కదిరి నరసింహ క్షేత్ర యాత్ర

0
3

[ఇటీవల కదిరి నరసింహ క్షేత్రం, తిమ్మమ్మ మర్రిమాను దర్శించి ఆ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]నా[/dropcap]రసింహక్షేత్రాలలో ప్రసిద్ధి గాంచింది కదిరి. శ్రీ ఖాద్రీ నరసింహుని దేవస్థానం. అనంతపురం జిల్లా (ఎ.పి) లోని పెద్ద పట్టణాలలో కదిరి ఒకటి. అనంతపురం నుండి  90 కి.మీ. దూరంలో ఉంటుంది. అనంతపరం నుండి మదనప్లలె మీదుగా, పలమనేరు, చిత్తూరు, రాయవేలూరు ఇంకా చెన్నైకి వెళ్లే జాతీయరహదారిలో కదిరి వస్తుంది.

జూలై 29న, సతీసమేతంగా, కదిరి నరసింహుని దర్శనానికి బయలుదేరాము. మనకు హైదరాబాదు నుంచి, కాచిగూడ – మాధురై సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఉంది. దానిలో డైరెక్ట్‌గా కదిరికి చేరుకోవచ్చు. అది ఉదయం 6.05 నిముషాలకు కాచీగూడాలో బయలుదేరుతుంది. మధ్యాహ్నం 1.45కు కదిరి చేరుకుంటుంది. మొదట్లో, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మీటర్ గేజ్ ట్రాక్ ఉన్నప్పుడు ఇదే దారిలో తిరుపతి రాకపోకలు చేసేది. అబ్బో! ఎప్పటిమాట లెండి? దాదాపు 40 ఏళ్లు దాటింది!

మా చెల్లెలు వాళ్లు అనంతపురంలో ఉంటారు. మా బావగారు జూలై 31 కెనరాబ్యాంక్ సీనియర్ మేనేజరుగా పదవీ విరమణ చేస్తూ ఉన్నందున, ఆ కార్యక్రమానికి హాజరు కావటానికని బయలుదేరాము. అందుకే డైరెక్ట్‌గా కదిరికి వెళ్లకుండా, ఆనంతపురంలో దిగాము.

 

జూలై 30న, ఉదయం మా మేనకోడలు వాళ్ల కారులో బయలుదేరాము కదిరికి. 7 గంటలకు కదిలాం. డ్రయివింగ్ మా మేనకోడలు మైత్రేయే! అవలీలగా నడిపేస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. ఆమె భర్త హరీష్ కూడా మాతో వచ్చాడు. ఆయనకు కూడా డ్రయివింగ్ బాగా వచ్చినా, భార్యకు డ్రయివింగ్ ఇష్టమని, ఆ అమ్మాయినే నడపనిచ్చాడు. అసలు డ్రయివింగ్ ఆ అమ్మాయకి నేర్పిందే ఆ అబ్బాయిట. నాకు ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’ అన్న చిలకమర్తి వారి పద్యపాదం గుర్తొచ్చింది. భార్యకు ‘ముద్దార’ నేర్పించాడన్న మాట మా హరీష్. కదిరికి ఎనిమిదిన్నరకు చేరుకున్నాము.

మా బావగారు కదిరి కెనరాబ్యాంకు వారికి ఫోన్ చేసే ఉన్నారు. వారి స్టాఫ్ ఒకరు వచ్చి, మాకు స్వామివారి దర్సనం త్వరగా అవడానికి సహాయం చేశారు. ఆ రోజు ఏకాదశి. వందల సంఖ్యలో భక్తులు కర్నాటక, తెలుగు రాష్ట్రాల నుండి నరసింహ స్వామి వారి దివ్య దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. నలభై నిమిషాలలో శ్రీ ప్రహ్లాద సమేత శ్రీ నరసింహస్వామి వారి దివ్య దర్శనం లభించింది మాకు.

సహజంగా, నరసింహస్వామి వారు పర్వతాగ్రములలో, గుహలలో వెలసి ఉంటారు. కాని, శ్రీ ఖాద్రీ నరసింహుడు నేల మీదే, పట్టణం నడి బొడ్డున నిలిచి ఉన్నారు. చాలా పెద్ద దేవస్థానం. విశాలమైన ఆవరణ. మధ్యలో సమున్నత స్తంభాలతో కూడిన గొప్పమంటపం. ప్రధానాలయం చుట్టూ కళాకృతులతో కూడిన చిన్న చిన్న గోపురాలు. సమున్నత ధ్వజస్తంభం. ఒక వైపు సామివారి కల్యాణము జరగే మంటపం, పురాతన స్తంభాలతో అలరారుతున్నది.

దేవాలయం ఆవరణలో, శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక మహావృక్షం ఉంది. దాని చుట్టూ చప్టా నిర్మించి, దాని పై అందంగా  పువ్వులు, లతలు, ముగ్గులు పెయింట్ చేశారు. చెట్టు క్రింద నాగ ప్రతిష్ఠ చేసి ఉన్నారు. సర్పాకృతిలో సుబ్రహ్మణ్యస్వామివారు వెలసి ఉన్నారు.

అమ్మవారి ఆలయం అంతరాలయంలోనే స్వామి వారి ఆలయం ప్రక్కన ఉంది. అమ్మవారి పేరు శ్రీమహాలక్ష్మీ దేవి. అమృతవల్లీ తాయారు అని కూడా అంటారు. నరసింహస్వామి వారికి కుడివైపున భక్తాగ్రణ్యుడైన ప్రహ్లాదకుమారుడు చేతులు జోడించుకొని ఉన్న, జీవకళ ఉట్టిపడుతూ ఉన్న విగ్రహం, నల్లరాతితో చెక్కబడి, నిగనిగ మెరుస్తూ ఉంది. ప్రహ్లాద సమేతుడై స్వామివారు ఉండడం కేవలవం ఖాద్రి నరసింహస్వామి ఆలయంలోనే ఉంటుంది.

పట్టణం మధ్యలో ఉండటం, ఇరుకు వీధులు వల్ల కార్ పార్కింగ్ సమస్య చాలా ఎక్కువ.

ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించారని ఐతిహ్యం. విజయనగర రాజుల నిర్మాణశైలి. చుట్టూ ఎత్తయిన ప్రహారీగోడలు, నాలుగు వైపులా నాలుగు ప్రవేశ ద్వారాలతో, ఆలయం అలరారుతూ ఉంటుంది. సంక్రాంతి తర్వాత క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు, తిరునాళ్లు రంగరంగ వైభోగంగా జరుగుతాయి. లక్షల మంది భక్తులు హాజరవుతారు.

ఖాద్రీ నరసింహుడు అనే పేరు రావడానికి నేపథ్యం ఉంది. ‘ఖ’ అంటే ఆకాశమని ఏకాక్షర నిఘంటువులో చెప్పబడింది. గంధర్వలు, కిన్నరులు, యక్షులు వంటి వారిని ‘ఖేచరులు’  అంటారు కదా. అద్రి అంటే కొండ. మొదట్లో అది కొండప్రాంతంగా ఉండేదేమో? ‘ఖాద్రి’ అన్నది క్రమంగా జనములనోళ్లలో ‘కదిరి’ గా మారింది.

‘సంక్రాంతి’ అంటే పశువుల పండగ. ఆ రోజు స్వామి వారు కదిరి కొండకు పారు వేటకు వస్తారని భక్తుల నమ్మకం. ఆయన వసంత వల్లభడు కదా! పారు వేట తరువాత స్వామి వారిని ‘తేరు’ (రథం)లో ఊరిగింపుగా తీసుకుని వస్తారు. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలన్నీ విశేషమైనవే! వైశాఖ శుద్ధ పౌర్ణమినాడు మల్లెపూల తిరుణాళ్లు, చింతపూల తిరుణాళ్లను, ఉట్ల తిరుణాళ్లను జరుపుతారు. నృసింహ జయంతిని అత్యంత వైభవంగా జరుపుతారు ఇక్కడ.

కదిరి లక్ష్మీనరసింహ స్వామిపై అన్నమాచార్యుల వారు రాసిన కీర్తన చాలా ప్రసిద్ధి చెందింది. శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ లాంటి సంగీత దిగ్గజాలు ఆ కీర్తన నాలాపించి, స్వామి వారి భక్తులను పులకాంకితులను చేస్తారు.

‘కదిరినృసింహుడు కంబమునా వెడలె విదితముగా సేవింపరోమునులు’ అన్న పల్లవితో సాగుతుంది ఈ కీర్తన. స్వామివారిని మన కనుల ముందు సాక్షాత్కరింప చేసే కీర్తన యిది. శ్రీమతి శివశ్రీ స్కందప్రసాద్ అనే ప్రఖ్యాత గాయని గాత్రంలో ఈ కీర్తన మరింత సుసంపన్నమైంది. ‘కాటామరాయుడా కదిరీ నరసింహుడా’ అన్న కీర్తన కూడా జానపద సంగీతంలో స్వామివారిని స్తుతిస్తుంది.

స్వామి వారు ప్రతిష్ఠితులు కారు. స్వయంభూ. హిరణ్యకశిపుని వధానంతరం, స్వామివారి ఆగ్రహం ఏ మాత్రం తగ్గలేదట. ప్రహ్లాదకుమారుడు ఈ ఖాద్రి పర్వత ప్రాంతంలోనే స్వామి వారిని ప్రార్థించి, శాంతిపచేశాడని ఐతిహ్యం. అందుకే మూలవిరాట్టు వద్ద ప్రహ్లాదుడుంటాడు. కొన్ని చారిత్రికాధారల ప్రకారం, 10వ శతాబ్దంలో పట్నం పాలెగాడు రంగనాయకులు, ఆయన ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరిగిందని చెబుతారు.

ఈ క్షేత్రంలో, ఒక విశేషం ఇంకొకటి ఉంది. మూల విరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత, విగ్రహం నాభి నుంచి ఒక రకమైన స్వేదజలం ఉత్పన్నమవుతుంది. దానిని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. ఆ స్వేదం రాతి విగ్రహం నుండి ఎలా వస్తుందనేది సైన్సుకు, హేతువాదులకూ అందని దైవరహస్యం. మంగళగిరి పానకాలరాయుడు, పాత్ర పరిమాణంతో సంభంధం లేకుండా, సరిగ్గా సగం పానకాన్ని గ్రహించి, మిగతా సగాన్ని బయటకు వదుల్తారు. ఆవరణలో ఒక్క చీమ కూడా ఉండదు. “ఎన్నగ తరమే నీ లీలలు” అన్నట్లే, దైవాన్ని విశ్వాసించే వారికి ఈ  ‘మిరాకిల్స్’ ఏమీ అసహజం అనిపించవు.

కదిరికి దగ్గరలో ‘గాండ్లపెంట’ అనే ఊరు ఉంది. అక్కడి చంద్ర చెట్టులోని కొయ్య నుండి స్వామి వారు ఉద్భవించారని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడి కొండకు ఆనుకునే ‘కాటము’ అనే గ్రామం ఉంది. అందుకే -స్వామిని కాటమరాయుడంటారు.

కదిరి పట్టణానికి కొంచెం దూరంలో, కొండ మీద మరొక ఆలయం ఉంది. అదీ నృసింహాలయమే. ఆలయ గాలిగోపురం అంత పెద్దది కాదు. కానీ, శిల్పకళాశోభితం. హరిహరరాయులు, బుక్కరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, దశల వారీగా గాలిగోపురాన్ని నిర్మించారని చరిత్ర. ‘బురుగు తీర్థం’ అని స్వామి వారి పుష్కరిణి, కల్యాణకట్ట దాటిన తర్వాత ఉంటుంది.

నరసింహుని సన్నిధిలో రచయిత, వారి శ్రీమతి హిరణ్మయి

ఆలయ ప్రాంగణంలో, పునాది లేకుండా, బండపై నిలబెట్టిన గరుడస్తంభం ఒక ఇంజనీరింగ్ మార్వెల్. కుడి వైపున సీతాలక్ష్మణ హనుమత్ సమేతులైన శ్రీకోదండరామ స్వామి వారి ఆలయం ఉంది. గర్భాలయానికి కుడి వైపున భృగుమహర్షుల వారు ప్రతిష్ఠించిన వసంత వల్లభులు మనకు దర్శనం ఇస్తారు. ఎడమవైపు ఆండాళ్ అమ్మవారుంటారు. గర్భాలయం ఎదుట ‘గరుడాళ్వారు’ మందిరం ఉంటుంది. అది చిన్నది. గర్భాలయం బయట ఇరవైపుల, జయ విజయుల విగ్రహాలు సుందరప్రతిమలుగా నిలబడి ఉంటాయి.

పూరీ జగన్నాథ రథోత్సవం తర్వాత ఖాద్రీ నరసింహుని రథోత్సవమే అంత పెద్ద ఎత్తున జరుగుతుందని అంటారు. అప్పుడు భక్తులు రథం మీదికి మిరియాలు చల్లుతారు. స్వామి వారికి అధిక సంఖ్యలో ముస్లింలు కూడా భక్తులుగా ఉన్నారు!

ఆలయం సుమారు 36 చదరపు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. మూలవిరాట్టు విగ్రహం సాలగ్రామ శిలానిర్మితము. పుష్కరిణి సాక్షాత్తు బ్రహ్మచేత సృష్టించబడినదని ఐతిహ్యం. ఆలయ సముదాయంలో చిన్న మ్యూజియం కూడా ఉన్నది. అందులో పురాతన నాణెములు, శిల్పములు, శాసనములు, ఆలయమునకు సంబంధించిన వివిధ కళాఖండాలు, అవశేషాలు ఉన్నాయి.

స్వామి వారి క్షేత్ర దర్శనం మాకు ఒక అలౌకికానుభూతిని మిగిల్చింది. అప్పటికి పది గంటలయింది. పొట్టలో ఆత్మారాముడు నరసింహుని వలె గర్జించడం ప్రారంభించాడు. స్వామి వారి దర్శనం. ఆలయ సందర్శన పూర్తయేంత వరకు ‘ఆకలి’ మమ్మల్ను అసలు బాధించలేదు. ఎందుకంటే అలౌకికమైన అవస్థలో ఉన్నాము. దర్శనం అవగానే దేహం తన డిమాండ్లను మొదలు పెట్టింది.

మా హరీష్ మమ్మల్ని ఒక ఆర్య వైశ్య హోటలుకు తీసుకొని వెళ్లాడు. చాలా చిన్న హోటలు. కాని యాత్రీకుల రద్దీ విపరీతంగా ఉంది. అక్కడ కదిరి పోలీసు శాఖవారి బోర్డు నన్ను ఆకర్షించింది. పార్కింగ్ చేస్తే ‘చేసిన వారికి వెయ్యి రూపాయలు, హోటలు వారికి పదివేలు రూపాయలు జరిమానా!’.

దీని ప్రభావమో ఏమో, హోటలు సంబంధించిన ఒకాయన, ఒక కర్ర పట్టుకొని, హోటలు ముందు, ఎదురుగా, ప్రక్కల, ఏ వాహనాన్ని పార్కు చేయకుండా, హడావిడి చేస్తున్నాడు. “తమ దాకా వస్తే గాని తత్త్వం బోధపడదు” కదా!

రాయలసీమ స్పెషల్ ఉగ్గాణి మిర్చి బజ్జీ తిందామనుకుంటే, అది ఎనిమిదిన్నరకే అయిపోయిందని చెప్పారు.  నెయ్య కారం మసాలా దోసెలున్నాయి. ఉల్లి పచ్చికారం పులిమి, దానిపై పుట్నాల పొడి చల్లి, నేతితో దోరగా కాల్చి యుస్తున్నారు. లేత బంగారు రంగులో అత్యంత స్పృహణీయంగా ఉన్నాయా దోసె రత్నాలు. వాటి రుచి అమోఘం. రెండు దోసెలు ఒక ప్లేటు. కేవలం యాభై రూపాయలే. మన చట్నీస్, మినర్వా లాంటి హైక్లాస్ రెస్టారెంట్లలో రెండు వందల వరకు ఛార్జి చేసి, జింక చర్మాల లాంటి దోసెలు సర్వ చేస్తారు. అవి వీటి ముందు దిగదుడిచి పారెయ్యడానికి కూడ పనికి రావు! తర్వాత ఒక పెద్ద మట్టి కుండలో ‘మసాలా మజ్జిగ’ అమ్ముతున్నారు. పెద్ద గ్లాసు పది రూపాయలు మాత్రమే! అద్భుతంగా ఉంది, జిహ్వను పరమానందానికిలోను చేసిన మజ్జిగ అది.

తిమ్మమ్మ మర్రిమాను సందర్శనం

అక్కడ నుండి ‘ముదిగుబ్బ’ రూట్‌లో ఉన్న ‘తిమ్మమ్మ మర్రిమాను’ను చూడటానికి బయలుదేరాము. రోడ్ అంత బాగులేదు. 25 కి.మీ. ప్రయాణించడానికి 45 నిముషాలు పట్టింది.  ‘గూటిబయలు’ అన్న గ్రామ పరిధిలో ఉంది ఈ మహావృక్షం. ప్రస్తుతం ఇది సత్యసాయి జిల్లా పరిధిలోకి వచ్చింది.

తిమ్మమ్మ మర్రిమానుకు వెళ్ళే దారిలో, బంతి పూల తోట

ప్రపంచంలోని అత్యంత విస్తారంగా వ్యాపించిన వటవృక్షరాజాలలో తిమ్మమ్మ మర్రిమాను ఒకట. ఇది ‘Ficus Benghalensis’ అను శాస్త్రీయనామము గల వృక్షజాతికి చెందింది. మహబూబ్‌నగర్ వద్ద ‘పిల్లలమర్రి’, బెంగాల్ లోని ‘ది గ్రేట్ బాన్యన్ ట్రీ ఆఫ్ కలకత్తా’, చెన్నై అడయార్‌లలో కూడా ఇలా వేల చ.మీ. వ్యాపించిన మర్రి చెట్లున్నాయి.

తిమ్మమ్మ మర్రిమాను దాదాపు 9 ఎకరముల విస్త్రీర్ణములో వ్యాపించి ఉఁది. 1989లో ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం పొందింది. దీని పరిధి 19,107 చ.మీ. అన్ని మతాల ప్రజలు దీనిని మతపరమైన స్మారకంగా ఆరాధిస్తారు.

తిమ్మమ్మ అనే స్త్రీ, సతీహగమనం చేసింది. ఈ చెట్టు ఆమె చితిలో ఉపయోగించిన ఒక కొమ్మనుంచి ఉద్భవించందని ఐతిహ్యం. చెట్టు మధ్యలో తిమ్మమాంబ ఆలయం ఉంది. దాని ముందు ఒక శివలింగం, గోపురం ఉన్నాయి. సంతానార్థులైన స్త్రీలు తిమ్మమాంబను పూజించి సంతానం పొందగలరని విశ్వాసం. శివరాత్రి రోజు ఇక్కడ పెద్ద ‘తిరునాళ్లు’ జరుగుతాయి.

 

ఈ చెట్టును మొట్టమొదట ప్రపంచానికి పరిచయం చేసింది. రిగ్రేట్ ఆయ్యర్ (సత్యనారాయణ్ అయ్యర్) అనే ఫోటోగ్రాఫర్ మరియు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. తిమ్మమ్మ చరిత్రను 1989లో యస్. యస్. గిరిధర్ ప్రసాద్ రాయ్ ‘శ్రీ వీరయ్య నాయకుని చరిత్ర’ పేరిట ప్రచురించారు. ఆగస్టు 29, 2017 న B.B.C వారు, వారి సిరీస్, ‘ది ట్రీ స్పిరిట్స్’లో, రెండవ ఎపిసోడ్‍లో, ఈ చెట్టును గురించి చరిత్రను, వీడియోలను ప్రసారం చేశారు.

గిన్నిస్ బుక్ లో నమోదైన, తిమ్మమ్మ మర్రి మాను, గూటి బయలు, సత్య సాయి జిల్లా, ఏ. పి. UNESCO వారి నేషనల్ హెరిటేజ్ స్టేటస్ పొందిన శతాబ్దాల చరిత్ర గల పురాతన మహావృక్షం

ఈ చెట్టు మీద పక్షులు రెట్టలు వేయవట. మొదట్లో సందర్శకులను లోనికి అనుమతించేవారు. వారు అత్యుత్సాహంతో ఊడలను పట్టి లాగడం, ఊడలను పట్టుకొని ఊగడం, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పడేయటం చేస్తూ, ఆ అపురూప వృక్ష Ambience ను పాడు చేస్తూంటే, చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మాత్రమే చూడవచ్చు. విశాలమైన పెద్ద  పెద్ద శాఖలు, ఇబ్బడి ముబ్బడిగా దిగిన ఊడలు, ప్రకృతి యొక్క విశ్వరూపాన్ని మనకు విశదం చేస్తాయి. చెట్టును, కొమ్మలను, ఊడలను, గ్రిల్స్ బయట నుండే ఫోటోలు, వీడియోలు తీశాము. ఎంత చూసినా తనివి తీరని పచ్చదనం.

అక్కడ దాదాపు గంటకు పైగా గడిపాము. ఒక గైడ్ అక్కడ సందర్శకులకు మర్రిమాను ప్రాశస్త్యాన్ని, చారిత్రిక నేపథ్యాన్ని వివరించి, వారిచ్చింది తీసుకుంటున్నాడు. మేమూ కాసేపు విన్నాము. కారు పార్కింగ్‌కు ఫీజు ఏమీ లేదు. ప్రవేశ రుసుము కేవలం పది రూపాయలే.

 కదిరి నరసింహుని దర్శించుకునే వారు తర్వాత తిమ్మమ్మ మర్రిమానును తప్పక చూడాలి. మేము చూడలేకపోయాము గాని, కదిరి పట్టణంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి వారు నిర్మించిన ‘మరకత మహాలక్ష్మి’ మందిరం కూడా చాలా బాగుంటుందట. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు అనంతపురం చేరుకున్నాం.

మా బావగారి పదవీ విరమణ సభలో పాల్గొని, రాత్రి 10.20 నిమిషాలకు మైసూరు –  కాచీగూడ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ చేరుకున్నాము. దైవము, ప్రకృతి రెండింటినీ దర్శించుకునే బాగ్యం మాకు కలిగింది. రెండింటికీ అభేదమనే కదా విశ్వకవి టాగోర్ చెప్పింది! వీలు చూసుకుని ఒకసారి వెళ్లిరండి మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here