సిరివెన్నెల పాట – నా మాట -4 – అద్వైత తత్వాన్ని విడమర్చి చెప్పే ప్రయత్నం

1
3

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

జగమంత కుటుంబం నాది

~

చిత్రం: చక్రం

సాహిత్యం: సిరివెన్నెల

గాత్రం: కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి

~

సాహిత్యం:

పల్లవి:
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది@2
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
~
చరణం:
కవినై కవితనై భార్యనై భర్తనై@2
మల్లెల దారిలో మంచు ఎడారిలో@2
పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేను రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్నెల్ని.. ఆడపిల్లల్ని
||జగమంత కుటుంబం ||
~
చరణం:
మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై@2
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేను రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని
చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని.. ఇంద్రజాలాన్ని
||జగమంత కుటుంబం ||
~
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలె
నా హృదయమె నా లోగిలి
నా హృదయమె నా పాటకి తల్లీ
నా హృదయమె నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి
||జగమంత కుటుంబం ||

‘చక్రం’ సినిమాలోని ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టం, నిజానికి తెలుగును, తెలుగు సాహిత్యాన్ని ప్రేమించే వాళ్ళందరికీ ఇది ఎంతో ఇష్టమైన పాట. భావం పూర్తిగా కొరుకుడు పడకున్నా, ఆ పాట ఎంతో ప్రజాదరణ పొంది, ఒకప్పుడు విరివిగా వినిపించేది. ఇంత గంభీరమైన తెలుగు పదాలతో, వినగానే అర్థం కావడం కష్టం అనిపించే ఈ పాట యువతను కూడా ఆకర్షించడం చాలా గొప్ప విశేషం. ఆ పాత్రకు, పాట భావానికి తగ్గట్టుగా గాత్రం అందించారు కొమ్మినేని. ఈ పాటను సినిమాకి ఇవ్వమని అడిగితే తాను ఇవ్వనన్నానని, అయితే దర్శకుడు కృష్ణవంశీ మొండి పట్టు పట్టి ఈ పాట కోసమే కథను సృష్టించి, చక్రం సినిమా తీశారని సిరివెన్నెల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నన్ను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నాకు ఆ పాట మీద ఇంకా ఆసక్తి పెరిగింది. సినిమా కోసం పాట రాయడం సర్వసామాన్యం, కానీ పాట కోసం సినిమా తీయడం?.. అసామాన్యమే, అనన్య సామాన్యమే! ఇంత అద్భుతమైన పాటను విశ్లేషించాలన్న నా ప్రయత్నం సాహసమే!

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది’, అన్న తొలి వాక్యమే ఈ పాటలోని లోతులను స్పృశించాలన్న బలమైన కోరికను నాకు కలిగించింది. నిజమే, మనసు ఆనందంగా, ఉల్లాసంగా వుంటే, అందరూ నావాళ్ళే, నా వెనుక ఎంత మంది ఉన్నారో! అనిపిస్తుంది. మరీ  నిరాశలో వుంటే.. నేను ఒంటరిని, నాకెవరూ లేరు.. అనిపిస్తుంది. యా మతిః, సా గతిః, (దృష్టిని బట్టే సృష్టి) అని ఆర్యోక్తి. ఇదంతా మనసు ఆడించే ఆటే. బయటపడడమే జ్ఞానం.

సంసార జీవితం నాదే సన్యాసం శూన్యం నాదే’.. అనగానే ఇదేదో అద్వైత సిద్ధాంతం అనిపించింది. పూర్ణంలోనే శూన్యం వుంది శూన్యంలోనే పూర్ణం వుంది. సత్య మూలాల్లోకి వెళితే.. ఒక విత్తనంలో అడవి వుంది కానీ కంటితో చూస్తే విత్తనంలో శూన్యం వుంది. అనుబంధం పెరిగితే సన్యాసే.. సంసారి. బంధాలు తగిలించుకోకుండా, తామరాకు మీది నీటి బిందువులాగా వుండగలిగితే సంసారే.. సన్యాసి!

కానీ సిరివెన్నెల గారు, ఇది సినిమా కోసం రాసిన పాట కాదని, రవి కాంచని చోట కవి కాంచున్’ అన్న నేపథ్యంలో తాను రాసుకున్న కొన్ని కవితలలో ఇది ఒకటని చెప్పారు. నిరంతరం తన భావాల్ని కనే కవి, అలుపెరగకుండా కిరణాలను కనే రవి, ఇద్దరు ఒకటేనని, జగతిని జాగృతం చేయడానికే నిరంతరం శ్రమిస్తారని సిరివెన్నెల గారు విశ్లేషించారు. ఇందులోని మొదటి చరణం కవి హృదయాన్ని ఆవిష్కరించగా, రెండవ చరణం రవి తత్వాన్ని చిత్రీకరిస్తుంది. మూడవ చరణం మళ్ళీ కవి గురించిన భావాన్నే వ్యక్తం చేస్తూ, హృదయం అనే అంశం మీద ముగుస్తుంది. సీతారామశాస్త్రి గారికి నంది పురస్కారాన్ని అందించిన మరో ఆణిముత్యం ఈ అద్భుత గీతం.

ఈ పాట వినగా వినగా, దీని theme మనసే అని, ఇది dualityని ప్రతిబింబింప చేస్తూ non-duality, అంటే అద్వైత తత్వాన్ని విడమర్చి చెప్పే ప్రయత్నం ఇందులో జరిగిందని నాకు బలంగా అనిపించింది.

అయితే వేదాంతాన్ని అత్యంత మనోహరంగా పలికించిన ఎందరో సినీ కవులు మన తెలుగు తెరవెనుక వున్నారు. అద్వైత తత్త్వాన్ని అలవోకగా, అరటిపండు ఒలిచి పెట్టినట్టు, విప్పి చెప్పిన కవి సిరివెన్నెల. ఆయన స్వయంగా అద్వైతానుభూతిని పొంది రాసినట్లు మన మనసుకు అర్థం అవుతుంది. వాక్యం రసాత్మకం కావ్యం’ అన్నట్టు ఈ పాట ఆద్యంతం రసాత్మకంగా ఉంటుంది. ప్రేమల భాషలు లేఖలనింపగ నేర్పే కావాలి’ ..అన్న గజల్‌లో నేను, పదమూ, భావము లయమైపోవగ కూర్పే కావాలి’.. అని వ్రాసుకున్నాను. ఆ అందమైన కూర్పు నాకు ఈ పాటలో కనిపించింది. పదగాంభీర్యం, భావగాంభీర్యం రెండూ సమతూకంలో ఉంటూ, దేనికదే పోటీ పడిన పాట ఇది.

కవినై కవితనై భార్యనై భర్తనై@2

మల్లెల దారిలో మంచు ఎడారిలో@2

పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల

నాతో నేను అనుగమిస్తూ నాతో నేను రమిస్తూ

ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం

కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని

రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్నెల్ని.. ఆడపిల్లల్ని

కవి నుండి కవితను వేరు చేసి చూడడం సాధ్యం కాదు. ఒకటి అనుభూతి అయితే, రెండవది అనుభవకర్త. కవి మనసు సముద్రమైతే, కవిత అందులో పుట్టే ఒక అల. కవి హృదయం కఠిన సత్యాలనైనా, మృదువైన భావాలనైనా అలవోకగా పలికించగలదు. భార్యలాగా అయినా, భర్తలాగా అయినా సమంగా అనుభూతి చెందగలదు. ఒక కవే కాదు, ఎవరికైనా మనసు దేని గురించి ఆలోచిస్తుందో, ఎలా ఆలోచిస్తుందో, ఆ విధమైన అనుభూతినే పొందుతుంది. మనసు చేసే మాయాజాలం ఇది. కవి జీవిత గమనంలో జయ గీతాలలో కాకుండా, కన్నీటి జలపాతాలలో కూడా మునుగుతూ.. తేలుతూ, మల్లెల దారులే కాకుండా, మంచు ఎడారులలో కూడా పయనించాల్సి వస్తుంది. ప్రశంసలైనా, విమర్శలైనా సమభావంతో స్వీకరించాల్సి ఉంటుంది.

ఇది ఒక అద్భుతమైన సాహిత్యం. హృదయాన్ని ఎంతో మథిస్తే కానీ, మన మనసుతో మనం తాదాత్మ్యం చెందితే కానీ, నిరంతరంగా తపిస్తే కానీ, ఘర్షణ జరిగితే కానీ ఇటువంటి, నిత్యజీవిత సత్యాలు చెప్పే వేదాంతపు పాట పుట్టదు. గొప్ప సాహిత్య సృష్టి జరగాలంటే, అనంతమైన ఏకాంతం కూడా అవసరం. అప్పుడే ఒక కవి కలల్ని, కథల్ని, రంగుల లోకాల్ని, కావ్యకన్నెల్ని, సృష్టించగలడు. కవి తన మనసుతో సహ-గమనం( కలిసి నడుస్తూ) చేస్తూ, కావ్య కన్యలను కంటాడు. ఎందుకంటే తన మనసులో పుట్టిన భావచంద్రిక, మరొక ఇంటికి చేరుకొని అక్కడ కూడా సాహితీ వెన్నెలలు పూయిస్తుందని! అయితే ‘ఆడపిల్లల్ని’ అన్నమాట ఇక్కడ పునరుక్తిగా అనిపించింది. ఎందుకంటే కావ్య కన్యలు అంటేనే ఆడపిల్లలు కదా. కవి అయినా, రవి అయినా, నిరంతరం చలనానికై తపిస్తూనే వుంటారన్న సామ్యం ఇక్కడ చూపించబడింది.

మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై@2

మంటల మాటున వెన్నెల నేనై

వెన్నెల పూతల మంటను నేనై

రవినై, శశినై, దివమై, నిశినై

నాతో నేను సహగమిస్తూ, నాతో నేను రమిస్తూ

ఒంటరినై, ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం

కిరణాల్ని, కిరణాల హరిణాల్ని, హరిణాల చరణాల్ని,

చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని.. ఇంద్రజాలాన్ని

ఈ చరణం – కాలగమనాన్ని, సూర్యుడి తత్వాన్ని మనకు చక్కటి పదవిన్యాసంతో వివరిస్తుంది. గగనానికి కన్ను వంటి సూర్యుడు, తనలో తాను రగిలిపోతూ, విశ్వానికంతా వెలుగును, చైతన్యాన్ని, జీవ శక్తిని ప్రసాదిస్తాడు. మండే ఆ ఎండ వెనుక, ప్రకృతికంతా ఉపకారం చేసే వెన్నెల వంటి చల్లని గుండె ఉంది. నిజానికి రాత్రిపూట చంద్రునిలో కనిపించే ప్రకాశం కూడా, ఆ సూర్యుడి నుంచి అందజేయబడేదే కదా! అంటే ఆ వెన్నెల వెలుగుల వెనుక గల మంట కూడా సూర్యుడే! రవి తానే, శశి తానే, పగలు- రేయి అన్నీ తానే. ప్రకృతిలో అన్నీ పరస్పర ఆధారితాలే. అన్నిటినీ కలిపి సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి కానీ, విడదీసి చూస్తే, అసంబద్ధమే, అసంపూర్ణమే. రెండుగా కనిపిస్తున్నవి అన్నీ చూడగలిగితే ఒకటే! కాలమూ సూర్యుడే, కాలగమనమూ సూర్యుడే. కర్తవ్యదీక్షతో తన చుట్టూ తాను తిరుగుతూ కాలగమనంలో ముందుకు సాగిపోతూ, కాలాన్ని తనతో పాటు ముందుకు నడిపిస్తూ ఉంటాడు సూర్యుడు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం సారాంశం ఇదే. ఆత్మలోనే పరమాత్మ ఉన్నాడు పరమాత్మలోనే ఆత్మ ఉంది. అందుకే అక్కడ ద్వైతము లేదు, అంతా అద్వైతమే.

ఇక్కడ కవి, కాల గమనాన్ని ఎంత అందంగా నిర్వచిస్తున్నాడో చూడండి! ఏకాంతమైన మనసుతో, ఒంటరిగా, హరిణాల వంటి సూర్య కిరణాలను, వాటి చరణాలను, ఆ చరణాల పరుగులలో ముందుకు పరిగెత్తే కాలాన్ని, అది చేసే ఇంద్రజాలాన్ని, నిరంతరంగా చూస్తూ మురిసిపోతూ ఉన్నాడు కవి. ఎంత గొప్ప భావ ప్రకటన! కాలం మనకు గమ్యాన్ని ఏర్పరుస్తుంది కానీ, ఆ కాలానికి గమ్యం ఏది? ఎంత రమణీయమైన కవితా విన్యాసం! సీతారామశాస్త్రి గారిది ఎంత అనుభవైకవేద్యమైన జ్ఞానం!

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె

గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలె

నా హృదయమె నా లోగిలి

నా హృదయమె నా పాటకి తల్లీ

నా హృదయమె నాకు ఆలి

నా హృదయములో ఇది సినీవాలి

ఇక మూడవ చరణం, ఎంతో ఆర్ద్రతతో నిండి, ప్రతి గుండెనూ అందంగా స్పృశించే ఒక గొప్ప భావనా వీచిక. ఒక కవి పాట రాసిన తర్వాత, గాయకుడి గళం ద్వారా గాలి పల్లకిలో ఊరేగుతూ, చేరవలసిన చోటికి చేరుతుంది. అంత కష్టతరమైన ప్రసవ వేదన తరువాత, పెరిగి పెద్దదైన ఆ కవితా కన్నె గడప దాటి వెళ్ళిపోతే, కవి మనసు మూగబోయి, అచేతనంగా ఉండిపోతాడు.. మరో కవిత పుట్టేదాకా! సంసారి అయినా సన్యాసి అయినా; కవి అయినా కవిత అయినా; భార్య అయినా భర్త అయినా; సంతోషమైనా, దుఃఖమైనా; రవి అయినా శశి అయినా; జగమంత కుటుంబం మనదే అయినా, మనది ఏకాకి జీవితం అయినా.. ఈ భావాలన్నీ మనసువే. కవి హృదయమే తన లోగిలి, తన పాటకు తల్లి అంటే తనకు ఆలి; సినీవాలి. సినీవాలి అంటే అమావాస్య ముందు కనిపించే చంద్రరేఖ; చీకటిలోని ఆశాకిరణం, సినీవాలి అంటే పార్వతీదేవి, ప్రకృతి, మాయ. ఇది ప్రతి వారి మనసులో జరిగే మాయాభరితమైన నిరంతర సంఘర్షణ. వ్యక్తి రూపంలో కనిపించే ప్రతి ఒక్కరూ అవ్యక్తమైన అనంతమే. ‘You are not a drop in the Ocean but you are an Ocean in the drop’, అంటాడు ఒక పాశ్చాత్య వేదాంతి.

సింధువులోని బిందువు మనమే, బిందువులోని సింధువు మనమే.

ఈ పాట లోతులను తవ్వుకుంటూ వెళ్తే ఒక విశ్లేషణ కాదు, ఒక పెద్ద గ్రంథమే వ్రాయాల్సి వస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అనే ఆ జ్ఞాన బ్రహ్మకు అటు తెలుగు సినీ పరిశ్రమ, ఇటు తెలుగు వారు ఎంతో రుణపడి ఉన్నారనేది అక్షర సత్యం.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here