‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -14

0
3

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 4 కాకతీయులనాటి సమాజంలో స్త్రీల స్థానం – రెండవ భాగం:

సతీసహగమనం -పర్యాయపదాలు:

[dropcap]ఆ[/dropcap]నాడు సతీసహగమనం అనే పదం వాడుకలో లేదు. భర్తతో భార్య కూడా చితిలో కాలి అతన్ని అనుసరించడాన్ని సహగమనమని, సహమరణమని, అన్వారోహణమని అనేవారు. అన్వారోహణమంటే భర్త శవంతోపాటు చితిపై ఎక్కి దహింపబడటం. భర్త వేరే ప్రదేశంలో ఎక్కడో చనిపోతే, తరువాత ఆ విషయం భార్యకు తెలిసి తానూ భర్త అస్థికలతోనో, అతని పాదుకలతోనో లేక భర్తకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేక పోయిన అగ్నికి ఆహుతి అయితే దాన్ని అనుమరణమన్నారు.

“దేశాంతర మృతే తస్మిన్సాధ్వీ తత్పాదుకద్వయమ్
నిధాయోరసి సంశుద్ధా ప్రవి శేజాతవేదసమ్”

శివుని కోపాగ్నికి భస్మమైన మన్మథునికై శోకించి రతీదేవి తానూ కుల పాలికలకు తగినట్లు సహగమనం చేయదలచిందని నన్నెచోడుని కుమార సంభవంలో ఉన్నది. అటువంటి దానిని అనుమరణమని అంటారు.

దశకుమార చరిత్రలో రాజహంసుని ధర్మపత్ని వసుమతీదేవి తన భర్త మరణించాడని తలచి శరీర త్యాగం చేయదలచింది. అగ్నికి ఏర్పాటు చేయమని మంత్రులను కోరితే వారు – “సంశయంబగు పతి మరణంబునకు నను మరణంబు తగదు” అని ఆమె కోర్కెను నిరాకరించారు.

సహగమనమన్నది మొదట ఎవరూ స్త్రీలపై బవలంతంగా రుద్దినది కాదు. కాలక్రమేణా ధర్మశాస్త్రాల ద్వారా సహగమనం అన్నది మహత్తును గొప్పతనాన్ని సంతరించుకోవడం వల్ల అది ఘనకార్యంగా మధ్యయుగంలో పరిగణించేవారు. వీరులకు వీరమరణం ఉచితమైనదని నమ్మినట్లే వీరపత్నులకు సహగమనం ఉచితమని భావించారు. మొదట్లో కొద్ది మంది సాహసికురాండ్రు ధైర్యవతులు అయిన స్త్రీలు సహగమనం పాటిస్తే క్రమక్రమంగా అది రాజకుటుంబాలలో కట్టుబాటుగా పరిణమించి ఉంటుంది.

కులస్త్రీ భర్తతో ఇహలోకంలో సుఖించకపోయినా సహగమనం చేసి పరలోకంలో పతిని చేరాలన్నది కాకతీయుల కాలంనాటి వారిలో కొందరి అభిప్రాయం కావచ్చును. పల్నాటి వీరచరిత్రలో భర్తను యుద్ధవిముఖుని చేయమని మాంచాలను కోరిన ఐతాంబతో

“బ్రహ్మ గూర్చెను మమ్ము బాలుర మపుడు
సమరంబులో నతడు సమసిన వెనుక
వెంటనేగెద గాని వినుము నామాట
పంపుము పుత్రుని బవరమ్మునకు”

అని మాంచాల అన్నది.

వీరులు మరణిస్తే వీరస్వర్గం అలంకరించినట్లే వారి పత్నులు సహగమనం చేస్తే ఆమెకు తన భర్త సాంగత్యం లభించి పరలోక సౌఖ్యాలు పొందుతుందని ఆనాటి వారి విశ్వాసం అయితే ఈ హక్కు కేవలం కులస్త్రీలకు మాత్రమే ఉందనీ, వేశ్యలు ఇహలోక సౌఖ్యాలందించడానికి మాత్రమే అర్హమైన వారని ఆనాటి వారు తలచేవారు.

బాలచంద్రుడు యుద్ధానికి బయలుదేరుతూ వేశ్య సబ్బాయిని తన వెంట రమ్మని అడిగినపుడు ఆమె అందుకు నిరాకరించి

“ఇహసౌఖ్య మొసగుట కేమె కర్తలము
పర సౌఖ్యమొసగుటకు నీ పడతియే కర్త”

అన్న మాటల్లో పై అభిప్రాయాన్నే వెలిబుచ్చింది.

సహగమనంపై ప్రాచీన ధర్మశాస్త్ర కారుల అభిప్రాయాలు:

యాజ్ఞ వల్క్యస్మృంతి – మితాక్షర
అయంచ సర్వాసాం శ్రీణా మగర్భిణీ నామ బాలాపత్యా
నామాచాణాలం సాధారణో ధర్మః
భర్తారం యానుగచ్ఛతీత్య విశేషోపాదానాత్

అన్న యాజ్ఞవల్క్య స్మృతికి వ్యాఖ్యానం చేస్తూ మితాక్షర – శంఖలిఖిత అంగిరసులనే ధర్మ శాస్త్రకారుల సూత్రాలను ఉటంకించింది.

త్రిస్రః కోట్యోర్థకోటీచ యాని లోమాని మానుషే
తావత్కాలం వసేత్స్వర్గం భక్తారం యానుగచ్ఛతి
వ్యాలగ్రాహీ యధాసర్పం బలా దుద్ధరతే బిలాత్
తద్వదు ధృత్య సానారీ సహతేనైవ మోదతే
తత్రసా భర్త పరమాస్తూయ మానాప్సరోగణైః
క్రీడతే పతినా సార్ధం యావది న్ద్రశ్చతుర్దశ

మితాక్షరలో చెప్పినట్లు శంఖఅంగీరసులు సహగమనం చేసే స్త్రీ యొక్క గొప్పతనాన్ని పై శ్లోకాల ద్వారా ఈ క్రింది భావాల్ని వెలిబుచ్చారు.

ఏ స్త్రీ భర్త మరణానంతరం అగ్నిద్వారా అతడిని అనుసరిస్తుందో ఆమె శరీరంపై ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు అంటే మూడు వందల యాభై కోట్ల సంవత్సరాలు స్వర్గవాసం చేస్తుందనీ, పాములవాడు తన శక్తినీ, చాకచక్యాన్నీ ఉపయోగించి ఏ కన్నంలో ఉన్నా పామును ఎలాగ బయటికి రప్పిస్తాడో అదేవిధంగా సహగమనం చేసిన స్త్రీ కూడా భర్త ఎక్కడున్నా స్వర్గానికి రప్పించి అతనితో స్వర్గసుఖాలనుభవిస్తుంది, దేవతా స్త్రీల మెప్పు పొందుతుంది.

సహగమనం చేసే భార్య వల్ల కలిగే ఫలితాల గురించి కూడా వీరు ఈ విధంగా చెప్పారు.

భర్త బ్రహ్మహత్యా పాతకం చేసినా, మిత్రవధ చేసినా లేక కృతఘ్నుడైనా అతని భార్య భర్త శవాన్ని కౌగలించుకొని దహనమైతే అతని పాపాలన్నీ పోగొట్టి పునీతుని చేస్తుంది. భర్త చితిపై చేరిన భార్య అరుంధతితో సమానమైన శీలం కలదనీ, స్వర్గంలో ఆమె పొగడబడుతుందనీ కూడా వారు చెప్పారు. అంతేకాదు ఆ విధంగా సహగమనం చేయని భార్యకు రాబోయే జన్మల్లో స్త్రీగా జన్మించక తప్పదు – అని శిక్షగా చెప్పారు.

హరీతుడనే ఋషి సహగమనం చేసిన స్త్రీ తన తల్లి తండ్రి భర్తల యొక్క వంశాలను పవిత్రం చేస్తుందని చెప్పాడు.

పై ధర్మశాస్త్రకారులందర్నీ ఉటంకించి వ్యాఖ్యానించిన మితాక్షర అన్వారోహణం చెయ్యడం అనేది విప్రులనుండి చండాలుర వరకు అందరు స్త్రీలు పాటించవలసిన ధర్మంగా చెప్పింది. అయితే గర్భిణీస్త్రీలు, శిశువులున్నవారు సహగమనం చేయరాదని మితాక్షర ద్వారా నిర్దేశింపబడింది.

సహగమనాన్ని వ్యతిరేకించిన ధర్మశాస్త్రకారులు:

సహగమనాన్ని అంగీకరించని ధర్మశాస్త్రకారులు, వ్యాఖ్యాతలు కూడా ఉన్నారు. మనుస్మృతికి వ్యాఖ్యానం వ్రాసిన మేధా తిధి సహగమనాన్ని అధర్మమని అశాస్త్రీయమని చెప్పాడు. స్మృతి చంద్రికకర్త అన్వారోహణం కంటే బ్రహ్మచర్యం వల్ల కలిగే ఫలితం శ్రేష్ఠమన్నాడు.

విజ్ఞానేశ్వరుడు బ్రాహ్మణ స్త్రీలకు సహగమనాన్ని అంగీకరించలేదు అది ఆత్మహత్యతో సమానమని అందుచేత దోషమనీ చెప్పాడు.

మితాక్షర సహగమనాన్ని సమర్థించినప్పటికీ ప్రస్తుత చారిత్రక కాలానికి చెందిన కేతన తన విజ్ఞానేశ్వరంలో సహగమనాన్ని నిర్దేశించలేదు. భర్త చనిపోయిన తర్వాత బ్రహ్మచర్యం పాటించిన స్త్రీ పతివ్రత అనీ, పార్వతితో సఖీత్వం పొందుతుందనీ చెప్పాడు.

పతి యున్నను బతి చచ్చిన
నితరుల దా( బొందకున్న యీలువుంటాలీ
క్షితి( గీర్తియు (బిమ్మట (బా
ర్వతితో సఖీత్వమును ధ్రువంబుగ (బడయున్

సాహిత్యంలో సహగమనం చేసిన స్త్రీలు:

పల్నాటి వీరచరిత్ర కావ్యంలో పేరిందేవి సహగమనం చేసిందని ముందు చెప్పడమైంది. అనపోతు భార్య, ఖడ్గతిక్కన భార్య జానమ బ్రాహ్మణ స్త్రీలే అయినా సహగమనం చేశారు. రంగనాధ రామాయణంలో అమూలకమైన సులోచన వృత్తాంతంలో సులోచన తనకు చిన్న పిల్లలున్నప్పటికీ వారిని తన తండ్రి వద్దకు పంపి సహగమనం చేసింది. చేసేముందు మామ, లంకకు రాజు అయిన రావణుని అనుమతి కోరింది. అందుకాతడు “ప్రియ సుతాగ్రజు జంపి భీతుల చేత భయ దుఃఖ వార్ధిలో బడియున్న వాడ నాకేమి తోచదు నాతియీ మీద నీకు దోచిన జాడ నీవేగుమని” బదులు పలికాడు.

దీన్ని బట్టి కాకతీయుల కాలంలో కొందరు స్త్రీలు తమ యిష్టాపూర్వకంగానే సహగమనాలు చేశారని చెప్పవచ్చును. కొందరు బహుశా ధర్మశాస్త్రాలు చెప్పిన ప్రకారం అరుంధతితో సమంగా కీర్తి సంపాదించే కోరికతో చేసి ఉండవచ్చు. రాజకుటుంబాలలో సహగమనాలు కాలక్రమేణా ఎక్కువ కావడానికి కారణం గెలిచిన రాజులు ఓడిన రాజుల భార్యలను బలాత్కారం చేసి వారి అంతఃపుర స్త్రీలను బందీలుగా పట్టి తీసుకుపోయి తమ అంతఃపురాలలో దాసీలుగా చేసుకొనేవాళ్లు. కొందరు అంతపురస్త్రీలను తమ విలాసినులుగా చేసుకొనేవారు. ఏ పురుషుడినైనా అవమానించాలన్నా, శిక్షించాలన్నా అతనిని శారీరకంగా హింసించకుండా అతని తాలూకు స్త్రీలపై అత్యాచారం చేస్తే ఆ పురుషునికి ఎక్కువ బాధాకరం, అవమానం కలుగుతాయి కనుక శత్రువు అ పనికి పూనుకుంటాడేమోననే భయం, ఆ స్త్రీలను బలాత్కారం చేసి అనుభవిస్తే వారి వంశం అపవిత్రమౌతుందనీ భావించేవారు కనుగ ఓడిన రాజుల స్త్రీలు ప్రాణత్యాగం చేసేవారు.

ధర్మశాస్త్రాలలో చెప్పిన సహగమన కార్యక్రమ పద్ధతి:

శుద్ధితత్త్వమనే శాస్త్రం ప్రకారం సహగమనం తంతు ఈ విధంగా ఉన్నది.

విధవ అయిన స్త్రీ రెండు తెల్లని వస్త్రాలను ధరించి చేతులలో ధర్భలు పట్టుకొని తూర్పునకు గానీ ఉత్తరానికి గానీ అభిముఖంగా కూర్చొని ఆచమనం చేస్తుంది. బ్రాహ్మణులు ఓం తత్సత్ అనగానే ఆమె నారాయణుని తలచుకొని మాసం, పక్షం, తిథి పేరు చెప్పుకొని సంకల్పం చేసుకోవాలి. తరువాత ఆమె అష్ట దిక్పాలకులను, సూర్య చంద్రాదులను అగ్నిని తన భర్తతో సహగమనానికి సాక్షులుగా చేసుకొని చితి చుట్టూ ముమ్మూరు ప్రదక్షిణం చేస్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు “ఇమానారీః – – -” అనే ఋగ్వేదమంత్రం చదివి, అతి పవిత్రమై అత్యుత్తమమైన ఈ పతివ్రతాస్త్రీలు తమ భర్తల దేహాలతో అగ్ని ప్రవేశం చేయుగాక అనే పురాణ శ్లోకం చదవగానే ఆ స్త్రీ నమోనమః అని చితిపై చేరుతుంది.

సహగమనం చేసే స్త్రీకి ఒక ద్రవం తాగడానికి ఇచ్చేవారు. అది ఆమె మెదడును స్తబ్ధుగా చేసి ఆయోమయంగా చేస్తుంది. ఆ ద్రవం తాగడంవల్ల ఆమె ఎక్కువగా నవ్వడం చేస్తుంది. చూసే వారందరికీ ఆమె సంతోషంగా సహగమనం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ ద్రవం గురించి “డుబోయి” అన్న రచయిత తన గ్రంథంమైన ‘హిందూ మానర్స్ కస్టమ్స్ అండ్ సెరిమొనీస్’ రెండవ భాగంలో ఈ విధంగా వ్రాశారు. “చాలామంది విదేశీ యాత్రికులు చెప్పినదీ, నా ఉద్దేశంలో నిజం కూడా ఏమిటంటే సహగమనం చేయబోయే వారి చేత ఒక విధమైన పానీయం తాగిస్తారు. దానివల్ల ఆ స్త్రీ మెదడు స్తబ్ధుగా అయిపోయి, అయమోమయ స్తితిలో, సరి అయిన నిర్ణయం తీసుకునే శక్తి, తమకు జరగబోయే అన్యాయాన్ని గురించిన అవగాహన శక్తి కోల్పోతారు. ఇది కాశ్మీర పువ్వు లేదా కుంకుమ పువ్వు (కేవర్) కేసరాలు ఎండబెట్టి కాచిన కషాయం. దీన్ని తాగిన వారికి అతిగా నవ్వువచ్చి మరణిస్తారు”. ఇందులో ఎంతవరకు నిజముందోగానీ కాకతీయుల కాలంలో ఎక్కువగా కుంకుమ పువ్వును లేపనాలుగా వాడేవారు. ఆనాటి వారి వీరావేశ మతావేశాలకి కారణం కుంకుమపువ్వు వాడకం కావచ్చునేమో పరిశీలించవలసిన విషయమే.

కాకతీయుల నాటి సాహిత్యంలో సహగమన కార్యక్రమ వర్ణన:

రంగనాథ రామాయణంలో సులోచన సహగమనం:

సులోచన తన తోటి సఖులు, సతులు కొలువగా రావణుని ఆనతిని తీసుకొని చుట్టాలు బంధువులు వెంటరాగా మృదంగ, నిస్సాణ, పటహ భేరీ శంఖ పటుకాహళాది శబ్దాలు మోగుతుండగా, ఆమె స్నానం చేసి సిరిపట్టు పుట్టాన్ని కట్టి రత్న భూషణాలు అలంకరించుకొని, ఇంద్రజిత్తు శరీరాన్ని మంచి వస్త్రాలతో, భూషణాలతో అలంకరించి మంచి విమానం పైనుంచి వాద్యతూర్యనాదాలు మోగుతూ ఉండగా, త్రేతాగ్నులను తీసుకొని దైత్యులు రాగా వేదోక్త విధి పూర్వకంగా ఉత్తర భాగంలో చితిని పేర్చి వచ్చిన ముత్తైదువుల కపుడు పసిడి శూర్పాలను, వస్త్రాలను ఇచ్చి భక్తితో చితిమీదకు చేరి భర్తను కౌగిలించుకోగా చితికి నిప్పు అంటించారు.

ఖడ్గ తిక్కన భార్య జానమ సాగుమానం (సహగమనం) కాటమరాజు కధలో ఈ విధంగా ఉన్నది. ఖడ్గతిక్కన భార్య తన భర్తతో సహగమనం చేసే నిమిత్తమై సచేలస్నానం చేసి అనేక దానాలను బ్రాహ్మలకిచ్చి రణభూమి చుట్టూ ప్రదక్షిణం చేసి ప్రార్థించి, పతి శిరస్సును గుర్తుపట్టి తీసుకువచ్చి దానితో కూడా సాగుమానం చేసింది.

కాటమరాజు కథలో యరనూకసీత సాగుమానం:

యరనూక సీత తన భర్త చనిపోగా సాగుమానానికి సిద్ధమై తన పిల్లలను వదిన పుల్లమ్మకు అప్పగించింది. పాలుతాగే పసిపాప నాగమ్మకు పాలు ఇచ్చి ఆమెను వదిన చేతికిచ్చి గోవులు వస్త్రాలు, ధనము తెప్పించి బ్రాహ్మణులకు కోరిన దానాలిచ్చింది. దాదులను పిలిచి తాళబీగాలను వారికిచ్చి వస్తువులను కనకాంబరములను తెచ్చి ఇవ్వమని చెప్పింది. మిగిలిన చెలులందరూ స్నానాలు చేశాక వారు పసుపు కుంకుమ, పుష్పగంధాన్ని జల్లారు. అందరూ కూర్చుండగా అంగరంగ భోగాలు ఆటపాటలు చేస్తూ స్త్రీలందరూ చెట్లనీడకు చేరారు. బంగారపు టరుగుపై గౌరిని నిలిపి, పదివేల చేటలు, మాడలు, పదివేల చీరలు భూషలు చాలా తెప్పించి, యరనూక సీత గౌరి నోము నోమి కథ అంతా విని బ్రాహ్మణస్త్రీలను పిలిచి సకల వస్తువులు, చీరలు, రవికలు అందరికీ పంచి పెట్టింది. ఆ తరువాత పట్టుచీర విడిచి, పసుపుచీర గట్టి పూల చెండ్లు చుట్టుకొని గుండానికి చేరింది. గుండం చుట్టూ ఇతర స్త్రీలతో ప్రదక్షిణలుచేసి, దేవతలను ధ్యానం చేసి, గట్టుచేరింది. అగ్ని అంటుకొని మంటలు చెలరేగుతుండగా అగ్నిని ప్రార్థించి వేడి నిమ్మపండ్లు, చమురు కుండలు, పుష్పాలు గుండంలో వేసి ఆచంద్ర తారకం అవనిలో వర్ధిల్లమని ప్రజలను దీవించి గుండంలో దూకింది యరనూక సీత. ఆమె వెనుకనే ఆ స్త్రీలు అగ్నిలో దూకారు.

ఇంతకుముందు చెప్పినట్లు ప్రాచీనకాలం నుంచి స్మృతులు, ధర్మశాస్త్రాలు సహగమనాన్ని ప్రోత్సహించినా అవైదిక మతాలు వీటిని ప్రోత్సహించలేదు. బౌద్ధమతాన్ననుసరించిన స్త్రీలు భర్త చనిపోయాక బ్రహ్మచర్యం పాటించారని నానేఘాటు వద్దనున్న శాసనంలో దేవి నాగనికను గురించి తెలిపిన దాన్ని బట్టి తెలుస్తున్నది. ఆమె గురించి ఆ శాసనంలో గృహమందుండియు తాపసి వంటి దని, బ్రహ్మచర్యమును పాటించునదని చెప్పబడింది.

కాకతీయుల కాలంలో వ్యాప్తిలో ఉన్న వీరశైవమతం స్త్రీలను పురుషులతో సమానంగా గౌరవించింది. శైవుడు కాని భర్తను వదిలి వేయవచ్చునన్న శైవమతం భర్త చనిపోతే నిష్కారణంగా నిండు జీవితాన్ని అగ్నికి ఆహుతి చేయమని ఎలా బోధించగలదు? మరణించిన వ్యక్తి ఎంత పాపాత్ముడైనా శివరాత్రి నాడు శివునికి దీపం అర్పిస్తే కైలాసం చేరుకుంటారని శైవుల నమ్మకం. శివలింగ ప్రతిష్ఠ, శిఖరంపై కలశాలు పెట్టించడం ఉత్తరాయన సంక్రాంతి వంటి పుణ్యతిథులలో అఖండదీపాలనర్పించడం వంటి ధర్మకార్యాలు చేయయడం వల్ల మరణించిన వ్యక్తి శివలోకం చేరుకుంటాడు. కనుక అతడి పాపాలను పోగొట్టేందుకు అతని భార్య సహగమనం చెయ్యవలసిన అవసరం లేకుండా, ఆమె శక్తికొద్దీ శివలింగ ప్రతిష్ఠ చేయడం తాహతును బట్టి ఆలయతటాక నిర్మాణాలు, భూరిదానాలు చేయడం, అంతగా ధనంలేని స్త్రీ అఖండదీపానికై గోవులనర్పించడం వంటివి చేసి భర్తకు శివలోక ప్రాప్తి కలిగించేది.

సాహిత్యంలో అంటే పలనాటి వీరచరిత్ర, రంగనాథ రామాయణం కాటమరాజు కథల (రచించిన కాలం ఏదైనా కథాకాలం కాకతీయులనాటిదే) లో ఉన్న సహగమనాలు భర్తలు కోల్పోయిన స్త్రీలు తమ కులాచార ప్రకారం సతిననిపించుకోవాలనే కోరికతో కాక యిష్టానుసారం చేసినవి. పౌరాణిక మతం పురుషులు చేసే పాపాలు వారి కులస్త్రీల సహగమనాలతో ప్రక్షాళనమై, అతనికి పుణ్యలోకాలు లభిస్తాయని బోధిస్తే, వీరశైవమతం పురుషుడు గానీ స్త్రీ గానీ పాపం చేసిన వారెవరైనా శివలింగాన్ని ధరించి శైవధర్మాన్ని అనుసరిస్తే కైలాసం లభిస్తుందని బోధించి, భర్త పాప ప్రక్షాళనకు సంబంధించి స్త్రీల బాధ్యతను తగ్గించింది. కాకతీయుల కాలం తర్వాత రాజుల కాలంలో వైష్ణవ మత ప్రాబల్యం హెచ్చింది. స్త్రీలకు స్వేచ్ఛ నిచ్చిన శైవమత ప్రభావం తగ్గింది. రాజకీయ పరిస్థితులు, మత పరిస్థితులు స్త్రీల సహగమనాన్ని ప్రోత్సహించాయి. విజయనగర సామ్రాజ్య కాలంలో రాజులు బహుభార్యత్వం పాటించి వందల సంఖ్యలో స్త్రీలను పెళ్ళాడేవారు. ఆ రాజు మరణిస్తే అందరూ సహగమనం చేసేవారు. మహమ్మదీయ పాలకులు వారి పాలనలో సహగమనం పేరుతో జరిగే యీ ఘోరమైన సంప్రదాయాలను సతి పేరుమీద జరిగే అకృత్యాలను నిరసించారు. సహగమనం చేసేవారు సుల్తాన్ దగ్గర అనుమతి తీసుకోవలసిన అవసరం ఉండేది. వారు అంగీకరించకపోయినా, వారికింది ఉద్యోగులు లంచాలు తీసుకొని అనుమతిని ఇచ్చేవారు.

మహమ్మదీయుల దండయాత్రలు, తరువాత వారి పరిపాలనా కాలంలో కూడా సహగమనాలు ఎక్కువే అయినా బ్రిటిష్ వారి కాలంలో సహగమన నిషేధ చట్టం ప్రవేశపెట్టే వరకూ సాగడానికి కేవలం అవి కారణాలు కావు. ఆంధ్రదేశంలో కంటే బెంగాలు రాజస్థాను వంటి ప్రదేశాలలో ఈ సహగమనాలు ఎక్కువైనాయి. విధవలను బలవంతంగా చితిమీదికి నెట్టి కాల్చడం బెంగాలులో ఎక్కువై రాజారామమోహనరాయ్ వంటి సంఘ సంస్కారులకు దుస్సహమై విలియం బెంటింగ్ ప్రభువు చేత సహగమన నిషేధ చట్టం తెప్పించడానికి కారణమైంది. బెంగాలులో అంత ఎక్కువగా సతి అమలు జరగడానికి కారణం మత, సాంఘిక కారణాలు మాత్రంకాదు. బెంగాలులో అమలులో ఉన్న దాయభాగ ధర్మశాస్త్ర ప్రకారం విధవకు తక్కిన కొడుకులందరితో పాటు ఆస్తిలో సమానమైన హక్కు ఉన్నది. ఈ హక్కు సంపాదించడానికి ఆడపిల్ల తల్లిదండ్రులు బలవంతంగా చావడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులకు తమ కుమార్తెలనిచ్చి పెళ్ళి చేస్తే, ఆస్తి విధవకు దక్కకుండా తమకి దక్కాలని చనిపోయిన వ్యక్తి అన్నదమ్ములు, తల్లిదండ్రులు దగ్గరి బంధువర్గం ఆ స్త్రీని సతీసహగమనం పేరుతో బలవంతంగా చితిమీదికి నెట్టి చంపేవారు.

మొదట భర్తపై అనురాగంతో అతనిని వదలలేని భార్య, పతివియోగాన్ని సహించలేని స్త్రీ తన యిష్టాను పూర్వకంగా చేయడంతో మొదలయిన సహగమనం కాలక్రమంలో ఎంతో మంది నిస్సహాయులైన బాలికలకు, యువతులకు శాపంగా, బలవన్మరణంగా మారి సంఘసంస్కర్తలు రాజారామమోహన్ రాయ్ వంటి వారి ఉద్యమాల వల్ల, చట్టపరంగా మన దేశంనుండి తొలగిపోయింది. అయినా చట్టానికి ప్రభుత్వానికీ తెలియకుండా కొన్ని సహగమనాలు జరిగినాయని వార్తా పత్రికలలో ప్రచురింపబడటం వల్ల తెలుస్తున్నది.

ప్రజలు సహగమనాన్ని ఒక మహాకార్యంగా భావించడం దాన్ని ఆచరించిన స్త్రీని ఆరాధించడం మాని ఆ విధమైన చర్యలను భారతీయ సంస్కృతికి వన్నె తెచ్చేవని ప్రోత్సహించే మతాలను రాజకీయ పక్షాలను ఖండించి సతీసహగమనం మన సంస్కృతికి కళంకమని భావిస్తే స్త్రీలకు న్యాయం చేకూర్చిన వారవుతారు. ఉపేక్ష చేసినా, సహగమనాన్ని ప్రోత్సహించినా స్త్రీలు అధోగతి పాలవక తప్పదు.

వితంతు స్త్రీ:

భారతదేశంలో అనాదిగా కులస్త్రీలకు గౌరవం ఇవ్వబడింది. పతివ్రత అయిన స్త్రీ ఎంతో మహిమ కలదని మన ధర్మశాస్త్రకారులు ఉద్ఘాటించారు. ఆ స్త్రీ విధవ అయినపుడు సహగమనం చేయడం వల్ల ఆమె పుట్టింటివారు, అత్తింటివారు, భర్త ఆమె వంశంలోని పితరులు అందరూ తరిస్తారని ధర్మశాస్త్రకారులు చెప్పినట్లు ముందు చెప్పుకున్నాం. అయితే వీరశైవ మతంలో వ్యక్తి చనిపోయినపుడు శివలింగ ప్రతిష్ఠ చేస్తే శివలోకం చేరుకుంటారని నమ్మడం వల్ల చాలామంది స్త్రీలు భర్త మరణించినపుడు శివలింగ ప్రతిష్ఠలు చేశారు. ఆ విధంగా సహగమనం చేయకుండా ఉన్న స్త్రీలు బ్రహ్మచర్యం విధిగా పాటించేవారు. భర్తలేని స్త్రీలు మాంగల్యరహితలుగా, ఏ అలంకారం లేకుండా ఉండాలని, ధనవంతులైనప్పటికీ నిరాడంబరంగా జీవించాలని ఆనాటి ధర్మశాస్త్రాలు శాసించాయి.

పతిహీనలయిన భామిను,
లతి ధనవతులయ్యు గులజలయ్యును ననలం
కృతలయ్యెడు మాంగల్యర
హితలయ్యెడు గృపణవృత్తి నిదియు మొదలుగన్

ఆనాడు క్షత్రియస్త్రీలు సహగమనం చేసినా బ్రాహ్మణ వితంతువులకు విజ్ఞానేశ్వరుడు సహగమనాన్ని అంగీకరించలేదు. సహగమనం ఆత్మహత్యతో సమానమని విజ్ఞానేశ్వరుడు చెప్పాడు. వితంతువులకు ఆస్తిహక్కు ఆచారంగా స్థిరపడిందని, వారు ఆభూషణాలు విసర్జించారు కానీ కేశాలు తీసేవారు కాదని ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ డెక్కన్‌లో ఉన్నది.

శైవమతాన్ని అవలంభించిన స్త్రీలు వితంతువులైనప్పటికీ శైవ సంబంధమైన రుద్రాక్షలు, స్ఫటికపు పూసలు, విభూతి ధరించేవారు. సభలకు వెళ్ళేవారు. స్వతంత్రంగా జీవించేవారు. వారు శైవభక్తులను పురుషులైనప్పటికీ ఇంటికి ఆహ్వానించి అతిధి సత్కారాలు చేసేవారు. బ్రాహ్మణ స్త్రీలు పై విధంగా చేయడం ఇష్టంలేని బ్రాహ్మణులు, రాజుతో చెప్పి దండింపజేయడానికి ప్రయత్నం చేసేవారు.

పండితారాధ్య చరిత్రలో పోరండ్ల సూరసానవ్వ అనే బ్రాహ్మణ వితంతువు విధవలుండవలసిన పద్ధతిలో ఉండక, జంగముడైన మాలలను ఇంటికి ఆహ్వానించి అగ్రహారాన్ని మైలపరచిందని బ్రాహ్మణులు రాజుకు చెప్పి, ఆమెను దండించమని చెప్పిన సందర్భంలో సూరసానమ్మ భక్తురాలిగా చేసుకొనే అలంకారాన్ని తెలిపారు.

వైధవ్య వర్తనల్ వఱతి పాల్సేసి
యరయ నుమ్మెత్తకాయలు దిన్నయదియె
మరులు గొన్నది యొ మున్ మతిదప్పినదియొ

చెక్కిళ్ళకు, కణతలకు, శరీరానికి విభూది (బూడిద మెత్తుకొని) రాసుకొనేదనీ, తలకు, చెవులకు, చేతులకు రుద్రాక్షలు, పటికంపు పూసలు ధరించినదని, విధవలుండవలసిన విధంగా ఉండక పైవిధంగా ఉన్నదని చెప్పడం వల్ల స్మార్త బ్రాహ్మణ విధవ స్త్రీలు ఏ విధమైన మైపూతలూ, అలంకారాలు లేకుండా ఉండేవారని ఊహించవచ్చును. స్వతంత్రంగా ఏ మతాన్నైనా అనుసరించే హక్కు వారికి లేదు. శ్రీనాథుని నాటికి బ్రాహ్మణ వితంతువుల స్థితి అతి దయనీయంగా ఉండేది.

శ్రీనాథుని కాలంలో విధవలు ఉపవాసాలుండేవారు. నానా పుణ్యతీర్థాలు సేవించేవారు. నిష్ఠతో జపాలు చేసేవారు. భక్తితో దేవతార్చనం చేసేవారు. అయినప్పటికీ వితంతువు మగనాలితో సరిపోలదని శ్రీనాథుడు కాశీఖండంలో అన్నాడు.

ఉదయమే నిద్రలేవగానే తల్లి, వదినె, అత్తగారు తప్ప విధవ స్త్రీ ముఖం చూడకూడదు అని, ప్రాణం లేని శవం సుగంధ ద్రవ్యాలతో, అభిషేకాలతో ఎంత కడిగినా పవిత్రం కానివిధంగా విధవ ఎన్ని విధాల ప్రయత్నించినా శుచిత్వాన్ని పొందదు అని, పరమ నిర్భాగ్యురాలు అయిన ఆమె ఆశీస్సు విష సమమని, ముండదీవెన ఎంత ప్రియంగా ఉన్నా అంగీకరించరాదు అని కాశీఖండంలో శ్రీనాథుడు చెప్పాడు. దీన్నిబట్టి శ్రీనాథుని కాలంనాటికి విధవలు ఎంత హీనంగా చూడబడేవారో అర్థమౌతుంది. క్రీడాభిరామంలో శ్రీకాకుళాంధ్ర దేవుని తిరునాళ్ళలో బాలవితంతువులు ఎలా ప్రవర్తించేవారో ఎంత జుగుస్సాకరంగా వారి జీవితం ఉండేదో వర్ణించబడింది.

ఆనాడు బాలికలకి బాల్యంలోనే వివాహాలు జరిగేవి. అందులో బ్రాహ్మణ బాలికలను వయసులో పెద్దవారైన వారికిచ్చి పెళ్ళిచేసేవారు. వేదవిద్య పూర్తిచేసుకునేందుకు 12, 24, 36, 48 ఇలా ఒక్కొక్క వేదం పూర్తి చేసుకుంటూ నాలుగు వేదాలను పూర్తిచేసి బ్రహ్మచర్యం మాని గృహస్థాశ్రమం స్వీకరించబోయిన పెద్దవారికి ఐదేళ్ళ లేదా పదేళ్ళ బాలికతో వివాహం అయేది. వారు కన్యలు గానే విధవలయే వారని కేతన విజ్ఞానేశ్వరంలోని క్రింది పద్యాన్ని బట్టి ఊహించవచ్చు.

మగవారి పొందు ఎన్నడూ లేని విధవలైన కన్యలను అక్షత అని అంటారు.

‘మగపొందెన్నడు లేక విధవయగు కన్నియ యక్షత సమాఖ్య గలిగి చరించున్’

కాకతీయుల కాలంలో యాదవుల కాలంలో (ది ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది డక్కన్ – యాజ్‌దానీ గారు చెప్పినట్లు) బాహ్మణ వితంతువులు కేశాల్ని తీసేవారు కాదు.

చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకొని, జీవితాధారం లేక పూటకూటిళ్ళు నడుపుతూ, సహజమైన శారీరక బలహీనత, వయసులో సహజమైన కోరికలణచుకోలేని విధవలను మతాన్నడ్డు పెట్టుకొని చెరిచే జంగములు, మతగురువులు, ఆచార్యులు ఎక్కువై సమాజంలో వితంతు స్త్రీలంటే అసహ్యం, జుగుప్స కలిగి వారి దుస్థితికి జాలిపడే గుణంపోయింది. కనుకనే శ్రీనాథుని కాలానికి స్త్రీలు విధవలుగా జీవించడం కంటే భర్తతో సహగమనం చేయడమే మేలని అది గొప్ప కార్యమనీ తలచేవారు. కాకతీయుల కంటే పూర్వకాలంలో భర్తపోయాక స్త్రీ చనిపోవడమే మేలని భావించేవారు. కానీ కాకతీయుల కాలంలో బ్రాహ్మణులు కాక తక్కిన కులాలలోని వితంతువులైన స్త్రీల పరిస్థితి ఈ విధంగా లేదు. భర్త చనిపోతే అతని పుణ్యం కోసం, శివలోక ప్రాప్తికోసం శివలింగ ప్రతిష్ఠలు చేసి, ఆలయాలు కట్టించేవారు. రాజ్యానికి వారసుడు చిన్నవాడైతే పెరిగి రాజ్యపాలన చేపట్టేవరకు రాజ్యభారాన్ని వహించేవారు. వారి తరఫున స్త్రీలే రాజ్యమేలేవారు. రాజమాతలుగా కొడుకులకు రాజనీతి బోధించి, పాలనలో సలహాలనిచ్చేవారు. దైవభక్తి గలవారు మతసభలలో, సంఘ సంస్కార కార్యక్రమాలలో పాల్గొనేవారు. అయితే అటువంటి వారు బహుతక్కువ. పోరండ్ల సూరసానవ్వ అంత్యజులని వెలివేసే బ్రాహ్మణులను ధిక్కరించి తన యింట్లో ఒక అంత్యజునికి ఆతిథ్యమిచ్చి శిక్షింపవచ్చిన వారందరికీ శివతత్త్వం బోధించి మానవులందరూ సమానమేనని చెప్పి కనువిప్పు కలిగించింది.

బ్రాహ్మణ విధవలు పూటకూటి యిళ్ళు నడిపేవారు. క్రీడాభిరామంలో పూట వంటకాలు పెట్టే బాడబులవాడలో లక్ష్మణవజ్ఝల యింటిలో, అటువంటి పూటకూళ్ళు నడిపే యిళ్ళలో వితంతువులున్నట్లు తెలుస్తుంది. పూటకూటి యిళ్ళలో విహారానికి కూడా పనికివచ్చే విధంగా విప్ర విధవలు ఉండేవారని క్రీడాభిరామంలో ఉన్నది.

వీరు చిన్నతనంలోనే వైధవ్యాన్ని పొంది, కోరికల నణచుకోలేక, నీతినియమాలు పట్టించుకోని కుటుంబ సభ్యుల మూలంగా పతనం చెంది (పూటకూట యిళ్ళకు) యితర ప్రాంతాల నుండి పట్టణానికి వచ్చి యాత్రికులకు శరీరాన్నమ్ముకొనేవారు. ఆ విధంగా కొందరు ఉన్నప్పటికీ వారుకూడా ఆధ్యాత్మికమైన జీవనానికి దూరంగా ఉండేవారు కాదు. అచ్యుత జాగరణ వేళలలో రామాయణ, భాగవతాది గ్రంథాలు పాడేవారు. ఒక రాయ వితంతువు కోయిల పంచమ స్వరంలో కూసిన విధంగా అచ్యుత జాగరణ వేళల్లో రామాయణం ఆరుకాండలు మనోహరంగా పాడిందని క్రీడాభిరామంలో ఉన్నది. దాన్ని బట్టి రెండు విధాల వారూ ఉండేవారని చెప్పాలి. బీద బ్రాహ్మణ స్త్రీలు దేవాలయాలలో మఠాలలో నీళ్ళు పోయడం, సత్రాలలో వంట చేయడం వంటివి చేసేవారు. బహుశా ఆ స్త్రీలు విధవలు అయివుండవచ్చు. ఇతర వృత్తివర్గాల వితంతు స్త్రీలు ఆయా వృత్తులను కొనసాగించేవారు. క్షత్రియ స్త్రీలు, పాలకవర్గానికి చెందిన స్త్రీల మాటెలా ఉన్నా, సంఘంలో క్రింది వర్గాల స్త్రీలు సహగమనం ఏనాడూ పాటించలేదు. శైవమత ప్రభావం వల్ల సహగమనాలు తగ్గగా, విధవలు ముఖ్యంగా బాల్యంలోనే భర్తలను పోగొట్టుకొన్న విప్రవిధవలు నైతికంగా పతనం చెందడం సహించని శ్రోత్రియులు, ధర్మశాస్త్రకారులు విధవల నీతినియమావళి నేర్పరచి వారి శీలరక్షణ బాధ్యత స్వీకరించి వారిని నిర్వికారులుగా, నీరసులుగా చేయడానికి వారిచే ఉపవాసాలు చేయించి, విధవలకు కేశాలు తీసివేసి, తెల్లని వస్త్రాలు ధరింపచేయడం వంటివి చేసివుంటారు. శ్రీనాథుని కాలానికి కేశాలు తీసే ఆచారం వచ్చివుంటుంది. కనుకనే క్రీడాభిరామంలో బోడముండ అనీ, కాశీఖండంలో ముండదీవెన అని ప్రసక్తమైంది.

వితంతు పునర్వివాహం:

బాలవితంతువులకు పునర్వివాహం చేయాలన్న సంకల్పం ఆధునిక యుగ సంఘ సంస్కర్తలైన రాజారామమోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులుగారు వంటి వారికి కలిగిందని, దాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించి వితంతువుల జీవితం బాగుచేయడానికి ప్రయత్నించారని మనకు తెలుసు. అంతకుముందు వితంతువులు దుర్భరమైన జీవితాన్ని గడిపేవారని మనకు తెలుసు. అయితే కాకతీయుల కాలంలో, అంటే స్త్రీల పరిస్థితి మెరుగుగా ఉన్న కాలంలో వితంతువులకు పునర్వివాహం జరిగేదా లేక తరువాతి కాలంలో లాగా అనూహ్యమా అన్నది మనం పరిశీలించాలి.

సాహిత్యాధారాలను బట్టి విధవలు కొందరు వివాహమాడేవారని అనుకోవచ్చును. క్రింది వర్గాల స్త్రీలలో మారు మనువు సాధారణమే. కానీ బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలలో, రాజరికం చేసే కులాల స్త్రీలలో వితంతు విహహాలు తక్కువ. అయితే అసలు జరిగేవి కావు అనటానికి లేదు. బాలిక అయిన స్త్రీకి భర్తపోతే మళ్ళీ పెళ్లి చెయ్యటం అక్కడక్కడా జరిగేది. దీనికి ఆధారం కేతన విజ్ఞానేశ్వరంలో కనిపిస్తుంది.

మగడీల్గ గన్య పెండిలి,
యగునేనియునది పునర్భువగు
మగని దిగవిడిచి యొండెను
మగండీల్గిన న నొండే వేఱు మగనికి నాలై
తగ గనిన సుతుడు రెండవ
మగనికి బౌనర్భవాఖ్య మహి బుత్రు డగున్

పై పద్యాలను బట్టి విధవలు మళ్ళీ పెళ్లి చేసుకొనేవారని తెలుస్తున్నది. బహుశా దీన్ని పౌరాణిక మతంవారు, ధర్మశాస్త్రకారులు హర్షించి ఉండరు. కనుకనేవారు దాన్ని గరించి ఆ విధంగా చేయటం పాపమని, కూతురికి పునర్వివాహం చేసినవారు నరకమనుభవిస్తారని చెప్పారు.

కేతన విజ్ఞానేశ్వరంలో పరపూర్వలయిన కాంతల వరియింపగ దగదు దాన బాపముదుగలుం అని చెప్పాడు. మారన మార్కండేయ పురాణంలో యజ్ఞ దాన వివాహ విఘ్న కర్తయు గన్యాపునర్దాన కారియు గ్రిమి త్వంబు నొందుదురు అని చెప్పాడు. రామాజనములకు దేవర న్యాయంబున్, భామకు రెండవ పెండ్లియు కలియుగంలో తప్పు అని ఆర్యులు చెప్పారన్నాడు కేతన.

పై ఉదాహరణలను బట్టి స్త్రీలకు రెండవ పెండ్లి చేయటం పాపమని చెప్పినా వాస్తవానికి ఆనాడు విధవలకు మళ్ళీ పెళ్ళి జరిగేదని పరోక్షంగా తెలుస్తున్నది. కాకతీయుల కాలంలో వీరశైవ మతమిచ్చిన స్వేచ్ఛ వల్ల విధవలు తమకు తోచిన విధంగా జీవితాన్ని గడిపినట్లు తోస్తుంది. కనుకనే అందరు వితంతు స్త్రీలు ఒకే మార్గాన్ననుసరించలేదు. ఈ స్వాతంత్ర్యం, నిర్ణయాధికారం స్త్రీలకు తరువాతి కాలంలో లోపించింది. మళ్ళీ పంతొమ్మిదవ శతాబ్దంలో వితంతు పునర్వివాహం గురించి ఆలోచన బయలుదేరింది. అది కూడా సంఘసంస్కర్తలనబడే పురుషులకే పరిమితమైంది. అసలు స్త్రీని ఆమె ఏం చెయ్యాలని కోరుకుంటోంది అని ఎవరూ అడగలేదు. ఈ సందర్భంలో హిందూమతానికి కొత్తవెలుగు చూపి, పునరుద్ధరించ ప్రయత్నించిన స్వామి వివేకానందుని అభిప్రాయం తెలియపరచాలి. ఒకానొక సంఘసంస్కర్త విధవా వివాహం గురించి వివేకానందుని అభిప్రాయం గురించి ప్రశ్నిస్తే “మాటిమాటికీ ఈ ప్రశ్న నన్నడగడానికి నేనెవరిని? అసలు స్త్రీ సమస్యని పరిష్కరించడానికి నువ్వెరివి? ప్రతి విధవ స్త్రీని శాసించడానికి నువ్వేమైనా భగవంతుడివా? నువ్వు తప్పుకుంటే స్త్రీలు వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకొంటారు” అని బదులు పలికారు. స్త్రీని మగవారు శాసించడమన్నది ఆయన సహించలేని విషయం. కానీ అటువంటి పురుషులు అరుదైన ప్రస్తుత ప్రపంచంలో స్త్రీ ఎలా జీవించాలన్నది నిర్ణయించే అధికారం స్త్రీకి మాత్రం ఉండదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here