల వంశానికి భయం తగ్గేట్టు, నాకు సంతోషం కలిగేట్టు ఈ సర్పయాగాన్ని ఆపి నాగజాతిని కాపాడు!” అని అడిగాడు ఆస్తీకమహర్షి. అతడు అడిగినదాన్ని విని అక్కడ ఉన్నవాళ్లందరు “అర్హుడు, తగినవాడు, గొప్ప తపస్సే ధనంగా కలవాడు అయిన ఈ బ్రాహ్మణుడి కోరిక తీర్చడం మంచిది. గౌరవంతోను, ప్రేమతోను అతడి కోరిక తీర్చండి!” అన్నారు.
సదస్యులందరూ కలిసి చెప్పడం వల్ల జనమేజయుడు ఆస్తీకుడు అడిగినట్టు సర్పయాగాన్ని ఆపించాడు. అప్పటికే మంత్ర ప్రభావంతో వేగంతో సుడిగాలిలా హోమకుండం వైపు వస్తున్న తక్షకుణ్ని మధ్యలోనే ఆపి హోమకుండంలో పడకుండా వెనక్కి పంపించేశాడు ఆస్తీకుడు. తల్లి అయిన కద్రువ ఇచ్చిన శాపం వల్ల జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో కద్రువ సంతానమైన పాములు మరణిస్తున్నాయి. సర్పయాగాన్ని ఆపించి పాముల్ని మరణం నుంచి తప్పించిన ఆస్తీకుణ్ని యాగశాలలో ఉన్నవాళ్లందరూ భక్తితో స్తోత్రం చేశారు.
జరత్కారుడు అనే గొప్ప మహర్షికీ, వాసుకి చెల్లెలు జగత్కారువుకీ కుమారుడైన ఆస్తీక మహర్షిని స్మరిస్తే పాముల వల్ల భయం ఉండదు. ఆస్తీకమహర్షి కథ విన్నవాళ్ల పాపాలన్నీ నశిస్తాయి.
ఇంతటితో ఆదిపర్వం రెండవ ఆశ్వాసం పూర్తిచేసుకున్నాము.