ఫొటోగ్రాఫ్

8
3

[శ్రీమతి జొన్నలగడ్డ శేషమ్మ రచించిన ‘ఫొటోగ్రాఫ్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]సీ[/dropcap]తారామమ్మ మామగారి కాలం నాటి ధాన్యపు గాదెను తెరచి పరిశీలిస్తోంది. కొన్ని సంవత్సరాలుగా ఆ గాదెను తెరవలేదు. ఒకప్పుడు వారిది అవిభక్త కుటుంబము. పొలం వుండేది మామగారికి. ధాన్యం ప్రతి సంవత్సరం ఇంటికి తెచ్చి గాదెలో నిల్వ చేసేవారు. బియ్యం కావలసినపుడు గాదె తెఱచి, ధాన్యం తీసి, మరకు (Rice Mill) తీసుకొని వెళ్లేవారు. మామగారికి ఓపిక తగ్గుతూండగా ఆ బాధ్యత సీతారామమ్మ తీసికొన్నది. అబ్బో – ఇది ఏభై సంవత్సరాల పై మాట.

ఇప్పుడు ఆధునిక యుగం. గాదె అవసరం తీరింది. ప్రస్తుతం ఎక్కువ అవసరం లేని సామాన్లు దాచుకునే ‘store’గా ఆ గాదె ఉపయోగపడుతున్నది. అందులో ఒక పెద్ద ట్రంకు పెట్టెలో పుస్తకాలు దాచింది సీతారామమ్మ. పెట్టె తెరిచి పుస్తకాలను పరిశీలిస్తున్నది. అది ఓ విజ్ఞాన గని. విశ్వనాథ సత్యనారాయణ గారివి, సోమర్సెట్ మామ్‌వి, విక్టర్ హ్యూగోవి, ఝంపాలహరి బుకర్ ప్రైజ్ నవల ‘నేమ్ సేక్’ – ఇలా ఎన్నో అమూల్య గ్రంథాలు – వానిని ఆమె ఒక్కోటి చదివి, హైలైట్స్‌గా తాను వ్రాసుకున్న నోట్సు కూడా వానితో వుంది. అది తీసి పక్కన పెట్టుకుంది.

పెట్టె క్రింది భాగం వరకూ వెళ్లింది – పాత ఫొటోలు కొన్ని కనబడినవి. అత్త మామలవి, మిగతా కుటుంబ సభ్యులవి, తన తల్లిదండ్రులవి ఇలా – “అరే” సడన్‌గా ఆగి పోయింది. ఒక ఆశ్చర్యకరమైన కేక పెట్టి – సీతారామమ్మ. పాత ఫొటో పసుపు రంగులోకి వచ్చింది – స్పష్టత తగ్గింది. ఎవరీమె అనుకుని, దుమ్ము పట్టి మసక బారిన కళ్లద్దాలు బాగా తుడిచి మరీ పరిశీలించింది. “అమ్మమ్మ” – అవును “అమ్మమ్మ” అని మురిసిపోయింది.

అమ్మమ్మను సజీవంగా కళ్ల ఎదుట ఎదుట చూసిన అనుభూతి పొందినది. చిరునవ్వు చిందుస్తున్న మహిళామూర్తి, గట్టిగా నాలుగు అడుగుల రెండంగుళాల ఎత్తు ఉండేదేమో – చామన ఛాయ, కాని వెలుగు లీనుతున్న ముఖవర్చస్సు, చెవులకు దుద్దులు పెద్దవి, రాళ్లతో మెరిసి పోతున్నాయి. రెండు ముక్కు పుటాలకూ, పెద్ద పెద్ద ముక్కెడలు, అవి కూడ పెద్ద, చిన్న రాళ్లతో – వ్రేలాడుతున్నవి. కాశ పోసి చీర కట్టు. కాళ్లకు వెండి కడియాలు, గొలుసులు, అబ్బో – అవి ఎంత బరువుండేవో! ఆమె ఎలా భరించేదో – చక చకా ఇల్లంతా కలయ తిరిగేది, నిరంతరం పనే; పాపం రాత్రికి కాళ్లు నెప్పులు అని బాధపడేది. మనుమలు ఆమెకు లేపనం వ్రాసి, మర్దనా చేసేవారు. ఆమె వాళ్లకు కథలెన్నో చెప్పేది. పాటలు పాడేది. ఆప్యాయంగా చేరతీసేది వాళ్లను.

చిన్నప్పటి నుండి సీతారామమ్మకు అమ్మమ్మ అంటే ఎంత ప్రేమో – చెప్పలేనిది. తన తండ్రిగారు తనకు ఆమె పేరు పెట్టేరు. పెద్దక్కకు బామ్మ గారి పేరు. రెండో అక్కకు ఏడుకొండల స్వామి పేరు ‘వెంకట రమణ’ అని, తనకు అమ్మమ్మ పేరు – ‘సీతారామమ్మ’ అని.

అమ్మమ్మకు ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. కానీ వాళ్లెవ్వరూ తమ పిల్లలకు ఈ పేరు పెట్టలేదు. అమ్మమ్మను అందరూ ‘రాముడూ’ , ‘రాముడూ’ – అని పిలిచేవారు. పనివాళ్లు ‘రాముడమ్మ గారూ’ అనేవారు. ఇంక తాతయ్య మరీను; భార్య అంటే ఎంత అలుసో! “ఒసే రావుడూ ఎక్కడ చచ్చేవు” అని తప్ప జీవితంలో మరో విధంగా సంబోధించిన గుర్తే లేదు. ఈ కారణాల వాళ్ళ ఆమె పేరు మొరటుగా అనిపించిందేమో – ఎవరూ ఆ జోలికి వెళ్ల లేదు.

తాతయ్య చాలా పేదవాడు. సంపాదన ఏమీ లేదు. ఎలా బతుకు బండి లాగేడో మరి, తెలియదు. ఆ పల్లె  జమీందారు దగ్గర వుండి, కథలు చెప్పి, హాస్యం మాట్లాడి, నవ్వించి, కాలక్షేపం కలిగించే వాడని చెప్తారు. అవి సత్య కాలపు రోజులు – సంపన్నులు తమకు తోచిన సాయం తాతయ్యకు చేస్తూండేవారు. పేదరికం వలన తాతయ్య తన కూతుళ్లు ముగ్గురినీ చాలా చిన్న వయస్సులో ఉండగానే – రెండవ వివాహం వారికి ఇచ్చి పెళ్లి చేసేడు. కొడుకులు ఆఖర్ని పుట్టేరు. ఆ విధంగా ఆ అల్లుళ్ల ఇళ్లు చేరి, అక్కడే బతుకు బండి వెళ్లదీసేవారు వాళ్లిద్దరూనూ. అయినాసరే పౌరుషానికి తక్కువేమి లేదు తాతయ్యకు. అమ్మమ్మను చూస్తే ఎంత లోకువో, బహుశా తన చేతకానితనం మీద అక్కసును అలా ఆమె మీద పెత్తనంగా చూపించే వాడేమో!

కూతుళ్ల పురుళ్లూ, పుణ్యాలూ ఓపికగా నిర్వహించింది అమ్మమ్మ. అల్లుళ్లు శ్రీమంతులు – అదొక్కటే వారిద్దరి అదృష్టము – అమ్మమ్మకు రోజంతా చాకిరీ – పది మందికి వంట, వార్పు, బియ్యం బాగు చేయడము, తిరగలి విసరడము, పప్పు రుబ్బడము, పచ్చళ్లు చేయడం. ఇలా పగలంతా ఏదో పనే – క్షణం విశ్రాంతిగా కూర్చున్నట్లు గుర్తే లేదు ఎవ్వరికీను. ఎంత సహనమో ఆమెకు.

మనుమలందరికీ ప్రత్యేకమైన పేర్లు పెట్టి, వాళ్ల మీద పాటలు కట్టి లాలించి, లాల పోసి, తుడిచి, సాంబ్రాణి పొగ వేసేది. పెద్దక్కను “వియ్యపురాలా, ఓ వయ్యారి లోల నీ సోకు ఎంతో” అనేది. చిన్నక్కను “వెంకట రమణ మూర్తి, ఏడు కొండల స్వామీ – మా యింట వెలసేవా మా బంగారు తల్లిగా” అనేది. ఇంకా సీతారామమ్మ అంటే ప్రత్యేకమైన ముద్దు. “నా బంగారం, నా పేరింటి వజ్రం, నా చిట్టి వరహాల తల్లి, నా సీతాలు” అంటూ వొళ్లో కూర్చుండబెట్టుకొనే లాలించేది. సీతకు ఏనుగునెక్కినంత సంబరంగా వుండేది – అందరికి వైపూ కళ్లెగరేసి చూసేది గర్వంగా.

తాతయ్య దిన చర్య, భోజనం – చిత్రంగా సాగేవి. ఉదయాన్నే లేచేవాడు. సీతారామమ్మ తండ్రి గారికి పెద్ద పెరడు వుండేది. అది చక్కగా సాధిక పరచి, పూల మొక్కలు, ఆకు కూరలు, ఋతువులకు అనుగుణంగా ఎంచి వేసేవాడు. పాదులు పెట్టి పందిర వేసేవాడు. ఉదయం ఆ తోట పని లోనే గడిపేవాడు. నీళ్లు తోడి పోసేవాడు. తరువాత తయారయిన కూరగాయలు, పువ్వులు, కోసేవాడు. ఇంటికి కావలసినవి లోపల జాగ్రత్త చేసి మిగతావి అమ్మేవాడు. తక్కెడ, రాళ్లు సిద్ధంగా వుంచుకునే వాడు. వచ్చిన వాళ్ళతో నిక్కచ్చిగా బేరసారాలు సాగించేవాడు. “పెరటిలో కాపించిన లేత కూరగాయలు, మెరిసిపోయే కనకాంబరాలు, పరిమళాలు వెదజల్లే మల్లె పువ్వులు – ఎక్కడ దొరుకుతాయి? – కావాలంటే తీసికొండి, లేకపోతే పొండి” అని డబాయించేవాడు.

ఉదయం ఎనిమిది నుండి పదకొండు వరకూ బయట తిరిగి వచ్చేవాడు. పన్నెండు అయేసరికి ఇల్లు చేరుకునేవాడు. తాతయ్య నూతి దగ్గరకు వెళ్లి స్వయంగా చేదతో నీళ్లు తోడుకొని, స్నానం చేసి భోజనానికి వచ్చేవాడు – ఆకలి – పైగా అమ్మమ్మ అంటే చులకన కదా “ఒసే రావుడూ ఎక్కడ చచ్చేవు? మొగుడికి అన్నం పెట్టాలన్న జ్ఞానము లేదు నీకు” అని అరిచేవాడు. అప్పటికే అమ్మమ్మ అన్నీ సిద్ధపరిచేది. అరటి ఆకులో భోజనము – ఉసిరికాయ, చింతకాయ – పచ్చళ్లు; నిమ్మకాయ ఊరగాయ, ఒక ముద్ద వేడి అన్నంలో పసుపు, మరో ముద్దలో నేతిలో వేయించిన మిరియాల పొడి – ఇవి మామూలు రొటీను; ఇంకా రోజువారీగా ఒక పప్పు కూర, మరో ప్రత్యేకమైన కూర, పులుసు లేదా చారు, మజ్జిగ – ఇలా సంపూర్ణమైన భోజనం – రమారమి అర కేజీ బియ్యం ప్రాప్తికి అన్నం తినేవాడు.

హాయిగా లొట్టలు వేస్తూ తిన్నా “ఏడ్చినట్లుంది. ఇందులో ఉప్పే లేదు, ఇక్కడ పోపు వేగలేదు. నీ జీవితంలో ఒక్కనాడైనా శ్రద్ధపెట్టి వండేవా?” అని తింటున్నంత సేపూ అమ్మమ్మను తిట్టి పోసేవాడు. ఆ దరిదాపులలో ఎవ్వరూ నిలబడే వారు కాదు. అందరికీ భయమే. ఒక్కోసారి తేడా వస్తే ఆ ముద్ద అమ్మమ్మ ముఖం మీద వేసి కొట్టేవాడు. సీతారామమ్మకు ఎంత కోపం వచ్చేదో అలా అమ్మమ్మను వేధిస్తూ వుంటే –

ఓసారి “ఏమిటి తాతయ్య, ఇంత బాగా వండింది. లొట్టలు వేసుకొని తిన్నావు. ఆకు ఖాళీ చేసేవు. మా అమ్మమ్మను అన్ని తిట్లు తిట్టి ఏడిపిస్తున్నావు. మంచిది కాదు. ఆమె లేక పొతే నీకు ఒక్క రోజు ఇలా జరుగుతుందా – అమ్మమ్మను ఏమైనా అన్నావో జాగ్రత్త” అంది సీతారామమ్మ. అప్పటికి ఆమెకు తొమ్మిదేళ్ల వయస్సు. “నేను పెద్దదాన్ని అవనీ – నాతో అమ్మమ్మను తీసుకు పోతాను” అనేసింది. అంత ధైర్యం ఎలా వచ్చిందో ఏమిటో!

తాతయ్యకు షాక్ తగిలిందేమో – మనవరాలి వైపు కొరకొర చూసి, అక్కణ్ణించి వెళ్ళిపోయేడు. సీతారామమ్మ తల్లి, అక్కలిద్దరూ పరుగున వచ్చి ఆమెను ముద్దు పెట్టుకున్నారు. అమ్మమ్మ సాధారణంగా భోజనం చేసే వరకూ మడిగా ఉంటుంది. తాతయ్య గేటు తీసుకొని బయటకు వెళ్లగానే, పరుగున వచ్చి సీతను కౌగిలించుకొని, వళ్లో కూర్చుండ బెట్టుకుని ఏడిచేసింది. “నా పేరింటి తల్లీ, నా  బంగారం, ఎంత బాగా చెప్పేవే – నా సీతాలూ – నేను చచ్చిపోయి నీ కడుపునా పుడతానులే అమ్మా” అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది.

ఈ సంఘటలన్నీ సీతకు జ్ఞాపకాల పొరల్లోంచి, బయటకు వచ్చేయి. కన్నీళ్లు కారుతూనే వున్నవి. కాలం ఆగదు. దశాబ్దాల క్రితం జరిగిన విషయాలు నేడు అనుకోని పనిగా గుర్తు వచ్చాయి. సీతారామమ్మ – పెరిగి, విద్యార్థిగా, తరువాత వివాహం జరిగినపుడు ‘సీత’గా నలుగురికీ పరిచయమైంది. పెళ్లి అయ్యేక భర్తతో అతని ఉద్యోగం చేసే వూరు చేరుకున్నది. ఒక రోజు సాయంత్రం దసరా నవరాత్రులలో – సీత తండ్రిగారి నుండి వుత్తరం వచ్చింది. “మీ అమ్మమ్మగారు సీతారామమ్మ గారు అనారోగ్యంతో బాధపడి స్వర్గస్థురాలయేరు” అని – ఆ కార్డు ఆమెకు భర్త ఇచ్చేరు. చదివిన సీత కన్నీరు కార్చింది అమ్మమ్మను తలచుకొని. “సీతా, వేడినీళ్లు బక్కెట్టులో పోసేను – వెళ్లి స్నానం చెయ్యి” అన్నారు శ్రీవారు.

ఆరు నెలలు గడిచేయి. ఒక రోజు అమ్మమ్మ కలలో కనపడింది. దీనంగా రోదిస్తున్నది. “నా బంగారు తల్లీ, ఆకలి వేస్తోందే, చూడు ఈ చీర ఎలా చిరిగి పోయిందో” అని చూపించింది. సీతకు వెంటనే భయంతో మెలకువ వచ్చి చాలా సేపు బాధ పడింది. మర్నాడు దగ్గర లోని అనాథాశ్రమానికి వెళ్లి భోజనానికి ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం పెద్దామెను తలచుకొని దసరా రోజులలో తెలిసిన వారికి నాణ్యమైన చీర, రవిక, పళ్లూ, పూలు ఇస్తున్నది. భోజనానికి ఏర్పాటు చేస్తున్నది.

అవన్నీ మళ్లీ ఈ గాదె లోని ఫోటో వలన గుర్తుకు వచ్చేయి. ఫొటో మసకగా వుంది. వెంటనే బొంబాయిలో వున్న పెద్ద కూతురు సాధనకు ఫోన్ చేసి వివరాలు చెప్పింది. “అమ్మా నువ్వు ఏం వర్రీ అవ్వకు. ఆ ఫొటోకు ఒక ఫోటో తీసి నాకు వాట్సాప్‌లో పంపు. తర్వాత కొరియర్‌లో ఆ ఫోటో పంపు.  ఇది మహా నగరం. సినీ పరిశ్రమకు కేంద్రం. నిపుణులైన ఫొటోగ్రాఫర్లు, మంచి చిత్రకారులు కూడా వుంటారు. సజీవంగా కనపడే విధంగా చిత్రపటాలు గీస్తారు. మీ అమ్మమ్మ గారి ఫోటో చూసి ఆమె చిత్రాన్ని చక్కగా గీయగలరు” అంది సాధన.

ఆ ఫోటో, చిత్రపటము సీతను చేరిన రోజున ఆమె ఆనందానికి అవధుల్లేవు. ‘శ్రీమతి సీతారామమ్మ’ అని పెద్ద అక్షరాలతో వ్రాయించి, ఫ్రేమ్ కట్టించి, తన గదిలో పెట్టుకున్నది.

ఆ రోజు నుండి సగర్వంగా “నా పేరు సీతారామమ్మ. మా అమ్మమ్మ గారి పేరు” అని నలుగురితో చెప్పుకున్నది. ఇంటి గేటు దెగ్గర బోర్డు మీద శ్రీవారి పేరు కింద ‘సీత’ అన్నది తొలగించి ‘సీతారామమ్మ’ అని వ్రాయించింది. ఇప్పుడామెకు ఎంతో తృప్తిగా వుంది. అమ్మమ్మ హాయిగా నవ్వినట్లు కలగన్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here