అదే పనిగా..

1
3

[మాయా ఏంజిలో రచించిన ‘Just Like Job’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(దైవంతో ఆంతరంగిక సంభాషణగా ఈ కవితని చూడవచ్చు. లౌకిక ప్రపంచం సాఫీ అయిన, ప్రశాంతమైన జీవితానికి భరోసా ఇవ్వనప్పుడు, జీవితంలో అనేకానేక సంఘర్షణలను ఎదుర్కొన్నప్పుడు చివరాఖరి వేడుకోలుగా దేవుడే గుర్తుకొస్తాడు. అలాంటి ఒక మానసిక స్థితిలో మాయా రాసిన కవిత!!)

~

[dropcap]నా[/dropcap] ప్రభూ! నా ప్రభూ!
చాలా కాలంగా నేను
నీకై ఏడ్చాను
భగభగమనే సూర్యుని వేడిమిలో
వెన్నెల చంద్రుని చలువదనంలో
నా రోదన నా అరుపులు
నువుండే స్వర్గం దాకా నిన్ను వెదికాయి
దైవమా..!
నా దుప్పటి – చల్లని మంచు తప్ప
మరేమీ కానప్పుడు
నా దేహం
ఎముకలకు దుస్తులు వేసినట్లుగా
ఉన్న రోజులలో
నేను అదే పనిగా
నీ నామాన్ని జపించాను
తండ్రీ! తండ్రీ!
నా జీవితాన్ని నీకు
సంతోషంగా అర్పిస్తున్నాను!

లోతైన నదీప్రవాహాలు ముందున్నాయి
ఎత్తైన పర్వత శిఖరాలు పైనున్నాయి
నా హృదయం, ఆత్మ
నీ ప్రేమని మాత్రమే కోరుకుంటున్నాయి
కానీ భయాలేవేవో
చీకట్లో తోడేళ్ళలా నా చుట్టూ పరిభ్రమిస్తున్నాయి
నన్ను మర్చిపొయ్యావా
ఓ ప్రభువా – ఈ నీ శిశువు చెంతకు రా!
ఓ ప్రభూ, నన్నెప్పటికీ మరవకు!

నీ భుజమ్మీద తలవాల్చమని చెప్పావు
ఆసరాగా తలవాల్చుకున్నాను
నీ ప్రేమని నమ్మమని చెప్పావు
నమ్ముతున్నాను
నిన్ను పేరుతో పిలవమని చెప్పావు
నేనలాగే పిలుస్తున్నా నిన్ను
నీ మాట మీద ముందుకు అడుగేస్తున్నాను!

నువు నా సంరక్షకుడివని చెప్పావు
నాకున్న ఏకైక మహిమాన్విత రక్షకుడివి
నా అందమైన గులాబీల మైదానానివి

ఆనందం.. మహదానందం
దైవపుత్రుని అద్భుతమైన పదం

స్వర్గధామంలో నా తల్లిని చూపించి
సుస్వాగత మండపం వద్ద
నన్ను కూర్చుండబెట్టి
కీర్తి శిఖరాలను అధిరోహింపచేస్తానని చెప్పావు
నీ మాట మీదే నేను ముందుకు అడుగేస్తున్నాను

సందులు గొందులలోంచి
ఇరుకిరుకు మార్గాలలోంచి
వీధులలోంచి
రోడ్లపైనుంచి
రహదారులలోంచి
గతకాలపు పుకార్ల దళార్లను
అర్ధరాత్రి పాదచారులను
అబద్ధాలను, అవినీతిని
మోసగాళ్ళను జూదగాళ్ళను దాటుకొని
నీ మాటమీద..
కేవలం
నీ మాటమీద
దేవుని కుమారుడవైన
నీ అద్భుతమైన మాటవలన
నీ మాటమీదే
ప్రభూ!
నేను ముందుకు అడుగేస్తున్నాను!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


Harleem writers Guild లో అత్యంత శక్తివంతంగా అత్యధికంగా రచనలు చేసిన ప్రతిభావంతురాలైన కళాకరిణిగా ఎదిగింది మాయా. జీవితం లోని అనేకానేక ఉద్వేగాలను పొదివి పట్టుకొని ఆమె రాసిన autobiographical fictions ఆ రోజుల్లో కొత్త శకానికి నాంది పలికాయి. కవిత్వం, నాట్యం, సంగీతం, ఫిల్మ్ రైటింగ్, చిత్రదర్శకత్వం, వ్యాసకర్తగా, నాటకకర్తగా, టెలివిజన్ ప్రయోక్తగాను రాణించింది. ఇవన్నీ కాకుండా civil rights activism ను గట్టిగా ప్రకటించింది. కృతనిశ్చయం, క్రమశిక్షణ, చేసే పనిపట్ల ప్రేమ ఉంటే ఎటువంటి అవరోధాలనైనా సునాయాసంగా దాటవచ్చని రాయడమే కాకుండా చేతల్లో చేసి చూపించింది మాయా. ఆమె ఉపన్యాసాలు కూడా ఎంతో ఉత్తేజభరితంగా ఉండేవి.

ఇలా పౌరహక్కుల ఉద్యమంలో చురుగ్గా వ్యవహరిస్తున్న కాలంలోనే 1959లో Southern Christian Leadership Conference జరిగింది. అక్కడే Malcolm X అనే ఉద్యమ కవితో సన్నిహిత పరిచయం ఏర్పడింది మాయాకి. అతన్ని తన కుటుంబసభ్యుని వలె భావించేది మాయా. Malcolm X – Ghanaకి వచ్చినపుడు, తాను విదేశీపర్యటనలో ఉన్నప్పుడు భావసారూప్యత కలిగిన వీరిద్దరూ కలిసి ప్రయాణించేవారు. ఆలోచనలు పంచుకునేవారు.

1964లో United States కి మాయా తిరిగి రాగానే African American Unity Organization ని మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలనుకొని ఆ దిశగా కార్యకలాపాలు ప్రారంభించాడు Malcolm X. అనూహ్యంగా Malcolm X హత్యకి గురి కావడంతో ఆ ప్రణాళికలన్నీ అతనితోనే ఆగిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here