నగరంలో నిశి

0
4

(2022లో భారతదేశ సందర్శన తరువాత డా. కొవ్వలి గోపాలకృష్ణ రాసి దాచుకున్న భావాలను పంచుకుంటున్నారు!)

[dropcap]ఎ[/dropcap]న్నో వసంతాలు నిర్గమించాక ఏదో చూస్తాను, ఎవరో కలుస్తారని ఎక్కిన విమానం కంటే వేగంగా పరిగెత్తన ఊహల పల్లకిలో వడివడిగా ఉత్సాహంగా మమతావనిలో దిగా. ఎప్పుడూ పట్టనంతగా మూడు గంటలకి పైగా వలస విభాగ తనికీల తంతు ముగిసిన అనంతరం బయటకి వచ్చేసరికి మగతలో దిగిన వయసు మళ్ళుతున్న శరీరం కోపగించుకోడానికి కూడా బలం లేని స్థితిలో పెట్టె బేడా అందించే బెల్ట్‌తో నడిచే చక్రాలుండే చోటుకి వెళ్ళాను. నన్ను చుట్టుముట్టి కూలి కావాలా? టాక్సీలో ఎక్కించాలా? అంటూ నా వెంట ఓటరు వెంట పడి విసిగించే ఛోటా, మోటా నేతల్లా మూగుతారని ఊహించా, గతంలో లాగా. మెడలో ముద్ర బిళ్ళ ఉండే సహయకులు ఎవరైనా కనపడతారేమోనని చూసి, చూసి కనిపించిన ఒకరిని పిలిచి సహాయం కోరాను. ఆశ్చర్యంగా డబ్బు ప్రస్తావన లేకుండా తోపుడు బండి తెచ్చి నాతో నడిచాడు సదరు సహాయకుడు. సుమారుగా ఖాళీగా ఉన్న రెండు పెద్ద పెట్టెలను నడిచే చక్రం మీద నుంచి లాగి నాకోసం తెచ్చిన తోపుడు బండి మీద పెట్టాడు సహాయకుడు, ఖాళీ పెట్టెలకి ఇంత బిల్డప్పా అన్నట్టు నా వైపు చూస్తూ. వెనక్కి వచ్చేటప్పుడు పుస్తకాలతో నింపుకు రావడం కోసం ఖాళీ పెట్టెలతో భారతాగమనం అని తెలీదుగా అతనికి!

నేను వచ్చాను, నేను ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాలంటే కనీసం ఒక భారత సిమ్ కార్డ్ ఉండాలిగా. ఆలోచన రావడంతోటే ఒక ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ నడిపే బడ్డీ కనిపించింది. అవధులు లేని ఆనందంతో, “ఒక ఆశ జీవనాన్నే మార్చేస్తుంది” అని మనసులోనే నీరసంగా నినదిస్తూ సదరు బడ్డీలో సుఖాసీనుడై ఉన్న ఉద్యోగిని మర్యాదాపూర్వకంగా “అయ్యా, సిమ్ కార్డ్ కావాలి” అని అడిగాను. లిప్త పాటు సమయంలోనే “లేవు, ఒక గంట తరవాత వస్తాయి” అని రోబో నుంచి వచ్చే కృత్రిమ సమాధానంలా జవాబిచ్చాడు. నాకు ఎక్కడో తగిలినట్టయింది. నాలుగేళ్ల క్రితం వచ్చినప్పుడు కూడా ఇక్కడే, ఇలాగే ఉండే మనిషే, ఇలాగే చెప్పాడుగా! నిరాశతో నేను, నా సామాను ఉన్న తోపుడు బండి తోసే సహాయకుడు పదడుగులు ముందుకు వేశాక “ఒక ఐడియా సిమ్‌కి దారి తీసింది”. “భయ్యా, ఇంకోసారి వెళ్ళి అడుగు, పెద్దాయనకి (తెల్ల జుట్టుకి అందలం!) అవసరం అని, ఏదో ఒకటి ‘work out’ చేయమని” అన్నాను నా సహాయకుడితో. “సరే సర్” అని వెళ్ళి చాలా సేపు తరవాత తిరిగి వచ్చి నన్ను సిమ్ కార్డ్ బడ్డీకి తీసుకు వెళ్ళాడు. అప్పటికే, “ఒక సిమ్‌తో ఎన్నో జీవితాలని” మార్చగల సదరు బడ్డీ కొట్టు సిమ్ దొర ఒక “తెల్ల జాతి” ప్రయాణీకుడికి సిమ్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. వర్ణ వివక్ష అనకూడదు, విదేశీయుల పట్ల గౌరవం అనాలి! నా ఫోన్ తీసుకొని, అటూ, ఇటూ తిప్పి, ఏదో చేస్తూ, చేస్తున్నట్టు చూపిస్తూ సెల్ లో సిమ్ వేశాడు. 600 రూపాయలు ఇచ్చి “సిమ్”పాదనోత్సాహంతో అక్కడనుండి నిష్క్రమించాను. మరుసటి రోజు వచ్చిన సంక్షిప్త సమాచారం ప్రకారం నాకు ఉన్న bandwidth లో సగానికి పైగా వాడినట్టు (నేను నిదురిస్తున్న సమయంలోనే!), ఇంకా కావాలంటే ఇంకా పైకం చెల్లించాలంటూ సమాచారం అందింది. సదరు విమానాశ్రయంలో ఉన్న బడ్డీ కొట్టు ఆసామి ఆరు వందలు గుంజి మూడు వందల ప్లాన్ ఇచ్చాడని గమనించి అవాక్కయ్యా! అది అవినీతి కాదు. అవసరాన్ని ఆకర్షణీయంగా సొమ్ము చేసుకునే కుశలత. ఎలాంటి నిబంధనలు లేకుండా విచ్చలవిడి వ్యాపారం చేసే వెసులుబాటు కల్పించే అసమదీయ ప్రభుత్వ అండదండలు, ఆశీస్సులు వాడుకోగల వ్యాపార నైపుణ్యం.

ఇంకా నేను విమానాశ్రయం లోనే ఆగిపోతే ఎలా!! మూడు వారాల ముచ్చట్లు ముందున్నాయిగా.

మూడు వారాలలో, ఎన్నో మురిపాలు చూసా; మరిన్ని ముచ్చట్లు, మనసుని దొలిచే సన్నివేశాలు, మదిని దోచే మమతల సమాగమాలు, ఎదని తాకే వాక్సుధారస బాణ తూణీరాల పదును చూసా. ఇరుకు సందుల్లో, వాణిజ్య ప్రాంగణాల్లో వొదిగిన విద్యా వ్యాపార సామ్రాజ్యాలనీ చూసా. ముఖ్య ప్రశ్నలకి సమాధానాలు ముక్కు మూసుకుని బట్టీ పట్టి రాంకులు చేపడితే ఉజ్వల భవిష్యత్ కాళ్ళ దగ్గర ఉంటుందని ఆశపడి, శ్రమించే ఆశావహ విద్యార్థి సమూహాన్ని చూసా. తాను తినకున్నా, పిల్లలు IT బాబులు కావాలని అహర్నిశం ఆటో నడిపే ఆశావాద ఆంధ్ర నాన్నలని దగ్గరగా చూసా. అబ్బాయిని అందలంపై చూడాలని రక్తం చెమటగ మార్చే అమ్మల కన్నుల అందం చూసా.

పగలే పున్నమి గాచిన చందంగా పానశాలల ప్రాంగణాల వైభవం గాంచా. ఆర, పావు సీసాల అమృతాన్ని, ఆగలేక అక్కడే ఆపొసన పట్టే సురాత్మజులనెందరినో కన్నీటి పొరల వెనక కళ్ళారా చూసా. ప్లాస్టిక్ గ్లాసులు, సీసాల చెత్త, స్వేచ్ఛా వాటికని తలపించే స్వచ్ఛ భారతాన్ని తల్లడిల్లి చూసా. ఆశయాల దీపాలని ఆర్పే నిద్రాణ “ప్రత్యేక హోదా” కోసం పానవిక్రయాలయాల కటకటాల బయట కాసులతో దీనంగా నిలబడే నిర్వీర్య యువజన గతిని నిశ్చేష్టుడనయి చూసా. ఏదో సాధిస్తే వచ్చే పతకంలా పొడవాటి సీసాని పైకెత్తి గెంతులు వేసే నిర్లజ్జా యువకుల వెగటు కైపుల చూపులు చూసా.

ఐదు వేలు ఇస్తామని ఊరించి వెయ్యి చేపారని రోజంతా పార్టీ జెండా మోసిన అద్దె అభిమానుల ఫిర్యాదుల నిట్టూర్పులు విని, వికసించిన వికాసానికి మెచ్చి, ఎద మోకాలుకి చేరే ముందే కోలుకొని అచ్చెరువొందా.

“ఏమీ చేయలేమండీ” అని నిర్లిప్తతతో, నిస్త్రాణతో నిట్టూర్చే బుధజన మాటలు విని, నేను చెప్పిన జోకు నా ముందే సభలో తనదిగా చెప్పిన వయసు మళ్లిన “మేధావి”లా సకిలిస్తూ, ఇకిలిస్తూ “అవునండి, సమాజానికి మకిలి అంటింది” అని నా మేధో సంపత్తినీ పంచి సంతసించా.

ఒకప్పుడు “వెలిగిన” గదిలో జరిగిన సాహిత్య సభలో ఆరవైకి పైబడిన స్వయంప్రకాశక సాహితీ విరాణ్మూర్తులు విజ్ఞాన గుళికలు పంచుతూ ఉంటే, నిర్లిప్తతతో కూర్చున్న సభికుల అంతరంగ శోధన చేసే ప్రయత్నం చేశా.

ప్రాంతీయ వార్తల కోసం దొరికిన వార్తా పత్రికలు కొని తిరగేస్తే- నన్ను లం*కొ* అంటే నేను దొం*లం*కొ* అననా? ఏం పీకుతారు? అనే పతాక శీర్షికలతో పాటు “ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన కేంద్రం” లాంటి విషయం లేని చర్విత చరణ వార్తలూ, కథనాలూ చదివా.

అలసి సొలసి సేదతీరదామని మంచంపై కేగిరి TV పెడితే, “తొడగొట్టి సవాలు” చేసిన యువ నాయకురాలి ప్రసంగం, సకలము తానై సజ్జలనిపాతము కురిపించు రామకృష్ణామృత ధారలు గ్రోలి శయనించా.

మూర్తీభవించిన నిర్లిప్తత, నిరాశ, నిస్త్రాణ, నిస్సహాయత అలముకున్న రాష్ట్రంలో ఆకలితో, గంపెడాశాలతో అహర్నిశం శ్రమించే దీక్షతో, తూర్పు, ఈశాన్య రాష్ట్ర యువజనం ఆంధ్రాకి అన్నంకోసం వలస వస్తూంటే, మేధో ఉద్దీపన కోసం పశ్చిమానికి వలస వెళ్ళిన నా గతం గుర్తుకు వచ్చి నిట్టూర్పు విడిచా.

ఎక్కడ మేధస్సు గౌరవింప బడుతుందో అక్కడ సంపదలు సృష్టింపబడతాయి. ఎక్కడ వందిమాగధులు విరాజిల్లుతారో అక్కడ అరాచకం నెలకొంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో అన్నీ ఉచితాలే కావడంతో ఎవరూ పనిచేయడానికి ముందుకు రావడం లేదట. అందుకే ఇతర రాష్ట్ర యువకులు పనికోసం వలస వస్తున్నారు. మన వారు పానశాలలని, పాన విక్రయాలయాలను పోషించే దీక్ష చేపట్టారు. బీరు, బిర్యానీ పంచే రాజకీయ పార్టీల పుణ్యమా అని ఆకలి, దప్పికలు తీరుతున్నాయి జైకొట్టే పనిని వృత్తిగా ఎంచుకున్నవారికి.

ఎదగాలన్న ఆర్తి లేని సమాజం చరిత్ర సృష్టించలేదు. ఎంతో ఘన చరిత్ర ఉన్న తెలుగు జాతి ఎక్కడకి పయనిస్తోందో — కాలం చెబుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here