‘నా’ నుంచీ ‘మనం’ లోకి!-1

3
3

[శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన – ‘నా’ నుంచీ ‘మనం’ లోకి! – అనే నాటికని పాఠకులకు అందిస్తున్నాము. ఇది మొదటి భాగం.]

పాత్రలు:

వంశీ – సాఫ్ట్‌వేర్ ఇంజనీరు – 37 సవంత్సరాలు

గీత – వంశీ భార్య – సాఫ్ట్‌వేర్ ఇంజనీరు – 35 సంవత్సరాలు

శ్రీరామ్ – వంశీ నాన్న – విశ్రాంత ఉద్యోగి – 65 సంవత్సరాలు

వసంత – వంశీ అమ్మ – 63 సంవత్సరాలు

అక్షర – వంశీ చెల్లి – 32 సంవత్సరాలు

~

రామ్: (సంతోషంతో గట్టిగా అరుస్తూ) వసంతా! ఓ వసూ!

వసంత: (లోపలి నుంచీ) వస్తున్నా! ఏమిటంత ఆనందం?

రామ్: విషయం వింటే నువ్వూ ఎగిరి గంతు వేస్తావు.

వసంత: ఈ వయస్సులో అదొక్కటే తక్కువ.

రామ్: వయసు దేముందోయ్ మనసు హుషారుగా ఉండాలి గానీ.

వసు: ఇంతకీ విషయం చెప్పలేదు.

రామ్: ఆ.. ఆ.. మన కుమార రత్నం వంశీ, కోడలు, మనవడుతో పాటు ఇక్కడకు వచ్చేస్తున్నాట.

వసు: (ఆశ్చర్యంగా) నిజంగాఁ!

రామ్: అవునోయ్! ఇద్దరికీ ఉగ్యోగాలు ఆన్‌లైన్ లోనేనట. అందుకని మన దగ్గిర ఉందామని.

వసు: ఇదంతా కల కాదు కదా!

రామ్: (కాస్త హాస్యంగా) గిల్లి చూపించానా?

వసు: వద్దు లెండి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారుగా పెద్దలు. ఇన్నాళ్ళకి అర్థమయ్యిందా వాడికీ విషయం!?

రామ్: పోనీలే! ఇప్పటికైనా వాడు మారాడని సంతోషించు.

వసు: అంతేలే! మనం చిన్నప్పటి స్నేహం ప్రేమగా మారాక ఇద్దరి ఇండ్లల్లో వాళ్ళను ఒప్పించి అత్తమామలను కూడా ప్రేమగా చూసుకున్నాం.

రామ్: మన సుపుత్రుడు మాత్రం కులాలు, మతాలను ప్రక్కన పెట్టి పరువు ప్రతిష్ఠని దూరం చేసుకొని వాడి ప్రేమ పెళ్ళికి అంగీకరిస్తే వాడేం చేసాడు?

వసు: అవును రామ్. పెళ్ళికి ముందు, తర్వాత అంటే ఈ యువతరం వాళ్ళు నొచ్చుకుంటారు, కానీ పెళ్ళి అయ్యాక మన వైపు కన్నెత్తి కూడా చూడలేదు.

రామ్: మన బాధ ఎవరికీ రాకూడదు. నా స్నేహితులంటారు నువ్వంతలా వాళ్ళ పెళ్ళకి ఒప్పుకున్నందుకు మీ దంపతులను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని.

వసు: ప్చ్.. పువ్వుల్లో కాదు, అసలు కళ్ళకే కనిపించనంత వరకూ దూరమయ్యారుగా.

రామ్: ఏ జన్మలో ఏం పాపం చేసామో?

వసు: సంసారాన్ని ఈది, ఈది విశ్రాంతి తీసుకోవల్సిన సమయంలో కొడుకు, కోడలు ఇలా ప్రవర్తిస్తే జీవితం నరకమే కదా!

రామ్: ఎవరో చెప్పారు – పిల్లల్ని పెంచటం, విద్యా బుద్ధులు చెప్పించడమే మన బాధ్యత. వాళ్ళ మీద ఆశలు పెట్టుకోకూడదని.

వసు: ఓపిక లేని సమయంలో కాస్త ఆసరాగా కొడుకులు ఉంటే బాగుంటుందని అనుకోవటం కూడా తప్పేనా?

రామ్: అంతే! కాలం అలా మారిపోయింది. ఎవరికీ వారే యమునా తీరే తరహాలో ఉంది.

వసు: పోనీలెండి. మనవడి ముద్దు ముచ్చట్లకి దగ్గరవుతాం. ఏలినాటి శనిలా ఏడేండ్లగా అనుభవిస్తున్న బాధ ఒక్క మాటతో ఎగిరిపోయింది.

రామ్: మనమే అన్నం వండుకొని కూరలు, పచ్చడి, సాంబారు బయటి నుంచే తెచ్చుకుంటున్నాం, కష్టమేమో!

వసు: ఏం భయపడకండి. పిల్లలు సాయం చెయ్యరా ఏమిటి? అంతా మన మంచికే అని నేనానందపడుతుంటే!?

రామ్: (నసుగుతూ) ఏమోఁ! నీ ఆరోగ్యం అంతంత మాత్రం..

వసు: ఫరవాలేదు లెండి. ముందే భయపడకండి. అంత అవసరమైతే వంటమనిషిని పెట్టుకుందాం.

రామ్: నువ్వా మాత్రం భరోసా ఇస్తే చాలు. రైట్! రైట్!(హుషారుగా)

వసు: (నవ్వుతూ) చాల్లెండి.

(మనసులో) ఎప్పుడూ, దిగులుగా, నీరసంగా కనిపించే రామ్ ఈ రోజు ఎంత సంతోషంగా కనిపిస్తున్నాడు? కొడుకు వస్తున్నాడన్న సంబరం ఉత్సాహాన్ని తెచ్చేసింది.

***

కారు హారన్ మ్రోగిన శబ్దం.

రామ్, వసు: (సంతోషంగా ఇద్దరూ ఒకేసారి) పిల్లలు వచ్చేసినట్లున్నారు.

వంశీ: అమ్మా! నాన్నా! బాగున్నారా?

రామ్, వసు: ఆఁ! ఆఁ! బాగున్నాం రా

గీత: అత్తయ్యా! మావయ్యా! ఎలా ఉన్నారు?

రామ్, వసు: బాగున్నాం గీతా!

వసు: (ఆశ్చర్యంగా) మనవడు ఏడిరా?

వంశీ: వాడు మా దగ్గర ఉండటం లేదమ్మా! వాళ్ళ అమ్మమ్మ దగ్గిరే ఉంటాడు. ఇద్దరికీ ఉద్యోగాలుగా.

గీత: అమ్మను విడిచి రావటానికి కూడా ఇష్టపడడు. శని, ఆది వారాలలో మేమే వెళ్ళి వస్తుంటాం.

వసు: (నీరసంగా) అవునా!

రామ్: కాళ్ళూ, చేతులూ కడుక్కోండి.

వసు: నేను టిఫిన్ల సంగతి చూస్తాను.

***

వసు: ఏమిటిది రామ్. పిల్లల ముద్దు మచ్చట్లు వీళ్ళు చూసుకోరా?

రామ్: ఇద్దరికీ ఉద్యోగాలుగా, పనివాళ్ళు సరిగ్గా చూస్తారో లేదో అని ఉంటుందిగా.

వసు (దిగులుగా): వాడు వస్తాడని ఎంత ఎదురు చూసాం? ఎన్ని బొమ్మలు కొని ఉంచాం!?

రామ్: వాళ్ళతో పాటూ ఒకసారి మనము వెళదాం. అప్పుడు ఇద్దాం లే!

వసు: ఏమో! నా మనసేం బాగోలేదు. ఇప్పుడు మనం ఉన్నాంగా. తీసుకు వచ్చి ఉంటే బాగుండేది.

రామ్: కోడలు చెబుతోందిగా వాళ్ళ అమ్మకు అలవాటు పడిపోయాడని.

వసు: అంతేనా రామ్.

రామ్: అంతే. నాకు మాత్రం బాధగా లేదా?

***

వంశీ: అమ్మా! దోసెలు చాలా బాగున్నాయి. నీ అంత పలుచగా ఎవ్వరూ వెయ్యలేరమ్మా.

వసు: చిన్న నవ్వు.

గీత: వంట చెయ్యటం నా కసలు అలవాటు లేదు అత్తయ్యా.

వసు: పెళ్ళి కాక ముందు ఎవరూ చెయ్యరు. అందరూ ఆ తర్వాతేగా అలవాటు చేసుకుంటారు.

వంశీ: అందరి సంగతి దేముడెరుగు. ఈవిడ మాత్రం పెళ్ళయ్యాక సంవత్సరం దాకా వంటింట్లోకి అడుగు పెట్టలేదు.

రామ్: మరి ఏం చేసే వాళ్ళురా?

వంశీ: ఆర్డర్లే ఆర్డర్లు.

రామ్: అవునా. మీ అమ్మ మాత్రం నన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.

వసు: మీరు మరీనూ.

రామ్: అత్తగారి దగ్గరా, అందరి దగ్గరా అన్నపూర్ణమ్మలా మంచి పేరు తెచ్చుకుంది.

వంశీ: కాస్త గీతకు నేర్పమ్మా.

వసు: అలాగే లేరా!

రామ్: ఒరేయ్ వంశీ. నీకో సంగతి తెలుసా? ఇప్పుడు మాత్రం మీ అమ్మ సరేనంటేనే దోసెల పిండి కొనుక్కొని వచ్చేది.

వంశీ: అదేంటి?

వసు: అబ్బా ఊరుకో రామ్.

గీత: చెప్పండి మామయ్యా.

రామ్: ఏం లేదమ్మా! మీ అత్తగారికి ఇది వరకు ఓపిక లేదు. మేము తినేది ఆరు దోసెలే ఐనా వెయ్యగలదో లేదో కనుక్కొనే తెస్తాను.

వంశీ: మా అమ్మను నాన్న చూసినంత అపురూపంగా ఎవరూ చూడరు.

గీత: అవునా.

వంశీ: అంతేనా! వీళ్ళు ఏ ఊర్లో ఉన్నా అక్కడందరికీ ఆదర్శ ప్రేమ జటలు వీళ్ళే.

గీత: గొప్పేగా.

వంశీ: ఇంకా భర్తలందరూ భార్యలంతా అమ్మలాగా ఉండాలని భార్యలంతా భర్త అంటే నాన్నలా ఉండాలనే వారు.

నలుగురు: హ.. హ.. నవ్వులు

***

గీత: వంశీ! తొమ్మిందింబావు అయ్యింది. చెప్పమన్నావుగా.

వసు: అదేంటి గీతా! చెప్పటమేమిటి?

గీత: అంతే అత్తయ్యా! మీ అబ్బాయి స్నానాల గదిలోకి వెళితే గంట దాకా బయటకి రాడు.

వసు: డాక్టరుకి ఒకసారి చూపించుకోవచ్చుగా.

గీత: అదేం రోగం కాదు. సెల్ పుచ్చుకొని చూసుకుంటూ ఉంటాడు లోపల.

వసు: నువ్వు చెప్పినా వినటం లేదా?

గీత : పెళ్ళి అయిన దగ్గర నుంచీ ఎంతో ప్రయత్నించాను. ఏమీ ప్రయోజనం లేదు.

వసు: ఇదెక్కడా చూడలేదే!?

గీత: ఈయనే కాదు. ఇప్పుడు అందరూ అంతే అత్తయ్యా.

వసు: అవునా?

గీత: మామయ్యాగారిని ఒకసారి చెప్పి చూడమనండి మారతారేమో?

వసు: అలాగే.

గీత (గోముగా): ఆ! అత్తయ్యా! నాకు డ్యూటీ సమయం అయింది. కాస్త మా గదిలోకి టిఫిన్ ఇచ్చెయ్యరూ!

వసు: అలాగే.

రామ్: వసూ! వాళ్ళను తొందరగా తెముల్చుకుని టిఫిన్‌కి డైనింగ్ టేబుల్ దగ్గరకు రమ్మను.

వసు: మొదటి రోజే ఏం చెబుతాం?

రామ్: అన్ని సార్లు మనమేం తిరగగలం?

వసు: అవును. జీవితమంతా చేసీ చేసీ అలిసిపోయాం. కష్టమే. నిన్న వాడికి అన్ని అట్లు వేసేటప్పటికి నా పనయిపోయింది.

రామ్: వంశీకి నేను చెబుతాలే.

వసు: మీ ఇష్టం.

***

రామ్: వసూ! ఇది విన్నావా?

వసు: ఏమిటండీ?

రామ్: బస్టాండులో బస్సు కోసం ఎదురు చూస్తున్న అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసారట.

వసు: ఇలాంటి వార్తలు మామూలు అయిపోయాయి. మహాత్ముడు గాంధీగారు ఆర్ధరాత్రి ఆడపిల్లలు ఒంటరిగా తిరగగలిగితే అసలైన స్వాతంత్ర్యం అంటే..

రామ్: యువతరం ఇప్పుడు ఇలా తయారవుతోంది.

వసు: నెట్‌ని అందరికీ అందుబాటులో తెస్తే అంతే కదా.

రామ్: పిల్లలు తల్లి తండ్రుల చేతుల్లోంచి ఎప్పుడో జారిపోయారు.

వసు: మగపిల్లలతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు కాస్త ఆత్మరక్షణ టెక్నిక్స్ నేర్చుకోవాలి రామ్.

రామ్: అదీ నిజమే. కాలంతోపాటూ మనమూ మారాలి.

వసు: అవసరంలో ఉన్నప్పుడు 100కి ఫోన్ చెయ్యమని ప్రభుత్వం వాళ్ళు చెబుతూనే ఉన్నారు.

రామ్: ఆ భయంలో అలాంటివి తట్టవేమో?

వసు: ఆపద వచ్చినప్పుడే ఎదుర్కోవటానికి ధైర్యం తెచ్చుకోవాలి కదా.

రామ్: ఆ సమయంలో అసలు ఎవరికి ఫోను చెయ్యాలనేది కూడా ఒక ఆలోచనే!

వసు: వీటికి సంబంధించి చాలా యాప్స్ కూడా వస్తున్నాయి. అవి సెల్‍లో ఉంచుకోవటం ముందు ఆడపిల్లలు చేయాలి.

రామ్: ఆఁ! నా స్నేహితుని కూతురు ఒక ఇన్‌స్పెక్టరు నెంబర్ సెల్‌లో మొదటే ఉంచుకుంటుందట.

వసు: ఏమో పబ్‌లూ, డేటింగ్‌లూ, అంటూ మనది కాని సంస్కృతి వెంట పడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి.

రామ్: విదేశీ పద్ధతులను ఎంత దూరం పెట్టమని చెబుతుంటే ఇప్పటి పిల్లలు దానికి అంత దగ్గరవుతున్నారు.

వసు: ముందు మనం మన పాత పద్ధతులను అలవాటు చేసుకుంటే కానీ మార్పు రాదు.

రామ్: నయంలే.. వినేవాడు ఎవడు? పాత చింతకాయ పచ్చడి అని కొట్టి పారేస్తారు.

వసు: మళ్లీ వీళ్ళేగా ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనేది.

రామ్: సరే! పడుకుందాం. మళ్ళీ ప్రొద్దునే లేవాలి.

***

గీత: (గోముగా) వంశీ.

వంశీ: ఏమిటి?

(మనసులో) భార్య తనకు ఏదో టెండర్ పెడుతోంది.

గీతా: ఆంటీ, అంకుల్‌ని అలా అత్తయ్యా, మామయ్యా అని పిలవటం ఎంతో కష్టంగా ఉందో తెలుసా?

వంశీ: తప్పదు గీతా. కొన్న చిన్న చిన్న ట్రిక్స్ పాటించాలి.

గీత: ఒక్కరోజు కాదుగా.

వంశీ: ఆన్‌లైన్‌లో పని.. మాకు కదలటానికి వీలుపడదు అంటే అన్నీ అమ్మ చేసి పెట్టటంలా.

గీత: అవుననుకో.

వంశీ: మరి అమ్మ అంత చేస్తుంటే నువ్వు నాలుగు పలుకులు పలకలేవా?

గీత: రెండు, మూడు రోజులు ఊరుకుంటారు. ఆ తర్వాత ఊరుకుంటారా ఏం?

వంశీ: వచ్చినప్పుడు చూసుకుందాంలే. బయట ఫుడ్ తినీ తినీ నోరు అదోలా తయారయింది.

గీత: నీకే నువ్వు బాగానే ఉన్నావ్. ఎప్పడు ఆ మాట పుసుక్కున అంటారో అని నాకు భయంగా ఉంది.

వంశీ: అయితే సాయం చెయ్యి. అమ్మ కూడా అన్నీ ఒక్కటే చెయ్యలేదుగా.

గీత: అదుగో. నువ్వు మాట తప్పితే నేనూరుకోను. అవసరమైతే పని అమ్మాయిని పెడతాను, వంటమ్మాయిని మాట్లాడతానన్నావు.

వంశీ: ఇప్పుడు మాత్రం కాదాన్నానా?

గీత: అలా అన్నావవే వచ్చాను. లేకపోతే నాకక్కడే బాగుంది.

వంశీ: అమ్మ చేతి వంట రుచిని అప్పుడే దూరం చేసెయ్యకు. వంటవాళ్ళు సరిగ్గా చేస్తారనే ధాఖలా లేనే లేదు.

గీత: ఏమో బాబూ నువ్వు వేటలో ఉండు.

వంశీ: సరే! నాకు నిద్ర వస్తోంది. పడుకోనీ. అలోచిస్తానంటున్నానుగా.

***

వసు: రామ్! ఆపు ఆ కాళ్ళు నొక్కడం.

రామ్: ఫరవాలేదులే వసూ! నీకు పని ఎక్కువైపోతోంది. నిన్నలా చూడలేకపోతున్నాను.

వసు: అందుకని.

రామ్: కాస్తన్నా నీకు ఉపశమనం అందివ్వనీ. దానికి కూడా అడ్డుకోకు.

వసు: ప్రొద్దున లేచిన దగ్గర నుంచీ రాత్రి పొడుకునే దాకా సాయం చేస్తూనే ఉంటావుగా. అది చాలదా?

రామ్: వారం రోజులకే పిల్లాడు మన దగ్గర ఉన్నాడన్న ఆనందం పోయింది.

వసు: అయ్యో! అదే మాట?

రామ్: అంతే వసూ! వాడికి వాడి భార్య ఎంత గొప్పో నాకు నువ్వు అంత కంటే ఎక్కువే.

వసు: తొందరపడి నోరు జారకండి.

రామ్: అందుకే ప్రయత్నిస్తున్నాను.

వసు: అప్పుడేనా.

రామ్: అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకే చూస్తారు. అంతా కాదు.

వసు: (బాధతో కూడిన నవ్వుతో) అవునా.

రామ్: నువ్వు ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నావు.

వసు: లేదు రామ్.

రామ్: మరి ఆ అమ్మాయి అసలు ఆడపిల్లేనా. అత్తగారు వయసులో ఉన్నావిడ చేసి పెడుతుంటే కూర్చుని తింటుంది.

వసు: చిన్నగా. వినిపిస్తుందేమో.

రామ్: విననీ. అప్పుడైనా సిగ్గు వస్తుందేమో.

వసు: మీరు కొంప ముంచేట్లు ఉన్నారండీ.

రామ్: వంశీ అయినా ఆ అమ్మాయికి చెప్పాలిగా.

వసు: చెప్పే ఉంటాడు.

రామ్: శని ఆదివారాలన్నా చేస్తారేమో అని చూసా. అత్తగారి ఊరికి పారిపోయారు.

వసు: వాళ్ళు వెళ్ళినందుకు కాదు. బుజ్జిగాడ్ని చూడటానికి మనల్ని కూడా రమ్మంటారనుకున్నా. అదీ లేదు.

రామ్: నేనూ అదే అనుకున్నా. నువ్వు బయట పడ్డావు, నేను బయటపడలేదు. అంతే తేడా.

వసు: కారే కదా! మాట వరుసకి కూడా పిలవలేదు.

రామ్: వాడికి అక్కడ ఏం ఇబ్బంది ఉందో ఏమో?

వసు: అనుకుంటాం కానీ ఇప్పటి ఆడపిల్లలకు అత్తమామలంటేనే గౌరవం లేదు.

రామ్: అమ్మా నాన్నా అని నీ కొడుకుకి ఉందా చెప్పు. అదే ఉంటే ఇలా ప్రవర్తించడు కదా.

వసు: (ఒత్తి పలుకుతూ) మన కొడుకు.

రామ్: అవునులే. వాడు మంచిగా ఉంటే అలానే అనేవాణ్ణి.

వసు: నేను ఒప్పుకోను. వాడు ఎలా ఉన్నా మన కొడుకే. పెళ్ళి కాకమందు ఎంతలా ప్రాణం పెట్టేవాడు.

రామ్: ఓ మురిసిపోయే దానివిగా.

వసు: ఇప్పుడు మరి మనల్ని పరాయి వాళ్ళలా ఎలా చూస్తున్నాడు.

రామ్: ఇప్పుడేమిటి వసూ.. ఆ అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచే వాడలా మారిపోయాడు.

రామ్: మన పెంపకంలో లోపమేమో.

వసు: అది కానే కాదు. ఆడ, మగ భేదం లేకుండా పెంచామని అందరూ మనల్ని ఎంత మెచ్చుకునే వారు.

రామ్: మరి అంతలా ఎలా మారిపోయాడు?

వసు: చెల్లికి పెళ్ళి నేనే చేస్తా. కట్నం కూడా నేనే చూసుకుంటా అన్నవాడు డబ్బులు సరిపోతాయా అని కూడా అడగలేదు.

రామ్: ఒక అతిథిలా వచ్చి వెళ్ళాడు. మారి ఉంటాడని నేనేం అనుకోలేదు వసూ.

వసు: నేనే పిచ్చిదాన్ని. నాకు తగ్గట్లుగా అన్నీ ఊహించుకుంటూ ఉంటాను.

రామ్: నీలో ఆ అమాయకత్వమే నాకు నచ్చుతుంది వసు.

వసు: రామ్!

***

ఫోన్ రింగవుతున్న శబ్దం.

వసు: హలో!

అక్షర: అమ్మా! నేను అక్షరను.

వసు: ఆఁ! చెప్పు తల్లీ.

అక్షర (ఆత్రంగా): ఏమిటమ్మా! అంత నీరసంగా ఉన్నావ్?

వసు: లేదురా! బాగనే ఉన్నా.

అక్షర: పోమ్మా! నాకు తెలియదా నీ సంగతి. నువ్వు బాగుంటే ఎంత హుషారుగా ఉంటావో.

వసు: నీ కబుర్లు ఏమిటి.

అక్షర: నావి ఎప్పుడూ ఉండేవే. నువ్వు ముందిది చెప్పు. వదిన నీతో బాగా కలిసిపోతోందా?

వసు: ఆఁ!

అక్షర: అమ్మా! నువ్వు ఏదో దాస్తున్నావ్. నాతో కాకపోతే ఎవరికి చెప్పుకుంటావ్?

వసు: ఏమీ లేదంటుంటే.

అక్షర: నేను నమ్మను. పోనీ అన్నయ్య ఎలా ఉన్నాడు? అది చెప్పు. ఇది వరకులా ఉంటున్నాడా?

వసు: నా బుజ్జి తల్లి ఎలా ఉంది?

అక్షర: మాట దాటేస్తున్నావ్.

వసు: నా మనవరాలి గురించి నాకు కాక ఇంకెవరికి ఉంటుందే.

అక్షర: అమ్మమ్మ, తాతయ్య మనింటికి ఎప్పుడు వస్తారు అని అడుగుతోంది.

వసు: ఏదీ. మీ నాన్న చాదస్తం నీకు తెలుసుగా. ఆడపిల్ల ఇంటికి ఎక్కువ వెళ్ళకూడదంటారు.

అక్షర: ఈ కాలంలో ఏంటమ్మా! నువ్వెంత చెప్పినా అన్నీ నాన్న వింటారు. ఇది వినరేంటమ్మా?

వసు: అదేనే నాకు అర్థం కానిది. ఆస్తిలో సగం వాటా ఇస్తానంటారు కానీ దానిని మాత్రం ఒప్పుకోరు.

అక్షర: నేను నాన్నతో మాట్లాడతాలే.

(మనసులో) అన్నయ్య, వదిన గురించి నాన్నతోనే రాబట్టాలి.

వసు: అల్లుడుగారు ఎలా ఉన్నారు?

అక్షర: మా అత్తయ్య బంగారం అంటాడు ఎప్పుడూ.

వసు: (నవ్వుతూ) కొంపతీసి నన్ను అమ్మేస్తాడేమో?

అక్షర: భలేదానివే. అలా చెయ్యబోతే నేనూ, నాన్న ఊరుకుంటామా? మేమే నిన్ను కొనేసుకుంటాం.

వసు: ఎవరో పిలుస్తున్నారు. మళ్ళీ మాట్లాడతా.

(ఫోన్ పెట్టేసిన శబ్దం.)

***

వసు: వంశీ! నువ్వు స్నానం చేసావా?

వంశీ: లేదమ్మా!

వసు: ఎప్పుడు చేస్తావ్?

వంశీ: ఈ రోజే.

వసు: ఎప్పుడూ ఇంతేనా?

వంశీ: అవునమ్మా! హైద్రాబాద్‌లో మా అపార్ట్‌మెంట్ లోకి వేడి అసలు రాదు. చల్లగా హాయిగా ఉంటుంది.

వసు: అందుకని రోజూ స్నానం చెయ్యవా?

వంశీ: ఏమిటమ్మా ఇది? చిన్న పిల్లవాడిని అడిగినట్లు.

వసు: అవునురా. చిన్నవాడివైతే రెండు పీకి శుభ్రం గురించి చెప్పేదాన్ని.

వంశీ: మరి ఇప్పుడెందుకిలా?

వసు: ఏమోరా! నిన్ను చూస్తే చాలా సిగ్గుగా ఉంది.

వంశీ: అమ్మా! టేక్ ఇట్ ఈజీ. ఇప్పుడిదంతా కామన్.

వసు: నేనే ఆ కామన్‌లో లేను. నా కొడుకు వారిలో ఒకడిగా ఉండడం నాకు నచ్చటం లేదు.

వంశీ: ఇలాంటి సుద్దులు చెబుతావనే ఇన్నాళ్ళూ మీకు దూరంగా ఉన్నాను.

వసు: అవునురా. నేను ఏదో చెయ్యకూడని పనిని నీతో చేయిస్తున్నట్లు.

వంశీ: మా కిష్టం లేనిది చేయమంటే అలాగే చిరెత్తుకొస్తుంది.

వసు: ఇంటర్‌లో నీ సాక్స్, బట్టలు ఉతుక్కోవటం లేదని మీ స్నేహితులు చెబితే నిన్ను సరి చేసాను.

వంశీ: తెలియని వాళ్ళకి చెప్పాలి.

వసు (వెళ్ళిపోతూ): శుభ్రత మన ఆరోగ్యం కోసం. నీకు చెప్పినా ఆ గోడకు చెప్పినా ఒకటే.

***

రామ్: వంశీ! అలా డాబా మీదకు వెళదాం. ఒక పది నిముషాలే. వస్తావా?

వంశీ: ఆఁ! నాన్నా! ఒక కాల్ ఉంది. ఇది అవగొట్టేసి ఒక్క అయిదు నిముషాలలో వస్తాను.

రామ్: సరే! నేను పైన ఎదురు చూస్తూ ఉంటాను.

వంశీ: అలాగే.

రామ్: ఏదో రాగాన్ని ఆలపిస్తూ ఉంటాడు.

వంశీ: వెన్నెల బాగుంది కదా నాన్నా!

రామ్: అవునురా. దానికి చల్లదనం ఇవ్వటమే తెలుసు.

వంశీ: మంచి వాళ్ళలా, మీలాగా!

రామ్: ఎందుకు? నువ్వడిగితే కొండ మీద కోతిని కూడా ఇచ్చేవాడిననా?

వంశీ: అవును. అమ్మ వారించబోయినా, నేనేది అడిగితే అది మీరు ఇచ్చేవారు. అందుకే మీరంటే ఇష్టం. గౌరవం.

రామ్: అవునా! అమ్మ ఒక్కతే అంత పని చేసుకుంటోందిగా. కాస్త సాయం చెయ్యమని గీతకు చెప్పవచ్చుగా.

వంశీ: మేము చేసేది సాఫ్ట్‌వేర్ ఇంజనీరు జాబ్ నాన్నా! మామూలు ఉద్యోగాలు కావు.

రామ్: అయితే నేనడిగిన ప్రశ్నకూ దీనికీ సంబందం ఏమిటి?

వంశీ: అక్కడికే వస్తున్నా. కంపెనీ వాళ్ళు మాకు లక్షల జీతం ఇస్తున్నారు. అలాగే మేము కదలలేని పరిస్థితి కల్పిస్తున్నారు.

రామ్: అవునా. మరి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులెవరూ సంసారాలు చేసుకోవడం లేదా? వంటలు వండుకోవటం లేదా?

వంశీ: నాన్నా!

రామ్: అవునురా! నేను నాన్ననే మాట్లాడుతున్నాను. లోకంలో మీరిద్దరే ఉద్యోగాలు చేస్తున్నట్లు భలే మాట్లాడుతున్నావురా.

వంశీ: అది కాదు నాన్నా!

రామ్: మరేమిటి?

వంశీ: నిజం చెప్పాలంటే గీతకు ఏ పనీ రాదు. ఆ ఉద్యోగం చెయ్యటమే గొప్ప.

రామ్: ఆహా? మరి అక్కడ ఏం తినేవాళ్ళు?

వంశీ: మా అత్తగారు వచ్చి మాతోనే ఉండేవారు. ఆవిడే ఇలాంటివన్నీ చూసుకొనే వారు.

రామ్: ఓహో! అదా సంగతి.

వంశీ: అవును నాన్నా! తనకు సహాయం చెయ్యాలన్న ఆలోచన కూడా తెలియదు.

రామ్: ఓ! మీ అత్తగారు కూతుర్ని చాలా గొప్పగా పెంచారే.

వంశీ: అతి సుకుమారి నాన్నా.

రామ్: పెళ్ళి కాక ముందు అమ్మ కూడా అంతే, నీకు తెలుసా?

వంశీ: ఎందుకు తెలియదు?

రామ్: పాపం ఇప్పుడు మీ అత్తగారికి ఏమయ్యింది?

వంశీ: మావయ్య బాత్రూమ్‍‌లో కాలుజారి పడ్డారు. అన్నీ ఆవిడే చూసుకోవలసి వస్తోంది.

రామ్: ఓ! అదా సంగతి.

వంశీ: ఆఁ! అక్కడే ఉన్నారు.

రామ్: సరేరా! వెళ్ళి పని చేసుకో.

వంశీ: అలాగే నాన్నా! గీత గురించి ఏమీ అనుకోకండి.

రామ్: నువ్వు చెప్పావుగా. ఇంకెందుకు అనుకుంటాం?

వంశీ: సరే! వస్తాను.

మెట్లు దిగుతున్న శబ్దం వినిపిస్తుంది.

రామ్: ఏం పిల్లలు!?

***

వసు: రామ్! ఎందుకంత దిగులుగా ఉన్నావ్?

రామ్: ఏం లేదు వసూ!

వసు: నాకే వినిపిస్తావా కథలు. నీ మనసు చెప్పనివి నీ కళ్ళు చెప్పేస్తాయి నాకు.

రామ్: కాస్త నీరసంగా ఉంది.

వసు: అది నా సొంతం కదా.

రామ్: కాసేపు అది నా దగ్గరకు అద్దెకు వచ్చింది.

వసు: అబ్బో.

రామ్: ఎంత బాధలో ఉన్నా నవ్వించేస్తావు కదా.

వసు: హమ్మయ్యా! బాధ ఉందని ఒప్పుకున్నావుగా.

రామ్: అది నాలోనే ఉండనీ. తెలిస్తే నువ్వు కూడా బాధ పడతావు.

వసు: నేను బాధ పడినా ఫరవాలేదు. నీ బాధ దింపేసే అవకాశాన్ని మాత్రం నేను వదలను.

రామ్: మొండి.

వసు: ఊఁ! ఇప్పుడు చెప్పు.

రామ్: వంశీ మన మీద ప్రేమతో ఇక్కడికి వచ్చాడనుకున్నాం కదా!

వసు: అవును. అదే లేకపోతే ఇన్నాళ్ళూ రాని వాడు ఇప్పుడెందుకొస్తాడు?

రామ్: అదే! పిచ్చి ప్రేమ.

వసు: కాదా?

రామ్: నువ్వూ నేనే కాదు. తల్లి తండ్రులంతా ఇంతే. నిస్వార్ధపరులు.

వసు: రామ్! వింతగా ఉందే నువ్వు వేదాంతం మాట్లాడుతున్నావు.

రామ్: అవును వసూ! బాధ, కష్టం లోంచే వేదాంతం పుట్టుకొస్తుంది.

వసు: బాబోయ్! ఇక నేను ఈ సస్పెన్స్‌ని భరించలేను.

రామ్: గుప్పిట మూసినంత సేపే ఈ చిదంబర రహస్యం. విప్పానంటే ఏమీ ఉండదు.

వసు: నేను మాట్లాడను పో.

రామ్: అలగకు బంగారం.

వసు: సరే. చెప్పు.

రామ్: నీ కోడలికి వంటమ్మాయి చేసే వంట నచ్చక మన దగ్గరకు వచ్చారు.

వసు (బాధగా): అవునా! ఇన్నాళ్ళకు మళ్ళీ మన కొడుకుకి మన మీద ప్రేమ గుర్తు వచ్చింది అనుకున్నానే.

రామ్: నేనూ అలానే భ్రమ పడ్డాను.

వసు: నిజం చెప్పండి. ఇదంతా తమాషానా? లేక మీ ఊహాఁ?

రామ్: రెండూ కాదు. పచ్చి నిజం.

వసు: ఇలాంటివి వినటానికేనా పిల్లలను కని, పెంచింది?

రామ్: చిన్నప్పుడు కాళ్ళతో తంతారు. ఇప్పుడు మాటలతో.

వసు: మనం గుండెని రాయి చేసుకోవాలి అన్నమాట.

రామ్: తప్పుదు ఇంకా ఎన్ని వినాలో? మరెన్ని చూడాలో?

వసు: వెళ్ళమని చెప్పేద్దామా?

రామ్: వద్దు వసూ! ఇంటికి వచ్చిన శత్రువునే మనం వెళ్ళమని చెప్పం. అలాంటిది కన్న బిడ్డను పొమ్మనే కాఠిన్యామా?

వసు: నీ అభిప్రాయం తెలుసుకుందామని.

రామ్: ఏదయినా మనం నడిచేది ఒకే బాట, ఒకే మాటపైనే కదా!

వసు: అవును రామ్! చివరి వరకూ కలిసి ఉండేది ఉండగలిగేది మనమిద్దరమే.

రామ్: నా కది చాలు వసూ! అంత కంటే నాక ఇంకేం అక్కర్లేదు.

వసు: సరే! హాయిగా నిద్రపోండి.

***

వసు: రామ్! ఈ సారి వీళ్ళు వెళ్ళినప్పుడు బాబునూ, ఆవిడనూ కూడా తీసుకు రమ్మని చెబుదామా?

రామ్: ఎందుకు నీకు నువ్వు పనిని పెంచుకుంటావు వసూ?

వసు: ఆ తిప్పలేవో నేను పడతాను. ఈ విషయం వంశీకి చెబుదామా?వద్దా?

రామ్: చెప్పు ఏమంటాడో చూద్దాం!

వసు: సరే ఈ వారం ఎందుకో వెళ్ళలేదు.

రామ్: వీళ్ళింకా లేవలేదా?

వసు: లేదు. శని, ఆదివారాలు సెలవులు కదా, పన్నెండు, ఒంటి గంట దాకా లేవరట.

రామ్: ఓ!

వసు: వాళ్ళకు టిఫిన్ వండాలో వద్దో తెలియదు. పోనీ చేస్తే ప్రొద్దున్నది సాయంత్రం తినరట.

రామ్: ఓహో!

వసు: మిగిలితే పారెయ్యండి అంటున్నారు ఇద్దరూ.

రామ్: అది మనకు అలవాటు లేదు కదా.

వసు: కావల్సినంతే చేసుకోవటం మన పద్ధతి.

రామ్: లక్షలు జీతాలుగా వస్తే అలానే మాట్లాడతారులే.

వసు: ఒకేసారి భోజనం చేస్తారట.

రామ్: ఏమిటో ఇప్పటి పిల్లల పద్ధతులు ఏమీ అర్థం కావటం లేదు.

వసు: రాత్రి రెండు గంటల దాకా స్నేహితులతో కబుర్లు. అదేమిటిరా అంటే తప్పదమ్మా అంటాడు వంశీ.

రామ్: ఇలా చేస్తే వాళ్ళకి కావల్సిన ఆహారం ఎలా సరిపోతుంది? ప్రొద్దున టిఫిన్ మానకండి అని చెబుతుంది శాస్త్రం.

వసు: వీళ్ళేమో ఆలశ్యంగా పడుకుంటున్నాం కాబట్టి లేట్‍గా లేస్తాం అంటారు.

రామ్: మనమేం చెయ్యగలం?

వసు: అందుకే అట్లు పిండి కలుపుతున్నా. కావాలంటే తింటారు. లేకపోతే మానేస్తారు.

రామ్: బాగుంది వసూ. ఆదుకోవటానికి మనకు ఫ్రిజ్ ఉందిగా.

వసు (నవ్వుతూ): హఁ! హఁ!

***

సెల్ మ్రోగింది.

రామ్: హలో!

అక్షర: హా! నేను నాన్నా! అక్షరని!

రామ్: ఆఁ! చెప్పరా!? ఎలా ఉన్నారు మీరంతా!

అక్షర: బాగున్నాం.

రామ్: అల్లుడుగారు, బుజ్జి తల్లి కూడా! ఇంకేంటి విశేషాలు?

అక్షర: నువ్వే చెప్పాలి నాన్నా! అన్నయ్యా, వదిన మీతో ఎలా ఉంటున్నారు? మీతో బాగా ఉంటున్నారా అని.

రామ్: అంతా బాగుంది.

అక్షర: వదిన అమ్మకు సాయం చేస్తోందా?

రామ్: ఆఁ! చేస్తోంది.

అక్షర: నిజం చెప్పు నాన్న! నా మీద ఒట్టే!

రామ్: ఇంత చిన్న దానికి ఒట్లు దాకా ఎందుకు తల్లీ?

అక్షర: మరి నువ్వు నిజాన్ని దాస్తున్నావుగా.

రామ్: అమ్మ చాలా చిక్కి పోయిందిరా ఈ నెలకే. ఎక్కడ పడకేస్తుందో అని నాకు భయంగా ఉంది.

అక్షర: ఒక పని చేయకూడదూ.

రామ్: ఏమిటది?

అక్షర: నేను జారిపడ్డానని డాక్టరు రెస్టు తీసుకోమన్నారని, అందుకే అమ్మనీ, నిన్ను రమ్మనమన్మానని చెప్పి వచ్చెయ్యండి.

రామ్: బాగోదురా.

అక్షర (కొద్దిగా కోపంగా): వాళ్ళు ఏమీ చెయ్యకుండా తింటూ ఉంటే బాగుందా?

రామ్: ఏమోరా!

అక్షర: (బ్రతిమాలుతున్నట్లు) రండి! నాన్నా!

రామ్: పోనీలే. మీ అమ్మను పంపుతాను.

అక్షర: అదేం కుదరదు. నువ్వు రావాలి. మీ అల్లుడు కూడా సంతోషిస్తారు.

రామ్: చూద్దాం.

అక్షర: అదేం లేదు. మీరు వస్తున్నారంతే!

ఠక్కున ఫోన్ పెట్టేసిన శబ్దం.

***

రామ్: వసూ! ప్రొద్దున అక్షర ఫోన్ చేసింది.

వసు: ఏమిటిట. నాతో మాట్లాడనే లేదు. తండ్రీ కూతుర్లు ఏమి మాట్లాడేసుకున్నారు?

రామ్: అక్షర కాలు జారి పడిందట. డాక్టర్లు బెడ్ రెస్ట్ అన్నారుట.

వసు: అయ్యో! ఇప్పుడు ఎలాగుంది దానికి?

రామ్: కదలలేకపోతోంది కాని బాగానే ఉందట.

వసు: ఆవునాఁ?

రామ్: నిన్ను పంపిస్తాను. వెళతావా?

వసు: వెళదాం.

రామ్: నేనెందుకు? నీ అవసరం దానికి ఉంది.

వసు: మీరు లేకుండా నేను ఎక్కడికైనా వెళ్ళానా?

రామ్: ఇప్పుడు వెళ్ళు.

వసు: వెళ్ళను. వస్తానంటే వెళదాం. అది కూడా మొన్న చాలా గొడవ పెట్టింది. మనం వాళ్ళింటికి రావం లేదని.

రామ్: సరే ! వెళదాం లే!

వసు: అయితే వంశీకి చెబుతా ఈ విషయం.

రామ్: చెప్పాలిగా మరి.

వసు: అయితే ఏదైనా వండనా?

రామ్: వద్దు. సంస్కృతి ఫుడ్స్‌లో అన్ని దొరుకుతున్నాయి. కొనుక్కొని తెచ్చేస్తాను.

వసు: సరే! బట్టలవీ సర్దుకోవాలిగా.

రామ్: అవును.

వసు: సరే! నేనా పనిలో ఉంటాను.

రామ్: మంచిది. బజారు కెళ్ళి అవి కొనుక్కొని వచ్చేస్తాను.

వసు: ఈ ఎండలో ఎందుకు? సాయంత్రం వెళ్ళి తెద్దురుగానీ.

రామ్: ఏ పనీ నా కిష్టమైనట్లు చెయ్యనివ్వవుగా.

వసు: నేను వెళ్ళవద్దని అంటే ఆ మాట అనాలి.

రామ్: లాజిక్కులకు ఏమీ తక్కువ లేదు. అసలు నువ్వు లాయర్ వయ్యి ఉండాల్సింది.

వసు: ఆఁ! ఇక నాకు అదొక్కటే తక్కువ.

***

గీత: వంశీ!

వంశీ: ఏమిటో చెప్పు.

గీత: మనం హైద్రాబాద్ వెళ్ళిపోదామా?

వంశీ: ఏం మీ అమ్మ వచ్చేస్తానందా?

గీత: లేదు.

వంశీ: మరెందుకు?

గీత: ఏమో! ఇక్కడ ఉండాలనపించటం లేదు.

వంశీ: అమ్మానాన్నా రేపు చెల్లి దగ్గరకు వెళుతున్నారట.

గీత: అదేంటి. మనం ఇంట్లో ఉండగా మనల్ని వదిలేసి ఎలా వెళతారు?

వంశీ: మనం వాళ్ళను వదిలేసి వెళ్ళటం లేదా?

గీత: బాబును చూడటానికి వెళ్తున్నాం.

వంశీ: ఇప్పుడు వాళ్ళూ అదే పని చేస్తున్నారు. చెల్లి పడిందట. డాక్టరు బెడ్ రెస్ట్ అన్నారట.

గీత: ఓ! అందుకా?

వంశీ: మరీ.. ఊరికే మా అమ్మానాన్న ఎక్కడికీ కదలరు.

గీత: అంతేలే! గూటి పక్షులు.

వంశీ: అంతే అనుకో.

గీత: మరి మనం ఇక ఇక్కడ ఎందుకు? చెప్పేసి వెళ్ళిపోదాం.

వంశీ: బాగుంటుందా?

గీత: ఇందులో బాగుండటానికి ఏముంది?

వంశీ: ఆలోచిద్దాం!

గీత: కావాలంటే వాళ్ళు వచ్చాక మళ్ళీ వద్దాం. ఆరుగంటలేగా ప్రయాణం?

వంశీ: ఆఁ!

గీత: అన్నిటికీ నాన్చుడు వ్యవహారమే.

వంశీ: నీ అంత సులభంగా నేను ఏదీ నిర్ణయించుకోలేను.

గీత: అటో ఇటో తేల్చు బాబూ!

వంశీ: ..మౌనం.

గీత: మాట్లాడు.

వంశీ: అమ్మా వాళ్ళని ముందు వెళ్ళనీ.

(ముగింపు వచ్చే వారం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here