[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[ఒకరోజు మధుకర్ సుందర్‍ని తన ఇంటికి బ్రేక్‍ఫాస్ట్‌కి పిలుస్తాడు. ఇంతకు ముందు అక్కడ కలిసిన ఓ మహిళ కనబడి నవ్వుతుంది. లోపలికి వెళ్తాడు సుందర్. ఆమె ఒక ప్లేట్‍లో బిస్కట్స్ సర్ది పట్టుకొచ్చి అక్కడ పెట్టి వెళ్తుంది. ఇక్కడకి వచ్చేవారి ప్రవృత్తులన్నీ సందేహాస్పదంగా ఉంటాయని మధుకర్ అనడంతో సుందర్ తొట్రుపడతాడు. తేలిగ్గా తీసుకోమని, అది ఓ జీవిత సత్యం అని అంటాడు మధుకర్. తర్వాత సుందర్‍ని తన లైబ్రరీ లోకి తీసుకువెళ్తాడు. కొన్ని కాగితాలని సుందర్ తీయబోతుంటే, అవి గాజుకంటే నాజూకని, పగిలిపోతాయని అంటాడు. ఒక ప్లాస్టిక్ పనిముట్టు బయటకి తీస్కి ఒక్కో కాగితాన్ని ఒక ట్రేలో పెడతాడు మధుకర్. వాస్కోడగామా సహచరుడు 1502లో చెప్పిన విషయాలున్న కాగితాన్ని తీసి చదువుతాడు మధుకర్. మనం మామూలుగా వాడే మిరియాలు, అల్లం, ఇంగువ తొలుత దోపిడీలన్నింటికీ కారణాలంటాడు. అవి పండే చోట వ్యాపార నిమిత్తం పెద్ద పెద్ద స్థావారాలుండేవని చెప్తాడు. వాటినే ఔషధాలుగా వాడి జబ్బులను నయం చేసేవారని చెప్తాడు. వాటితోనే మృతుల శరీరాలను పాడైపోకుండా కాపడుకున్నారని అంటాడు. ఇలా వ్యాపారాలున్న స్థలాలలో అమ్మాయికు పని చేస్తూ కొంకణి, తులు, మలయాళ భాషల మిశ్రమంలో సందేశాలు రాసి పంపేవారని తెలుపుతాడు. సందేశాలు రాశారు సరే, మరి ఆ కాగితాలను ఎందుకు భద్రపరిచారని అడుగుతాడు సుందర్. ఆ కాగితం మెటీరియల్ ఏమిటో ఎవరికీ తెలియదని చెప్తాడు మధుకర్. మరో కాగితం మీద మార్కోపోలో ఇద్దరు యాత్రికుల గురించి రాసి ఉన్న సమాచారాన్ని చదివి వినిపిస్తాడు. వాస్కోడగామా తన నౌకలో ఇద్దరు మహ్మదీయ వర్తకులను బంధించి తెచ్చినప్పుడు వారు కెస్టిలియన్ భాషలో మాట్లాడి అతన్ని ఆశ్చర్యపరిచారని, తాము ఇక్కడికి రావడనికి కారణం క్రైస్తవులు, స్పెసెస్ అని చెప్పారని చెప్తాడు. ఇక చదవండి.]
[dropcap]మా[/dropcap] రిసార్ట్ వెనుక వరుసగా కొన్ని ఇళ్లున్నాయి. అందులో కేవలం కొద్ది రోజుల కోసం అద్దెకు దిగిన కృష్ణప్రసాద్ గారు ఇటీవల పరిచయం అయ్యారు. ఆ ఇళ్ల మీదుగా వెళుతుంటే ఆయన గొంతు వినిపించింది.
“నన్ను పెద్దగా వెతుక్కోనక్కరలేదు. ఈ గేటు దగ్గరే వేళ్లాడుతూ ఉంటాను” అన్నాడు.
ఆగి, అటు చూసాను.
“చెప్పండి సార్, వాకింగ్ అయిపోయిందా?”
“లేదు. ఇవాళ ఆ క్రిందనున్న తోటలో కెళ్లాలి. వస్తారా?”
“ఏముందక్కడ?”
“ఎంత మాట? తోటలో ఏముంటుందా? మీరెక్కడి రచయిత సార్? నవ్వుతారెవరన్నా!”
“పదండి”
ఇద్దరం అలా చక్కని గాలికి బయలుదేరాం.
“ఇష్టం లేకపోయినా సముద్రాన్ని చూడాల్సిందే. అవునా?”
“అవును. అటు తిరిగితే అదే”
“అదొక్కటే కాదు గోవాలో, ఇక్కడి పూలు ఎక్కడా ఉండవు”
ఆలోచించాను. ఆ మాట కొస్తే, ఇక్కడి విషయాలు ఇక్కడివే. ఎటో ముందుకెళుతుంటే ఆపేసారాయన.
“ఇల్లాగ..” కుడి వైపు చూపించాడు.
అటు తిరిగాను. కృష్ణప్రసాద్ గారు కావటానికి డాక్టరు. రకరకాల ప్రకృతి వైద్యాలలో నిపుణులు. అటువైపుగా భుజం మీద చెయ్యి వేసి మరీ లాక్కెళ్లారు. రాజోలు నుండి ఇంత దూరం ఊరికే వచ్చి ఉండరు కదా?
రోడ్డుకి కుడి ప్రక్క ఓ సన్నని దారి మీద నడిపించుకుంటూ లాక్కెళ్ళారు.
“ఓ మాటడుగుతాను సుందరం గారూ”
“చెప్పండి”
“పూలను చూస్తే మనసుకు బాగుంటుంది. అవునా?”
“అవును”
“వాటిని కోసేస్తే?”
“అదోలా ఉంటుంది”
“ఎవరి తలలోనో పెడితే?”
“మన.. కాదు మనకు కావలసిన వారి తలలో పెడితే బాగుంటుంది”
“మన వాళ్ళే ఇంకొకరికి అమరిస్తే?”
“కాలుతుంది”
“కరెక్ట్”
“తప్పు పూలది కాదు కదా?”
“ముమ్మాటికిన్నూ”
“మరి.. సున్నితమైన పూలను ఒక చోట చేర్చి రాక్షసంగా నలిపేస్తే?”
ఆగాను. ఇదెక్కడి గోల? ఏమైందీయనకి?
“నో.. అలా ఎందుకు నలపాలండీ?”
“మనసుకు బాగుండాలి కదా?”
“ఛీ!”
“పొరపాటు పడ్డారు. అలా నలిపాక అందులోంచి మందు వస్తుంది. అది సేవించాక మనసుకు బాగుంటుంది. ఏమంటారు?”
“కరెక్ట్. అంటే ఈ పూలలో మందున్నదన్న మాట!”
“మందు లేనిదెక్కడ? ప్రియురాలి కళ్ళల్లో మందు లేదా? తిండిలో మందు లేదా? విషంలో మందు లేదా? ఆ సాగరంలో మందు లేదా? గుళ్ళో నిలబడ్డ దేవుని కళ్ళల్లోని కరుణలో మందు లేదా? ఒక నిజమైన డాక్టర్‍కి సృష్టి యావత్తూ ఔషధమే”
“రోగం ఎక్కడుంది?”
“ఎక్కడా లేదు”
“మరి?”
“ఆలోచనలో ఉంది”
ఆలోచించాను. నవ్వుకున్నాం ఇద్దరం. ఆగాం. దూరంగా క్రింద అద్భుతమైన లాండ్‍స్కేప్. రకరకాల పూలు.. ఒక్కసారి ప్రకృతి నిత్యకళ్యాణం వంటి పండుగ చేసుకుంటున్నట్లుంది. అసలే తూనీగలా ఉంటారు, జర జరా జారిపోతారు కృష్ణప్రసాద్ గారు. జాగ్రత్తగా అనుసరించాను. ఒకచోట ఆగారు.
“ఇది చూడండి”, అన్నారు.
తెల్లని పువ్వు. అయిదు రేకులతో ముద్దొస్తోంది. నందివర్ధనంలా ఉంది కానీ అది కాదు. దీని తెలుగు దానికదే సాటి.
“దీనిని ఇక్కడ గుట్రో అంటారు”
“ఓ”
“ఆంగ్లంలో మూన్ ఫ్లవర్!”
“చంద్రుని పువ్వా?”
“అవును. ఇందులో ఏముందో తెలుసా?”
“చెప్పండి. మీరు చెప్పాలి, నేను వినాలి. దానినే ఎడ్యుకేషన్ అంటారు”
“ఆ.. అలా అనైమాకండి మరి. ఎటకారమొద్దండి మాస్టారూ!”
“ఇంతకీ ఏంటి విశేషం?”
“దీని మధ్యలో పసుపురంగులో ఉన్న పుప్పొడి గమనించారా?”
జాగ్రత్తగా చూసాను. నిజమే.
“పసుపుపచ్చ గురుగ్రహానికి చెందినది. తెలుపు చంద్రునిది. ఈ రెండు కలవటం గజకేసరి యోగం. ఆ పుప్పుడిని గమనించండి. ఆ సంఖ్యను చూడండి”
లెక్కబెట్టాను. తొమ్మిదున్నాయి.
“నవగ్రహాలవి”
“ఛా”
“మరండి! ఆ రేకులు అయిదున్నాయి. వాటి మీద గీతలు చూడండి”
అద్భుతంగా ఉన్నాయి.
“సుందరం గారూ! ఈశ్వరుడు అన్నింటినీ మన ముందరే పెట్టాడు. మనం చూడటం లేదు.”
“సృష్టిలో లోపం లేదు”
“కరెక్ట్. దృష్టిలోనే. ఈ రేకుల మధ్య గీతలు చూడండి. మూడేసి ఉంటాయి. మూడు గురువు సంఖ్య”
“ఓకే”
“ఇవి సాయంత్రం విచ్చుకుంటాయి. చంద్రోదయం దీనికి లింకు”
“గొప్ప అన్వయం కనిపిస్తోంది”
“అంతే కాదు. ఒక్కొక్క పూవుకు ఒక్కొక్క నిర్దిష్టమైన..”
“నాదముంది, శ్రుతి ఉంది..”
ఇద్దరం నవ్వుకున్నాం. ఆ పూవును జాగ్రత్తగా నిమిరాడాయన.
“కానీ దీనిని కోసి పారేసి నాశనం చేయటం నాకిష్టం లేదు”
“ఏం మాటండీ?”
“అవును”
“మరి మందు అన్నారు?”
“ఎక్కడుందనుకుంటున్నారు మందు?”
“చెప్పండి”
“ఆ పుప్పొడిని సన్నగా తొలగిచి జాగ్రత్తగా ఓ కాగితంలో పెట్టి మంచి నీళ్లల్లోకి జార్చి పది నిముషాల లోపు సేవిస్తే మనిషికి నీరసం, డిప్రెషన్ వంటివి మటుమాయమవుతాయి”
“అద్భుతం”
“ఇంకా చాలా ఉంది”
“కూర్చోమంటారా?”
“అక్కర్లేదు. ఆ ఆకులను చూడండి”
నిజమే. అందమైన పూవులను చూస్తాం కానీ ఆకులను చూడం.
“మామూలుగా ఆకుల మీద గీతలుంటాయి. ఈ ఆకుల మీద గీతలకు, లెక్కలలోని ఫెబోనాచీ సీరిస్‌కు వింత అనుబంధం ఉంది. ప్రతి అయిదు గీతల తరువాత గీతలు విడిపోయి మరికొన్ని సన్నని గీతలుగా మారుతాయి”
“ఈ ఆకులలో కూడా మందుందా?”
“ఉంది. మత్తు మందు ఎనస్థీషియాగా పని చేస్తుంది. కానీ ఇంకా పరిశోధన రంగం దానిని అనుమతించటం లేదు.”
“దేనికని?”
“ఇంకా నిర్ధారణ జరగలేదు.. మనిషికి ఇవ్వవచ్చా లేదా అనేది”
“జంతువుల మీద ప్రయోగించలేదా?”
“పూలు ఎంత చక్కనైనవో, జంతువులు కూడా అంత చక్కనైనవి. ఆలోచన, అవగాహన ఉన్నవి. మేకలు ఈ ఆకులను ముట్టుకోవు”
“ఎందుకని?”
చుట్టూతా చూసారాయన.
“ఓకె. వదిలెయ్యండి. ఇప్పుడు ఇక్కడ మేకలు దొరికినా, వాటితో మాట్లాడడం కష్టం”
తల ఆడింది, గొప్ప సైంటిస్టులా ముందరకి నడిచారాయన. నేను అనుసరించాను. ఎందుకో ఆగిపోయారు. అక్కడ ఎదురుగా నీటిలో ఉన్న మొక్కలో ఎరుపు, పసుపు పచ్చ – రెండూ సరిగ్గా సగం సగం పంచుకున్న రేకులతో ఒక కమలం ఉంది. పుప్పొడి కూడా సమంగా పంచినట్లుంది. రేకులు అందంగా నిక్కపొడుచుకుని ఉన్నాయి. సూర్యకిరణాలు దాని క్రింద నున్న నీటిలోకి వెళ్ళి దేనినో తాకి తిరిగి ఆ రేకుల మీద ప్రకాశిస్తున్నాయి.. ఆయన నా కోసం వెనక్కి తిరిగి చూసారు.
“సాల్కమ్ దాని పేరు”, చెప్పారు.
అద్భుతంగా ఉంది. పూచే పూల లోన ఏముందో ఏమో! గోవాలోని సామూహిక సంస్కృతి ఆ రేకులలో ప్రకాశిస్తోంది! కథలు ఎన్నో ఉంటాయి. ప్రకృతి చరిత్రను తనలో ఇనుమడింపజేసుకుని చరిత్ర ఇది అని తిరిగి మనకే చెబుతోందా అనిపించింది.
కృష్ణప్రసాద్ గారు ఆయన సిద్ధాంతంతో అప్పటికే సిద్ధమవుతున్నారు..
(ఇంకా ఉంది)