[ప్రఖ్యాత కవి గుల్జార్ చిన్న కవితలను అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి.]
~
1.
[dropcap]బ[/dropcap]తకడానికి ముక్తసరిగా ఉండడం కూడా అవసరమే దోస్త్..
అది నీ పొగరనుకుంటే అనుకోని!
మరీ వొంగి నడుచుకున్నావనుకో..
ఈ లోకం నీ వీపుని కూడా ముక్కాలి పీట చేసి ఎక్కి తొక్కుతుంది!
~
2.
ఓహ్.. ఖుదా!
ఈ మొహబ్బత్‍ని ఎంత వింతైన పదార్థంతో తయారు చేసావు?
నువ్వు సృష్టించిన మనిషే నీ ముందు
నిలబడి ఇంకెవరి కోసమో
విలవిల్లాడుతూ దుఃఖిస్తుంటాడు!
~
3. ఎవరు ఇలా నా హృదయాన్ని
తడుతున్నారు?
ఈ ఎడారిలో.. ఎవరో నడుస్తున్న
అడుగుల సవ్వడి వినిపిస్తోంది!
~
4. కన్నీరు కార్చేటప్పుడు..
ఎవరూ తోడు ఉండరని కాబోలు..
కన్నీళ్ళకి ఏ రంగూ ఉండదు!
~
మూలం: గుల్జార్
అనువాదం: గీతాంజలి
గుల్జార్ ప్రఖ్యాత కవి, చలనచిత్ర పాటల రచయిత. ఆయన 18 ఆగష్టు 1936న ప్రస్తుత పాకిస్తాన్ లోని దినాలో జన్మించారు. దేశవిభజన తరువాత వారి కుటుంబం ఢిల్లీకి వలస వచ్చింది. గుల్జార్ అసలు పేరు సంపూర్ణసింగ్. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలలో రచనలు చేసి ఖ్యాతి పొందిన గుల్జార్‌కు 2004లో పద్మభూషణ్ అవార్డు, 2002లో సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. 2009 సంవత్సరానికి గాను బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ‘జై హో’ అనే పాటకి ఆస్కార్ అవార్డును పొందారు.